భారతీయులు చేస్తున్న తప్పు ఏంటో తెలుసా?

ప్రపంచంలోని పుస్తకాలన్నీ అదృశ్యమైపోయినా ఒక్క భగవద్గీత మిగిలితే చాలు. ఇంకేమీ అవసరం లేదంటాడు మహాత్మాగాంధీ, మానసికతత్త్వశాస్త్రం, ఆధ్యాత్మికం, నైతికవిలువలు....వెరసి ఒక మనిషి మనీషిగా, ఎదిగి ఉత్తమవ్యక్తిత్వంతో అలరారేందుకు అవసరమైన అంశాలన్నీ భగవద్గీతలో లభ్యమౌతాయి. జీవితానికి పునాది అయి, ప్రాణాధారం వంటి తత్వజ్ఞానం లభిస్తుంది. ఆ తత్త్వజ్ఞానాన్ని జీవితరంగంలో క్రియారూపంలో అనువర్తించే మార్గం లభిస్తుంది. నిత్యకృత్యాలలో ఎదురయ్యే చిన్న చిన్న సందేహాల నుండి క్లిష్టసమస్యల పరిష్కారం వరకూ అన్నీ భగవద్గీతలో లభిస్తాయి. అందుకే వ్యక్తి ఊహ ఎదిగి, వ్యక్తిత్వం స్థిరపడే సమయంలో గీతాపఠనం అతని ఎదుగుదల కాక దిశ కల్పిస్తుంది. ప్రపంచంలో మనిషి జన్మకు అర్ధం తెలిపి, ఆ జన్మను సార్ధకం చేసుకునేందుకు మార్గం చూపిస్తుంది. తాత్కాలిక సత్యం, శాశ్వత సత్యాలను గుర్తించటం నేర్పుతుంది. క్షణికావేశాలు, ఆకర్షణలను గుర్తించి నిజమైన భావనలను గుర్తించే విచక్షణను నేర్పుతుంది.  అంటే, శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచీ మంచి మాటలు నేర్పుతూ, జన్మించిన తరువాత మంచి ఆలోచననిస్తూ, ఎలాగైతే మొక్క ఎదిగి, తీగలా సరైన దిశలో పాకేట్టు సమాజం జాగ్రత్తలు తీసుకుంటూ వస్తుందో, ఇప్పుడు చెట్టు, వృక్షమయ్యే సమయంలో భగవద్గీత సరైన దిశాదర్శనం చేస్తుందన్నమాట. ఈ జ్ఞానంతో సమాజసాగరంలో అడుగిడిన వ్యక్తి ఆత్మవిశ్వాసంతో, విచక్షణతో తాను విజయుడవటమే కాక సమాజాన్ని విజయం దిశలో నడిపిస్తాడు. ఇది మన భారతీయ, వ్యవస్థలో వ్యక్తి విజయం కోసం స్వాభావికంగా ఏర్పరచిన బాట. అయితే ఈ బాటను విస్మరించి, ఈ జీవనవిధానాన్ని తృణీకరించటం వల్ల ఈనాడు మనకు కృత్రిమ అవయవాల వంటి పాశ్చాత్యప్రభావిత వ్యక్తిత్వవికాస డాక్టర్ల ఆలోచనలు అవసరం అవుతున్నాయి. ప్రస్తుతవ్యవస్థలో భార్యభర్తలిద్దరికే కలసి జీవనం సాగించే ఓపిక ఉండటం లేదు, ఇక పెద్ద బంధుగణంతో కలసి జీవించే సహనం ఉండే పరిస్థితి లేదు. దాంతో జన్మించటం తోటే పసిపిల్లవాడికి లభించే 'భద్రత కవచం' లేకుండాపోయింది. భార్యభర్తలిద్దరూ తప్పనిసరిగా ఉద్యోగాలు చేయాల్సి రావటంతో, చివరి క్షణం వరకూ గర్భవతి అయిన స్త్రీ ఉద్యోగానికి వెళ్ళాల్సి వస్తోంది. దాంతో వాతావరణం ప్రసక్తి రావటం లేదు. మామూలు ఉద్యోగాలు, చిరాకులు, ఉద్విగ్నతలు తల్లితో పాటు గర్భంలో పిల్లవాడూ అనుభవించాల్సి వస్తోంది. ఇక పిల్లవాడు పుడుతూనే ఓ 'సమస్య' అవుతున్నాడు. తల్లిదండ్రుల జీవితంలో 'అద్భుతం' కావాల్సిన పిల్లవాడి ఆలన పాలనలు బరువైపోవటంతో, పిల్లవాడు పని సమయాల్లో 'అనాథ'లా క్రచ్లలో ఉండాల్సి వస్తోంది. సుమతీ శతకాలు, లాలిపాటలు, జోలపాటలు పాడే ఓపిక, తీరికలు ఎవరికీ ఉండకపోవటంలో ఆశ్చర్యం లేదు. పైగా ఇది టీవీలు, మొబైల్ ఫోన్ ల యుగం కావటంతో, వ్యాపార విలువలే ప్రధానం కావటంతో పిల్లవాడికి సినీ పాటలే సుమతీ శతకాలవుతున్నాయి. రీమిక్స్లు జోలలవుతున్నాయి. కార్టూన్లు, క్రైమ్ నాటకాలు పురాణాలవుతున్నాయి. అంటే, జీవితమంటే ఏమిటో తెలియకనే, ఈ ప్రపంచంలో తన పాత్ర ఏమిటో ఆలోచన లేకుండానే, అత్యంత అశాంతితో, అభ్యనతా భావంతో, పిల్లలు ప్రపంచంలోకి అడుగిడుతున్నారు. దీనికి తోడు విజయం అంటే 'డబ్బు సంపాదన' అన్న భావం సమాజంలో స్థిరపడింది.  పాఠశాలల్లో నైతికవిలువల బోధన కొరవడింది. డబ్బును బట్టి చదువు లభ్యమౌతుంది. అదీ ఉద్యోగ సంపాదన చదువు తప్ప, మనిషికి వ్యక్తిత్వాన్నిచ్చే చదువు కాదు. దాంతో విచక్షణ అన్నది అదృశ్యం అవుతోంది. ఇటువంటి పరిస్థితులలో మనకు మానసిక డాక్టర్లు, వ్యక్తిత్వవికాస కౌన్సిలర్లు అవసరమౌతున్నారు. అంటే కోకిల కాకి అయ్యే ప్రయత్నాలు చేస్తూండటంతో, ప్రస్తుతం కాకి కోకిలకు 'పాట' నేర్పుతోందన్న మాట! ఎప్పుడైతే ఈ సత్యం అర్థమౌతుందో, అప్పుడే జీవితాలలో మార్పు మొదలవుతుంది. నిజమే కదా!!                                    ◆నిశ్శబ్ద.

ప్రపంచాన్ని ఇముడ్చుకున్న టెలివిజన్.. ఆవిష్కారమైన రోజు…

ఒక 20 సంవత్సరాల కిందటి కాలంలోకి చూస్తే అప్పటి ప్రపంచం వేరుగా ఉండేది. అక్కడక్కడా కనిపించే బుల్లితెర సందడి ఒక అద్బుతంగానే ఉండేది. బొమ్మలు కదులుతూ మాటలు, హవాభావాలు అందరికీ వీణులవిందు చేస్తుండేది. ఇదంతా టివి గా మనం పిలుచుకునే టెలివిజన్ కథ.  ప్రస్తుతకాలంలో టెలివిజన్ చాలా రూపాంతరం చెంది దీర్ఘచతురస్ర చెక్క పలక అంత పరిమాణంలోకి వచ్చింది. టీవీ లేని ఇల్లు అంటూ ఇప్పుడు ఎక్కడా లేదేమో... 1996లో, ఐక్యరాజ్యసమితి సాధారణ సభ నవంబర్ 21ని ప్రపంచ టెలివిజన్ దినోత్సవంగా ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి టెలివిజన్ గురించి నిర్ణయం తీసుకోవడంపై బలమైన కారణమే ఉంది. టెలివిజన్ గురించి ఐక్యరాజ్యసమితి నిర్ణయం వెలువరించిన కాలానికి టెలివిజన్ అనేది ఒక అద్భుతమైన ప్రసార సాధనం. ఇది మనిషి జీవితం పై  ఎక్కువ ప్రభావం చూపుతుందని,  అలాగే వినోద పరిశ్రమకు అంబాసిడర్‌గా కూడా ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుందని గుర్తించింది.  టెలివిజన్ అనేది కమ్యూనికేషన్ మరియు గ్లోబలైజేషన్ యొక్క చిహ్నం అని ఐక్యరాజ్యసమితి తెలియజేసింది.  ఇంతటి ప్రధాన పాత్ర పోషించిన టెలివిజన్ చరిత్ర గురించి అందరూ తెలుసుకోవాలి. 1927లో, ఫిలో టేలర్ ఫార్న్స్‌వర్త్ అనే 21 ఏళ్ల వ్యక్తి  ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రానిక్ టెలివిజన్‌ను కనుగొన్నాడు.  అతను 14 సంవత్సరాల వయస్సు వరకు కరెంటు ప్రసారం లేని ఇంటిలో నివసించాడు.  అతను తన ఉన్నత పాఠశాలలో  కదిలే చిత్రాలను సంగ్రహించి, వాటిని కోడ్‌గా మార్చగల వ్యవస్థ గురించి ఆలోచించడం ప్రారంభించాడు. అంతేకాకుండా రేడియో తరంగాలతో ఆ చిత్రాలను వివిధ పరికరాలకు తరలించాడు.  ఎలక్ట్రాన్ల పుంజం ఉపయోగించి కదిలే చిత్రాలను సంగ్రహించడంలో అతను మెకానికల్ టెలివిజన్ వ్యవస్థ కంటే చాలా సంవత్సరాలు ముందున్నాడు.  అయితే  ప్రపంచ సమాచార వ్యాప్తిని ప్రోత్సహించే అంతర్జాతీయ దినోత్సవానికి టెలివిజన్ చిహ్నంగా మారుతుందని అప్పుడు అతను ఊహమాత్రంగా అయినా అనుకుని ఉండడు.  1996లో నవంబర్ 21 మరియు 22 తేదీల్లో ఐక్యరాజ్యసమితి మొదటి ప్రపంచ టెలివిజన్ ఫోరమ్‌ను నిర్వహించింది.  ఇక్కడ, ప్రముఖ మీడియా వ్యక్తులు వేగంగా మారుతున్న ప్రపంచంలో పెరుగుతున్న టెలివిజన్ ప్రాముఖ్యతను చర్చించడానికి మరియు వారి పరస్పర సహకారాన్ని ఎలా పెంచుకోవచ్చో పరిశీలించడానికి సమావేశమయ్యారు.  ఐక్యరాజ్యసమితి నాయకులు ప్రజలలో టెలివిజన్  ఓ సానుకూల  దృష్టిని తీసుకురాగలదని, శాంతి మరియు భద్రతకు ముప్పుల గురించి అవగాహన పెంచుతుందని, సామాజిక మరియు ఆర్థిక సమస్యలపై దృష్టిని పదును పెట్టగలదని గుర్తించారు. ఇక  ప్రపంచ రాజకీయాలపై నిస్సందేహంగా  ప్రజల అభిప్రాయాన్ని తెలియజేయడం, ప్రసారం చేయడం మరియు ప్రభావితం చేయడంలో టెలివిజన్ ఒక ప్రధాన సాధనంగా గుర్తించబడింది.  ఈ సంఘటన కారణంగా, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నవంబర్ 21 ప్రపంచ టెలివిజన్ నిర్వహించుకోవాలని  నిర్ణయించింది, టెలివిజన్ డే అనేది కేవలం ఆ వస్తువును గుర్తుచేసుకోవడం, దాన్ని చూడటంతో ముగిసిపోయేది కాదు. అది ప్రాతినిధ్యం వహిస్తున్న సమకాలీన ప్రపంచంలో కమ్యూనికేషన్ మరియు ప్రపంచీకరణకు చిహ్నం. ఇది ఒకనాటి తరానికి అద్భుతంగా అనిపించిన టెలివిజన్ కథ.                              ◆ నిశ్శబ్ద.

నెహ్రుకు కోపం తెప్పించిన ఓ.. సందర్భం!

