హ్యాండ్ వాష్ కూ ఒక డే ఉంది తెలుసా!

పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. మన శుభ్రతే మనల్ని కాపాడుతుంది. హ్యాండ్‌ వాష్ చేయడం అనేది  ప్రతిరోజూ తినడానికి ముందు చేసే పనే.  ఎప్పటి నుండో పెద్దలు తినడానికి ముందు కాళ్ళు, చేతులు కడుక్కోపో…. అని చెబుతూ వస్తున్నారు. అంతేనా బయటకు వెళ్లి బాగా తిరిగి ఇంటికి వచ్చాక కూడా కాళ్ళు చేతులు కడుక్కోమని చెబుతూనే ఉన్నారు. ఇది ఇప్పటి అలవాటు కాదు భారతీయులకు.  అయితే చేతులు కడుక్కోవడాన్ని ఇంగ్లీష్ లో హ్యాండ్ వాష్ అనేసి, దానికోసం  కూడా ఒక ప్రత్యేక దినాన్ని ఏర్పాటు చేసినట్టు, దాన్ని ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక దినంగా జరుపుకుంటారని చాలా తక్కువమందికి తెలుసు. అక్టోబర్ 15న గ్లోబల్ హ్యాండ్‌ వాషింగ్ డే. ఇంతవరకు దీనికంటూ ఒక ప్రత్యేక రోజుందని తెలియకపోయినా దాన్ని మనం సహజంగానే ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి పెద్దగా ప్రత్యేకత చూపించం. కానీ గత రెండు సంవత్సరాల కిందట కోవిడ్ మహమ్మారి చేసిన భీభత్సానికి చేతులను సానిటైజర్ తో పదే పదే కడగాల్సి వచ్చింది. చేతులు ఎందుకు శుభ్రంగా ఉంచుకోవాలి అనే విషయం కూడా బానే అర్థమయ్యింది అందరికీ ఆ బీభత్సం కొనసాగినన్ని రోజులూ. కానీ ఈ హ్యాండ్ వాష్ డే ను 2008 నుండే స్టార్ట్ చేశారు. దాని గురించి కాస్త వివరంగా….. అసలు ఈ హ్యాండ్ వాష్ డే ఎందుకు??  ఎలా పుట్టిందంటే….. ప్రజలు చాలా అనారోగ్యాల బారిన పడేది ఆహారం ద్వారా, నీటి ద్వారా. ఈ పదార్థాలు ఎంత శుభ్రతగా ఉన్నా తినే చేతులు శుభ్రంగా లేకపోతే సహజంగానే చేతులకు ఉన్న మురికి, బాక్టీరియా వంటివి కడుపులోకి వెళ్ళిపోయి జబ్బులు కలిగిస్తాయి. అందుకే ప్రజలకు అవగాహన కలిగించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 15 వ తేదీన వరల్డ్ హ్యాండ్ వాష్ డే జరుపుకోవాలని నిర్ణయించారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మొదలైన వాటిలో పనిచేసేవారికి, పిల్లలకు అవగాహన కల్పించడం ద్వారా చేతుల ద్వారా వ్యాప్తి చెందే కొన్నిరకాల జబ్బులను అరికట్టవచ్చు.  కొన్ని ముఖ్యమైన విషయాలు!! 1980 సంవత్సరంలో స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగిన వరల్డ్ వాటర్ వీక్‌ లో గ్లోబల్ హ్యాండ్‌ వాషింగ్ డే ఆవిర్భవించింది.  అయితే 2008 లో ప్రపంచ వ్యాప్తంగా దీన్ని జరుపుకోవడం ప్రారంభమైంది.  2008 అక్టోబర్ 15 న ప్రపంచ వ్యాప్తంగా  120 మిలియన్లకు పైగా పిల్లలు, సుమారు 70 దేశాలలో సబ్బుతో చేతులు కడుక్కుని దీన్ని ప్రారంభించారు. 2008లో గ్లోబల్ హ్యాండ్‌ వాషింగ్ డేలో పాల్గొన్న దేశాల్లో భారతదేశం ఒకటి. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఇంకా అతని సహచరులు మెరుగైన ఆరోగ్యం మరియు పరిశుభ్రతను ప్రోత్సహించడంలో 100 మిలియన్ల మంది పిల్లలతో చేరి దీన్ని విజయవంతం చేశారు. ప్రస్తుతం, 17 దేశాల్లో 10 మిలియన్ల మందికి పైగా హ్యాండ్‌ వాష్ సౌకర్యాలు లేవు. పై విషయాలు గమనిస్తే చేతులు కడుక్కోవడం గురించి అవగాహన కల్పించడానికి కూడా ఒకరోజు కేటాయించుకోవడం అనేది సబబుగానే అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కోవిడ్ నేర్పిన గుణపాఠం మర్చిపోలేనిది కదా. టీవీ యాడ్ లో చూపినట్టు చేతులను అటు రుద్ది, ఇటు రుద్ది, గోళ్లలో మురికి పోయేలా శుభ్రంగా కడుక్కోవడం మంచిదే..                                          ◆నిశ్శబ్ద.

రోమ్ ను పాలించిన హాడ్రియన్ రాజు వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసా?

శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అనే సామెత ఎప్పుడు పుట్టిందోకానీ, ఆనాటికే ఒక వందకోట్ల దరిద్రాలను లెక్కించారనుకోవాలి. మానవతావాదం, సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందిన నేటి కాలంలోనే దరిద్రమింత విస్తృతంగా అనేక ప్రాంతాల్లో, అనేక వర్గాల్లో విలయతాండవం చేస్తున్నదంటే, ఇక రాజులు, రంగప్పలు తమ ఇష్టం వచ్చినట్లు పన్నులు వసూలు చేస్తూ పరిపాలించిన రోజుల్లో అధికాధిక ప్రజానీకం ఎంతటి దుర్భర దారిద్ర్యాన్ని అనుభవించారో మనకు తెలియదు. నిజానికి నేటి సాంకేతిక పరిజ్ఞానంతో దారిద్ర్యాన్ని చాలావరకు నిర్మూలించే వీలుంది. కాని ఈ విజ్ఞానాన్ని అందుకు వినియోగించకపోగా, కొత్త కోర్కెలను సృష్టించడానికే వినియోగిస్తున్నారు. ఈనాడు ప్రభుత్వాలూ, ప్రజలూ తలుచుకుంటే ప్రపంచవ్యాప్తంగా మానవాళికి తిండీ, బట్టా సమకూర్చడం అంత కష్టమైన విషయం కాదు. కానీ ప్రభుత్వాలకు ఆయుధాలను ఉత్పత్తిచేసే విషయం మీద ఉన్నంత శ్రద్ధ ప్రజలకు తిండీ, బట్టా అందించడంలో వుండటం లేదు. మనుష్య జాతి యావత్తూ ఒకటే అయి, జాతిమతభేదాలు పాటించడం మానేస్తే ఆయుధాలపై వ్యయం అవసరం లేదు, నేడు లభ్యమయ్యే ఉత్పత్తి సాధనాలతో ప్రపంచ వ్యాప్తంగా దారిద్ర్యాన్ని ఇట్టే నిర్మూలించవచ్చు. ఇలా జరగకపోవడానికి కారణం ప్రభుత్వాలూ, వాటిని ఎన్నుకున్న ప్రజలూ అని చెప్పాల్సి ఉంటుంది. ఇక దరిద్రం మీద ఎన్నిసార్లు యుద్ధం ప్రకటించినా, దానిని నిజంగా తొలగించగలమా అనే అనుమానం వస్తుంటుంది. బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా కొన్ని కొన్ని వర్గాలు దారిద్ర్యాన్ని అనుభవిస్తూనే వున్నాయి. ఏది ఏమైనప్పటికీ తూర్పు ఖండాల్లో కనిపించే కటిక దారిద్య్రం పశ్చిమ దేశాల్లో కనిపించదు. ఆ దేశాల్లోని జీవన ప్రమాణాలను అనుసరించి కొన్ని వర్గాల వారికి తగినన్ని సౌకర్యాలు ఉండకపోవచ్చు కానీ, అసలు తిండికీ, గుడ్డకీ నోచుకోని పరిస్థితి లేదు. ఆ మాటకొస్తే తిండీ, గుడ్డా, ఒకమాదిరి వసతీ లేకుండా మనిషి అక్కడ అసలు బ్రతకలేడు. దేహంలో వెచ్చదనం త్వరితంగా క్షీణించి మరణిస్తాడు. ఇంకా అభివృద్ధి చెందని మన తూర్పుదేశాల్లో తిండీ, బట్టా, వసతి లేక పోయినా, వాతావరణం పొడిగా వుంటుంది కాబట్టి, నీళ్లు త్రాగి చెట్టుక్రింద పడుకొని కూడా కొన్నాళ్లు ప్రాణం నిలుపుకోగలడు. అయినప్పటికీ దారిద్ర్యదుఃఖం భరించడం ఎవరికైనా చాలా కష్టం. పూర్వం రెండవ శతాబ్దంలో హాడ్రియన్ మహారాజు రోమ్ ను పరిపాలిస్తున్న కాలంలో ఒక పౌరుడు తన దారిద్ర్యాన్ని తట్టుకోలేక పోయాడు. అయినప్పటికీ ఆత్మహత్య మహాపాతకమనే విశ్వాసం ఉన్నందువల్ల హాడ్రియన్ మహారాజును చాలా దారుణంగా  తిడుతూ తన పేరుతో ఒక ఉత్తరం వ్రాసిపడేశాడు. హాడ్రియన్ దాన్ని చదివి, ఆ ఉత్తరం రాసిన వాడిని  పిలిపించాడు. “నువ్వు మహారాజును చాలా తీవ్రంగా దూషించావు. ఇలాంటి అపరాధానికి శిక్ష మరణదండన అన్న సంగతి నీకు తెలియనిది కాదు. కానీ చేతులారా ఇలాంటి లేఖవ్రాసి నీ చావును నువ్వే ఎందుకు కొని తెచ్చుకున్నావో నాకు అర్థం కాకుండా వుంది. ఏమిటి నీ ఉద్దేశం?” అని అడిగాడు. "మహారాజా, మీరు నాకు మరణశిక్ష విధిస్తే, ఒక్క దెబ్బతో నాకు మూడు బాధలు నివారణ అవుతాయని ఆశించాను" అన్నాడు ఆ నిర్భాగ్యుడు. "ఏమిటా మూడు బాధలు?" "మొదటిది నాకు తినడానికి తిండిలేదు. రెండవది కట్టుకోవడానికి బట్ట లేదు. మూడవది నాతోబాటు నా భార్యా, పిల్లవాడూ కూడా ఇదే బాధను అనుభవిస్తున్నారు. ఇది అసలే చూడలేకుండా వున్నాను. ఈ మూడు బాధలూ మీ మరణశిక్షతో అంతమవుతాయని ఎదురు చూస్తున్నాను" అన్నాడు. నిర్దాక్షిణ్యానికి మారుపేరుగా చలామణి అయిన హాడ్రియన్ రాజు "వీణ్ణి వదిలేసి ఇలాగే జీవించనివ్వండి. మరణించడంకన్నా ఇతడికి జీవించడమే పెద్ద శిక్ష అని నాకు తోస్తుంది" అని తీర్పు చెప్పాడు. ఇదీ చరిత్రలో దారిద్య్రం తీరు,  హాడ్రియన్ రాజు వ్యక్తిత్వం.                                        ◆నిశ్శబ్ద.

సెల్ఫ్ కేర్ ఎందుకు ముఖ్యం?? దానికోసం ఏమి చెయ్యాలి?

