మీరూ ఫొటోస్ తీస్తారు ఫిల్మ్ మేకర్స్ లా!

మనుషులు గడిచిపోయిన కాలాన్ని గుర్తుచేసుకోవడానికి చాలా రకాల మెరుగు ఉన్నాయి. గడిచిపోయినా కాలంలో చేదు జ్ఞాపకాలు అయితే మనసులో అలా ఉండిపోతాయి. కానీ తీపి జ్ఞాపకాలు చాలావరకు ఏదో ఒక ఉనికిని మనదగ్గర వదిలి ఉంటాయి. ముఖ్యంగా చిన్నతనంలో బుడిబుడి నడకలు, ఇష్టమైన వారితో కలసి గడిపిన క్షణాలు, ఇష్టమైన ప్రదేశాలను సందర్శించిన రోజులు ఇలాంటివన్నీ చాలావరకు ఫోటోల రూపంలో మనదగ్గర ఉంటాయి. వాటిని ఎప్పుడైనా చేసుకున్న ఆ కాలంలోకి వెళ్ళిపోయి ఆ క్షణాలను గడిపినట్టే ఉంటుంది. ఇంత తీపి గుర్తులు అయిన ఫోటోల వెనక చరిత్ర ఏంటి??  దాని పరిణామక్రమం ఏంటి అని చూస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిశాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 19 వ తేదీని ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఎన్నెన్నో కొత్త పుంతలు తొక్కి బోలెడు అద్బుతాలు సృష్టిస్తున్న ఫోటో వెనుక అసలు సంగతి ఏముంది?? మొబైల్స్ లో కూడా చక్కగా ఫొటోస్ తీసేస్తున్న మనకు ఈ ఫోటో ఆవిష్కరణ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే అవకాశం ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం  సందర్భంగా వచ్చేసింది. ఫోటోగ్రఫీ డే ని ఎలా నిర్ణయించారు?? 1837లో లూయిస్-జాక్వెస్-మాండే డాగురే, డాగ్యురోటైప్ ను ఆవిష్కరించారు. ఇతను  ఫ్రెంచ్ కళాకారుడు మాత్రమే కాకుండా ఫోటోగ్రాఫర్ కూడా. ఆయన ఆవిష్కరణ ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు విక్రయించారు. తరువాత అది బహుమతిగా అందివ్వబడింది. ఆయన అవిష్కరణను 1839 ఆగస్ట్ 19 న గుర్తించారు.  ప్రపంచ వ్యాప్తంగా సుమారు 150 మంది కలసి 1991 నాటికి ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్న మీదట ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని జరపడం మొదలయ్యింది. ఫోటో అనే ప్రక్రియకు బీజం వేసిన లూయిస్ డాగురే భౌతికాశాస్త్రవేత్త కూడా. ఆ తరువాత అతను ప్రసిద్ధ థియేటర్ డిజైనర్ అయ్యాడు. జోసెఫ్ నైసెఫోర్ నీప్స్ అనే వ్యక్తి డాగురే తో వ్యాపార భాగస్వామిగా ఉండేవాడు. ఇతను హీలియోగ్రాఫి పద్దతిలో ఫోటోగ్రాఫిక్ ప్రక్రియ తెలిసినవాడు. నీప్సే "వ్యూ ఫ్రమ్ ది విండో ఎట్ లే గ్రాస్" అనే చిత్రాన్ని 1826లో పాలిష్ షీట్ మీద రికార్డ్ చేసాడు. ఇదే మొట్టమొదటి ఫోటో.  