మాటని ఒకే మాటని.. నీతోనే ఉంటానని…

◆ప్రామిస్ డే◆   ఓ మనిషికి నమ్మకాన్ని ఇవ్వడం, ఆ నమ్మకంతో భరోసా కల్పించడం ఈ ప్రపంచంలో చాలా గొప్ప విషయం. అయితే ఆ నమ్మకం ఇతరుల్లో ఎట్లా కల్పిస్తారు?? అది ఎదుటివారికి ఎలా ధైర్యాన్ని ఇస్తుంది??  వాలెంటైన్స్ వీక్ లో భాగంగా అయిదవ రోజును ప్రామిస్ డే గా జరుపుకుంటారు. మీ భాగస్వామి పట్ల మీకున్న అభిమానం, ప్రేమ ఎంత గొప్పదో.. వారికి మీ జీవితంలో ఎలాంటి స్థానం ఉందో తెలియజేసి వారితో ఎప్పటికీ ఉంటానని వాగ్దానం చేయడం ఈ ప్రామిస్ డే లో ఉన్న ప్రత్యేకత. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11 వ తేదీన ప్రేమికుల నుండి, ప్రేమలో ఉన్న  భార్యాభర్తల వరకు అందరూ ప్రామిస్ డే ని సెలెబ్రెట్ చేసుకుంటారు. ఇందులో భాగంగా తమ జీవిత భాగస్వామితో బంధాన్ని మరింత దృఢంగా మార్చుకోవడం, బంధాన్ని మరింత ఎక్కువ కాలం ఆరోగ్యంగా సాగేలా చేయడం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అన్నిటికంటే ముఖ్యంగా జీవితంలో భాగస్వామి తమకు ఎంతో ముఖ్యమని చెప్పడమే ఇక్కడ ప్రధానాంశం. జీవితాంతం తోడు నిలిచేది ఒక్క జీవన సహచరులే.. అందుకే జీవితంలో తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నా జీవిత భాగస్వాములకు అంత ప్రాధాన్యత ఉంది.    ప్రామిస్ ప్రాముఖ్యత.. బంధంలో ఉన్నప్పుడు నమ్మకం ఇస్తే ఆ బంధం పదిలంగా ఉంటుంది. అంటే.. నమ్మకం అనేది బంధాలకు పునాది లాంటిది. జీవితంలో భాగస్వాములకు ఎన్నో వాగ్ధానాలు చేస్తుంటాం. కొన్నిసార్లు వాటిని విస్మరిస్తుంటాం. అయితే ఈ ప్రామిస్ డే రోజును వాటిని క్లియర్ చేసి భాగస్వామి కళ్ళల్లో మెరుపును, పెదవుల మీద చిరునవ్వును చూడగలిగితే.. ఒక భాగస్వామిగా మీరు సఫలం అయినట్టే.. ఒకరి పట్ల మరొకరు చూపించే అనురాగం వెలకట్టలేనిదే.. అలాగే మాట ఇవ్వడం ఎంత సంతోషాన్ని కలిగిస్తుందో.. ఆ మాట తప్పడం వల్ల జీవిత భాగస్వాములు ఎంత డిజప్పాయింట్ అవుతారో కూడా అలాంటి సందర్భాలలో స్పష్టం అవుతుంది. వీటన్నింటినీ పక్కన పెడితే.. ఇలాంటి చిన్న చిన్న మాట ఇవ్వడాలు, తప్పడాల గురించి వదిలేస్తే.. నిన్ను నేను ఎప్పటికీ వదలను.. జీవితాంతం నీతోనే ఉంటానని మాట ఇవ్వడం ఆ మాటను నిలబెట్టుకోవడం ఎంతో ముఖ్యం.  ప్రామిస్ డే రోజు మీ భాగస్వామికి ప్రామిస్ చేయండి. మాటని ఒకే మాటని.. నీతోనే ఉంటానని.. అని ఓ రిథమ్ లో చెప్పండి..                                         ◆నిశ్శబ్ద.  

నమ్మకానికి ఉన్న శక్తి ఎలాంటిదో తెలుసా?

నమ్మకం లేకుండా ఈ సృష్టే లేదుకదా?!  మనిషి తన జీవితంలో ఏమి చేయాలన్నా నమ్మకమే ప్రముఖ పాత్ర పోషిస్తుంది.నమ్మకం ఉంటే ఎంతటి పనిని అయినా చేయడానికి నడుం బిగిస్తారు. అదే నమ్మకం లేకపోతేనో… ఆలోచించండి. నమ్మకం లేకుండా ఈ ప్రపంచంలో ఎలాంటి విజయమైనా, ఎలాంటి విషయాలైనా జరుగుతాయా? ఆలోచించండి. నమ్మకం అనేది ఈనాడు మరో ప్రతిసృష్టినే చేయగలదు. మంచినీ, చెడునీ రెండింటిని చేయగలదు. కానీ ! మనం మంచిని మాత్రమే నమ్ముదాం. గెలుపును మాత్రమే నమ్ముదాం... అద్భుత విజయం మనకు చేకూరబోతుందని నమ్ముదాం. ఇలా చేయడం వల్ల మనిషి తన జీవితంలో తాను ఎంతో అత్యున్నత స్థాయికి ఎదగగలడు. మాటల్లో చెప్పినంత, వందకు వంద శాతం కాకపోయినా కనీసం మనిషి ఆశించిన మేరకు సాధించగలడు.   ఒక నెలలో కోటి రూపాయలు సంపాదించాలని అనుకుంటున్నారా! మీరు మీ సొంత విమానంలో దేశదేశాలూ తిరగాలని అనుకుంటున్నారా! ప్రపంచంలోనే గొప్ప వ్యాపారవేత్త కావాలని అనుకుంటున్నారా! ఇవన్నీ... ఎటువంటి సందేహం  లేకుండా... నిస్సంకోచంగా ఎవరైనా, ఎలాంటి వారైనా... ఎంత పేదవారైనా, ధనికులైనా సాధించరు. కానీ ఒక్క విషయం... మీరు అది చెయ్యలేనేమో ... ఇది సాధ్యమేనా అని ఆలోచనలను బలవంతంగా తుడిచివేసి... నూటికి నూరుపాళ్ళు నేను చెయ్యగలను అని నమ్మండి. ఈ నమ్మకమే ఎంతటి అసాధ్యమునైనా సాధింపజేస్తుంది. ఇప్పుడు విమానాల్లో తిరుగుతున్న వారు, పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు స్థాపించినవారిలో స్వంతంగా ఎదిగినవారు బోలెడు మంది ఉన్నారు. వారందరూ మనవల్ల ఏమవుతుందిలే… అనుకుని ఉంటే ప్రస్తుతం ఆ స్థాయికి చేరగలిగేవారా?? నమ్మకం అందరిలోనూ ఒకటే కదా… ఒక్కొక్కరికి ఒకో విధమైన మెదడు ఇవ్వలేదు ఆ భగవంతుడు. కానీ మనిషి ఆలోచనే వెరైపోతోంది… ఈ సృష్టినే సృష్టించగల నమ్మకం... మీకు  విజయాన్ని ఇవ్వలేదా? నమ్మండి. బలవంతంగానో లేక ఇష్టంగానో లేక నమ్మకంగానో  మొత్తానికి నమ్మకాన్ని మనసులో బలంగా నాటుకొండి.  మీరు నమ్మడం వలన కలిగే లాభం ఏంటో తెలుసా...! మీరు కోరుకున్న మహోన్నత విజయం.. మీకు లభిస్తుంది. మీరు ఎందుకు ఈ విషయాలను నమ్మాలంటే... ఒక నమ్మకం పనిచేసే తీరును మీకు వివరిస్తుంది. మీ విజయానికి కావాల్సిన శక్తిని, నేర్పును, మార్గాలను మీకు  చూపిస్తుంది. నేను గొప్పగా మారగలను అనే నమ్మకమే... మీరెలా మారాలి అనే దారిని చూపిస్తుంది. విజయం సాధించడానికి మార్గాలను ఏర్పరుస్తుంది. ఎంతటి విజయాన్నైనా సాధించడానికి కావాల్సిన అత్యవసరమైన అతి ముఖ్యమైన మొట్టమొదట అర్హత ఏంటో తెలుసా... "నేను సాధించగలను" అని నమ్మడం.  నమ్మకానికి అపరిమితమైన శక్తి ఉంది. అది మిమ్మల్ని ఎంత ఎత్తుకైనా చేరుస్తుంది. ఎంతో శ్రమకోర్చి... ఎన్నో అనుభవాల నుంచి, మరెందరో విజేతల జీవితాల నుండి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. ఎందరో విజయవంతుల జీవితాల్లోని ప్రతి మాటా ప్రతి విషయమూ సూటికి నూరుపాళ్ళూ మీకు విజయం చేకూర్చడానికి... ఉద్దేశించబడిందే. అయితే నమ్మకంతో మీ మనసు చెప్పే మాటను మనస్ఫూర్తిగా నమ్మడం మొదలు పెట్టండి... ఖచ్చితంగా... మీరు మారడం మొదలు పెడతారు. విజయం సాధించేదాకా వెనుదిరగరు. “ఎందుకంటే నమ్మకమే విజయం" “సందేహమే ఓటమి" ఈ విషయాలు మరవకండి.                                     ◆నిశ్శబ్ద.

డిప్రెషన్‌ వల్ల ఓ ఉపయోగం ఉంది!

పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు... అంటూ మనకి ఓ వేమన పద్యం ఉంది. ఆరంభింపరు నీచ మానవులు... అంటూ భర్తృహరి సుభాషితంలో ఉన్న పద్యాన్నీ వినే ఉంటాము. ఏతావాతా తేలేదేమిటంటే- కార్యసాధకుడనేవాడు ఒక పనిని మొదలుపెట్టాక, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడనాడడు. ఆరు నూరైనా సరే తన లక్ష్యాన్ని సాధించి తీరతాడు. ఇదంతా వినడానికి చాలా బాగుంది. పైగా భౌతిక విజయాలే కీలకమైన ఈ పోటీ ప్రపంచంలో పట్టుదల కలిగినవారిదే పైచేయి అన్న వాదనా వినిపిస్తోంది. కానీ...   డిప్రెషన్‌తో కూడా లాభం ఉంది జర్మనీలోని ‘University of Jena’కు చెందిన సైకాలజిస్టులు డిప్రెషన్ వల్ల కూడా ఓ ప్రయోజనం ఉందని వాదిస్తున్నారు. కొంతమంది తమకు పొంతన లేని లక్ష్యాలను ఎన్నుకొని, వాటిని సాధించలేక క్రుంగుబాటుకి లోనవుతుంటారనీ... ఆ క్రుంగుబాటులోంచే వారికి తమ పొరపాటు అర్థమవుతుందనీ తేల్చి చెబుతున్నారు. తాము ఎన్నుకొన్న లక్ష్యంలోనే పొరపాటు ఉందని తేలిపోయాక, తమకు సాధ్యమయ్యే లక్ష్యాలనే ఎంచుకుంటారని అంటున్నారు. అంతేకాదు! దేని కోసం ఎంతవరకు ప్రయత్నించాలి? అనే విచక్షణ కూడా వారికి క్రుంగుబాటుతో అలవడుతుందట.    వదులుకునే విచక్షణ తమ వాదనలో ఎంత వరకు నిజం ఉందో తేల్చుకునేందుకు సదరు సైకాలజిస్టులు ఓ పరిశోధనను చేపట్టారు. ఇందుకోసం అటు డిప్రెషన్‌తో బాధపడుతున్నవారినీ, ఇటు ఆరోగ్యంగా ఉన్నవారినీ ఎన్నుకొన్నారు. వారందరికీ కొన్ని గజిబిజి పదాలను (jumbled words) అందించారు. అంతవరకూ బాగానే ఉంది. పనిలో పనిగా కొన్ని అసాధ్యమైన పదాలను కూడా అందించారు. అంటే వాటిని ఎంతగా ప్రయత్నించినా కూడా ఒక అర్థవంతమైన పదం రాదన్నమాట! మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు జవాబు లేని పదాలను కూడా సరిచేసేందుకు పట్టువిడవకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారట. కానీ డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తులు కాసేపు ప్రయత్నించిన తరువాత, ఇక తమవల్ల కాదు అన్న అనుమానం వస్తే వాటని పక్కన పెట్టేయడాన్ని గమనించారు. పట్టువిడుపులు ఉండాలి.   పట్టివిడువరాదు అన్న సూక్తి ప్రతి సందర్భానికీ వర్తించదు అన్నది నిపుణుల మాట. మన అవకాశాలకీ, లక్ష్యానికీ మధ్య అంతులేనంత అగాధం ఉన్నప్పుడు ఒక స్థాయిలో దానిని విడిచిపెట్టేయడం మంచిదంటున్నారు. అందుకే ఈసారి ఎవరన్నా క్రుంగుబాటుతో సతమతమవుతూ ఉంటే, ముందు వారి లక్ష్యాలను కూడా విచారించాలని సూచిస్తున్నారు. - నిర్జర.