ప్రతి మనిషికి తన జీవితంలో సెల్ఫ్ కేర్ అనేది చాలా ముఖ్యం. ఇది మనిషి శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి అవసరమైన సమయాన్ని కేటాయించుకోవడానికి,  తమ మీద తమకు శ్రద్ధను పెంచుకోవడానికి సహాయపడుతుంది. చాలామందికి ఎదురయ్యే అనారోగ్య సమస్యలు ఎక్కువ భాగం సెల్ఫ్ కేర్ లేకపోవడం వల్లనే సంభవిస్తాయి. నేటి బిజీ బిజీ జీవితాలలో ఎవరికీ తమకు తాము కాసింత సమయాన్ని కేటాయించుకునే తీరిక, తమ గురించి, తమ శారీరక, మానసిక పరిస్థితులు ఎలా ఉన్నాయి?? వాటి స్థాయి ఏంటి?? ఏ విషయాలకు ఎలా స్పందిస్తున్నాను?? నేను స్పందిస్తున్న తీరు సరైనదేనా అనే ఆలోచన కూడా ఉండనే ఉండదు. అదే సెల్ఫ్ కేర్ ఉంటే మనిషిని పీడించే ఒత్తిడి దరిదాపుల్లోకి కూడా రాదు. సెల్ఫ్ కేర్ మనిషిని శక్తివంతంగా చేయడంతో పాటు చుట్టూ ఉన్న వ్యక్తుల జీవితాలు తమ మీద ప్రభావం చూపించకుండా ఉండేలా కూడా చేయగలుగుతుంది. అయితే సెల్ఫ్ కేర్ వల్ల మనిషిలో పెంపొందించుకోవాల్సింది ఏంటి?? అనే ప్రశ్న చాలా మందిలో ఎదురవుతుంది. సెల్ఫ్ కేర్ లో అందరూ తెలుసుకోవాల్సినవి మీకు అవసరమైనది ఏంటో తెలుసుకోవడం. మీ దృష్టిలో మీకు విలువైనది, మీ జీవితంలో విలువైనది ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.  ప్రతి ఒక్కరి జీవితానికి కొన్ని విషయాలు, కొన్ని నిర్ణయాలు, కొన్ని పరిస్థితులు సరిపోయేట్టు ఉంటాయి. అలాగని అందరి జీవితాలకు అవే సమంజసమైనవి అని చెప్పలేం. ఎవరి జీవితానికి ఏమి కావాలి?? అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొంత సమయం కూడా అవసరం అవుతుంది.   అందరూ గుర్తుంచుకోవలసిన ముఖ్య విషయం ఏమిటంటే సెల్ఫ్ కేర్ అనేది ఒకసారి మాత్రమే చేసే పని కాదు. ఒక్కసారితో అది ముగిసిపోదు. జీవితం సాగుతున్నన్ని రోజులూ సెల్ఫ్ కేర్ గురించి నిర్ణయాలు, ఆలోచనలు, ఆచరణలు సాగుతూనే ఉండాలి. మనిషిలో హార్మోన్ల స్థాయి కూడా ఈ సెల్ఫ్ కేర్ విషయంలో ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనిషి మానసిక స్థితిని ఆలోచనల తీరును ప్రభావితం చేసే కొన్ని చిట్కాలు ఫాలో అయితే సెల్ఫ్ కేర్ విషయంలో చురుగ్గా ఉండగలుగుతారు. ఎంతో సులువైన, కేవలం ఒక్క నిమిషం సమయం మాత్రమే కేటాయించగలిగే కొన్ని టిప్స్ ఇక్కడున్నాయి. చిన్నపిల్లలు నాలుక బయట పెట్టి అల్లరి పని చేసినట్టు చెయ్యాలి. దీనివల్ల ఎంతో ఉత్సాహం చోటు చేసుకుంటుంది. ఒత్తిడి శాతం తగ్గిపోతుంది. అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుని మీలో మీకు నచ్చే మూడు విషయాలు ఏమైనా చెప్పుకోండి. దీనివల్ల మీలో ప్రత్యేకత ఏమిటి అని మీకే తెలుస్తుంది. నెగిటివ్ ఆలోచనలు వదిలెయ్యాలి. మనసులో మీరు కోరుకునేది ఏంటో దాన్ని బలంగా పదే పదే మననం చేసుకోవాలి. దానికోసం ఒక నిమిషమైనా ప్రార్థన చేసుజకోవాలి. మనసుకు ఆహ్లాదాన్ని ఇచ్చేలా వాతావరణాన్ని మార్చుకోవాలి. ఇష్టమైన పూలు, నచ్చిన వాసన ఉన్న పెర్ఫ్యూమ్, నచ్చిన ఎసెంటియల్ ఆయిల్ తో గదిని, ఇంటిని, ఉద్యోగం చేస్తున్న మీ క్యాబిన్ ను ఆహ్లాదంగా మార్చుకోవచ్చు. మనసుకు చాలా రిలీఫ్ ఇస్తుంది ఈ పని. స్నేహితులు, బంధువులు, పెంపుడు జంతువులు, కొలీగ్స్ ఇలా ఎవరిని అయినా సరే హృదయపూర్వకంగా కౌగిలించుకోవాలి. కౌగిలికి చాలా మంచి పవర్ ఉంది. కేవలం ఆరు సెకన్ల కౌగిలింతకు ఆక్సిటోసిన్ అనే హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి మనిషిలో పాజిటివ్ ఫీలింగ్స్ ను పెంచుతాయి. శరీరాన్ని తరచుగా సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. శారీరకంగా కలుగుతున్న మార్పులు ఏమిటనేది గుర్తిస్తూ ఉండాలి. బాడీ ఫిట్ గా ఉంచుకోవడంలో ఇది పనిచేస్తుంది. కళ్ళు మూసుకుని సంతోషంగా గడిపిన క్షణాలు, సందర్భాలను గుర్తుచేసుకోవాలి. వాటిని గుర్తుచేసుకున్నప్పుడు సహజంగానే మనసు సంతోషంగా మారుతుంది. ఇలా సెల్ఫ్ కేర్ కోసం పైన చెప్పుకున్నవి పాటిస్తూ ఉంటే మనిషి జీవితం ఎంతగానో మార్పు చెందుతుంది. ఎంతో గొప్ప భవిష్యత్తులోకి వెళ్తుంది.                                       ◆నిశ్శబ్ద.

ఉత్తరాల విందు మొదలుపెడధామా?

అప్పుడెప్పుడో వచ్చిన రాజశేఖర్ అల్లరి ప్రియుడు సినిమాలో ఉత్తరాల ఊర్వశి అంటూ సాగే పాట ఇద్దరు వ్యక్తుల మధ్య ఉత్తరాల రాయబారం ఎంత బాగుంటుందో చెప్పకనే చెబుతుంది. అంతేనా అందంగా రాసిన అక్షరాల పొందికలో దాగిన అందం మంత్రముగ్ధుల్ని చేస్తుంది. దానికి భావుకత, రసాత్మకత తోడైతే ఆ ఉత్తరమొక తీయని జ్ఞాపకంగా మారిపోతుంది. ఇవన్నీ చాటింగ్స్, ఫోన్ కాల్స్ లో జరిగినా అన్నీ మెరుపు మెరిసి మాయమైనట్టు ఉంటాయి. కానీ ఉత్తరాలు మాత్రం దాచిపెడితే ఏళ్లకేళ్ళు పదిలంగా ఉంటాయి.  అసలు ఈ ఉత్తరాల సౌకర్యం అందరికీ అందుబాటులో తెచ్చిన తపాలా ఏనాటిది?? ఈ తపాలా వ్యవస్థ ఎక్కడ మొదలయ్యింది?? టెలిగ్రామ్, పోస్ట్, కొరియర్, స్పీడ్ పోస్ట్, లెటర్స్, కార్డ్ పోస్ట్ ఇలా బోలెడు రకాల సౌకర్యాలు కలిగిన తపాలా గురించి తెలుసుకోవాలి. ఫోన్ లు ఎవ్వరికీ అందుబాటులో లేని కాలంలో అందరినీ తన మయాజాలంతో మంత్రముగ్ధుల్ని చేసిన తపాలా వ్యవస్థ గురించి చరిత్రలోకి వెళ్ళాలి. వరల్డ్ పోస్ట్ డే ప్రతి సంవత్సరం అక్టోబర్ 9 న నిర్వహిస్తారు. ఇది అంతర్జాతీయంగా జరిగే దినోత్సవం. ఇది మొట్టమొదటిసారి 1874 సంవత్సరంలో స్విట్జర్లాండ్ లో ప్రారంభమైంది. 1969 సంవత్సరం నుండి ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆ రోజు నుండి తపాలా సేవల ప్రాముఖ్యం గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో ఈ తపాలా దినోత్సవం జరుపుకోవడం జరుగుతోంది.  ఒకప్పుడు!! ఒకప్పటి కాలంలో అంటే బ్రిటీషు వారు భారతదేశానికి రాకముందు రాజులు దేశాన్ని పాలిస్తున్నప్పుడు పావురాల ద్వారా రహస్య సమాచారాలు పంపబడేవి, సాధారణ విషయాలను ఉత్తరాలలో రాసి రాయబారుల ద్వారా ఉత్తరాలు పంపుకునేవారు. ఈ ఉత్తారాలలోనే ఎంతో విషయ సారాంశం నడిచేది. బ్రిటీషువారు వచ్చాక నూతన పద్ధతులు అందుబాటులోకి తెచ్చారు. టెలిగ్రామ్ వ్యవస్థ మెల్లగా మొదలయ్యింది.  ఎప్పుడు ఎక్కడ  ప్రకటించారంటే!! ప్రపంచ తపాలా వ్యవస్థ స్విట్జర్లాండ్ లో మొదలైతే తపాలా దినోత్సవం మాత్రం జపాన్ దేశంలో టోక్యోలో మొదలయ్యింది. మొదటిసారిగా అక్టోబర్ 9 వ తేదీన ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకోవాలని అక్కడే నిర్ణయిస్తూ ప్రకటించారు. తపాలా దినోత్సవం గురించి భారతదేశ బృంద సభ్యుడు అయిన శ్రీ ఆనంద్ మోహన్ నరుల ప్రతిపాదనను అందించారు. అది ఆమోదించబడటంతో అప్పటి నుండి తపాలా ప్రాముఖ్యత అక్టోబర్ 9 న అందరికీ తెలిసేలా నిర్వహించబడుతుంది. మనమేం చేయచ్చు?? నేటి కాలంలో ఆధునిక టెక్నాలజీ వ్యాప్తమైపోయి తపాలా వ్యవస్థ బలహీనమైన మాట కాదనలేని వాస్తవం. కానీ ఏదైనా ఎక్కువగా వాడితే బోర్ కొట్టేస్తుంది అంటారు కదా అలాగే ఈ టెక్నాలజీ కూడా కాస్త బోర్ గానే అనిపిస్తుంది. ఇంకా ఇంకా పైకి ఎదుగుతూ వీడియో కాల్స్ టెక్నాలజీ వచ్చి పడినా అదేది అంత కిక్కు ఇచ్చినట్టు అనిపించదు. ఒకప్పుడు అయితే రవాణా వ్యవస్థ సరైన విధంగా ఉండేది కాదు కాబట్టి తపాలా వ్యవస్థ కాస్త నెమ్మదిగానే నడిచేది. రోజులు తరబడి ఉత్తారాల కోసం, టెలిగ్రామ్ ల కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం రవాణా వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. చాలా తొందరగా సేవలు అందిస్తోంది. పైగా ప్రైవేట్ కొరియర్ సర్వీసుల కంటే తక్కువ ధరతో, వేగవంతమైన సేవలు ఇప్పుడు తపాలా వ్యవస్థ సొంతం. అందుకే వ్యక్తులను మరింత దగ్గర చేసే ఉత్తారాల కబుర్లను ఎంచక్కా మీదైన స్టయిల్ లో అందంగా, చమత్కారంగా, అదనపు హంగులు, రంగులు జోడించి తోకలేని పిట్టగా తుర్రుమని వదలండి.  మీ ఉత్తరం అందుకున్నవారు మిమ్మల్ని మెచ్చుకోకపోతే చూడండి. అంతేకాదు మిగతా రవాణా వ్యవస్థ, కొరియర్, పార్సిల్ వంటివి కూడా పోస్టల్ లో ఎంతో బాగున్నాయి నేటి కాలంలో. వాటిని అందరూ వినియోగించుకుంటే తపాలా వ్యవస్థ మరింత ఉత్సాహంగా మారుతుంది.                                       ◆ నిశ్శబ్ద.

ఆకాశమే హద్దుగా భారత వైమానిక దళం!