మనకు తెలిసిన వారిలోనో… స్నేహితుల లోనో… లేక చుట్టాలలోనో.. కొందరుంటారు. వారిలో ఎవరైనా మనకు ఏదైనా అదృష్టం కలిసివస్తే అప్పు రూపంలోనో పప్పురూపంలోనో తనింత పంచుకుంటాడు, కష్టం చెప్పుకుంటే “నాకేమి సంబంధం?” అని లేచిపోతాడు. ఇహ అలాంటప్పుడు “ఎలావున్నావ్?” అని అడిగినపుడు ఏమీ సమాధాన మివ్వకుండా నవ్వేసి ఊరుకోవడమే మంచిది. మనుషుల మధ్య ప్రవర్తిల్లే సంబంధాన్ని బాగా కనిపెట్టినందువల్లనే ఇంగ్లీషువాడు "హౌ డూయుడూ?" అని మనల్ని ఎవరైనా పలకరిస్తే, సమాధానంగా మనం అతన్ని "హౌ డూయూడూ?” అని “యు” అక్షరాన్ని దీర్ఘంచేసి పలకడమే “మానర్స్" అని తేల్చాడు. అంతేకాని వీరి బాగోగులు వారికీ, వారి బాగోగులు వీరికీ వివరించుకుంటూ కూర్చోవలసిన ఆగత్యం లేదు. సోదిగా చెప్పుకుపోయినా వినే ఓపిక ఎవరికుంటుంది? మనం ప్రభుత్వం వారివద్దనుండి ఏదైనా పొందాలనుకున్నప్పుడు సుదీర్ఘమైన ప్రశ్నావళి నొకదాన్ని మనకందిస్తారు? అది "ఫిలప్" చేసి వారికి తిరిగి ఇవ్వవలసి వుంటుంది. ఇందులో కనిపించే ప్రశ్నలన్నీ చూస్తే, ప్రభుత్వం నుండి మనమాశించే దానికీ ఇక్కడ మనం సమాధానం చెప్పవలసిన ప్రశ్నలకు అసలు సంబంధమేమైనా వుందా, ఈ సమాధానాలన్నీ ఓపిగ్గా ఎవరైనా చదువుతారా అనే అనుమానం వస్తుంది. కానీ ప్రశ్నలన్నిటికీ విధాయకంగా సమాధానాలిచ్చి తీరవలసిందే. విసుక్కుంటూనే అన్నీ రాసి దరఖాస్తు దాఖలు చేసుకుంటాం. పండిట్ నెహ్రూ బ్రతికుండే రోజుల్లో అతడి పాశ్చాత్య స్నేహితుడు ఒకాయన అసలీ భారతీయాధికారులు ఈ “ఫిలప్" చేసిన ఫారాలన్నీ నిజంగా పరికిస్తారా. లేక ఏదో ఆనవాయితీని బట్టి ఆ ఫారాలన్నీ మనచేత ఊరికే నింపిస్తున్నారా అని పరీక్షిద్దామని అనుకున్నాడు. నెహ్రూ మిత్రుడైన కింగ్ స్లీ మార్టిన్ "న్యూ స్టేట్స్మన్ అండ్ నేషనల్” అనే ప్రఖ్యాత బ్రిటిష్ వారపత్రికకు ఎడిటర్. బ్రతికున్న రోజుల్లో, భారతదేశం టూరిస్టు శాఖ ఆహ్వానంపై అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండేవాడు. ఇండియాకు వచ్చినప్పుడల్లా “యల్లో ఫీవర్" జ్వరం కార్డులో యాత్రికుడు ఒకరోజు క్రితం ఎక్కడున్నదీ, రెండు రోజుల క్రితం ఎక్కడున్నదీ, అదే విధంగా మూడు, నాలుగు, వరుసక్రమంలో తొమ్మిదిరోజుల క్రితం ఎక్కడున్నదీ వ్రాయమని నిర్ధేశించి వుండేది. విజిటర్ ఏదైనా "యల్లో ఫీవర్" ప్రబలే ప్రాంతంలో నివసించి వచ్చాడా అని తెలుసుకోవడానికి ఉద్దేశించింది ఈ కార్డు. కింగ్ మార్టినికి కాస్త పదునైన హాస్యధోరణి వుండేది. అందుచేత “ఒక రోజు క్రితం" అనే పదాల ఎదురుగా "మేరీ” అనీ, “రెండు రోజుల క్రితం” కాలమ్లో “సూసాన్” అనీ, మూడురోజుల క్రితం “జేన్" అని వరసగా తొమ్మిది రోజులకు తొమ్మిది స్త్రీల పేర్లను ఉదహరించాడు. "ఈ నింపిన ఫారాలు ఎవరూ చదవరని నేను మొదట్నించే అనుమానిస్తూనే వుండేవాణ్ణి. ఇట్లా ఎట్లా రాశావు అని నన్ను అడిగినవాళ్లు లేరు” అని తన పత్రికలో రాశాడు. ఇది చూచిన నెహ్రు "ఏమిటిది?" అని ఆ శాఖలోని ఒక ఉద్యోగినిని పిలిపించి అడిగాడు. " నేను వాళ్ళకి చెప్తూనే వచ్చానండీ, ఆ కాలమ్స్ మార్చి “గత తొమ్మిది దినాల్లో మీరు ఏయేదేశాల్లో వుండి వచ్చారో పేర్కొనండి” అని వ్రాయించండని. కానీ నా మాట ఎవరూ పట్టించుకోలేదు" అన్నాడు. నెహ్రూ ఆగ్రహించి ఆ తర్వాత ఆ ఫారమ్ మార్పించాడు. ఇలా ఉంటుంది కొందరి తీరు. ప్రభుత్వాల విషయం ఇందుకు మినహాయింపు కాదు..                                       ◆నిశ్శబ్ద.

మగమహారాజులపై కాసింత దృష్టి పెట్టాలి!

గుర్తింపు మనిషికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది, మనిషి ఉనికిని మరింత విస్తృతం చేస్తుంది. ఇక్కడ సాధారణ మానవ ఉనికి గురించి మాట్లాడటం లేదు, ప్రతి వ్యక్తికి తనకంటూ ఒక ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మనకు ప్రస్తుతం ఎన్నో రకాల దినోత్సవాలు ఉన్నాయి. పేరెంట్స్ డే, చిల్డ్రెన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, టీచర్స్ డే ఇలా లెక్కకు మిక్కిలి ఉన్నాయి. ప్రతిరోజుకూ దాని ప్రాధాన్యతను అనుసరించి వాటిని జరువుకుంటూ ఉంటారు. ఆ కోవలోనిదే మెన్స్ డే. నేషనల్ మెన్స్ డే అనేది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన రోజు.  ఎందుకంటే… ఈ సృష్టికి ఆడది ఎంత ముఖ్యమో మగవాడు కూడా అంతే ముఖ్యం. మహిళా దినోత్సవాన్ని ఎంతో విస్తృతంగా జరుపుకునే ఈ కాలంలో మగవారికి గుర్తింపు, గౌరవం ఇవ్వడం ఖచ్చితంగా చేయాల్సిన పని. ఒకప్పుడు మగవాడి అజమాయిషీ ఎక్కువగా ఉన్న కాలంలో మగవాళ్లను విలన్లుగా చూసి, ఆడవారిని వారే అణిచివేస్తున్నారని వారి మీద విమర్శనాస్త్రాలు సంధించిన వారు చాలామందే ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. మగవాళ్ళు ఆడవారికి మద్దతు ఇస్తున్నారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, లక్ష్యాలు, క్రీడలు ఇలా ఎన్నో ఆడవారు మగవారితో సమానంగా రాణిస్తున్న రంగాలు ఉన్నాయి. అయితే ఇది కేవలం ఆడవారి గెలుపా… అంటే కాదని చెప్పవచ్చు. ప్రతి మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉన్నట్టు, ప్రతి మహిళ విజయానికి మగవాడి తోడ్పాటు, మగవాడి మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. అందుకే మగవారిని గౌరవించాలి, వారికి గుర్తింపు ఇవ్వాలి. నవంబర్ 19 వ తేదీ నేషనల్ మెన్స్ డే. ప్రతి సంవత్సరం ఈ మెన్స్ డే ఉన్నా.. ఉమెన్స్ డే అంత ఆర్భాటాలు ఏవి మెన్స్ డే కి జరగడం లేదని గగ్గోలు పెడుతున్నవారు ఉన్నారు. సహజంగానే మహిళలు కాస్త హైలైట్ అవుతూ ఉంటారు అన్ని విషయాలలో… దానికి అనుగుణంగా మొదటి నుండి మహిళలు అణిచివేయబడిన వర్గంలో ఒక భాగమయ్యారు కాబట్టి వారికి స్వతహాగానే తమకంటూ ప్రత్యేకత ఉందని వ్యాప్తం చెయ్యాలని ఉంటుంది. దానికి తగ్గట్టే మహిళా సంఘాలు, మహిళ సదస్సులు, మహిళా విభాగాలు ఏర్పడ్డాయి. అయితే మగవారికి ఇలాంటివి ఏమి లేవు. అందుకే మెన్స్ డే ని ప్రత్యేకంగా ఆర్భాటంగా జరిపేవాళ్ళు కనిపించరు. కానీ…. ఏం చేయచ్చు?? మెన్స్ డే అనేది ప్రపంచం మొత్తం మీద మగవారిని గుర్తించి వారికేదో సన్మానాలు గట్రా చేయాలని కాదు అర్థం. మగవారికి కూడా కాసింత ప్రాముఖ్యత ఇవ్వాలని. ఇక్కడేం తక్కువయ్యింది వాళ్లకు అనే ప్రశ్న మళ్ళీ వొస్తుందేమో… ఆడవారు కూడా ఉద్యోగాలు చేస్తున్నా చాలా శాతం కుటుంబాలకు మగవారు బాధ్యత వహిస్తూ ఉంటారు. దీని కారణంగా మగవారు తమ ఆరోగ్యం, వ్యక్తిగత శ్రద్ధ గురించి తక్కువగానే ప్రాముఖ్యత ఇస్తారు. ప్రతి కుటుంబంలో మగవారి ఆరోగ్యం, వారి మానసిక పరిస్థితి, వారు ఎదుర్కొంటున్న వ్యక్తిగత సమస్యలు, ఒత్తిడి వంటి విషయాల గురించి దృష్టి సారించడం ఈ మెన్స్ డే రోజు చేయవచ్చు. ఇది ఎప్పుడైనా చేయవచ్చు కానీ ఈరోజే ఎందుకనే ప్రశ్న వస్తే అవగాహనకు తొలిమెట్టు అనేది అన్నిసార్లు జరగదు. దానికోసం ప్రత్యేకంగా సమయాన్ని, శ్రద్దను కేటాయించగలగాలి. అలాంటప్పుడే సాధారణ సమయాల్లో కంటే ఎక్కువ దృష్టి దాని మీదకు వెళుతుంది.  మగవారి ఆరోగ్యం, వారి క్షేమం ఉంటే ప్రతి ఇల్లూ కొన్ని భయాలు, భారాలకు దూరంగా హాయిగా ఉండగలుగుతుంది. అందుకే మగవారికి కేటాయించిన దినోత్సవాన్ని మిస్ కాకుండా సెలబ్రేట్ చేయండి..                                     ◆నిశ్శబ్ద.

ఆలోచన గురించి జిడ్డు కృష్ణమూర్తి మాటలు!