డబ్బు సంపాదించే ఉపాయం చెప్పిన చాణక్యుడు..!!

చాణక్యుడి పేర్కొన్న అనేక అంశాల్లో డబ్బు ఒకటి. మన జీవితంలో డబ్బు ఎలా ఉపయోగించాలన్న విషయాన్ని చాణక్య నీతిలో స్పష్టంగా వివరించారు. చాణక్యుడి విధానంలో, 'ధనమే మతాన్ని అనుసరించేవాడు'. ఎవరైతే డబ్బును సరైన మార్గంలో వినియోగిస్తారో...వారు మతాన్ని కూడా మంచి మార్గంలో అనుస్తారిస్తారని తెలిపారు. చాణక్యుడు చెప్పినట్లుగా మనం డబ్బును ఎలా ఉపయోగించాలి? సరైన మార్గంలో ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభం పొందగలము. ధనం జనం పరిత్రయ: మనం సరైన మార్గంలో ధనాన్ని ఉపయోగించినప్పుడే..అది సమాజ శ్రేయస్సుకు ఉపయోగించినట్లు అర్థం. తప్పుడు పనులు చేయడానికి లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించడానికి డబ్బు ఖర్చు చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి లేదా సమాజానికి మాత్రమే ఇబ్బంది లేదు. దీనితో మీరు సమస్యలను కూడా ఎదుర్కోవచ్చు. మంచి మార్గంలో సంపాదించడం: మనం మంచి మార్గాల ద్వారా మాత్రమే డబ్బు సంపాదించాలి. చెడు లేదా హింసాత్మక మార్గాల ద్వారా సంపాదించిన లేదా సంపాదించిన డబ్బు మనకు సంతోషాన్ని లేదా సంతృప్తిని ఇవ్వదు. మీరు స్వచ్ఛమైన మార్గాల ద్వారా మాత్రమే డబ్బు సంపాదించాలి. ఆ డబ్బును మంచి పనుల కోసం ఉపయోగించాలి. కష్టపడి సంపాదించాలి: మనం ఎప్పుడూ కష్టపడి సంపాదించాలి. కష్టపడి సంపాదించిన లేదా కష్టపడి సంపాదించిన డబ్బుతో మనం ఏ పని చేసినా, దాని నుండి మనకు మంచి ఫలితాలు వస్తాయి. అటువంటి డబ్బు మాత్రమే మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు తప్పుడు మార్గాల ద్వారా చాలా డబ్బు సంపాదించవచ్చు. కానీ, ఇది ఈరోజు కాదు రేపు మీకు సమస్య తీసుకురావడం ఖాయం. ధనభావానాం అపి స్వధర్మ నాశః మితిమీరిన కోరికలు, సంపాద...మీ స్వధర్మాన్ని నాశనం చేస్తుంది. డబ్బు సంపాదించాలన్న మితిమీరిన కోరిక అధర్మం వైపు నడిపిస్తుంది. దీంతో జీవితంలో ఎన్నో సమస్యలు తప్పవు. కాబట్టి.., డబ్బు సంపాదించాలనే మితిమీరిన కోరికను వదిలివేయడం మంచిది. ధనాని పూజ్య నరః వంటిది: అంటే ధనవంతులకు సమాజంలో ఎప్పుడూ గౌరవం ఉంటుంది. డబ్బు లేదా సంపద ఉన్నవారిని సమాజం ఎప్పుడూ గౌరవిస్తుంది. అలాంటి వ్యక్తులు చాలా సులభంగా గౌరవం మరియు కీర్తి పొందుతారు. దానేన విత్తం వినీతం: వినయంతో డబ్బు సంపాదించండి. తెలివిగా ఉపయోగించుకోండి. ఇలా డబ్బును వినియోగించినప్పుడే దానికి అర్థం ఉంటుంది.  ఇష్టానుసారం డబ్బు ఖర్చు చేయడం మానేయండి.

పిల్లలకు తల్లిదండ్రులు చేస్తున్న లోటు ఇదే!

తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలకు ఇది అవసరం అని ఆలోచిస్తూ.. ఎన్నెన్నో ఇస్తుంటారు. కానీ వాళ్లకు లోటుగా ఉన్నదేంటి అని ఆలోచించరు. తత్త్వవేత్త ఖలీల్ జిబ్రాన్ అంటాడు... Children through you, But not to you.... పిల్లలు మీ ద్వారా ఈ ప్రపంచానికి పరిచయమయ్యారే కానీ, మీ నుంచి కాదు. వారి రాకకు మీరు వారధులు మాత్రమే. ఈ నిజాన్ని భరించాలంటే తల్లితండ్రులకు కఠినంగానే ఉంటుంది. అయితే ఈ సార్వత్రిక సత్యాన్ని విశ్వసిస్తే ఎలాంటి ఆందోళన, ఆవేదన లేకుండా పిల్లల్ని తీర్చిదిద్దగలరు. భగవంతుడు నిర్దేశించిన లక్ష్యానికి మీ పిల్లల్ని బాణాల్లా సంధించే ప్రయత్నంలో మీరు ధనుస్సులు మాత్రమే. ధనుస్సు నిఖార్సుగా ఉంటేనే బాణాన్ని పదునుగా వినరగలదు లక్ష్యానికి. అందుకే మిమ్మల్ని మీరు ఉన్నతంగా, విశాలంగా తీర్చిదిద్దుకోవాలి.. ప్రశాంతంగా, పొదరిల్లుగా ఇంటిని తీర్చిదిద్దాల్సింది తల్లితండ్రులే. ఏడిపించే సీరియళ్లు చూస్తూ తల్లి... ఏ ఇంక్రిమెంట్ల గురించో మాట్లాడుకుంటూ తండ్రి... ఉంటే పిల్లలు అన్నం కోసం తప్ప ఆత్మీయత కోసం ఇంటికిరారు. అర్ధరాత్రి పుట్టిన క్షణం నుంచి అష్టకష్టాలు పడ్డాడు శ్రీకృష్ణుడు... అయినా చెక్కిలిపై చిరునవ్వును చెదరనీయని స్థితప్రజ్ఞుడు. అందుకే భగవద్గీత బోధించిన భగవానుడాయన. ఆ సమత్వభావనే, ఆ ధీరోదాత్తతే ప్రతీ తండ్రీ పుణికిపుచ్చుకోవాలి. తలలు తెల్లపడటమో, ముఖం ముడతలు పడటమో పెద్దరికం కాదు. సుఖదుఃఖాల్ని, లాభాలాభాల్ని, జయాపజయాల్ని సమంగా స్వీకరించడమే ఎదుగుదల. పిల్లల ముందు మీరు నవ్వుతూ ప్రశాంతంగా  కనిపిస్తూ.. నిశ్చల తటాకంలా నిలబడి చూస్తే.. పిల్లలు ఎంత సంతోషపడతారో అర్థమవుతుంది. ఇంట్లో తమ సమస్యల్ని అర్థం చేసుకోటానికి గురువుల్లాంటి స్నేహితులయిన తల్లితండ్రులు పక్కనుండాలని ప్రతీ బిడ్డా కోరుకుంటుంది. బడి పాఠాలే కాదు, బ్రతుకు పాఠాలూ ముఖ్యమే... ఈనాటి పిల్లలకు బడి పాఠాలకేమి కొదవలేదు. వచ్చిన కొరతంతా బ్రతుకు పాఠాలకే. కుటుంబంలోనే ఆ పాఠాలు వల్లె వేయించాలి. వినయం లేని విద్య శోభించదని, విలువలు లేని ఎదుగుదలకు విలువే లేదని, ఇచ్చే బాధ్యత తెలియని చేతికి పుచ్చుకునే హక్కూ లేదని, మనం పైకి రావాలంటే పక్కవాడు పడిపోవాల్సిన అవసరం లేదని.. ఇలా అన్నీ చెప్పాల్సింది అమ్మానాన్నలే. పిడికెడు అటుకులు పెట్టినందుకే మిత్రుడికి పసిడివరాలు కురిపించిన కృష్ణుడు... పితృవాక్య పరిపాలన కోసం పడరాని కష్టాలు పడ్డ రాముడు... బిడ్డల బ్రతుకు పాఠాల్లో పరిచయమైతే వారు ఆణిముత్యాలై వెలుగుతారు. అందుకే కనీసం రాత్రి భోజనమైనా పిల్లలతో కలసి చేయాలని చెప్పేది... ఓ మంచి కథని గోరుముద్దలతో కలిపి తినిపించిన్నప్పుడు ఆ ఫలితం ఎంత మధురంగా, మహత్తరంగా ఉంటుందో స్వామి వివేకానంద మాతృమూర్తి భువనేశ్వరీ దేవికి తెలుసు, కలామ్ కన్నతల్లి ఆషియమ్మకు తెలుసు. ఇవి ప్రతి తల్లిదండ్రి తెలుసుకుని తీరాలి.                                 ◆నిశ్శబ్ద.

నెట్టింట్లో అబ్బాయిల ఆసక్తికరమైన వెతుకులాటలు!