రక్షణ అనేది ప్రతి దేశానికి అవసరం. ప్రపంచంలో ఎన్నో దేశాలు రక్షణ పరంగా బలంగా ఉండటం వల్ల పక్కదేశం వాడు దాడి చేయకుండా ఉండగలుగుతున్నాడు. ఒకప్పటి కాలంలో రాజులు కోట రక్షణ కోసం, తమ రాజ్యాన్ని పక్క రాజ్యం వాడు దండెత్తి వచ్చి లాక్కోకుండా ఉండటం కోసం సైన్య బలాన్ని పెంచుకుంటూ ఉండేవారు. అయితే రాచరిక వ్యవస్థ పోయాక ఈ రక్షణ వ్యవస్థ క్రమంగా మరుగున పడింది. బ్రిటిషు వారి చేతుల్లో నలిగాక భారతదేశానికి రక్షణ వ్యవస్థ అవసరం మళ్ళీ తెలిసొచ్చింది. జల, వైమానిక, సైనిక దళాల వైపు అడుగులు పడిన కారణంగా నేడు భారతదేశ రక్షణ దళం ప్రపంచంలో పటిష్టమైనదిగా ఆవిర్భవించింది. అంతేకాదు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తన బలాన్ని పెంచుకుంటూ వచ్చింది కూడా.  అసలు ఎయిర్ ఫోర్స్ డే ఎలా ఏర్పడింది? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రాయల్ ఎయిర్ ఫోర్స్ గా పిలిచేవారు. ఇది ఏర్పడినప్పుడు దీనిలో కేవలం ఆరుమంది సభ్యులు, 19 మంది సైనికులు ఉన్నారు అనే విషయం విస్మయం కలిగించినా వీరి ప్రయాణం నేడు ఒక గొప్ప శక్తిగా మారిందంటే ఎంత కృషి చేసి ఉండాలో అర్థమవుతుంది. ఈ సభ్యుల దగ్గర నాలుగు వెస్ట్ ల్యాండ్ వ్యాపిటి IIA ఆర్మీ ప్లైన్ లు ఉండేవి. అప్పటికి ప్రపంచంలో ఇతర దేశాలలో డజన్ల కొద్దీ యుద్దవిమానాలు, ప్లైన్ లు ఉండేవి, వీటితో పోలిస్తే భారతదేశం దగ్గరున్నవి చాలా తక్కువ. అయినా భారతదేశం వాటిని అభివృద్ధి చేసుకోవడంలో సఫలం అయింది. 1936, 1938 సంవత్సరాలలో  వీటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. ఫలితంగా రెండవ ప్రపంచ యుద్ధ సమయానికి భారత వాయు దళం చాలా శక్తివంతగా రూపు మార్చుకుంది.  1941 సంవత్సరం తరువాత శిక్షణా నిర్వహణలు ఎంతో వేగం పుంజుకున్నాయి. శిక్షణ కోసం క్లబ్ లు ఏర్పాటుచేయడం, యువ రక్తాన్ని ఈ వర్గంలో భాగస్వామ్యం చేయడం వంటి చర్యల వల్ల భారత వైమానికదళం పటిష్టత పొందింది. 1932 అక్టోబర్ 8 వ తేదీన స్థాపించబడిన భారత వైమానిక దళం ప్రస్తుతం 90 వ ఎయిర్ ఫోర్స్ డే సైలెబ్రేషన్ ని జరుపుకోబోతోంది. యుద్ధాలలోనూ, రక్షణ వ్యవస్థ తనవంతు పాత్ర సమర్థవంతంగా పోషించే వాయుదళం తన విజయాలను గుర్తుచేసుకుంటూ, అమరవీరులకు నివాళులు అర్పిస్తూ దేశమంతా చాటిచెబుతుంది.  భారత వాయుదళం గురించి! ప్రతి సంవత్సరం ఒక్కో చోట భారత వాయుదళం వేడుకలు జరపడం సాధారణం. 2022 సంవత్సరం అక్టోబర్ 8 న జరుగుతున్న ఈ వేడుకలకు చండీఘర్ వేదిక అయింది. వాయు దళం తన బలాన్ని ప్రదర్శిస్తూ విన్యాసాలు చేస్తుంది. దీనికోసం ముందుగుగానే సన్నాహాలు చేస్తోంది, గొప్ప సాధన వీరి సొంతం కూడా.  ఆకాశంలో అద్భుతం చేసే ఈ విన్యాసాలు చూడటానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈసారి జరుగుతున్న  ఎయిర్ షోలో 83 విమానాలు పాల్గొంటాయి.  ఎయిర్ షోలో పాల్గొనే విమానంలో 44 యుద్ధ విమానాలు, 7 రవాణా విమానాలు, 20 హెలికాప్టర్లు ఇంకా 7 పాతకాలపు విమానాలు ఉన్నాయి.  అదే సమయంలో 9 విమానాలను సిద్ధంగా ఉంచుతారు. ఒకో సంవత్సరం ఒక ప్రత్యేకత ఉన్నట్టు ఈసారి ఎయిర్ షో ప్రత్యేకత ఏంటంటే.. కొత్త తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను కూడా ఇందులో చేర్చనున్నారు. ప్రతి వర్గానికి ఒక నినాదం అంటూ ఉంటుంది. అలాగే ప్రతి దేశానికి కూడా నినాదం ఉంటుంది. అలాగే భారత వాయుదళానికి కూడా ఓ నినాదముంది. ఈ నినాదం వెనుక ఒక ఆసక్తికర విషయముంది. "నభః స్పృషం దీప్తమ్"  అనేది భారత వైమానిక దళం యొక్క నినాదం. ఇది గీతలోని పదకొండవ అధ్యాయం నుండి తీసుకోబడింది. మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన కర్తవ్య ఉపదేశమే ఈ నినాదం వెనుక కారణం. ఈ నినాదంతోనే భారత వైమానిక దళం తన విధులను నిర్వహిస్తుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి కొన్ని ముఖ్యవిషయాలు! భారత వైమానిక దళం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద వైమానిక దళం.  యుపిలోని ఘజియాబాద్‌లో ఉన్న హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆసియాలోనే అతిపెద్దది. IAF అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని అర్థం. భారత వైమానిక దళం వివిధ కార్యకలాపాలలో ముఖ్యమైన పాత్ర పోషించింది.  వీటిలో ఆపరేషన్ పూమలై, విజయ్, మేఘదూత్ మొదలైనవి ఉన్నాయి. భారత వైమానిక దళం IAF ఐక్యరాజ్యసమితితో శాంతి పరిరక్షణ మిషన్లలో కూడా పనిచేస్తుంది. భారత వైమానిక దళాన్ని గతంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని పిలిచేవారు.  ఈ పేరు స్వాతంత్ర్యం వరకు ఉన్నప్పటికీ,  స్వాతంత్య్రానంతరం రాయల్ అనే పదాన్ని తొలగించారు. IAFలో అధిక సంఖ్యలో మహిళా ఫైటర్ పైలట్లు, మహిళా నావిగేటర్లు, మహిళా అధికారులు ఉన్నారు, వీరు భారత వైమానిక దళానికి తమ సేవలను అందిస్తారు.  భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ ఫ్లీట్‌లో కూడా మహిళా ఫైటర్ పైలట్ ఉన్నారు. దేశంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో భారత వైమానిక దళం ఎల్లప్పుడూ సహాయక చర్యల్లో పాల్గొంటుంది.  వీటిలో గుజరాత్ తుఫాను(1998), సునామీ (2004), ఉత్తర భారతదేశంలోని వరదలు ఉన్నాయి.  అయితే, ఉత్తరాఖండ్‌లో వరదల సమయంలో చిక్కుకుపోయిన పౌరులను రక్షించడం ద్వారా IAF ప్రపంచ రికార్డు సృష్టించింది.  ఈ మిషన్‌కు 'రాహత్' అని పేరు పెట్టారు, ఈ సమయంలో భారత వైమానిక దళం దాదాపు 20,000 మందిని రక్షించింది. ఇలా భారత వైమానిక దళం ఆకాశమే హద్దుగా ప్రపంచంలో గొప్పగా ఎదిగి దేశానికి అన్ని వేళల్లో నేనున్నానని భరోసా ఇస్తుంది. భారత వైమానిక దళానికి సెల్యూట్ చేయాలి మరి.                                        ◆నిశ్శబ్ద.

వామ్మో జనాభా పెరిగిపోతోంది!

ఈ ప్రపంచం అంతా ప్రజలతో నిండిపోయినది. వృక్షాలు, జంతువులు, పక్షులు ఇలా అన్ని జీవుల మధ్య మనిషే అధికారికంగా అజమాయిషీ చేస్తున్నాడు. ఈ ప్రపంచంలో ప్రస్తుత జనాభా 786 వందల కోట్లు అని చెబుతున్నారు. ఈ 786 వందల కోట్లలో భారతదేశ జనాభా 17% తో 135 కోట్ల నుండి 140 కోట్లుగా ఉంది. ఇంత జనాభా ఈ భారతదేశ భూభాగంలో కవాతు చేస్తున్నట్టే అనిపిస్తుంది.  జులై నెల 11 వ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటారు. నిజానికి ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని గత ముప్పై సంవత్సరాల నుండి జరుపుకుంటూనే ఉన్నారు. ఇంతకీ ఈ ప్రపంచ జనాభా దినోత్సవం రోజున ఏమిచేస్తారు?? ప్రపంచంలో ఇంత జనాభా పెరిగిపోతుంటే చివరికి భూమి కొరత, ఆహారం కొత్త సంభవించదా?? అనే అనుమానాలు చాలామందికి ఉంటాయి. జనాభా పెరుగుదల! సంఖ్య పెరుగుతూ పోతే భాగాలు తగ్గుతూ పోతాయి. ఈ జనాభా పెరుగుదల విషయంలో అదే జరుగుతోంది. తిండి, నీరు, వసతి, నిత్యావసరాలు అన్నీ ఇబ్బందిగా మారిపోతున్నాయి. ఒక కుటుంబ సభ్యునికి అవసరం పెరిగితే అది ఆ కుటుంబ ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఎన్నో కుటుంబాలు బతుకుతున్న దేశ పరిస్థితి ఏంటి?? జనాభా పెరుగుదలవల్ల ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక మాంద్యం నెలకొంటుంది. జనాభాకు తగిన అభివృద్ధి లేకపోతే దేశం వెనుబడిపోతుంది.  నియంత్రణ మంచిదేనా? జనాభా పెరుగుదల నియంత్రణ అనేది దేశాన్ని అభివృద్ధి మార్గం వైపు నడిపిస్తుంది. ఎలా అంటే ఒక కుటుంబంలో ఇద్దరు పిల్లల కోసం పెట్టె అన్ని రకాల ఖర్చులను కలిపి ఒక పిల్లాడిని గొప్ప చదువులు చదివించడానికి ఉపయోగించవచ్చు. వేగవంతమవుతున్న ఈ జనరేషన్ లో డబ్బు మీదనే చాలా జీవితాలు చాలా నిర్ణయాలు తీసుకుంటాయి. అందుకే ఇద్దరు పిల్లలను కన్నవాళ్ళు ఒక్కరినే కనిఉంటే బాగుండేది అనో, లేదా ఇంకా ఎక్కువ పిల్లల్ని కన్నవాళ్ళు ఇంతమందిని కనిఉండకూడదు అనో అనుకునే సందర్భాలు కూడా వస్తుంటాయి. జీవితాలలో ఆర్థిక ఎదుగుదల ఉండాలంటే ఖర్చు కూడా ముఖ్యమైనదే. ఈ ప్రపంచ అవకాశాలను అందుకోవాలంటే సగటు దిగువ మరియు మధ్యతరగతి పౌరునికి ఎంతో క్లిష్టమైన సమస్యలు ఎదుకురవుతాయి. అన్ని రకాల రంగాలలోనూ పోటీ పెరుగుతుంది. నిరుద్యోగం కూడా ఎక్కువ అవుతుంది. ఫలితంగా దేశం ఆర్థిక ఎదుగుదలలో, అభివృద్ధిలో మందగిస్తుంది. ప్రజల కర్తవ్యం? సగటు భారత పౌరులుగా అందరి బాధ్యత ఈ దేశ అభివృద్హి మీద ఆధారపడి ఉంటుంది. అలాగే దేశంలో జనాభా పెరుగుదల అనేది కుటుంబ నియంత్రణ పాటించని వారి వల్లనే జరుగుతోంది. వేగంగా పెరిగే జనాభా వల్ల అనూహ్యంగా అంతర్జాతీయ వాణిజ్యం కూడా దెబ్బతింటుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. ఇలా అన్ని విధాలుగా దేశ గతిని మార్చేసే ఆయుధంగా ఈ జనాభా పెరుగుదల అనే అంశం కీలకంగా మారుతుంది. రాబోయే కాలాల్లో రేపటి తరాలు తిండి, ఆవాసం, నిత్యావసరాల కోసం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ జనాభా పెరుగుదల వల్లనే అడవుల శాతం, పంట భూముల శాతం తగ్గి భవనాలుగా మార్పు చెందుతున్నాయి. ప్రకృతి క్రమంగా విచ్చిన్నమవుతోంది. ఇన్ని నష్టాలను నిర్మూలించుకోవాలి అంటే ప్రతి వ్యక్తి కుటుంబ నియంత్రణ అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దాన్ని అమలుచేయాలి. ఇలా చేస్తే ప్రపంచ జనాభాలో రెండవ స్థానంలో ఉన్న భారతదేశం కాసింత అభివృద్హి, ఆర్థిక స్థితి అనే ర్యాంకులను కూడా అందుకుంటుంది.                                  ◆వెంకటేష్ పువ్వాడ.

మనిషి భయం విషయంలో చేసే వెర్రి ఆలోచన!!