మన జీవితాలలో ఆలోచన ఎందుకంత ప్రముఖపాత్ర వహిస్తుంది? ఆలోచన అంటే భావనలు, మెదడు కణాలలో పేరుకొని పోయిన జ్ఞాపకాల ప్రతిస్పందనలు. బహుశ  చాలమంది ఇంతవరకు ఇటువంటి ప్రశ్న వేసుకోకొకపోయి ఉండవచ్చు. ఒకవేళ వేసుకున్నా. ఇదంతా ముఖ్యమయినది కాదు. ముఖ్యమయినది భావోద్వేగం! అనుకుని వుంటారు. అయితే, యీ రెంటినీ వేరు చేయడం ఎలాగో ఆలోచన, రాగభావానికి కొనసాగింపు ఇవ్వకపోయినట్లయితే, ఆ భావన త్వరలోనే క్షీణించి పోతుంది. కాబట్టి - మన నిత్య జీవితాలలో, తిరుగుడు రాళ్ల మధ్య నలిగిపోతూ, భయ విహ్వలమయిన జీవితాలలో ఆలోచన ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుంది? ఎవరికి వారు ప్రశ్నించుకుని చూడాలి. మనిషి ఆలోచనకు ఎందుకు బానిస అయిపోయాడు? మోసకారి, తెలివి అయినది, అన్నిటినీ అమర్చేది, ప్రారంభంచేసేది, అన్వేషించి పెట్టేది, యుద్ధాలను తీసుకువచ్చింది, భయోత్పాతాన్ని సృష్టించినది, ఎంతో ఆదుర్దాను క్షణక్షణమూ రూపకల్పనలు చేస్తున్నది, తన తోకను తానే మింగుతున్నది,  నిన్నటి సుఖాలలో ఓలలాడుతూ ఆ సుఖాలను నేడు రేపు కూడా కొనసాగించేది,  ఆలోచన ఎప్పుడూ చురుకయినది, కబురు చెబుతుంది, కదులుతుంది, నిర్మాణం చేస్తుంది. తీసుకుపోతుంది, అదనంగా కలుపుతుంది, ఏవేవో అనుకుంటుంది! భావనలు మనకు ఆచరణకంటే ముఖ్యమయిపోయినాయి, అనేక క్షేత్రాలలో పాండిత్యం సంపాదించిన మహా విజ్ఞానులు వ్రాసిన పుస్తకాలలో చాతుర్యంతో వెలిబుచ్చిన అభిప్రాయాలు చాల మోసకారి, సూక్ష్మమయిన ఈ భావనలను మనం ఆరాధిస్తున్నాం. పుస్తకాలను పూజిస్తున్నాం. మనమే ఆ పుస్తకాలం. మనమే ఆ అభిప్రాయాలు. వాటితో చిక్కగా నిబద్దులమయి పోయాం. భావాలను ఆదర్శాలను ఎప్పుడూ చర్చించుకుంటూ తార్కికంగా ఉద్దేశ్యాలు వెలిబుచ్చుతున్నాం. ప్రతి మతానికి తనదే అయిన విశ్వాసము, సూత్రము, భగవంతుళ్లను చేరుకునే మూసకట్టు వున్నాయి. ఆలోచన ప్రారంభాన్ని గురించి చూస్తున్నప్పుడు యీ భావనల కట్టడాన్నే ప్రశ్నిస్తున్నాం. భావాలను చర్యలనుంచి వేరు చేశాం. ఎందుకంటే, భావనలు ఎప్పుడూ గతానికి చెందినవి. ఆచరణ వర్తమానానికి సంబంధించినది. అంటే, జీవితం ఎప్పుడూ వర్తమానంలోనే వుంటుంది. మనకు జీవించడం భయం కాబట్టి గతం భావనల రూపంలో మనకు అత్యంత ముఖ్యమయినది అయిపోయింది. మన ఆలోచన విధానాన్ని గమనించడం ఆసక్తిదాయకంగా వుంటుంది. మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఆలోచన అనుకుంటున్న ప్రతి చర్య ఎక్కడనుంచి బయలుదేరుతోంది? తప్పనిసరిగా జ్ఞాపకం నుంచే కదూ! ఆలోచించటానికి ప్రారంభం అంటూ ఉందా? ఉంటే, దానికి మనం పట్టుకోగలమా అంటే, జ్ఞాపకం యొక్క ప్రారంభం ఎందుకంటే మనకు జ్ఞాపకశక్తి అంటూ లేకపోతే ఆలోచనలే వుండవు. ఆలోచన ఏ రకంగా నిన్నటి ఒక సుఖానికి బలం చేకూర్చి కొనసాగింపు ఇస్తుందో సుఖానికి వ్యతిరేకమయిన దుఃఖం, భయాలను సైతం కొనసాగించడం కూడా కల్పిస్తుంది.  అనుభవించేవాడు వాడే ఆలోచించేవాడు. తానే ఆ సుఖము, దుఃఖము అయి, వాటిని పెంచి పోషించేవాడు అవడము కూడా చూపెడుతుంది.  ఆలోచన చేస్తున్నవాడు సుఖాన్ని బాధనుండి వేరు చేస్తాడు. సుఖాపేక్షలోనే దుఃఖము, బాధ, భయాలకు ఆహ్వానం ఇమిడి వున్నదని గమనించడు. మానవ సంబంధాలలో ఆలోచన ఎప్పుడూ సుఖాన్ని కోరుతోంది. దీనికి అనేక పేర్లు ఇస్తుంది. విశ్వాసం, సహాయం, దానం పోషణ, సేవ ఇలా.  మనం ఎందుకు సేవించాలనుకుంటున్నామో! పెట్రోల్ స్టేషన్ మంచి సేవలను అందిస్తుంది. ఈ మాటల అర్థం యేమిటి,  సహాయం, ఇవ్వడం, సేవలు చేయడం? ఇదంతా యేమిటి? సౌందర్యంతో, తేజస్సుతో, సౌకుమార్యంతో నిండిన కుసుమం నేను ఇస్తున్నాను, సహాయ పడుతున్నాను, సేవిస్తున్నాను' అని ప్రకటిస్తుందా? అది వుంటుంది, అంతే. అది యేమీ చేయటానికి ప్రయత్నం చేయదు గనుక భూమి అంతా ప్రసరిస్తుంది. ఆలోచన చాల మోసకారి, తెలివయినది. తన సౌకర్యం కోసం దేన్నయినా వికృత పరచగలదు. సుభాపేక్షతో విర్రవీగే ఆలోచన తన దాస్యాన్ని తానే తెచ్చుకుంటుంది. ఆలోచన ద్వంద్వ ప్రకృతిని తీసుకు వస్తుంది. మన సంబంధ బాంధవ్యాలలో, మనలో సుఖాన్ని తీసుకు వచ్చే హింస ఉంది, దయగా ఉదారంగా వుండాలనే కోరిక వున్నది. మన జీవితాలలో యెప్పుడూ జరుగుతున్నది యిదే. ఆలోచన యీ ద్వైతభావాలను తీసుకురావడం, వైరుధ్యాన్ని ప్రవేశపెట్టటమే కాక, అసంఖ్యాకంగా జ్ఞాపకాలను పోగు చేసుకుంటుంది. సుఖమూ బాధలతో కూడిన ఈ జ్ఞాపకాలద్వారా అది పునరుజ్జీవనం పొందుతుంది. కనుక ఆలోచన గతానికి చెందినది. పాతది.                                      ◆నిశ్శబ్ద.

స్ట్రీట్ షాపింగ్.. అదిరిపోయే కలెక్షన్స్

షాపింగ్ అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారు? అందులో లేడీస్ గురించి వేరే చెప్పక్కర్లేదు. అలా ఏదో పని మీద బయటికి వెళ్ళినప్పుడో లేదా అవసరానికి కొందామని వెళ్ళినపుడు ఏదైనా అట్రాక్టివ్ గా కనిపిస్తే ఇంకా టెంప్ట్ కాకుండా ఉండగలమా చెప్పండి. సాధారణంగా ఆడవాళ్ళకి ఎన్ని ఉన్నా ఇంకా ఏదో కావాలి లేదా మ్యాచ్ అవ్వలేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు  కొందామని ప్లాన్ చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు అనుకోకుండా కూడా షాపింగ్ చేస్తాం. అయితే మనం సాధారణంగా చేసే షాపింగ్ ఎక్కువగా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది. సరదాగా టైం పాస్ కి షాపింగ్ చెయ్యాలి అనుకున్నప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ లేదా స్ట్రీట్ షాపింగ్ ని ప్రిఫర్ చేసుకుంటాము. ఎందుకంటే ఇందులో వెరైటీ కలెక్షన్స్ ఉంటాయి. అందుబాటు ధరల్లో దొరుకుతాయి. అంతే కాకుండా వెస్ట్రన్ వేర్, ఇండో వెస్ట్రన్, అందమైన ట్యాంక్ టాప్స్, ఫ్రాక్స్, నీ లెన్త్ ఫ్రాక్స్, ఈవెనింగ్ గౌన్స్, జాకెట్స్ ఇలా రకరకాల వెరైటీస్ తో రకరకాల కలర్స్ లో దొరుకుతాయి. మన పర్సనాలిటీని, మన స్కిన్ టోన్ ని బట్టి మనకి నప్పే దుస్తులను మనం ఎంపిక చేసుకుంటాం. టాప్స్.. స్కర్ట్స్ లేదా జీన్స్ మీద  మ్యాచ్ చూసుకొని వేసుకోవచ్చు అదిరిపోతుంది. చిన్న బర్త్ డే పార్టీలకు లేదా వీకెండ్ ఔటింగ్స్ కి ఇవి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. ఈ స్ట్రీట్ షాపింగ్ లో ఒక్కోసారి టాప్ బ్రాండెడ్ వి కాపీ వెర్షన్స్ కూడా దొరుకుతాయి. ఒరిజినల్ కి ఏ మాత్రం తీసిపోవు అంటే నమ్మండి. కాకపోతే కాపీ వెర్షన్స్ కొనేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్ చేసి తీసుకోవాలి. లేదు అంటే దొరికిపోతాం(కాపీ అని తెలిసిపోతుంది). బట్టలతో పాటుగా మ్యాచ్ అయ్యే చెప్పులు, బ్యాగ్స్, జ్యువలరీ, హెయిర్ యాక్ససరీస్ ఇలా చాలా వెరైటీస్ మనం షాపింగ్ చేసుకోవచ్చు. మన హైదరబాద్ లో చాలా ప్లేసెస్ లో స్ట్రీట్ షాపింగ్ చేసుకోటానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అమీర్ పేట్, కోఠి, ఓల్డ్ సిటీ, బేగం బజార్, సికింద్రాబాద్-జనరల్ బజార్… ఒక్కో ఏరియాలో ఒక్కో వెరైటీ అందుబాటులో ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం షాపింగ్ చేసేయండి.

దేశ జ్ఞానాన్ని వెలిగించే జాతీయ విద్యాదినోత్సవం!

విధ్యా వినయేన శోభతేః... అన్నారు పెద్దలు. అంటే వినయాన్ని చేకూర్చే విద్యనే ఉత్తమమైనది అని అర్థం. విధ్య లేని వాడు వింత పశువు అని కూడా అన్నారు.. విద్య వల్ల మనిషిలో మేధాపరంగా గొప్ప మార్పు చోటు చేసుకుంటుంది. ఎంత ఎక్కువ చదువుకుంటే అంత గొప్ప జ్ఞానం వ్యక్తి సొంతం అవుతుందని చెప్పేవారు. అయితే కేవలం డిగ్రీ పట్టాలకు మాత్రమే పరిమితమయ్యే జ్ఞానం మనిషి మాససిక వికాసానికి దోహదం చెయ్యదు. అక్షరము అంటే నాశనం లేనిది అని అర్థం.అందుకే కాలం ఎంత మారినా చదువుకున్న చదువు మనిషికి ఏదో ఒక మార్గాన్ని చూపిస్తూనే ఉంటుంది. చరిత్రలోకి చూస్తే ఎంతో మంది గొప్పగా ఎదిగిన వారు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదిగినవారే... వారందరికీ చదువు విలువ ఎంతో స్పష్టంగా తెలుసు కాబట్టే వారు ఎంత గొప్పవారు అయినా చివరికంటూ నిత్యవిద్యార్థులుగా కొనసాగారు.  భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11 న జాతీయ విద్యాదినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు. భారతదేశ మొట్టమొదటి కేంద్ర విద్యాశాఖమంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకుని మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యాదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు.  ఎప్పుడు ఏర్పడింది.. ప్రస్తుతం మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ గా పిలువబడుతున్న విద్యాశాఖ  2008 సంవత్సరం నవంబర్ 11 న భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యాదినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించి, ప్రకటించింది. అప్పటి నుండి జాతీయ విద్యా దినోత్సవ వేడుక సాగుతోంది.  థీమ్ ఏంటో తెలుసా... ఈ విషయం మీద అవగాహన పెంపొందించే దిశగా ప్రతి సంపత్సరం ఒక కొత్త థీమ్ ను ప్రకటించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నాలు చేస్తుంది భారత ప్రభుత్వం. అదే విధంగా 2022 సంవత్సరానికి సంబంధించిన థీమ్ "Changing the course and transforming education". పై థీమ్ తో భారత ప్రభుత్వం ప్రజల్లో విద్యమీద అవగాహన పెంచే కార్యక్రమాలను ఈ ఏడాది చేపట్టబోతోంది. జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్న మౌలానా అబుల్ కలామ్ గురించి తెలుసుకుంటే….. నవంబర్ 18, 1888న జన్మించిన మౌలానా అబుల్ కలాం  పూర్తి పేరు "అబుల్ కలాం గులాం ముహియుద్దీన్ అహ్మద్ బిన్ ఖైరుద్దీన్ అల్-హుస్సేనీ ఆజాద్". ఈయన  భారత స్వాతంత్ర్య కార్యకర్త,  రచయిత మరియు భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఈయన భారత ప్రభుత్వంలో మొదటి విద్యా మంత్రి అయ్యాడు.   ఆగస్టు 15, 1947 నుండి ఫిబ్రవరి 2, 1958 వరకు ఈయన భారత విద్యా మంత్రిగా పనిచేశాడు.  ఫిబ్రవరి 22, 1958న ఢిల్లీలో మరణించాడు. అంటే ఈయన తన పదవి నుండి  తాను మరణించడానికి 20 రోజుల ముందు తప్పుకున్నాడు.  జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఏమి చేయవచ్చు?? జాతీయ విద్యాదినోత్సవ సందర్భంగానే కాకుండా సాధారణ రోజుల్లో కూడా  కృషి చేయవచ్చు కదా అని కొందరు ఎద్దేవా చేస్తూ ఉంటారు. అయితే జాతీయ విద్యాదినోత్సవం నాడు ఈ అవగాహనా కార్యక్రమాలు మరింత పుంజుకుంటాయి. అవగాహన!! జాతీయ విద్యాదినోత్సవం రోజు అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. నిరక్షరాస్యత కలిగిన ప్రాంతాలలో ఈ కార్యక్రమాల ఏర్పాటు ఉండేలా చూసుకోవాలి. పిల్లలను పనికి పంపే పెద్దవారి విద్య విలువ అర్థమయ్యేలా చెప్పాలి. పిల్లలను పని నుండి బడికి పంపే దిశగా వారి ఆలోచనలు మళ్లించాలి. విద్య వల్ల ఉద్యోగావకాశాలు ఎలా చేజిక్కించుకోవచ్చో, ఉద్యోగం చేసే వారికి ఈ సమాజంలో ఎంతటి సముచిత స్థానం లభిస్తోందో వివరించి చెప్పాలి.  సహాయం!! చదువు కోవడానికి ఇబ్బంది పడే పిల్లలు ఈ కాలంలో చాలామందే ఉన్నారు. చదువు ఖరీదు అయిపోయిన ఈ కాలంలో ఆర్థిక సమస్యలు కారణంగా విద్యకు ఉద్వాసన పలికే పేద మాణిక్యాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారిని చదువులో ప్రోత్సహించాలి. నేరుగా సహాయం కావచ్చు, లేదా స్వచ్చంధ సంస్థల తరపున కావచ్చు లేదా విరాళాలు సేకరించి కావచ్చు ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను చదువులో రాణించేలా చేస్తే దేశానికి విద్యా వంతులను అందించినట్టు అవుతుంది.   ఇలా ప్రతి ఒక్కరూ ఈ జాతీయ విద్యాదినోత్సవం రోజున తమకు చేతనైన విధంగా చేయూతను అందించవచ్చు.                                       ◆నిశ్శబ్ద.

స్వీయ క్రమశిక్షణ ఎందుకు అవసరం?