వెర్రి వెయ్యి విధాలు ఉంటుందని పెద్దలు చెబుతారు. ఒకప్పుడు ఏవైనా అనుమానాలు వస్తే వాటిని ఎవరిని అయినా అడిగి ఆ అనుమానాలు తీర్చేసుకోవడానికి బాగా కష్టపడేవాళ్ళు. వచ్చే అనుమానాలు అలా ఉండేవి మరి. కొన్ని తింగరి అనుమానాలు వస్తే వాటిని ఎవరిని అడిగి నివృత్తి చేసుకోవాలో తెలియదు కొందరికి. కొందరు ధైర్యం చేసి అడిగి తిట్లు తింటూ ఉంటారు. అయితే అదంతా పాతకాలం అయిపోయింది. వచ్చే అనుమానం ఏదైనా ఇప్పుడు ఎవరినో ఆడాల్సిన అవసరం లేకుండా నేరుగా పాకెట్ లో నుండి మొబైల్ బయటకు తీసి నెట్టింట్లోకి దూరి ఒకటికి నాలుగు సమాధానాలు వెతికేసుకుంటున్నారు.  వచ్చే అనుమానాలకు సమాధానాలు వెతుక్కోవడం బానే ఉంది కానీ నెట్ లో అబ్బాయిలు వెతుకుతున్న విషయాలు, వారి అనుమానాల గురించి తెలిస్తే కాస్త నవ్వు వస్తుంది, మరికాస్త ఆశ్చర్యం వేస్తుంది.  ప్రతి సంవత్సరం దాదాపు 68వేలమంది అబ్బాయిలు నెట్ లో వెతుకున్న విషయం ఏమిటంటే లైంగిక సామర్థ్యం గురించి. తమలో లైంగిక సామర్థ్యం ఎంత ఉంది?? లైంగిక సామర్థ్యము పెరగడానికి ఏమి చెయ్యాలి?? వంటి విషయాల గురించి నెట్ లో శోధించడం ఎక్కువ చేస్తున్నారట. గూగులమ్మను ఈ విషయంలో చాలా వాడేస్తున్నట్టు చెబుతున్నారు. ఆడవాళ్లు జుట్టు గురించి, జుట్టు సంరక్షణ గురించి జాగ్రత్తలు, జుట్టు పెరుగుదలకు చిట్కాలు మొదలైన వాటికోసం ఎలాగైతే నెట్ లోనూ, యూట్యూబ్ లోనూ చాలా  వెతికేసి అన్ని ప్రయోగాలు చేస్తారో, మగవాళ్ళు కూడా తమ గడ్డం విషయంలో అంతే ఆసక్తిగా కేరింగ్ గా ఉంటారట. అందుకే షేవింగ్ చేయడం వల్ల గడ్డం పెరుగుతుందా లేదా?? గడ్డం బాగా గుబురుగా, మందంగా ఉండాలంటే ఏమి చెయ్యాలి వంటి విషయాలు కూడా వెతికేస్తున్నారు. మగవాళ్ళు చాలామంది ఎండలో వెళ్ళేటప్పుడు టోపీ వాడటం సహజం. అయితే టోపీ పెట్టుకోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందని కొందరు చెబుతారు. అందుకేనేమో టోపీ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందా అనే విషయన్ని కూడా  గుగులమ్మను అడుగుతున్నారట. ఇక మగవాళ్లకు అత్యంత ఇష్టమైన పని. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం. దానికోసం జిమ్ చేస్తారు, వర్కౌట్స్ చేస్తారు. బాడీ ఫిట్ గా ఉండటానికి ఎలాంటి వర్కౌట్స్ చెయ్యాలి అని తెగ వెతుకుతూ ఉంటారట. ఈ మగవాళ్ళు కేవలం వాళ్ళ విషయాలే కాదు అమ్మాయిలకు సంబంధించిన విషయాల్లో కూడా వేలు పెట్టేస్తున్నారు. అమ్మాయిలను ఇంప్రెస్ చేయాలంటే ఏమి చెయ్యాలి?? అమ్మాయిలకు నచ్చేవి ఏంటి?? నచ్చనివి ఏంటి?? ఏమి చేస్తే అమ్మాయిలు ఎక్కువ సంతోషిస్తారు?? వంటి విషయాలకు సమాధానాలను కూడా నెట్టింట్లో వెతుకుతున్నారట. ఇప్పటి దాకా చెప్పుకున్నవి ఒకటైతే ఇప్పుడు చెప్పుకోబోయేది ఇంకొక లెవల్ విషయంలా అనిపిస్తుంది.  అదే అబ్బాయిలు మగవాళ్లకు కూడా రొమ్ముక్యాన్సర్ వస్తుందా అనే విషయాన్ని చాలా సీరియస్ గా వెతుకుతుంటారట.  ఇలా లైఫ్ సెటిల్ అవ్వడం గురించో, ప్రోబ్లేమ్స్ సొల్యూషన్స్ గురించో కాకుండా ఇలాంటి విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన అబ్బాయిల స్వభావానికి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.                                   ◆వెంకటేష్ పువ్వాడ.

ఆశించకుండా చేసే మేలు ఎలా ఉంటుంది?

మునుపటి తరాల్లో వారం చేసుకుంటూ చదువుకున్న విద్యార్థులు ఎందరో వుండేవారు. చదువుకోవాలనే వారి అభిలాషా, చదువుకునే  వారిపై ఈ గృహస్థుల అభిమానమూ చూడముచ్చటగా వుండేవి. భారతదేశ అధ్యక్షపదవి అలంకరించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటివాడే చిన్నతనంలో వారాలు చేసి చదువుకునేంత బీదరికం అనుభవించాడని ఆ తరం వారు చెప్పుకుంటారు. గుణవంతులు, ప్రతిభావంతులు అయిన మరెందరో ఆ విధంగా కష్టపడి చదివి ఆ తర్వాతి జీవితంలో ఎంతగానో గొప్పగా ఎదిగిన వారున్నారు. తనతో సహపంక్తి భోజనం చేసిన కుర్రాడు. ఎన్నో ఏళ్ళ తర్వాత ఏదో ఒక ఉన్నతస్థానం ఆక్రమించినప్పుడు తానే స్వయంగా అతడి సహాయం కొరకై ఎదురుచూచే సందర్భం రాకపోయినా, అతడు ఆనాడు తనకు భోజనసదుపాయం ఏర్పరిచిన గృహయజమానిని కృతజ్ఞతాపూర్వకంగా తలుచుకున్నాడని ఎవరైనా చెప్పినప్పుడో, ఏదైనా సందర్భం పురస్కరించుకొని ఆ పెద్దమనిషి ఈ గృహస్థును ప్రత్యక్షంగా సత్కరించినప్పుడో ఇతడి ఆనందానికి అంతు ఉండదు. దీని గురించి ఒక ఉదాహరణ చెప్పుకోవాలి.. అమెరికాలోని లీలాండ్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున విద్యార్థులు అనుకోని ఆర్థిక ఇబ్బందులకు గురైనారు. ప్రఖ్యాత సంగీతజ్ఞుడు సాడీరుస్కీచేత పియానో వాద్యకచేరీ పెట్టించి ఇంత డబ్బు వసూలు చేయగలిగితే తమ ఇబ్బందినుండి బయట పడచ్చుకదా అని ఒక విద్యార్థికి తట్టింది. సాడిరుస్కీ కచేరీల ఏర్పాట్లు చూసే మానేజర్ను వెళ్ళి కలిశారు. పియానో కచేరీకి రెండువేల డాలర్లు ముట్టచెప్పవలసి వుంటుందన్నాడు ఆ మానేజర్, విద్యార్థులు అలాగేనంటూ వసూళ్ళు ప్రారంభించారు. ఇద్దరు విద్యార్థులూ ఎంతో ప్రయత్నించారు కానీ, పదహారు వందల డాలర్లకన్నా వసూలు చేయలేక పోయారు. కచేరీ జయప్రదంగా ముగిసిన తర్వాత, వారిద్దరూ సాడిరుస్కీవద్దకు వెళ్ళి తాము చేసిన ప్రయత్నం అంతా వివరించి ఎంత శ్రమించినప్పటికీ చివరకు పదహారు వందల డాలర్లు మాత్రమే వసూలు చేయగలిగామని చెప్పుకుంటూ, ఆ పదహారు వందల డాలర్లతో బాటు మరో నాలుగువందల డాలర్లకు ఓ ప్రామిసరీ నోటు వ్రాసి సాడిరుస్కీ చేతిలో ఉంచారు.  వారు చెప్పినదంతా వినిన సాడిరుస్కీ "అలా కుదరదు బాబూ" అంటూ ఆ ప్రామిసరీ నోటును చింపేసి, పదహారు వందల డాలర్లు వారికి తిరిగి ఇస్తూ “ఈ ఏర్పాట్లన్నీ చేయడానికి మీ కెంత ఖర్చయిందో అది ముందు తీసేసుకోండి. ఆ మిగిలిన మొత్తంలో చెరి పదిశాతం వంతున మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలంగా వుంచేసుకోండి. ఆ మిగతాది నాకివ్వండి" అంటూ అంత మాత్రమే తీసుకున్నాడు. కాలచక్రం దొర్లింది. ప్రథమ ప్రపంచ సంగ్రామం ప్రారంభమై అనేక దేశాల ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసి అంతమైంది. సాడిరుస్కీ మాతృదేశం పోలండ్ ఆర్థికంగా చితికిపోయింది. ఆ దేశ ప్రజలకు తినడానికి తిండికూడా కరువైన గడ్డురోజులు వచ్చాయి. ఆవేశపూరితుడైన సాడిరుస్కీ తన దేశీయుల్ని గట్టెక్కించడానికి అహర్నిశలూ తన శాయశక్తులా కృషిచేస్తున్నాడు. ఆ విపత్సమయంలో తన మాతృదేశాన్ని ఆదుకోగలిగినవాడు అమెరికా దేశ ప్రెసిడెంట్ ఒక్కడేనన్న సంగతి సాడిరుస్కీ గ్రహించాడు.  “మాకీతరుణంలో సహాయం చేసి పుణ్యం కట్టుకోండి”. అని సాడిరుస్కీ తన దేశం తరపున అమెరికన్ అధ్యక్షుడికి విజ్ఞప్తి పంపించీ పంపించక ముందే, పోలీష్ ప్రజలకు పంపిణీ చేయడానికిగాను వేలాది టన్నుల ఆహారధాన్యాలు పోలండ్ లోని ఆహారమంత్రికి అందడం ప్రారంభమైంది. క్షుధార్తులైన వారి ఆహారావసరాలు తీర్చి మరుక్షణం పారిస్ పట్టణంలో మకాం వేసుకున్న అమెరికన్ ప్రెసిడెంట్ హార్బర్ట్ హోవర్ను కలుసుకోడానికి అక్కడికి హుటాహుటిన వెళ్ళిన సాడిరుస్కీ "సకాలంలో సహాయం అందించి మా దేశవాసుల్ని రక్షించినందుకు కృతజ్ఞత తెలుపుకోడానికి వచ్చాను" అన్నాడు. “దానిదేముంది లెండి సాడిరుస్కీ మహాశయా, మీ ప్రజల అవసరం ఎలాంటిదో నాకు అవగతమైంది. అదీకాక చాలా ఏళ్ళ క్రితం నేను చదువుకుంటున్న రోజుల్లో ఒకమారు చాలా ఆర్థిక ఇబ్బందులకు లోనైనాను. అప్పుడు మీరు నాకూ, నా స్నేహితుడికీ చాలా ఉదారంగా సహాయపడ్డారు లెండి" అని చిరునవ్వుతో సాడిరుస్కీ చేతులు పట్టుకున్నాడు హార్బర్ట్ హోవర్. ఆశించకుండా చేసే సహాయం వల్ల తిరిగి మనిషికి దక్కే ఫలితాలు ఇలాగే ఎంతో అద్బుతంగానూ, ప్రయోజనం చేకూర్చేవి గానూ ఉంటాయి.                                         ◆నిశ్శబ్ద.

అసలు మదర్స్ డే ఎందుకు జరుపుకుంటారు... దీని వెనుక కథ ఏంటి!

