జగన్ పై గుంటూరు వైసీపీ నేతల గుర్రు!
posted on Dec 23, 2023 5:37AM
వైసీపీలో ఇప్పుడు ఆ పార్టీ అస్థిత్వాన్ని ప్రశ్నార్ధకంలో పడేశేలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం జగన్ వ్యూహాత్మకమో.. వ్యూహాత్మక తప్పిదమో కానీ అభ్యర్థుల మార్పు ఆ పార్టీలో ముసలానికి కారణమయ్యేలా ఉంది. గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి పదకొండు స్థానాల్లో ఇన్ చార్జీలను మార్చేసిన జగన్.. ఇలా సిట్టింగులను మార్చేసే నియోజకవర్గాల సంఖ్య 90కి పైనే ఉంటుందని సంకేతాలు పంపారు. ఆ దిశగా కసరత్తులూ మొదలెట్టేశారు. ఇలా నియోజకవర్గాల మార్చేసే వారిలో మంత్రులూ ఉన్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇప్పటికే మంత్రులు విడదల రజనీ, మేరుగ నాగార్జునని మార్చేశారు. 11 మందిని మార్చేసిన జగన్ ఇక రెండో విడతలో 40 మంది సిట్టింగుల మార్పునకు రెడీ అయిపోయారని వైసీపీ వర్గాలే చెప్తున్నాయి. దీంతో ఇప్పుడు వైసీపీ నేతలందరిలోనూ ఆందోళన ప్రారంభమయింది. ఇప్పటికే అధికారికంగా ఇక టిక్కెట్ రాదని తెలిసిపోయిన నేతలు కొందరు రాజీనామాలకు సిద్ధమవుతుండగా.. మరికొందరు పక్క చేపులు చూస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎమ్మెల్యేల అనుచరులు రాజీనామాల బాటపట్టారు. టిక్కెట్ రాదని కంగారు పడుతున్న నేతలు కొందరు ఇప్పటికైతే సైలెంట్ గా ఉండగా.. సమయం వచ్చినపుడు తిరుగుబాటుకు రెడీ అవుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బెంగళూరులో ఓ ఎంపీ నివాసంలో జరిగిన రహస్య భేటీని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఎన్నికల ముందు అధికార పార్టీలోకి చేరికలు ఉండాల్సిందిపోయి ఇప్పుడు వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైంది.
ఏపీ రాజకీయాలలో ఉమ్మడి కృష్ణాజిల్లా తర్వాత ఆ స్థాయిలో రాజకీయ చైతన్యం ఉండే జిల్లా గుంటూరు. ఇటు కృష్ణా, అటు ప్రకాశం జిల్లాలతో అనుబంధం ఉండే ఈ జిల్లా నేతలు రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా వ్యవహరిస్తుంటారు. అధికార వైసీపీలో కూడా ఈ జిల్లా నేతలే కీలకంగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు జగన్ నిర్ణయాలతో ఈ జిల్లా నేతలలో గుర్రు మొదలైంది. ఇప్పటికే ఈ టికెట్ల అలజడితో జగన్ కు నమ్మిన బంటుగా ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఎంకు రాంరాం చెప్పి వెళ్లిపోయారు. ఆయన స్థానంలో మంగళగిరికి గంజి చిరంజీవిని ఇఆన్ చార్జిని చేశారు. తనను మార్చేస్తున్నారనే ముందుగా ఆర్కేనే పార్టీ నుండి బయటకొచ్చేశారు. అంత సన్నిహితుడైన ఆర్కేను కూడా పక్కన పెట్టేయడంతో ఒక్కసారిగా పార్టీలో అలజడి మొదలైంది. ఇక వైద్య ఆరోగ్య మంత్రి రజనిని చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకు, సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగ నాగార్జునను వేమూరు నుంచి ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు, ప్రత్తిపాడు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి మేకతోటి సుచరితను తాడికొండకి తరిమేశారు.
చిలకలూరిపేటకు మల్లెల రాజేశ్‌నాయుడు రేపల్లెకు డాక్టర్ ఈవూరు గణేశ్, ప్రత్తిపాడుకు బాలసాని కిరణ్‌కుమార్‌లను కొత్త ఇన్‌చార్జులుగా నియమించారు. తెలుగుదేశం నుంచి వచ్చిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌కు ఈసారి మొండి చేయేనని తేల్చేశారు. ఈ పరిణామాలు ఇప్పుడు వైసీపీని కుదిపివేస్తున్నాయి. ప్రత్తిపాడులో ఉన్న సుచరితను.. వైసీపీ నుంచి సస్పెండ్ చేసిన ఉండవల్లి శ్రీదేవిపై పోటీ చేయమని తాడికొండ పంపారు. నిజానికి ఇక్కడ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను ఎన్నో ఆశలతో ఉన్నారు. డొక్కానే మొదట ఇన్ చార్జిగా నియమించగా.. అప్పట్లో శ్రీదేవి కోసం ఆయన్ను తప్పించి కత్తి సురేశ్‌ను ఇన్‌చార్జిగా వేశారు. ఇప్పడు కూడా మరోసారి ఆయనకు మొండిచేయి చూపి సుచరితను తెచ్చారు. దీంతో డొక్కా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వేమూరు ఎమ్మెల్యే మంత్రి మేరుగ నాగార్జున మార్చొద్దు బాబోయ్ అంటూ ఎంత మొత్తుకున్నా వినకుండా మార్చేశారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటిని కృష్ణా జిల్లాకు పంపడం లేదంటే ఈసారి అసలు టికెట్ కేటాయించకపోవడం జరగనుందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దీంతో అంబటి అధిష్టానంతో బేరసారాలు మొదలు పెట్టినట్లు తెలుస్తున్నది.
ఒకవైపు అమరావతి ఎఫెక్ట్ తో ప్రభుత్వంపై ప్రజలలో తీవ్ర అసంతృప్తి ఉండగా.. ఇప్పుడు స్థానాల మార్పుతో నేతలలో కూడా సొంత పార్టీపై, పార్టీ అధినేతపై ఆగ్రహం, అసంతృప్తి పెల్లుబుకుతోంది. 40 మందికి పైగా సిట్టింగుల మార్పు అభ్యర్థులతో రెండో జాబితా నేడో రేపో రానున్నట్లు తెలుస్తున్నది. ఈ జాబితా కనుక వస్తే ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాలలో పెను మార్పలు తప్పవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జిల్లాకు చెందిన దాదాపు అరడజను మంది నేతలు తిరుగుబాటుకు సిద్దమవుతున్నట్లు రాజకీయ వర్గాలలోచర్చ జరుగుతోంది. గుంటూరు జిల్లాపై కూడా వైసీపీ ఆశలు వదిలేసుకోవలసిన పరిస్థితులు ఉత్పన్నమౌతాయని విశ్లేషిస్తున్నారు.