మాస్కులు మస్ట్.. కరోనా వ్యాప్తితో అమలులోకి వచ్చిన నిబంధన
posted on Dec 21, 2023 9:01AM
కరోనా రెండేళ్లుగా ఆ మాటే ఎక్కడా వినిపించడం లేదు. కానీ అంతకు ముందు మహమ్మారి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. తుమ్మినా, దగ్గినా కరోనాయే అన్న అనుమానంతో నిద్ర లేకుండా చేసింది. లక్షల మంది ఉసురు తీసేసి ప్రజలను క్వారంటైన్ లో మగ్గిపోయేలా చేసింది. కరోనా మహమ్మారి ముప్పు తొలగిందని ఊపిరి పీల్చుకునే లోగా ఉపిరి తీసేయడానికి రెడీ అయిపోయానంటూ కొత్త వేరియంట్ రూపంలో ఇప్పుడు మళ్లీ కోరలు చాస్తోంది.
పంజా విసరడానికి సిద్ధమౌతోంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా బుధవారం (డిసెంబర్ 20)న కరోనా బులిటిన్ విడుదల చేసింది. తాజాగా నాలుగు కేసులు నమోదయ్యాయని ఆ బులిటిన్ లో పేర్కొంది. 402 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో నలుగురు పాజిటివ్ గా తేలారని ప్రకటించింది. కాగా మొత్తంగా ప్రస్తుతం గాంధీలో 9 మందిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.
కరోనా కొత్త వేరియంట్ వ్యాప్తి తీవ్రత కారణంగా రాష్ట్రంలో మాస్కులు ధరించడాన్ని తప్పని సరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాలలో తిరిగితే ఫైన్ తప్పదని హెచ్చరించింది.