ప్రపంచం యావత్తూ మే 14 వ తేదీన మదర్స్ డే ను జరుపుకుంటుంది. తల్లిప్రేమను చాటుతూ, తల్లి త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్నెన్నో దేశాలు గొప్పగా జరుపుకునే ఈ మాతృభాషాదినోత్సవం గురించి చరిత్రలో చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. 16వ శతాబ్దపు ప్రారంభంలో ఇంగ్లాండ్‌లోని క్రైస్తవులు "మదరింగ్ సండే" అని ఒక రోజును జరుపుకునేవారు. ప్రజలు తమ ప్రాంతంలోని ప్రధాన చర్చికి కుటుంబాలతో కలసి వచ్చేవారు. ఆరోజు  పిల్లలు తమ తల్లులకు పువ్వులు లేదా చిన్న బహుమతులు ఇచ్చేవారు. యునైటెడ్ స్టేట్స్‌లో, మదర్స్ డే యొక్క మూలాలు నిర్మూలనవాది మరియు ఓటు హక్కుదారు అయిన జూలియా వార్డ్ హోవ్ ప్రయత్నాల నుండి గుర్తించబడ్డాయి. 1870లో, ఆమె మదర్స్ డే ప్రకటన రాసింది, శాంతి, నిరాయుధీకరణ కోసం మహిళలు ఏకం కావాలని పిలుపునిచ్చింది. మనకు తెలిసిన ఆధునిక మదర్స్ డే, అన్నా జార్విస్ అనే ఒక అమెరికన్ సామాజిక కార్యకర్త చేత నిర్వహించబడింది. 1905లో తన స్వంత తల్లి మరణించిన తరువాత, జార్విస్ తల్లులను గౌరవించటానికి జాతీయ సెలవుదినాన్ని ఏర్పాటు చేయాలని ప్రచారం చేసింది. ప్రతి ఒక్కరు వారి తల్లులపై ప్రేమను, కృతజ్ఞతలను వ్యక్తపరచడానికి ఒక రోజును రూపొందించాలని ఆమె కోరుకుంది. 1914లో, ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ యునైటెడ్ స్టేట్స్‌లో మే నెలలో రెండవ ఆదివారాన్ని మదర్స్ డేగా పేర్కొంటూ ఒక ప్రకటనపై సంతకం చేశారు. ఈ అధికారిక గుర్తింపు దేశంలో మదర్స్ డేని విస్తృతంగా జరుపుకోవడానికి దారితీసింది. అప్పటి నుండి, ప్రపంచంలోని వివిధ దేశాలు మదర్స్ డేని జరుపుకోవడం మొదలుపెట్టాయి., దీంతో అన్నా జార్విస్ మదర్స్ డే స్థాపకురాలిగా గుర్తింపు పొందింది, తరువాత ఆమె మదర్స్ డే మూలంగా జరుగుతున్న వ్యాపారాన్ని చూసి విస్తుపోయింది. అన్నా జార్విస్ ప్రారంభంలో మదర్స్ డేని తల్లుల పట్ల ప్రేమను వ్యక్తం చేసే అద్భుతమైన దినంగా రూపొందించింది.  ఆమె ప్రచారంతో ఇది ఎంతో విస్తరించింది కూడా. కానీ జార్విస్ అదంతా వాణిజ్యీకరణంలో కలిసిపోవడంతో తను రూపొందించిన దానికి, అక్కడ జరుగుతున్నదానికి పొంతన లేదనే విషయం అర్ధం చేసుకుంది.  ఎక్కడ చూసినా గ్రీటింగ్ కార్డ్‌లు, పువ్వులు, ఇతర బహుమతుల విక్రయం ద్వారా మదర్స్ డే కాస్త కమర్షియల్ డే గా మారిపోయింది. చివరికి ఆమె మాటర్స్ డే ను రద్దు చేయాలని ప్రయత్నం  చేసినా అది జరగలేదు. కానీ ఆమె చేసిన ప్రయత్నం ఫలితంగా ఇప్పటికీ అందరూ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.                                     ◆నిశ్శబ్ద.

డబ్బు పట్ల నిజాయితీగా ఉండటం అంటే ఏంటి.. మీరెలా ఉంటారు?

డబ్బు పట్ల నిజాయితీ అంటే తీసుకుంటున్న డబ్బుకు సరిపడ పని చేస్తున్నామా అని! పిండి కొద్ది రొట్టి అన్నమాట. కాని మనం చాలా ఎక్కువ సందర్భాలలో డబ్బు పట్ల నిజాయితీని ప్రకటించం. తీసుకుంటున్న జీతానికి తగ్గ పనిచేయం. పైగా ఇంతకంటే ఎక్కువ ఎవడు చేస్తాడు? అని ప్రశ్నిస్తాం.  ఎపుడూ ఎర్న్ లీవులు, క్యాజువల్ లీవులు, మెడికల్ లీవులు పెట్టేస్తుంటాం. మనం తీసుకునే జీతానికి బాస్ ని ఒప్పించడానికి లేదా బాస్ని ఆనందపర్చడానికి మాత్రమే చూస్తాం తప్ప, చేతికి వచ్చిన డబ్బుకి తగ్గ పనిని చేస్తున్నామా అని ప్రశ్నించుకోం. దీనివలన నష్టం ఏమిటంటే, ఆ వ్యక్తులు జీవితంలో పెద్దగా ఎదగలేరు. జీవితంలో ఎదుగుదల అంటే ఎంతసేపూ ఓ ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ లేదా ఎక్కువ డబ్బు రావడం కాదు. జీవితాన్ని నిత్య నూతనంగా గడపడమే.  ఎప్పుడూ ఓ తెలియని చిరాకు, గుబులు, భయం ఇలాంటి ఆలోచన గల వారి  జీవితాల్లో చోటు చేసుకుంటాయి.  ఓ సిటీ బస్ కండక్టర్ బస్సు ఎక్కే పాసింజర్లకు మర్యాద ఇవ్వడు. చిల్లర ఇవ్వకుండా అల్లరి పెడుతుంటాడు. ఆ కండక్టర్ చెప్పే కారణాలు నిజమైనప్పటికీ తనకు 'జీతం' ఇస్తున్నది ఓ ప్రయాణికుడన్న విషయం మరచిపోతాడు. తనకు ఆర్.టి.సి. జీతం ఇస్తోందనుకుంటాడు. సరియైన దృక్పథం లేకుండా ఉద్యోగం చేస్తుంటాడు. ఓ పోలీసు ఇన్స్పెక్టర్ తన పవర్ ప్రజల మీద చూపెడుతుంటాడు. తన బాస్ లకు సలాం కొడుతుంటాడు. అందుకనే “నువ్వు పోలీస్  ఇన్స్పెక్టర్గా తీసుకునే జీతంలో కనీసం ఓ రూపాయికైనా న్యాయం చెయ్" అన్న సినిమా డైలాగుకి మనం తెలియకుండానే జోహార్లు అర్పిస్తాం. మనందరం ఎదుగుదల లేని జీవితం గడపడానికి కారణం డబ్బు పట్ల నిజాయితీ ప్రకటించకపోవడమే. అంత వరకు ఎందుకు "నేను ఆర్.టి.సి. డిపో మేనేజర్ అయితే ఈ బస్సులన్నీ సమయానికి వచ్చేటట్లు చేయగలను" అని మనం ఎన్ని సార్లు అనుకోలేదు? పబ్లిక్ సర్వీసెస్ కమీషన్ చైర్మన్ అయితే నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటానా? కమీషనర్ ఆఫ్ పోలీస్ అయితే ఈ ట్రాఫిక్ సిస్టమ్న ఒక్క రోజులో బాగు చేయనూ! ముఖ్యమంత్రినయితే కరెంట్, నీటి సమస్యలను వెంటనే తీర్చనూ! ఇలా ప్రతి విషయంలో మనం ప్రకటించే దృక్పధం తీసుకుంటున్న డబ్బుపట్ల నిజాయితీ, మనం చేస్తున్న ఉద్యోగాలలో లేదా వ్యాపారాలలో చూపెడుతున్నామో అని ప్రశ్నించుకోవాలి. నేర్చుకోవడానికి పని చెయ్యాలి కానీ డబ్బు గురించి పని చేయకూడదు. నాకేంటిట లాభం అని ప్రశ్నించుకుని పని చేస్తామో, అప్పుడు డబ్బుకి సరిపడ పని చేయలేము. అసలు నిజమైన పని కూడా చేయలేము.                                  ◆నిశ్శబ్ద.

దేవుడున్నాడని చిన్నతనంలోనే తర్కంతో వాదించిన శాస్త్రవేత్త!

ఒక ప్రొఫెసర్ తన విద్యార్థులతో, "భగవంతుడు అన్నింటినీ సృష్టించాడా? అని అడిగారు. "అవును ఆయనే సృష్టించాడు” అని ఒక విద్యార్థి సమాధానమిచ్చాడు. "భగవంతుడు అన్నింటినీ సృష్టించాడు. అలాగే చెడును కూడా సృష్టించాడు. కాబట్టి భగవంతుడు చెడ్డవాడు" అని అన్నాడు ప్రొఫెసర్ తీర్మానిస్తూ. “భగవంతునిపై నమ్మకం" అనేది భ్రమ అని వాదించాడు. "సార్! నేనో ప్రశ్న అడగవచ్చా?”. అంటూ ఓ విద్యార్థి లేచాడు. అడగమన్నాడు ప్రొఫెసర్. "సార్! చల్లదనం ఉందాండీ" అని అడిగాడు. విద్యార్థి. “అదేం ప్రశ్న! చల్లదనం ఉంటుంది కదా! నీకెప్పుడూ అది అనుభవంలోకి రాలేదా?" అన్నాడు ప్రొఫెసర్. అప్పుడు ఆ విద్యార్థి "భౌతికశాస్త్రం ప్రకారం చల్లదనం అనేది ప్రత్యేకంగా లేదు కదా సార్. ఉష్ణోగ్రత లేకపోవడాన్నే చల్లదనమని అనుకుంటున్నాం. వస్తువులో ఉష్ణోగ్రత  లేదు గనుక, వేడిగా లేదని చెప్పడానికే మనం అనే చల్లదనం అనే పదాన్ని ఉపయోగిస్తాం” అన్నాడు. అవును నువ్వు చెప్పింది నిజమే అన్నాడు ప్రొఫెసర్. అయితే మరొక ప్రశ్న సార్.. “చీకటి ఉందా?” అని మళ్ళీ ప్రశ్న వేశాడు విద్యార్థి.   "అవును, ఉంది కదా” అన్నాడు ప్రొఫెసర్. "మళ్లీ మీరు పొరబడ్డారు!" అంటూ ఆ విద్యార్థి ఇలా చెప్పాడు.  “సార్, చీకటి అనేదే లేదు. వెలుతురు లేకపోవడాన్నే మనం చీకటి అంటున్నాం. వెలుతురును అధ్యయనం చేయగలం గానీ, చీకటిని అధ్యయనం చేయలేము. అని అన్నాడు. ఆ మాట విని ప్రొఫెసర్ చాలా నిశ్శబ్దం అయిపోయాడు.  సార్ ఇంకొక ప్రశ్న.. చివరి ప్రశ్న ఇదే..  "మరి చెడు ఉందాండీ?" అని చివరి ప్రశ్న సంధించాడా విద్యార్థి.  "అవును ఉంది. నేను మొదటే చెప్పానుగా, ఈ లోకంలో ఘోరాలు, హత్యలు. అన్నీ చెడే కదా" అన్నాడు ఆవేశంగా ప్రొఫెసర్. దానికి ఆ విద్యార్థి "సార్.. మనిషి హృదయంలో చెడు అనేదే లేదు, మంచి లేకపోవడమే చెడు అంటున్నాం.  అంటే భగవంతుడు లేకపోవడాన్నే పాపం అనే పదంతో నిర్వచిస్తున్నాం"  అని జవాబిచ్చాడు. ఆ తర్కానికి కంగుతిన్నాడు ప్రొఫెసర్. తాను ఓడి పోయానని అంగీకరిస్తూ ఏమీ వాదించలేక తల దించుకున్నాడు. అంతటి ప్రొఫెసర్ని కూడా తర్కంతో భగవంతుడు ఉన్నాడని ఒప్పించిన ఆ విద్యార్థి ఎవరో తెలుసా? ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్.                                  ◆నిశ్శబ్ద.

జీవితానికి పట్టుదల ఎందుకు అవసరమో తెలిపే విషయాలు...

