తెలుగుదేశం జనసేన కూటమిలో బీజేపీ ఉండదు.. ఇది కన్ ఫర్మ్!?
posted on Dec 21, 2023 @ 12:04PM
ఏపీలో ఎన్నికల ముహూర్తం దగ్గరకొచ్చేసింది. జనసేన తెలుగుదేశంతో కలిసే వెడుతుందన్న స్పష్టత ఎప్పుడో వచ్చేసింది. అయితే తెలుగుదేశం, జనసేన పొత్తులో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంటుందా? ఉండదా అన్న విషయంలో ఇప్పుడు స్పష్టత వచ్చేసింది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తి చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం (డిసెంబర్ 20) న జరిగిన యువగళం- నవశకం సభలో స్వయంగా జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చేశారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
నిన్న మొన్నటి దాకా అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకూ జనసేనాని ఎప్పుడు మాట్లాడినా ఏపీలో తెలుగుదేశం, జనసేనా కలిసే ఎన్నికలలో పోటీ చేస్తాయనీ, అలాగే బీజేపీ కూడా కలిసివస్తుందనీ చెబుతూ వచ్చారు. అయితే యువగళం-నవశకం సభలో మాత్రం ఆయన కేంద్రంలోని బీజేపీ ఆశీస్సులు ఉంటాయని, ఉండాలని ఆకాంక్షించారు కానీ ఆ పార్టీ కలిసిరావాలన్న మాట అనలేదు.
దీంతో పవన్ కల్యాణ్ బీజేపీ దూరం అన్న సంకేతాలిచ్చేనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ-జనసేన కూటమి వైఫల్యం తరువాత ఇరు పార్టీల వైఖరిలోనూ ఒకింత మార్పు వచ్చిందని, సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీలో ఉంటుందని ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విస్పష్టంగా ప్రకటించడంతో ఇక జనసేనతో మైత్రికి బీజేపీ చెల్లు చీటీ పాడేసిందా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అయితే ఇరు పార్టీల నుంచీ అటువంటి అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. దీనికి తోడు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాష్ట్రంలో జనసేన, బీజేపీ మైత్రి కొనసాగుతోందనీ, ఎన్నికలలో కలిసే పోటీ చేస్తామని చెబుతున్నారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత కూడా పురంధేశ్వరి అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. దీంతో ఏపీలో తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కూడా కలుస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అదే జరిగితే సీట్ల సర్దుబాటు, ఓటు ట్రాన్స్ ఫర్ సజావుగా సాగుతాయా అని పరిశీలకులు సైతం అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహజంగానే ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుంటే తమ గౌరవానికి తగ్గట్టుగా సీట్లు ఉండాలని పట్టుబడుతుంది. అయితే ఏపీలో కనీసం ఒక శాతం కూడా ఓటు స్టేక్ లేని బీజేపీకి పొత్తులో భాగంగా కోరినన్ని సీట్లు కేటాయించే అవకాశం, అవసరం తెలుగుదేశం పార్టీకి ఉండదు. ప్రస్తుత పరిస్థితులలో ప్రతీ సీటు కీలకంగా భావించే తెలుగుదేశం పొత్తులో భాగంగా కొన్ని సీట్లు జనసేనకు వదులుకుంటుంది, అవి కాకుండా మరికొన్ని సీట్లు బీజేపీకి కేటాయించేందుకు అంగీకరించే అవకాశాలు ఉండవు. ఆ పరిస్థితుల్లో జనసేన తనకు కేటాయించిన సీట్ల నుంచే బీజేపీకి భాగం ఇవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకూ బీజేపీ విషయంలో అలా త్యాగం చేసేందుకు జనసేన సిద్ధపడినట్లుగానే కనిపించింది. అందుకే బీజేపీ పొత్తులో ఉండే విషయంలో తెలుగుదేశం సానుకూలంగా కానీ, ప్రతికూలంగా కానీ స్పందించలేదు. యువగళం పాదయాత్ర ముగించిన తరువాత తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ కూడా బీజేపీ కూడా పొత్తులో ఉంటుందా అన్న విషయంలో ఆచి తూచి స్పందించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా చీలకూడదన్నదే తమ అభిమతమని చెప్పారు.
దీంతో బీజేపీ తెలుగుదేశం, జనసేన కూటమిలో భాగస్వామిగా ఉండే అవకాశాలే ఉన్నాయని అంతా భావించారు. సీట్ల సర్దుబాటు ఎలా అన్న విషయంపై చర్చోపచర్చలూ జరిగాయి. వీటన్నిటికీ పవన్ కల్యాణ్ యువగళం-నవశకం సభా వేదికగా ఫుల్ స్టాప్ పెట్టేశారనే పరిశీలకులు అంటున్నారు. బీజేపీ ఆశీస్సులు చాలనీ, ఆ పార్టీతో సీట్ల సర్దుబాటుకు అవకాశం లేదనీ చెప్పకనే చెప్పేశారని విశ్లేషిస్తున్నారు. తెలంగాణ ఫలితాల తరువాత బీజేపీ కూడా ఏపీలో తన వాస్తవ బలాన్ని బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. సీట్ల కోసం పట్టుబట్టకుండా నైతిక మద్దతుకే పరిమితమౌతుందని, జనసేనాని ఆశీస్సులు ఉంటాయన్న ఆకాంక్ష వెనుక ఉన్న అర్ధం కూడా ఇదేననీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ ఓంటరిగానే బరిలోకి దిగే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.