ప్రతి మనిషి జీవితం ఓ సరళ రేఖ లాగా అలా సాగిపోవాలి అంటే ఎన్నో విషయాలు సక్రమంగా ఉండాలి. కానీ ప్రస్తుతం ఉద్యమ లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు ప్రతి విషయం ఎగుడుదిగుడు దారిలాగా సాగుతూ ఉంటుంది చాలా మందికి. ఇలాంటి సమస్య లేకుండా హాయిగా సాగిపోవాలంటే ప్రతి వ్యక్తి నైతికంగా దృఢంగా ఉండాలి. నైతిక విలువలు, నైతికత అనేవి మనిషిని ప్రతి పనిలో సమర్థవంతుడిగా నిలబడతాయి.  నిజజీవితంలో నైతిక ప్రవర్తన ప్రభావవంతంగా ఉండాలంటే స్వీయ క్రమశిక్షణ పాటించాలి. ప్రతి వ్యక్తి తనకు తాను కొన్ని ఉద్దేశ్యాలు, కొన్ని పరిధులు, కొన్ని అలవాట్లు ఏర్పాటు చేసుకోవడం వల్ల తన పరిధిలో తాను ఉండటం కుదురుతుంది. ఇలా ఆత్మవిశ్వాసంతో తమపై తాము విధించుకొని అమలుపరచేదే స్వీయ క్రమశిక్షణ. జీవితంలో విజయం సాధించాలంటే మనంతట మనం నియమబద్ధమైన, క్రమబద్ధమైన జీవనాన్ని గడపాలి.  చాలామంది జీవితంలో ఓటమి పాలవ్వడానికి ముఖ్యమైన కారణం స్వీయ క్రమశిక్షణ లేకపోవడమే. ఇది చాలామందికి అర్థం కాదు. తాము బానే కష్టపడుతున్నాం, బానే చదజేవుతున్నాం అనుకుంటారు. కానీ జరుగుతున్న తప్పేమిటంటే స్వీయ క్రమశిక్షణ లేకపోవడం. ఎవరో చెబితే తప్ప తాను చేయాల్సిన పనులు చేయలేకపోవడం. ఈ తరహా తీరు మనిషిని తప్పకుండా బద్ధకిష్టుల జాబితాలోకి సులువుగా చేరిపోయేందుకు సహకరిస్తుంది. చాలామంది నియమబద్ధమైన జీవనశైలి లేని కారణంగా విజయాన్ని సాధించలేకపోతారు. స్వీయ మూడు రకాలుగా ఉంటుంది. భౌతిక క్రమశిక్షణ, మానసిక క్రమశిక్షణ,  ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనే మూడు విధాలుగా ఉంటుంది.  భౌతిక క్రమశిక్షణ:-  నిర్దిష్టమైన దైనందిన కార్యకలాపాలు, నియమిత ఆహారం, విశ్రాంతి, వినోదాలు, నిద్ర, నిర్దిష్టమైనపని, అన్నిచోట్ల క్రమశిక్షణతో మెలగడం వంటివి భౌతిక విధానానికి చెందిన స్వీయ క్రమశిక్షణలోకి వస్తాయి. మానసిక క్రమశిక్షణ:- అనవసరమైన వాటిపైకి దృష్టిని మరల్చి, మానసిక శక్తిని వృథాచేసే అన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండటమే మానసిక క్రమశిక్షణ. అతిగా దిగులు చెందడం, కృంగుపాటుకు గురవ్వడం, నిరాశ చెందడం, పగటి కలలు కంటూ ఉండటం వలన కూడా మానసిక శక్తి వృథా అవుతూ ఉంటుంది. ఏ విధమైన చంచలత్వానికి లోను కాకుండా నిర్దేశిత లక్ష్యంపై మనస్సును లగ్నం చేయాలి. అలాగే క్రమబద్ధమైన, తర్కబద్ధమైన ఆలోచనా విధానాలపై మనస్సుకి శిక్షణనివ్వాలి.  ఆధ్యాత్మిక క్రమశిక్షణ:- మనస్సుని ఏకాగ్రం చేయడంపై ఇచ్చే శిక్షణ కూడా మానసిక శిక్షణలోనిదే. "నేను యథార్థ సత్యాలను అభ్యసించను. నేను ఏకాగ్రతా శక్తిని, విషయ పరిత్యాగ శక్తిని సాధన చేస్తాను. అలా పరిణతి చెందిన మనస్సుతో విషయ గ్రహణానికి పూనుకొంటాను" అని స్వామి వివేకానంద వక్కాణించారు. స్వీయ క్రమశిక్షణను అలవరచుకొన్నవారికి అంతర్గత స్వేచ్ఛ, శక్తులు లభిస్తాయి. ఎంచుకొన్న ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించడంలో ఇవి తోడ్పడతాయి. నియమబద్ధమైన జీవనం లేనివారు అనవసర విషయాలలో సమయాన్ని వృథా చేసేవారు, సోమరిపోతు విద్యార్థులు తమ అలవాట్లకు తామే బలి అవుతూ, తమకేకాక ఇతరులకు కూడా సమస్యలు తెచ్చిపెడుతుంటారు. అందుకే మనిషి జీవితానికి స్వీయ క్రమశిక్షణ అనేది జీవితాన్ని మర్చివేసే మార్గం అవుతుంది.                                       ◆నిశ్శబ్ద.

రేడియోగ్రఫీ డే ఏమి చెబుతోంది?

ప్రపంచం అభివృద్ధి చెందడంతో పాటు వైద్య రంగం కూడా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఎన్నో రకాల ఆవిష్కరణలు మనిషి జీవితాన్ని సులువు చేస్తున్నాయి. నివారణ లేదు అనుకునే జబ్బులకు పరిష్కారాలు కనుగొనబడుతున్నాయి. వైద్య రంగంలో x-కిరణాలు ఉపయోగించడం ఒక అద్భుతం. ప్రజలకు వైద్యం చేయడానికి దాన్ని ఉపయోగించడం అపురూప ఘట్టం. ప్రపంచ రేడియోగ్రఫీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం నవంబర్ 8 న జరుపుకుంటారు, ఎందుకంటే ఇది X- కిరణాలు కనుగొనబడిన సందర్భాన్ని పురస్కరించుకుని వార్షికోత్సవాన్ని జరుపుకునే రోజు.    ప్రస్తుతం అభివృద్ధి చెందిన వైద్య రంగంలో ఈ x-కిరణాలు లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టం.   అనేక వైద్య రోగనిర్ధారణ సాధనాలకు పునాదిగానూ మరియు అనేక రకాల సమస్యలను కనుగొనడంలోనూ ఈ x-కిరణాలు వైద్యులకు సహాయపడతాయి.   నిమిషాల వ్యవధిలో వీటిని ఉపయోగించడగలగడం, రోగులకు ఎలాంటి నొప్పి తెలియనివ్వకుండా వీటితో వైద్యం చేయగలగడం వీటికి ప్రాధాన్యత పెరగడానికి కారణం.   ఇలాంటి రేడియోగ్రఫీ దినోత్సవాన్ని గురించి, దాని వెనుక ఉన్న చరిత్రను గురించి తెలుసుకోవాలి….  1895లో జర్మనీలోని వుర్జ్‌ బర్గ్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ విల్హెల్మ్ కాన్రాడ్ రోంట్‌జెన్ అనుకోకుండా ఎక్స్-కిరణాలను కనుగొన్నారు. రోంట్‌జెన్ తన ప్రయోగశాలలో కాథోడ్ కిరణాలతో పని చేస్తున్నప్పుడు  తన ట్యూబ్ సమీపంలోని టేబుల్‌పై స్ఫటికాల ఫ్లోరోసెంట్ గ్లోను గమనించాడు, అందులో ఒక గ్లో ఉంది.  ప్రతికూల మరియు సానుకూల ఎలక్ట్రోడ్లతో ఆ బల్బ్ ఉంది.   ట్యూబ్‌లోని గాలిని ఖాళీ చేసి, అధిక ఓల్టేజీని ప్రయోగించినప్పుడు, ట్యూబ్ ఫ్లోరోసెంట్ గ్లోను ఉత్పత్తి చేయడం ప్రారంభించింది.  ట్యూబ్‌ను నల్ల కాగితంతో కప్పి, ట్యూబ్‌కు కొన్ని అడుగుల దూరంలో ఉంచినప్పుడు పదార్థం ఆకుపచ్చ ఫ్లోరోసెంట్ లైట్‌ను ఉత్పత్తి చేస్తుందని అతను కనుగొన్నాడు.  ఈ పరిశీలనలతో, ట్యూబ్ కొత్త రకం కిరణాలను విడుదల చేస్తోందని, అది పేపర్ కవర్ గుండా వెళ్లి ఫాస్ఫోరేసెంట్ పదార్థాలను ఉత్తేజపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉందని అతను నిర్ధారించాడు.  ఈ కొత్త కిరణం అనేక పదార్ధాల గుండా వెళుతుందని, ఘన వస్తువులపై నీడలు పడుతుందని అతను కనుగొన్నాడు.  కిరణం మానవ కణజాలాల గుండా కూడా వెళుతుందని నిర్ధారించాడు.  ఈ ఆవిష్కరణ శాస్త్రీయ పురోగతికి ఎంతగానో ఉపయోగపడింది. ఈ కిరణాలు కనుగొన్న ఒక నెల తర్వాత చాలా మంది వైద్య సిబ్బంది ఐరోపా మరియు U.S.లో రేడియోగ్రాఫ్‌లను ఉపయోగించడం ప్రారంభించారు.  ఆరు నెలల తర్వాత, రేడియోగ్రాఫ్‌లు  గాయపడిన సైనికులకు సహాయం చేయడానికి యుద్ధభూమికి చేరుకున్నాయి.  వరల్డ్ రేడియోగ్రఫీ డే గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు.   1895 లో X-కిరణాలు కనుగొనబడ్డాయి అయితే ఈ కిరణాల ఆవిష్కరణ విచిత్రంగా జరిగింది.  రోంట్‌జెన్ ప్రమాదవశాత్తు ఎక్స్-కిరణాలను కనుగొన్నాడు.  1896 సంవత్సరంలో మొదటి సారి శస్త్రచికిత్స లో ఉపయోగించారు.   జాన్ హాల్-ఎడ్వర్డ్ అనే వైద్యుడు  ఒక శస్త్ర చికిత్సలో భాగంగా X-కిరణాలను ఉపయోగించాడు..  1999  ఖగోళ అనువర్తనాలు చేయబడ్డాయి.  చంద్ర ఎక్స్-రే అబ్జర్వేటరీ విశ్వంలో హింసాత్మక ప్రక్రియల అన్వేషణను అనుమతించడం ప్రారంభించబడింది.  2010 సంవత్సరం నాటికి, ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు బిలియన్ల వైద్య రేడియోగ్రఫీ పరీక్షలు నిర్వహించబడ్డాయి. ప్రస్తుతం 2022 నాటికి ఈ సంఖ్య, ఈ కిరణాల వినియోగం ప్రథమ స్థాయిలో ఉంది.                                         ◆నిశ్శబ్ద.

జ్ఞానప్రధాత గురునానక్!

ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజు గురునానక్ జయంతి కూడా వస్తుంది. గురునానక్ జయంతిని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను బట్టి  గురునానక్ ప్రకాష్ ఉత్సవ్, గురుపురాబ్, గురునానక్ దేవ్ జీ జయంతి అని కూడా పిలుస్తారు. ఈయన  సిక్కుమతం వ్యవస్థాపకుడు. ఈయన జన్మదినాన్ని యావత్ సిక్కు మతస్థులు అందరూ పండుగలా జరుపుకుంటారు.  గురునానక్ జయంతి రోజు గురునానక్ తన భోధనల్లో ప్రపంచానికి వినిపించిన ముఖ్య విషయాలను అందరూ గుర్తు చేసుకుంటారు. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో గురునానక్ జయంతిని జరుపుకుంటారు, ముఖ్యంగా పంజాబ్ రాష్ట్రంలో సిక్కు మతం విస్తృతంగా  ఉంది. ఈ ప్రాంతంలో గురునానక్ జయంతి గొప్ప వేడుకగా నిర్వహించబడుతుంది.  గురునానక్ జయంతిని ఎప్పుడు ?? ఎలా జరుపుకుంటారు?   గురునానక్ జయంతి సాధారణంగా అక్టోబర్-నవంబర్లలో పౌర్ణమి రోజున వస్తుంది.  2022 సంవత్సరం, నవంబర్ 8న  నాటికి ఈ జయంతి 553వ జయంతి గా నమోదు అయింది.  గురునానక్ జయంతి సిక్కు సమాజానికి ప్రతిష్టాత్మకమైనది.   గురునానక్ జయంతిని పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్  మొదలైన రాష్ట్రాలలో ముఖ్యమైన పండుగలలో ఒకటిగా భావిస్తారు.   సాధారణంగా గురుద్వారాలో గురునానక్ జయంతికి రెండు రోజుల ముందు వేడుకలు ప్రారంభమవుతాయి.  గురునానక్ జయంతికి ముందు రోజున 48 గంటల నాన్‌స్టాప్ సెషన్ కోసం ‘అఖండ మార్గం’ (దీని అర్థం ఆటంకం లేని ప్రార్థన) అని పిలువబడే గురు గ్రంథ్ సాహిబ్ పఠనం ప్రారంభమవుతుంది.  సిక్కు త్రిభుజాకార జెండాను పట్టుకున్న ఐదుగురు వ్యక్తుల నేతృత్వంలో ‘నాగర్‌కీర్తన్’ అనే ఊరేగింపు కూడా జరుగుతుంది.  ఈ పండుగ సాధారణంగా ‘ప్రభాత్ ఫేరిస్’ లేదా గురుద్వారాలో తెల్లవారుజామున ఊరేగింపులతో ప్రారంభమవుతుంది.  జెండాలు మరియు పూలతో అలంకరించబడిన వీధుల గుండా ఈ ఊరేగింపు కన్నుల పండుగగా సాగుతుంది.  పవిత్ర గురు  సాహిబ్‌ను పల్లకిలో ఉంచుతారు, అదే సమయంలో ప్రజలు సమూహాలుగా ఏర్పడి మతపరమైన శ్లోకాలు పాడుతూ సంప్రదాయ సంగీత వాయిద్యాలను వాయిస్తారు.  కొందరు తమ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను కూడా ప్రదర్శిస్తారు.  లాంగర్ మరియు సమాజ సేవ  సిక్కు సంప్రదాయంలో, 'లంగర్' అంటే భిక్షాటన గృహం లేదా పేదల కోసం ఒక స్థలం మరియు గురుద్వారాలోని కమ్యూనిటీ వంటగదికి పెట్టబడిన పేరు.  లంగర్ అనేది కులం, తరగతి, మతం లేదా లింగంతో సంబంధం లేకుండా  అవసరమైన ఎవరికైనా ఆహారాన్ని అందించే ప్రదేశం.  ఈ కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ ప్రతి ఒక్కరినీ గురు అతిథులుగా స్వాగతించడం.  సిక్కు సమాజం ముందుకు వచ్చి అవసరమైన వారికి గురుద్వారాల వద్ద ఆహారం మరియు ఆశ్రయం కల్పిస్తుంది.  మధ్యాహ్న భోజనాన్ని వాలంటీర్లు తయారు చేసి అందరికీ అందిస్తారు.  సిక్కు సంస్కృతిలో ఆహారాన్ని పంపిణీ చేయడం సమాజ సేవ (సేవా)లో భాగంగా పరిగణించబడుతుంది.  కడ ప్రసాదం ఈ పండుగ కోసం పెద్ద మొత్తంలో తయారు చేసి పంపిణీ చేసే సంప్రదాయ స్వీట్.  గురునానక్ జయంతి సందర్భంగా చూడవలసిన ప్రదేశాలు  భారతదేశంలో పండుగ జరుపుకోవడానికి ఉత్తమమైన ప్రదేశం అమృత్‌ సర్‌లోని గోల్డెన్ టెంపుల్, ఇక్కడ భక్తులు గురుద్వారాలో బస చేసి తమ గురువు ఆశీర్వాదం కోరుకుంటారు.  ఇక్కడ, అకల్ తఖ్త్ (అధికార స్థానాలు) ప్రతి సంవత్సరం గురునానక్ పుట్టినరోజున ప్రకాశిస్తుంది.  గోల్డెన్ టెంపుల్, అమృత్ సర్  గురుద్వారా నంకనా సాహిబ్ దేశ సరిహద్దులో ఉంది మరియు ఇది గురునానక్  జన్మస్థలం కాబట్టి ఏడాది పొడవునా యాత్రికులను ఆకర్షిస్తుంది. ప్రయాణికులు హిల్ స్టేషన్ గురు నానక్ జ్ఞాపకార్థం గురుద్వారా మణికరణ్ సాహిబ్‌ను కూడా నిర్మించింది.  పురాణాల ప్రకారం, ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు గురునానక్ మరియు అతని సిక్కుల సమాజం సందర్శించారు కాబట్టి ఇది భక్తులకు ప్రసిద్ధ ప్రదేశంగా మారింది.  గురుద్వారా సిస్ గంజ్ పాత ఢిల్లీలోని చాందినీ చౌక్‌ లో ఉంది. చక్రవర్తి ఔరంగజేబ్ తల నరికి చంపిన గురు తేజ్ బహదూర్ గౌరవార్థం నిర్మించబడింది.  ఇది ఢిల్లీలోని అత్యంత ప్రసిద్ధ సిక్కు తీర్థయాత్ర కేంద్రాలలో ఒకటి. గురుద్వారాలో ప్రార్థనా మందిరం ఉంది, రెండు అంతస్తుల నిర్మాణంతో పాటు గాజు షాన్డిలియర్లు మరియు ఎత్తైన పైకప్పు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు తమ  మతం పట్ల గొప్పగా గర్విస్తారు. భారతీయ జనాభాలో వీరు తక్కువ శాతం మందే ఉన్నా, వీరి ఉనికి కాపాడుకోవడానికి వీరి సంప్రదాయాలను పాటిస్తున్నారు.  గురునానక్  ఈ మానవాళికి అందించిన  జ్ఞానోదయమైన బోధనలను గుర్తుచేసుకోవడం ద్వారా ఈ సందర్భాన్ని మరింత అర్థవంతంగా మార్చుకుంటారు.                                       ◆నిశ్శబ్ద.

క్యాన్సర్ మీద యుద్ధ ప్రభంజనం!

నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే  భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 7 వ తేదీన జరుపుకుంటారు.  ఈ కాన్సర్ అవేర్నెస్ డే ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే క్యాన్సర్ యొక్క తీవ్రమైన ప్రమాదం గురించి ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఈ అవేర్నెస్ డే రోజున ఎంతో గొప్ప కృషి జరుగుతుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రజలలో మరణానికి కారణమయ్యే రెండవ అత్యంత ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్.  క్యాన్సర్‌తో మరణించే వారి పరిస్థితి భారతదేశానికి తీవ్రమైన ప్రమాదంగా ఉంది.   2020లో భారతదేశంలో 8.5 లక్షల మంది క్యాన్సర్‌తో మరణించారంటే దీని ప్రభావం ప్రజల జీవితాల్లోకి ఎంతగా చొచ్చుకుని పోయిందో అర్థం చేసుకోవచ్చు.  ఈ కారణంగా, ఈ రకమైన క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం నవంబర్ 7న నేషనల్ క్యాన్సర్ అవేర్‌నెస్ డే ని జరుపుకుంటారు.  దీని చరిత్ర ఏమిటి?  కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ మొదటిసారిగా 2014 సెప్టెంబరు నెలలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ప్రకటించారు. క్యాన్సర్ నియంత్రణపై రాష్ట్రస్థాయి ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఇందులో భాగంగా  ఉచిత స్క్రీనింగ్ కోసం మున్సిపల్ క్లినిక్‌లకు సందర్శించమని ప్రజలను ప్రోత్సహించాడు.  క్యాన్సర్  ప్రారంభ సంకేతాలు మరియు దానిని ఎలా నివారించాలి అనే దాని గురించి వివరాలను పొందుపరిచిన బుక్‌లెట్ కూడా అప్పుడు పంపిణీ చేసారు.  జరిగిన కృషి  ఈ ప్రాణాంతక వ్యాధికి వ్యతిరేకంగా దేశంలో ఒక ముఖ్యమైన అడుగు 1975లో  పడింది. దేశంలో క్యాన్సర్ చికిత్సను సులభతరం చేయడానికి  నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ ప్రోగ్రామ్‌తో ఈ అడుగు ప్రారంభమైంది.  10 సంవత్సరాల తర్వాత, 1984-85లో, ముందస్తుగా క్యాన్సర్‌ని గుర్తించడం, దాని నివారణపై దృష్టి సారించేందుకు ప్రణాళిక  విధానం సవరించబడింది. ఆ తరువాత దీని గురించి కృషి జరిగినా అది ప్రజలలోకి తీవ్రంగా చొచ్చుకుని వెళ్లలేకపోయింది. దానికి తగ్గట్టు అప్పటి దేశ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పరిష్కార మార్గాలు సులభతరం కాలేదు. ఆ తరువాత 2014 నుండి దీని గురించి అవగాహన పెంచడం మొదలుపెట్టారు.  ఈరోజే ఎందుకు?? భారతదేశంలో జాతీయ క్యాన్సర్ అవేర్నెస్ డే ని నవంబర్ 7 న జరుపుకోవడానికి కారణం.  రేడియోధార్మికశక్తిని కనుగొనడంలో  మేరీ క్యూరి చేసిన కృషి ప్రపంచం మరచిపోలేనిది. ఆమె జన్మదినాన్ని స్మరించుకుంటూ క్యాన్సర్ అవేర్నెస్ డే ని ఆమె పుట్టినరోజు అయిన నవంబర్ 7 న జరుపుకుంటున్నారు. క్యాన్సర్ గురించి కొన్ని భయానక గణాంకాలు, ఆసక్తికర విషయాలు...  పొగాకు (ధూమపానం ప్రత్యక్షం అయినా పరోక్షమయినా) వాడకం వల్ల భారతదేశంలో 3,17,928 మంది పురుషులు మరియు మహిళలు మరణిస్తున్నారు, ధూమపానం క్యాన్సర్‌కు దారి తీస్తుంది కాబట్టి దీనిని నివారించాలని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు.  2014 క్యాన్సర్ అవగాహన యొక్క ప్రాముఖ్యత పెంచడానికి జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని భారత కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తొలిసారిగా ప్రకటించారు 1975  క్యాన్సర్‌ను గుర్తించే కార్యక్రమాలను ప్రారంభించారు.  భారతదేశంలో క్యాన్సర్ చికిత్స సౌకర్యాలను అందించడానికి జాతీయ క్యాన్సర్ నియంత్రణ కార్యక్రమం ప్రారంభించబడింది  1911  నోబెల్ బహుమతి గ్రహీత మేరీ క్యూరీ గురించి అందరికీ తెలిసినదే. రేడియోధార్మికతలో ఆమె చేసిన కృషికి గుర్తింపుగా రసాయన శాస్త్రంలో రెండవ నోబెల్ బహుమతిని అందుకుంది. ఆమె చేసిన ప్రయత్నమే నేడు ఎన్నో రకాల క్యాన్సర్లు కనుగొనడానికి మార్గమవుతోంది.   1867  మేధావి పుట్టుక  మేరీ క్యూరీ, క్యాన్సర్ చికిత్స కోసం న్యూక్లియర్ ఎనర్జీ మరియు రేడియోథెరపీ అభివృద్ధికి దారితీసిన ఆమె కృషికి గుర్తుండిపోయే ప్రముఖ శాస్త్రవేత్త, వార్సా పోలాండ్‌లో జన్మించారు.  ఆమె పుట్టిన తేదీని భారతదేశంలో జాతీయ క్యాన్సర్ అవేర్‌నెస్ డేగా జరుపుకుంటున్నారు.                                       ◆నిశ్శబ్ద.

సమైక్యతా స్వరపు ఉక్కు సంకల్పం!

చిన్నప్పుడు ఆవు, పులి కథ పాఠంగా ఉండేది. మూడు ఆవులు కలసి మెలసి ఉండేవి. అవి ఎప్పుడూ కలని తిరిగేవి. కలిసి పచ్చిక మేయడానికి వెళ్ళేవి. అవి అలా కలసి ఉండటంతో వాటి దగ్గరకు వస్తున్న పులిని వాటి కొమ్ముల సహాయంతో తరిమి కొట్టేవి. కానీ ఆ ఆవుల మధ్య గొడవలు వచ్చాయి, ఒకదానికొకటి మాట్లాడుకోవడం మానేసాయి. అది గమనించిన పులి ఒక్కొక్క ఆవును చంపి తినడం మొదలుపెట్టింది. చివరికి ఆ ఆవులను అన్నిటినీ చంపి తినేసింది. ఆవులు కలసి ఉన్నప్పుడు వాటిని ఏమి చేయలేని పులి అవి విడిపోగానే వాటిని చంపేసింది. అంటే కలసి ఉన్నప్పుడు ఆవుల బలం ఎక్కువ, కానీ విడిపోగానే పులి బలం ఎక్కువయ్యింది.  ఇదే విధంగానే ఇంకొక కథ ఉండేది. ఒక తండ్రి తన కొడుకులు ఆస్తి పంచుకుని విడిపోవడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుకుని బాధపడి వాళ్ళను పిలిచి  ఒక్కొక్కరికి ఒకో కర్ర ముక్క ఇచ్చి దాన్ని విరచమని చెబుతాడు. వారు ఎంతో సులభంగా విరిచేస్తారు. ఆ తరువాత కట్ట కఱ్ఱముక్కలు ఇచ్చి విరచమంటే విరచలేరు. కారణం కలసికట్టుగా ఉంటే బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈ రెండు కథలు అందరికీ తెలియజేసేది ఒకటే…. ఐకమత్యంగా ఉంటేనే అది గొప్ప శక్తిగా అవుతుంది అని.  జాతీయ సమైక్య దినోత్సవం వెనుక కూడా ఇలాంటి కారణమే ఉంది. భారత మొదటి హోంశాఖ మంత్రి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా దీన్ని నిర్వహిస్తున్నారు.  వల్లభాయ్ పటేల్ జయంతికి సమైక్యతా దినోత్సవానికి లింకేంటి?? భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో తనదైన ముద్ర వేసిన వల్లభాయ్ పటేల్ లో న్యాయకత్వ నైపుణ్యాలు చాలా ఎక్కువ. ఈయన దేశాన్ని నడిపించడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. ముఖ్యంగా స్వాతంత్య్రం తరువాత 1947 సంవత్సరంలో జరిగిన భారత్- పాక్ యుద్ధ సమయంలో భారతదేశానికి సమర్థమంతమైన వ్యూహాన్ని అందించినవాడు ఈయన. ఈయనలో ఉన్న నైపుణ్యం ఫలితంగా ఈయనను "సర్దార్" అనే పేరుతో పిలుచుకుంటారు. ఇది మాత్రమే కాకుండా ఐక్యతలో ఉన్న గొప్పదనాన్ని గుర్తించిన ఈయన బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించిన తరువాత  అనేక రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్‌లో చేరేలా చేయడంలో  చేసిన కృషి మరచిపోలేనిది. ఇది భారతదేశం మొత్తం ఐక్య దేశంగా అవతరించడానికి మూలకారణం అయ్యింది.   ఒకటా రెండా బ్రిటీష్ ఆధిపత్యం నుండి విడుదలైన 565 స్వయం పాలక సంస్థానాలలో దాదాపు ప్రతి ఒక్కటి భారత యూనియన్‌లో చేరడానికి ఒప్పించిన అద్భుతమైన నైపుణ్యం  ఈయనదే…. ఇంతటి అసాధ్య పనిని సుసాధ్యం చేసినందుకు గానూ ఈయనను "భారతదేశపు ఉక్కు మనిషి" అనే బిరుదుతో ఎంతో ఆత్మీయంగా పిలుచుకుంటారు. 2014 సంవత్సరంలో అత్యంత ఎత్తైన ఉక్కు విగ్రహాన్ని ఆవిష్కరించింది మోదీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం హాయంలో ఆ సందర్భంగానే సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవం లేదా  రాష్ట్రీయ ఏక్తా దివస్ ను దేశ వ్యాప్తంగా జరుపుకోవాలని ప్రకటించారు. అప్పటినుండి భారతదేశంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 31 తేదీ సర్ధార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అధికారిక ప్రకటనలో  ఏ బెదిరింపులకు లోనూ కాకుండా దేశం యొక్క స్వాభావిక బలం మరియు స్థితిస్థాపకతను పునరుద్ఘాటించే అవకాశాన్ని కల్పిస్తుంది. మన దేశ ఐక్యత, సమగ్రత మరియు భద్రత గురించి దేశం మరొక అడుగు ముందుకు వెళ్లే దిశగా ఆలోచనలు, సరికొత్త ఆచరణలు చేపడుతుంది.  మరొక ముఖ్య విషయం ఏమిటంటే జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిజ్ఞ చేయబడుతుంది. దాని సారాంశం ఎలా ఉంటుందంటే…. "జాతి ఐక్యత, సమగ్రత భద్రతను కాపాడటానికి నన్ను నేను అంకితం చేస్తానని, నా తోటి దేశస్థులలో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి తీవ్రంగా కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా దేశం యొక్క ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్  దార్శనికత, ఆయన జీవించి ఉన్న కాలంలో చేపట్టిన  చర్యలు గుర్తుంచుకొని నా దేశం యొక్క అంతర్గత భద్రత విషయంలో నా స్వంత సహకారం అందించాలని నిర్ణయించుకున్నాను" అనే ప్రతిజ్ఞ చేయబడుతుంది. అధికారిక ఉత్తర్వుల ప్రకారం, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు (PSUలు). మరియు ఇతర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను పాటించేందుకు అక్టోబర్ 31న ప్రతిజ్ఞ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థులకు రాష్ట్రీయ ఏక్తా దివస్ ప్రతిజ్ఞను నిర్వహించేందుకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా జాతీయ సమైక్యతా దినోత్సవం వెనుక భారతదేశ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి అనిర్వచనీయమైనదిగా ఉంది.                                      ◆నిశ్శబ్ద.

