జగన్ పై వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాటు.. వెల్లంపల్లి రాజీనామా.. వసంత పోటీకి దూరం?
posted on Dec 21, 2023 8:29AM
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో సంక్షోభం నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఏకంగా తిరుగుబాటుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. దాదాపు 42 మంది పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు పార్టీ వర్గాల నుంచే తెలుస్తోంది. ఈ అసంతృప్తికి టికెట్ల లొల్లి కారణమని అంటున్నారు.
మొత్తంగా జగన్ పాలన పట్ల ప్రజలలో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని ఒకింత తగ్గించే ఉద్దేశంతో సీఎం జగన్.. సిట్టింగుల సీట్లు మార్చేస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని మార్చేశారు. త్వరలో ఇలా మార్చే ఎమ్మెల్యేల రెండో జాబితా వస్తుందన్న ప్రచారంతో నేతల్లో టెన్షన్ నెలకొంది. ఒకవైపు అభ్యర్థుల జాబితా ఖరారుపై సీఎం జగన్ కసరత్తు కొనసాగుతున్నది. పోటీ చేసే స్థానాలు, నియోజకవర్గాల మార్పు తదితర అంశాలపై సీఎం జగన్ నేరుగా ఎమ్మెల్యేలతోనే చర్చిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే స్థానంపై ఎమ్మెల్యేలకు స్పష్టత ఇస్తుండగా.. మరోవైపు నేతలు మాత్రం ఇన్నాళ్లు కాపాడుకుంటూ వచ్చిన నియోజకవర్గాన్ని వదిలేసేందుకు ఎంత మాత్రం ఇష్టపడడం లేదు.
ఈ క్రమంలోనే వైసీపీలో సంక్షోభం తలెత్తింది. వైసీపీలో ఈ అభ్యర్థుల మార్పు పార్టీలో ముసలం పుట్టేందుకు దోహదపడుతోంది. చాలామందికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదనీ, పార్టీ గెలిచాక పదవులు ఇస్తామని, మరికొందరికి పార్లమెంటుకు వెళ్లాలని ముఖం మీద చెప్పేయడంతో వారంతా తీవ్ర అసంతృప్తితో ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటున్నట్లు పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి.
ఇప్పటికే ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులను మార్చేయగా.. ఇప్పుడు మరికొందరిని మార్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం మరికొందరు మంత్రులు, ప్రజా ప్రతినిధులకు సీఎం నుంచి పిలుపు రాగా.. మంత్రులు విశ్వరూప్, గుమ్మనూరు జయరాం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంను కలిశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, విశాఖ జిల్లా గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కూడా సీఎంతో భేటీ అయ్యారు. వీరితో పాటు పలువురు ఎమ్మెల్యేలు కూడా క్యాంపు కార్యాలయానికి వచ్చి తమ సీటుపై పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య, నరసాపురం ఎమ్మెల్యే, విప్ ప్రసాదరాజు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా, మంత్రి శంకరనారాయణ సీఎంవోకు వచ్చి పార్టీ ముఖ్యనేతలతో మంతనాలు జరిపారు.
అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి ముఖ్యనేతలు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వసంత కృష్ణ ప్రసాద్ కూడా సీఎంను కలిసి చర్చించారు. విజయవాడ వెస్ట్ నుండి వెలంపల్లిని తప్పించి.. ఈసారికి త్యాగం చేయాలని సూచించినట్లు సమాచారం. మరోవైపు విజయవాడ సెంట్రల్ నుండి మల్లాది విష్ణును తప్పించి.. ఆ స్థానంలో విజయవాడ వెస్ట్ నుంచి ఒక ప్రముఖ కళాశాల అధిపతిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. మరోవైపు విజయవాడ పశ్చిమ సీటు కూడా వసంత కృష్ణను కాదని మరొకరికి అప్పగించనున్నట్లు తెలుస్తుంది. దీంతో బెజవాడ వైసీపీలో ఇప్పుడు గందరగోళం నెలకొనగా.. టికెట్ దక్కని ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యతను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీసుకు న్నారని చెబుతున్నారు.
అయితే, తనకు పార్టీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెల్లంపల్లి పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అలాగే వసంత కృష్ణ ప్రసాద్ అధిష్టానంపై అనకబూని తాను అసలీ ఎన్నికలలో పోటీకే దూరంగా ఉంటానని పార్టీ హైకమాండ్ ముఖం మీదనే కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారని అంటున్నారు.
ఒకవైపు సమీక్ష జరిగిన జిల్లాల అభ్యర్థులే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీలో కొనసాగడమా? వైదొలగడమా అన్న యోచనలో ఉంటే.. జగన్ మాత్రం తన సిట్టింగుల మార్పు ప్రణాళితో ముందుకు సాగుతున్నారు. త్వరలో సీమ జిల్లాల్లోనూ అభ్యర్థుల మార్పుపై కసరత్తులు ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు.
మొత్తంగా ఇప్పటి వరకూ ఉన్న సమాచారం మేరకు.. ఒకరూ, ఇద్దరూ కాదు అధికార వైసీపీలో ఇప్పుడు ఏకంగా 42 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధమయ్యారని విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వీరిలో అసంతృప్తిని చల్లార్చడానికి వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగి పార్టీ నిర్ణయానికి కారణాలేమిటో, వారి సేవలను ఏ రీతిలో వినియోగించుకుంటామో చెప్పే ప్రయత్నం చేసినా అది వికటించి తిరుగుబాటుకు దారి తీసినట్లు సమాచారం.
ఇప్సుడు తిరుగుబాటు ఎమ్మెల్యేల దృష్టి కాంగ్రెస్ వైపు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఇదే సరైన అదును అన్నట్లుగా ఏపీలో బలోపేతం అయ్యేందుకు పావులు కదుపుతోందని చెబుతున్నారు. జగన్ సోదరి షర్మిలకు ఏపీ నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తున్నది. అదే జరిగితే వైసీపీ నుంచి వలసలు ఆ పార్టీ తిరిగి కోలుకోలేని విధంగా ఉంటాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీకి టచ్ లోకి వచ్చినట్లు ఆ పార్టీ ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. మొత్తంగా ప్రజా వ్యతిరేకత, సిట్టింగుల మార్పు వైసీపీలో సంక్షోభం ముదిరిపాకాన పడేలా చేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రానున్న రోజులలో అధికార వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో వలసలు ఖాయమని చెబుతున్నారు. మొత్తంగా నాలుగున్నరేళ్ల పాలనలో సమాజంలోని అన్ని వర్గాలనూ ఇబ్బందుల పాల్జేసి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న జగన్ ఇప్పుడు సిట్టింగుల మార్పుతో సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని కూడా కోల్పోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.