నీప్సే మరణం తరువాత లూయిస్ డాగురే 1837లో తన సొంత పద్దతిలో డ్యాగురోటైప్ ను కనుగొన్నాడు. అది సిల్వర్ అయోడైడ్ తో రాగి ప్లేట్ పై రికార్డ్ చేయబడిన ఫోటో. కెమెరాలో రికార్డ్ చేయబడిన ఈ ఫొటోస్ పాదరసం ఆవిరికి గురిచేయడం వల్ల డవలప్ చేయబడ్డాయి. 1839 తరువాత గ్రేట్ బ్రిటన్ మినహా అన్నిచోట్లా పేటెంట్ దాఖలు చేశారు దీనికి.  ఇవీ ఫోటోగ్రఫీ వెనక ఉన్న కొన్ని విషయాలు. అయితే ప్రస్తుతం అరచేతిలో ఇమిడిపోతున్న మొబైల్ ఫోన్స్ లో ఉన్న లెన్స్ కెమెరాలు ఉపయోగిస్తే ఎంతో అద్భుతమైన ఫొటోస్ తీసేస్తున్నారు అందరూ. నిజం చెప్పాలంటే ఫొటోస్ తీయడం మీద కాస్త ఆసక్తి ఉంటే చాలు ఇప్పుడు చేతుల్లో ఉండే మొబైల్ సహాయంతో ప్రతిఒక్కరూ ఫోటోగ్రాఫర్స్ తీసినంత అందంగా ఫొటోస్ తీసేస్తున్నారు.  అయితే ఫోటోగ్రఫీ మీద ఇష్టం ఉన్నా కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల  ఫొటోస్ ఔట్పుట్ సరిగా రాదు. అందుకే ఫొటోస్ తీసేటప్పుడు గమనించుకోవలసిన కొన్ని విషయాలు తెలుసుకోండి!! ఉపయోగిస్తున్న పరికరం ఏదైనా అంటే మొబైల్ కానీ కెమెరా కానీ దాన్ని వాడటం ఎలా అనే విషయం పూర్తిగా తెలుసుకోవాలి.  ఏవిధమైన ఫొటోస్ తీయాలి అనేది ముందే నిర్ణయించుకోవాలి. కెమెరా సెట్టింగ్స్ ను సరిచేసుకోవాలి. ఫొటోస్ తీసేటప్పుడు లైటింగ్ ను ఒడిసిపట్టడం నేర్చుకోవాలి. షేడ్ ప్రాంతాలను, దిశలను అవగాహన చేసుకుని ఫొటోస్ తీయాలి. ఫొటోస్ తీసేటప్పుడు కెమెరా షేక్ అవ్వకుండా మీ పాదాలను కదల్చడం కూడా తెలిసిఉండాలి. లేకపోతే ఫొటోస్ బ్లర్ గా వస్తాయి. ఫొటోస్ తీయడం  కోసం ఉపయోగించే ఇతర అదనపు సహాయపరికరాలు ఉంటాయి. అదే ట్రై పాడ్. దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి. ఎత్తు, మౌల్డ్ చేయడం వంటివి. కెమెరాకు కు ఫ్లాష్ ను ఎలా ఎప్పుడు ఉపయోగిస్తే ఫొటోస్ బాగా వస్తాయి తెలుసుకోవాలి. ఫొటోస్ ని ఎప్పుడూ బ్యాకప్ పెట్టుకోవాలి. అలా చేస్తే పోగొట్టుకున్నాం అనే బాధ ఉండదు. ఫోటో కి ఫోటో కి మధ్య చేంజ్ ని గమనించాలి. ఎలాంటి ఫొటోస్ బాగా తీయగలుగుతున్నారు అనేది బాగా అర్థమైపోతుంది. ఫోటో ఔట్పుట్ బాగా వచ్చేవరకు వెనక్కు తగ్గకండి. ఓపిక చాలా ముఖ్యం. ఇవన్నీ తెలుసుకుని పాటిస్తే మీకు మించిన ఫోటోగ్రాఫర్ లేరని అందరూ ఒప్పేసుకుంటారు. మీరు తీసిన ఫొటోస్ ఎవరికైనా చూపించినప్పుడు.                                      ◆నిశ్శబ్ద.

విజయం కావాలంటే యువత తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు!