మనిషికి జీవితంలో పట్టుదల అనేది ఎంతో ముఖ్యం. ఈ పట్టుదల అనేది కేవలం మనిషికే కాదు సకల పశుపక్ష్యాదులకు కూడా ఉంటుంది. దానికి ఒక మంచి ఉదాహరణ… టిట్టభ అనే పక్షి కథ..  టిట్టభ అనే పక్షి జంట ఒకటి సముద్రతీరంలో గూడు కట్టుకుని ఉండేది. ఆడపక్షి గుడ్లు పెట్టినప్పుడల్లా, సముద్రరాజు అలలతో వాటిని ముంచెత్తి, మింగేసేవాడు. సముద్రుని దురాగతాన్ని గమనించిన మగపక్షి, 'సముద్రాన్నే ఎండగట్టి, నా గుడ్లను స్వాధీనపరచుకొంటాను' అంది. ఆ పిట్ట తన ముక్కుతో, రెక్కలతో నిరంతరాయంగా సముద్ర జలాలను భూమిపైకి వేయసాగింది. ఇతర పక్షులు, ఆ మగ టిట్టిభ పక్షి విషయం తెలుసుకొని, తాము కూడా ఈ మహత్తర కృషిలో పాలుపంచుకున్నాయి. పక్షిజాతులన్నీ సమైక్యంగా చేస్తున్న పనిని గమనించి, గద్దలు, రాబందులు మొదలైన పక్షిజాతులన్నీ క్రమంగా ఆ పనికి పూనుకున్నాయి. ఈ సంగతి విన్న పక్షిరాజు గరుత్మంతుడు కూడా వైకుంఠం వదలి వచ్చి, పక్షి సమూహాలతో చేయి కలిపాడు. వాహనం లేక కష్టపడుతున్న విష్ణువు స్వయంగా సముద్ర తీరం చేరాడు. గరుత్మంతుడు పక్షిజాతుల దైన్యాన్ని తన స్వామికి నివేదించాడు. కరుణామయుడైన శ్రీమహావిష్ణువు సముద్రరాజుకు నచ్చజెప్పి, ఆ తీతువు పక్షి జంటకు గుడ్లను తిరిగి అప్పగించేటట్లు చేశాడు. 'హితోపదేశం'లోని ఈ కథ పట్టుదల ఫలితాన్ని చెబుతుంది. శ్రమశీలికి అపజయం ఉండదు అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఇది ఒక పక్షి కథనం మాత్రమే.. మన చరిత్రలో దీనికి మరికొన్ని ఉదాహరణలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడిగా విశేష ఖ్యాతిని ఆర్జించిన అబ్రహామ్ లింకన్ 1816 నుంచి 1860 వరకు అనుభవించిన కష్టనష్టాలు, జయాప జయాలు అంతులేనివి. ఆయన ఎనిమిదిసార్లు దేశాధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయాడు. మూడుమార్లు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. రెండుసార్లు  వ్యాపారంలో దివాలా తీశాడు. ఆరు నెలల పాటు తీవ్ర మనస్తాపంతో కుమిలిపోయాడు. పదిహేడేళ్ళ పాటు ఋణగ్రస్తుడిగా గడిపాడు. చివరకు  1860 ఎన్నికలలో గెలిచి, అమెరికా అధ్యక్షుడయ్యాడు. బానిస వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడి చరిత్రకెక్కాడు. ఆయన అంత సాధించడానికి ప్రధాన కారణం పట్టుదల, అచంచల దీక్ష. దృఢ సంకల్పం ఉంటే తప్పకుండా సంకల్ప సిద్ధి కలుగుతుంది. నెపోలియన్ చక్రవర్తి ఆకారంలో చాలా పొట్టి. అలాంటి వాడు ప్రపంచాన్నే జయించాడు. అందుకు కారణం - ఉక్కు లాంటి చెక్కు చెదరని అతని మనసే!  గొప్ప వక్తగా పేరు తెచ్చుకున్న డెమస్తనీస్ కు నిజానికి మహా నత్తి. ఆయన నాలుక కింద గులకరాళ్ళు ఉంచుకొని, సాగర తీరంలో కేకలు వేసి, తనకున్న నత్తిని పోగొట్టుకొన్నాడు. మహావక్తగా నివాళులందుకొన్నాడు. సహనం, పట్టుదల వల్లనే ఆయన ఆ స్థాయికి ఎదగగలిగాడు.  ప్రజల ఎగతాళినీ, నిందలనూ లెక్కచేయకుండా బీదవాడైన బెంజిమిన్ డిజ్రేలీ ఇంగ్లండు ప్రధాని కావడానికి కారణం అతని పట్టుదలే. రోమన్  సామ్రాజ్య ఉత్థాన పతనాలు రాయడానికి గిబ్బన్ 20 ఏళ్ళు కష్టపడ్డాడు. వంద కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణమైనా సరే ఒక్క అడుగు వేయడంతోనే ప్రారంభమవుతుంది. 'ఉద్యమేన హి సిద్ధ్యంతి' అనడంలోని పరమార్థం అదే. అసాధ్యం సాధ్యం కాగలదు. కాబట్టి మనిషి తనలో ఉన్న పట్టుదలను పెంపొందించుకోవాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి. ఎవరికో సాధ్యం కాలేదు మనకేం సాధ్యమవుతుందిలే.. వంటి నిరాశా వాదాలు వదిలిపెట్టాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది.                                ◆నిశ్శబ్ద.  

చాక్లెట్స్ తో మొటిమలకి చెక్!

  చాక్లెట్స్ అంటే పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ఇష్టమే. తీయ్యటి చాక్లెట్స్ తినటానికి ఓ కారణం దొరకాలే కాని తినకుండా ఉండగలమా ? ఏ పుట్టినరోజుకో, పండగకో, కాదు ఇప్పడిక రోజు చాక్లెట్స్ తినడానికి ఓ తియ్యటి కారణం దొరికింది. అదే మొటిమ అవునండీ! అందమైన ముఖానికి ఓ చిన్ని మొటిమైన పెద్ద మచ్చ కిందే లెక్క అందులోనూ టీనేజ్ అమ్మాయికి మొటిమలతో పెద్ద పేచినే. ఇలా మొటిమలతో వేగలేని వారికీ ఓ తియ్యటి మందు కనిపెట్టిందో అమెరికా కంపెనీ విటమిన్లు, మినరల్స్తో నింపే ఓ చాక్లెట్ను తయారుచేశారు. వాటిని రోజుకు 2 నుంచి 5 దాకా తింటే చలట. రెండు మూడు వారాల్లోనే మొటిమలు తగ్గిపోవటం గ్యారెంటి అంటున్నారు. ఈ చాక్లెట్ లో వాడే విటమిన్లు, మినరల్స్ వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళనా తగ్గుతాయట. అలాగే చర్మం లోపలకి చేరే జిడ్డుని కూడా తొలగిస్తాయట. దాంతో క్రమంగా మొటిమలు కూడా తగ్గుతాయట కాబట్టి మొటిమల కోసం క్రీములు, పైపూతలు వేసుకునే కష్టం లేదిక అందుకోసం గంటలు, గంటలు సమయం వృదా చేయక్కర్లేదు. హాయిగా ఓ తియ్యటి చాక్లెట్ నోట్లో వేసుకోవటమే. ఇంతకి ఆ చాక్లెట్ పేరు చెప్పలేదు కదు ' ఫ్రూటెల్స్' పేరుతో దొరికే ఈ చాక్లెట్ కీ ఇప్పుడు విదేశాలలో బోల్డంత డిమాండ్. కాదా మరి టీనేజ్ అమ్మాయిల్నే కాదు అబ్బాయిల్ని దడదడల లాడించే మొటిమలా మజాకానా! ....రమ

మనిషి జీవితం ఈ రెండు విషయాల మీదే ఆధారపడి ఉంటుంది!

అతి సర్వత్రా వర్జయేత్.. అని పెద్దలు అన్నారు. ఏ విషయంలోనూ అతిగా ఉండకూడదు అని దీని అర్ధం. అతి భాష మతి హాని, మిత భాష ఎంతో హాయి.. అని కూడా అంటారు. అతిగా మాట్లాడితే బుర్ర పాడవుతుంది, అదే తక్కువగా మాట్లాడితే అన్నిటికి మంచిది అని అర్థం. అన్ని వేళలా 'అతి'ని విసర్జించాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అతిగా తినడం, అతిగా నిద్రపోవడం, మాట్లాడడం ఇలా అవసరాన్ని మించి చేసే ఏ పనైనాసరే ప్రమాదకరం అని గ్రహించాలి. మహాత్ములంతా మౌనంతోనే మహత్కార్యా లను సాధించారు. మనం ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే 'నోటిని' అదుపులో పెట్టడం నేర్చుకోవాలి. అనవసరంగా మాట్లాడడం కట్టిపెట్టాలి. నోటిని అదుపులో ఉంచుకొంటే మనసును స్వాధీనంలో ఉంచుకున్నట్లే! అతిగా మాట్లాడడం వలన మనలో ఉన్న శక్తి వృథా అవుతుంది. కాబట్టి శక్తిని సమకూర్చుకోవాలి  అంటే ఎక్కువ మాట్లాడటం తగ్గించాలి.   అతిగా మాట్లాడడం చాలామంది బలహీనత ఖ్నే విషయం తెలిస్తే కాస్త ఆశ్చర్యం వేస్తుంది. కానీ దానివల్ల కలిగే అనర్థాన్ని గ్రహించినా మాట్లాడకుండా ఉండలేని పరిస్థితిలో కొందరుంటారు. అతిగా మాట్లాడటం వల్ల కలిగే  నష్టాన్ని గ్రహించి దాన్ని తగ్గించుకోవాలనే ఆలోచన చేస్తే అప్పుడు కొన్ని విషయాలు అందరికీ సహాయపడతాయి.  బలహీనులు 'అదృష్టాన్ని' నమ్ముకుంటారు. బలవంతులు 'ప్రయత్నాన్ని' నమ్ముకుంటారు. మరి మీరు ఈ రెండింటిలో దేన్ని నమ్ముకుంటారో మీరే నిర్ణయించుకోండి. అతిగా మాట్లాడటమే మీ బలహీనత అయితే అప్పుడు మీరు ఏ విషయంలోనూ సరైన ప్రయత్నం చేయలేరు.  నోటిని, మాటను అదుపులోపెట్టుకుంటే మనసును కూడా అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు..  అయితే.. మనసును నియంత్రించడం మానవులకే కాదు. దేవతలకు కూడా ఒక పెద్ద సమస్యే! శ్రీరాముడు కూడా మనసుని నియంత్రించడం ఎలాగో తెలుపమని వశిష్ఠులవారిని ప్రార్ధించాడు. 'నీరు' పల్లానికి పారడం ఎంత సహజమో, 'మనసు' విషయ వస్తువుల వైపు పరుగులు తీయడం అంతే సహజం. నీటిలో తడవకుండా ఈత నేర్చుకోలేం. చెడు ఆలోచనలు రాకుండా మనోనిగ్రహాన్ని సాధించలేం. కాబట్టి మనసులో చెడు ఆలోచనలు వస్తున్నాయని ఆందోళన పడకుండా ఈ క్రింది సూచనలు పాటించాలి.  మనసు తలుపును తలపులు తట్టినప్పుడు ఒక్కసారి ఆలోచించి తలుపు తెరవడం నేర్చుకోండి. అంటే ఏదైనా అనిపించగానే దాన్ని వెంటనే ఆ పని చేయడం, ఆ మాటను విశ్వసించడం చేయకూడదు. ముందు వెనుకా ఆలోచన చేయాలి.  చెడు తలపులు తెచ్చే తంటాలను ఒక్కసారి ఇమేజిన్ చేసుకోవాలి. దానివల్ల ఎంత నష్టం కలుగుతుందో.. ఎన్ని సమస్యలు ఎదుర్కోవాలో ఊహించుకోవాలి. మంచి ఆలోచన ఎప్పుడూ ఆరోగ్యకరమైన మనసుకు దోహదం చేస్తుంది. కాబట్టి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి.    మనసుని ప్రలోభపరిచే పరిస్థితులకు దూరంగా ఉండాలి. చెడు సావాసం, చెడు మాట, చెడు దారి జీవితంలో వైఫల్యానికి కారణాలు.                                  ◆నిశ్శబ్ద.

