Read more!

పరీక్షలకు సవాల్ విసిరే అద్భుత సూత్రాలు!

డిసెంబర్ నెల గడిచిపోతోంది. పిల్లలకు పరీక్షల కాలం దగ్గరకు వచ్చేస్తోంది. పిల్లలకు పరీక్షలు అంటే పెద్దలకు విషమపరీక్ష. పిల్లల కోసం పెద్దలు కుస్తీ పడతారు. తమ పిల్లలు బాగా పరీక్షలు రాయాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి అనేది ప్రతి తల్లిదండ్రుల ఆశ. అయితే చదవడంలో కాస్త విభిన్నత, సరైన విధానం తెలుసుకుంటే చక్కని ప్రిపరేషన్ సాగించవచ్చు. వాటికోసం ఇదిగో టిప్స్...

పరిశీలన:-

మెదడులో శాశ్వతంగా ముద్రవేసుకోవాలంటే మనం వస్తువు లేదా విషయాలను శ్రద్ధగా పరిశీలించాలి. ఒక వ్యక్తిని ఒక్కసారి చూస్తాం. అతని బొమ్మ మెదడులో కొద్దికాలమే గుర్తుంచుకుంటాం. అదే వ్యక్తిని పరిశీలనగా, శ్రద్ధగా ఉత్సుకతతో చూస్తే అధిక కాలం గుర్తుండిపోతాడు. ఈ పరిశీలన అనేది మన మనసులో ఉత్సుకత రేకెత్తించి విషయం పట్ల శ్రద్ధను, ప్రాముఖ్యతను కలుగచేస్తుంది. పరిశీలించడం అంటే ఆ వస్తువు లేదా విషయం పట్ల మన జ్ఞానేంద్రియాలన్నింటినీ ఉపయోగించి పర్యవేక్షించడం. విద్యార్థికి ఉండవలసిన ప్రాధమిక లక్షణం పరిశీలనాత్మకత. చదివినవి, లేదా చూసినవి దీర్ఘకాలం గుర్తుంచుకోతగ్గవా కాదా అని నిర్ణయించుకొని విషయ సంగ్రహణం చేయాలి. 

ఏకాగ్రత :-

ఏకాగ్రతకు మనిషిని దేవుడిలా మార్చగల శక్తి ఉంది. ఏకాగ్రత వలన సర్వమూ లభిస్తుంది. మనం దేన్నయితే ఏకాగ్రతో పరిశీలిస్తామో అది మనకు తలవంచి తీరుతుంది. ఏకాగ్రత వలన చేయలేని విషయాలు ఈ సృష్టిలోనే లేవు. ఏకాగ్రత మనలో దాగి ఉన్న అద్భుత అపూర్వ శక్తులను వెలికి తీస్తుంది. మనల్ని మానవాతీతులుగా కూడా మార్చేస్తుంది. ఏకాగ్రత వలన వస్తువుల్ని సైతం కదిలించగలం. ఎటువంటి అద్భుతశక్తికైనా అవసరమైన ఒకే ఒక్క మూలకం ఏకాగ్రత. జ్ఞాపకశక్తిని పెంచుకోవడంలో తిరుగులేని ఆయుధం ఎకాగ్రత. మనం ఒక వస్తువు పైన ఏకాగ్రత ఉంచితే ఆ వస్తువుపై స్పష్టత, ఆసక్తి కల్గి ఆ వస్తువు దీర్ఘకాలం గుర్తుండిపోవడానికి దోహదమవుతుంది. మీరు గుర్తుంచుకోవాలన్న విషయాలపై అపారమైన ఏకాగ్రతను కనబర్చండి. ఎప్పుడైతే ఏకాగ్రత లోపిస్తుందో వెంటనే దాని స్థానంలో అశ్రద్ధ, అనాసక్తి, బద్ధకం మొదలవుతాయి. ఇది జీవితాన్ని నిర్వీర్యం చేస్తుంది. మనుషులు రుషులౌతారు ఎలాగంటే కేవలం ఏకాగ్రతను అపారంగా కల్గి ఉండటం వలన.