ఆగష్టు 12న అంతర్జాతీయ యువ దినోత్సం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. యువతలో లోపించేది నమ్మకం, ఆత్మవిశ్వాసం, పట్టుదల. యువత చిన్న చిన్న వాటికి నిరుత్సాహానికి లోనవుతుంటారు. ఏమి చేస్తే విజయం సాధించగలమో, యువతకు చదువు ఎంత అవసరమో, మానసిక పరిణితి ఎలా ఉండాలో తెలుసుకుంటే యువత ఆలోచనల్లో మార్పు మొదలవుతుంది. అందుకే యువతను ఉత్తేజపరిచే వాక్య ప్రవాహంలోకి వెళ్లాలిప్పుడు!! సమాజంలో మనం ఏదైనా సాధించాలంటే చదువు చాలా అవసరం...! చదువుంటే మనిషికి విలువ కూడా పెరుగుతుంది. విలువ పెరగడం ద్వారా మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే విజయసోపానం అవుతుంది. ఎందుకంటే మన అందరికి విజయాలకు తొలిమెట్టు నమ్మకం కాబట్టి!! ఏ పనైనా చెయ్యగలమనే నమ్మకం మన మీద మనకు ఉన్నప్పుడు అవకాశాలను మనమే సృష్టించుకోగలుగుతాము. ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా మనం విజేతలు ఎలా కావాలో. ఏం చేస్తే విజయం లభిస్తుందో తెలుస్తుంటుంది. కొన్ని కొన్ని అవకాశాలను మనం వినియోగించుకుంటున్నప్పుడు వాటి ద్వారా మనం ఓర్పు, మానసిక ధైర్యాన్ని పొందుతాము. విజేత కావాలనుకునే వ్యక్తికి ఓర్పు, మానసిక ధైర్యం చాలా అవసరం. విజయాన్ని సాధించాలి అనే ఆలోచన మనలో వున్నప్పుడు అనుకోకుండా సమయాన్ని సేవ్ చేసుకునే ఒకానొక లక్షణం చేసే  మనలో ఏర్పడుతుంది. సమయాన్ని సేవ్ చేయడం అనేది సాధారణమైన విఆహాయం కాదు. విజయం సాధించాలంటే మొదట సమయం ఎంత విలువైనదో అర్థం కావాలి.   మనం పట్టుదలతో ఉన్నప్పుడే విజయం మన సొంతమవుతుంది. అలాగే మంచి  వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలి. ఎందుకంటే మంచి వ్యక్తిత్వం ద్వారానే సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తించబడతాము. ఇక్కడ మంచి వ్యక్తిత్వం అంటే ఏంటి అని ఆలోచన వస్తే సమాజ ఆమోడయిగ్యమైనది మాత్రమే కాదు నైతిక విలువలు కలిగినదే మంచి వ్యక్తిత్వం. ఇది ఉంటే  నిరాశావాదాన్ని తరిమికొడుతుంది. ఆ  నిరాశావాదం లేకపోతే అపజయం అనే మాట వినబడదు.   ఆశ అనేది మనుష్యుల్లో నమ్మకాన్ని, బాధ్యతలను పెంచుతుంది. మనం బాధ్యతలను స్వీకరించడం ద్వారా కొంత వరకు కొన్ని కొన్ని విషయాలలో అనుభవాన్ని పొందవచ్చు. ఈ అనుభవం అనేది విజయానికి తోడ్పడుతుంది. అలాగే మనం చేసే పనిమీద నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి. నమ్మకం లేకపోతే మనం ఏ పని చేయలేము. పండు కాస్తుంది, లేక పువ్వు పూస్తుంది అన్న నమ్మకం వల్లే మనం మొక్కల్ని నాటుతాము. ఆ నమ్మకమే లేకపోతే మనం మొక్కల్ని కూడా నాటం. మనకు మనం చేసేపని ద్వారా ఫలితం వస్తుంది అన్న భావన వుండడం వల్లనే మనం అన్ని పనులూ చేయగలుగుతున్నాము. ప్రతి మనిషికి లక్ష్యం అనేది వుండాలి. లేకపోతే మనిషి జీవితం నిస్సారంగా వుంటుంది. అందుకే ప్రతీ మనిషి లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి. ఏర్పరచుకున్న లక్ష్యాన్ని ఏకాగ్రతతో సాధించడానికి ప్రయత్నం చేయాలి. ఆ లక్ష్యాన్ని సాధించే మార్గంలో కొంతమంది స్నేహితులు ఎదురువుతారు. మనం నిజమైన స్నేహితులను ఎన్నుకోవాలి. అదేవిధంగా మనం ఇతరులకు మంచి స్నేహితులుగా నిలిచిపోవాలి. మనం ఏ విషయంలో కూడా మొహమాట పడకూడదు. మొహమాటపడడం వల్ల కొన్ని కొన్నిసార్లు నష్టపోవలని వస్తుంది.  