కార్మికుల గొంతుకు ఫలితం వచ్చిన రోజిది!

'నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం..' అంటాడు శ్రీశ్రీ. మనుష్య జాతి చరిత్ర మొత్తం పక్కవాడిని పీడించుకుని, దోచుకుని తినడంతోనే నిండిపోయిందని అంటాడు. సమాజంలో ఉన్న మనుషులు వర్గాలుగా చీల్చబడి, అది కూడా ఆర్థిక అసమానతలతో వేరు చేయబడి, దోపిడీ సమాజం దర్జాగా బతుకుతున్న కాలమిది. కష్టానికి తగిన ఫలితం లేక శ్రమను పరిధికి మించి ధారపోస్తున్న దీనమైన శ్రామికుల ప్రపంచమిది. ఎటు చూసినా బలహీనుడు దారుణంగా దగాకు గురవుతున్న ప్రపంచమిది. ఈ దోపిడీ సమాజానికి వ్యతిరేకంగా.. తమకూ హక్కులున్నాయని.. వాటిని  సాధించుకోవడం తమ లక్ష్యమని భావించి, పోరాడిన ఫలితంగా మే డే అవిర్భవించించి.  శ్రామికుల దినోత్సవమన్నా.. కార్మికుల దినోత్సవమన్నా.. లేబర్ డే అన్నా.. అదంతా బలహీనుల పక్షాన నిలబడేదే..  ప్రతి సంవత్సరం మే 1 తేదీని కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటారని అందరికీ తెలుసు. కార్మికులు సాధించిన విజయాలను గౌరవించడం, వారి హక్కులను వారిని గుర్తుచేయడం, ఆ దిశగా ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం.  ఈ కార్మిక దినోత్సవమే ప్రపంచ వ్యాప్తంగా 'మే డే'గా ప్రసిద్ధి చెందింది, ఇది 19వ శతాబ్దంలో యునైటెడ్ స్టేట్స్‌లో కార్మిక సంఘాల ఉద్యమంతో ఆవిర్భవించింది. వారి డిమాండ్స్ లో  ఎనిమిది గంటల పని ఓ ఉద్యమంగా సాగింది. అప్పటి వరకు కార్మికుల చేత 14 నుండి 15 గంటల పని చేయించేవారు.  కార్మికుల పోరాట ఫలితంగా కార్మిక దినోత్సవ బిల్లును ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం న్యూయార్క్ అయితే, ఫిబ్రవరి 21, 1887న ఒరెగాన్ దానిపై ఒక చట్టాన్ని ఆమోదించింది. తరువాత 1889లో, మార్క్సిస్ట్ ఇంటర్నేషనల్ సోషలిస్ట్ కాంగ్రెస్ గొప్ప అంతర్జాతీయ ప్రదర్శన కోసం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. రోజుకు 8 గంటలకు మించి పని చేయకూడదని కార్మికులు డిమాండ్ చేశారు. దీంతో మే 1వ తేదీని కార్మిక దినోత్సవంగా నిర్ణయించారు.  భారతదేశంలో కార్మిక దినోత్సవం మే 1, 1923న చెన్నైలో జరుపుకోవడం ప్రారంభించారు. దీనిని 'కమ్‌గర్ దివాస్', 'కామ్‌గర్ దిన్', 'అంత్రరాష్ట్రీయ శ్రామిక్ దివస్' అని కూడా పిలుస్తారు. ఈ రోజును లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ మొదటిసారిగా పాటించింది. కార్మికుల దినోత్సవాన్ని ఎన్నో దేశాలలో జాతీయ సెలవుదినంగా పాటిస్తారు. అమెరికా యూరప్ లలో కార్మిక దినోత్సవాన్ని చాలా గొప్పగా జరుపుకుంటారు.                                     ◆నిశ్శబ్ద.  

పవిత్ర మాసం రంజాన్!!

పండుగ అంటే ఒక పెద్ద సంబరం. పండుగలో కళ ఉంటుంది, సంతోషం ఉంటుంది, వీటితో పాటూ ఒక గొప్ప సందేశం ఉంటుంది. అది హిందువులు అయినా, ముస్లింలు అయినా, క్రైస్తవులు అయినా పండుగ జరుపుకోవడం అంటే తాము నమ్మిన సిద్దాంతంలో ఉన్న సందేశాన్ని అందరికీ తెలియజేయడమే. ముస్లిం మతస్థులకు పండుగలు చాలా కొద్దిగా ఉంటాయి. వాటిలో ఎంతో ప్రాముఖ్యమైంది రంజాన్. ముస్లిం మతస్తులు అనుసరించే చంద్రమాస క్యాలెండర్ ప్రకారం వారి సంవత్సరంలో తొమ్మిదవ నెలే ఈ రంజాన్. ఇది ఎంతో పవిత్రమైనదిగా వాళ్ళు భావిస్తారు. ఎందుకూ అంటే వారి పవిత్ర గ్రంథం అయిన ఖురాన్ ఈ రంజాన్ నెలలోనే ఆవిర్భవించింది. పరమార్థం!! ఒక వేడుకలో ఉండే అర్థాన్ని పరమార్థం అని చెప్పవచ్చు. ఇప్పుడు చెప్పుకుంటున్న రంజాన్ కూడా అలాంటి పరమార్థాన్ని దాచుకున్నదే. ముఖ్యంగా రంజాన్ ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని అందులో ఉన్న విశిష్టతను చెబుతుంది. ఇక ఇందులో ముస్లిం మతం యావత్ ప్రాశస్త్యం ఇమిడిపోయి ఉంటుంది.  ఉపవాసం ప్రాధాన్యత!! హిందువులకు ఉపవాసం, మాఘమాసం, కార్తీకం, ఇంకా మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఎంతటి భక్తి ఉంటుందో, రంజాన్ మాసంలో ముస్లిం మతస్థులకు అంతే భక్తి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది.  ప్రతిరోజు సూర్యోదయంకు ముందే నిద్రలేచి వంట చేసుకుని భోజనం చేసి సూర్యుడు ఉదయించి తరువాత ఇక పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా కఠోర ఉపవాసదీక్ష చేపట్టడం వీళ్ళ భక్తికి, క్రమశిక్షణకు తార్కాణం. ఈ ఉపవాసాన్ని రోజా అని పిలుస్తారు. నెల మొత్తం నిష్ఠగా రోజా ఉండే వాళ్ళు చాలామందే ఉంటారు. వీళ్ళలో రోజూ ఖురాన్ గ్రంధాన్ని పఠించడం, విధిగా నమాజ్ చేయడం తప్పనిసరిగా చేస్తారు.  ఇఫ్తార్!! ఉపవాసం విరమించడాన్ని ఇఫ్తార్ గా పిలుస్తారు. ప్రస్తుత కాలంలో ఇఫ్తార్ విందులు చాలా ఫెమస్ అయిపోయాయి. రాజకీయ నాయకులు, ప్రముఖులు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఓ రేంజ్ లో ఉంటుంది. వీళ్ళు ముఖ్యంగా ఖర్జూరానికి స్థానమిచ్చారు. ఉపవాసం ముగియగానే మొదటగా ఖర్జూరం తిన్న తరువాత మిగిలిన ఆహారం తీసుకుంటారు. అయితే సాధారణ రోజా ఉండేవాళ్ళు ఉపవాస దీక్ష ముగియగానే తాము తెచ్చిన ఆహారాన్ని అందరికీ పంచుతారు. ఇలా ఒకరికి ఇవ్వడంలో గొప్పదనాన్ని తమ మతంతో చాటి చెబుతారు. జకాత్!! ప్రతి ముస్లిం తన సంపాదనలో కొంతమొత్తాన్ని దానధర్మాల కోసం ఉపయోగించాలి. జాకాత్ అందుకే ఉద్దేశించబడింది. ఇవ్వడం అంటే ఇవ్వాలి కాబట్టి తమవారికి ఇచ్చుకోవడం కాదు. పేదలకు, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చెయ్యడం. ముఖ్యంగా పండుగ జరుపుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్లకు అవసరమైనవి సమకూర్చడం. ఇలా పండుగలో ఇవ్వడమనే గొప్ప విషయాన్ని మేళవించారు. పవిత్ర ఖురాన్!! హిందువులకు భగవద్గీత ఎలాంటిదో ముస్లిం మతస్తులకు ఖురాన్ అలాంటిది. నిజానికి ఖురాన్ లో ఎంతో గొప్ప విషయాలు ఉన్నాయి. అయితే ప్రతి మాత గ్రంధం కాలానుగుణంగా మారే మతపెద్దలు ఆలోచనలను నింపుకుంటూ మెల్లిగా స్వరూపాన్ని మార్చుకుంటూ వస్తోంది. అలా అవి మారుతూ ఉండటం వల్లనే ప్రస్తుతం అన్నిరకాల మత గ్రంధాలు విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాయి. అందుకే ఎందులో అయినా మంచిని తీసుకోవడంకు మించిన గొప్ప పని మరొకటి ఉండదు. నెలవంక నియమం. ప్రతిరోజూ ఆకాశంలో నెలవంకను చూసి దాని ప్రకారం ఉపవాస దీక్షను అంచనా వేసుకోవడం వీరి ప్రత్యేకత. హిందువులు ఎలాగైతే సూర్యుడి ఉషోదయ, అస్తమయాలను లెక్కలోకి తీసుకుంటారో, వీళ్ళు అలాగే చంద్రుడిని తీసుకుంటారు.  ఇలా నియమాలు, దానధర్మాలు, సహాయాలు కలగలిసి ఎంతో ఉదార హృదయాలను, ఉపవాస దీక్షలతో సహనాన్ని, నమాజ్ లతో క్రమశిక్షణను పెంచే రంజాన్ అందరికీ సందేశాన్ని ఇచ్చే పండుగ.                                   ◆ వెంకటేష్ పువ్వాడ.  

రంజాన్ మాసం-చివరి శుక్రవారం!!

