Read more!

కొత్తబంగారు లోకం ఇదిగో ఇలా సొంతం!! 

కొత్తలోకం అంటే వేరే ఎక్కడో వేరే గ్రహం గురించి మాట్లాడటం లేదు. ప్రతిమనిషి జీవితంలో వాళ్ళ భవిష్యత్తు గురించి కొన్ని ఆశలు, కొన్ని ఆశయాలు, మరికొన్ని దుఃఖాలు, ఇంకొన్ని సమస్యలు ఉండనే ఉంటాయి. అయితే వటన్నిటీ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు అనే దాని మీద వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 

నేటి యువతకు రేపటి గురించి ఎంతో పెద్ద కలలు ఉండటం సహజం. అయితే ఆ కలను సాధించుకుంటున్నవాళ్ళు ఎంతమంది అని తరచి చూస్తే చాలా కొద్ది జీవితాలు మాత్రమే  విజయ తీరాలు చేరుకుంటున్నాయని చెప్పవచ్చు. ఐటీఏ ఆ కొన్ని జీవితాలు కూడా నిజంగా తాము కన్న కలను నిజం చేసుకున్నారా లేక సమాజాన్ని, కుటుంబాన్ని కాంప్రమైజ్ చేయడానికి వాటి దృష్టిలో ప్రాముఖ్యత ఉన్న దాన్ని సాధించి బతికేస్తున్నారా??

ప్రశ్న చిన్నదే కానీ దానిలో లోతు, దాని కారణాలు మాత్రం చర్చిస్తే పెద్ద గ్రంథం అవుతుంది. చిన్నప్పటి నుండి కొన్ని విషయాలను బుర్రలో నూరిపోసి, బలవంతంగా కొన్ని, సమాజం కొన్ని ఎట్లా అయితేనేం కారణాలు ఎన్ని ఉన్నా మొత్తానికి తమకోసం తాము బతకడం అనే విషయాన్ని మాత్రం అందరి జీవితాల నుండి తొలగించారు మరియు తొలగించుకున్నారు మనుషులు. ఏదైనా గట్టిగా అడిగినా మంచి కోసమే అనే చెప్పేవాటిలో మంచి ఎంత ఉందో అర్థం చేసుకునే మానసిక పరిణితిని పెద్దలు తమ పిల్లల్లో పెంపొందించేందుకు కృషి చేస్తే చాలు కదా అనిపిస్తుంది.

ఇక యువత ఆవేశం, తొందరపాటుతో చేసే ఎన్నో పనులు తమ లక్ష్యాలు దారితప్పడానికి కారణం అవుతున్నాయి. వాటిని పునర్విమర్శ చేసుకోకుండా ప్రపంచం పెద్దదంటూ పరిగేడితే లక్ష్యం చేరుకోగలరో లేదో కానీ అలసట మాత్రం తప్పకుండా వస్తుంది. అందుకే తాము వెల్లదల్చుకున్న దారి గురించి అనుభవం ఉన్నవాళ్ళతో చర్చించి సురక్షితంగా సరైన మార్గంలో వెళ్లడం సబబు.

ఆశకు రెక్కలు ఇవ్వాలి!!

ఆశించడం తప్పేమి కాదు. ఈ ప్రపంచంలో మనిషిని గొప్పగా ఎదిగేలా చేసేది ఆశనే. అందుకే రేపటి జీవితం గురించి ఆశ ఉండాలి. ప్రతి మనిషి నిన్నటి కంటే అంతో ఇంతో మెరుగవుతూ ఉండాలి. దానికి తగ్గట్టు తమ అనుభవాల ద్వారా జీవితానికి జ్ఞానాన్ని పొగుచేసుకోవాలి. వ్యక్తిత్వ పరంగానూ, ఆలోచనాపరంగానూ ఎదగాలి. అప్పుడు ఆశ కూడా జీవితానికి తగ్గట్టు కదులుతూ సంతోషాన్ని కలిగిస్తుంది. 

ప్రాధాన్యత ప్రత్యేకత!!

ప్రతి మనిషి ఎదుటి మనిషికంటే రూపంలోనూ, ఆలోచనల్లోనూ, వ్యక్తిత్వ పరంగా ఇంకా సామాజిక ఆర్థిక స్థాయిల పరంగా విభిన్నమైనవాడు. ఒకే కుటుంబంలో ఉన్న ఎవరూ ఒకే ఆలోచన కలిగి ఉండరు. అలాంటప్పుడు జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయాల్లో వాళ్ళు అలా ఉన్నారు, మనం ఇలానే ఉందాం. వాళ్ళు అది సాధించారు మనం ఇది సాధిద్దాం అని ఎందుకు అనుకుంటారు. జీవితంలో ముఖ్యమైనది ఏది?? దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి?? తమలో ఉన్న ప్రత్యేకత ఏమిటి?? దాన్ని ఎలా పదును పెట్టుకుని తమకే గుర్తింపు తెచ్చేలా చేసుకోవాలి. ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకోవాలి.

ఆనందం ఎక్కడో లేదు మనసులోనే!!

నిజమే ఆనందం మనసులోనే ఉంటుంది. దాన్ని తెలుసుకునావాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండగలరు. వస్తువులలోనూ, ఎదుటి వాళ్ళ స్పందనలోనూ ఆనందాన్ని వెతుకునేవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉండలేరు. వాళ్ళను అశాంతి ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. అందుకే ఆనందానికి కీ ని మీదగ్గరే ఉంచుకోవాలి.

అడ్డంకులూ అవరోధాలు హుష్ కాకి!!

మనం వెళ్లాల్సిన ఊరికి ప్రయాణం చేసేటవుడు మధ్యలో దారి బాగోలేకపోయినా, వెహికల్ పాడైనా వేరే వెహికల్ లో, జాగ్రత్తగా వెళ్తాము అంతేకానీ ఆ ఊరికి వెళ్లడమే మనేస్తామా లేదు కదా!! ఇదీ అంతే. మనం అనుకున్న లక్ష్యంలో ఏదైనా సమస్య ఎదురైతే పరిష్కరించుకుంటే పోతుంది. కానీ ఈకాలం వాళ్లకు తెగ్గొట్టడం వచ్చినంత బాగా తిరిగి అతికించడం, దానికోసం కష్టపడటం, ఓర్పుగా ఉండటం రావు. వాటిని అలవాటు చేసుకోవాలి.

మనస్ఫూర్తిగా మంత్రం వెయ్యాలి!!

దేనికైనా మనసుతో తృప్తిగా చేయడం ముఖ్యం. అందుకే మనిషి స్వచ్ఛంగా ఉండాలి. కోపం, ద్వేషం, ఈర్ష్య, అసూయ లాంటివి మనసులో అసలు ఉంచుకోకూడదు. ప్రేమించడం తెలిసిన మనిషి దాన్ని తిరిగి ఆశించకుండా కేవలం ఇవ్వడంతోనే సరిపెట్టుకుంటే ఎంతో గొప్ప ప్రశాంతత దొరుకుతుంది. 

ఆశలు, లక్ష్యాలు, ఆశయాలు వీటన్నిటిని ఆశవహాదృక్పథంతో మనసు తలుపులు తెరిచి ముందుకు వెళ్తే కొత్తబంగారు లోకం సాక్షాత్కరిస్తుంది.

◆ వెంకటేష్ పువ్వాడ