స్వేచ్ఛ గురించి జిడ్డు కృష్ణమూర్తి ఏమి చెప్పాడు?

ప్రస్తుత సమాజంలో మనిషి తన వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తున్నాడు. తనకు కావలసిన దానికోసం ఎంత అయినా వాదిస్తారు, తనకూ అస్తిత్వం ఉందని తనకు స్వేచ్ఛ కావాలని, తనని ఏవరూ వారి చేతుల్లోకి తీసుకోకూడదు అని అనుకుంటారు.

అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టపరుచు కోవాలి  మనకు  నిజంగా స్వేచ్ఛ కావాలని అనుకుంటున్నామా? పూర్తి స్వేచ్ఛ కావాలనుకుంటున్నామా లేక ఏదో అనుకూలం లేనిచోటు నుంచి, తాత్కాలిక అసౌకర్యం నుంచి బయటకు రావాలని అనుకుంటున్నామా? మనకు ఇష్టం  లేని అనాహ్లాదకర, అవాంఛనీయ పరిస్థితుల నుంచి విడుదల కావాలని కోరుకుంటున్నామా?  బాధ కలిగించే, జుగుప్సలో ముంచే అనుభవాల నుంచి, అసౌఖ్యదాయక అనుభవాల నుండి బయటపడాలని అనుకుంటాము. అవాంఛనీయమయిన జ్ఞాపకాల నుంచి దూరంగా వుండాలనుకుంటాము. మన మనసుకు ఆహ్లాదం చేకూర్చే, కొన్ని సంతృప్తి చేకూర్చే ఆదర్శాలు, సూత్రాలు, వదిలి సంబంధాలు కావాలనుకుంటాము. ఒకదానిని వుంచుకొని మరొకదానిని వదిలివేయడం చాలా కష్టం. ఎందుకంటే  సుఖం అనేది దుఃఖం నుంచి విడదీయరానిది అని అందరికీ తెలిసిన తెలియనట్టే సుఖమే సర్వస్వం అనుకుంటూ భ్రమలో ఉంటారు. 

అందువల్ల ముందుగా మనం తేల్చుకోవలసిన అంశం ఏమిటంటే, మనం పరిపూర్ణమయిన స్వేచ్ఛ కావాలనుకుంటున్నామా?? లేదా?? అని! కావాలనుకుంటున్నాం అనుకునేట్లయితే, అప్పుడు స్వేచ్ఛ అంటే ఏమిటి స్వభావం, నిర్మాణ రూపం ఎలా వుంటుంది అన్న విషయాలు తెలుసుకోవాలి. 

అలా దేన్నించో వైదొలగి వుండడమే స్వేచ్ఛా? బాధనుండి స్వేచ్ఛ, ఏదో రకమయిన ఆదుర్దానుంచి స్వేచ్ఛ. ఇంతేనా  లేక మరేదో భిన్నమైన పరిపూర్ణ స్వేచ్ఛ ఉందా? మనిషిని ఇబ్బంది పెట్టే వృత్తంను వదిలి మరొక వృత్తంలోకి వెళ్ళడమే  స్వేచ్చనా...అసూయ నుంచి స్వేచ్ఛ పోందవచ్చును. కాని, అది కేవలం ప్రతిక్రియ మాత్రమే అయిపోయి, నిజమయిన, స్వేచ్ఛ కాకుండా వుండవచ్చును కదా? సంప్రదాయం నుంచి స్వేచ్ఛ సంపాదించ వచ్చును. దానిని వివరించి చూడడం ద్వారా,  త్రోసిరాజు అనడం ద్వారా. కానీ అటువంటి స్వేచ్ఛ వుద్దేశ్యం యేమిటి? ఆ సిద్ధాంతం ఈ కాలానికి తగినది కాదు కాబట్టి, ప్రస్తుతానికి అనుకూలమయినది కాదు కాబట్టి దాని కోసం ప్రయత్నం చేస్తున్నామా? 

అంతర్జాతీయత పట్ల మక్కువ వల్ల జాతీయ భావాలు సరయినవి కావనీ వాటి నుంచి స్వేచ్ఛ కావాలనీ అనుకుంటున్నామా? లేక ప్రస్తుత ఆర్థిక అనుకూలతల దృష్ట్యా సంకుచితమయిన జాతీయ భావనలు సరిఅయినవి కావని అనుకుంటున్నామా? ఇదంతా తేలికగా అర్థం చేసుకోవచ్చును. లేదా ఎవరో ఆధ్యాత్మిక రాజకీయనాయకుని పట్ల విరోధంతో క్రమశిక్షణ, విప్లవం పట్ల తిరుగుబాటు ధోరణితో మనం ఇటువంటి ఆలోచనలకు రావచ్చును. ఆ రకమయిన హేతువాదం, తార్కిక తీర్మానం  నిజ స్వేచ్ఛతో ఏ మాత్రమయినా పొందిక పొంది వున్నదా?

దేనినుంచయినా, ఎవరైనా  స్వేచ్ఛగా వున్నాము అనుకుంటే, అది గూడా ఒక ప్రతి చర్యే అవుతుంది. అది మరోరకమయిన కట్టుబాటును, ఆధిపత్యాన్ని తీసుకువస్తుంది. ఈ విధంగా మనం ప్రతిచర్యల పరంపరలతో స్పందిస్తూ. 'ప్రతిచర్య'ను విముక్తి అని ఆమోదించవచ్చు. కాని, అది నిజానికి స్వేచ్ఛ కాదు. వెనకటి కట్టుబాటు తాలూకు కొనసాగింపే అవుతుంది. మనసు ఇరుక్కుపోయిన గతానికి సంబంధించినదే అవుతుంది.

                                       ◆నిశ్శబ్ద