ధ్యానం :-

ధ్యానం అంటే ఏకాగ్రతగా ఉండటమే. మనం నిరంతరం  ఎన్నో వ్యర్ధమైన విషయాలపై దృష్టిసారించి మన అపారమైన శక్తిని వృధా చేస్తుంటాం. ఒకే దానిపై దృష్టి ఉంచడమే ఏకాగ్రత అంటే. ధ్యానంలో మనం చేసే పని ఇదే. ప్రతి రోజూ 20 నిముషాల పాటు అన్నింటినీ మరిచిపోయి మీ మెదడుకు సంపూర్ణ విశ్రాంతినిచ్చి ఎటువంటి అనవసర విషయాలను జ్ఞాపకం రానీయకుండా నిరోధించి కళ్ళు మూసుకొని హాయిగా మీ శ్వాసను గమనించండి. రెండు నిముషాలు మీరలా శ్వాసను గమనించడం చేస్తే మెల్లమెల్లగా మీ మెదడు విశ్రాంత స్థితికి చేరి శక్తిని జనించుకుంటుంది. ప్రతిరోజూ 20 నిముషాల పాటు అన్నింటినీ మరిచి ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలం మెదడుకు గొప్ప విశ్రాంతి కల్గించండి. మీ శ్వాసను ప్రతి సెకనూ కళ్ళు మూసుకొని గమనించడం వలన మీ ధ్యాస ఒక్కటే వస్తువు అంటే మీ శ్వాసపై ఏకాగ్రమై అపరిమితమైన శక్తి, ప్రశాంతత లభిస్తుంది. ఇలా శక్తిని పుంజుకున్న మన మెదడు రెట్టించిన శక్తితో తన పని ప్రారంభిస్తుంది.

శ్రద్ధ, ఇష్టం:

 మనం ఎప్పుడైనా ఇష్టం లేనివి చూడాలని గానీ చదవాలని కానీ అనుకోము కదా: మనకు నచ్చిందీ అంటే ఖచ్చితంగా దానిపై ప్రేమ, ఇష్టం, శ్రద్ధ ఉన్నాయని అర్థం. కథలనైతే ఇష్టంగా, శ్రద్ధగా ఎంతోసేపు పఠిస్తాం, ఆనందిస్తాం. అలా చదివిన ఆ కథలు మరణించే వరకూ గుర్తుండిపోతాయి. బాగా గమనించండి. ఎప్పుడో మీ 4 సంవత్సరాల వయస్సులో మనకు తాతయ్య చెప్పిన కథలు ఇంకా గుర్తుండి ఉంటాయి. కారణం ఏమిటంటే కథలంటే ఆసక్తి, ఇష్టం ఉండటం వలన  వాటిని వినడానికి శ్రద్ధగా సమయము కేటాయించడం వలన. ఏ విషయం మీదనైతే ఆసక్తి, శ్రద్ధ, ఇష్టం ఉంటాయో అవి దీర్ఘకాలం మన మెదడులో నిక్షిప్తం అయిపోతాయి.

5. ఊహాత్మక శక్తి :-

 చదివిన దానికంటే విన్నదీ, విన్నదానికంటే చూసినదీ మనం ఎక్కువగా గుర్తుంచుకుంటాం. అసలు విషయం  ఏమిటంటే మన మెదడుకు ఏ భాషా రాదు. తెలుగు, తమిళం, ఇంగ్లీషు, మరాఠీ లాంటి ఏ భాషా రాదు. దానికి తెలిసిన ఒకే ఒక్క భాష బొమ్మల భాష. "Picture | | language" ఎటువంటి విషయాలనైనా సరే మన మెదడు ఖచ్చితంగా తనకు తెలిసిన బొమ్మల భాషలోకి మార్చిన తర్వాతే నిక్షిప్తం చేసుకుంటుంది. ఉదాహరణకు మనం  ఇంగ్లీషులో Elephant అని అంటే వెంటనే మన మనసులో ఏనుగు రూపం కనిపిస్తుంది. తెలుగులో పులి అన్నా కూడా పులి చిత్రం ప్రత్యక్షమైపోతుంది. మీరు ఏది విన్నా, చదివినా చివరికి తిన్నా కూడా ఈ విషయాలన్నీ ఖచ్చితంగా బొమ్మలుగా మార్చబడి మెదడులో నిక్షిప్తం అవుతాయి. కావాలంటే చూడండి "పులుపు, కారం, చేదు”.. ఈ పదాలు పలుకగానే చింతకాయ, మిరపకాయ, వేపకాయ గుర్తుకు వస్తాయి. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన మెదడు బొమ్మలను దృశ్యాలనూ అత్యంత వేగంగా నిక్షిప్తం చేసుకోగలదు. మళ్ళీ వేగంగా పునరావృతం చేసుకోగలదు.

పైవాటిని ఫాలో అయితే ప్రిపేరేషన్ చాలా తొందరగా సమర్థవంతంగా పూర్తవుతుంది.

                                      ◆నిశ్శబ్ద.