సిట్టింగుల మార్పు..ప్రకాశం వైసీపీలో లుకలుకలు!
posted on Dec 21, 2023 @ 12:45PM
వైసీపీలో ఇప్పుడు సంక్షోభం తలెత్తే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం అన్నట్లుగా మారిపోయింది ఆ పార్టీ అధినేత జగన్ పరిస్థితి. ఇటు చూస్తే పార్టీపై ప్రజలలో పీకల దాకా అసంతృప్తి కనిపిస్తున్నది. ఇప్పటికే వెలువడిన సర్వేలన్నీ ఇదే విషయాన్ని కరాఖండీగా చెప్పేశాయి. దీన్ని అంతో ఇంతో తగ్గించి కనీసం పరువు పోకుండా ఉండేలా కాపాడుకోవాలని పార్టీ పెద్దలు రకరకాల ఎత్తులు వేస్తున్నారు. కసరత్తులు చేస్తున్నారు. ఎక్కడికక్కడ అభ్యర్థులను మార్చేసి ఎంతో కొంత మేర ప్రజలను మాయ చేయాలని చూస్తున్నారు. కానీ ఎమ్మెల్యేలేమో అందుకు ససేమీరా అంటున్నారు. నాలుగున్నరేళ్లగా అంటిపెట్టుకుని ఉన్న సిట్టింగ్ స్థానాన్ని వదిలి వెళ్ళమంటే అక్కడ పరిస్థితి తట్టుకోవడం ఎలా అంటూ అధిష్టానంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. మరికొందరికైతే రాష్ట్రంలో ఎక్కడ సీటు ఇచ్చినా ఓడిపోతారని ముందే తేలిపోవడం, వారికి సీట్లు ఇచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో వారు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఇప్పుడు జగన్ ఇప్పుడు ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడ్డారు. ఈ జిల్లా ఆ జిల్లా అని లేదు. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి.
ఉమ్మడి ప్రకాశం జిల్లాను తీసుకుంటే.. 2019ఎన్నికల్లో ఈ జిల్లాలో మూడు స్థానాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాలలోనూ వైసీపీ విజయం దక్కించుకుంది. చీరాలలో అప్పటి తెలుగుదేశం నాయకుడు కరణం బలరామకృష్ణమూర్తి, అద్దంకిలో గొట్టిపాటి రవి, కొండపిలో డోలా బాల వీరాంజనేయస్వామి మాత్రమే తెలుగుదేశం నుంచి విజయం సాధించారు. వీరు మినహా అందరూ వైసీపీ నాయకులే గెలిచారు. జగన్ ఒక్క ఛాన్స్ గాలిలో జిల్లాలకు జిల్లాలు వైసీపీ క్లీన్ స్వీప్ చేసినప్పటికీ ప్రకాశంలో మాత్రం తెలుగుదేశం మూడు స్థానాలను గెలుచుకొని సత్తా చాటింది. మరో రెండు చోట్ల స్వల్ప తేడాతో ఓడిపొయింది. అయితే తర్వాత తెలుగుదేశం తరఫున గెలిచిన బలరాం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ఈసారి ఇక్కడ పూర్తిగా వైసీపీకి ఎదురుగాలి వీస్తుంది. ఒంగోలు నుండి చీరాల వరకూ.. మార్కాపురం నుండి కందుకూరు వరకూ ఎక్కడా, ఏ నియోజకవర్గంలోనూ వైసీపీకి అనుకూల పరిస్థితులు లేవు. అందుకే ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ సిట్టింగుల స్థానాలను మొత్తంగా మార్చేయాలని నిర్ణయించుకుంది.
ఈ జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు సహా వైసీపీ ఎమ్మెల్యేలందరికీ ఓటమి తప్పదని ఇప్పటికే నివేదికలున్నాయి. అందుకే ముందుగా మంత్రి ఆదిమూలపునే మార్చేసింది అధిష్టానం. అలాగే ప్రస్తుత సిట్టింగుల్లో ఒకరిద్దరికి అసలు టికెట్ కూడా ఇచ్చే పరిస్థతి లేదని చెబుతోంది. దీంతో ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో మార్పుల లొల్లి మొదలైంది. ముందుగా యర్రగొండపాలెం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌ను కొండపికి మార్చగా.. కొండపిలో వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న వరికూటి అశోక్‌బాబును బాపట్ల జిల్లా వేమూరుకు కేటాయించారు. అలాగే వేమూరు నుంచి ఎన్నికైన మంత్రి మేరుగు నాగార్జునను ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు నియోజకవర్గానికి మార్చారు. ఇక, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిలను వేరే నియోజకవర్గాలకు పంపించేందుకు సిద్ధమయ్యారు.
అలాగే కీలకమైన ఒంగోలు నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. బాలినేని ఇప్పటికే రెబల్ గా వాయిస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీలో ఉంటే గిద్దలూరు కేటాయించనున్నారు. అయితే గిద్దలూరుకు మారేందుకు ఆయన సిద్ధంగా లేరు. ఇప్పటికే వైసీపీ రీజినల్ సమన్వయకర్త, ఎంపీ విజయసాయిరెడ్డికి బాలినేని ఈ విషయం తేల్చి చెప్పేశారు. కాగా, ఒంగోలు స్థానాన్ని కరణం బలరాంకు కేటాయించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఈ దఫా ఎమ్మెల్యేగా పోటీ చేయించనున్నట్లు తెలుస్తుంది. అయితే కరణం బలరాం కుమారుడు వెంకటేష్ కు చీరాల టికెట్ హామీ ఉండగా బలరాంకు అసలు టికెట్ దక్కడమే అన్న అనుమానాలూ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు లాంటి వారికి మొండి చేయే అంటున్నారు. దీంతో టికెట్ దక్కని వారు తిరుగుబాటుకు సిద్ధమ వుతున్నారు. మొత్తంగా ఇప్పుడు ప్రకాశం వైసీపీలో సిట్టింగుల మార్పు దుమారం రేపనుంది.