సేవకు అద్భుతమైన నిర్వచనం!

ఒక ఊరిలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో ప్రేమ, అభిమానం. ఆ ఇద్దరు అన్నదమ్ముల్లో పెద్దాయనకు వివాహమైంది, పిల్లలు కూడా! కానీ చిన్నతను పెళ్ళి చేసుకోలేదు బ్రహ్మచారిగానే జీవిస్తూ ఉన్నాడు. వారిద్దరికీ ఉమ్మడిగా కొంత పొలం ఉంది. అది సారవంతమైంది కావటంతో ఏటా ఇబ్బడిముబ్బడిగా దిగుబడి వచ్చేది. ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా లాభాన్ని ఇద్దరూ చెరిసగం పంచు కునేవారు. ఇలా కొన్నేళ్ళు గడిచాక, ఒకరోజు అర్ధరాత్రి, ఆ అన్నయ్య నిద్దరలోంచి మేల్కొని ఆలోచించడం మొదలుపెట్టాడు. 'అరే! నా తమ్ముడి విషయంలో ఎందుకో అన్యాయం జరుగుతోందని అనిపిస్తోంది. నాకు పెళ్ళయింది పిల్లలున్నారు. భవిష్యత్తులో నా బాగోగులు చూసుకోవడానికి నాకు వాళ్ళున్నారు. కానీ, తమ్ముడిని ఎవరు చూసుకుంటారు! వాడికి ఏదో ఒకటి చేయాలి వచ్చిన లాభాల్లో వాడికి ఎక్కువ ముట్టజెబితే భవిష్యత్తులో భద్రతగా ఉంటుంది' అనుకొని ఒక నిర్ణయాని కొచ్చాడు.  వెంటనే మంచం దిగి, పొలానికి వెళ్ళి, కొంత ధాన్యాన్ని తీసుకొని తమ్ముడి ధాన్యంలో కలిపాడు. మరోవైపు తమ్ముడు కూడా అన్న విషయమై ఆలోచించసాగాడు. 'నేను ఒక్కడిని, లాభాల్లో సగం వాటా తీసుకొని ఏం చేసుకుంటాను అన్నయ్యకు భార్య, పిల్లలు ఉన్నారు. ఆయనకు నా కన్నా ఎక్కువ అవసరాలుంటాయి. ఎలాగైనా, అన్నయ్యకు ఎక్కువ వాటా అందాలి' అనుకొని హుటాహుటిన వెళ్ళి, తన ధాన్యంలో కొంత ధాన్యాన్ని అన్నయ్య ధాన్యంలో కలిపాడు. ఇలా వీలున్నంత వరకు ఒకరికి తెలీకుండా, మరొకరు ప్రతి సంవత్సరం ఒకరికొకరు లాభపడేలా చూసుకునేవారు.  ఇలా ఒక రోజు అర్ధరాత్రి ఆ అన్నదమ్ములు ఒకరి ధాన్యంలో మరొకరు ధాన్యాన్ని కలిపివస్తూ ఒక దగ్గర కలుసుకోవడం ఆ ఊరిపెద్ద గమనించాడు. వారి ప్రేమాభిమానాలకు చలించిపోయాడు. వారి త్యాగగుణాన్ని ఊరంతా ప్రచారం చేశాడు. కొన్నేళ్ళకు ఆదర్శవంతమైన ఆ అన్నదమ్ములు గతించిపోయారు. ఒకానొక సందర్భంలో ఆ ఊరిలో గ్రామస్థులు ఆలయాన్ని కట్టించాలని అనుకున్నారు. దేవాలయ నిర్మాణానికి ఏది సరైన స్థలమనే చర్చ రాగా, గతంలో ఆ రాత్రి అన్నదమ్ములు కలుసుకున్న చోటే అనువైనదని తేల్చిచెప్పారు. నిస్వార్థం, త్యాగం నిండిన ఆ ఇద్దరి ఆదర్శం ఆలయరూపంలో తరతరాలకు ప్రసరింపచేయాలని నిర్ణయించారు. కానీ ఈ రోజుల్లో 'సేవ',''త్యాగం' అన్న పదాలకు అర్థాలే మారిపోతున్నాయి. సమాజంలో ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్. వంటి ఉన్నతోన్నత ఉద్యోగాల ద్వారానే సేవ చేయ వచ్చనుకుంటున్నారు. పదానికున్న ప్రాధాన్యమే మారిపోయింది. ముఖ్యంగా నేటితరం నిత్యజీవితంలో త్యాగం, ఉదారత వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా, ఏదో ప్రత్యేక సందర్భంలో పళ్ళో, మిఠాయిలో పంచితే సరిపోతుందని  అనుకుంటోంది. కానీ  'సేవ'కు మహోన్నతమైన స్థానం ఉంది. ఒకప్పుడు ఈ సేవ స్ఫూర్తితో వందలాది మంది తమ జీవితంలో సేవకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఇతరుల మంచిని కాంక్షిస్తూ సేవచేస్తే పరోక్షంగా అది మన మంచికే ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి. దీని వలన వ్యక్తిగా మన మూర్తిమత్వం వేయింతలవుతుంది, ప్రకాశిత మవుతుంది. స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే 'సేవలు పొందే వ్యక్తి కన్నా, సేవించే వ్యక్తే ధన్యుడు. సేవించుకునే అవకాశం కలిగించినందుకు ఎదుటివారికే మనం ఋణపడి ఉంటాం. ఆ భగవంతుడు తనను పూజించుకునే భాగ్యాన్ని, పరోపకారం రూపంలో ఇచ్చాడని తెలుసుకోండి. ఆరాధనగా భావించి 'సేవ' చేయటం అలవాటుగా చేసుకోండి'.అంటారు. కాబట్టి సేవ అనేది మనిషికి జీవితంలో ఎంతో ముఖ్యం.                                      ◆నిశ్శబ్ద.

భావి భారతం ఎక్కడ ?

  చిదిమితే పాలుగారే వయస్సు వాళ్ళది, కొడితే ఎర్రగా కం దిపోయే శరీరం వాళ్ళది. బంగారు వర్ణం లో ఉండే ఆచిన్నారుల్ని అక్కున చేర్చు కునే  వారు  ఉన్నారా? అంటే ఉన్నారు అయితే సహజంగా ఆవయస్సులో పెడతా మంటే ఆశ ,  కొడతా మంటే  భయం . అలా అమాయకంగా, ఉంటున్న జీవితంలో ఏదో తెలియని నిస్సతువ, ఏదో  తెలియని  నిరుత్సాహం.  అందరిలాంటి పిల్లలే వీళ్ళు ఎప్పుడూ ఒంటరి తనం కోరుకుంటారు, కొన్ని సదర్భాలలో  ఉద్రేకా నికి లోనూ అవుతూ ఉంటారు. చిన్న పాటి నిర్లక్ష్యం, క్షణికావేశం వాళ్ళని నేరస్తులను చేస్తుంది. ఇవి సాదారణ అంశం కాదు భావితరం. ముందు ముందు దేశాన్ని నడిపించాల్సిన భావితరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు ఇవి. , అయితే పుడుతూనే దొంగలు కారు వీరు, ఖూనీ కొర్లు ఆగంతకులు కానే కారు వీళ్ళు, వారి వారి  సామాజిక ఆర్ధిక సమస్యలు వాళ్ళని ఈ పరి స్థితికి, తీసుకు వచ్చేందుకు  కారణమని కొందరు, కాదు కాదు  వాళ్ళు జీవిస్తున చుట్టు  పక్కల పరిస్థితులు వాళ్ళను నేరస్తులుగా నిరూపించా యని అంటున్నారు నిపుణులు. చిరు ప్రాయంలోనే బాల నేరస్తులుగా ఎందుకు మారుతున్నారు. అందుకు కారణాలు,  అందరి జీవితల్లో నీకు యే జీవితం  ఇష్టం అని అడిగితే ఆడే పడే పసి వయస్సు పసి మొగ్గలాంటి చిన్నారులు అప్పుడే  మొగ్గ తొడిగిన ఆ చిరు  ప్రాయం లో అటు తల్లి తండ్రులు  ఇటు ఐన వాళ్ళను వదిలి బాల నేరస్తులుగా 3 నుంచి 7 ఏళ్ల జైలు జీవితాన్ని అనుభవస్తున్నారు ఆ చిన్నారులు.  అటువంటి చిన్నారుల జీవితం లో   కమ్ముకున్న అఛీ కట్లకు కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు చిన్నారులు చెప్పే సమాధానం ఏమిటి? అలాంటి బాల నేరస్తుల పట్ల ఎలా ప్రవర్తించాలి? అన్న అంశాలను జువనైల్ జస్టిస్ చట్టం 2015  ఏం  చెపుతోంది అనే అంశాన్ని తెలుసుకుందాం.                                                                       ప్రతి బాల బాలిక లోనూ శక్తి సామర్ధ్యలు ఉంటాయి. అందరూ శక్తి మంతులే, ఏదో సాధించాలి, తాను అందరిలా ఉన్నత స్థాయి లోకి ఎదగలన్న థ్హప త్రయం ఉంటుంది. భారత రాజ్యాంగం, బాల బాలికలకు అత్యంత ప్రాధాన్యత ను ఇచ్చింది అనడంలో ఏ మాత్రం  సందేహం లేదు  బాల బాలికల బధ్రత కోసం( జువానైల్ జూస్టిస్)చట్టం 2015 ప్రకారం బాల బాలికల సంరక్షణ, రక్షణ, వారి అభివృద్ధి, చికిత్స, సామాజిక బధ్రత, వివిధ సందర్భాలలో పిల్లలు ఎదుర్కుంటున్న సమస్యలపై వారి పట్ల  స్నేహ పూర్వకంగా వ్యవహరించాలని కోరింది. పిల్లలు సహజంగా చాలా అమయంగానే పుడతారు. కొన్ని రాకల్ సమస్యల వల్ల వాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్థూ ఉంటారని. అందులో కొన్ని సున్నిత మైనవిమరికొన్ని చట్టం తో ముడి పడ్డ ఆంశాలుగా విశదీక రింకారు.                                             పిల్లల్లో ఎలాంటి ప్రవర్తన ఉంటుంది అంటే ఉద్రేక పూరితం గాను బయటి కి భావాన్ని వ్యర్థమ్ చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు కన్నీటి పర్యంతం అవుతూ మరికొందరు కోపోద్రిక్తులు అవుతూ ఉంటారు. ఈ క్రమం లోనే చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడడం. దుర్భాష లాడడం. ఇతరుల పట్ల విచక్షణ కోల్పోడం.అనుచిత ప్రవర్తన, తరచుగా చిన్నప్పుడే అలవడడం  ఖద్దు. ఏ మైనప్పటికీ తల్లి తండ్రులు, కుటుంబ సభ్యులు ఇతరులు అంటే పిల్లల  సంరక్షణ బాధ్యతలు చూసే వారే  పిల్లలకి నయానో భయనో చెప్పి చూడాలే తప్ప వారిపట్ల ఖటినంగా వ్యవహరించడం కొట్టడం సరికాదని.                                                                            తెలిసి తెలిసి ఎవరు నేరం చేయరు అయితే అందుకు కారణమైన పరిస్థితులు పరిశీలించి. ఏ కరణాల వల్ల పరిస్థితుల వల్ల  నేరం  చేశారు. అక్కడ జరిగిన ఘటనలో  ఏ బాలుడు బాలిక నేరం చేశారని రుజువైందా? చిన్న చిన్న నేరాలు లేదా తీవ్ర  నేరాలు ఆరోపించ బడ్డ  బాలుర పట్ల ఎలా వ్యవహరించాలి? అన్న సమస్య కు జువనైల్ జస్టిస్ కొన్ని మార్గ దర్శకాలను సూచించింది. చైల్డ్  కన్ఫ్లిక్ట్ విత్ లా  అన్న అంశంలో జువానైల్ జస్టీస్ సెక్షన్ 2(13) ప్రకారం 18 సంవత్సరాలు నిండని బాల బలికలు నేరం ఒప్పుకుంటే నేరం రుజువు ఐనా అతని నేరం ఆధారంగా శిక్షించవద్దని,  నేర తీవ్రత ఆధారంగా, ఉద్దేశ పూర్వకంగా నేరం చేయలేదని, నేర ప్రవృత్తి అతనికి లేదని,,  అందుకు  గల కారణాలను,  సామాజికి ఆర్ధిక, అంశాలు క్రోడీకలించాలని ఆ త్రువాతే   పరిమితులతో కూడిన  శిక్ష ,లేదా వ్యక్తి గత శిక్ష లేదా అతని ప్రవృత్తిలో మార్పు వచ్చేవిధంగా తగిన శిక్ష ను ఖరారు చేయాలని జువనైల్ జస్టిస్ సూచించింది. ఈ అంశాలపై అసలు సమస్యల పై చేసిన విశ్లేషణ, పరిశోదన  చూద్దాం.   2015 నాటికి జాతీయ స్థాయిలో  ఇతర నేరాలతో పోలిస్తే  బాలనేరస్తుల   గణాంకాల లో  జాతీయ  నేరాల పై  వచ్చిన రిపోర్ట్ ఏమి చెపుతోందో చూద్దాం.                                                                                                                                                           బాల బాలికలు జువనైల్ జస్టిస్  చట్టాన్ని వ్యతిరేకించడం  సరికాదని అభిప్రాయపడింది. బాల బాలికల సంరక్షణ, రక్షణ. అత్యవసరమని  జువనైల్ జస్టిస్  చట్టం  2015 లో పేర్కొంది. ముఖ్యంగా  18 సంవత్సరాలు నిండని బాల బాలికలు   ఏదైనా ఒక నేరం చేసినట్లు రుజు వైతే   జువనైల్ కమీషన్ వేసే నాటికి అతని లేదా ఆమె వయస్సు తక్కువ  అయినట్లు అయితే, ఆ నేరం చేసి నట్లు బాలురు ఒప్పుకుంటే. తనకు సరైన వాతావరణం లేని కరణంగా, లేదా  ఆ నేరం  చేసేందుకు మరో నేపధ్యం ఉన్నప్పుడు. అతనికి మరో కొత్త జీవి తాన్ని  ప్రారంభించేందుకు అవకాశం ఉంది. కొన్ని నేరాలలో  నేర తీవ్రత ఆదారంగా , అందులో ఉద్దేశ పూర్వకంగా, నేరం చ్యలేదని, స్వత హా గా అతడు నేర ప్రవృత్తి గల మనస్తత్వం అతనిది లేదా ఆమెది కాదని, ఆ కేసు విషయం లో  నేరస్తులు గా చెప్పబడుతున్న వారి లో నేరం చేసే   తత్వం అందులో లేనప్పుడు,  అక్కడి వాతావరణం, పరిణామాలు అందుకు  గల కారణాలు, సరైనవి కానప్పుడు వీటిని చిన్న చిన్న నేరాలుగా  మాత్రమే పరిగ నించాలని జువనైల్ జస్టిస్ సూచించింది. అతని నేరం ఆధారంగా శిక్షించ  వద్దని తేల్చి చెప్పింది.  తప్పు చేసినా అతను లేదా ఆమె వారి విషయంలో వ్యక్తి గత శిక్ష, లేదా అతని ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చే విధంగా చర్యలు ఉండాలని సూచింది. వారి అవసరాలను గమనిస్తూ సామాజిక, మానసిక సంబంద మైన విషయా ల పట్ల కూడా నిశ్చింతగా  గమనించాల్సిన అవసరం ఉందని జువనైల్ జస్టిస్  నొక్కి చెప్పింది.                                                                        అసలు బాల బాలికలు ఎందుకు  బాల నేరస్తులుగా  మారుతున్నారు.జాతీయ స్తాయిలో  నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లో ఇప్పటికే 31, 396 మంది  బాల నేరస్తులు  ఉన్నట్లు నేషనల్ క్రైమ్  రిపోర్ట్ లో పేర్కొంది. ఇతర క్రైమ్ రిపోర్ట్  తో పోలిస్తే   2.1% మాత్రమే మెజారిటీ ఉందని ఆ రిపోర్ట్  లో పేర్కొన్నారు. అయితే ఇందులో ఉన్నవారు  చాలామంది  చిన్న చిన్న నేరాలు చేసిన వారే  అని రిపోర్ట్లో వివరించారు.  తల్లి తండ్రులు  ఆర్ధికంగా బల హీన పడిన వారు బలహీన వర్గాలకు చెందిన వారు 42.5% ఉన్నారని. మొత్తం మీద ఇందులో 11.5% మంది నిరక్ష రాస్యులే, ఉండడం గమనార్హం.  ఇతర  వర్గాల  వారు 43.4 %ఉన్నారని అందరూ ప్రాధమిక స్థాయిలో  చదువు కున్న వారని పరిశోధన లో తేల్చారు.  బాల నేరస్తులు చేసే రక రకా  ల   నేరాలను  ఏ విధంగా నిర్వచించిందో చూద్దాం.                                                                                        ఇక్కడ  బాలలే నేరస్తులు అసలు బాల నేర స్థులు  చేసే నేరాన్ని వివిధ రకాల నేరాలను నిర్వచించారు.                                                                                                                                                        వివిధ రకాల నేరాలకు పాల్పడినట్లు వివిధ రకాల నేరాలను జువనైల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం ఈ క్రింది విధంగా నిర్వచించారు.  చిన్న చిన్న నేరాలుతగాదాలు.... చిన్న చిన్న నేరాలకు భారతీయ శిక్ష స్మృతి లోని ఐ పి సి సెక్షన్ ప్రకారం 3 సంవత్సరల్ కారా గార శిక్ష తీవ్ర మైన నేరాలు... తీవ్రమైన నేరాలు చేసి నప్పుడు భారతీయ శిక్షా  స్మృతి లోని ఐ పి సి సెక్షన్ ప్రకారం తాత్కాలికంగా 3నుంచి 7 సంవత్సరాల కారాగార శిక్ష విదించాలని జువనైల్ జస్టిస్ సూచించింది.                                                                                                                                                 అతి తీవ్రమైన నేరాలు... అతి తీవ్రమైన  నేరం చేసిన వారికి భారతీయ శిక్షా స్మృతి ప్రకారం 7 సంవత్స రాల ఖటిన కారా  గార శిక్ష విదించాలని సూచించింది.రకరకాల  వృత్తులు వ్యక్తి గత  సామాజిక వ్య్వస్థ ప్రభావం బట్టి వాళ్ళు  బంధీలు గా అంటే ఆ బందనాలలో ఉన్నందున  అలావ్యవహరిస్తున్నారని అభిప్రాయ పడ్డారు.                                                                                                                     వ్యక్తి గత సా మాజిక వ్యవస్థ పై ప్రభావం  ఉంటుంది.                                                                     ఇండివిడ్యువల్  డెలీ కుఎంసీ అంటే  వ్యక్తి  గత జప్తు.                                         మరొకరి ప్రోత్సాహం తో జప్తు.                            నిర్మాణాత్మక, లేదా ప్రేరేపిత జప్తు.                                                                          సందర్బోచిత జప్తు.                                   ఇన్ని రకాల  జప్తు లకు ఒక్కో దానికి ఒక్కో రకమైన సామాజిక మాధ్యమం దీని పై విశ్లేషించాలి. అలాగే ఈ  ఆంశాల పై చివరగా  వారికి ట్రీట్మెంట్. ఐ వ్వడం తప్పని సరి.                                            వ్యక్తి గత జప్తు... ఈ  విషయంలో ఒక్క వ్యక్తి పాల్గొన్నట్లు తెలుస్తోంది. జప్తు చట్టం ప్రకారం వ్యక్తి గత మైన జప్తు వ్వ్యవహారమ్ లో కేవలం వ్యక్తి గత పర మైనా మానసిక స్థితి, వారి వాదన కేవలం జప్తు  అంశం   మానసిక సం బంధమై సమస్య లే కారణమని  చెప్తున్నారు . బాల్యంలో ప్రాధమిక స్థాయిలో పెరిగిన పెద్ద  సమస్య  గా మారి పెద్ద  లోపంగా పేర్కొన్నారు.అసలు వ్యక్తి గత జప్తు, ,వర్గ సహకారం తో జప్తు, నిర్మాణాత్మక జప్తు,  పరిస్థితులకు తల వంచే జప్తు , అన్న అంశాల ను  వివరంగా తెలుసుకుందాం.                                                                                                                            ఈ అంశాల పైన వివరంగా నిపుణులతో, మానసిక నిపుణుల తో  చర్చిద్దాం.....                                                                    పైన  చర్చించిన అంశాలను విశ్లేషించి నప్పుడు ఒకే విష్యం సహజంగా కనిపిస్తుంది.మన సిక శాస్త్ర వేత్తలు, నిపుణులు  విశ్లేషించిన అంశం లో వ్యక్తి గత జప్తు బలీయంగా నాటుకు పోయి నప్పుడు అది  అబద్దానికి దారి  తీస్తుంది.వ్యక్తి సమూహంలో ఉన్నప్పుడు అంటే కొంత మంది  ప్రోత్సహించడం, లేదా చాలా వ్యూహాత్మకంగా ప్లాన్డ్ గా పద్దతి ప్రకారం వారితో నిర్బంధంగా చేయించడం,  ఆ ప్రక్రియలో సహజంగా  బాల బాలికలు అబద్దం ఆడడం చేస్తూ ఉంటారు. సామాజికంగా సరైన నిర్మాణం, లేకపోవడం , వివిధ వర్గా ల మధ్య సమతౌల్యం లేక పోవడం, వల్ల తీవ్రమైన ఒత్తిడికి గురి కావడం. ఆర్ధికంగా సామాజికంగా కంగా ఇతరులతో పోటీ పడలేని స్థితి, విజయం సాధించేందుకు చేసే ప్రయత్నం లో వేసే చిన్న్బ తప్పటడుగు బాల బాలికల జీవి  తానికి శాపంగా పరినమిస్తుంది  నేరం చేసి  బతకడం కష్టం బఠాకడమూ కష్టమే ఆకలివేసిన ఆరోగ్యం బాగోకున్న బతికేస్తున్న చిన్న చేతులు బాల నేరస్తులను ఆడుకునేది ఎవరు? అన్న ప్రశ్నలకు సమాధానం లేదు. కోవిడ్ వచ్చినా మరే వ్యాధి వచ్చినా చెప్పుకోడానికి ఎవరు లేరు  వారి మాట ఎవరు వినరు మరి భావి భారాతం ఎక్కడ ?  .  

నటించేవారు ఎలా ఉంటారో తెలుసా?

కొందరు మనుష్యులు అందరితోనూ ఇట్టే ఏకీభవిస్తూ తిరుగుతూ వుంటారు. పలుకుబడీ, అధికార హోదా కలిగున్న వారితో అయితే మరీ వేగంగా ఏకీభవిస్తారు. అటువంటివారి మాటను వీరు ఏనాడూ కాదనరు. విభిన్న అభిప్రాయాలున్న ఇద్దరు వ్యక్తులు ఒకచోట చేరినా, ఇద్దరితోనూ ఏకీభవిస్తున్నట్లుగా, మధ్యమధ్యలో తల వంచుకుంటూ, తల పక్కకి తిప్పుతూ, విననట్లుగా నటిస్తూ, వినినా అర్థం కాలేదన్నట్లు ముఖం వేళ్ళాడేస్తూ, ఆ ఇరుకూ ఇబ్బందిలోనుండి ఎలాగోలా బయటపడతారు. అటు తర్వాత అలా వివాద పడినవారిలో ఒకరు “అతడేమన్నాడో చూశావా?" అని ఈ తటస్థుణ్ణి ఉద్రేకంగా అడిగినప్పుడు కూడా "అలా అన్నాడా? నేను వినలేదు సుమా!” అని ఆశ్చర్యపు పోజు పెడతాడు. “అక్కడే వుంటివి కదయ్యా? నీకేమి చెవుడొచ్చింది? విననే లేదంటావేమిటి?” అని విసుక్కుంటే, "విన్నానేమోకానీ, ఆ సమయానికి మీరు ఇప్పుడు చెప్పే అర్థం స్ఫురించలేదండీ" అని మరో అబద్ధమాడి అమాయకంగా చూస్తాడు. "వీడొక మందమతి” అని అవతలి మనిషి అభిప్రాయపడ్డా ఈ నటించే మనిషికి అభ్యంతరం లేదు కానీ, తాను మాత్రం ఇదమిద్దంగా ఎవరి పక్షమూ వహించడు.  ఈ స్వప్రయోజన పరుడు ఏ సందర్భంలోనూ న్యాయం వైపూ, ధర్మం వైపూ నిలుస్తాడని ఎవరూ అనుకునే వీలులేదు. ఇద్దరితోనూ అవసరం పడుతుంటుంది కాబట్టి, ఇద్దరిదీ “రైటే” అన్నట్లుగా తిరుగుతూ తనపని చక్కబెట్టుకుంటుంటాడు. ఇదో తరహా వ్యవహారం. కొందరికి స్వయంగా ఆలోచించే లక్షణమే వుండదు కాబట్టి ఎవరేది చెప్తే అదే “రైట్” అని తోస్తుంది. వీరికి స్వప్రయోజనం సాధించుకోవాలని వున్నా లేకపోయినా, అవతలివారన్నది సబబుగానే కనిపిస్తుంది. ఒక ధనికురాలికి నాలుగు రోజుల బట్టి కాస్తున్న జ్వరం తగ్గలేదు. ఎందుకైనా మంచిదని ఇద్దరు స్పెషలిస్టులను పిలిపించాడు. భర్త. ఒక స్పెషలిస్టు పరీక్షించి “ఇది టైఫాయిడ్ కేసు, సందేహం లేదు" అని తేల్చాడు. “కరెక్ట్" అన్నది ఆవిడ, తన కొచ్చిన కొద్దిపాటి ఇంగ్లీషుతో. రెండో స్పెషలిస్టు కూడా పరీక్షించి చూచాడు. తన ప్రత్యేకత నిలబెట్టుకోటానికా అన్నట్లు, “నిస్సంశయంగా ఇది ఒక రకమైన మలేరియా జ్వరం. కాదంటే చెవి తెగ్గోయించుకుంటాను” అని ప్రకటించాడు. “కరెక్టూ" అనేసింది రోగి అతడి వంకకు తిరుగుతూ. అదిరిపడిన భర్త, “ఇద్దరి డయాగ్నోసిస్ కరెక్టేలా అవుతుంది” అని తల గోక్కోవడం మొదలెట్టాడు. మంచం మీద పడుకోనున్న భార్య భర్తవంకకు తిరిగి “కరెక్ట్” అన్నది. మూర్ఖులు వాదించుకోడం ప్రారంభించినపుడు వారి వాదనలో చిక్కుకోకుండా వుండడం మంచిది. తలాతోకా లేకుండా, తమ అధిక్యత నిరూపించుకోడానికే వాదించే వారి మధ్య చిక్కుకున్నప్పుడు “తప్పించుకు తిరిగే వాడే ధన్యుడు”. జాతకకథల్లో ఇద్దరు మూఢుల మధ్య వివాదం గురించిన ప్రస్తావన ఒకటుంది. పౌర్ణమి తర్వాత పదిహేను రోజులపాటు మహాచలిగా వుంటుందని ఒకరూ, అమావాస్య తరువాత పక్షం రోజులే ఎక్కువ చలిగా వుంటుందని రెండోవాడూ, ఒకరితో ఒకరు తీవ్రంగా వివాదపడ్డారు. వాదన ఎటూ తెమలకపోయే సరికి, ఇద్దరూ కలిసి ఒక జ్ఞానివద్దకు వెళ్ళారు. "మా వాదనల్లో ఎవరిది సరియైనదో తేల్చి చెప్పండి” అని విషయం వివరించారు. జ్ఞాని కాసేపు తేరిపార జూచి, “మూర్ఖ ప్రజాపతులారా పౌర్ణమి తర్వాత పక్షమైతేనేమి అమావాస్య నిశీధి తర్వాతి రోజులైతే నేమి చలి చంద్రుడితో ఎలా ముడిపడి వుంటుంది? చలిగాలులవల్ల, గాలిలో తేమ అధికమైనందువల్ల చలి ఏర్పడుతుంది. కార్యకారణ సంబంధంలేని మీ ఇద్దరి వాదనా సమంజసమేనని, మీకు తగినట్లే వుందని నా తీర్పు” అన్నాడా జ్ఞాని. మూర్ఖులిద్దరూ తమ వాదన సరియైనదేనాని అనుకుంటూ సంతోషించి వెళ్ళిపోయారు. ఇలా తాము తమ అవసరార్థం ఎవరి వైపు నిలబడకుండా అటు ఇటు కూడా ఇబ్బంది కలిగించకుండా వెళ్ళేవాళ్ళు కొందరుంటారు. ప్రస్తుతకాలంలో  గొప్ప నటులు, మహా మేధావులు అనబడతారు వీళ్ళు.                                      ◆నిశ్శబ్ద.

పౌరులకు, వ్యక్తులకు మధ్య బేదం ఇదే..

ప్రతి సంవత్సరం జనవరి 12 న యువజన దినోత్సవం జరుపుకుంటారు. ఈ దేశానికి యువత అవసరాన్ని, భారతీయ హిందూ ధర్మ విశిష్టతను, విదేశాలలో సైతం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన స్వామి వివేకానంద పుట్టిన రోజును ఇలా యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామి వివేకానంద భారతదేశం గురించి, దేశ భవిష్యత్తు గురించి, భారత పౌరుల గురించి తన మాటల్లో ఇలా చెప్పారు.. స్వామి వివేకానంద నిద్రాణమై ఉన్న భారత జాతిని 'లేవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు ఆగవద్దు!' అని మేల్కొలిపారు. సుమారు వెయ్యి సంవత్సరాలుగా బానిసత్వాన్ని అనుభవిస్తూ, కొన ఊపిరితో ఉన్న భారతజాతిని 'సమస్త శక్తి మీలోనే ఉంది. మీరేమైనా సాధించగలరు!' అని జాగృతం చేసారు.  దేశ భవిష్యత్తు గురించి చెబుతూ భారతదేశం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకంటే అగ్రస్థానానికి చేరుకుంటుందని అన్నారు. స్వామీజీ 1897 జనవరి 25న రామనాథపురంలో తన ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభించారు....ఇక తెల్లవారదనుకున్న రాత్రి మెల్లమెల్లగా గడిచిపోతున్నట్లుంది. భరించరాని తీవ్ర వేదన ఉపశమిస్తున్నట్లనిపిస్తుంది.... భారతమాత దీర్ఘనిద్ర నుండి మేల్కొంటోంది.... ఇంక ఆమెనెవరూ ఆపజాలరు! ఇక ఆమె నిద్రపోదు". స్వామీజీ చెప్పిన భవిష్యవాణి నిజం కావాలంటే మనం ఏం చెయ్యాలి? వ్యక్తులు పౌరులుగా మారాలి నేటి యువత విదేశాలు భోగభాగ్యాలకు ఆకర్షితులవుతున్నారు. ఇటు భారతీయ సంస్కృతిని వదులుకోలేక, అటు విదేశీ సంస్కృతిని కాదనలేక సందిగ్ధంలో పడుతోంది. బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యం చాలా గొప్పదన్న విషయం మనమంతా తెలుసు కోవాలి. విదేశాలలో వేదాంతభేరిని మ్రోగించి, భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఒక ఆంగ్లేయ మిత్రుడు స్వామీజీని "ఇక్కడి భోగభాగ్యాలను చూసిన తరువాత భారతదేశంపై మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు. సమాధానంగా స్వామీజీ, "భారతదేశం నుండి వచ్చేముందు నా దేశాన్ని ప్రేమించాను. ఇప్పుడు నా దేశపు దుమ్ము, ధూళి, గాలి సర్వస్వం నాకు పవిత్రమైనవిగా భాసిస్తున్నాయి" అన్నారు. నేడు మన దేశస్థులు తమ దేశానికి సేవ చేయడం మాట అటుంచి భారతమాతను విమర్శించడంలోనే ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతి భారతీయుడు తమ దేశ గొప్పతనాన్ని తెలుసుకొని భారత పౌరునిగా మారడానికి ప్రయత్నించాలి. ఒకసారి ప్రముఖ భారత న్యాయవాది నానీ ఫల్కీవాలా జపాన్ వెళ్ళినప్పుడు ఆ దేశమంత్రిని ఇలా ప్రశ్నించారు. "భారతదేశంలో కావలసిన సంపదలున్నాయి. భారతీయులు తెలివైనవారు. అయినప్పటికీ భారతదేశం జపాన్లాగా ఎందుకు అభివృద్ధి చెందలేకపోతోంది?" అని.  సమాధానంగా జపాన్ మంత్రి “జపాన్లో ఒక మిలియన్ పౌరులున్నారు. భారతదేశంలో ఆరువందల మిలియన్ల వ్యక్తులున్నారు" అని తన అభిప్రాయాన్ని చెప్పారు.  'దేశం మనకు ఏమి చేసింది' అని తలచేవారు వ్యక్తులు, 'దేశానికి మనం ఏం చేసాం' అని ప్రశ్నించుకునేవారు పౌరులు. తమ స్వార్థం కోసం ఆలోచించేవారు, తమ ప్రయోజనాల కోసం జీవించేవారు వ్యక్తులు. ఇతరుల కోసం ఆలోచించేవారు, ఇతరులకు సేవ చేసేవారు పౌరులు. ప్రతి ఒక్క భారతీయుడు వ్యక్తి నుంచి పౌరునిగా మారాలి. యువశక్తి జాగృతం కావాలి నేడు భారతీయులు అందరికంటే తెలివైనవారని ప్రపంచమంతా ఒప్పుకుంటుంది. అయితే మనం అక్కడితో ఆగిపోకుండా ప్రతిభావంతులంగా మారాలి. దీనికోసం నేటి యువత విద్యతో పాటు విలువలను అలవరచుకోవాలి, మనోబలాన్ని పెంపొందించుకోవాలి. జ్ఞానంతో పాటు హృదయాన్ని విశాలం చేసుకోవాలి. స్వామీజీకి యువశక్తిపై అత్యంత విశ్వాసం ఉంది. యువత తమ అంత రంగంలో ఉన్న అనంత శక్తిని జాగృతం చేసి భారతమాతను ముందుకు తీసుకుపోవాలి.. ప్రతి ఒక్క భారతీయుడు భారత పౌరునిగా మారి, తమ శక్తిని జాగృతం చేస్తే, కొద్ది రోజులలోనే భారతదేశం అగ్రస్థానానికి చేరుకుంటుంది. వివేకానందుని భవిష్యవాణి సత్యమవుతుంది. ఇది మనందరి చేతులలోనే ఉంది.                                  ◆నిశ్శబ్ద. 

ప్రవాస భారతీయులు దేశ ప్రగతికి కీలకం!

ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులకంటూ ప్రత్యేకత ఉంటుంది. భారతీయతను తాము వెళ్లిన చోటుకు వ్యాప్తి చేయడం,  భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఇతర దేశాలలో కూడా పాటించడం, అందులో ఉన్న గొప్పదనాన్ని అందరికీ తెలియజేయడం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలలో ఎన్నో అభివృద్ధి మార్గాలలో భారతీయుల విజ్ఞానం కూడా భాగమవుతుండటం విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం.  విదేశాలకు వెళ్లిన భారతీయులు చదువులు, ఉద్యోగాల నిమిత్తం అక్కడ ఉంటూ భారతీయులను ఒకే తాటిపై ఉంచేందుకు, వారు భారతీయతను మరచిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రవాస భారతీయులు దివాస్ ను జరుపుకుంటూ వస్తున్నారు. దీని వెనుక ఉన్న  మరొక విషయం ఏమిటంటే ఈ ప్రవాస భారతీయ దివాస్ ను మన జాతిపిత మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ తన విద్యాభ్యాసం ముగించుకుని తిరిగి భారతదేశానికి వచ్చిన సందర్భంగా  జనవరి 7 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు జరుపుకుంటారు.  భారతదేశ ప్రతిష్ట, గౌరవం ఇనుమడించడంలో విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తుల పాత్ర చాలా ఉంటుంది. వీరందరూ తమ ప్రతిభతో విదేశాలలో గొప్ప అవకాశాలు పొందడమే కాకుండా  భారతదేశ ఉనికిని పలుచోట్లకు తీసుకెళ్తున్నారు. మొదట ఈ ప్రవాస భారతీయ దినోత్సవాన్ని 2003 సంవత్సరం జనవరి 7 నుండి 9 వరకు ప్రతి సంవత్సరం నిర్వహించేవారు. అయితే 2015 సంవత్సరం దీనికి సవరణలు చేసి ప్రతి సంవత్సరం కాకుండా రెండేళ్లకు ఒకసారి దీన్ని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో 2023 సంవత్సరంలో ప్రవాస భారతీయ దివాస్ నిర్వహించబడుతుంది.  ఈ సంవత్సరం జనవరి 7 వ తేదీన మొదలయ్యే ప్రవాస భారతీయ దినోత్సవం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలో జరగనుంది. విదేశాలకు వెళ్లే భారతీయులు భారతదేశం గర్వపడేలా చేయాలన్నది కూడా ఈ దినోత్సవంలో చర్చించే ఓ ముఖ్యమైన అంశం. ప్రవాస భారతీయ దినోత్సవ వేడుక సందర్భంగా ఎంతో మంది అతిథులు, విదేశాలలో ఉన్న భారతీయ కమ్యూనిటీకి చెందినవారు పాల్గొంటారు. స్వదేశీ-విదేశీ సంబంధాలను మెరుగుపరడంలో కూడా విదేశాలకు వెళ్లే భారతీయుల పాత్ర ఉంటుంది. భారతదేశం వివిధ రసంగాలలో అభివృద్ధి చెందడానికి గొప్పగా సహకరించిన విదేశాలకు వెళ్లిన భారతీయులకు ఈ ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డ్ ను వీరికి అందజేస్తారు. అలాగే ఈరోజు జరుపుకోవడం వల్ల భారతీయులు, ఇక్కడ ప్రభుత్వాలు, అధికారులు భారతీయుల పట్ల బాధ్యతను, సహకారాన్ని అందించేందుకు ఆరోగ్యకరమైన సత్సంబంధాలు పెంపొందించుకునే అవకాశం కూడా ఉంటుంది. విదేశాలలో నివసించే భారతీయులకు అక్కడ ఏవైనా ఇబ్బందులు ఎదురైతే స్వదేశీ అధికారుల మద్దతు, అక్కడి వారు ఇక్కడికి తిరిగిరావడానికి దేశ అధికారులతో మాట్లాడటం వంటి కీలక అంశాలు మెరుగుపడతాయి.  భారతదేశానికి మాత్రమే కాకుండా వివిధ దేశాలకు కూడా ఇతర దేశాలతో సత్సంబంధాలు ఏర్పడాలంటే స్వదేశం నుండి ఇగ్గర దేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తుల పాత్ర కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి ప్రవాస భారతీయులు ఎప్పుడూ దేశ ప్రగతిలో తాము కూడా కీలకమనే విషయాన్ని మరచిపోకండి. అలాగే దేశం మీకోసం ఎప్పుడూ సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటుందని మరవకండి.                                    ◆నిశ్శబ్ద.

యుద్ధం ముగింపా? కాదు అదే మొదలు వీరి జీవిత పోరాటానికి!

"యుద్ధం" ప్రపంచ దేశాల నుండి సాధారణ పౌరుల వరకు ఉలిక్కిపడే విషయమిది. కేవలం ఒక చిన్న పదంలో ఎంతో భీభత్సం దాగుంది. ఎన్నో జీవితాల దైన్యం నిమిళితమై ఉంది, వందలు, వేలు, లక్షల కొద్దీ ప్రాణాలు ప్రశ్నార్థకమై నిలుచుంటాయి. ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామం నుండి నేడు ఇంకా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వరకు, యుద్ధానికి ఫలితం ఏమిటి అనేది ప్రతి దశలో తెలుస్తూనే ఉంది అందరికీ. మరీ ముఖ్యంగా ఈ యుద్ధాలలో జరిగిన నష్టం ఏమిటి?? కేవలం ప్రాణాలు, ఆస్తుల నష్టాలేనా??   యుద్దాల వల్ల సంభవించే మరొక భయంకరమైన పరిణామం ఉంది. అదే భవిష్యత్తరాలు అనాథలుగా మారడం. మరీ ముఖ్యంగా ఈ యుద్ధాల వల్ల చిన్న పిల్లల జీవితాలు దుర్భరంగా మారతాయి.  యుద్ధాలలో మరణించే వారి పిల్లల బాధ్యత తీసుకునేవారు ఎవరూ ఉండరు. వారు శరణార్ధులుగా ఇతర దేశాలకు వలస పోయి అనాథలుగా బ్రతకాల్సి వస్తుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని ఐక్యరాజ్యసమితి యుద్ధ అనాథల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 6వ తేదీన జరుపుతూ వస్తోంది.  దీని ఉద్దేశం ఏమిటి??  యుద్ధాల కారణంగా అనాథలుగా మారిన పిల్లల గురించి అవగాహన కల్పించడం ఈ దినోత్సవం లక్ష్యం.  ఈ రోజు యుద్దాల కారణంగా అనాథలుగా మారిన పిల్లల కష్టాలను, వారు పెరుగుతున్నప్పుడు ఎదుర్కొనే మానసిక, సామాజిక, శారీరక పరిస్థితులను, వారి ఇబ్బందులను, వారి కనీస అవసరాల కోసం, భద్రత కోసం వారు చేసే పోరాటాన్ని అందరికీ తెలిసేలా చేయడం ముఖ్య ఉద్దేశం.   పరిస్థితులు ఎలా ఉన్నాయి?? యుద్దాలు పరిణమించడం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనాథలుగా మారుతున్న వారి లెక్కలను ఐక్యరాజ్యసమితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 మిలియన్ల మంది అనాథలు ఉన్నారు, ఇందులో ఆసియాలో 61 మిలియన్లు, ఆఫ్రికాలో 52 మిలియన్లు, లాటిన్ అమెరికా, కరేబియన్‌లలో 10 మిలియన్లు, తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో 7.3 మిలియన్లు ఉన్నారు. ఈ లెక్క లక్షలాది మంది పిల్లలు అనాథలుగా మారారనే దానికి  సాక్ష్యంగా స్పష్టతను ఇస్తుంది.  చేదు నిజం ఏమిటంటే..  మొత్తం అనాథల్లో 95 శాతం మంది ఐదేళ్లకు పైబడిన వారే.  అంటే ఐదేళ్ల నుండే తమవారిని కోల్పోయి అగమ్యగోచరమైన పరిస్థితిలో పిల్లలున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో అనాథల సంఖ్య చాలా తక్కువగా ఉంది.  కానీ, యుద్ధాలు, భయంకరమైన అంటువ్యాధులకు గురైన ప్రదేశాలలో, అనాథల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఎదుర్కొంటున్న పరిణామాలు ఏమిటి?? దేశాల మధ్య రగిలే సమస్యలు కాస్తా ఇరుదేశాల్లోని ప్రజల మీద ప్రభావం చూపిస్తాయి. ఇవి యుద్ధానికి దారితీసినప్పుడు లక్షలు, కోట్ల మంది ఎంతో సునాయాసంగా జీవితాలను జార్చుకుంటున్నారు. దేశాల మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం ప్రజలకు లేకపోవడం వల్ల ఆ దేశాల చర్యలకు ప్రజలు బలిపశువులవుతున్నారు. యుద్ధాలలో పెద్దవారు, యువకులు మరణించగా దిక్కుతోచని స్థితిలో పసిపిల్లలు అనాథలవుతున్నారు. వీరు ఆహారం, ఆశ్రయం, భద్రత విషయంలో ప్రతి రోజునూ లెక్కపెట్టుకుంటూ జీవించాల్సి వస్తోంది. గత లెక్కల చిట్టా ఏమి చెబుతోంది?? ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం అనాథల సంఖ్య 1990 నుండి 2001 వరకు పెరిగింది.  అయినప్పటికీ, 2001 నుండి,  ఈ సంఖ్య స్థిరంగా తగ్గుతూ వచ్చింది. ఆ కాలంలో సంవత్సరానికి 0.7% మాత్రమే నమోదు అయింది.   1990లో 146 మిలియన్లు, 1995లో 151 మిలియన్లు, 2000లో 155 మిలియన్లు,  2005లో 153 మిలియన్లు, 2010లో 146 మిలియన్లు  2015లో 140 మిలియన్లు గా నమోదయ్యాయి. ప్రస్తుతం ఏమి చేయొచ్చు?? ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి అందరికీ తెలిసిందే.. రెండు దేశాల మధ్య సమస్యగా మొదలైన ఈ యుద్ధం కాస్తా మరింత దీర్ఘకాలం కొనసాగితే మూడవ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే ప్రపంచం మొత్తం మీద కోట్ల కొద్దీ మరణాలు సంభవించడమే కాకుండా ఎంతో మంది పిల్లలు అనాథలుగా మారతారు. కాబట్టి దేశాల మధ్య సమస్యలకు యుద్దమే పరిష్కారం కాదనే విషయం మనకు తెలిసిన సగటు పౌరుడి చేతిలో దాన్ని అడ్డుకునే అస్త్రం లేకపోయినా అనాథలను ఆదుకునే మనసు, వారికి ఆశ్రయమిచ్చే తాహతు మనకున్నప్పుడు అలాగే చేయడం అందరి ధర్మం. యుద్ధం ముగింపు కాదు, కొన్ని కోట్లమంది పిల్లల జీవితాల పోరాటానికి అది మొదలవుతుంది.                                       ◆నిశ్శబ్ద.

కొత్తబంగారు లోకం ఇదిగో ఇలా సొంతం!! 

కొత్తలోకం అంటే వేరే ఎక్కడో వేరే గ్రహం గురించి మాట్లాడటం లేదు. ప్రతిమనిషి జీవితంలో వాళ్ళ భవిష్యత్తు గురించి కొన్ని ఆశలు, కొన్ని ఆశయాలు, మరికొన్ని దుఃఖాలు, ఇంకొన్ని సమస్యలు ఉండనే ఉంటాయి. అయితే వటన్నిటీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనే దాని మీద వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.  నేటి యువతకు రేపటి గురించి ఎంతో పెద్ద కలలు ఉండటం సహజం. అయితే ఆ కలను సాధించుకుంటున్నవాళ్ళు ఎంతమంది అని తరచి చూస్తే చాలా కొద్ది జీవితాలు మాత్రమే  విజయ తీరాలు చేరుకుంటున్నాయని చెప్పవచ్చు. ఐటీఏ ఆ కొన్ని జీవితాలు కూడా నిజంగా తాము కన్న కలను నిజం చేసుకున్నారా లేక సమాజాన్ని, కుటుంబాన్ని కాంప్రమైజ్ చేయడానికి వాటి దృష్టిలో ప్రాముఖ్యత ఉన్న దాన్ని సాధించి బతికేస్తున్నారా?? ప్రశ్న చిన్నదే కానీ దానిలో లోతు, దాని కారణాలు మాత్రం చర్చిస్తే పెద్ద గ్రంథం అవుతుంది. చిన్నప్పటి నుండి కొన్ని విషయాలను బుర్రలో నూరిపోసి, బలవంతంగా కొన్ని, సమాజం కొన్ని ఎట్లా అయితేనేం కారణాలు ఎన్ని ఉన్నా మొత్తానికి తమకోసం తాము బతకడం అనే విషయాన్ని మాత్రం అందరి జీవితాల నుండి తొలగించారు మరియు తొలగించుకున్నారు మనుషులు. ఏదైనా గట్టిగా అడిగినా మంచి కోసమే అనే చెప్పేవాటిలో మంచి ఎంత ఉందో అర్థం చేసుకునే మానసిక పరిణితిని పెద్దలు తమ పిల్లల్లో పెంపొందించేందుకు కృషి చేస్తే చాలు కదా అనిపిస్తుంది. ఇక యువత ఆవేశం, తొందరపాటుతో చేసే ఎన్నో పనులు తమ లక్ష్యాలు దారితప్పడానికి కారణం అవుతున్నాయి. వాటిని పునర్విమర్శ చేసుకోకుండా ప్రపంచం పెద్దదంటూ పరిగేడితే లక్ష్యం చేరుకోగలరో లేదో కానీ అలసట మాత్రం తప్పకుండా వస్తుంది. అందుకే తాము వెల్లదల్చుకున్న దారి గురించి అనుభవం ఉన్నవాళ్ళతో చర్చించి సురక్షితంగా సరైన మార్గంలో వెళ్లడం సబబు. ఆశకు రెక్కలు ఇవ్వాలి!! ఆశించడం తప్పేమి కాదు. ఈ ప్రపంచంలో మనిషిని గొప్పగా ఎదిగేలా చేసేది ఆశనే. అందుకే రేపటి జీవితం గురించి ఆశ ఉండాలి. ప్రతి మనిషి నిన్నటి కంటే అంతో ఇంతో మెరుగవుతూ ఉండాలి. దానికి తగ్గట్టు తమ అనుభవాల ద్వారా జీవితానికి జ్ఞానాన్ని పొగుచేసుకోవాలి. వ్యక్తిత్వ పరంగానూ, ఆలోచనాపరంగానూ ఎదగాలి. అప్పుడు ఆశ కూడా జీవితానికి తగ్గట్టు కదులుతూ సంతోషాన్ని కలిగిస్తుంది.  ప్రాధాన్యత ప్రత్యేకత!! ప్రతి మనిషి ఎదుటి మనిషికంటే రూపంలోనూ, ఆలోచనల్లోనూ, వ్యక్తిత్వ పరంగా ఇంకా సామాజిక ఆర్థిక స్థాయిల పరంగా విభిన్నమైనవాడు. ఒకే కుటుంబంలో ఉన్న ఎవరూ ఒకే ఆలోచన కలిగి ఉండరు. అలాంటప్పుడు జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయాల్లో వాళ్ళు అలా ఉన్నారు, మనం ఇలానే ఉందాం. వాళ్ళు అది సాధించారు మనం ఇది సాధిద్దాం అని ఎందుకు అనుకుంటారు. జీవితంలో ముఖ్యమైనది ఏది?? దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి?? తమలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?? దాన్ని ఎలా పదును పెట్టుకుని తమకే గుర్తింపు తెచ్చేలా చేసుకోవాలి. ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి. ఆనందం ఎక్కడో లేదు మనసులోనే!! నిజమే ఆనందం మనసులోనే ఉంటుంది. దాన్ని తెలుసుకునావాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండగలరు. వస్తువులలోనూ, ఎదుటి వాళ్ళ స్పందనలోనూ ఆనందాన్ని వెతుకునేవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. వాళ్ళను అశాంతి ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. అందుకే ఆనందానికి కీ ని మీదగ్గరే ఉంచుకోవాలి. అడ్డంకులూ అవరోధాలు హుష్ కాకి!! మనం వెళ్లాల్సిన ఊరికి ప్రయాణం చేసేటవుడు మధ్యలో దారి బాగోలేకపోయినా, వెహికల్ పాడైనా వేరే వెహికల్ లో, జాగ్రత్తగా వెళ్తాము అంతేకానీ ఆ ఊరికి వెళ్లడమే మనేస్తామా లేదు కదా!! ఇదీ అంతే. మనం అనుకున్న లక్ష్యంలో ఏదైనా సమస్య ఎదురైతే పరిష్కరించుకుంటే పోతుంది. కానీ ఈకాలం వాళ్లకు తెగ్గొట్టడం వచ్చినంత బాగా తిరిగి అతికించడం, దానికోసం కష్టపడటం, ఓర్పుగా ఉండటం రావు. వాటిని అలవాటు చేసుకోవాలి. మనస్ఫూర్తిగా మంత్రం వెయ్యాలి!! దేనికైనా మనసుతో తృప్తిగా చేయడం ముఖ్యం. అందుకే మనిషి స్వచ్ఛంగా ఉండాలి. కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ లాంటివి మనసులో అసలు ఉంచుకోకూడదు. ప్రేమించడం తెలిసిన మనిషి దాన్ని తిరిగి ఆశించకుండా కేవలం ఇవ్వడంతోనే సరిపెట్టుకుంటే ఎంతో గొప్ప ప్రశాంతత దొరుకుతుంది.  ఆశలు, లక్ష్యాలు, ఆశయాలు వీటన్నిటిని ఆశవహాదృక్పథంతో మనసు తలుపులు తెరిచి ముందుకు వెళ్తే కొత్తబంగారు లోకం సాక్షాత్కరిస్తుంది. ◆ వెంకటేష్ పువ్వాడ

కొత్త సంవత్సరం కొత్త గోల్స్ లో వీటిని తప్పక చేర్చండి!!

కొత్త సంవత్సరం అనగానే చాలామంది కొన్ని గోల్డ్ పెట్టుకుంటారు. అన్ని లిస్ట్ కూడా రాసేసుకుంటారు. కానీ అవన్నీ న్యూ ఇయర్ రోజు అందరికీ శుభాకంక్షాలు తెలుపుతూ, పార్టీలు చేసుకుంటూ ఆ సందడిలో మొదటి రోజే లక్ష్యాలకు పంగనామాలు పెడతారు. అయితే… కొత్త సంవత్సరం సందర్భంగా ఎన్ని లక్ష్యాలు పెట్టుకున్నా అవన్నీ పాటిస్తేనే తగిన పలితం ఉంటుంది. లిస్ట్ లో రాసుకున్నంత సులువుగానే వాటిని కూడా అటక ఎక్కిస్తారు. కానీ… కొత్త సంవత్సరం గోల్డ్ లిస్ట్ లో ఎన్ని రసుకున్నా… వాటిలో ఎన్ని ఫాలో అయినా… అవ్వకపోయినా… ప్రస్తుతం మీరు చదవబోయే వాటికి మాత్రం తప్పకుండా చోటు కల్పించి వాటిని ఫాలో అయితే.. కొత్త ఏడాదిలో మీ జీవితంలోంచాలా గొప్ప మార్పు చూస్తారు. అవి ఏమిటంటే… కొత్త స్నేహం.. స్నేహితులు ఇప్పటికే చాలామంది ఉన్నారు. మళ్లీ కొత్త కొత్త స్నేహం ఏంటి?? అని అనుమానం, కొత్త స్నేహాలు ఎందుకు?? అనే ప్రశ్న చాలామందిలో పుడుతుంది. అయితే స్నేహితులు ఇంతమందే ఉండాలి.. కొత్తగా ఎవరితోనూ స్నేహం చేయకూడదు అనే రూల్స్ ఏమీ జీవితాల్లో లేవు కదా… కొత్త స్నేహం మొదలుపెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?? అనే ప్రశ్న ఆ తరువాత పుట్టచ్చు… స్నేహాలు పెరగడం వల్ల ఎప్పుడూ వ్యక్తికి ఇతరులతో సంబంధాలు విస్తృతం అవుతాయి. ఈ కారణంగా సర్కిల్ పెరుగుతుంది. దీనివల్ల మనకు ఉన్న ఆత్మీయులు ఎక్కువ అవుతారు. మనిషి సంఘజీవి అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా.. పదిమందితో సత్సంబంధాలు కలిగి, పందిమందితో సంతోషంగా జీవించేవాడికి సమస్యల వల్ల కలిగే ఇబ్బందులు చిన్నవిగా అనిపిస్తాయి. కాబట్టి కొత్త స్నేహం మొదలుపెట్టండి..  ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యం బాగుంటే జీవితంలో ఎన్నో సాధించగలుగుతారు. నిజానికి ఆరోగ్యం సరిగా లేకపోయినా అన్ని ఇబ్బందులనూ ఎదుర్కొంటూ జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుతున్నవారు ఎంతోమంది ఉన్నారు. మన చుట్టూనే అలాంటి వారు మనకు ప్రేరణ కలిగిస్తూ ఉంటారు. అయితే ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, ఆరోగ్యకరంగా జీవించడం ఎంతో ముఖ్యం. అదే మనకు శ్రీరామ రక్ష. బరువుకు బ్రేక్స్… కొందరు అధికబరువు ఉంటారు. నిజానికి దీనివల్ల శరీరాన్ని చుట్టుముట్టే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ చేయాల్సిన మొదటిపని శరీరానికి తగిన బరువు ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడం. ఒకవేళ తగిన బరువుకంటే ఎక్కువ ఉంటే బరువు తగ్గడం మీద దృష్టి పెట్టడం. బ్యాడ్ హబిట్స్ కు బై బై.. చెడు అలవాట్లు అనగానే చాలామంది ఏవేవో ఉహించుకుంటారు. తినకూడని పదార్థం తినడం, సమయవేళలు పాటించకపోవడం, అతిగా తినడం, సంబందం లేకపోయినా ఇతరులతో గొడవ పడటం, నోటి దురుసు, ఇతరులను నొప్పించేలా మాట్లాడటం ఇలా చూసుకుంటే చాలా చిన్న విషయాలలో కూడా తప్పుగా ప్రవర్తించేవారు ఉంటారు. ఇలాంటి వాటిని సురిచేసుకుని చూస్తే తమ జీవితం ఎంత మారుతుందో వారికే స్పష్టంగా అనుభవంలోకి వస్తుంది. ఆహార మంత్రం!! చలి వనికిస్తుంది, మళ్ళీ కోవిడ్ వేవ్స్ వినబడుతున్నాయి. మరి సాదారణంగా సరిపోతుందా?? లేదు కదా.. పోషకాహారం తీసుకోవాలి. తాజాగా ఉండేలా చూసుకోవాలి. రుచి గురించి కాదు, ఆహార నాణ్యత గురించి, అది శరీరానికి చేసే మేలు గురించి ఆలోచించి ఆహారం విషయంలో అడుగులు వెయ్యాలి.  ఇలా పైన చెప్పుకున్న విషయాలను  మీ న్యూ ఇయర్ లిస్ట్ లో చేరిస్తే.. జీవితాన్ని ఎంతగానో మార్పుకు లోను చేసి సంతోషంగా ఉండటానికి కారణం అవుతుంది.                                         ◆నిశ్శబ్ద.

మీరూ.. గతంలో జీవిస్తున్నారా? అయితే ఇది చదవండి!

మనిషి తన జీవితంలో చేసే పెద్ద తప్పు ఏదైనా ఉందంటే అది వర్తమానంలో ప్రయాణిస్తూ గతంలో జీవిస్తూ ఉండటం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రస్తుత కాలంలో ఎంతోమంది చేస్తున్న పని అదే..  "మా తాతలు నేతులు త్రాగారు మీరు మా మూతులు వాసన చూడండి," అన్నాడట వెనకటికొకాయన. కొందరికి తమ పూర్వీకులు చాలా గొప్పవారని వీరు వారి సంతతి వారేనని మన సాంప్రదాయం సంస్కృతి వారిలో కూడా వారసత్వంగా వచ్చిందని గొప్పలు చెప్పకుంటూ వుంటారు చాలామంది.  సూర్యునికి  ఎదురుగా నిలబడితే మనిషి తన నీడను కూడా తాను చూసుకోలేడు. అలాగే గతంలో జీవించడం అలవరచుకుంటే ప్రస్తుత జీవితం శూన్యమవుతుంది. ఈ విషయం ఎంత చెప్పినా ఎవరికీ అర్థం కాదు.  యుద్ధం జరిగిన దేశాలలో ఎంతో ఆస్తి నాశనమయిన వారిని మనం చూశాం ఎంతో ధనం, ఎన్నో భవంతులు, మరెన్నో ఫ్యాక్టరీలు పోగొట్టుకుని నేలమట్టమయిన ధనికుల చరిత్రలను మనం చూస్తూ ఉంటాం. అంతటి ప్రాభవాన్ని చవిచూసిన ప్రభుద్దులు అంతా కోల్పోయాక బ్రతకడం కోసం ఒక చిన్న ఉద్యోగిగా మారి,  మరోక వ్యక్తి దగ్గర గుమాస్తాగానో, వేరే ఇంకో పనో  పనిచేస్తూ ఉంటారు. చిన్న చిన్న షాపులలో సెల్స్ మెన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వారు ఎంతోమంది ఉంటారు. వారు అవకాశం దొరికితే కమ గత వైభవాన్ని చెప్పుకోలేకుండా వుండలేరు. మేము ఒకప్పుడు బాగా వున్నవారమే. బ్రతికి చెడ్డవారం అంటూ వాపోతారు.  ఆ రోజుల్లో మీరు మా  ఇంటికి వచ్చివుంటే మిమ్మల్ని ఏ విధంగా అతిధ్యంతో ముంచెత్తేవాడినో... అంటూ గతంలోకి పోయి నాటి సుఖ భోగాల గుర్తులలోనూ, , ఆలోచనా పరంపరలతోనూ  తన గత వైభవ చరిత్రను కథలు కథలుగా వినిపిస్తారు. అది నిజమే కావచ్చు కాని మనకు అదంతా గత చరిత్ర క్రింద అనిపిస్తుంది. 'గతజల సేతు బంధనం దేనికి' అనిపిస్తుంది. ప్రస్తుతం అటువంటి చరిత్రలని ఆదరించి ఆదుకునేవారు మన నవసమాజంలో కనిపించరు. గతాన్ని ప్రస్తుతంతో పోల్చడం ఎవరికి ఇష్టం ఉండదు. అదంతా యదార్ధమే కావచ్చు కాని ప్రస్తుతానికి చరిత్ర అనేది అప్రస్తుతం, లాభంలేని వ్యర్థ కాలక్షేపానికి మాత్రమే అలాంటివన్నీ ఉపకరిస్తాయి.  అలాంటి కథలన్నీ వినడానికి అంత ఓపిక ఎవరికీ లేదు.  ఈ రోజుల్లో నీ పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తారు కాని,  ఎప్పుడో గడిపిన సుఖ సంతోషాల గురించి, సమస్తం చెయ్యి జారిపోయిన తరువాత పూర్వం బ్రతికిన రోజుల గురించి ఎవరికీ అవసరం లేదు.  కొందరు వ్యక్తులు ఇలా చెప్పేటప్పుడు ఉన్నఫీ ఉన్నట్టు చెబుతూ ఉంటారు. అయితే మరికొందరు ఆనాటి వైభోగం ఏదీ ఇప్పుడు లేదు కాబట్టి, ఇప్పుడు తనని ఎవసరూ ఆధారాలు చూపించమని అడగరు కాబట్టి లేనివన్నీ కల్పించి కథలు అల్లుతారు.  అందులో మూడు వంతులు ఆతిశయోక్తులే ఉంటాయి. దురదృష్టవశాత్తు ప్రపంచంలో అనేక ప్రమాదాలు సంభవించి ఎన్నో కోట్లమంది నిరాశ్రయులుగా మారిపోయారు. కొన్ని ప్రాంతాలు ప్రపంచపటం నుంచే తొలిగిపోయాయి. కోట్లాది ఆస్తులు నామరూపాలు లేకుండా పోయాయి. కాని రుజువులు లేని నిజాలను మనం విశ్వసించం, అది మానవ నైజం. పోయిందని చెబితేనే నమ్మం అలాంటిది జరిగిపోయిన వాటిని కథలుగా చెప్పుకుంటూ ఉండటం ఎంతవరకు అవసరం. బహుశా కొందరు తమ గత జీవితాన్ని గుర్తుచేసుకుని వాస్తవంలో ఇలా ఉన్నామే అని బాధపడుతూ ఉంటారు. ఎన్నో సుఖాలు అనుభవించిన జీవితం కష్టాల మధ్య ఇబ్బందులు పడుతూ ఉండాల్సి వస్తోందే అని సంఘర్షణకు గురవుతుంది. కానీ గతాన్ని ఆలోచించడం వల్ల, దాని గురించి ఇతరులకు చెప్పుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమి ఉండదని తెలుసుకోవాలి. గతం ఏమీ లేదని, వర్తమానమే జీవితానికి మొదలు అని తనకు తాను చెప్పుకుని సాగిపోవాలి. అప్పుడే జీవితంలో ముందుకు సాగగలడు.                                         ◆నిశ్శబ్ద.

పరీక్షలకు సవాల్ విసిరే అద్భుత సూత్రాలు!

డిసెంబర్ నెల గడిచిపోతోంది. పిల్లలకు పరీక్షల కాలం దగ్గరకు వచ్చేస్తోంది. పిల్లలకు పరీక్షలు అంటే పెద్దలకు విషమపరీక్ష. పిల్లల కోసం పెద్దలు కుస్తీ పడతారు. తమ పిల్లలు బాగా పరీక్షలు రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అనేది ప్రతి తల్లిదండ్రుల ఆశ. అయితే చదవడంలో కాస్త విభిన్నత, సరైన విధానం తెలుసుకుంటే చక్కని ప్రిపరేషన్ సాగించవచ్చు. వాటికోసం ఇదిగో టిప్స్... పరిశీలన:- మెదడులో శాశ్వతంగా ముద్రవేసుకోవాలంటే మనం వస్తువు లేదా విషయాలను శ్రద్ధగా పరిశీలించాలి. ఒక వ్యక్తిని ఒక్కసారి చూస్తాం. అతని బొమ్మ మెదడులో కొద్దికాలమే గుర్తుంచుకుంటాం. అదే వ్యక్తిని పరిశీలనగా, శ్రద్ధగా ఉత్సుకతతో చూస్తే అధిక కాలం గుర్తుండిపోతాడు. ఈ పరిశీలన అనేది మన మనసులో ఉత్సుకత రేకెత్తించి విషయం పట్ల శ్రద్ధను, ప్రాముఖ్యతను కలుగచేస్తుంది. పరిశీలించడం అంటే ఆ వస్తువు లేదా విషయం పట్ల మన జ్ఞానేంద్రియాలన్నింటినీ ఉపయోగించి పర్యవేక్షించడం. విద్యార్థికి ఉండవలసిన ప్రాధమిక లక్షణం పరిశీలనాత్మకత. చదివినవి, లేదా చూసినవి దీర్ఘకాలం గుర్తుంచుకోతగ్గవా కాదా అని నిర్ణయించుకొని విషయ సంగ్రహణం చేయాలి.  ఏకాగ్రత :- ఏకాగ్రతకు మనిషిని దేవుడిలా మార్చగల శక్తి ఉంది. ఏకాగ్రత వలన సర్వమూ లభిస్తుంది. మనం దేన్నయితే ఏకాగ్రతో పరిశీలిస్తామో అది మనకు తలవంచి తీరుతుంది. ఏకాగ్రత వలన చేయలేని విషయాలు ఈ సృష్టిలోనే లేవు. ఏకాగ్రత మనలో దాగి ఉన్న అద్భుత అపూర్వ శక్తులను వెలికి తీస్తుంది. మనల్ని మానవాతీతులుగా కూడా మార్చేస్తుంది. ఏకాగ్రత వలన వస్తువుల్ని సైతం కదిలించగలం. ఎటువంటి అద్భుతశక్తికైనా అవసరమైన ఒకే ఒక్క మూలకం ఏకాగ్రత. జ్ఞాపకశక్తిని పెంచుకోవడంలో తిరుగులేని ఆయుధం ఎకాగ్రత. మనం ఒక వస్తువు పైన ఏకాగ్రత ఉంచితే ఆ వస్తువుపై స్పష్టత, ఆసక్తి కల్గి ఆ వస్తువు దీర్ఘకాలం గుర్తుండిపోవడానికి దోహదమవుతుంది. మీరు గుర్తుంచుకోవాలన్న విషయాలపై అపారమైన ఏకాగ్రతను కనబర్చండి. ఎప్పుడైతే ఏకాగ్రత లోపిస్తుందో వెంటనే దాని స్థానంలో అశ్రద్ధ, అనాసక్తి, బద్ధకం మొదలవుతాయి. ఇది జీవితాన్ని నిర్వీర్యం చేస్తుంది. మనుషులు రుషులౌతారు ఎలాగంటే కేవలం ఏకాగ్రతను అపారంగా కల్గి ఉండటం వలన. ధ్యానం :- ధ్యానం అంటే ఏకాగ్రతగా ఉండటమే. మనం నిరంతరం  ఎన్నో వ్యర్ధమైన విషయాలపై దృష్టిసారించి మన అపారమైన శక్తిని వృధా చేస్తుంటాం. ఒకే దానిపై దృష్టి ఉంచడమే ఏకాగ్రత అంటే. ధ్యానంలో మనం చేసే పని ఇదే. ప్రతి రోజూ 20 నిముషాల పాటు అన్నింటినీ మరిచిపోయి మీ మెదడుకు సంపూర్ణ విశ్రాంతినిచ్చి ఎటువంటి అనవసర విషయాలను జ్ఞాపకం రానీయకుండా నిరోధించి కళ్ళు మూసుకొని హాయిగా మీ శ్వాసను గమనించండి. రెండు నిముషాలు మీరలా శ్వాసను గమనించడం చేస్తే మెల్లమెల్లగా మీ మెదడు విశ్రాంత స్థితికి చేరి శక్తిని జనించుకుంటుంది. ప్రతిరోజూ 20 నిముషాల పాటు అన్నింటినీ మరిచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలం మెదడుకు గొప్ప విశ్రాంతి కల్గించండి. మీ శ్వాసను ప్రతి సెకనూ కళ్ళు మూసుకొని గమనించడం వలన మీ ధ్యాస ఒక్కటే వస్తువు అంటే మీ శ్వాసపై ఏకాగ్రమై అపరిమితమైన శక్తి, ప్రశాంతత లభిస్తుంది. ఇలా శక్తిని పుంజుకున్న మన మెదడు రెట్టించిన శక్తితో తన పని ప్రారంభిస్తుంది. శ్రద్ధ, ఇష్టం:  మనం ఎప్పుడైనా ఇష్టం లేనివి చూడాలని గానీ చదవాలని కానీ అనుకోము కదా: మనకు నచ్చిందీ అంటే ఖచ్చితంగా దానిపై ప్రేమ, ఇష్టం, శ్రద్ధ ఉన్నాయని అర్థం. కథలనైతే ఇష్టంగా, శ్రద్ధగా ఎంతోసేపు పఠిస్తాం, ఆనందిస్తాం. అలా చదివిన ఆ కథలు మరణించే వరకూ గుర్తుండిపోతాయి. బాగా గమనించండి. ఎప్పుడో మీ 4 సంవత్సరాల వయస్సులో మనకు తాతయ్య చెప్పిన కథలు ఇంకా గుర్తుండి ఉంటాయి. కారణం ఏమిటంటే కథలంటే ఆసక్తి, ఇష్టం ఉండటం వలన  వాటిని వినడానికి శ్రద్ధగా సమయము కేటాయించడం వలన. ఏ విషయం మీదనైతే ఆసక్తి, శ్రద్ధ, ఇష్టం ఉంటాయో అవి దీర్ఘకాలం మన మెదడులో నిక్షిప్తం అయిపోతాయి. 5. ఊహాత్మక శక్తి :-  చదివిన దానికంటే విన్నదీ, విన్నదానికంటే చూసినదీ మనం ఎక్కువగా గుర్తుంచుకుంటాం. అసలు విషయం  ఏమిటంటే మన మెదడుకు ఏ భాషా రాదు. తెలుగు, తమిళం, ఇంగ్లీషు, మరాఠీ లాంటి ఏ భాషా రాదు. దానికి తెలిసిన ఒకే ఒక్క భాష బొమ్మల భాష. "Picture | | language" ఎటువంటి విషయాలనైనా సరే మన మెదడు ఖచ్చితంగా తనకు తెలిసిన బొమ్మల భాషలోకి మార్చిన తర్వాతే నిక్షిప్తం చేసుకుంటుంది. ఉదాహరణకు మనం  ఇంగ్లీషులో Elephant అని అంటే వెంటనే మన మనసులో ఏనుగు రూపం కనిపిస్తుంది. తెలుగులో పులి అన్నా కూడా పులి చిత్రం ప్రత్యక్షమైపోతుంది. మీరు ఏది విన్నా, చదివినా చివరికి తిన్నా కూడా ఈ విషయాలన్నీ ఖచ్చితంగా బొమ్మలుగా మార్చబడి మెదడులో నిక్షిప్తం అవుతాయి. కావాలంటే చూడండి "పులుపు, కారం, చేదు”.. ఈ పదాలు పలుకగానే చింతకాయ, మిరపకాయ, వేపకాయ గుర్తుకు వస్తాయి. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన మెదడు బొమ్మలను దృశ్యాలనూ అత్యంత వేగంగా నిక్షిప్తం చేసుకోగలదు. మళ్ళీ వేగంగా పునరావృతం చేసుకోగలదు. పైవాటిని ఫాలో అయితే ప్రిపేరేషన్ చాలా తొందరగా సమర్థవంతంగా పూర్తవుతుంది.                                       ◆నిశ్శబ్ద.

స్వేచ్ఛ గురించి జిడ్డు కృష్ణమూర్తి ఏమి చెప్పాడు?

ప్రస్తుత సమాజంలో మనిషి తన వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాడు. తనకు కావలసిన దానికోసం ఎంత అయినా వాదిస్తారు, తనకూ అస్తిత్వం ఉందని తనకు స్వేచ్ఛ కావాలని, తనని ఏవరూ వారి చేతుల్లోకి తీసుకోకూడదు అని అనుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టపరుచు కోవాలి  మనకు  నిజంగా స్వేచ్ఛ కావాలని అనుకుంటున్నామా? పూర్తి స్వేచ్ఛ కావాలనుకుంటున్నామా లేక ఏదో అనుకూలం లేనిచోటు నుంచి, తాత్కాలిక అసౌకర్యం నుంచి బయటకు రావాలని అనుకుంటున్నామా? మనకు ఇష్టం  లేని అనాహ్లాదకర, అవాంఛనీయ పరిస్థితుల నుంచి విడుదల కావాలని కోరుకుంటున్నామా?  బాధ కలిగించే, జుగుప్సలో ముంచే అనుభవాల నుంచి, అసౌఖ్యదాయక అనుభవాల నుండి బయటపడాలని అనుకుంటాము. అవాంఛనీయమయిన జ్ఞాపకాల నుంచి దూరంగా వుండాలనుకుంటాము. మన మనసుకు ఆహ్లాదం చేకూర్చే, కొన్ని సంతృప్తి చేకూర్చే ఆదర్శాలు, సూత్రాలు, వదిలి సంబంధాలు కావాలనుకుంటాము. ఒకదానిని వుంచుకొని మరొకదానిని వదిలివేయడం చాలా కష్టం. ఎందుకంటే  సుఖం అనేది దుఃఖం నుంచి విడదీయరానిది అని అందరికీ తెలిసిన తెలియనట్టే సుఖమే సర్వస్వం అనుకుంటూ భ్రమలో ఉంటారు.  అందువల్ల ముందుగా మనం తేల్చుకోవలసిన అంశం ఏమిటంటే, మనం పరిపూర్ణమయిన స్వేచ్ఛ కావాలనుకుంటున్నామా?? లేదా?? అని! కావాలనుకుంటున్నాం అనుకునేట్లయితే, అప్పుడు స్వేచ్ఛ అంటే ఏమిటి స్వభావం, నిర్మాణ రూపం ఎలా వుంటుంది అన్న విషయాలు తెలుసుకోవాలి.  అలా దేన్నించో వైదొలగి వుండడమే స్వేచ్ఛా? బాధనుండి స్వేచ్ఛ, ఏదో రకమయిన ఆదుర్దానుంచి స్వేచ్ఛ. ఇంతేనా  లేక మరేదో భిన్నమైన పరిపూర్ణ స్వేచ్ఛ ఉందా? మనిషిని ఇబ్బంది పెట్టే వృత్తంను వదిలి మరొక వృత్తంలోకి వెళ్ళడమే  స్వేచ్చనా...అసూయ నుంచి స్వేచ్ఛ పోందవచ్చును. కాని, అది కేవలం ప్రతిక్రియ మాత్రమే అయిపోయి, నిజమయిన, స్వేచ్ఛ కాకుండా వుండవచ్చును కదా? సంప్రదాయం నుంచి స్వేచ్ఛ సంపాదించ వచ్చును. దానిని వివరించి చూడడం ద్వారా,  త్రోసిరాజు అనడం ద్వారా. కానీ అటువంటి స్వేచ్ఛ వుద్దేశ్యం యేమిటి? ఆ సిద్ధాంతం ఈ కాలానికి తగినది కాదు కాబట్టి, ప్రస్తుతానికి అనుకూలమయినది కాదు కాబట్టి దాని కోసం ప్రయత్నం చేస్తున్నామా?  అంతర్జాతీయత పట్ల మక్కువ వల్ల జాతీయ భావాలు సరయినవి కావనీ వాటి నుంచి స్వేచ్ఛ కావాలనీ అనుకుంటున్నామా? లేక ప్రస్తుత ఆర్థిక అనుకూలతల దృష్ట్యా సంకుచితమయిన జాతీయ భావనలు సరిఅయినవి కావని అనుకుంటున్నామా? ఇదంతా తేలికగా అర్థం చేసుకోవచ్చును. లేదా ఎవరో ఆధ్యాత్మిక రాజకీయనాయకుని పట్ల విరోధంతో క్రమశిక్షణ, విప్లవం పట్ల తిరుగుబాటు ధోరణితో మనం ఇటువంటి ఆలోచనలకు రావచ్చును. ఆ రకమయిన హేతువాదం, తార్కిక తీర్మానం  నిజ స్వేచ్ఛతో ఏ మాత్రమయినా పొందిక పొంది వున్నదా? దేనినుంచయినా, ఎవరైనా  స్వేచ్ఛగా వున్నాము అనుకుంటే, అది గూడా ఒక ప్రతి చర్యే అవుతుంది. అది మరోరకమయిన కట్టుబాటును, ఆధిపత్యాన్ని తీసుకువస్తుంది. ఈ విధంగా మనం ప్రతిచర్యల పరంపరలతో స్పందిస్తూ. 'ప్రతిచర్య'ను విముక్తి అని ఆమోదించవచ్చు. కాని, అది నిజానికి స్వేచ్ఛ కాదు. వెనకటి కట్టుబాటు తాలూకు కొనసాగింపే అవుతుంది. మనసు ఇరుక్కుపోయిన గతానికి సంబంధించినదే అవుతుంది.                                        ◆నిశ్శబ్ద

ఔరంగజేబు జీవితంలో ఆసక్తికర విషయం!!

మొగల్ పాదుషా ఔరంగజేబు కఠినమైన మనిషని చరిత్రలో చదువుతుంటాం. కానీ ఈ కాఠిన్యం ఇతరుల విషయంలోనే కాకుండా, తన విషయంలో కూడా అంతే కఠినంగానూ ఉండేవాడు. మతవిధుల్ని తు.చ. తప్పకుండా అమలు జరుపాలనే విషయంలో చాలా నిక్కచ్చిగా వుండేవాడు. తన స్వంత ఖర్చు కోసం ఖజానాలోని డబ్బు ముట్టుకొనేవాడు కాదు. ప్రార్థన వేళల్లో ముస్లిములు శిరస్సుపై ధరించే టోపీలు, కోరాన్ గ్రంథం కాపీలు తయారు చేసి వాటి అమ్మకం ద్వారా వచ్చే డబ్బులతో జీవనం సాగించేవాడు. ప్రవక్త, దేవుడు వీరిద్దరి యెడల అతడి భక్తి అపారం.  తను నివసించే ప్రాంతంలోని వారంతా ఒకచోట చేరి భగవత్ ప్రార్థనలు జరిపితే బాగుంటుందని అతడికో ఆలోచన తట్టింది. ఎంతోమంది ఒక్కచోట చేరి ఏకహృదయంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తే చూడముచ్చటగా వుంటుందని అనిపించింది. దానికోసం పెద్ద మసీదును ఒకదాన్ని నిర్మింపజేసాడు. ప్రార్థన చేపే ఒక్కొక్కరికి ఒక్కో నలుచదరపు గడి ఉండేట్లుగా ఏర్పాటు చేయించాడు. మిగతా అందరితో బాటు తాను కూడా ప్రార్థన వేళకు అక్కడ హాజరయేవాడు. అంతా వస్తున్నారా? అందరూ ఈ ఏర్పాట్లు చూసి సంతోషిస్తున్నారా? అని కనుక్కుంటుండేవాడు. అందరు వస్తున్నారు కానీ, మసీదు పక్కనే నివసించే ఒకతడు మాత్రం రావడం లేదని చెప్పారు పనివారు.   “ఎవరా మనిషి? నేను చేసిన శాసనం తెలియదా? అందరూ ఇక్కడికి వచ్చి ప్రార్థించాలనే నా ఆకాంక్ష అతడికి తెలియజేయలేదా?” అన్నాడు.  "తెలియజేశామండీ, కానీ పట్టించు కోకుండా ఆ వీధుల కూడలిలో అలాగే కూచుంటాడండీ" అని సమాధాన మిచ్చారు వాళ్ళు. "మసీదుకు ప్రార్థన సమయంలో వచ్చి తీరాలనే నా ఆజ్ఞ అతడికి తెలియజేయండి” అన్నాడు పాదుషా.  పాదుషా వారి ఆజ్ఞ అని చెప్పామండీ. ఎంతో వేడుకున్నాము. కానీ కదలడండీ." అన్నారు పనివారు. "అయితే బలవంతంగా పట్టుకురండి” అన్నాడు  పాదుషా.  ఆ మర్నాడు అతన్ని బలవంతంగా మసీదుకు పట్టుకువచ్చి ఒక నలచదరపు గడిలో నుంచోబెట్టారు. అలా నుంచోనుండగా అక్కడున్న మిగతా వారందరూ మోకాళ్ళమీద వంగి ప్రార్థనలు చేస్తున్నారు. చక్రవర్తి కూడా ప్రార్థిస్తున్నాడు. మసీదులోని ముల్లా ఎలుగెత్తి ప్రార్థన ప్రారంభించాడు. ఇటువంటి పవిత్ర వాతావరణంలో, ఈ బలవంతం మీద వచ్చిన మనిషి హఠాత్తుగా పెద్ద పెట్టున అరిచాడు. “నీ తుచ్ఛమైన దైవం నా పాదాలకింద ఉన్నాడు" అని వెర్రికేక పెట్టి ఆ మసీదు నుండి విసురుగా నడుస్తూ వెళ్ళిపోయాడు. భక్తులు నివ్వెరపోయారు. సాక్షాత్తూ పాదుషా కూడా వారి మధ్యనే ఉన్నాడు. ఎంత అపచారం జరిగిందనేది అందరూ కళ్లారా చూశారు, చెవులారా విన్నారు. ప్రార్థన పూర్తయిన తర్వాత పాదుషా తన మంత్రులను పిలిచి "అరిచిందెవరో, ఆ దైవ ద్రోహిని ఉరి తీయించండి" అని ఆదేశించాడు. అలా అరిచిన వ్యక్తిని ఉరితీసారు.  కానీ ఆనాటి నుండి ఔరంగజేబు మనసు హాయిగా వుండేది కాదు. తానే అపరాధం చేశానేమో అన్నట్లు బాధపడుతుండేవాడు. ఒకనాడు మంత్రుల్ని పిలిచి ఆ మసీదు వద్దకు పోయివద్దాం పదండి. ఆ మసీదులో నుంచోనుండగా ఆ వ్యక్తి అలా వెర్రికేక పెట్టటానికి ఏదో బలమైన కారణముండి వుండాలి అంటూ దారి తీసాడు. మసీదువద్దకు వెళ్ళి, ముల్లాను పిలిపించి "నిజంచెప్పు. సంకోచించవద్దు. నీవు ఆనాడు ప్రార్థన చేసే సమయంలో ఆ వ్యక్తి అలా దురుసుగా కేక పెట్టి వెళ్ళిపోయాడు కదా. ఆ ప్రార్థన వేళలో నీ మనస్సు సంపూర్తిగా అల్లామీదనే వుండేనా?” అని అడిగాడు.  అందుకు సమాధానంగా ఆ ముల్లా "ప్రార్థన ప్రారంభించేప్పుడు మనసు దేవుడు మీదనే లగ్నమై వుండెనండీ, కాని కొద్ది సేపట్లోనే నా మనసులో ఒక రకమైన ఆలోచన మెదిలింది. చక్రవర్తి ఇక్కడే వున్నారు కదా మరింత గట్టిగా ప్రార్థన సలిపితే పాదుషా సంతోషిస్తారు. నా కూతురు వివాహం తలపెట్టినప్పుడు పాదుషాను అభ్యర్థిస్తే డబ్బు సులభంగా మంజూరవుతుంది" అనే ఆలోచన వచ్చింది. పాదుషాకు ఛట్టున ఏదో స్ఫురించి "ఆ మనిషి నుంచున్న గడి క్రింద తవ్వి చూడండి" అన్నాడు. తవ్వారు. లోతున పెద్ద పాతర కనిపించింది. ఎంతో ధనమున్నది. చక్రవర్తికి పూర్తిగా అర్థమై పోయింది. “నీ దేవుడు నా పాదాలక్రింద ఉన్నాడని" ఆ మనిషి ఆగ్రహంతో ఎందుకు కేక పెట్టాడో, తాను ఎటువంటి మహాభక్తున్ని సంహరింప జేసాడో తెలిసే సరికి, అతడికి మనశ్శాంతి లేకుండా పోయింది.  పాప పరిహారార్థం తన మరణానంతరం తన దేహాన్ని ముక్కలు చేసి, ఒక్కో ముక్కను ఒక్కొక్క మహాపురుషుడి సమాధి వద్ద ఉంచమని, ఆ విధంగానైనా తనకు మనశ్శాంతి లభిస్తుందని వీలునామాలో వ్రాసిపోయాడని అంటారు. అందుకనే ఔరంగజేబు గోరీలకు ఏవిధమైన పై పూతలు రాతలు లేకుండా సాధారణమైనవిగా నెలకొల్పారట. మట్టితో నిర్మించిన ఈ నిరాడంబరమైన గోరీల వద్ద రోజ్మేరీ మొక్కను ఒకదాన్ని మాత్రం నాటారు.          ◆నిశ్శబ్ద

మానవహక్కుల గళం విప్పుదాం!!

ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కొన్ని హక్కులను కలిగి ఉన్నాడు. ఆ హక్కులు ఇప్పటికిప్పుడు సంక్రమించినవి కాదు. నాటి బ్రిటీషు కాలంలో బానిసత్వం తప్ప ఏమీ లేదు మనుషులకు. అయితే కాలానుగుణంగా జరిగిన పోరాటాల ఫలితంగా ప్రస్తుతం ఎన్నో రకాల స్వేచ్ఛ మనకు అందుతోంది. మనకు లభిస్తున్న ప్రతి స్వేచ్చా కొన్ని రకాల హక్కుల ద్వారా లభిస్తోంది. మాట్లాడే హక్కుతో స్వేచ్ఛగా మాట్లాడటం, జీవించే హక్కుతో నచ్చినట్టు బ్రతకడం, ప్రాథమిక హక్కులతో విద్య, వైద్యం, ఆహారం, కనీస అవసరాలు, తిండి-గుడ్డ మొదలైనవి పొందటం మనిషికి హక్కుల ద్వారా లభించేవి.  ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 వతేదీన మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు ఏర్పడింది?? దీని వెనుక ఉన్న కారణం ఏమిటి?? దీని ద్వారా మనుషులు ఏమి సాధించుకోవచ్చు?? మానవ సమాజంలో దీని పాత్ర ఏమిటి?? వంటి విషయాలు వివరంగా… ఎప్పుడు ఏర్పడింది?? మానవ హక్కుల దినోత్సవం 1948 సంవత్సరం డిసెంబర్ 10 వ తేదీన  ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అప్పటి కాలంలో ఈ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా సుమారు 500 భాషలలో రూపొందించింది. దీన్ని పురస్కరించుకుని అప్పటి నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 వ తేదీన మానవహక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటోంది.  మానవ హక్కుల దినోత్సవం వెనుక కారణం!! ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో రకాల అవసరాలను కలిగి ఉంటాడు. అయితే వాటిని పొందడంలో ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఆర్థిక, సామాజిక ఇబ్బందుల వల్ల వ్యక్తి తనకు అవసరమైన వాటిని సాధించుకోవడంలో విఫలం అవచ్చు లేదా వాటిని సాధించుకోవడానికి తగిన వనరులు అందుబాటులోకి తెచ్చుకోలేకపోవచ్చు. ఇలాంటి కారణాల వల్ల వ్యక్తి జీవితంలో ఎదుగుదల శూన్యంగా మారుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం, సంతోషంగా జీవించడం వంటి విషయాలను పొందగలిగితే ఆ మనిషి జీవితం ఉన్నత దశలోకి వెళుతుంది. అందుకే అందరూ ఒక ఉన్నత దశలో ఉండటం వల్ల రాష్ట్రం, దేశం, ప్రపంచం క్రమంగా అభివృద్ధిలోకి వెళుతుంది. ఇలాంటి అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూమానవ హక్కులు పొందాలని ఐక్యరాజ్యసమితి చేసిన ప్రకటననే మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మానవ హక్కుల ద్వారా వ్యక్తి ఏమి సాధించుకోవచ్చు?? వ్యక్తిగత స్వేచ్ఛ ద్వారా వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతి వ్యక్తి అభివృద్ధి పథంలో ప్రయాణిస్తే ఈ ప్రపంచం మెల్లిగా అభివృద్ధి కోణంలో ముందుకెళుతుంది. కాబట్టి వ్యక్తి తన జీవితానికి అవసరమైన హక్కులను సాధించుకుంటే వాటిని ఉపయోగించుకోవడం ద్వారా జీవితంలో ఎదుగుదల సాధ్యమవుతుంది. సమాజంలో మానవ హక్కుల పాత్ర ఏమిటి?? వ్యక్తుల సమూహం సమాజం అయినప్పుడు వ్యక్తులు హక్కుల ద్వారా సాధించే అభివృద్ధి సమాజ అభివృద్ధికి మూలకారణం అవుతుంది. అంతే కాకుండా సమాజానికి మనిషి మూల స్తంభం వంటివాడు. మనిషి బాధ్యతగా ఉంటే బాధ్యతాయుతమైన సమాజం ఏర్పాటు అవుతుంది. కాబట్టి మానవ హక్కుల వినియోగం ఆరోగ్యకరంగా ఉంటే బాధ్యతాయుతమైన సమాజం ఏర్పాటు అవుతుంది. ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా చరిత్రలో నమోదు అయిన  కొన్ని ముఖ్య ఘట్టాలు.. 1865 సంవత్సరంలో బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలను అనుసరించి అమెరికాలో బానిసత్వం రద్దు చేయబడింది. ఈ రద్దు కారణంగా అమెరికాలో స్వేచ్ఛకు బీజం పడింది.    ప్రపంచ చరిత్రలో రెండవ ప్రపంచ యుద్ధం అనేది చాలా దారుణమైన సంఘటనగా వర్ణించవచ్చు.  1941 నుండి 1945 వరకు జరిగిన ఈ యుద్ధంలో చెప్పలేనంత మారణకాండ చోటుచేసుకుంది. హిట్లర్, నాజీ జర్మనీల పోరు బీజం కాస్తా దాదాపు కోటి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యింది.. ఇది ప్రపంచ చరిత్రలో భయంకరమైన అక్షరాలతో లిఖితమైంది.    డిసెంబర్ 1948 గురించి పైన చెప్పుకున్నట్టు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ ప్రకటన ఆధారంగా ప్రతి ఒక్కరూ తమకు అవసరమైన స్వేచ్ఛను హక్కుల రూపంలో పొందేందుకు అవకాశం కల్పించింది.    2015 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల మధ్య అసమానత్వం తొలగించే దిశగా చేసిన కృషి ఫలితంగా  అందరికీ సమానత్వం అనే నినాదంతో ఫిన్లాండ్ నాన్-డిస్క్రిమినేషన్ యాక్ట్‌ను ఆమోదించింది. ఇది విద్య, వ్యాపారం, ఉద్యోగాలలో వివక్షతను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన అంశం.  ఈ విధంగా ప్రపంచ చరిత్రలో  మానవహక్కుల గురించి ఎన్నో విషయాలు పొందుపరచబడ్డాయి. వీటిని దుర్వినియోగం చేయకుండా సరైన రీతిలో వినియోగించుకుంటే ప్రతి వ్యక్తి తాను అభివృద్ధి చెందడమే కాకుండా ఇతరులను, సమాజాన్ని కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్లగలడు.                                     ◆నిశ్శబ్ద.

భారతదేశం అభివృద్ధి పేరుతో ముందుకెళుతుందా లేదా వెనక్కా?

అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారతదేశం 131 వ స్థానంలో స్థానంలో ఉంది. ఇది 189 దేశాల పట్టికలో పొందిన స్థానం. సామాజిక, ఆర్థిక ఎదుగుదలలో భారతదేశం మిగిలిన దేశాలతో పోలిస్తే ఎంతో అభివృద్ధి చెందవలసి ఉంది. అభివృద్ధి అంటూ ముందుకు పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది కానీ నిజానికి బలహీనపడిపోతున్నట్టు ఎన్నో విషయాలు స్పష్టం చేస్తున్నాయి కూడా. ఇంతకూ మనం ముందుకు వెళుతున్నామా?? లేక వెనక్కు వెళుతున్నామా??   సమాజంలో పెరుగుతున్న దాష్టీకాలు, దౌర్జన్యాలు గమనిస్తే మనం పాలరాతి యుగంలో ఉన్నామా! లేక పాత రాతి యుగంలోనే ఉన్నామా అనిపిస్తోంది. పొత్తిళ్ళలోనే బిడ్డల్ని గొంతు నులిమేస్తున్న కసాయి కన్నతల్లులు... ఎంతో మంది కనిపిస్తున్నారు. తమ జీవితాలు సంతోషంగా లేవని బిడ్డలను చంపి తాము చావడానికి సిద్ధపడుతున్న మహిళలు కోకొల్లలు. వీరు అమ్మ అనే పేరుకే మచ్చ తెస్తున్నారని అనిపిస్తుంది.  వావివరసలు మరచి మగవారు జరుపుతున్న విశృంఖల ఘోరకృత్యాలు... చూస్తే అడవి మృగాలు కూడా సిగ్గుతో తలదించుకుంటాయి.  మన ప్రవర్తన రోజురోజుకూ ఎందుకింత పతనావస్థకు చేరుకుంటోంది?? మనుషులుగా పుట్టిన అందరం క్రమంగా పశుప్రవృత్తిని పెంచుకుంటున్నాం అనే విషయం అక్కడక్కడా జరుగుతున్న సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది. అందుకే స్వామి వివేకానంద అంటారు "పవిత్రత, మానవీయత లోపించి, ప్రాపంచికత మితిమీరిన రోజున, ఆ జాతికి అంత్యకాలం దాపురిస్తుంది. సమాచార విప్లవంతో పురోగమించామని సంబరపడుతున్నా, సదాచారం లోపిస్తే మాత్రం అది తిరోగమనమేనన్న విషయాన్ని మనం విస్మరించకూడదు. సాంకేతికత, సంబంధిత విజ్ఞానం మన జీవన వ్యవహారాన్ని సులభతరం చేయవచ్చు; అంతమాత్రం చేత దానిని మన జీవనశైలిగా మలచుకుంటే దుష్ఫలితాలు అనంతం” అని.  ఇది స్వామి వివేకానంద చెప్పిన నాటి నుండి నేటి వరకు కూడా సాగుతున్న వ్యవహారం. లోపం ఎక్కడుంది?? వైఫల్యం ఎవరిది?? సమాజం గాడి తప్పుతోందన్న చర్చ సర్వత్రా జరుగుతూనే ఉంది. మరి లోపం ఎక్కడో, వైఫల్యం ఎవరిదో అంతుచిక్కడం లేదు. ఆలోచిస్తే ఈ లోపం, వైఫల్యం ఒక్కరిది కాదు. ఇది మనందరిదీ! ప్రాథమిక స్థాయి నుంచి నేటి సమాజం మీట నొక్కితే వేగమే తప్పా వివేకం లేని మరమనుషులను తయారు చేస్తోంది. విద్యాలయాల నుంచి వ్యక్తిత్వం లోపిస్తున్న సాంకేతిక సాధనాల్లా ఈ తరం యువతీ యువకులు బయటి ప్రపంచానికి పరిచయమవుతున్నారు. వీరికి విచక్షణ, వివేకంతో పనిలేదు. కేవలం చెప్పింది అప్పజెప్పగలరు, అప్పగించిన పనిని చేసి చూపించగలరు. అంతే కాని తమకు తాము దేని మీదా ధారాళంగా ఏది చెప్పలేరు, అవగాహనతో చేయలేరు.  భారతదేశంలో విశ్వవిద్యాలయాల నుంచి వస్తున్న విద్యార్థుల్లో నైపుణ్యం, సృజనాత్మకతతో కూడిన వారు పదిహేను శాతానికి మించి కూడా లేరనే ఓ వాస్తవం విస్మయపరుస్తుంది. అంటే అభిరుచి, ఆసక్తి, స్వయం నిర్ణయం... ఇలా ఏవీ పరిగణనలోకి తీసుకోకుండానే ఇతరుల ప్రోద్బలం వల్లో, ఉపాధి లక్ష్యం వల్లో విశ్వవిద్యాలయం స్థాయికి చేరుకుంటున్నాం తప్ప అవగాహన, నైపుణ్యం  మొదలైనవాటి వల్ల కాదు. అలా అవగాహన లేకుండా అంత చదువులు చదివితే ఆ తరువాత పరిస్థితి అయోమయం, అగమ్యగోచరం. నేటికాలంలో జరుగుతున్నది అదే.. అందుకే మనం అభివృద్ధి పేరుతో ముందుకు వెళుతున్నామా లేక వెనక్కు వెళుతున్నామా అనే సందేహం వస్తుంది. నిజమా కాదా?? మీరూ ఆలోచించండి ఒకసారి.                                       ◆నిశ్శబ్ద.

రాజ్యాంగ రూపశిల్పి అస్తమించిన రోజు!

అంబేద్కర్ పేరు వినని వ్యక్తి ఉండడు ఏమో. భారతదేశ స్థితి గతులను మార్చివేసిన వ్యక్తి అంబేద్కర్. ప్రజలు ఈయనను దేవుడితో సమానంగా కొలుస్తారు. విద్య, ఉద్యోగం, సమానత్వం మొదలైన ప్రతి విషయంలో అంబేద్కర్ ఒక స్ఫూర్తి తేజంగా అందరికీ ఆదర్శనీయుడు. దేశానికి ఎంతో చేసిన వ్యక్తి తన తనువు చాలించిన దినం డిసెంబర్ నెలలోనే వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈయన ప్రజల కోసం చేసిన పోరాటం, త్యాగం, సేవ మొదలైన వాటిని గుర్తుచేసుకోవాలి. ఈయన వర్ధంతి సందర్భంగా ఈయన గురించి….  డిసెంబర్ నెలలో ముఖ్యమైన రోజులలో అంబేద్కర్ వర్ధంతి కూడా  ఒకటి.  BR అంబేద్కర్ వర్ధంతి పరిస్థి సంవత్సరం డిసెంబర్ 6న జరుపుకుంటారు.  ఈయన భారత రాజ్యాంగం యొక్క ప్రధాన రూపశిల్పిగా పరిగణించబడ్డాడు.  సమానత్వం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి గానూ  నేటి ప్రజలకు అవగాహన కల్పించడానికి  భారతదేశంలో డాక్టర్ BR అంబేద్కర్ యొక్క వర్ధంతిని జరుపుకుంటారు.   బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈయన జీవితంలోకి తొంగి చూస్తే…   అంబేద్కర్ నాటి కాలానికి(ఎంతో అభివృద్ధి చెందినా నేటికి కూడా) అందరూ వెనుకబడిన వర్గంగా భావించే దళిత కులంలో జన్మించారు, ఈ కారణం వల్ల వారు అంటరానివారిగా పరిగణించబడ్డారు మరియు సామాజిక-ఆర్థిక వివక్షకు గురయ్యారు.  అంబేద్కర్ పూర్వీకులు బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో చాలా కాలం పనిచేశారు. ఈయన తండ్రి మోవ్ కంటోన్మెంట్ వద్ద బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు.  చదువు నిమిత్తం పాఠశాలకు హాజరైనప్పటికీ, అంబేద్కర్, మరికొందరు కులం కారణంగా  ఇతర  పిల్లల నుండి వేరు చేయబడ్డారు. అంతే కాకుండా ఉపాధ్యాయులు కూడా దళిత కులమనే కారణంతో ఇలాంటి వారికి చదువు విషయంలోనూ ఇతర తరగతి గది కార్యకలాపాలలోనూ సహకారం అందించలేదు. పైగా వీరిని తరగతి గదిలో కూర్చోనివ్వడానికి అనుమతి నిరాకరించారు. బాల్యమంతా ఇలాంటి పరిస్థితులు మధ్య సాగిన BR అంబేద్కర్ భారత రాజ్యాంగానికి ప్రధాన రూపశిల్పి.  భారతదేశంలోని వివిధ కులాల అభివృద్ధికి ఆయన అనేక పనులు చేశారు, ప్రధానంగా అంటరానితనాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించారు.  భారతదేశంలోని నివాసితులందరికీ వారి కులాలతో సంబంధం లేకుండా  సరైన వనరులు కల్పించడంలో కృషి చేసారు.  ఇలా వెనుకబడిన వారికోసం అంబెడ్కర్ చేసిన కృషి ఫలితంగా ఈయన వర్దంతి రోజున దేశం మొత్తం ఈయనను గుర్తుచేసుకుంటుంది. ఇక  BR అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ సంవత్సరం 2022 డిసెంబర్6 న వివిధ ప్రాంతాలలో జరిగే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే… డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ మరణించి ఈ. సంవత్సరానికి 66 సంవత్సరాలు పోయిర్తయ్యి  67వ వర్ధంతి వచ్చింది.  దేశం మొత్తం మీద దీన్ని  మహాపరినిర్వాణ దివస్ గా పేర్కొంటారు.  ఆయన 67వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు, ఉపన్యాసాలు ఏర్పాటు చేయనున్నారు. భారత రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి అంబేద్కర్ వర్ధంతిలో కీలకంగా పాల్గొంటారు. వీరు  సమాజానికి డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి మరియు కులతత్వాన్ని నిర్మూలించడంలో ఆయన చేసిన కృషి గురించి ఉపన్యాసాలు ఇస్తారు.  ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.  భారత రాజ్యాంగ పితామహుడిగా పిలువబడిన ఈయన సంఘ సంస్కర్తగా దేశానికి, సమాజానికి అతను చేసిన సేవలు వెలకట్టలేనివి. ఈ సేవలకు గానూ  1990లో భారతదేశ అత్యున్నత పురస్కారం అయిన భారతరత్నను కూడా పొందాడు. ఇంకొక ఆసక్తికర విషయం ఏమిటంటే… ఈయనకు  తొమ్మిది భాషలు తెలుసు, అంతే కాకుండా  భారతదేశంలో డాక్టరేట్‌ను అభ్యసించిన మొదటి వ్యక్తి. ఇంత గొప్ప వ్యక్తికి పరిస్థి ఒక్కరూ నివాళులు అర్పించాలి..                                        ◆నిశ్శబ్ద.

మనిషి గురించి, కాలం గురించి జిడ్డు కృష్ణమూర్తి మాటలు!

ఓ గొప్ప శిష్యుడు భగవంతుని దగ్గరకు వెళ్లి తనకు సత్యబోధ చేయమని కోరిన కథను ఇక్కడ చెప్పుకోవాలి. పాపం! ఆ భగవంతుడు అన్నాడు. 'నాయనా, చాల ఎండగా వుంది, ఓ గ్లాసెడు మంచినీళ్లు తెచ్చిపెట్టు.' అని. ఆ శిష్యుడు సరేనని చెప్పి ఓ యింటి ముందుకు వెళ్లి తలుపు తట్టాడు. ఓ సుందరాంగి తలుపు తెరిచింది. శిష్యుడు ఆమెను ప్రేమించడం జరిగింది. ఆమె కూడా అతన్ని ప్రేమించింది. వారికి వివాహం అయింది, అనేక మంది పిల్లలు కూడా కలిగారు. ఒక రోజు విపరీతంగా వర్షం కురవసాగింది. రోడ్లన్నీ వరదలమయం అయినాయి. ఇళ్లన్నీ కొట్టుకుపోతున్నాయి. శిష్యుడు భార్యను భుజాల మీదుగా ఎత్తుకుని, పిల్లలను చంకన వేసుకుని ఆ వరదలో పడి కొట్టుకుపోతూనే 'ఓ భగవంతుడా! నన్ను కాపాడు' అని ఎలుగెత్తి కేక వేశాడు.  అప్పుడు భగవంతుడు శిష్యుడితో 'నేను అడిగిన మంచినీళ్లు యేవయ్యా?' అని అడిగాడు. ఇది మంచి కథ. ఎందుకంటే, మనం చాలమందిమి ప్రతిదానినీ కాలక్రమేణ కాలప్రమేయంతో తూచుకుంటాము. మనిషి కాలం ఆధారంగా జీవిస్తాడు. అతని పలాయన వాదంలో భవిష్యత్తును రూపొందించుకోవడం ఓ మంచి ఎత్తు. మనలో మార్పులన్నీ కాలానుగుణంగా కాలక్రమేణ వస్తాయని అనుకుంటాము. క్రమతను మనలో కొద్దికొద్దిగా క్రమక్రమంగా రూపొందించుకోవచ్చునని  అనుకుంటాము. కాని కాలం క్రమతనుగానీ శాంతిని గానీ తీసుకురాదు. అందుచేత ఏదో కాలక్రమేణ జరుగుతుంది సుమా అన్న విషయం మనం మరచిపోవాలి. అంటే, రేపు అనే రోజు ఒకటి ఉందనీ అప్పుడు ప్రశాంతంగా వుంటామనీ అనుకోగూడదు. మనం ఈ క్షణంలోనే, యిప్పుడే క్రమంలో వుండిపోవాలి. నిజంగా ప్రమాదం ముంచుకు వచ్చినప్పుడు కాలం అంతర్ధానమైపోతుంది కదూ? అప్పుడు తక్షణ చర్య వుంటుంది. అయితే, మనకున్న అనేక సమస్యల తాలూకు ప్రమాదాన్ని మనం పసికట్టం, అందుచేత వాటినుంచి తట్టుకోవటానికి సమయం, కాలం అనే సాధనాన్ని కల్పించుకుంటాం, అన్వేషిస్తాం. సమయం మనకేమి సహాయం చేయదు. పైగా దగా చేస్తుంది. మనలో మార్పు తీసుకురాదు. సమయం అనేదానిని గతం, వర్తమానం, భవితవ్యం అని భాగాలు చేసుకున్నాడు మనిషి. ఈ విభాగాలు చేసుకున్నందువల్ల సంఘర్షణ తప్ప యింకేమి సంప్రాప్తం కావడం లేదు. నేర్చుకోవడం అనేది కూడా కాలక్రమేణ జరిగే పనేనా? వేల సంవత్సరాల తరువాత కూడా మనం ఒకళ్ల నొకళ్లం చంపుకోవడం, అసహ్యించుకోవడం కంటే వేరయిన సక్రమ జీవన విధానం వున్నదని నేర్చుకోలేకపోయాము. కాలానికి సంబంధించిన సమస్య చాల ముఖ్యము. జీవితాన్ని రాక్షసమయము, అర్థ విహీనము చేసుకున్న మనం యే సమస్యనయినా పరిష్కరించుకోవాలనుకుంటే, ముఖ్యంగా ముందుగా కాలాన్ని గురించిన విషయమే ప్రస్తావించుకోవాలి. మనం లోగడ ప్రస్తావించుకుని, గమనానికి తెచ్చుకున్న తాజాతనం, అమాయకత్వంతో కూడిన మనసుతో మటుకే చూచి, కాలాన్ని అర్థం చేసుకోగలమనే సంగతి ముందు గ్రహించగలగాలి. అనేక సమస్యలు మనను గందరగోళ పరుస్తున్నాయి. మనం యీ గందరగోళంలో చిక్కుకుపోయాము. ఒక అడవిలో దారి కనబడక చిక్కుకుపోయామనుకోండి, అప్పుడు యేం చేస్తాం? ఉన్న చోట ఆగిపోతాం. ముందుగా మనం చేసే పని యిదీ. ఆగిపోయి, చుట్టూ పరికించి చూస్తాం. అయితే, మనం గందరగోళంలో ఎక్కువగా  చిక్కుకుపోయాం కాబట్టి, జీవితంలో దారి కనబడక యిరుక్కుపోయాం కాబట్టి  మనం యేం చేస్తున్నామంటే: అటుయిటు పరుగులు తీస్తున్నాం, వెదుకులాడుతున్నాం, అడుగుతున్నాం, దబాయిస్తున్నాం, ప్రాధేయపడుతున్నాం. అందుచేత మొదటి విషయం యేమిటంటే - మనం చేయవలసిన మొదటి పని యేమిటి అనే విషయం గురించి సాగే ఆలోచనలో పడిపోయిన మనం అంతరంగికంగా మనం అగిపోవాలి ముందు. అంతరంగికంగా అగిపోయినప్పుడు, మానసికంగా నిశ్చలంగా వున్నప్పుడు  మనసు ప్రశాంతంగా తయారవుతుంది, స్పష్టత యేర్పడుతుంది. అప్పుడు ఈ కాలపు ప్రశ్నను గురించి జాగ్రత్తగా గమనించవచ్చును. ఇదీ జిడ్డు కృష్ణమూర్తి గారు మనిషి గురించి, కాలం గురించి, మనిషి కాలం విషయంలో చేస్తున్న ఆలోచన గురించి ఇచ్చిన వివరణ.                                     ◆నిశ్శబ్ద.

విజేతలను పరాజితులను వేరు చేసేది ఏంటి?