ఆహారమే ఆరోగ్యమంటారు ఎందుకు?

ఆరోగ్యానికి ఆయువుపట్టు మనం తీసుకునే ఆహారం. ఆహారం నియమబద్ధంగా ఉండాలి. మనం బ్రతకడానికి తినాలి. అంతే కానీ తినడం కోసమే బ్రతకకూడదు. పౌష్టికాహారాన్ని నియమబద్దంగా తీసుకుంటూ తగు మోతాదులో శరీర వ్యాయామం చేసుకుంటూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలి. ఈ నియమబద్ధమైన ఆహారం కొందరికి మాత్రమే పరిమితం కాదు. ఇది అన్ధశ్రీ హక్కు. దీన్ని అందరూ తీసుకోవాలి. క్రొవ్వు పదార్థాలను పూర్తిగా నిషేధించాలి. విటమిన్స్ సమృద్ధిగా ఉండే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. మితంగా తినాలి, బాగా పనిచేయాలి. ఎప్పుడూ హుషారుగా ఉండాలి. మన శరీరంలోని కణాలు నిర్వీర్యం కాకుండా పోషించేవి విటమిన్స్. న్యూట్రిషన్ ఫుడ్ అంటే సంపూర్ణాహారం తీసుకోవాలి. పాలు, పండ్లు, సంపూర్ణ ఆహారం క్రిందకు వస్తాయి. నువ్వెంత తిన్నావని కాదు ప్రశ్న. ఏ రకమైన ఆహారం తీసుకున్నావన్నది ముఖ్యం. మనం తీసుకునే ఆహారం మనకు ఆరోగ్యదాయకం కాకపోయినా మనకు అనారోగ్యాన్ని చేకూర్చకూడదు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి.  బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏమిటి? అని చాలా మంది సందేహం. మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్, కార్బొహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్, క్రొవ్వు పదార్థాలు ఉండాలి. ప్రతి వ్యక్తికి కొంతశాతం అంటే కొన్ని కేలొరీల శక్తి గల ఆహారం కావాలి. కేలొరీల శక్తి మరీ తగ్గకూడదు. మరీ హెచ్చు కాకూడదు. రెండూ కూడా మన ఆరోగ్యానికి హానికరమే ! సామాన్యంగా మనం తీసుకునే ఆహారంలో తక్కువ కేలరిక్ వేల్యూ ఉండాలి. న్యూట్రిషన్ వేల్యూ, ఫుడ్ వేల్యూ హెచ్చుగా ఉండాలి. ముందుగా పౌష్టికాహారానికి కావలసింది ప్రోటీన్స్. అవి బాగా ఉండేలా చూసుకోవాలి. శరీరానికి బలం చేకూర్చడానికి ప్రోటీన్స్ తో పాటు, కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం. చాలా మందికి కార్బొహైడ్రేట్స్ మూలంగా లావెక్కుతారనే అపోహ ఉంది. ఎక్కువగా ఏ రకమయిన ఆహారం తీసుకున్నా ప్రమాదమే. కొవ్వు పదార్థాలను కూడా మితిమీరి తీసుకోరాదు. నిజానికి శరీర దారుఢ్యతకు కొవ్వు ఎంతో అవసరం. కొవ్వు పదార్థాలను అసలు తీసుకోకపోవటం కూడా హానికరమే. కనుక మన నియమిత ఆహారంలో కొవ్వు పదార్థం కూడా తీసుకోవాలి. అలాగని ఎక్కువగా తీసుకోకూడదు.  మనం తీసుకునే ఆహారంలో హెచ్చుభాగం పండ్లు ఉండేటట్లు చూసుకోవడం మంచిది. కూరగాయలు అధికంగా తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో హెచ్చుగా విటమిన్స్ లభ్యమవుతాయి. మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి. తాజా ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. టొమోటాలు, దోసకాయ, పాల కూర మొదలయిన వాటిలో హెచ్చుగా కాల్షియం ఉంటుంది. ఐరన్ ఉంటుంది. కెరోటిన్, రిబోఫ్లోవిన్, విటమిన్ 'సి' ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి మంచిది.  తాజాపండ్లు ఆరంజ్,  ఆపిల్, బొప్పాయి తింటే ఆరోగ్యకరమైన చర్మం ఏర్పడుతుంది. లెమన్ జ్యుస్ కూడా మంచిదే. అందులో విటమిన్ 'సి' ఉంటుంది. అది ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుతుంది. చర్మం బాగుండాలని అనుకుంటే నిమ్మరసం తీసుకోవాలి. ఎక్కువగా కాఫీ, టీ తాగకూడదు. చల్లని పానీయాలు ఆరోగ్యానికి హానికరం ఎక్కువగా తీసుకోరాదు.నీరు పుష్కలంగా తాగాలి. పైన చెప్పుకున్న  ఆహారం తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా, ఆనందంగా, అందం సొంతం చేసుకోవచ్చు.                                          ◆నిశ్శబ్ద.

విటమిన్లు ఎందుకు ముఖ్యం?

ప్రతి మనిషికి ఆరోగ్యం అనేది చాలా అవసరం...! ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చెయ్యగలం...! ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సమృద్ధిగా అందాలి. అంటే  పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాల్సిందే...! ఏమి తింటున్నాం అన్నది కాదు మనం తినే ఆహారంలో ఎంత శాతం మనకు ఆరోగ్యకరమైన పోషకాలు అందుతున్నాయి అన్నది ముఖ్యం. అందుకే ఆహారంలో పోషక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉండగలం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మనకు ఎ,బి,సి, డి, ఇ విటమిన్లు ఉన్నాయని తెలుసు. ముఖ్యంగా విటమిన్ 'ఎ' వలన సౌందర్యం అంటే శరీర ఆరోగ్యం అనే ముందుగా జ్ఞాపకం వస్తుంది. అంటే అందాన్ని పెంచే విటమిన్ గా విటమిన్ 'ఎ' ని వర్ణించవచ్చు. అయితే శరీరం ఆరోగ్యంగా ఉంటేనే అందాన్ని కాపాడుకోగలం. అన్ని విటమిన్లు సమానముగా వినియోగించినప్పుడే సరిగా ఫలితాలు వుంటాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి విటమిన్ అవసరమే. ఒక్కొక్క విటమిన్ యొక్క ఉపయోగాలు చెప్పాలంటే... విటమిన్ 'ఎ'  'ఎ' విటమిన్ చర్మము మీద పనిచేస్తుంది. చర్మం ఆరోగ్యవంతంగా ఉండాలంటే విటమిన్ 'ఎ' చాలా అవసరం. విటమిన్ 'ఎ' వెంట్రుకల్ని, కంటిచూపుని సంరక్షిస్తుంది. ఇది మనకు ఆహారంలో పాలు, లివర్, కేరట్, క్యాబేజీ, ఆకుకూరలు, వెన్న, గ్రుడ్లు, టమోటా, మీగడలలో లభిస్తుంది.  విటమిన్ 'ఎ' గల ఆహారం చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచగలుగుతుంది. చర్మ సంరక్షణ మీద ఆసక్తి ఉన్నవారు విటమిన్ 'ఎ' గల ఆహారం తీసుకోవటం చాలా అవసరం. మన చర్మతత్వాన్ని బట్టి కూడా మన ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చు. విటమిన్ 'బి'  ఇది ఎనిమిది విటమిన్ల సంయోగము. ఇది శరీరంలో నెర్వస్ సిస్టమ్ను బలపరుస్తుంది. అంతే కాదు ఆ సిస్టంను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. మీకు ఆరోగ్యానికి అందమైన చర్మానికి విటమిన్ 'బి' కలిగిన ఆహారం అవసరం.  విటమిన్ బి లభించే పదార్థాలు కొన్ని చెప్పుకుంటే వాటిలో ధాన్యము, లివర్, ఆకుకూరలు, పచ్చిగుడ్ల సొన మొదలయినవి. విటమిన్ 'సి'  శరీరంలో టిష్యూలను బలంగా, ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. విటమిన్ 'సి' పళ్ళ చిగుళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. దీన్ని నిమ్మజాతి పళ్ళ నుండి పొందగలం. విటమిన్ సి అధికంగా గల ఆహారం తీసుకోవటం అవసరం. విటమిన్ 'సి' పండ్లలో, టమోటా, లివర్, క్యాబేజి, ఎర్రమిరపకాయ, కాలీఫ్లవర్, స్ట్రాబెర్రీ పండ్లలో లభిస్తుంది. ఇది ఇమ్యూనిటిని బాగా పెంచడంలో తోడ్పడుతుంది. విటమిన్ 'డి'  మీ దంతములు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ 'డి' వాడాలి. దీనివలన దంతములు, ఎముకల మూలములు గట్టిబడి ఆరోగ్యవంతంగా ఉంచగలవు. అట్లాగే పిల్లల ఎముకలు దృఢంగా పెరగాలంటే విటమిన్ 'డి' చాలా అవసరం. విటమిన్ 'డి' లభించే పదార్థాలను చూస్తే వాటిలో చేపలో, గ్రుడ్లలో, మీగడలో, కాడ్వర్ ఆయిల్ మొదలైనవాటిలో  'డి' విటమిన్ లభిస్తుంది. అట్లాగే సూర్యరశ్మిలో 'డి' విటమిన్ అధికంగా ఉంటుంది. అందుకే రోజులో కొద్దిసేపు లేత సూర్యకిరణాలు శరీరం మీద పడేలా ఉండాలని చెబుతారు. విటమిన్ 'ఇ'  విటమిన్ 'ఇ' రక్తప్రసారాన్ని శరీరంలో సక్రమంగా ఉండేలా చూస్తుంది. విటమిన్ 'ఇ' ఎక్కువగా క్యారెట్, క్యాబేజి, ఆలివ్, రొట్టె, తాజాకూరలు, జీడిపప్పు మొదలైన వాటిలో లభిస్తుంది. ఈ విధంగా ఎ, బి, సి, డి, ఇ మొదలైన విటమిన్ గల ఆహారం తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నిత్యం ఆరోగ్యంగా ఉండవచ్చు.                                 ◆నిశ్శబ్ద.

చీకటి వెలుగుల రంగేళి!

దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. వెలుగుతున్న దీపాలు చూస్తే ఎంత సంతోషమో, సంతోషంగా ఉన్న జీవితాలను చూస్తే కూడా అంతే సంతోషం కలగాలి మనుషులకు. కానీ అది నిజమేనా…. ఇప్పట్లో సంతోషంగా ఉన్న జీవితాలను చూస్తే సంతోషపడేవారు ఉన్నారా?? అస్తమాను ఎదుటివారి జీవితాలను చూసి కుళ్ళుకుంటూ ఓర్వలేనితనం పెంచుకునే వారే అడుగడుగునా కనబడుతూ ఉంటారు. అయితే జీవితంలో చీకటి, వెలుగు అనేవి ఒకదాని తరువాత ఒకటి వస్తూ వుంటాయని. అవి మనిషి జీవితములో కష్ట సుఖాలలాగే వచ్చి పోయేవి అనే విషయాన్ని స్పష్టం చేయడానికే ఈ ఉపమానాన్ని ప్రస్తావిస్తారని చాలామంది పెద్దలు చెబుతారు.  చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి అని ఒక కవి రాసాడు. చీకటి వెలుగు కష్ట సుఖాల్లాంటివి అవి రెండూ ఉన్న జీవితమే పండుగలా ఉంటుంది. మనిషి ఎప్పుడూ సంతోషమే కోరుకుంటాడు. దుఃఖాన్ని ఎవరూ కోరుకోరు. కనీసం ఊహకు కూడా ఆ విషయం రాదు. కానీ ఎదుటి వాడికి మాత్రం సంతోషాలు వస్తే మనసులో రగిలిపోతాడు, అదే కష్టాలు వస్తే లోలోపల పొంగిపోతాడు. కానీ ఎవరికైనా సరే ఎప్పుడూ సంతోషాలు జీవితంలో ఉంటే నిజానికి సంతోషం విలువ తెలుస్తుందా??  ఒక పిల్లాడికి ప్రతిరోజూ నచ్చిన ఆహారం పెడుతున్నారు. వాడికి నచ్చనిది దూరం జరిపి వాడు తినాలని అనుకున్నదే పెడుతున్నారు. కానీ ఒకరోజు వాడు అందుబాటులో లేని ఆహారం అడిగాడు. వేరే ఎన్ని ఖరీదైనవి చూపించినా వాడికి మాత్రం అదే కావాలనే మొండితనం. తనకు కావలసింది ఇవ్వలేదని తల్లిదండ్రుల మీదా ద్వేషం. దేన్నీ లక్ష్యపెట్టని నిర్లక్ష్యం. కోరుకున్నది దక్కకపోతే ఉన్మాదంగా మర్చివేస్తాయి అనే విషయాన్ని మాత్రమే కాదు, అసలు అనుకున్నది, కోరుకున్నది జరగకపోతే ఎలా ప్రవర్తించాలో ఆ పిల్లవాడికి ఏమీ తెలియకుండా పెరగడానికి కారణం అయ్యింది ఆ తల్లిదండ్రులు చేసిన పని.  నచ్చింది ఇవ్వడం ఆ తల్లిదండ్రులు చేసిన తప్పు కాదు కానీ ఏదైనా అనుకున్నది జరగకపోతే దాన్ని ఎలా తీసుకోవాలి?? వ్యక్తిత్వం ఎలా ఉండాలి వంటి విషయాలు పిల్లలకు నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది. అందుకే అంటారు సంతోషాన్ని మాత్రమే కాదు పిల్లలకు కష్టాన్ని కూడా పరిచయం చెయ్యాలి అని. కష్టాన్ని వారికి పరిచయం చేసినప్పుడే, వారికి సంతోషం గురించి ఒక స్పష్టమైన అర్థం, అవగాహన కలుగుతాయి. కష్టాన్ని ప్రేమించాలా?? అవును కష్టాన్ని ప్రేమించాలి. ప్రతి కష్టం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. సంతోషం మనిషిని వాస్తవ ప్రపంచం నుండి దూరంగా లాక్కుని వెళితే కష్టం వారికి వాస్తవ ప్రపంచంలో నిజానిజాలను పరిచి చూపిస్తుంది. అందుకే మనిషికి సంతోషం కంటే కష్టం చేసే మేలు ఎక్కువ. ప్రతి కష్టాన్ని చీకటితో పోలుస్తారు. అందుకే చీకటి ఉంటేనే వెలుగుకు అయినా విలువ ఉండేది అని చెబుతారు. అంటే ఇక్కడ కష్టం అనేది మనిషిని ఇబ్బంది పెట్టకపోతే దాని తరువాత వచ్చే సంతోషాన్ని మనిషి ఆస్వాదించలేడు. అందుకే కష్టాన్ని కూడా ప్రేమించాలి అని చెప్పేది.  కష్టాన్ని నమ్మిన వాడు, కష్టపడేవాడు ఎప్పటికీ చెడిపోడు. కష్టాలు ఉన్నాయంటే బాధపడుతూ ఉండేవారు కష్టానికి తగిన పలితం తప్పకుండా ఉంటుంది అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటే కష్టాలలో ఉన్నప్పుడు కూడా తరువాత సంతోషమొస్తుంది అనే ఆశావహ భావన మనిషిని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిచేలా చేస్తుంది. అప్పుడు ఖచ్చితంగా అందరూ ఒప్పుకుంటారు. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి అని. కష్టసుఖాలతో సాగే జీవితమే నిజమైన పండుగలాంటిది కాదంటారా??                                       ◆నిశ్శబ్ద.

పరామర్శకులు చేస్తున్న పొరపాట్లు ఏమిటో తెలుసా?

కొందరికి అవతలివారిని చూసీ చూడటంతోటే పరామర్శించాలనే బుద్ధి పుడుతుంది. ఈ చేసే పరామర్శకు అట్టే అర్థం కూడా ఉండదు. అవతలివాడిని మరింత బాధకు గురిచేయడానికే పనికి వస్తుంది. చిక్కిపోయినట్లున్నారే అంటాడు. నిజానికి ఇతడు చేయగలిగిన సహాయమంటూ ఏమీ వుండదు. అవతలవాడికి ఆ మధ్య వచ్చిపోయిన జ్వరాన్ని గుర్తుకు తీసుకురావడానికి మాత్రమే ఉపకరిస్తుంది. అది గుర్తు వచ్చేసరికి అసలే బలహీనంగా వున్న మనిషి మరింత నిస్త్రాణకు గురవుతాడు. తనకు ఫలానా జబ్బు వచ్చిన కారణం చేత చిక్కిపోయానని అతడు తన “నేరం” ఒప్పుకునే వరకూ ఇతడా "చిక్కడం" గురించి అంటూనే వుంటాడు. ఆ వ్యక్తి తనుపడ్డ బాధంతా సవివరంగా చెప్పి, అదంతా తలపోసుకున్నందువల్ల మరింత నీరసించిపోతాడు. అంతా విని ఇతడు చేసేదేముంటుంది? ఏమీ వుండదు. "ఆయుర్వేదంలో దీనికేదో మందున్నదండీ. సమయానికి గుర్తురావడం లేదు. మొన్న మా బావమరిది వాడాడు. కనుక్కొని చెప్తాను" అనో, లేదంటే ఏదో కరక్కాయ వైద్యమొకటి చెప్పి, ఆ వ్యక్తి “ప్రయత్నించి చూస్తా"ననే వాగ్దానం ఇచ్చేవరకూ వదలకుండా వెంటాడి, ఆ తర్వాతగానీ అక్కడనుండి వెళ్ళడు. తాను వైద్యుడు కానప్పుడు తనకా వ్యాధి అనుభవం లేనప్పుడు తను చేసేదేముంటుంది? వ్యాధినుండి కోలుకుంటున్న వారు ఇతడి పాలిటబడితే మరింత వ్యధకు లోనవుతారు. ఈ సానుభూతిపరుడు పెట్టే బాధ, ఒక్కోమారు వ్యాధి బాధను మించిపోతుంటుంది. ఈ పద్ధతికి పూర్తిగా భిన్నంగా ప్రవర్తించేవారు మరికొందరు. ఎవరికి యే జబ్బూ వున్నదనే మాటనే తొలుత అంగీకరించరు. ప్రతివారినీ పది సూర్య నమస్కారాలు చేయమని సలహా ఇస్తుంటారు. పిడుక్కూ బియ్యానికీ ఒకే మంత్రమన్నట్లు వ్యాధి ఏదైనప్పటికీ సూర్యనమస్కారాలే “ప్రిస్క్రైబ్" చేస్తారు. " మా వ్యాధి ఇదండీ" అని ఎవరైనా అన్నప్పుడు, కాసేపు ఆలోచించి నమస్కారాల సంఖ్యను ఎక్కువచేసి చెప్తారు. వారి దృష్టిలో మనమందరం వ్యాధులను ఊహించుకునే రోగిష్ఠి మనస్తత్వం గల వాళ్ళం. అందుచేత మానసిక శారీరక రుగ్మతలకన్నిటికీ ఈ సూర్య నమస్కారాలే చికిత్స అని వారి అభిప్రాయం.  " మేము నేర్పుతాం. ప్రొద్దున్నే ఇంటికి వచ్చి నేర్పమంటారా?” అని బలవంతం చేస్తారు. బలహీనులు, రోగిష్ఠులు వీరికో పది నమస్కారాలు పెట్టి వదిలించుకోకపోతే, వీరిద్వారా చాలా బాధకు గురవవలసి వస్తుంది. రోగులకు ప్రోత్సాహకరమైన మాటలు చెప్తే మానసికోల్లాసం కలుగుతుందనీ, ఆ విధంగా వారి వ్యాధి వేగంగా తగ్గి పోతుందనే విశ్వాసం కొందరిది. దీనినొక విధానంగా రూపొందించి అమలు జరుపుతుంటారు. రోగిలో వ్యాధి కాస్త వెనక్కు తీస్తుంటే, ప్రోత్సాహకరమైన మాటలకు కాస్త ప్రయోజనముంటుంది. అలాంటిదేమీ లేనప్పుడు ఈ విధానాన్ని ప్రయోగిస్తే అసందర్భంగా ఉంటుంది. కాస్త తగ్గితే మరింత తగ్గినట్లుగా మాట్లాడే వీలుంటుంది కానీ అసలేమాత్రం మార్పు కనిపించనప్పుడు ఏదో ఉత్సాహం కలిగించడానికి వెర్రిగా మాట్లాడితే ఎవరికైనా విసుగు జనిస్తుంది. ఫ్రెంచి ఆర్టిస్ట్ జీన్ లూయీ పోరైన్ మరణశయ్యపై ఉన్నాడు. బంధువులు అందరూ చుట్టూ చేరి అతడికేవో ఆశావహమైన మాటలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. భార్య తన దుఃఖాన్ని దిగమ్రింగుకుంటూ “కాస్త తేటగానే కనిపిస్తున్నారండీ" “ ముఖం పీక్కుపోయినట్లున్నప్పటికీ నాలుగు రోజులనాటి ఉబ్బు లక్షణాలు అన్నది. "తగ్గినట్లున్నై, అంటే జబ్బు వెనక్కు తీస్తున్నదన్నమాట" అన్నాడు బావమరిది.  "నిన్నా మొన్నటికన్నా ఊపిరి కాస్త తేలిగ్గా తీసుకోగలుగుతున్నారనుకుంటాను" అన్నాడు కుమారుడు. పోరైన్ నీరసంగా నవ్వి "అదృష్టవంతుణ్ణి సుమా! వ్యాధి నిర్మూలమయింతర్వాతే నాకు మరణం ఆసన్నమవుతున్నట్లున్నది" అన్నాడు. ఇదీ నేటి కాలంలో మనుషులు ఇతరుల విధానంలో ప్రవర్తించే తీరు.                                     ◆నిశ్శబ్ద

ఆహార వీధికి ప్రతినిధులు వీళ్ళు!