మరణాన్ని చీకటితో పోల్చారు. 'నీలమేఘ విలసత్కా లాంజనాకారు. ఘోర నిశాతోత్కట దంష్ట్రు' అంటూ ఎఱ్ఱన భారతంలో యముడిని వర్ణించాడు. యముడు కారు నలుపు. వాడి కోరలు కలవాడు. ఇదీ యముడి వర్ణన. కానీ ఆశ్చర్యపత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ ఛాన్య ఆశ్చర్యవ్యమైన మధ్యశ్చకోని శ్రుత్వా ప్యేనం వేదనచైవకశ్చిత్౹౹ మరణం గురించి, దేహి దేహ పరస్పర సంబంధం గురించి వింతగా చూస్తారు. వింతగా మాట్లాడతారు. ఆశ్చర్యంతో వింటారు. ఎంత మాట్లాడినా, ఎన్ని విన్నా నిజంగా మరణం గురించి తెలుసుకున్నవారు ఎవ్వరూ లేరు. కాబట్టి మరణమంటే భయం వ్యక్తిలో అంతర్గతంగా ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ మరణభయాన్ని తర్కంతో జయించాలి. అది తప్పనిసరి. ఎవరూ తప్పించుకోలేరు. అదేమిటో ఎవరికీ తెలియదు. ఇక దాని గురించి భయపడి లాభం లేదు. లాభం లేనిదాని గురించి, మనం ఏమీ చేయలేని దాని గురించి భయపడటంలో అర్థం లేదు. ఎప్పుడో మరణం వస్తుందని ఇప్పటి నుంచీ బాధపడుతూ కూచుంటే, వచ్చే మరణం ఎలాగూ వస్తుంది. కానీ ఉన్న జీవితం చేజారిపోతుంది. కాబట్టి భయపడి లాభం లేదు, ఈ రకమైన 'వాదం' ప్రతి భయాన్నీ జయించేందుకు ఉపయోగించవచ్చు. ఏదో వస్తువు కొనాలని ఉంటుంది. కానీ దుకాణం వాడు మోసం చేస్తాడేమోనన్న భయంతో వెనుక ముందు ఆడుతుంటాడు. 'వస్తువు కొంటాను. మోసం చేస్తాడు. అయితే ఏంటట?” అనుకుని ముందుకు వెళ్తే పని అవుతుంది. పైగా "వాడు మోసం చేస్తాడని తెలిసీ మోసపోయానంటే, ఇక బాధపడే అర్హత నాకు లేదు" అనుకుంటే సమస్య లేదు. కొందరు ప్రతి చిన్న విషయానికీ 'ఏమౌతుందో' అని భయపడుతుంటారు. వారు అనుక్షణం తమని తాము ఇలా ప్రశ్నించుకుంటూ, తర్కించుకుంటూ భయాన్ని అధిగమించవచ్చు. ఒకామెకు ఇల్లు వదిలి సగం దూరం వచ్చాక ఇంటికి తాళం వేసిందో, లేదోనన్న అనుమానం కలిగింది. దాంతో ఆమె ప్రయాణమంతా కుదురుగా ఉండలేక పోయింది. తిరిగి ఇంటికి వచ్చిన తరువాత తాళం చూస్తే కానీ ఆమెకు శాంతి కలగలేదు. కానీ ఈ లోగా ఆమె ప్రయాణాన్ని ఎంజాయ్ చేయలేకపోయింది. ఆమె తోటివారి ఆనందం పాడైంది. ఇటువంటప్పుడు కూడా 'సరే. తాళం వేయటం మరిచిపోయాను ఐతే ఏమైంది? ఇంట్లో వస్తువులు పోతాయి. మళ్లీ కొనవచ్చు' అనుకోవచ్చు. లేకపోతే ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేసి చెప్పి 'కాస్త చూడండి' అని చెప్పవచ్చు. ఇలా, ఇక భయం కలిగితే దాన్ని తర్కంతో జయించటం అలవాటు చేసుకోవాలి. ఒకాయన రోజూ ఉదయమే వాకింగ్ కు వెళ్తాడు. ఐతే ఆయన నడిచే దారిలో చీకటి ఉంటుంది. కుక్కలు అరుస్తుంటాయి. కుక్క అరుపు వినగానే ఆయన వాకింగ్ మానేసి వెనక్కు వచ్చేస్తుంటాడు. ఆ వైపు వెళ్లాలంటే భయం. ఓ రోజు ధైర్యం చేశాడు. 'కుక్కలు ఏం చేస్తాయి? చెయ్యెత్తితే పారిపోతాయి' అనుకుని తడబడుతున్న గుండెను చిక్కబట్టుకుని చీకట్లోకి అడుగు వేశాడు. కుక్కలు అరుస్తూ, వాటి గోలలో ఈయనని పట్టించుకోలేదు. ఈయన వాకింగ్ కొనసాగించాడు. ఆ తరువాత తన భయాన్ని చూసి నవ్వుకున్నాడు. ఈ చిన్న భయం వల్ల ఎన్నాళ్లు వాకింగ్ మానేశాడో తలుచుకుని మరింత నవ్వుకున్నాడు. మన భయాలన్నీ ఇటువంటివే. కాబట్టి మనిషి తనలో భయాన్ని తరిమికొట్టాలి.                                      ◆ నిశ్శబ్ద.

మాటను బట్టి మనిషి, మనిషిని బట్టి మాట అని ఎందుకన్నారు?

ఎదుటివాడి అహంకారాన్ని సంతృప్తిపరుస్తూ, వాడిని అర్థం చేసుకుంటూ గౌరవంగా ప్రవర్తించటం వ్యక్తి ఔన్నత్యానికి నిదర్శనం. అంతే తప్ప 'ఎదుటివాడిని గౌరవించటం నా  స్థాయికి భంగం కలిగిస్తుందన్నట్టు ప్రవర్తించటం సమంజసం కాదు. మనం బ్యాంకుకు వెళ్తాం. చిరునవ్వుతో, ఓపికగా సమాధానం ఇచ్చేవారిని గౌరవిస్తాం. వారి దగ్గరకే మళ్ళీ మళ్ళీ వెళ్తాం. విసుక్కునేవారిని అసహ్యించుకుని దూరం పోతాం. కాబట్టి నోరారా, ప్రేమగా వ్యక్తులను, గౌరవించి, పలకరించటం వ్యక్తిత్వవికాసంలో అత్యంత ఆవశ్యకమైన అంశం. ఈ అంశాన్ని ఎంతో నైపుణ్యంతో నేర్పుతాడు నన్నయ, ఈ కింది పద్యంలో…. నిండుమనంబు నవ్యనవ  నీతసమానము పల్కు దారుణా ఖండల శస్త్రతుల్యము జ  గన్నుత విప్రుల యందు నిక్క మీ  రెండును, రాజు లందు విప రీతము గావున విప్రు డోపు, నో  పం డతి శాంతుడయ్యు నర పాలుడు శాపము గ్రమ్మఱింపగన్|| ఉదంకుడనే మహర్షి, గురుదక్షిణ కోసం పౌష్యుడనే మహారాజు దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఉదంకుడు తాత్కాలికంగా విచక్షణను మరచిపోతాడు. దాంతో కోపాలు పెరుగుతాయి. రాజు, మహర్షి ఒకరిని ఒకరు శపించుకుంటారు. తరువాత ఇద్దరూ తమ తప్పును గ్రహిస్తారు. మహర్షి తన శాపాన్ని ఉపసంహరించుకుంటాడు. రాజు ఉపసంహరించుకో లేకపోతాడు. మహర్షుల మనస్సు నవ్యనవనీతసమానం. నిండైనది. దాంట్లో క్రోధం ఉండదు. ఉన్నా తాత్కాలికమే. వారికి కోపం వస్తే వారి పలుకు వజ్రాయుధం లాంటిది. కానీ వారి మనస్సు వెన్నలాంటిది కావటంతో శాపాన్ని ఉపసంహరించుకోగలుగుతారు. ఎందుకంటే వారి కోపంలో స్వార్ధం లేదు. క్రోధం తాత్కాలికమే. కానీ రాజులు అలాంటివారు కాదు. వారు కపటులు, వారి మాట మెత్తగా ఉంటుంది. హృదయం శస్త్రసమానమైందిగా ఉంటుంది. రాజ్యం నడిపేందుకు రకరకాల వేషాలు వేయాలి. అధికారం నిలుపుకునేందుకు కుట్రలు పన్నాలి. వారి నిజాయితీలో స్వార్థం ఉంటుంది. వారి క్రోధం దీర్ఘకాలం ఉంటుంది. కాబట్టి వారు శాపాన్ని ఉపసంహరించుకోలేరు. ఇదీ మనకు అనుభవమే. ఒక వ్యక్తి మనకు సన్నిహితుడు. అతడు ఒకోసారి కోపంగా తిట్టినా మనం పట్టించుకోం. కోపం తగ్గిన తరువాత అతడే మన దగ్గరకు వస్తాడు, క్షమాపణ వేడుకుంటాడు. ఇక్కడ 'మాట' కన్నా మనసు ప్రాధాన్యం వహిస్తుంది. అంటే, వాక్కు ఎంత కఠినంగా ఉన్నా, మనస్సు మెత్తనైతే వాక్కులోని కాఠిన్యం, తీవ్రతలు తగ్గుతాయి. అందుకే, తల్లిదండ్రులు ప్రేమ కురిపిస్తూ, అప్పుడప్పుడు కఠినంగా వ్యవహరించినా, పిల్లవాడు వారి ప్రేమను అర్థం చేసుకోగలుగుతాడు. ఇక్కడే వ్యక్తి నోరార పిలవటం, ప్రేమగౌరవాలు ప్రదర్శించటం వంటి అంశాలు ఉపయోగిస్తాయి. కాబట్టి మన నిత్యజీవితంలో అనుక్షణం 'మాట' ప్రాధాన్యం వహిస్తుందని గ్రహించాలి. ఎదుటివారికి మనం మన మాట ద్వారానే అర్ధమౌతాం. కాబట్టి మాట స్పష్టంగా, నిజాయితీగా ఉండాలి. డొంక తిరుగుడుగా, వ్యంగ్యంగా, నిష్టురంగా మాట్లాడటం వల్ల లాభం లేదు. నిజాయితీగా, సత్యం పలకటం వ్యక్తి ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. అయితే ఈ సత్యం కూడా కుండ బద్దలు కొట్టినట్టు ఉండకూడదు. అప్రియమైన దాన్ని కూడా ప్రియంగా అయ్యేట్టు చెప్పాలి. అమంగళకరమైనదాన్ని కూడా మంగళకరమైన పదాలతో చెప్పాలి. ఇందుకు మనం 'వాక్కు' శక్తిని అర్ధం చేసుకోవాలి. మన లోంచి వెలువడుతున్న వాక్కు సరస్వతీస్వరూపం అని గ్రహించాలి. మనం మాట్లాడే ప్రతి మాటా ఆ వాగ్దేవికి మనం అర్పిస్తున్న నీరాజనంలా భావించాలి. అప్పుడు మన 'మాట' కొక కొత్త సొగసు వస్తుంది. ప్రతి మాటా ఆ వాగ్దేవి అర్చన గీతంలా పవిత్రతను ఆపాదించుకుంటుంది. స్వచ్ఛమైన, స్పష్టమైన వాక్కు ఆనందాన్ని కలిగించటమే కాదు, ఆరోగ్యానికి హేతువవుతుంది. అందుకే 'మాటను బట్టి మనిషి, మనిషిని బట్టి 'మాట' అన్నారు పెద్దలు.                                         ◆నిశ్శబ్ద

సంబరాల దసరాలో ఆసక్తికర విషయాలు!

  పండుగ అంటే పట్టలేనంత ఆనందం ప్రతి ఒక్కరికీ. కేవలం దేవతల పూజ, వారి కృపకు పాత్రులయ్యే సందర్భం మాత్రమే కాదు పండగ అంటే, ఇంటిల్లిపాదీ ఎన్ని సమస్యలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి కలసిమెలసి సంతోషంగా ఉంటూ జీవితంలో ఆనందాలు కలగాలని కోరుకునే రోజు కూడా. సంతోషం సగం బలం అని అంటారు పెద్దలు. ఆ సంతోషం వెంటబెట్టుకువచ్చేవి పండుగలు. ప్రస్తుతం దసరా మొదలయ్యింది. దుర్గా నవరాత్రులు తొమ్మిదిరోజులూ కన్నుల పండుగే. ఈ తొమ్మిది రోజుల్లో జరిగే విశేషాలు బోలెడు. ప్రతి ఇంట్లో ఆడవారు ఉద్యోగాలు, పరుగులతో ఎంత బిజీగా ఉన్నా పూజ విషయంలో మాత్రం రాజీ పడరు. దసరా నవరాత్రులలో జరిగే సంబరాలు ఏంటో తెలియని వారు కొందరుంటారు. వారు తప్పక తెలుసుకుని తీరాలి. నైవేద్యాలు! దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు జరిగితే ఆ తొమ్మిది రోజులూ ఇంట్లో ఘుమఘుమలే. రోజుకొక్క నైవేద్యం చేసి అమ్మవారికి పెడుతూ, ఇంటిల్లిపాదీ ఆరగించడం ఓ సంతోషం. నిజానికి సాధారణంగా చేసే వంటలకు, నైవేద్యం కోసం చేసే వాటికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా రుచి మొత్తం ప్రసాదానిదే అన్నట్టు ఉంటుంది. ఒకో అమ్మకు ఒకో రకమైన నైవేద్యం చాలా సింపుల్ గానే చేయచ్చు. ఇప్పట్లో ప్రతి ఒక్కటీ యూట్యూబ్ లో ఉంటాయి కాబట్టి వాటిని చూసి ఫాలో అయిపోవచ్చు వంట రాని వాళ్ళు కూడా. బొమ్మల కొలువు! దసరా బొమ్మల కొలువు నిజానికి కళ తగ్గిందనే చెప్పాలి. ఎక్కడో కొన్ని ఇళ్లలో తప్ప ఇది కనిపించదు. ఈ బొమ్మల కొలువుకు ఓ ప్రత్యేకత ఉంది. అదే ఈ సృష్టి గురించి నిగూడమైన అర్థం కూడా. బొమ్మల కొలువు అంతా ఈ ప్రపంచ మానవాళి, జీవులు అయితే వీటిని పాలిస్తూ, పోషిస్తూ ఆ అమ్మవారు ఉంటారని, అదే బొమ్మల కొలువులో నిజమైన అర్థమని చెబుతారు.  జమ్మి వృక్షం పూజ! ఈ దసరా వెనుక ఒక పండుగకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా మరొక ముఖ్యమైన విషయం ఉంది. అదే జమ్మి చెట్టు పూజ. పాండవులు వనవాసం వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆయుధాలు అన్నీ స్మశానంలో ఉన్న జమ్మిచెట్టు మీద శవం ఆకారంలో పేర్చి వెళతారు. వనవాసం, అజ్ఞాతవాసం పూర్తయిన తరువాత తిరిగి విజయ దశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి వృక్షం మీద నుండి తీసుకున్నారు. అప్పుడు జరిగిన యుద్ధంలో వారు విజయం సాధించారు కూడా. అందుకే జమ్మి వృక్షాన్ని పూజిస్తారు. రావణ కాష్టం! సీతమ్మను ఎత్తుకుపోయిన రావణాసుడి మీద రాముడు యుద్ధం చేసాడు. రామ, రావణ యుద్ధం తొమ్మిది రోజులు జరిగి, రావణ సంహారం పదవ రోజున జరిగిందని, ఆ రోజుని గుర్తు చేసుకుంటూ దసరా పండుగ రోజు పదితలల రావణుడి బొమ్మను దహనం చేస్తారు. దీనినే రావణకాష్ట అని కూడా అంటారు. చాలా చోట్ల ఇది జరుగుతుంది. మహిషాసుర వధ! అమ్మవారు ఈ లోక ప్రజలను కాపాడటం కోసం తొమ్మిది రోజులు మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి దసరా పండుగ రోజున మహిషాసురుడిని సంహరిస్తారు. ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని చోట్ల మహిషాసుర వధ నిర్వహిస్తారు. నవరాత్రుల ఆరాధన! ముంబయి, కలకత్తా వంటి ప్రాంతాలలో నవరాత్రులు జరిగినన్ని రోజులూ అద్బుతమే. ఆ రోజులలో అమ్మవారిని ప్రతిష్టించి వినాయక నవరాత్రులలాగా జరుపుతారు. దసరా పండుగ పూర్తవగానే అమ్మను నిమజ్జనం చేస్తారు. ఇది ఆ ప్రాంతాలకే చెందిన ప్రత్యేకత. బతుకమ్మ సంబరాలు! తెలంగాణ ప్రాంత ప్రజల జీవనదృశ్యం బతుకమ్మ పండుగలో కనిపిస్తుంది. తెలంగాణ తమ రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించింది కూడా. బతుకమ్మను పేర్చడం కూడా గొప్ప కళ. ఉదయమంతా పూజలు, బతుకమ్మ పేర్చడం, నైవేద్యాలతో గడిచిపోతుంది. సాయంత్రం అవ్వగానే మహిళలందరూ ఒకచోట చేరి బతుకమ్మ పాటలు పాడుతూ, చీకటి పడుతుండగా బతుకమ్మను నీళ్లలో వదులుతారు. ఇలా తొమ్మిది రోజులు అయ్యాక దసరా రోజు సంబరాలు జరుపుకుంటారు. ఇలా దసరా పండుగ రోజులలో ఎన్నో ప్రత్యేకతలు ఆయా ప్రాంతాల విశిష్టత ఆధారంగా జరుగుతాయి.                                        ◆నిశ్శబ్ద.