మహమ్మదీయ మిత్రులు ఎంతో ముఖ్యమైనదిగా భావించే రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని జుమాతుల్ విదా అని అంటారు. సాధారణంగా శుక్రవారాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావించే ముస్లిం సోదరులు రంజాన్ మాసంలో చివరి శుక్రవారాన్ని  అని శుక్రవారాల కంటే ప్రత్యేకంగా చూస్తారు. అరబ్బీ భాషలో జుమా అంటే శుక్రవారం. అల్ విదా అంటే వీడ్కోలు. జుమాతుల్ విదా అంటే చివరి శుక్రవారానికి వీడ్కోలు పలకడం అని అర్థం. అంటే రంజాన్ మాసం ముగింపు దశకు వచ్చిందని, ముస్లిం మిత్రులు ఎంతో భక్తిగా ఆచరిస్తున్న ఉపవాసాలకు కూడ వీడ్కోలు పలకాల్సిన సమయం వచ్చేస్తోందని అర్థం. రంజాన్ మాసం మొదలును ఈద్-అల్-ఫితర్ గా చెప్పుకుంటామని అందరికీ తెలిసినదే.  నెలవంక దర్శనంతో ఇది ప్రారంభమవుతుంది, ఇది ఇస్లామిక్ ప్రపంచానికి చాలా పవిత్రమైన రోజు.  వ్యక్తులు పవిత్ర ఖురాన్‌ను పఠించాలని, ఒకరికొకరు తమ సంతోషాన్ని అందరితో పంచుకోవాలని నియంగా ఉంటుంది. కావాలంటే ప్రతిచోటా ఇద్దరు ముస్లిం సోదరులు ఎదురుపడితే ఆలింగనంతో ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడం చూడవచ్చు.  ఈ మాసంలో  పేదలకు దానాలు చేయడం ద్వారా ఇవ్వడంలో ఉన్న గొప్పదనాన్ని తెలుపుతారు    జుమాతుల్ విదా చరిత్ర  వారంలో ప్రతి శుక్రవారం ఇస్లామిక్ సంప్రదాయాలు మరియు సంస్కృతి ప్రకారం ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. ఈరోజు ప్రార్థనలు చేయడం వల్ల ముస్లిం సోదరులు  తమకు ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇంకా రంజాన్ మాసంలోనే ఖురాన్ ఆవిర్భవించింది కాబట్టి ఖురాన్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు.  ఈ సందర్భంగా  ఖురాన్‌ను తప్పనిసరిగా పఠిస్తారు, దేవుని ఆశీర్వాదాలను పొందడం కోసం నిరాశ్రయులకు మరియు నిస్సహాయంగా ఉన్నవారికి ఆహారం అందించడం, సహాయాలు చేయడం వంటి ఇతర ధార్మిక చర్యలను పాటిస్తారు.   ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం, దేవుని దూత ఈ నిర్దిష్ట రోజున (శుక్రవారం ప్రార్థన) మసీదును సందర్శించి, ఇమామ్‌ను వింటాడు.  ఆ సమయంలో అక్కడ ఉండటం వల్ల దేవుడి కృపకు పాత్రులు అవ్వగలమనే నమ్మకంతో ఉదయాన్నే ప్రార్థనల కోసం మసీదుకు వెళ్లే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం  ఏమిటంటే రంజాన్ మాసంలో వచ్చే ఈ చివరి శుక్రవారం రోజున నమాజ్ చేయడం వల్ల, తాము ఏదైనా తప్పులు చేసి ఉంటే అల్లాహ్ వారిని క్షమిస్తాడని  ప్రవక్త మహమ్మద్ తన బోధనలలో తెలిపారు.  చివరి శుక్రవారం రోజున అన్ని ప్రాంతాలలో  మసీదు వెలుపల షామియానాలు ఏర్పాటు చేస్తారు. ప్రార్థనలు కోసం వచ్చే భక్తుల రద్దీ కారణంగా, అందరూ ప్రార్థనలు చేసుకోవడానికి అనువుగా ఇలాంటి ఏర్పాట్లు చేస్తారు. ఎక్కువ భగణ ఖురాన్ పఠించడానికి కేటాయిస్తారు.  స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇవ్వడం లేదా పేదలకు ఆహారం ఇవ్వడం భవిష్యత్తులో పుణ్యాన్ని పొందుతుందని నమ్ముతారు అదే విషయాన్ని తమ పిల్లలకు కూడా చెబుతారు. సమాజ్ సందడి!! ముస్లిం సోదరులు తమ జీవితంలో నమాజ్ ను కూడా భాగంగా చేసుకుని ఉంటారు. అయితే రంజాన్ మాసంలో మాత్రం నమాజ్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. సాధారణంగా కొందరు రోజులో రెండు లేదా మూడు సార్లు నమాజ్ చేసుకుంటారు కానీ రంజాన్ మాసంలో మాత్రం అయిదు సార్లకు తగ్గకుండా నమాజ్ చేయడం తప్పనిసరి. నమాజ్ కు ముందు వజూ చేయడం పరిపాటి. వజూ అంటే ముఖం, కాళ్ళు, చేతులు మూడుసార్లు నీటితో శుద్దిచేసుకోవడం.  ఇందుకోసం మసీదు లలో ప్రత్యేకంగా చిన్న చిన్న నీటి సరస్సులు, ఏర్పాటు చేయబడి ఉంటాయి కూడా. సుర్మా….. సొగసు!! నిజానికి సుర్మా అనేది ముస్లిం సోదరులు జీవితంలో ఒక అలంకరణ అంశంగా మాత్రమే కాకుండా అదొక భక్తి భావనగా కూడా చూస్తారు. నమాజ్ చేసుకోవడానికి ముందు వజూ చేసి, కళ్ళకు  సుర్మా పెట్టుకోవడం తప్పనిసరిగా రంజాన్ మాసంలో చేస్తారు. కళ్ళకు కాటుక లాగా పౌడర్ రూపంలో ఉండే నల్లని సుర్మా ఎంతో అందంగా ఉంటుంది. ఇంకా దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముస్లిం సోదరులు అవధూతగా భావించే మహమ్మద్ ప్రవక్త సుర్మాను ఎప్పుడూ పెట్టుకునేవారని, అందుకే రంజాన్ మాసంలో దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెబుతారు. ఇంటికి వచ్చిన అతిథులకు అందమైన భరణి లలో సుర్మాను, అత్తరును బహుమతిగా ఇవ్వడం ముస్లిం సోదరులు ఆచారం కూడా. చివరి శుక్రవారం మీతోటి ముస్లిం సోదరులకు సహకరించండి మరి. పండుగ, సంబరం, సందేశం అందరివీ మరి.                             ◆వెంకటేష్ పువ్వాడ.

వ్యక్తిత్వం గొప్పగా ఉండాలంటే ఈ రెండూ దూరం పెట్టాలి!

మనిషిని గొప్పగా నిలబెట్టేది వారి వ్యక్తిత్వమే.. కానీ ఈ కాలంలో మనుషుల్లో ఉన్న కొన్ని లక్షణాలు వారి వ్యక్తిత్వపు విలువను తగ్గించేస్తాయి. మరీ ముఖ్యంగా ఈ కింది రెండు మనిషిని ఎంత నీచంగా తయారు చేయాలో.. అంత నీచంగా చేస్తాయి. వీటిని దూరంగా  ఉంచడం మంచి వ్యక్తిత్వానికి అవసరం..  ఓర్వలేనితనం.. ఒకరిని చూసి మనం ఓర్వలేకపోతున్నామంటే, మనల్ని మనం హీనపరచు కుంటున్నామని అర్థం. అది పూర్తిగా మన ఆత్మన్యూనతా భావానికి (Inferiority complex) చిహ్నం. ఈ అసూయ పొడ చూపిన క్షణం నుంచి మనలో మానసిక అలజడి మొదలవు తుంది. అది క్రమంగా మన ప్రశాంతతను హరించి వేసి మన శక్తులన్నింటినీ నిర్వీర్యం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో మన విచక్షణను కూడా కోల్పోయేలా చేస్తుంది. ఎదుటి వ్యక్తి మనకు శత్రువన్న భ్రమను కల్పించి, ప్రతీకార జ్వాలల్ని రగిలిస్తుంది. నలుగురితో కలసి ఆహ్లాదంగా ఉండలేని పరిస్థితిని సృష్టిస్తుంది. అందుకే స్వామి వివేకానంద అంటారు 'Jealousy is the bane of our national character, natural to slaves. Three men can not act in concert together in India for five minutes!' నిజమే, అసూయ బానిసల స్వభావం. అది జాతి స్వభావాన్నే విషపూరితం చేసి, నిర్వీర్యపరుస్తూ ఉంది. భారత దేశంలో ముగ్గురు వ్యక్తులు కలసికట్టుగా అయిదు నిమిషాలైనా పనిచేయలేరు. ఒక కళాకారుడు, మరో కళాకారుడిని మన స్ఫూర్తిగా అభినందించలేడు. ఒక రచయిత మరో రచయిత పుస్తకాన్ని ఆసక్తిగా చదవలేడు. ఒక సంగీత విద్వాంసుడు మరో సంగీతజ్ఞుడి గానాన్ని సంపూర్ణంగా ఆస్వాదించలేడు! ఇలా, ఇక ఎంత విద్వత్తు ఉంటే ఏం లాభం?. చాలా సభాకార్యక్రమాలకు చాలా మంది కళాకారులు ఒకరిని పిలిస్తే, మరొకరు మేము రామని నిరాకరిస్తున్న సందర్భాలు కోకొల్లలు. కుళ్ళుకుంటే కుమిలిపోతాం..  అసూయ యుక్తాయుక్త విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. నిజానికి ఎవరి ప్రతిభ వారిదే! ఎవరి ప్రాధాన్యం వారిదే! మనం కుళ్ళుకొని కుమిలిపోయినంత మాత్రాన ఒకరిది మన సొంతం కాదు. పైగా మానసిక అనారోగ్యానికి గురిచేస్తుంది. ఎదుటివారిని చూసి ఉడుక్కునే కన్నా, వారు ఆ స్థాయికి చేరుకోవటానికి పడిన శ్రమను గుర్తించి, అనుసరించాలి. తన వైభవాన్ని చూసి ఓర్వలేక, తరచూ అవమానపరిచే మామ దక్షుడి మానసిక స్థితిని విశ్లేషిస్తూ, తన సతీదేవి పార్వతితో శ్రీమద్భాగవత సప్తమస్కంధంలో పరమశివుడు అంటాడు 'అహంకారమూ, దోషములు లేనివారు కావడం చేత సజ్జనులకు ఘనకీర్తి లభిస్తుంది. అలాంటి కీర్తి, తమకూ దక్కాలని కొందరు కోరుకుంటారు. కానీ వారు అసమర్థులు కావడం వల్ల వారికి కీర్తి రాదు. అందుచేత మనస్సులో కుతకుత ఉడికిపోతారు'.  ఈ రెండింటిని మనిషి తనకు ఎంత దూరంగా ఉంచుకుంటే అంత మంచిది. అదే మనిషి వ్యక్తిత్వాన్ని గొప్పగా మారుస్తుంది.                                    ◆నిశ్శబ్ద.

మీకూ ప్రపంచంలో చెడు కనబడుతోందా?? కారణమిదే..

