నెల్లూరులో వైసీపీ ఆపసోపాలు!
posted on Dec 23, 2023 4:27AM
సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు సిట్టింగ్ అభ్యర్థుల మార్పు పేరుతో చేస్తున్న కసరత్తు వైసీపీలో తిరుగుబాటుకు దారి తీస్తోంది. ఇప్పటికే 11 మందిని మార్చేసిన జగన్.. త్వరలో 40 మందికి పైగా జాబితాను రెడీ చేసే పనిలో ఉన్నారు. ఈ మేరకు తాడేపల్లి ప్యాలెస్ లో కసరత్తులు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ ఒక్కో జిల్లా ముఖ్య అభ్యర్థులను పిలిచి జగన్ బుజ్జగించే పనిలో ఉన్నారు. అభ్యర్థులు కొందరు కూల్ గానే ఒప్పుకుంటున్నా.. మరికొందరు మాత్రం ససేమిరా అని ముఖంమీదే చెప్పేస్తున్నారు. ఇంకొంత మంది ఏకంగా తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. వీరిని బుజ్జగించేందుకు సజ్జల, విజయసాయి రెడ్డి లాంటి వారిని నియమించినా వాళ్ళ మాటలకు కూడా అభ్యర్థులు ఖాతరు చేయడం లేదని తెలుస్తున్నది. దీంతో అభ్యర్థుల మార్పుతో రానున్న రెండో జాబితాతో వైసీపీలో ముసలం పుట్టడం ఖాయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే కొందరు తెలుగుదేశం, జనసేన వైపు చూస్తున్నారు. మొత్తం మీద సంక్రాంతి తర్వాత వైసీపీ నుండి భారీ స్థాయిలో వలసలు ఉండే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి నెల్లూరు అంటే వైసీపీకి కంచుకోట. అంతకు ముందు కాంగ్రెస్ కు పెట్టని కోటగా ఉన్న ఉమ్మడి నెల్లూరు జిల్లా.. వైసీపీ ఆవిర్భావం తర్వాత జగన్ వెంట నడిచింది. అందుకే 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది స్థానాలలో వైసీపీ గెలిచింది. అయితే సరిగ్గా నాలుగేళ్లు గడిచే సరికి మొత్తం సీన్ మారిపోయింది. జగన్ కోసం పోరాటాలకు కూడా సిద్దపడే నేతలు ఇప్పుడు వైసీపీకి దూరమైపోయారు. ఓదార్పు యాత్ర సమయంలో జగన్ వెన్నంటి నడచిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇప్పుడు పార్టీలో లేరు. శ్రీధర్ రెడ్డిని ప్రభుత్వ పెద్దలే దెబ్బకొట్టాలని చూడగా.. ఆయన తిరుగుబాటు చేసి వైసీపీని ముప్పతిప్పలు పెట్టి చివరికి టీడీపీ వైపు వెళ్లారు. అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే, సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డికి కూడా పొగబెట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ వేశారంటూ ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని సస్పెండ్ చేయగా.. ఆయన కూడా ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు. దీంతో ఇప్పుడు నెల్లూరులో వైసీపీ ఆపసోపాలు పడుతోంది.
పార్టీలో ఉన్న అభ్యర్థుల మీదేమో ప్రజలలో తీవ్ర అసంతృత్తి ఉంది. పోనీ అభ్యర్థులను మార్చేద్దామంటే ఇక్కడ సరైన అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సి వస్తున్నది. మరోవైపు ఉన్న వారిలో గ్రూపు తగాదాలు కూడా ఎక్కువైపోయాయి. దీంతో ఇప్పుడు వైసీపీ ఇక్కడ ఏం చేయాలో కూడా తోచని పరిస్థితితో ఉంది. ముందుగా ఉన్న వారిని మార్చేసేందుకు సిద్దమైన జగన్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ను అక్కడి నుంచి తప్పించేందుకు నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనిల్ కుమార్ ను ప్రత్యర్థుల కంటే ఎక్కువగా సొంత పార్టీ నేతలే ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అనిల్‌కుమార్ యాదవ్‌తో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అసలు పొసగడం లేదు. నెల్లూరు నుంచి అనిల్ పోటీ చేస్తే, తాను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో వుండనని ఇప్పటికే వేమిరెడ్డి తేల్చి చెప్పారు. మరోవైపు అవగాహాలేని అనిల్ వ్యాఖ్యలు, దూకుడు స్వభావంతో ప్రజలలో కూడా తీవ్ర అసంతృప్తి మూటగట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనను అక్కడ నుండి తప్పించి ప్రకాశం జిల్లా కనిగిరికి పంపనున్నట్లు తెలుస్తుంది. కనిగిరిలో ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ కు ఈసారి టికెట్ లేనట్లేనని చెబుతున్నారు.
ఇక కావలి సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్ది ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆత్మకూరు మేకపాటి విక్రమ్ రెడ్డి, కోవూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి, గూడూరు వెలగపల్లి వరప్రసాద్ రావు, సూళ్ళూరు పేట సంజీవయ్య వీళ్లందపైనా కూడా వారి వారి నియోజకవర్గాలలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. వీళ్లంతా కూడా ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు జగన్ వద్ద నివేదికలు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వీరిలో ముగ్గురికి అసలు ఈసారి టికెట్టిచ్చే పరిస్థితే లేకపోగా.. వారి స్థానంలో ఇక్కడ ఎవరిని దింపాలన్నదే వైసీపీకి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. చిత్తూరు జిల్లా నుండి మంత్రి రోజాను నెల్లూరులో దింపనున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అలాగే ప్రకాశం జిల్లా నుండి మరో కీలక నేతను కూడా నెల్లూరులో దింపాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే, టికెట్లు దక్కనివారు రెబల్స్ గా మారితే ఈసారి ఈ జిల్లాను వైసీపీ సంపూర్ణంగా వదులుకోవాల్సిందే అంటున్నారు పరిశీలకులు.