బాధ్యతలను పంచుకోవడమంటే ఏంటి?

ప్రతీ పుట్టుకకీ ఒక ప్రయోజనం వుంది. మన నైపుణ్యాలనీ, శక్తి సామర్థ్యాలనీ అధికంగా ఉపయోగించుకుంటూ, బాధ్యతలను పంచుకుంటూ, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందకర జీవితాన్ని కొనసాగించాలి. ఇదే మనిషి జీవితంలో అందరికీ కావలసినది కూడా. కానీ మనుషులు కొంచెం ఆశ ఎక్కువ గలవారు. ఉన్నదాంతో తృప్తి పడరు. ఇంకా ఇంకా కావాలని అనుకుంటూ వుంటారు.  అయితే మనుషులు జీవితంలో తమకు కావలసిన వాటిని గట్టిగా అడిగి మరీ సాధించుకుంటారు. వీటినే హక్కులు అని అంటారు. ప్రతీ మనిషి హక్కులతోబాటు బాధ్యతలను కూడా పంచుకోవటం నేర్చుకోవాలి. ఒక విద్యార్థిగా, ఉద్యోగిగా, భర్తగా, లేక భార్యగా సంఘంలో సభ్యుడిగా, ఒక అన్నగా, ప్రతి విషయంలోనూ బాధ్యతలను పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం బాధ్యతలను పంచుకోవటం ద్వారా మనకంటూ ఒక విలువ ఏర్పడుతుంది. విలువలు మనిషి జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆ విలువలే మనిషిని ప్రత్యేకంగా నిలబెడతాయి. మనిషిలో నైతిక, సామాజిక, ధార్మిక విలువలు తప్పకుండా ఉండాలి. అవి ఉన్న వ్యక్తి లో గొప్ప వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది. మనందరిలో వున్న బలహీనత ఏమిటంటే బాధ్యతల నుండి తప్పించుకోవటం, ఇక్కడ బాధ్యత అనే పదాన్ని బట్టే అది ఆ వ్యక్తి తప్పకుండా నిర్వహించాల్సిన పని అనే విషయం అర్థమవుతుంది. కానీ అందరూ ఏమి చేస్తారు?? ఆ పని ఎక్కడ చేయాల్సి వస్తుందో అనే బద్దకంతో ఏవో కుంటి సాకులు, అబద్ధాలు చెప్పి ఆ పని నుండి మెల్లగా దూరం వెళ్ళిపోతారు. కానీ అందరూ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే బాధ్యతలను స్వీకరించటం వల్ల మనకు ప్రతీ విషయంలోనూ అనుభవం అనేది ఏర్పడుతుంది. ఈ అనుభవం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొనే తెలివితేటలు మనకు లభ్యమవుతాయి. అనుభవమే గురువు, అనుభవాల సారమే జీవితం అని స్వామి వివేకానంద చెప్పిన విషయం అందరూ గుర్తుచేసుకోవాలి.   ఏ పనినైనా సరే తప్పించుకోవడానికి, సాకులు చెప్పడానికి ప్రయత్నించకూడదు. ఎప్పుడూ ఏదోసాకులు చెప్పడానికి ప్రయత్నించేవారు జీవితంలో ఏ పని చెయ్యడానికి కూడా ముందుకు రాలేరు. ఏ పనీ చేయలేరు, పనులు చేయకుండా తప్పించుకునేవారు పనులు చేయడం చేతకాకుండా నిస్సహాయుడిగా, చేతకానివాడిగా తయారవుతున్నాడని అర్థం. అంటే తనని తాను అలా మార్చుకుంటున్నాడు. అలాంటి వాడు  కొంచెం కూడా విలువలను కూడా దక్కించుకోలేరు.  ఒక పనిని చేయకపోవడానికి వంద కారణాలు చెప్పవచ్చు. కానీ అదే పనిని చేయడానికి ఎన్ని సమస్యలు ఉన్నా, ఎంత అసౌకర్యం ఉన్నా చెయ్యాలన్న మనస్సు ఒక్కటుంటే చాలు చేసేస్తారు. మనలో చెయ్యాలన్న తపన వుండాలి, మన మనస్సును మనమే ప్రోత్సహించుకోవాలి. చెయ్యగలమనే నమ్మకాన్ని మనసుకు ఇవ్వాలి. ఆ రకమైన మనస్తత్వాన్ని మనమే సృష్టించుకోవాలి. అప్పుడే మనం ఏ పనినైనా చెయ్యగలం. ఏ పనినైనా మనసుపెట్టి, బాధ్యతతో చేయగలం అన్న మనస్తత్వంతో చేయాలి. చేయగలమన్న నమ్మకమే మన చేత ఏ పనినైనా చేయిస్తుంది. బాధ్యత అనేది అభివృద్ధికి దారితీస్తుంది. ఈ విధంగా పని చేయాలనే నమ్మకం మనిషిలో బాధ్యతలను మెల్లిగా అభివృద్ధి చేస్తే ఆ బాధ్యతలను అందరూ పంచుకుని వాటిని సక్రమంగా నిర్వర్తిస్తే అప్పుడు ప్రతి కుటుంబం, సమాజం, నేటి వ్యవస్థ అంతా సవ్యంగా ఉంటుంది.                                        ◆నిశ్శబ్ద.

ప్రపంచము-శాంతి అంతిమ లక్ష్యమేంటి?

శాంతి అనేది ఎన్నో జీవితాలను సమస్యల నుండి బయట పడేస్తుంది. ఎలాంటి భయాందోళనలు లేని జీవితం గడిపేలా చేస్తుంది. అందుకే ఎందరో ప్రముఖులు శాంతి కోసం పోరాడారు. ప్రపంచానికి శాంతి కావాలని, అదే ప్రపంచాన్ని ఉన్నతంగా నిలబెడుతుందని. శాంతి వల్లనే అన్ని దేశాలు, అన్ని వర్గాలు ప్రజలు తమ జీవితాన్ని తాము హాయిగా గడపగలుగుతారు.   ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 21ని అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా జరుపుకుంటారు.  ఈ శాంతి దినోత్సవం రోజు ఐక్యరాజ్యసమితి 24 గంటల పాటు ఎక్కడా హింస, పీడించడం,  కాల్పులు జరపడం వంటివి చేయకూడదని. దీని ద్వారా కలిగే చిన్నపాటి మార్పు ప్రజలలో ఆలోచనను రేకెత్తి ఆ మార్పు దీర్ఘకాలం వైపు మరలేలా అడుగులు పడటానికి మూలమవుతుందని నిర్ణయించింది. ఈ విధంగా  శాంతి దినోత్సవాన్ని పాటించడం ద్వారా శాంతి ఆదర్శాలను బలోపేతం చేయడానికి  సాధ్యమవుతుంది.   ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు హింసాత్మకమైన, రక్తపాతమైన గతాన్ని కలిగి ఉన్నాయి. ఈ దేశాలలో కొన్ని తమ దేశ పౌరుల భవిష్యత్తును, దేశ భవిష్యత్తును, ప్రపంచంలో వారి మనుగడను దృష్టిలో ఉంచుకుని తమ ధోరణి మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ, శాంతి దినోత్సవాన్ని తమలో అంతర్భాగం చేసుకోవడానికి, ప్రజల ఆలోచనల్లో మార్పులు తీసుకురావడానికి ముందడుగు వేస్తున్నాయి. అయితే మరికొన్ని దేశాలు మాత్రం సరిహద్దులలో ఉన్న ఇతర దేశాలతో హింసాత్మకంగా కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతికి భంగం కలిగిస్తుంటాయి.  ఇలాంటి వాటిని అరికట్టడానికే ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే ఈ శాంతి దినోత్సవ చరిత్ర ఏమిటి??  1981లో ఈ శాంతి దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఆమోదం చేయబడింది.ఆ తరువాత ఇరవై సంవత్సరాలకు ప్రపంచంలో చాలా దేశాలు శాంతి దినోత్సవం వైపు అడుగులు వేసాయి.  శాంతి దినోత్సవం మాట!! చివరి ఏడాది కరోనా విలయతాండవం చేస్తుండటంతో కరోనా నుండి ప్రపంచం కోలుకోవాలనే థీమ్ తో శాంతి దినోత్సవాన్ని జరుపుకున్నారు. అయితే 2022 సంవత్సరంలో శాంతి దినోత్సవాన్ని జాత్యహంకారం నశించాలనే నినాదంతో జరపాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ప్రపంచంలో ఎన్నో దేశాలలో జాతి, వర్గ బేధాలను అనుసరించి మనుషుల మీద దాడులు జరుగుతున్నాయి. దేశాలు, దేశాల మధ్య ఏర్పడిపోయే ఈ అభద్రాభావ చర్య మనుషుల్ని, సమాజాన్ని, సరిహద్దు ప్రాంతాల ప్రజలను, ముఖ్యంగా విదేశాలకు వెళ్లే వారిని భయాందోళనలో నెట్టేస్తాయి. శాంతి బహుమతి!! ప్రపంచ వ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసిన వారికి, అహింస కోసం పోరాడిన వారికి నోబెల్ శాంతి బహుమతి ప్రదానం చేస్తారు. మొదటి నోబెల్ శాంతి బహుమతి 1901లో అందించారు. దేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు, సౌబ్రాతృత్వం కోసం దేశాల మధ్య పగలు, శత్రుత్వాలు తగ్గించే దిశగా కృషి చేసేవారికి శాంతి బహుమతి అందజేయడం జరుగుతుంది.  ప్రశాంత దేశం!! ప్రపంచంలో అత్యంత ప్రశాంత దేశంగా 2008లో ఐస్ ల్యాండ్ గుర్తించబడింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం దాని స్థానాన్ని అది నిలబెట్టుకుంటూ వస్తోంది.  కొన్ని ఆసక్తికర విషయాలు!! 2015లో హింస వల్ల జరిగిన ఆర్థిక వ్యయం 13.6 ట్రిలియన్లు.  సెప్టెంబర్ 2015 నాటికి హింసాత్మక విషయాలను కలిగి ఉన్న ఉగ్రవాద వెబ్‌సైట్‌ల సంఖ్య 9,800 గా ఉంది. ఇవన్నీ హింసను ప్రేరేపిస్తాయ్.  1992 మరియు 2019 మధ్య మహిళా సంధానకర్తల శాతం 13%. 1992 మరియు 2019 మధ్య ప్రపంచవ్యాప్తంగా ప్రధాన శాంతి ప్రక్రియల్లో సంతకం చేసిన మహిళల శాతం 6%.   2015 మరియు 2019 మధ్య కాల్పుల విరమణ ఒప్పందాల శాతం11%. ఇందులో లింగ నిబంధనలు కూడా ఉన్నాయి.  ప్రపంచంలోని అత్యంత ఘోరమైన ఆహార సంక్షోభం కారణంగా యెమెన్ జనాభాలో అంచనా వేసిన వారి సంఖ్య 15.9 మిలియన్లు.   2019లో తీవ్రమైన ఆకలితో జీవిస్తున్న వారి సంఖ్య 135 మిలియన్లు.   సంఘర్షణ చెందుతున్న  దేశాలలో తీవ్రమైన ఆకలితో బాధపడుతున్న వ్యక్తుల శాతం 60%  అక్టోబర్ 2020 నాటికి మహిళలు, శాంతి  భద్రతపై జాతీయ కార్యాచరణ ప్రణాళికలను కలిగి ఉన్న దేశాల సంఖ్య 88.    COVID-19 సంక్షోభానికి ప్రతిస్పందనగా జాతీయ ప్రభుత్వాలు రూపొందించిన విధాన చర్యల సంఖ్య 417.    2016లో సాయుధ పోరాట ప్రాంతాల్లో నివసిస్తున్న యువత 408 మిలియన్లు అని అంచనా. ఇకపోతే ప్రపంచ శాంతి దినోత్సవం సందర్భంగా అందరూ తెలుసుకోవలసిన విషయాలు. ప్రపంచం, ప్రపంచం చుట్టూ ఉన్న పరిస్థితులు, విషయాలు అన్నీ తెలుసుకుని వాటిని అర్థం చేసుకోవాలి.  ఆర్థిక, ఆహార భద్రతను సామాజిక పరంగా దృడం చేసుకోవాలి. అన్ని రకాల, అన్ని వయసుల వారికి కేటాయించబడిన హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలి. సమానత్వం కోసం, సమన్యాయం కోసం పోరాడాలి. ప్రజాస్వామ్య నిర్ణయాలను, ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఉద్దేశ్యాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా నడుచుకోవాలి.                                        ◆నిశ్శబ్ద.