మన విజయ సాధనలో జ్ఞాపకశక్తిని పెంచుకోవాలి. ప్రతీక్షణం సద్వినియోగం చేసుకోవాలి. కష్టపడటాన్ని ఇష్టపడాలి, అవిశ్రాంతంగా కృషి చేయాలి. కష్టేఫలి అన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు. కష్టంలేకపోతే ఫలితం కూడా లేదు. మనం కష్టపడినప్పుడు ఫలితం లభిస్తుందనే నమ్మకాన్ని కలిగి ఉండాలి. మనం ఏర్పరచుకున్న మంచి లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోవాలి. అందులో మనం మంచినే గ్రహించడానికి ప్రయత్నించాలి. మంచి వల్ల మనలో పాజిటివ్ ఆలోచనలు కలుగుతాయి. ఏ పనినైనా ఇష్టంతో చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఇష్టంతో చేస్తే కష్టాన్ని మర్చిపోవచ్చు. ఏ విషయంలో కూడా భయపడకూడదు. భయం అనేది మనల్ని వెనుకడుగు వేసేలాగా దోహదపడుతుంది. జీవితం అంటేనే సుఖదు:ఖాలమయం. రెండూ అనుభవించినప్పుడే జీవితం యొక్క విలువ మనకు అర్ధమవుతుంది. ఈ సుఖ దుఃఖాలను అనుభవించే సమయంలో మనకు అహంకారం అనేది పెరిగిపోతుంది. అహంకారం వల్ల అపజయాలు ఎదురవుతాయి. అందుకే వినయవిధేయతలే విజయాన్ని నిర్దేశిస్తాయంటారు పెద్దలు. కాబట్టి నమ్మకం నుండి వినయంగా నడుచుకోవడం వైపు యువత ప్రయాణం సాగాలి.                                                         ◆నిశ్శబ్ద.

ఆదివాసుల జీవితాలను ఆదుకోండి!

మనుషులు నాగరికులు కాకముందు వారి జీవితం వేరుగా ఉండేది.  మనిషి కోతి నుండి పుట్టాడని ఆదిమమానవుడు కాలక్రమంలో మార్పులకు లోనవుతూ నేడు నాగరిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, నాగరికుడిగా బ్రతుకున్నాడని చెబుతారు. ఈ నాగరిక అనాగరిక అంశాల మధ్య తేడాలు ఎన్ని ఉన్నా, ఆ రెండింటిలో ఉన్న మనుషులు వారి వారి జీవితాలను కొనసాగించడానికి పోరాటం చేయక తప్పదు. అయితే కాలంతో కొన్ని మాత్రమే అభివృద్ధి చెందినట్టు మనుషులు కూడా కొందరే అభివృద్ధి చెంది నాగరిక సమాజంలో కొందరు, ఆటవిక సమాజంలో కొందరు ఉండిపోయారు.  అడవులను నమ్ముకుని, ప్రకృతి మధ్య, ఆటవిక వనరులను ఉపయోగించుకుంటూ, ఆ అడవినే దైవంగా భావిస్తూ బ్రతుకుతున్న ఆటవిక జాతులు చాలా ఉన్నాయి. సమాజంలో కుల, మత, వర్గ భేదాలు, ఆర్థిక వ్యవస్థ, అన్నిటికి మించి స్వార్థంగా ఆలోచించడం వల్ల ఇలాంటి ఆటవిక జాతులకు నేటికి సరైన న్యాయం అంటూ జరగడం లేదు. అడవులలో నివసించేవారిని ఆదివాసీలు అంటారు. గిరిజనులైన వీరు సంచారజీవితాన్ని గడుపుతూ ఉన్నచోట అనుకూలమైన వ్యవసాయం చేసుకోవడం, ప్రకృతి వనరుల మధ్య బ్రతకడం, ముఖ్యంగా అటవీ ఉత్పత్తులను దగ్గర్లోని సంతల్లో అమ్మడం చేస్తూ జీవిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు "వంద దేశాలలో" "అయిదు వేల ఆదివాసీ తెగలు" ఉన్నట్టు గుర్తించారు. వీరిలో ఒక్కో తెగ ఒక్కో భాష మాట్లాడుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆదివాసీ తెగలు "ఆరువేల ఏడువందల" భాషలు మాట్లాడుతున్నారు. మొత్తంమీద "వీరి జనాభా" చూస్తే సుమారు "నలభై కోట్లకు" పైన ఉంది. ప్రపంచ జనాభాలో వీరి జనాభా శాతం తక్కువే అయినప్పటికీ అభివృద్ధి చెందుతున్న ప్రపంచీకరణలో ఆదివాసీలు తమ హక్కుల కోసం పోరాడాల్సి వస్తోంది.  