జగన్ విశాఖ ఆశలు గల్లంతు.. కార్యాలయాల తరలింపునకు హైకోర్టు బ్రేక్
posted on Dec 21, 2023 @ 3:15PM
జగన్ విశాఖ నుంచి పాలన ఆశలు ఇక ఆవిరైపోయినట్లే. ఏదో ఒక సాకుతో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించి అక్కడ నుంచి పాలన సాగించినట్లు చేద్దామని వేసిన జగన్ ఎత్తుగడ పారలేదు. క్యాంపు కార్యాలయాలంటూ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను విశాఖకు మార్చేసి విశాఖ నుంచి పాలన అన్న తన మాటను చెల్లుబాటు చేసుకోవాలని చూసిన జగన్ కు హైకోర్టులో చుక్కెదురైంది. విశాఖకు కార్యాలయాల తరలింపు ప్రక్రియకు కోర్టు బ్రేక్ వేసింది. కేసును త్రిసభ్య ధర్మాసనానికి బదలాయిస్తూ గురువారం (డిసెబర్ 21) ఉత్తర్వులు జారీ చేసింది. త్రిసభ్య ధర్మాసనం తీర్పు వచ్చేంత వరకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధించింది.
అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాల తరలింపును సవాల్ చేస్తూ రైతులు వేసిన పిటిషన్‌పై బుధవారం (డిసెంబర్ 20) హైకోర్ట్‌లో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌ను ముగ్గురు సభ్యుల ధర్మాసనంకు పంపుతామని హైకోర్ట్ చెప్పింది. అక్కడ ఇప్పటికే విచారణ పెండింగ్‌లో ఉందనీ.. ఈ లోపు పిటీషన్ వేసిన రైతుల ఆందోళనను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని హైకోర్ట్ న్యాయమూర్తి తెలిపారు.
రాజధాని కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో విధిస్తామని ధర్మాసనం చెప్పింది. దీంతో తాము ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకుంటామని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో. తదుపరి విచారణను హైకోర్టు ఒక రోజు వాయిదా వేసింది. గురువారం తిరిగి ఈ కేసు విచారణ చేపట్టిన హైకోర్టు కేసును త్రిసభ్య ధర్మసనానికి బదిలీ చేసింది. ఆ ధర్మాసనం తీర్పు వెలువరించేంత వరకూ కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసింది..