నటించేవారు ఎలా ఉంటారో తెలుసా?

కొందరు మనుష్యులు అందరితోనూ ఇట్టే ఏకీభవిస్తూ తిరుగుతూ వుంటారు. పలుకుబడీ, అధికార హోదా కలిగున్న వారితో అయితే మరీ వేగంగా ఏకీభవిస్తారు. అటువంటివారి మాటను వీరు ఏనాడూ కాదనరు. విభిన్న అభిప్రాయాలున్న ఇద్దరు వ్యక్తులు ఒకచోట చేరినా, ఇద్దరితోనూ ఏకీభవిస్తున్నట్లుగా, మధ్యమధ్యలో తల వంచుకుంటూ, తల పక్కకి తిప్పుతూ, విననట్లుగా నటిస్తూ, వినినా అర్థం కాలేదన్నట్లు ముఖం వేళ్ళాడేస్తూ, ఆ ఇరుకూ ఇబ్బందిలోనుండి ఎలాగోలా బయటపడతారు. అటు తర్వాత అలా వివాద పడినవారిలో ఒకరు “అతడేమన్నాడో చూశావా?" అని ఈ తటస్థుణ్ణి ఉద్రేకంగా అడిగినప్పుడు కూడా "అలా అన్నాడా? నేను వినలేదు సుమా!” అని ఆశ్చర్యపు పోజు పెడతాడు. “అక్కడే వుంటివి కదయ్యా? నీకేమి చెవుడొచ్చింది? విననే లేదంటావేమిటి?” అని విసుక్కుంటే, "విన్నానేమోకానీ, ఆ సమయానికి మీరు ఇప్పుడు చెప్పే అర్థం స్ఫురించలేదండీ" అని మరో అబద్ధమాడి అమాయకంగా చూస్తాడు. "వీడొక మందమతి” అని అవతలి మనిషి అభిప్రాయపడ్డా ఈ నటించే మనిషికి అభ్యంతరం లేదు కానీ, తాను మాత్రం ఇదమిద్దంగా ఎవరి పక్షమూ వహించడు. 

ఈ స్వప్రయోజన పరుడు ఏ సందర్భంలోనూ న్యాయం వైపూ, ధర్మం వైపూ నిలుస్తాడని ఎవరూ అనుకునే వీలులేదు. ఇద్దరితోనూ అవసరం పడుతుంటుంది కాబట్టి, ఇద్దరిదీ “రైటే” అన్నట్లుగా తిరుగుతూ తనపని చక్కబెట్టుకుంటుంటాడు. ఇదో తరహా వ్యవహారం.

కొందరికి స్వయంగా ఆలోచించే లక్షణమే వుండదు కాబట్టి ఎవరేది చెప్తే అదే “రైట్” అని తోస్తుంది. వీరికి స్వప్రయోజనం సాధించుకోవాలని వున్నా లేకపోయినా, అవతలివారన్నది సబబుగానే కనిపిస్తుంది. ఒక ధనికురాలికి నాలుగు రోజుల బట్టి కాస్తున్న జ్వరం తగ్గలేదు. ఎందుకైనా మంచిదని ఇద్దరు స్పెషలిస్టులను పిలిపించాడు. భర్త. ఒక స్పెషలిస్టు పరీక్షించి “ఇది టైఫాయిడ్ కేసు, సందేహం లేదు" అని తేల్చాడు.

“కరెక్ట్" అన్నది ఆవిడ, తన కొచ్చిన కొద్దిపాటి ఇంగ్లీషుతో. రెండో స్పెషలిస్టు కూడా పరీక్షించి చూచాడు. తన ప్రత్యేకత నిలబెట్టుకోటానికా అన్నట్లు, “నిస్సంశయంగా ఇది ఒక రకమైన మలేరియా జ్వరం. కాదంటే చెవి తెగ్గోయించుకుంటాను” అని ప్రకటించాడు.

“కరెక్టూ" అనేసింది రోగి అతడి వంకకు తిరుగుతూ. అదిరిపడిన భర్త, “ఇద్దరి డయాగ్నోసిస్ కరెక్టేలా అవుతుంది” అని తల గోక్కోవడం మొదలెట్టాడు. మంచం మీద పడుకోనున్న భార్య భర్తవంకకు తిరిగి “కరెక్ట్” అన్నది.

మూర్ఖులు వాదించుకోడం ప్రారంభించినపుడు వారి వాదనలో చిక్కుకోకుండా వుండడం మంచిది. తలాతోకా లేకుండా, తమ అధిక్యత నిరూపించుకోడానికే వాదించే వారి మధ్య చిక్కుకున్నప్పుడు “తప్పించుకు తిరిగే వాడే ధన్యుడు”. జాతకకథల్లో ఇద్దరు మూఢుల మధ్య వివాదం గురించిన ప్రస్తావన ఒకటుంది. పౌర్ణమి తర్వాత పదిహేను రోజులపాటు మహాచలిగా వుంటుందని ఒకరూ, అమావాస్య తరువాత పక్షం రోజులే ఎక్కువ చలిగా వుంటుందని రెండోవాడూ, ఒకరితో ఒకరు తీవ్రంగా వివాదపడ్డారు. వాదన ఎటూ తెమలకపోయే సరికి, ఇద్దరూ కలిసి ఒక జ్ఞానివద్దకు వెళ్ళారు. "మా వాదనల్లో ఎవరిది సరియైనదో తేల్చి చెప్పండి” అని విషయం వివరించారు.

జ్ఞాని కాసేపు తేరిపార జూచి, “మూర్ఖ ప్రజాపతులారా పౌర్ణమి తర్వాత పక్షమైతేనేమి అమావాస్య నిశీధి తర్వాతి రోజులైతే నేమి చలి చంద్రుడితో ఎలా ముడిపడి వుంటుంది? చలిగాలులవల్ల, గాలిలో తేమ అధికమైనందువల్ల చలి ఏర్పడుతుంది. కార్యకారణ సంబంధంలేని మీ ఇద్దరి వాదనా సమంజసమేనని, మీకు తగినట్లే వుందని నా తీర్పు” అన్నాడా జ్ఞాని. మూర్ఖులిద్దరూ తమ వాదన సరియైనదేనాని అనుకుంటూ సంతోషించి వెళ్ళిపోయారు. ఇలా తాము తమ అవసరార్థం ఎవరి వైపు నిలబడకుండా అటు ఇటు కూడా ఇబ్బంది కలిగించకుండా వెళ్ళేవాళ్ళు కొందరుంటారు. ప్రస్తుతకాలంలో  గొప్ప నటులు, మహా మేధావులు అనబడతారు వీళ్ళు.

                                     ◆నిశ్శబ్ద.

Advertising
Advertising