Read more!

పౌరులకు, వ్యక్తులకు మధ్య బేదం ఇదే..

ప్రతి సంవత్సరం జనవరి 12 న యువజన దినోత్సవం జరుపుకుంటారు. ఈ దేశానికి యువత అవసరాన్ని, భారతీయ హిందూ ధర్మ విశిష్టతను, విదేశాలలో సైతం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చాటిన స్వామి వివేకానంద పుట్టిన రోజును ఇలా యువజన దినోత్సవంగా జరుపుకుంటారు. స్వామి వివేకానంద భారతదేశం గురించి, దేశ భవిష్యత్తు గురించి, భారత పౌరుల గురించి తన మాటల్లో ఇలా చెప్పారు..


స్వామి వివేకానంద నిద్రాణమై ఉన్న భారత జాతిని 'లేవండి, మేల్కొనండి, గమ్యం చేరేవరకు ఆగవద్దు!' అని మేల్కొలిపారు. సుమారు వెయ్యి సంవత్సరాలుగా బానిసత్వాన్ని అనుభవిస్తూ, కొన ఊపిరితో ఉన్న భారతజాతిని 'సమస్త శక్తి మీలోనే ఉంది. మీరేమైనా సాధించగలరు!' అని జాగృతం చేసారు.


 దేశ భవిష్యత్తు గురించి చెబుతూ భారతదేశం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకంటే అగ్రస్థానానికి చేరుకుంటుందని అన్నారు. స్వామీజీ 1897 జనవరి 25న రామనాథపురంలో తన ఉపన్యాసాన్ని ఇలా ప్రారంభించారు....ఇక తెల్లవారదనుకున్న రాత్రి మెల్లమెల్లగా గడిచిపోతున్నట్లుంది. భరించరాని తీవ్ర వేదన ఉపశమిస్తున్నట్లనిపిస్తుంది.... భారతమాత దీర్ఘనిద్ర నుండి మేల్కొంటోంది.... ఇంక ఆమెనెవరూ ఆపజాలరు! ఇక ఆమె నిద్రపోదు". స్వామీజీ చెప్పిన భవిష్యవాణి నిజం కావాలంటే మనం ఏం చెయ్యాలి?


వ్యక్తులు పౌరులుగా మారాలి నేటి యువత విదేశాలు భోగభాగ్యాలకు ఆకర్షితులవుతున్నారు. ఇటు భారతీయ సంస్కృతిని వదులుకోలేక, అటు విదేశీ సంస్కృతిని కాదనలేక సందిగ్ధంలో పడుతోంది. బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యం చాలా గొప్పదన్న విషయం మనమంతా తెలుసు కోవాలి. విదేశాలలో వేదాంతభేరిని మ్రోగించి, భారతదేశానికి తిరిగి వస్తున్నప్పుడు ఒక ఆంగ్లేయ మిత్రుడు స్వామీజీని "ఇక్కడి భోగభాగ్యాలను చూసిన తరువాత భారతదేశంపై మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు. సమాధానంగా స్వామీజీ, "భారతదేశం నుండి వచ్చేముందు నా దేశాన్ని ప్రేమించాను. ఇప్పుడు నా దేశపు దుమ్ము, ధూళి, గాలి సర్వస్వం నాకు పవిత్రమైనవిగా భాసిస్తున్నాయి" అన్నారు. నేడు మన దేశస్థులు తమ దేశానికి సేవ చేయడం మాట అటుంచి భారతమాతను విమర్శించడంలోనే ఎక్కువ ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రతి భారతీయుడు తమ దేశ గొప్పతనాన్ని తెలుసుకొని భారత పౌరునిగా మారడానికి ప్రయత్నించాలి.


ఒకసారి ప్రముఖ భారత న్యాయవాది నానీ ఫల్కీవాలా జపాన్ వెళ్ళినప్పుడు ఆ దేశమంత్రిని ఇలా ప్రశ్నించారు. "భారతదేశంలో కావలసిన సంపదలున్నాయి. భారతీయులు తెలివైనవారు. అయినప్పటికీ భారతదేశం జపాన్లాగా ఎందుకు అభివృద్ధి చెందలేకపోతోంది?" అని.


 సమాధానంగా జపాన్ మంత్రి “జపాన్లో ఒక మిలియన్ పౌరులున్నారు. భారతదేశంలో ఆరువందల మిలియన్ల వ్యక్తులున్నారు" అని తన అభిప్రాయాన్ని చెప్పారు. 


'దేశం మనకు ఏమి చేసింది' అని తలచేవారు వ్యక్తులు, 'దేశానికి మనం ఏం చేసాం' అని ప్రశ్నించుకునేవారు పౌరులు. తమ స్వార్థం కోసం ఆలోచించేవారు, తమ ప్రయోజనాల కోసం జీవించేవారు వ్యక్తులు. ఇతరుల కోసం ఆలోచించేవారు, ఇతరులకు సేవ చేసేవారు పౌరులు. ప్రతి ఒక్క భారతీయుడు వ్యక్తి నుంచి పౌరునిగా మారాలి.


యువశక్తి జాగృతం కావాలి నేడు భారతీయులు అందరికంటే తెలివైనవారని ప్రపంచమంతా ఒప్పుకుంటుంది. అయితే మనం అక్కడితో ఆగిపోకుండా ప్రతిభావంతులంగా మారాలి. దీనికోసం నేటి యువత విద్యతో పాటు విలువలను అలవరచుకోవాలి, మనోబలాన్ని పెంపొందించుకోవాలి. జ్ఞానంతో పాటు హృదయాన్ని విశాలం చేసుకోవాలి. స్వామీజీకి యువశక్తిపై అత్యంత విశ్వాసం ఉంది. యువత తమ అంత రంగంలో ఉన్న అనంత శక్తిని జాగృతం చేసి భారతమాతను ముందుకు తీసుకుపోవాలి.. ప్రతి ఒక్క భారతీయుడు భారత పౌరునిగా మారి, తమ శక్తిని జాగృతం చేస్తే, కొద్ది రోజులలోనే భారతదేశం అగ్రస్థానానికి చేరుకుంటుంది. వివేకానందుని భవిష్యవాణి సత్యమవుతుంది. ఇది మనందరి చేతులలోనే ఉంది.


                                 ◆నిశ్శబ్ద.