ఇంటిలోకే పచ్చదనం.. ప్రకృతితో మమేకం

పచ్చదనాన్ని ఎవరు ఇష్టపడరు! మనమందరం ఇష్టపడతాం. మొక్కల పెంపకానికి సరిపడా ఖాళీ స్థలం లేకపోయినా.. గార్డెనింగ్‌పై ఉన్న ప్రేమ మొక్కలు పెంచాలనే మీ కోరికను మరింత పెంచేస్తుంది. నీడలో మరియు తక్కువ సూర్యకాంతిలో జీవించే వివిధ రకాల మొక్కలను ప్రకృతి మనకు అందిస్తుంది. అవి సులభంగానే లభిస్తాయి. కానీ కొన్ని మాత్రం చాలా అరుదుగా మరియు తక్కువ అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ నగరం మధ్యలో అన్యదేశ ఇండోర్ ప్లాంట్ కేంద్రం ఉంది. ఇది హైదరాబాద్‌ లోని మొక్కల ప్రేమికులకు అందమైన అరుదైన మొక్కలను అందిస్తుంది. ఇది మీ ఇండోర్‌ను రిఫ్రెష్ చేయడమే కాకుండా మీ ఇళ్లలోకి ప్రకృతిని తీసుకొచ్చినట్లు ఉంటుంది. ప్లాంటిక్ అనేది ఇండోర్ మొక్కలు, బోన్సాయ్, ఇండోర్ చెట్లు, సక్యూలెంట్స్ ను విక్రయించే ఒక ప్రత్యేకమైన స్టోర్. మొక్కలను సక్యూలెంట్స్ మరియు కాక్టితో మినియేచర్ గార్డెనింగ్‌లో ప్రదర్శించవచ్చు. ప్లాంటిక్ మీ ఇళ్లు మరియు కార్యాలయలను పచ్చదనంగా మార్చడంలో సహాయపడుతుంది. వారు మీ ఇండోర్ గార్డెన్‌లు, బాల్కనీ స్పేస్‌లు, టెర్రస్ గార్డెన్‌లు మరియు పోర్చ్‌లను కూడా నిర్వహిస్తారు. 9160608787@King Kazemi పై మీరు వారిని సంప్రదించవచ్చు.

సక్సెస్ వెంట రావాలంటే దీన్ని నమ్మాలి!

మనిషి జీవితంలో పనులను చేసే విధానాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. సాధారణంగా చేసిన పనికి సాధారణమైన పలితం ఉండొచ్చు, అదే పనిని మరింత కష్టపడి చేస్తే ఆ పనికి దక్కే ఫలితం మరింత గొప్పగా ఉండొచ్చు. అంటే  దక్కే ఫలితం అంతా చేసే విధానంలోనే ఉంటుంది.  కష్టపడి పనిచేస్తే దేనినైనా సాధించవచ్చు. అందుకే కష్టేఫలి అన్నారు. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం లభిస్తుంది. కష్టపడి అంకితభావంతో పనిచేయటం ప్రారంభిస్తే విజయాలు వాటంతటవే వస్తాయి. కష్టపడకుండా అన్నీ కావాలనుకోవటం అసమర్థత అవుతుంది. అసమర్థత మాత్రమే కాదు మనుషుల్లో ఉన్న మూర్ఖత్వం కూడా అదే. అలా అనుకునే వారు ఎప్పటికీ ఏమీ సాధించలేరు. కాబట్టి విజయాలు సాధించడానికి వంకర మార్గాలు, సులువైన దారులు, వేరే ఇతర ఆలోచనలు ఏమీ ఉండవు.  కేవలం కష్టపడాలి. కొందరు డబ్బు అడ్డు పెట్టుకుని పనులు విజయవంతం చేసుకుంటారు. అపుడు అది విజయం అవ్వదు. కష్టపడి సాధించుకునేది మాత్రమే విజయం అనబడుతుంది. కష్టపడితే దేనినైనా సొంతం చేసుకోవచ్చు. కష్టపడి అంకితభావంతో పనిచేయగలగటమే అదృష్టం! కష్టపడి పనిచేసే అవకాశం లభించడమే ఒక అదృష్టం! అటువంటి అదృష్టం మనల్ని వరిస్తున్నప్పుడు మనం తలుపులను మనస్సుని మూసుకుని కూర్చుంటే ఏ ప్రయోజనాన్నీ పొందలేము. అవకాశాలు మనల్ని వరిస్తున్నప్పుడు మనం అందుకోవడానికి సిద్ధంగా వుండాలి.  రోదసి ప్రయోగానికి సిద్ధంగా వున్న ఏస్ట్రోనాట్ లాగా, సముద్రగర్భంలోకి వెళ్ళే డైవర్లాగా సిద్ధంగా వుండాలి. ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ ఆపరేషన్ కి కావలసిన వస్తువులన్నీ ముందుగా ఆపరేషన్ థియేటర్ తో సహా సిద్ధం చేసుకుంటారు. వ్యాపారం చేసేవారు వ్యాపారానికి కావలసిన అవకాశాలతో సిద్ధంగా ఉంటారు. ఇలా ప్రతిదానికి సిద్ధంగా ఉండటం ఎంత ముఖ్యమో, విద్యార్థులు పరీక్షల కోసం కావలసిన మెటీరియల్ తో సిద్ధంగా ఉండటం అంతే అవసరం. ప్రతి విషయంలోనూ కష్టపడే గుణం అలవరచుకోవాలి. ఎందుకంటే కష్టం వెనకాలే ఫలితం కూడా ఉంటుంది. కష్టపడడం వల్ల మన శ్రమ ఏమీ వృధాకాదు. అందుకు సంబంధించిన ఫలితం ఇవ్వాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎల్లుండు కాకపోతే ఇంకొకరోజు ఇలా ఎప్పటికైనా ఆ ఫలితం లభిస్తుంది. 'చేతకానితనముంటే జాతకాన్ని నిందించకు, నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించకు' అంటారు ఓ మహానుభావుడు.  మనిషిలో  చేతకానితనం ఉన్నప్పుడు, ఆ మనిషి తన వైఫల్యాలకు కారణంగా జాతకాన్ని చూపించాల్సిన అవసరం ఉంటుందా?? అలాగే నాసిరకంగా, ఒకరికి నమ్మకం ఇవ్వలేని సరుకు పెట్టుకుని అసలు అమ్మకం అనే విషయం గురించి ఎందుకు అరవాలి. సరుకు మంచిది అయితే కొనకుండా ఉంటారా ఎవరైనా?? ఈ చేతకానితనం, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి జాతకాలను, బయట పరిస్థితులను సాకుగా చూపెడితే మనిషికే నష్టం తప్ప బయటివాళ్లకు ఏంటి నష్టం?? మనలో సమర్ధవంతమైన నైపుణ్యాలు ఉండాలి. అప్పుడు జీవితంలో విజయాలు సాధిస్తాము. జీవితంలో అరుదుగా వచ్చే అవకాశం లభించినపుడు మీనమేషాలు లెక్కించుకుంటూ వెనుకాడకూడదు. అదృష్టం వరించినంత కాలం మన తెలివితేటలే దానికి కారణం అని చెబుతుంటాము. దురదృష్టం వెంటాడు తున్నప్పుడు దానికి కారణం జాతకాలని, వాస్తు అని చెప్పడం మంచి పద్ధతి కాదు. భారతదేశంలో చాలామంది సంపన్నులు తమ స్వయం కృషితో ఎదిగిన వారే కాని, వారసత్వం మీద వచ్చిన వారుకాదు. కష్టపడితే ఫలితం లభిస్తుందన్న నమ్మకం కలిగివుంటే విజయాలను సొంతం చేసుకోవచ్చు. కష్టించి పనిచేస్తే భవిష్యత్ మన గుప్పిట్లోనే వుంటుంది. అందుకే కష్టాన్ని నమ్మితే బాగుపడే వాడే కానీ చెడిపోయేవాడు లేడు ఈ ప్రపంచంలో. ఆ విషయం గుర్తుపెట్టుకుంటే కష్టం వైపు క్రమంగా నడుస్తారు ఖచ్చితంగా.                                      ◆నిశ్శబ్ద.

మంచి వ్యక్తిత్వం ఇలా సాధ్యం!