మన మనోస్థితే మన చుట్టూ ఉన్న ప్రపంచ స్థితిని నిర్ణయిస్తుంది. మనోస్థితి మారితే, ప్రపంచ స్థితి కూడా విధిగా మారితీరుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ చేయాల్సిందేమిటంటే… మిమ్మల్ని మీరు పవిత్రీకరించుకోవాలి. అలా చేస్తే గనుక  ప్రపంచం కూడా తప్పక పరిశుద్ధమౌతుంది. ఈ విషయాన్నిపూర్వం నుండి భోధిస్తూనే ఉన్నారు. అయితే దాన్ని పూర్వంకంటే ఇప్పుడు ఎక్కువగా బోధించాల్సి ఉంది. సందుకంటే.. ఇరుగుపొరుగు వారి విషయాలలో మన ఆసక్తి పెరిగిపోతోంది. సొంత విషయాలలో ఆసక్తి తగ్గిపోతోంది. మనం మార్పు చెందితే ప్రపంచం కూడా మార్పు చెందుతుంది. మనం పరిశుద్ధులమైతే, లోకం కూడా పరిశుద్ధమౌతుంది.  ప్రతి ఒక్కరూ ఒక ప్రహన వేసుకోవాలి.  ఇతరులలోని చెడును నేనెందుకు చూడాలనేదే ఆ ప్రశ్న. నేను చెడిపోయి ఉంటేనే గాని ఇతరులలోని చెడును చూడలేను. నాలో బలహీనత లేకపోతే నాకు దుఃఖం కలుగదు. నేను పసివాడిగా ఉన్నప్పుడు నాకు దుఃఖాన్ని కలుగించినవి. నన్నిప్పుడు దుఃఖపెట్టలేవు. మనస్సు మారింది కాబట్టి, ప్రపంచం కూడ తప్పక మారుతుందని వేదాంతం వక్కాణిస్తుంది. ఇలా మనోనిగ్రహాన్ని సాధించిన వ్యక్తిపై బాహ్యమైనది ఏదీ ప్రభావం చూపలేదు. అతడికి ఇకపై కూడా ఎలాంటి బంధం ఉండదు. అతడు స్వాతంత్ర్య మనస్కుడు అవుతాడు. అలాంటివాడే ప్రపంచంలో చక్కగా జీవించగలిగిన సమర్థుడు అవుతాడు.  లోకాన్ని గురించి రెండు విధాలైన అభిప్రాయాలు గల వ్యక్తులు సాధారణంగా కనిపిస్తారు. కొంతమంది నిరాశావాదులై ప్రపంచం ఎంత ఘోరం! ఎంత దుష్ట అని అంటుంటారు. మరికొంతమంది ఆశావాదులై ప్రపంచం ఎంత చక్కనిది! అద్భుతమైనది! అని అంటుంటారు. మనోనిగ్రహాన్ని సాధించని వారికి ప్రపంచం చెడ్డదిగా తోస్తుంది లేదా మంచిచెడుల  మేళవింపు గానైనా అనిపిస్తుంది. మనోనిగ్రహ సంపన్నులమైతే మనకు ఈ ప్రపంచమే ఆశాజనకమై కనబడుతుంది. అప్పుడు మనకు ప్రపంచంలో ఏదీ మంచిగాగాని చెడుగా గాని అనిపించదు. అన్నీ సర్వం సరైన స్థానంలో ఉన్నట్లు అదంతా సమంజసమే అన్నట్టు అగపడుతుంది. ప్రేమా, సౌజన్యమూ, పావనత్వమూ మనలో ఎంత పెంపొందితే బయట వున్న ప్రేమాసౌజన్య పాపనత్వాలను మనం అంతగా చూడగలం. పరదూషణ నిజానికి ఆత్మదూషణే. పిండాండాన్ని నువ్వు చక్కబరుచుకొన్నావా (ఇది నువ్వు చేయగల పనే), బ్రహ్మాండం తనంతట తానే నీకు అనువుగా మారుతుంది. ఆదర్శ ద్రవాన్ని అది ఎంత కొద్ది పరిమాణంలో ఉన్నా దానికంటే ఎక్కువ పరిమాణంగల ద్రవంతో సరితూగేటట్లు చేయవచ్చుననే సూత్రంలా ఒక నీటిబిందువు విశ్వంతో సరితూగగలదు. మనలో ఏది లేదో అది మనకు వెలుపల కూడా కనబడదు. చిన్న ఇంజనుకు పెద్ద ఇంజను ఎలాంటిదో విశ్వం మనకు అలాంటిది. చిన్నదాన్లో కనిపించే దోషం పెద్దదాన్లో ఏర్పడే చిక్కును ఊహింపజేస్తుంది. లోకంలో సాధింపబడ్డ ప్రతియత్నమూ నిజానికి ప్రేమచేత సాధింపబడిందే. తప్పులు ఎన్నటం వల్ల ఎన్నడూ ఏ మేలూ ఒనగూరదు. వేలకొద్ది సంవత్సరాలుగా విమర్శనా మార్గాన్ని అనుసరించి చూడటమైంది. నిందల వలన దేనినీ సాధించలేము.  అంటే మనిషి తనలో చెడును, చెడు భావనలను పెంచుకుంటే…  ఈ ప్రపంచంలో కూడా చెడు ఉన్నట్టు, తన చుట్టూ చెడు భావనలు ఉన్నట్టూ అతనికి అనిపిస్తుంది  ఇందులో వింత ఏమి లేదు. చూసే చూపును బట్టి విషయం అర్థమవ్వడం మాములే కదా…                                 ◆ నిశ్శబ్ద.

రాజ్యాంగ శిల్పి జయంతి!!

రాజ్యాంగం పేరు వినగానే అందరికీ గుర్తొచ్చే పేరు అంబేద్కర్. అందరికీ డా. బి.ఆర్ అంబేద్కర్ గా తెలిసిన ఈయన అసలు పేరు భీంరావ్ రాంజీ అంబేద్కర్. 1891 ఏప్రిల్ 14 వ తేదీన పుట్టిన ఈయన భారతీయ చరిత్రలో ఓ సంచలనం. అంటరానితనం, అస్పృశ్యత, ఆర్థికంగా ఎదగలేకపోవడానికి నిరక్షరాస్యతే కారణమని తను ఎంతో ఉన్నత విద్యావంతుడవ్వడమే కాకుండా ఎంతోమందికి స్ఫూర్తిగా కూడా నిలిచాడు. భారతదేశ రాజ్యాంగానికి రూపునిచ్చి బడుగు వర్గాల జీవితాలలో వెలుగులు నింపడానికి కృషిచేసిన మహనీయుడు ఈయన. అంటరాని బాల్యం!!  నిజంగా మనిషికి డబ్బున్న కూడా గౌరవం లేని కాలంలో అంబేద్కర్ పుట్టాడు. ఈయన తండ్రి బ్రిటిష్ వారి దగ్గర సుబేదారుగా పనిచేసేవాడు. ఆర్థికంగా మరీ అంత కష్టాలు ఏమీ ఉండేవి కాదు. కానీ చుట్టూ ఉన్న అగ్రవర్ణాల వారి నుండి సమస్యలు ఎదుర్కునేవాళ్ళు. ఎవరూ ముట్టుకునేవాళ్ళు కాదు, అందరూ ఉపయోగించే వస్తువులు ముట్టుకొనిచ్చేవాళ్ళు కాదు.  దానికోక చిన్న ఉదాహరణ:- బడిలో నీళ్లు తాగాలి అంటే చెత్త ఊడ్చే అతను ప్రత్యేకంగా వీళ్లకు ఇచ్చేవాడు. అందరితో కలిసి ఆడుకొనిచ్చేవాళ్ళు కాదు.  అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే "ఈరోజు చెత్త ఊడ్చే అతను లేడు. అందుకే తాగడానికి నీళ్లు లేవు" బాల్యంలో ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్న అంబేద్కర్ మహాశక్తిగా ఎదగడం వెనుక ఉన్నది కేవలం అక్షరాస్యత అంటే ఆశ్చర్యం వేస్తుంది. విద్య మనిషిని ఎంత గొప్పగా తయారుచేస్తుందో అర్థమవుతుంది. భారతదేశంలో ఉన్న విద్యాధికుల పేర్లు రాయాల్సి వస్తే అంబేద్కర్ పేరు ఎంతో గర్వంగా రాయచ్చు.  ఎంతో గొప్ప విశ్వవిద్యాలయాలలో పట్టాలు పుచ్చుకుని గొప్ప న్యాయవాదిగా మారినవాడు అంబేద్కర్. దళిత మహాసభతో మలుపు!! 1927 సంవత్సరంలో జరిగిన దళిత మహాసభ ఓ గొప్ప మలుపు అనుకోవాలి. చెరువులో నీటిని ముట్టుకునే అనుమతి కూడా లేని సందర్భంలో ప్రజలలో చైతన్యం నింపి ఆ చెరువు నీటిని అందరూ స్వీకరించేలా చేశారు ఈయన. ఆ తరువాత బహిష్కృత భారతి అనే పత్రిక స్థాపించాడు. ఆ పత్రికలోనే ఒక వ్యాసంలో అంబేద్కర్ ఇలా పేర్కొన్నారు. "తిలక్ గనుక అంటారానివాడుగా పుట్టి ఉంటే స్వరాజ్యం నా జన్మహక్కు అని కాకుండా అస్పృశ్యతా నివారణ నా ద్యేయం, అదే నా జన్మహక్కు అని నినదించి ఉండేవాడేమో" అని. ఆ మాటలు చూస్తే అంబేద్కర్ తన జీవితంలో కులవివక్షత వల్ల ఎంత ఇబ్బంది పడ్డాడో అర్థమవుతుంది. ఈ క్రమంలోనే బడుగు వర్గాల వారికి ఆర్థిక ఎదుగుదల ఉన్నప్పుడే దేశం ఆర్థికంగా ఎదుగుతుందని ఈయన విశ్వసించాడు. భారతజాతీయ కాంగ్రెస్ లో దళితులకు ప్రత్యేక నియోజక వర్గాలు తీసుకురావడం కోసం ఎంతో పోరాటం చేసి చివరకు విజయం సాధించాడు. రాజ్యాంగ రూపకల్పన!! నిజానికి రాజ్యంగం రూపొందించడానికి ఏడు మంది సభ్యులను నియమిస్తే అంబేద్కర్ తప్ప మిగిలిన అందరూ వివిధ కారణాల వల్ల రాజ్యాంగ పరిషత్తుకు దూరమయ్యారు. అందువల్ల అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడానికి నడుం బిగించాడు. ఈయన గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త అవ్వడం వల్ల రాజ్యాంగంలో బడుగు వర్గాల వారు బలపడేందుకు రిజర్వేషన్లను  పొందుపరిచారు.  ఎంతోమంది రిజర్వేషన్ల మూలంగా ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించారు. ప్రభుత్వ పథకాలకు అర్హులయ్యారు. అందుకే ఈయన బడుగు వర్గాల వారి పాలిట దేవుడయ్యాడు. మతమార్పిడి మరణం!! అంబేద్కర్ గారు దళిత వర్గం నుండి క్రిస్టియానిటిలో చేరారని ఆయన క్రైస్తవం పుచ్చుకోవడం వల్ల ఎంతోమంది దళితులు క్రైస్తవం వైపు దృష్టి పెట్టడం అందరికీ తెలిసిందే. అయితే అంబేద్కర్ గారు దళిత వర్గం నుండి క్రైస్తవం లోకి వెళ్ళలేదు అనేది నిజం. ఆయన ఎంతో ప్రాచీనమైనది, హిందూ మతానికి దగ్గరగా ఉన్నది అయిన భౌద్ధ మతంలోకి మారారు. ఈయన 1956 డిసెంబర్ 6వ తేదీన మరణించారు. భారతదేశానికి ఈయన అందించిన సేవలకు భారతరత్న ప్రకటించి విశ్వాసం నిలుపుకుంది భారతప్రభుత్వం. ప్రభావం!! భారత రాజకీయాలపై, విద్యార్ధులపై, దిగువ తరగతి వర్గాల వారిపై మాత్రమే కాకుండా విద్యావంతులపై కూడా అంబేద్కర్ ప్రభావం ఎంతో ఉంది. ఫలితంగా ఆయన ఎన్నో విధాలుగా అందరినీ ప్రభావం చేశారు. అది పరిస్థితులను అధిగమించి విద్యావంతుడుగా మారడం కావచ్చు, బడుగు జీవితాల కోసం శ్రమించడం కావచ్చు, రాజ్యాంగ కర్తగా కావచ్చు. ఏది ఏమైనా భారత రాజ్యాంగం నిలిచి ఉన్నంతవరకు దాన్ని లిఖించిన అంబేద్కర్ కూడా భారతావనిలో నిలిచే ఉంటాడు. ఓ ప్రభావితుడుగా…... ఓ ఆర్థిక వ్యూహకర్తగా…… ఈయన రచించిన పలు గ్రంథాలే వాటికి నిదర్శనాలు మరి.                                 ◆వెంకటేష్ పువ్వాడ.