ఆదివాసీల జీవనశైలి వారి అలవాట్లు, సంప్రదాయాలు అన్నీ ఎంతో విశిష్టమైనవి. వారి సంస్కృతి సంప్రదాయాలను, వారి హక్కుల్ని కాపాడటం కోసం ప్రతి సంవత్సరం ఆగష్టు 9 వ తేదీన ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1993లో ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఈ తీర్మానం అమలు అయిన తరువాత  అడవులపై హక్కులు ఆదివాసులకే ఉన్నాయని 2010 జూలై 14న జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రకటించారు. అయితే అది అమలు కాలేదు.  దేశ పార్లమెంటుల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆదివాసీలు ఉన్నా ఆదివాసీల అభివృద్ధి వారి హక్కుల కోసం నోరుతెరచి మాట్లాడేవారు వాటిని సాధించుకోవాలని ప్రయత్నం చేసేవారు కనిపించడం లేదు. కారణం వారిలో వారే స్వార్థపరులుగా మారిపోవడం కూడా.  ఉప్పుతో కూడా కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు నడుపుతున్న నేటి వ్యాపార అధినేతల మనసులో ఆదివాసులు అంతరించిపోతే ఎంతో ఆటవిక భూములు, అక్కడ ఉత్పత్తులతో వ్యారసామ్రాజ్యాన్ని విస్తృతం చేసుకోవాలనే ఆలోచనలే ఆదివాసుల జీవితాలను ప్రమాద కోరల్లో నిలబెడుతున్నాయి. ఈ ఆదివాసుల సంరక్షణకు నడుం బిగిస్తూ నక్సల్స్ వంటి పోరాట బృందాలు ఏర్పడ్డా వారికి కూడా నిరంతరం హింసాయుత జీవితం, ప్రాణం మీద భరోసాలేని బ్రతుకు దిక్కవుతోంది. అటవీ భూముల కోసం, ఆ భూముల్లో ఖనిజాల కోసం, ఇతర ఉత్పత్తుల కోసం, విలువైన కలప కోసం ఆశపడి పూర్తిగా ఆదివాసులని అంతం చేయాలని అనుకుంటున్న నేటి నాగరిక సమాజానిది ఎలాంటి మనస్తత్వమో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఎన్నో రకాల కుటీర పరిశ్రమలు, చేతి కళలు, ఆరోగ్య రహస్యాలు, ఆయుర్వేద మూలికలకు నిలయమైన అడవులను నిర్వీర్యం చేస్తూ అక్కడి ఆదివాసులకు నరకం చూపించడం మృగలక్షణం అనే మాట సరిగ్గా సరిపోతుంది. మానవ నాగరిత ప్రారంభమైన అడవులను, మానవ జీవితం మొదలైన విధానాన్ని అంతం చేయడం అంటే నడవడానికి సహకరిస్తున్న కాళ్ళను నరికేసుకోవడమే. ఆ తరువాత ఈ ప్రపంచంలో మనిషి ఉనికి కోసం చాలా కష్టాలు పడి వెతకాలి. ఎందుకంటే మనుషులు మృగాలుగా మారిపోయాక నిజమైన మనుషులు కనబడతారో లేదో మరి.  మనసున్నవారు ఆదివాసులకు చేతనైన సహాయం చెయ్యాలి. విద్య, వైద్యం వంటి వసతులు కలిగించాలి. అప్పుడు వాళ్ళు తమ సామర్త్యాన్ని చాటిచెబుతారు. సహాయం చేసే ఉద్దేశ్యం లేనివారు ఎవరి జీవితాల్ని వాఫు చూసుకోవాలి. అంతేకానీ వారి జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టి వారిని ఇబ్బందిపెట్టకూడదు. ప్రస్తుతం భారత రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ద్రౌపతి ముర్ము ఎంపికైన సందర్భంగా చాలామంది ఆదివాసీ ప్రజల గురించి మాట్లాడుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏ తెగలో అయినా ఏ జాతిలో అయినా ఒక వ్యక్తి దేశ స్థాయి పదవిని, గౌరవాన్ని పొందినంత మాత్రాన ఆ తెగలోనూ, ఆ జాతి లోనూ మార్పు వచ్చేయదు. ప్రతి మనిషి మేలైన జీవితం కోసం పాటుపడాల్సిందే. కాబట్టి వారి జీవితం కోసం తపించే ఆదివాసులని నొప్పించకండి.                                           ◆నిశ్శబ్ద.

భారతీయ చేనేత….. వస్త్రప్రపంచానికి అధినేత!

మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి, అవి వారసత్వంగా కొనసాగుతున్నవి కూడా. కళల పేరిట భారతదేశానికే ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టేవి. అలాంటి వాటిలో చేతి వృత్తులు చాలా ఉన్నాయి. చేతి వృత్తులలో చేనేతకు ఎంతో చరిత్ర ఉంది. భారతదేశంలో స్వదేశీ ఉద్యమం 1905 లో మొదలైంది. అప్పుడు విదేశీ వస్తు బహిష్కరణ చేస్తూ ఖద్దరు దుస్తులు వేసుకుంటూ నిరసన తెలిపినవారు ఉన్నారు.  భారతీయ చేనేత పరిశ్రమకు ఎంత చరిత్ర ఉందో ఈ పరిశ్రమలో అంత కళాత్మకత కూడా ఉంది. కేవలం ఏదో ఒకటిలే అన్నట్టు కాకుండా ఎంతో అద్భుతమైన ఆకారాలతో, కనులను కట్టిపడేసే రంగులతో  వస్త్రాలు నేయడం నేతన్నల గొప్పదనం.  భారతదేశం స్వదేశి ఉద్యమం చేపట్టిన రోజునే భారతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటారు. భారతదేశంలో ఈ చేనేత వృత్తి మీద ఆధారపడిన వారి ఆర్థిక, సామాజిక అవసరాలను గురించి, చేనేత గొప్పదనం గురించి, అందులో ఉన్న సంప్రదాయపు విలువల గురించి యావత్ దేశమంతా అవగాహన కలిగించాలనేదే సంకల్పంగా జరుపుకుంటున్న రోజు ఇది. చేనేత వృత్తి ఎంచుకున్న వాళ్లలో ఆసక్తికరంగా ఆడవాళ్లు 70% మంది ఉన్నారు. దీన్ని బట్టి భారతీయ చేనేత వస్త్రపరిశ్రమలో మహిళల సాధికారతకు చేనేత వృత్తి ఎంత గొప్పగా దోహదం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఈ భారతీయ చేనేత దినోత్సవం పూర్తిగా చేనేత కార్మికులను గుర్తించాలని, వారిలో ఉన్న కళకు ప్రపంచవ్యాప్త ప్రశంసలు అందాలనేది ముఖ్య ఉద్దేశం. చేనేత దినోత్సవం ఎవరి కృషి? ప్రస్తుత ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ గారు 2015వ సంవత్సరంలో మొట్టమొదటిసారి  భారతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించి దేశవ్యాప్తంగా తన గళాన్ని వినిపించారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆగష్టు 7 వ తేదీన దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటూనే ఉన్నారు. ఏడు చేనేత దినోత్సవాలను పూర్తిచేసుకుని ఇప్పుడు ఎనిమిదవ చేనేత దినోత్సవ సంబరాలకు భారతదేశం సిద్ధమవుతోంది. చేనేత పరిశ్రమ గురించి ఆసక్తికర విషయాలు! భారతదేశంలో చేనేత పరిశ్రమ అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలలో ఒకటి. ఇది పట్టణ-గ్రామీణ సత్సంబంధాలను పెంచుతుంది. ముఖ్యంగా గ్రామీణ జీవనోపాధిలో అత్యంత ముఖమైనదిగా చేనేత మంచి స్థానంలో నిలుచుంది. భారతీయ చేనేత రంగం తక్కువ మూలధనంతో నిర్వహించగలిగిన అంశం. అయితే దీనిలో ఉన్న అద్బుతమంతా చేనేత కళాకారులలో ఉన్న కళలోనే ఉంది.  