మనిషిలో మంచితనం అనేది ఒక గొప్ప గుణం. ఈ గుణం ద్వారా మనిషికి సమాజంలో ఒక మంచి స్థానమంటూ ఏర్పడుతుంది. మంచితనాన్ని నింపుకున్న వ్యక్తిని మంచితనానికి నిదర్శనంగా అతనొక మంచి వ్యక్తిత్వం కలిగినవాడు, ఆమె మంచి వ్యక్తిత్వం కలది అని గుర్తుచేసుకుంటూ ఉంటారు. కానీ చాలామంది వ్యక్తిత్వం విషయంలో ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు. తమదగ్గర డబ్బు ఉందనో, గొప్ప ఫ్యామిలీ బాక్గ్రౌండ్ ఉందనో, ఇతరుల అవసరం తమకు రాదు అలాంటప్పుడు మంచిగా ఎందుకు ఉండాలి అనే ఆలోచనతోనో మొత్తానికి వ్యక్తిత్వాన్ని మంచిగా ఉంచుకోరు. కానీ ఈ సమాజంలో విలువ అనేది డబ్బును, స్థాయిని వచ్చినా చివరికి వ్యక్తిత్వం దగ్గరే నిజమైన గౌరవం అనేది ఆగుతుంది. మనం సమాజంలో మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలంటే తప్పనిసరిగా కొన్ని లక్షణాలను కలిగి వుండాలి. మంచి వ్యక్తిత్వం సంపాదించుకోవడం అనేది మనమీదే ఆధారపడి వుంటుంది. మనిషి అనుకుంటే దేనినైనా చేయగలడు, ఏమైనా సాధించగలడు అంటారు కదా. అలాగే మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించాలంటే మొదటిగా మనం అన్ని విషయాలలోనూ చాలా ధైర్యంగా, నిజాయితీగా వుండాలి. ఏ విషయం లోనైనా సరే ఆడంబరంగా వుండకూడదు. అట్లాగే మనం ఎప్పుడూ కూడా స్థిర మనోనిశ్చయం కలిగివుండాలి. మనం ఏవైనా చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు విజయాలు సాదించినప్పుడు మనం సాధించిన దానిపట్ల గర్వంగా వుండడంలో తప్పులేదు. ఎందుకంటే అది కష్టం వల్ల దక్కిన ప్రతిఫలం కాబట్టి. కానీ  అహంకారం మాత్రం వుండకూడదు. అహంకారం అనేది మనల్ని అణచివేస్తుంది. మనం ఎప్పుడూ కూడా ప్రక్కవారితో అంటే ఎవరితో ల్నైనా మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడాలి. అంతేకాని దురుసుగానో లేక అసలు మాట్లాడటం ఇష్టం లేనట్టు బలహీనంగా మాట్లాడకూడదు. బలహీనం అనేది మనలో ఉన్న నిరాశను నిరాసక్తిని తెలియజేస్తుంది. ఎందుకంటే నోటి వాక్కు చాలా బలమైనది. నోటి వాక్కును ఆయుధంగా వర్ణిస్తారు పెద్దలు. అందుకే ఈ సమాజంలో ప్రతీది కూడా నోటివాక్కుతో ముడిపడి వుంటుంది. మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం సాధించిన వాటి పట్ల సంతృప్తిపడాలి. అంతేగాని అలక్ష్యంగా వుండకూడదు. మనలక్ష్యం పట్ల మనకు డిటాచ్మెంట్ తో కూడిన ఎటాచ్మెంట్ వుండాలి. అంటే ఆ విజయం మనదే కావచ్చు కానీ విజయం సాధించిన తరువాత ఎప్పుడూ దాన్నే గుర్తుచేసుకుని తరువాత జరగవలసిన పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. మంచి పేరును పొందగలము.  కొందరు సమయం సందర్భం లేకుండా అర్ధం పర్ధం లేకుండా, మనసులో ఉన్న విషయం ఏదైనా సరే దాన్ని వెళ్లగక్కేస్తుంటారు.  పర్యవసానాలు ఏమిటో గ్రహించకుండా అనవసరంగా ఏదేదో మాట్లాడటం మానాలి. అలా మాట్లాడడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి, వాటి నుండి బోలెడు సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఏ వ్యవహారంలోనైనా, తగాదాల్లోనైనా నేర్పుగా, ఓర్పుగా వ్యవహరించాలి. తామరాకు మీద నీటిబొట్టులా ఉండాలి.  మన చెవినపడ్డ ప్రతీ విషయాన్ని నిజమని నమ్మడం మానుకోవాలి. ఇతరుల మాటలను, చేతలను, జరుగుతున్న విషయాలను తప్పుగా అర్ధం చేసుకోకూడదు. అత్యుత్సాహంతో చేసేపనులు చివరకు సమస్యలే తెచ్చిపెడతాయి. ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో పలకరించాలి. ప్రేమగా మాట్లాడాలి. ఎప్పుడూ కూడా తీరికలేనట్లు ప్రవర్తించకూడదు. ప్రస్తుత కాలంలో చాలామంది చేసేతప్పు అదే. తీరికలేదు అన్నట్టు తప్పించుకు తిరుగుతారు. మంచి వ్యక్తిత్వం కావాలన్నా, నలుగురితో సత్సంబంధాలు ఉండాలన్నా ఎదుటివారికి కూడా వీలైన వరకు సమయాన్ని కేటాయించాలి. అలాగని పూర్తిగా వ్యక్తిగత పనులు వదిలేసుకొని మరీ అందరితో ఉండమని ఎవరూ చెప్పారు. అట్లాగే ఏదైనా తగాదా వచ్చినప్పుడు అవతలి వాళ్ళే ముందుగా దిగి రావాలని ఎదురు చూడకూడదు. మనమే మాట్లాడానికి ముందుకు రావాలి. మనం ఈ లక్షణాలు అన్నింటిని కలిగివుంటే ఈ సమాజంలో మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవచ్చు. మనం ఈ లక్షణాలన్నింటిని కలిగి వుండడానికి ప్రయత్నించాలి. నిజం చెప్పాలంటే ధైర్యం కలిగినవాళ్లే అన్నిటికి సిద్ధంగా ఉండగలరు. ధైర్యవంతుడిదే ఈ భూమి అన్నారు వివేకానందుడు ఆ విషయం మరిచిపోకండి.                                        ◆నిశ్శబ్ద.

మనిషికి మానసిక ధైర్యం అవసరమెంత?

అందరి జీవితాలు వడ్డించిన విస్తరి కాదు. ఎంతో కష్టపడాలి. మనం విజయాలు సాధిస్తున్నప్పుడు జీవితం ఎంతో సంతోషదాయకంగా అనిపిస్తుంది. కొందరుంటారు ఎదుటివారు విజయం సాధించగానే, ఉన్నత స్థాయిలోకి వెళ్లారని తెలియగానే అదేదో ఒక్కసారిగా ఆ స్థానానికి వెళ్లిపోయినట్టు ఎంతో ఈసీ అన్నట్టు చెప్పేస్తారు. కానీ ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాల కష్టమే వారి ప్రస్తుత విజయానికి కారణం అనే విషయాన్ని తెలుసుకోరు. అంతేనా గెలిచిన వారి వెంట ఎంతోమంది వెళతారు అదే పరాజయాల బాటలో నడుస్తున్నప్పుడు వెనక వచ్చేవారు ఎవరూ ఎక్కువగా ఉండరు. అలాంటప్పుడు మనుషులు నిరాశకు లోనవుతారు. అలాంటప్పుడు జీవితం విషాదమయంగా బాధల సుడిలో ఉన్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ మనం చేసే పని అద్భుతంగా చేసి తీరాలి.  మనం కష్టాలలో ఉన్నాం కదా అని చేసే పనిలో నిర్లక్ష్యం చూపకూడదు. దీనికి మానసిక ధైర్యం కావాలి. ప్రపంచంలో మనం ఏం కోల్పోయినా ఫర్వాలేదు. కానీ మానసిక ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. మానసిక ధైర్యమే మనకు దీర్ఘకాలిక విజయాలను చేకూర్చి పెడుతుంది. మానసిక ధైర్యం అంటే సమస్యలు వచ్చినప్పుడు వాటిని ఎంతో తెలివిగా అర్థం చేసుకోవడం,సమస్య ఏమిటో గుర్తించడం, సమస్య అర్థమయ్యాక దానికి పరిష్కారాన్ని వెతకడం, ఈ ప్రాసెస్ జరిగే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవ్వవచ్చు, ఎన్నో నొచ్చుకునే విషయాలు భరించాల్సి రావచ్చు. కానీ వాటన్నిటినీ భరించాలి. అలా బాధలను ఎదుర్కొనే మానసిక ధైర్యాన్ని పెంచుకోవాలి.  చేసే పనులలో ఎన్నో ఒడిదుడుకులు, అవరోధాలు ఉన్నప్పుడే అప్పుడే మానసిక ధైర్యం అవసరం అవుతుంది. అలాంటప్పుడు మానసిక ధైర్యం ఎంత గొప్పదో, అది మనిషిని ఎలా నిలబెడుతుందో, మనిషి జీవితాన్ని ఎలా మలుపు తిప్పుతుందో అర్థమవుతుంది.  బాధల్ని, కష్టాల్ని, ఆర్థిక సమస్యలనూ అధిగమించడానికి మనం చేయాలనుకునే పనులను ఉన్నతంగా చేయడానికే ప్రయత్నించాలి. వీటి ఫలితం నూటికి నూరు శాతం వ్యతిరేకంగా వచ్చినా ధైర్యాన్ని సడలిపోనివ్వకూడదు. లక్ష్యం వైపుగానే అడుగులు వేయాలి తప్ప బేరువుగా పారిపోకూడదు. కంఫర్ట్ బుల్ జోన్ నుంచి బయటికి వచ్చినా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. కంఫర్ట్ జోన్ అంటే ఎప్పుడూ సమస్యలు రాకుండా సుఖంగా గడిచిపోవడం. అలాంటి సుఖం మనిషికి మంచిది కాదు. భవిష్యత్తులో ఎన్నో కష్టాలు తెచ్చిపెడుతుంది, కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వలేదు.  ప్రేక్షకుడి స్థాయి నుంచి ఫెర్ ఫార్మెన్స్ స్థాయికి ఎదగాలి. చప్పట్లు కొట్టే దశ నుంచి చప్పట్లు కొట్టించుకునే దశకి ఎదగాలి. అది మనిషిలో రావలసిన మార్పు. మనిషి ఒకే సర్కిల్ లో ఉండిపోతే అలా ఎదగడం ఎప్పటికీ సాధ్యం కాదు. మన మానసిక ధైర్యమే మనకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని కలిగిస్తుంది. మనం ఓటమిలో ఉన్నప్పుడు మన శత్రువుల మాటలకు, విమర్శలకు మౌనంగానే సమాధానం చెప్పాలి. ఇతరులు మన శక్తి సామర్ధ్యాలను శంకిస్తున్నప్పుడు, అనుమానిస్తున్నప్పుడు నిశ్శబ్ధంగానే రెట్టింపు పనిచేసి మనల్ని మనం ఋజువు చేసుకోవాలి.  పరాజయాలలో ఉన్నప్పుడు మన పరాజయాలకు కారణాలుగా ఇతరులను నిందించవద్దు. సహనంతో వేచి ఉండాలి. మన చేతకానితనానికి ఇతరులను నిందించకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచం, ఈ భూమి మనదే. ఇక్కడ దొరికే ప్రతి అవకాశం మనదే. మనం ఉపయోగించుకోవాలి. మనమే భూమి పుత్రులం. అవకాశాలకు జాతి, మత, కుల, ప్రాంతాలు లేవు. భయం మన గుండెల్లో గూడు కట్టుకుంటే ఏ పనీ సక్రమంగా చేయలేము. భయం మనల్ని తన గుప్పిట్లోకి తీసుకోకుండా జాగ్రత్తపడాలి. భయాన్ని అధిగమించాలి. భయాన్ని అధిగమించడానికి భౌతికంగా శారీరకంగా మానసికంగా రెండు విధాలుగా సంసిద్ధులు కావాలి. అప్పుడే మానసిక ధైర్యం మనల్ని విడిచిపోదు, అది మనతో ఉంటే మనం ఏదైనా సాధించగలం.                                         ◆నిశ్శబ్ద.

మనం నిజమైన స్నేహితులమేనా?

ప్రతిఒక్కరు జీవితంలో స్నేహానికి ప్రాధాన్యత ఇస్తారు. స్నేహంచాలా గొప్పది. కనీసం ఒక్క స్నేహితుడిని అయినా కలిగుంటారు. చిన్నతనం నుండి మరణం వరకు స్నేహం అనే అనుబంధంలో సాగేవారు ఎందరో. స్నేహంలో సహాయం, సలహాలు, తోడ్పాటు, ఓదార్పు, ముందడుగు వేసే ధైర్యం లభిస్తాయి. అలాగే స్నేహితుల మధ్య గొడవలు, చిరాకులు, వాదనలు, అభిప్రాయభేధాలు కూడా బోలెడు వస్తుంటాయి.  ఇతరులు మనకి నిజమైన స్నేహితులా? అని ఆలోచించిస్తారంతా! అయితే అలా ఆలోచించడానికి ముందు మనం ఇతరులకు నిజమైన స్నేహితులమేనా? అని ఒక్క క్షణం ఆలోచించుకుంటే మంచిది. మనం స్నేహంలో ఆప్యాయత, ప్రేమ, అభిమానం, ఓదార్పు కావాలని కోరుకుంటూ వుంటే వాటిని ముందు ఇతరులకు ఇవ్వడం, పంచడం నేర్చుకోవాలి. అంటే ఇక్కడ మనల్ని బట్టే ఎదుటివారు ఉంటారు. మన ప్రవర్తన మన వ్యక్తిత్వాన్ని బట్టి మన స్నేహితులు మన విషయంలో ప్రవర్తిస్తారు. స్నేహాన్ని, స్నేహితులను ఎప్పుడూ కానుకలతో కొనవద్దు, కానుకలు ఆపేస్తే స్నేహమూ ఆగిపోతుంది. స్నేహంలో కానుకలు, ఇచ్చిపుచ్చుకోవడాలూ వుండవు. ఇచ్చి పుచ్చుకొనేది మనస్సు మాత్రమే. అంతేకానీ ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు సంతోషపడిపోయి ఆహా, ఓహో అని పొగడగానే వాడే నిజమైన స్నేహితుడు. నా గురించి అందరికీ గొప్పగా చెబుతాడు అని అనుకుంటే తప్పే.  మిత్రుడు అడగకుండా చేసే సహాయమే నిజమైన సహాయం. సహాయం చేసి కృతజ్ఞతలు ఆశించడం సరికాదు. స్నేహమంటేనే మనకి వున్నది ఇవ్వడం, పంచడం. ఏదో ఉపకారాన్ని ఆశించి చేసే స్నేహం కలకాలం నిలవదు. మన ప్రతిష్టను, గౌరవమర్యాదలను పెంచగలిగే ఉత్తమనడవడికలు కలిగిన వారితో స్నేహం చేయాలి. చెడ్డవారితో, చెడు అలవాట్లు కలిగిన వారితో కలిసి మెలసి తిరగడం కంటే అటువంటి స్నేహితులు లేకుండా ఒంటరిగా ఉండటమే మంచిది. చెడ్డవారితో స్నేహం ఉదయపు నీడలాంటిది. ఆ నీడ ఉదయాన ఎక్కువవుండి, తరువాత గంట గంటకీ తగ్గిపోతుంది. మంచి వారితో స్నేహం సాయంత్రపు నీడ లాగా మొదట తక్కువగా వుండి తరువాత గంట గంటకీ పెరుగుతూ వుంటుంది. స్నేహం ఆ విధంగా పెరుగుతూ వుండాలి.  పాపపు పనులు నుంచి మళ్ళించే వాడే స్నేహితుడు. ఏది మంచో అది మాత్రమే చెబుతాడు మంచి స్నేహితుడు. ఈల అచేస్తే బాగుంటుంది అని ఓ ఉత్తమ సలహా ఇచ్చేవాడు,ఇలా చెడితే పలితం ఇలా ఉంటుందని అందులో మంచి చెడును సాధారణ విషయంలా వివరించి చెప్పేవాడు మంచి స్నేహితుడు.  కానీ ఏది చెడో అదే చెబుతాడు చెడ్డ స్నేహితుడు.చెడ్డ స్నేహితుడు ఎప్పుడూ చెడును మంచిగా చెబుతాడు, అదే నిజమైన మంచి అనే భ్రమను కలిగిస్తాడు. అందులో తప్పులేదని వాదించి చెబుతాడు. చివరకు మనిషిలో విచక్షణను మెల్లిగా కోల్పోయేలా చేస్తాడు.  ఈ విచక్షణను ఎవరికి వారే తెలుసుకోవాలి.  మంచి నీటి నదులు సముద్రంలో కలిసి ఉప్పునీరుగా మారిపోయిన విధంగా చెడ్డ వ్యక్తులతో స్నేహం కొనసాగిస్తే చేటు తప్పదు. చెడ్డ స్నేహితులకు తెలివితేటలు ఎక్కువగా వుంటాయి. వీరు చక్కగా మాట్లాడుతారు. మంచి మాటకారితనం వల్ల ఇటువంటి వారి నుండి తప్పించుకోవడానికి ఎక్కువ వివేకం, సమయస్ఫూర్తి వుండాలి. మనం స్నేహితుల్ని మందలించేటప్పుడు రహస్యంగా మందలించాలి. పొగిడేటప్పుడు బహిరంగంగా పొగడాలి. కానీ చెడు స్నేహితులు అలా కాదు. మీ ముందు మిమ్మల్ని పొగిడి మీరు లేని సమయంలో అందరి దగ్గర మీ గురించి చెడుగా చెప్పడం చేస్తారు.   అలాగే అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యవిషయం పరిచయస్తులందరూ స్నేహితులు కారు. తెలిసిన వాళ్ళందరూ స్నేహితులు కారు. అందరితో పరిచయం పెంచుకోవాలి. కాని కొద్ది మందితో మాత్రమే స్నేహితులుగా వుండాలి. అలాగే మనం నిజమైన స్నేహతులుగా ఉన్నామా లేదా తెలుసుకోవాలి.                                         ◆నిశ్శబ్ద.

