Read more!

ప్రవాస భారతీయులు దేశ ప్రగతికి కీలకం!

ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులకంటూ ప్రత్యేకత ఉంటుంది. భారతీయతను తాము వెళ్లిన చోటుకు వ్యాప్తి చేయడం,  భారతీయ సంస్కృతి సంప్రదాయాలను ఇతర దేశాలలో కూడా పాటించడం, అందులో ఉన్న గొప్పదనాన్ని అందరికీ తెలియజేయడం మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలలో ఎన్నో అభివృద్ధి మార్గాలలో భారతీయుల విజ్ఞానం కూడా భాగమవుతుండటం విశేషంగా చెప్పుకోవాల్సిన విషయం. 


విదేశాలకు వెళ్లిన భారతీయులు చదువులు, ఉద్యోగాల నిమిత్తం అక్కడ ఉంటూ భారతీయులను ఒకే తాటిపై ఉంచేందుకు, వారు భారతీయతను మరచిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రవాస భారతీయులు దివాస్ ను జరుపుకుంటూ వస్తున్నారు. దీని వెనుక ఉన్న  మరొక విషయం ఏమిటంటే ఈ ప్రవాస భారతీయ దివాస్ ను మన జాతిపిత మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ తన విద్యాభ్యాసం ముగించుకుని తిరిగి భారతదేశానికి వచ్చిన సందర్భంగా  జనవరి 7 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు జరుపుకుంటారు. 


భారతదేశ ప్రతిష్ట, గౌరవం ఇనుమడించడంలో విదేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తుల పాత్ర చాలా ఉంటుంది. వీరందరూ తమ ప్రతిభతో విదేశాలలో గొప్ప అవకాశాలు పొందడమే కాకుండా  భారతదేశ ఉనికిని పలుచోట్లకు తీసుకెళ్తున్నారు. మొదట ఈ ప్రవాస భారతీయ దినోత్సవాన్ని 2003 సంవత్సరం జనవరి 7 నుండి 9 వరకు ప్రతి సంవత్సరం నిర్వహించేవారు. అయితే 2015 సంవత్సరం దీనికి సవరణలు చేసి ప్రతి సంవత్సరం కాకుండా రెండేళ్లకు ఒకసారి దీన్ని జరుపుకుంటున్నారు. ఈ క్రమంలో 2023 సంవత్సరంలో ప్రవాస భారతీయ దివాస్ నిర్వహించబడుతుంది. 


ఈ సంవత్సరం జనవరి 7 వ తేదీన మొదలయ్యే ప్రవాస భారతీయ దినోత్సవం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలో జరగనుంది. విదేశాలకు వెళ్లే భారతీయులు భారతదేశం గర్వపడేలా చేయాలన్నది కూడా ఈ దినోత్సవంలో చర్చించే ఓ ముఖ్యమైన అంశం.


ప్రవాస భారతీయ దినోత్సవ వేడుక సందర్భంగా ఎంతో మంది అతిథులు, విదేశాలలో ఉన్న భారతీయ కమ్యూనిటీకి చెందినవారు పాల్గొంటారు. స్వదేశీ-విదేశీ సంబంధాలను మెరుగుపరడంలో కూడా విదేశాలకు వెళ్లే భారతీయుల పాత్ర ఉంటుంది. భారతదేశం వివిధ రసంగాలలో అభివృద్ధి చెందడానికి గొప్పగా సహకరించిన విదేశాలకు వెళ్లిన భారతీయులకు ఈ ప్రవాస భారతీయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డ్ ను వీరికి అందజేస్తారు. అలాగే ఈరోజు జరుపుకోవడం వల్ల భారతీయులు, ఇక్కడ ప్రభుత్వాలు, అధికారులు భారతీయుల పట్ల బాధ్యతను, సహకారాన్ని అందించేందుకు ఆరోగ్యకరమైన సత్సంబంధాలు పెంపొందించుకునే అవకాశం కూడా ఉంటుంది. విదేశాలలో నివసించే భారతీయులకు అక్కడ ఏవైనా ఇబ్బందులు ఎదురైతే స్వదేశీ అధికారుల మద్దతు, అక్కడి వారు ఇక్కడికి తిరిగిరావడానికి దేశ అధికారులతో మాట్లాడటం వంటి కీలక అంశాలు మెరుగుపడతాయి. 


భారతదేశానికి మాత్రమే కాకుండా వివిధ దేశాలకు కూడా ఇతర దేశాలతో సత్సంబంధాలు ఏర్పడాలంటే స్వదేశం నుండి ఇగ్గర దేశాలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగస్తుల పాత్ర కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి ప్రవాస భారతీయులు ఎప్పుడూ దేశ ప్రగతిలో తాము కూడా కీలకమనే విషయాన్ని మరచిపోకండి. అలాగే దేశం మీకోసం ఎప్పుడూ సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటుందని మరవకండి.


                                   ◆నిశ్శబ్ద.