సాధారణంగా వీకెండ్ వచ్చింది అంటే అందరూ చేసే పని బయటకు వెళ్లి తినడం. ఇప్పటి కాలంలో చిన్న చిన్న హోటల్స్ కు వెళ్లడం అంటే ఎంతోమందికి నామోషీ. అదే రెస్టారెంట్ లకు అయితే ఎగిరి గంతేస్తారు. రెస్టారెంట్ లలో ఆహారపదార్థాల రుచి మాత్రమే కాదు వారు వాటిని అందించే తీరు, వడ్డించే విధానం కూడా చాలా ప్రత్యేకం. కానీ చాలామంది రెస్టారెంట్ ఫుడ్ లో ధర మాత్రమే ఎక్కువ అని అంటూ ఉంటారు. సాధారణంగా బయట చిన్న చిన్న హోటల్స్ లో, బండ్ల మీద దొరికే ఆహారపదార్థాలు మినహాయిస్తే  రెస్టారెంట్ లలో తయారయ్యే ఆహారపదార్థాలు ఎంతో ప్రత్యేకమైనవి. ఆ వంట గదుల నుండి బయటకు వచ్చే ఎన్నో పదార్థాలు నిపుణుల చేతుల్లో రూపుదిద్దుకున్నవి. టీవీ లలో సాధారణంగా మాస్టర్ చెఫ్ అని ఇంకా వేరు వేరు రకాల వంటల పోటీల ప్రోగ్రామ్స్ వస్తుంటాయి. వాటిలో కూడా మాస్టర్ చెఫ్ ఇండియా ఎంతో పేరు పొందింది. దాన్ని చూసిన వారందరికీ చెఫ్ అంటే ఎలాంటి పరిస్థితులలో ఎలాంటి ఆలోచనలు చెయ్యాలి?? వంటల విషయంలో ప్రతీది ఎలా జాగ్రత్త తీసుకోవాలి. అనుకున్న ఔట్ ఫుట్ రావడానికి ఎంత కష్టపడాలి?? వంటి ఎన్నో విషయాలు అర్ధమయ్యే ఉంటాయి.  రెస్టారెంట్స్ లో చెఫ్స్! రెస్టారెంట్ లలో చెఫ్స్ ఉద్యోగం అంటే అదేదో మనం తినడానికి వెళ్ళినప్పుడు ఏసీ గదుల్లో కూర్చుని ఎంజాయ్ చేసినట్టు ఏమి ఉండదు. చిన్న కాకా హోటల్ నుండి పెద్ద రెస్టారెంట్స్ వరకు ప్రతి ఒక్కచోట వంట చేసేవారు ఉడికిపోతున్న వంట గదిలో వేడిని భరిస్తూ వంట చేయాల్సిందే… ఆహారం మీద మక్కువే ఈ మార్గం వైపు! చెఫ్స్ గా మారడం వెనుక ఎంతో మందిని తమ అభిప్రాయాలు అడిగి చూసినప్పుడు వచ్చే సమాధానాలలో చాలా వరకు ఆహారం మీద ఉన్న ఇష్టమే వారిని చెఫ్స్ అనే వృత్తి వైపుకు తీసుకెళ్తోంది అనే విషయం తెలుస్తుంది. ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏయస్, ఐపిఎస్ వంటి పెద్ద పెద్ద గోల్స్ లో పరిగెడుతున్న యువత ఆహారం మీద ఇష్టం, విభిన్న రకాల రుచులను రుచిచూడాలనే అభిలాషతో గరిట చేతబట్టి నలభీములు అవుతున్నారు. నిరంతర ప్రయోగాలు, ఆవిష్కరణలు! ప్రతి వంటకం అన్నిచోట్లా దొరకదు. అది కొందరి చేతుల్లో రూపుదిద్దుకుంటుంది. వంట గదిలో నిరంతరం ప్రయోగాలు చేసే కొందరు చెఫ్స్ కొత్త కొత్త వంటకాలు ఆవిష్కరిస్తూ ఉంటారు. వాటి ఖరీదు కూడా ఎక్కువ ఉంటుంది. వాటి పేటెంట్ హక్కుల దృష్ట్యా రెస్టారెంట్ వారికి కూడా మంచి ఆదాయం ఉంటుంది. అంతేకాదు ఏ ఉద్యోగంలోనూ లేని తృప్తి చెఫ్ గా మారడంలో ఉంటుంది. తిన్నవారు ఆ వంటను మెచ్చుకుని తృప్తి పడినప్పుడు ఓ చెఫ్ గా విజయవంతమైనట్టు. వండి పెట్టడం పెద్ద కష్టం కాదులే అనుకునేవారు చాలామంది ఉంటారు. చెఫ్ అంటే అదేదో చులకన భావం చూపించే వారు కొందరుంటారు. అయితే ఏ పని కూడా అవగాహన లేకుండా చేసేది కాదు. ముఖ్యంగా ఆహారపదార్థాన్ని ముందు వెనుకలు చేసి వండే ప్రక్రియ అంతకన్నా లేదు. ప్రతి చిన్న విషయానికి బాధ్యత అనేది ఎంతో ముఖ్యం. ఓ రెస్టారెంట్ కి, అందులో ఒక ఆహార పదార్థానికి ఓ మంచి పేరు వచ్చిందంటే దాని వెనుక ఖచ్చితంగా ఓ చేయి తిరిగిన నలభీముడు ఉన్నాడని అర్థం. అందుకే ఎక్కడైనా ఆహారం నచ్చితే ఆ చెఫ్ ను మనసారా అభినందించండి.                                           ◆నిశ్శబ్ద.

మంచి ఆరోగ్యానికి ఇవి పాటించడం తప్పనిసరి!

ప్రతి మనిషికి ఆరోగ్యం అనేది చాలా అవసరం...! ఆరోగ్యంగా ఉంటేనే ఆ మనిషి దేనినైనా సాధించగలడు...! ప్రస్తుత కాలంలో ఆరోగ్యం అంటే సాధించాల్సిన గొప్ప విషయం అయిపోయింది చాలామందికి. కారణం ఏమిటంటే చిన్న వయసు నుండే మెల్లి మెల్లిగా ఆరోగ్య సమస్యలు చిగుర్లు వేస్తాయి. పాతిక సంవత్సరాల వయసు వచ్చేసరికి సమస్యల వయలం చుట్టూ ముడుతుంది. ఇక 30 ఏళ్ళు దాటితో జబ్బులు, వ్యాధులతో సహవాసం చేస్తూ సంసారపు బండి లాగాల్సి వస్తోంది. అయితే మనం కొన్ని చిట్కాలు పాటించినట్లయితే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండగలం...! అందుకోసం మనం చెయ్యాల్సిన మొదటి పని తీసుకునే ఆహారంలో ఎక్కువ భాగం  పండ్లు తీసుకోవడమే...! పండ్ల కంటే కూరగాయలు మరింత అధికంగా తీసుకోవాలి...! ఎందుకంటే వాటిలో ఎక్కువగా  విటమిన్లు లభ్యమవుతాయి. మినరల్స్ కూడా ఇందులో ఉంటాయి. విటమిన్స్, మినరల్స్ అనేవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. షుగరు వాడేటప్పుడు ఎక్కువగా రిఫైండ్ షుగర్స్ వాడకూడదు. ఎందుకంటే ఇది ఎక్కువగా చాక్లెట్స్, ఐస్ క్రీమ్ లలో, కేకులలో, తీపి పదార్ధములలో ఉంటుంది. మీరు పంచదార కన్నా తేనెను తీపిదనం కోసం వాడవచ్చు. ఇవి మాత్రమే కాదు తాజా కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. టమోటోలు, దోసకాయ, పాలకూర, మొదలైన వాటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం మాత్రమే కాదు ఐరన్, కెరోటెన్, రిబో ఫ్లోవిన్, విటమిన్ 'సి', ఫోలిక్ యాసిడ్ వంటివి ఉంటాయి.  కబాట్టి  ఎక్కువగా ఆకుకూరలు తినటం ఆరోగ్యానికి మంచిది. తాజా పండ్లు, బత్తాయి, యాపిల్, బొప్పాయి, తింటే ఆరోగ్యకరమైన చర్మం ఏర్పడుతుంది. సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే లెమన్ జ్యుస్ కూడా మంచిదే. అందులో విటమిన్ 'సి' ఉంది. ఇది ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. చర్మం బాగుండాలి అనుకుంటే నిమ్మరసం తీసుకోవాలి. నిమ్మరసం నీటితో కలిపి ఉదయాన్నే తీసుకుంటే రోజంతా హుషారుగా ఉంటుంది. కళ్ళు కళకళలాడుతూ మెరుస్తూ ఉంటాయి. నిమ్మరసం, నీళ్ళల్లో కొంచెం తేనె కూడా మిక్స్ చేస్తే మంచిది. ప్రతిరోజూ 1,2 గ్లాసుల వరకు బత్తాయి జ్యూస్ తీసుకోవడం మంచిది.  దీనివల్ల చర్మం మెత్తబడుతుంది. చర్మం మీద పొడలుంటే పోతాయి. చాలామందికి కాఫీ, టీ అనేవి వ్యసనంలా ఉంటాయి.  కానీ ఎక్కువగా కాఫీ, టీ త్రాగకూడదు. చల్లని పానీయాలు ఆరోగ్యానికి హానికరం. వీటిని ఎక్కువగా తీసుకోకూడదు. ప్రతిరోజూ  నీటిని  పుష్కలంగా త్రాగాలి. మీ శరీరంలోని మలినాలని ప్రక్షాళన చేయడానికి మంచి నీరుకు మించింది లేదు. తరువాత చిలికిన మజ్జిగ త్రాగడం మంచిది. వెన్నపూస తీసిన పాలు మంచివి. నిమ్మరసం వంటికి చాలా శ్రేష్టం. మన శరీరానికి అవసరమైన 'మెగ్నీషియం' దోసకాయలలో, ఉల్లిపాయలలో, యాపిల్ పండ్లలో, బాదంపప్పులో లభిస్తుంది. అలాగే పాస్ఫరస్ దుంపకూరలలో, పులుపుగా ఉండే పండ్లలో, కోడిగ్రుడ్డు సొనలో, చేపలలో, జున్నులో, మజ్జిగలో, బాదంకాయలలో, ఎక్కువగా లభిస్తుంది. 'కాల్షియం' కోడిగ్రుడ్లలో, డైరీపాల ప్రొడక్టులో లభిస్తుంది. ఇలా విటమిన్లు, ప్రోటీన్లు, అవి లభించే పదార్థాల గురించి అవగాహన పెంచుకుని మంచి ఆహారాన్ని తీసుకున్నట్లయితే ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించవచ్చు...!                                      ◆నిశ్శబ్ద.

పనికిమాలిన విషయాలు

అనగనగా ఓ బద్ధకిష్టి. బారెడు పొద్దెక్కాక లేవడం, తినడం, తిరగడం, రాత్రివేళకి పడుకోవడం.... ఇదే అతని దినచర్యగా ఉండేది. ఎప్పటిలాగే ఓ రోజు ఆ బద్ధకిష్టి సుష్టుగా తినేసి, అలా చల్లగాలికని చెరువుగట్టుకి చేరుకున్నాడు. ఆ చెరువుగట్టు మీద ఊసుపోక అటూఇటూ తిరగడం మొదలుపెట్టాడు. ఇంతలో అతనికి ఓ కపాలం కనిపించింది. దానిని చూసిన బద్ధకిష్టికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. దాని పక్కనే కూర్చుని నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాడు. ఆ కపాలం తనని చూసి నవ్వినట్లు తోచింది. ‘ఎవరు నువ్వు? నీకు ఈ గతి ఎలా పట్టింది?’ అని అడిగాడు బద్ధకిష్టి.   ‘జీవితాన్ని వృధా చేసుకుంటూ, పనికిమాలిన విషయాలను పట్టించుకోవడం వల్లే ఈ స్థితికి చేరుకున్నాను,’ అంది ఆ కపాలం. ఆ మాటలు విన్న బద్ధకిష్టికి ఎక్కడలేని ఆశ్చర్యం వేసింది. కపాలం మాట్లాడటం ఏమిటి? అందులోనూ తన పరిస్థితికి కారణం ఏమిటో చెప్పడం ఏమిటి? అనుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని ఎవరితోనన్నా పంచుకోవాలని అనిపించింది. కానీ ఎవరితో పంచుకుంటే బాగుంటుంది! అని తెగ ఆలోచించాడు. చివరికి ఏకంగా రాజుగారి దగ్గరకు వెళ్లే తను చూసిన విషయాన్ని చెప్పాలని నిశ్చయించుకున్నాడు. ఇంత చిత్రమైన విషయం అంతటి ప్రభువు దగ్గరకు చేరాల్సిందే అని బయల్దేరాడు.   అలా బద్ధకిష్టి రాజుగారి దగ్గరకు బయల్దేరాడు. ఓ రెండు రోజులు కాలినడకన రాజధానికి చేరుకుని, రాజదర్బారులోకి ప్రవేశించాడు. అక్కడ నిండు సభలో ఉన్న రాజుగారిని చూస్తూ తను మోసుకొచ్చిన వార్తని వినిపించాడు. ‘కపాలం ఏమిటి? మాట్లాడటం ఏమిటి? నీకుగానీ మతిపోయిందా!’ అని అడిగారు రాజుగారు. ‘లేదు ప్రభూ! కావాలంటే మీరే వచ్చి స్వయంగా చూడండి!’ అంటూ రెట్టించాడు బద్ధకిష్టి. బద్ధకిష్టి అంత గట్టిగా చెప్పడంతో రాజుగారిలో కూడా ఎక్కడలేని ఆసక్తి బయల్దేరింది. ఎక్కడో కథల్లో తప్ప తను కపాలం మాట్లాడటం గురించి విననే లేదయ్యే! అందుకే మందీమార్బలాన్ని వెంటతీసుకుని బద్ధకిష్టి వెంట బయల్దేరాడు. ఓ పూటంతా ప్రయాణించి వారు కపాలం ఉన్న చెరువుగట్టుకి చేరుకున్నారు.   ఆ కపాలం ఇంకా అక్కడే ఉంది. చిరునవ్వు నవ్వుతున్నట్లే ఉంది. ‘నేను ఈ దేశపు రాజుగారిని తీసుకువచ్చాను. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో ఈయనతో ఓసారి చెప్పు,’ అని అడిగాడు బద్ధకిష్టి. దానికి ఆ కపాలం నుంచి ఎలాంటి జవాబూ రాలేదు. మరోసారి, ఇంకోసారి.... అలా పదేపదే ఆ కపాలాన్ని ప్రశ్నించినా కూడా అది నిమ్మకుండిపోయింది. కపాలం మాట్లాడకపోయేసరికి, రాజుగారికి పట్టరాని ఆవేశం వచ్చింది. తమని నవ్వులపాలు చేయడానికే బద్ధకిష్టి ఈ పన్నాగం పన్నాడని ఆయన అనుకున్నారు. వెంటనే ‘వీడి శిరస్సుని ఖండించి ఆ కపాలం పక్కనే పడేయండి,’ అని ఆజ్ఞాపించి తన దారిన తాను చక్కా వెళ్లిపోయారు.   రాజుగారి ఆజ్ఞని భటులు నెరవేర్చారు. ఆ కపాలం పక్కనే బద్ధకిష్టి శిరస్సుని కూడా పడేసి వెళ్లిపోయారు. అంతా సద్దుమణిగిన తరువాత, అప్పుడు మాట్లాడింది కపాలం. ‘నా సంగతి సరే! ఇప్పుడు నీ సంగతి చెప్పు. నీకు ఈ గతి ఎలా పట్టింది?’ అంటూ బద్ధకిష్టి శిరస్సుని అడిగింది. దానికి బద్ధకిష్టి శిరస్సు ‘ఏముంది! జీవితాన్ని వృధా చేసుకుంటూ, పనికిమాలిన విషయాలను పట్టించుకోవడం వల్లే ఈ స్థితికి చేరుకున్నాను,’ అంటూ నిట్టూర్చింది.   (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా) - నిర్జర.