జీవితం మీద కలల ప్రభావమెంత?

మనిషి ప్రకృతి నుండి పుట్టినవాడు. మనిషిని ప్రకృతి నుంచి వేరుచేసిన ఆ శక్తులేమిటి ? అతని శరీర నాడీమండల నిర్మాణం, అతని వర్ణదృష్టి, దీపటిమ, నవ్వడం, విసుగుచెందడం లాంటి అతనిలో ఉన్న శక్తులు, అతడు నిటారుగా నిలబడి నడవటం, అతని చేతికి బొటన వ్రేలుండడం . ఇవేవి జంతువులకు లేవు. అయితే మనిషికి మరొక శక్తి గూడ ఉంది. అది కలలుగనే శక్తి. ఇది జంతువులకు (సకశేరుకాలకు మాత్రమే) గూడ ఉంది. ఈ శక్తే మనిషికి లేకపోతే నాగరికత ఎలా ఉండేదో మనం ఊహించలేం. అతడు కలలు కనకపోతే అతనికి మతం లేదు,పద్యం లేదు, పాట లేదు,కళ లేదు, ఇంజనీరింగు లేదు, సంకేతాలు లేవు, కట్టడాలు లేవు.  ఆనటోల్ ఫ్రాన్స్ "వాస్తవం కంటే స్వప్నం గొప్పదని నా పరమ విశ్వాసం"అన్నాడు.  అయితే ఇక్కడ అతడు మేధావులు కాల్పనిక శక్తి మీద స్వప్న ప్రభావాన్ని గురించి చెబుతున్నాడని గుర్తుంచుకోవాలి. అసలు, మనిషికి ఆత్మ అంటూ ఒకటి ఉన్నదన్న ఆలోచన పొడమటానికి మూలం కలే. దేశ దేశాల నాగరికతలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నాటి నుంచి నేటి వరకు మానవుడు కలలు కంటూనే ఉన్నాడు. అయినా, పందొమ్మిది వందల సంవత్సరంలో ప్రాయిడ్ రచించిన 'స్వస్వార్ధ వివరణం (Interpre tation of dreams) రంగం మీదికి వచ్చే వరకు, స్వప్నాధ్యయనం శాస్త్రీయ ప్రాతిపదికను సంతరించుకోలేదు. స్వప్నాల గతం ఎంతో దీర్ఘమైనదే కాని, వాటి చరిత్ర మాత్రం చెప్పదగినదే, దానిని తెలుసుకోవడం చేయడం మనకు తేలిక.  ప్రాచీన మానవుడు జాగ్రద్దలో దర్శించిన వాటి కంటే కలలో చూసిన వాటినే ఎక్కువగా విశ్వసించాడు. నిత్యకృత్యాల్లో మార్గనిర్దేశం కోసం వాటి మీద ఆధారపడేవాడు. ఒకడు తన ఆస్తి మరొకనికి సంక్రమించినట్లు కలగంటే, అతడు ఆ మరొకనికి తన (మొదటివాని) ఆస్తిని  ఇచ్చేసేవాడు. స్వప్నంలో పరసతిని, సుఖాన్ని అనుభవిస్తే అలా కల వచ్చిన వ్యక్తి శిక్షించబడేవాడు. ఆ శిక్షను అతడు సంతోషంగా స్వీకరించేవాడు.  అంతెందుకు ఒక యువతి, తన భర్త మరొక యువతితో రతి జరుపుతున్నట్లు కలగంటే. అది కేవలం కలే గదా అని ఆమెతో అన్నప్పుడు, అతడు 'నా' కలలోనే అలా చేస్తే, మరి 'అతని' కలలో 'ఇంకెలా చేస్తాడో!' అనింది. అంటే కలలే అని ఎవరూ కొట్టిపారేయరు. వాటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇస్తూనే ఉంటారు.  ఎప్పుడో కాదు వేగవంతమైన ఇప్పటికాలంలో కూడా మనం స్వప్న విషయాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఉన్నాం. పిల్లవాడు కుక్క కరిచినట్లు కలగంటే, తరువాత రోజు పగలంతా, కుక్కలంటే భయం భయంగానే సంచరిస్తాడు. మనం, పెద్దవాళ్ళం గూడ, ఏదైన పీడకలనో, మనస్సు వికలం చేసే కలనో కంటే, ఆ రోజంతా అదోరకంగా ఉంటాం. కలలు వాస్తవాలయినా కాకపోయినా, వాటి ప్రభావం మాత్రం వాస్తవ జీవితం మీద ఉంటుంది. ఇది అందరికి తెలిసిన సత్యమే! అత్యంత ప్రాచీన కాలం నుంచి దాదాపు గత శతాబ్ది వరకు, కలలను సంకేతాలుగ, సందేశాలుగా భావించే వారు. ఈ సంకేతాలు దేవుళ్ళ నుంచి, దయ్యాల నుంచి, ప్రేతాత్మల నుంచి వచ్చాయని వారి నమ్మిక. ఆయా సంకేతాలను బట్టి దేవతలకు, ఆగ్రహమో, అనుగ్రహమో వచ్చిందని అనుకొనే వారు. తదనుగుణంగా శాంతిక, పౌష్టిక కర్మలు, పూజలు జరిపించే వారు. సామాన్యంగా పురోహితులు, పూజారులే ఈ సంకేతాలకు అర్ధం చెప్పేవారు. అయితే ఇప్పటికాలంలో సైన్స్ పరంగా కూడా ఈ కలలకు అర్థం వెతికే పని జరుగుతుండటం కొసమెరుపు. ◆నిశ్శబ్ద.

స్వామి వివేకానంద మాటల్లో ఆలోచనాశక్తి!!

భారతీయ యువతకు ప్రేరణగా ఎందరో మేధావులు, గొప్పవారు వున్నారు. అయితే ఒక యువకుడిగా ఉండి ఈ ప్రపంచానికి భారతీయ ఆధ్యాత్మిక మరియు హిందూ ధర్మం గురించి గొంతెత్తి చెప్పినవారు స్వామి వివేకానంద ఆలోచనా శక్తి గురించి ఆయన మాటల్లో…... పని చేయడం చాలా అవసరం. దానికి మూలం ఆలోచనే కదా! కండరాల ద్వారా కొద్దిగా అభివ్యక్తమైన శక్తిని పని అంటారు. అయితే ఆలోచన లేనిదే ఏ పనీ జరుగదు. కాబట్టి మీ బుద్ధిని ఉన్నతమైన ఆలోచనలతో, అత్యున్నతమైన ఆదర్శాలతో నింపి, రేయింబవళ్ళు వాటిని మీ ముందు ఉంచండి. తత్ఫలితంగా మహోన్నతమైన కార్యాలు సిద్ధిస్తాయి.  ఒక భావాన్ని స్వీకరించండి. దాన్ని మీ జీవిత ధ్యేయంగా చేసుకోండి. దానినే మననం చేయండి, కలగనండి, ఆ భావంలోనే లయించి జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, శరీరంలోని ప్రతి ఒక్క భాగం ఆ భావంతో పూర్తిగా తాదాత్మ్యం కావాలి. తక్కిన అన్ని భావాలను త్రోసిరాజనండి. ఇదే విజయానికి దారి.  మీరు ఐదు భావాలను జీర్ణం చేసుకొని, వాటిని మీ జీవనంలో, మీ వ్యక్తిత్వంలో సారూప్యాన్ని పొందించు కుంటే ఒక గ్రంథాలయాన్నంతా కంఠస్థం చేసిన వ్యక్తి కంటే, మీకే ఎక్కువ విద్య వచ్చినట్లు!  ఆలోచనే మనలను కార్యోన్ముఖులను చేసే గొప్ప శక్తి. మనస్సును అత్యున్నతమైన ఆలోచనలతో నింపండి. ప్రతి రోజూ వాటిని వినండి. నెలల తరబడి వాటిని గూర్చి ఆలోచించండి. అపజయాలను లక్ష్య పెట్టవద్దు. అవి చాలా స్వాభావికం. ఈ అపజయాలు జీవితానికి అలంకారాలు. అవి లేకుండా జీవితమేమిటి? జీవితంలో పోరాటాలే లేకుండా ఉంటే, ఈ జీవితానికి ప్రయోజనం శ్యూనం. దురభ్యాసాలను మానాలంటే, వాటికి వ్యతిరేకమైన అభ్యాసాలను అవలంబించటమే ఉపాయం. దుష్టసంస్కార జనిత దురభ్యాసాలను, మంచి అభ్యాసాలతో నిరోధించాలి. అందుకని మీరు ఎప్పుడూ మంచినే చేస్తూ ఉండండి. ఎప్పుడూ పవిత్రమైన ఆలోచనలనే చేస్తూండండి. దుష్ట సంస్కారాలను నిరోధించడానికి ఇదే మార్గం. ప్రతి వాక్కు, ప్రతి సంకల్పం, ప్రతి చేష్ట. మీకు సంచిత ఫలాన్ని చేకూరుస్తుందన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. చెడు ఆలోచనలు, చెడు పనులు పెద్ద పులుల లాగా మీ పైకి దూకడానికి సిద్ధంగా ఉంటాయి. అయితే ప్రేరణనిచ్చే ఆశ కూడా ఉంది. మంచి ఆలోచనలు, మంచి పనులు, కొన్ని వేల దేవతాగణాల శక్తితో మిమ్మల్ని సదా, సర్వదా రక్షించగలవు. బాల్యం నుండీ సానుకూలమైన, ఉత్సాహకరమైన, బలప్రదమైన, ఆశాజనకమైన ఆలోచనలు వారి (పిల్లల) మెదళ్ళలో ప్రవేశింపనివ్వండి.  భౌతికంగా చూస్తే చెడు ఆలోచనలే వ్యాధిని కలిగించే విషక్రిములు. అంతర్గతంగా ఉన్న భావనే దేహాన్ని రూపొందిస్తుంది. ఒకదేశ ప్రజానీకం, దేశీయ భావాల అభివ్యక్తమే! మనం పరిశుద్ధులమై, మంచి ఆలోచనలకు ఉపకరణమైతే, అవి మనలో ప్రవేశిస్తాయి. మంచి మనసు చెడు ఆలోచనలను గ్రహించదు. చెడు ఆలోచనలు, చెడ్డ వారిలోనే అనుకూలమైన స్థానాన్ని గుర్తించ గలవు. అవి. అనుకూల పరిస్థితులలోనే పుట్టి పెరిగి వ్యాపించే సూక్ష్మ క్రిముల వంటివి.  ఎప్పుడూ నిరాశతో, నిరుత్సాహంతో జీవించే వారు ఏ పనినీ సాధించలేరు.                                          ◆నిశ్శబ్ద.