చాలా మంది విజయాన్ని సాధించాలని అనుకుంటారు. కానీ అధైర్యంతో వెనకడుగు వేస్తారు. విజయం సాధించాలంటే అందుకు కావలసింది ధైర్యమే కానీ అధైర్య పడటం కాదు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసుకోగల సామర్థ్యం మనలో వున్నప్పుడే విజయ శిఖరాలను చేరుకోగలగుతాము. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకోవాలి.  విజయాలు సాధిస్తే పొంగిపోతాడు కొందరు. కానీ విజయాలను సాధించినప్పుడు అణకువతో ఉండటమే అత్యత్తుమ సంస్కారం. విజయాన్ని సాధించాలంటే ప్రతీ మనిషి మొదట తన మీద తాను విజయం సాధించాలి. ఎక్కడ పుట్టాం, ఎలా పెరిగాం మొదలైన పరిస్థితుల్లాంటి పరిమితుల్ని ఛేదించుకుని బయటపడాలి. సంకల్ప బలంతో ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా మార్చగలం అనే నమ్మకం కలిగి వుండాలి.  కష్టే ఫలి అన్నారు పెద్దలు. అంటే కష్టపడనిదే ఏదీ సొంతం కాదు. కష్టపడకుండా మనకు ఏది లభించినా దాని విలువ మనకు తెలియదు. కష్టపడకుండా లభించిన దానిలో అంత థ్రిల్ కూడా వుండదు. ఆనందం ఏమీ వుండదు. అసలు అది విజయం కానేకాదు. దీన్ని బట్టి చూస్తే ఈకాలంలో ఎంతో మంది యువత సాధిస్తున్నది విజయమేనా అనే అనుమానం వస్తుంది. విజయం సాధించడం అంటే అన్ని సమకూర్చగా దాన్ని తమ ఖాతాలో వేసుకుని విజయం సాధించామని చెప్పడం కాదు. సమస్యలతో రాజీలేని పోరాటం చేసి మనం అనుకున్న గమ్యం చేరాలి. కష్టాలను ఎదుర్కొని, పోరాడి విజేతలుగా రూపాంతరం చెందాలి. ఎవరైనా విజయం సాధించారు అంటే  వారికేముందిలే అన్ని సమకూరతాయి అని నిర్లక్ష్యంగా మాట్లాడతారు. కానీ తమ శక్తి సామర్థ్యాల ద్వారానే ఎదుటివారు విజయాలు  కైవసం చేసుకున్నారని గుర్తించనే గుర్తించరు. ఎందుకంటే మనకంటే గొప్పవారు, ప్రతిభావంతులు వున్నారని మనం అంగీకరించం గనుక. అలా అంగీకరించకపోవడమే మనిషిలో ఉన్న అహం. ఆ అహంతో మనిషి తానే గొప్ప అనుకుంటూ ఉంటాడు.  విజయ పోరాటంలో సమస్యలు వస్తూనే వుంటాయి. ఆ సమస్యలను పరిష్కరించాలి తప్పితే వాటినే తలచుకుంటూ దిగులు పడటం అర్థంలేని వ్యాపకం అవుతుంది.  ఎందుకంటే ప్రతీ సమస్యకు ఒక పరిష్కారం అనేది వుంటుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ వుండదు. ప్రతి చిక్కుకు ఒక చిట్కా వుంటుంది. అదేదో తెలుసుకొని, సరైన సమయంలో ప్రయోగించాలి. విశ్వాసం, నమ్మకం వున్నప్పుడే వాటి వెనకాల విజయం కూడా వుంటుంది. సవాలు ఎంత పెద్దదైతే విజయమూ అంతే పెద్దది అయి వుంటుంది. ధైర్యే సాహసే లక్ష్మి అన్న నానుడి పూర్తిగా నమ్మి జీవితాంతం దానిని ఆచరించి విజయాలు సొంతం చేసుకోవచ్చు. పోటీలు, పందాలు సవాళ్ళు చిన్నప్పటి నుంచి మనందరికీ ఎదురవుతాయి. చాలమందింపిల్లల్లో ఇలాంటి పెట్టి పాడు చేస్తున్నారు వారిని స్వేచ్ఛగా ఉండనివ్వడం లేదు అని అంటారు. కానీ అన్నీ మన మంచికే అని అనుకోవాలి. అలా అనుకుంటే ప్రతి పనిలో అనుభవం వస్తుంది కదా అనే విషయం కూడా తెలుసుకోగలుగుతారు.  ఏ పనిని కూడా అసాధ్యం అని మన మనస్సులో చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే సాధ్యమనుకుంటే అన్నీ సాధ్యమే...! అసాధ్యమనుకుంటే అన్నీ అసాధ్యాలే...! విజేతలను, పరాజితులను వేరుచేసేది ఈ నమ్మకమే...!                                         ◆నిశ్శబ్ద.

సమానత్వం గురించి మాట్లాడేవారికొక చక్కని విశ్లేషణ!

ప్రస్తుత సమాజంలో కొందరు చాలా విచిత్రంగా ఉంటారు. నెలజీతం అందుకొన్న మొదటి పదిరోజులు ఆఘమేఘాలపై తేలిపోతుంటారు. అచ్చం అమెరికన్ కాపిటలిస్టుల వైఖరిలో వారికీ వీరికీ పార్టీలు ఇచ్చేస్తారు. వీరిలో దర్జాతనం అంతా వెలిగిస్తారు. విలాసంగా ఖర్చు చేస్తారు. ఆ తర్వాత పదిరోజుల పాటు చేతిలో డబ్బు చాలనందువల్ల సోషలిస్టు భావాలు పెరుగుతాయి వాళ్లలో. దేశసంపదని ప్రజలందరికీ న్యాయంగా పంపిణీ చేస్తే బాగుంటుందని ప్రకటించడం మొదలుపెడతారు. అలాంటి వ్యక్తి నెల చివరి పదిరోజుల్లోనూ డబ్బులకు గిజగిజ ఎక్కువై, కమ్యూనిస్టు భావాలకు లోనవుతాడు. భాషలో కాఠిన్యం ఎక్కువ చోటుచేసుకుంటుంది. ముఖ్యంగా  ధనికుల్ని ఏం చేసినా పాపం లేదంటాడు. అంతర్జాతీయ సామ్రాజ్యవాదాన్నే అంతం చేయాలంటాడు. ఆ నెలకు ముఫ్పై ఒక్క రోజులుంటే నెల చివరిరోజున అతడి పరిస్థితి చెప్పనక్కరలేదు. చేబదులు కూడా పుట్టని కారణం వల్ల ఆరోజుకు కావలసిన కాఫీ ఫలహారాలకోసం స్నేహితుల గుంపు మధ్యకు వెళ్ళి కూచుంటాడు. ఆ చివరిరోజున అతడి ధోరణి యావత్తూ అనార్కిస్టుగా కనిపిస్తుంది. ఈ సమాజంలోని అసమానత్వాలను కూకటి వ్రేళ్ళతో పెరికి వేయాలంటాడు. కనిపించిందంతా ధ్వంసం చేయాలంటాడు. ఆ మర్నాడు చేతిలో జీతం రాళ్ళు పడగానే అంతకు ముందు ప్రకటించిన భావావేశమంతా తగ్గి, మళ్ళీ ముందులాగా కాపిటలిస్టులాగా తృప్తిగా నవ్వుతూ వుంటాడు. ఒక పాశ్చాత్యుడి వద్ద బట్లర్ ఒకడు ఉండేవాడు. అతడు ప్రతి శుక్రవారం యజమాని అనుమతి పొంది నగర కమ్యూనిస్టు మీటింగుకు శ్రద్ధగా వెళ్ళి తిరిగొస్తుండేవాడు. కొన్ని మాసాలు గడిచిన తర్వాత బట్లర్ అనుమతి అడిగే శుక్రవారం వచ్చినప్పటికీ అతడు తన వద్దకు రాకపోవడం గమనించి అతడి యజమాని, "ఏమి, ఇవాళ మీటింగుకు వెళ్తున్నట్లు లేదే?" అని అడిగాడట.  "వెళ్లటం లేదండీ. పోయినసారి మీటింగుకు వెళ్ళినప్పుడు మన ఫ్రాన్సుదేశ సంపదని మన జనాభాకు సరిసమానంగా పంచితే మనిషి ఒక్కింటికి నెలకు ఏడువందల ఎనభై ఎనిమిది ఫ్రాంకులు ముట్టుతాయని ఎవరో ప్రసంగిస్తూ అన్నారు. నా నెల జీతం ఎనిమిది వందల ఫ్రాంకులైనప్పుడు నేను ఆ పార్టీలో వుండడం అనవసరమని అనిపించింది. అందువల్ల మానేశాను" అని సమాధానమిచ్చాడట. పూర్వం కాథరిన్ మెకాలే అనే ప్రసిద్ధ చరిత్ర రచయిత్రి వుండేది. సాంఘిక సమానత్వం గురించి ఆవిడ చాలా ఆవేశపడుతుండేది. పదిమంది మేధావులు తన ఇంట డిన్నర్ కు కూచున్న వేళల్లో తన విశ్వాసాన్ని గట్టిగా ప్రకటిస్తుండేది. ఆనాటి మహారచయిత, ప్రసిద్ధ నిఘంటుకర్త అయిన డాక్టర్ జాన్సన్, డిన్నర్ వద్ద ఆవిడ చేసిన ఘాటైన ప్రసంగం విని మొహం సీరియస్గా పెట్టి, “అమ్మా, మీ ప్రసంగం నన్ను పూర్తిగా మార్చేసింది. మీ వాదన నాకు చాలా సహేతుకంగా కనిపిస్తున్నది. మనుషులందరూ సమానమే కాబట్టి అందర్నీ ఒకటిగా చూడాలనే మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడాను. ఈ మాటలు నేను హృదయ పూర్వకంగా అంటున్నాననే విషయం రుజువు చేయడానికి ఇప్పటికిప్పుడే ఒక సూచన చేస్తున్నాను. ఇక్కడవున్న మీ పరిచారకుడు చాలా మర్యాదస్తుడు, నెమ్మదైనవాడు. పెద్ద మనిషి, ఇతడు మనతో బాటు ఈ డైనింగ్ టేబిల్ వద్ద కూచొని భోజనం చేయాలని నా ఆకాంక్ష" అన్నాడు.  డాక్టర్ జాన్సన్ చేసిన ఈ ప్రతిపాదనను కాథరిన్ మెకాలే అగ్రహంతో తిరస్కరించింది. జాన్సన్ లోలోన నవ్వుకొని ఆ తర్వాత తన అంతరంగికులతో మాట్లాడుతూ “అందర్నీ సమానం చేసేయాలనే ఆవిడ వాదన ఎంత అసంబద్ధమైనదో ఆరోజున ఆవిడకలా తెలియజేశాను. ఆనాటి నుండి నేనంటే ఆవిడకంత గిట్టేది కాదు. అందరూ సమానమేనని సిద్ధాంతీకరించే ఈ ప్రబుద్ధులు తమకన్నా పై శ్రేణిలో వున్న వారితో తాము సమానమవాలని కోరుకుంటారేగానీ తమ క్రింది వర్గాలవారితో తాము సమానంగా వ్యవహరించడానికి అంగీకరించరు." అని అన్నారు జాన్సన్.                                     ◆నిశ్శబ్ద.

భారతీయులు చేస్తున్న తప్పు ఏంటో తెలుసా?

ప్రపంచంలోని పుస్తకాలన్నీ అదృశ్యమైపోయినా ఒక్క భగవద్గీత మిగిలితే చాలు. ఇంకేమీ అవసరం లేదంటాడు మహాత్మాగాంధీ, మానసికతత్త్వశాస్త్రం, ఆధ్యాత్మికం, నైతికవిలువలు....వెరసి ఒక మనిషి మనీషిగా, ఎదిగి ఉత్తమవ్యక్తిత్వంతో అలరారేందుకు అవసరమైన అంశాలన్నీ భగవద్గీతలో లభ్యమౌతాయి. జీవితానికి పునాది అయి, ప్రాణాధారం వంటి తత్వజ్ఞానం లభిస్తుంది. ఆ తత్త్వజ్ఞానాన్ని జీవితరంగంలో క్రియారూపంలో అనువర్తించే మార్గం లభిస్తుంది. నిత్యకృత్యాలలో ఎదురయ్యే చిన్న చిన్న సందేహాల నుండి క్లిష్టసమస్యల పరిష్కారం వరకూ అన్నీ భగవద్గీతలో లభిస్తాయి. అందుకే వ్యక్తి ఊహ ఎదిగి, వ్యక్తిత్వం స్థిరపడే సమయంలో గీతాపఠనం అతని ఎదుగుదల కాక దిశ కల్పిస్తుంది. ప్రపంచంలో మనిషి జన్మకు అర్ధం తెలిపి, ఆ జన్మను సార్ధకం చేసుకునేందుకు మార్గం చూపిస్తుంది. తాత్కాలిక సత్యం, శాశ్వత సత్యాలను గుర్తించటం నేర్పుతుంది. క్షణికావేశాలు, ఆకర్షణలను గుర్తించి నిజమైన భావనలను గుర్తించే విచక్షణను నేర్పుతుంది.  అంటే, శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచీ మంచి మాటలు నేర్పుతూ, జన్మించిన తరువాత మంచి ఆలోచననిస్తూ, ఎలాగైతే మొక్క ఎదిగి, తీగలా సరైన దిశలో పాకేట్టు సమాజం జాగ్రత్తలు తీసుకుంటూ వస్తుందో, ఇప్పుడు చెట్టు, వృక్షమయ్యే సమయంలో భగవద్గీత సరైన దిశాదర్శనం చేస్తుందన్నమాట. ఈ జ్ఞానంతో సమాజసాగరంలో అడుగిడిన వ్యక్తి ఆత్మవిశ్వాసంతో, విచక్షణతో తాను విజయుడవటమే కాక సమాజాన్ని విజయం దిశలో నడిపిస్తాడు. ఇది మన భారతీయ, వ్యవస్థలో వ్యక్తి విజయం కోసం స్వాభావికంగా ఏర్పరచిన బాట. అయితే ఈ బాటను విస్మరించి, ఈ జీవనవిధానాన్ని తృణీకరించటం వల్ల ఈనాడు మనకు కృత్రిమ అవయవాల వంటి పాశ్చాత్యప్రభావిత వ్యక్తిత్వవికాస డాక్టర్ల ఆలోచనలు అవసరం అవుతున్నాయి. ప్రస్తుతవ్యవస్థలో భార్యభర్తలిద్దరికే కలసి జీవనం సాగించే ఓపిక ఉండటం లేదు, ఇక పెద్ద బంధుగణంతో కలసి జీవించే సహనం ఉండే పరిస్థితి లేదు. దాంతో జన్మించటం తోటే పసిపిల్లవాడికి లభించే 'భద్రత కవచం' లేకుండాపోయింది. భార్యభర్తలిద్దరూ తప్పనిసరిగా ఉద్యోగాలు చేయాల్సి రావటంతో, చివరి క్షణం వరకూ గర్భవతి అయిన స్త్రీ ఉద్యోగానికి వెళ్ళాల్సి వస్తోంది. దాంతో వాతావరణం ప్రసక్తి రావటం లేదు. మామూలు ఉద్యోగాలు, చిరాకులు, ఉద్విగ్నతలు తల్లితో పాటు గర్భంలో పిల్లవాడూ అనుభవించాల్సి వస్తోంది. ఇక పిల్లవాడు పుడుతూనే ఓ 'సమస్య' అవుతున్నాడు. తల్లిదండ్రుల జీవితంలో 'అద్భుతం' కావాల్సిన పిల్లవాడి ఆలన పాలనలు బరువైపోవటంతో, పిల్లవాడు పని సమయాల్లో 'అనాథ'లా క్రచ్లలో ఉండాల్సి వస్తోంది. సుమతీ శతకాలు, లాలిపాటలు, జోలపాటలు పాడే ఓపిక, తీరికలు ఎవరికీ ఉండకపోవటంలో ఆశ్చర్యం లేదు. పైగా ఇది టీవీలు, మొబైల్ ఫోన్ ల యుగం కావటంతో, వ్యాపార విలువలే ప్రధానం కావటంతో పిల్లవాడికి సినీ పాటలే సుమతీ శతకాలవుతున్నాయి. రీమిక్స్లు జోలలవుతున్నాయి. కార్టూన్లు, క్రైమ్ నాటకాలు పురాణాలవుతున్నాయి. అంటే, జీవితమంటే ఏమిటో తెలియకనే, ఈ ప్రపంచంలో తన పాత్ర ఏమిటో ఆలోచన లేకుండానే, అత్యంత అశాంతితో, అభ్యనతా భావంతో, పిల్లలు ప్రపంచంలోకి అడుగిడుతున్నారు. దీనికి తోడు విజయం అంటే 'డబ్బు సంపాదన' అన్న భావం సమాజంలో స్థిరపడింది.  పాఠశాలల్లో నైతికవిలువల బోధన కొరవడింది. డబ్బును బట్టి చదువు లభ్యమౌతుంది. అదీ ఉద్యోగ సంపాదన చదువు తప్ప, మనిషికి వ్యక్తిత్వాన్నిచ్చే చదువు కాదు. దాంతో విచక్షణ అన్నది అదృశ్యం అవుతోంది. ఇటువంటి పరిస్థితులలో మనకు మానసిక డాక్టర్లు, వ్యక్తిత్వవికాస కౌన్సిలర్లు అవసరమౌతున్నారు. అంటే కోకిల కాకి అయ్యే ప్రయత్నాలు చేస్తూండటంతో, ప్రస్తుతం కాకి కోకిలకు 'పాట' నేర్పుతోందన్న మాట! ఎప్పుడైతే ఈ సత్యం అర్థమౌతుందో, అప్పుడే జీవితాలలో మార్పు మొదలవుతుంది. నిజమే కదా!!                                    ◆నిశ్శబ్ద.