అన్నిటికంటే ముఖ్యంగా చేనేత పరిశ్రమ ఇతర ఫ్యాక్టరీ ఉత్పత్తుల్లా కాలుష్యాన్ని విడుదల చేయదు. దీనివల్ల  పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుంది. చేనేత పరిశ్రమ భారతదేశంలో గొప్ప కుటీర పరిశ్రమగా గుర్తించబడింది. సహజ ఉత్పత్తుల ద్వారా నడిచే ఈ పరిశ్రమ చిన్న పెద్ద ఆర్థిక స్థాయిలకు తగ్గట్టు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా కళాత్మకతను నింపుకున్న ఈ చేతివృత్తిని ఒకతరం నుండి మరొక తరం అందిపుచ్చుకుంటూ కళలో ఉన్న నైపుణ్యాన్ని వ్యాప్తం చేస్తున్నారు. రాట్నం, నూలు, మగ్గం ద్వారా నడిచే చేనేత పనిలో అన్ని వర్గాల వారు భాగస్వాములు అవుతారు. ఇప్పుడు అన్ని దేశాలు చేనేత వస్త్రాల వైపు ఆసక్తి చూపిస్తున్నాయి. కానీ శాతవాహనుల కాలంలోనే భారతదేశ చేనేత వస్త్రాలు యూరప్ దేశాలకు ఎగుమతి అయ్యాయి అనే విషయం భారతీయ చేనేత పనితనం, దాని చరిత్ర ఎంతగొప్పవో అందరికీ తెలుపుతుంది. మనం ఏమి చేయగలం? విదేశీ వస్త్ర మోజులో పడి మన కళను మన పనితనాన్ని మనం చిన్నచూపు చూడటం తగదు. అందుకే ప్రత్యేకంగా చేనేత దినోత్సవం రోజున మాత్రమే కాకుండా మిగిలిన రోజుల్లో కూడా పండుగలను, శుభకార్యాలకు, ప్రత్యేకరోజుల్లో చేనేత వస్త్రాలను కొనుగోలు చేయడం మంచిది. అలాగే కళను జోడించి చేనేత వస్త్రాలనే కొంచెం మోడ్రన్ గా మలచుకోవచ్చు. మిగిలిన దుస్తులతో పోలిస్తే చేనేత రంగులు ఆకర్షణీయంగా ఉంటాయి. అంతేకాదు మన్నిక బాగుంటాయి. నేరుగా చేనేత వ్యక్తుల దగ్గరకు వెళ్లి నచ్చినవి కొనుగోలు చేయచ్చు. ఇంకా ఆసక్తి ఉంటే నచ్చినట్టు అడిగి మరీ నేయించుకోవచ్చు. ఇలా మన భారతీయ చేనేత వస్త్ర పరిశ్రమ గొప్పదనాన్ని తెలుసుకుని దానికి గుర్తింపు వచ్చేలా ప్రోత్సహించడం మనందరి చేతుల్లోనే ఉంది.                                  ◆నిశ్శబ్ద.

ఫ్రెండ్షిప్ డే హంగామా ఇలా చేసేయండి!

ఎన్ని సమస్యలున్నా పక్కన ఫ్రెండ్స్ ఉంటే ఆ భరోసా వేరు. ఇప్పటి జనరేషన్ వారు ప్రతి ఈవెంట్ ను ఎంతో ఇష్టంగా సెలెబ్రెట్ చేసుకుంటారు. వాలెంటైన్స్ డే అంటే అందరికీ ఎంత స్పెషలో ఫ్రెండ్షిప్ డే అంటే అంతకంటే స్పెషల్ అనుకుంటారు. కొందరు చాలా దగ్గరి స్నేహితులు చదువులు, ఉద్యోగాలు, వివాహాలు జరిగిపోవడం వంటి కారణాల వల్ల దూరంగా ఉంటారు. మరికొందరు దగ్గర దగ్గరే ఉంటారు. దూరమున్నా, దగ్గరున్నా ఫ్రెండ్షిప్ డే రోజు కాస్త రచ్చ చేయాలని అది కూడా ఓ తీపి జ్ఞాపకంగా మలచుకోవాలని అనుకుంటారు.  ఇప్పట్లో స్కూల్ కిడ్స్ కూడా ఇలాంటి ప్రత్యేక రోజులను సీరియస్ గా ఫాలో అయిపోతున్న సందర్భంలో అందరూ ఫ్రెండ్షిప్ డే కి స్పెషల్ గా ఏమి చేయచ్చు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న అయి కూర్చుంటుంది. ఏమి ఆలోచించినా ఉహు అలా కాదు వేరెలా ఉండాలి అని ఎక్పెక్టషన్స్ ఇంకా ఎక్కువ పెట్టుకుంటారు. చిన్న పిల్లలు ఎక్కువ డబ్బులు ఖర్చు చేయలేరు కానీ వాళ్లకు కూడా స్వచ్ఛమైన స్నేహాలుంటాయి. అలాంటి వాళ్ళు బెంగ పడకుండా హాయిగా ఫ్రెండ్షిప్ డేని స్పెషల్ గా మలచుకోవడానికి  కొన్ని చిట్కాలు ఇచ్చేస్తున్నాం.  ◆ చిన్నచిన్న బహుమతులు ఇచ్చుకోవడం. బహుమతులు అనగానే మరీ ఖరీదు చూడకూడదు. బిస్కెట్ పాకెట్ లేదా చాక్లెట్ వంటివి చిన్న గిఫ్ట్ ప్యాక్ లో పెట్టి ఇవ్వడం. అదేదో చాక్లెట్ యాడ్ లో చెబుతారుగా తియ్యని వేడుక చేసుకుందాం అని. అదే మరి ఇది. ◆ మీలో కళ ఉంటే మాత్రం దానిని బయటకు తీసే అవకాశం ఇదేనని అనుకోండి. ఫ్రెండ్స్ కోసం ఫ్రెండ్షిప్ బ్యాండ్ లు తయారుచేయండి. వాళ్లకు సర్ప్రైజ్ గా వాటిని కట్టండి. ◆ ఇప్పట్లో ఫ్రెండ్స్ మధ్య ఫొటోస్ అనేవి చాలా కామన్. ఫ్రెండ్స్ తో కలసి దిగిన ఫొటోస్ లేదా ఫ్రెండ్ దిగిన ఫొటోస్ ను సేకరించి ఒక నోట్ బుక్ లో పెట్టి వాటి గురించి చిన్న చిన్న లైన్స్ రాసి ఆ బుక్ ని ఫ్రెండ్స్ కి గిఫ్ట్ ఇవ్వచ్చు. చాలా సంతోషపడతారు. ◆ ఇద్దరి మధ్య ఉన్న స్నేహపు బంధాన్ని ఇంకా పటిష్టం చేసుకోవడానికి అదే గొప్ప వేదిక అనుకోండి. ఇద్దరూ కలసి సమయాన్ని గడుపుతూ ఒకరి గురించి మరొకరు మాట్లాడుకోండి. అప్పుడు ఇద్దరిలో బలాలు బలహీనతలు తెలిసిపోతాయి. ◆ మీకు గనుక సామర్థ్యము ఉంటే చిన్న చిన్న కవితలు, లేదా కథలు రాసి స్నేహితులకు బహుమతిగా ఇవ్వచ్చు. ◆ ఫ్రెండ్ లో ఉన్న మంచి లక్షణాలను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని విషయాలు రాసి దానికి గ్రీటింగ్ కార్డ్ జతచేసి ఇవ్వచ్చు. ◆ పుస్తకాలను బహుమతిగా ఇవ్వచ్చు. దానివల్ల ఆ పుస్తకం ద్వారా ఫ్రెండ్స్ లో ఏదైనా మంచి చేంజ్ వస్తే దానికి కారణం మీరేనని జీవితాంతం గుర్తుంచుకుంటారు. ఇలా ఒకటా రెండా బోలెడు మార్గాలున్నాయి స్నేహితులతో ఫ్రెండ్షిప్ డే ను బిందాస్ గా జరుపుకోవడానికి. ఫ్రెండ్స్ తో కనుక కాసేపు గడిపాము అంటే ఫ్రెష్ గాలి పీల్చుకుని సేదతీరినట్టు ఉంటుంది. మీకు మంచి ఫ్రెండ్స్ ఉంటే ఈ విషయాన్ని ఒప్పుకుంటారు మరి.                             ◆నిశ్శబ్ద.

15 ఏళ్లకే 33 లక్షల ఉద్యోగం సాధించిన అబ్బాయి!

కొన్నిసార్లు కొన్ని విషయాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. ఈ ప్రపంచంలో మనిషి మేధస్సు, అది చేస్తున్న అద్భుతాలు అలాంటివే. సాధారణంగా గడుస్తున్న కాలంలో అక్కడక్కడా కొంతమంది తమ ప్రతిభతో, తాము చేసే పనులతో వైరల్ అవుతుంటారు. ఈమధ్య కాలంలో ఒక అబ్బాయి ఇలాగే వైరల్ అయిపోయాడు. ఇంతకు అతడు ఎందుకంత వైరల్ అయ్యాడు?? అతడు ఎవరు?? ఏంటి?? అనే విషయాలు తెలుసుకుంటే మన భారతదేశ భవిష్యత్తు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. వేదాంత్ డియోకెట్ అనే భారతదేశానికి చెందిన అబ్బాయి వాళ్ళ అమ్మ పాత లాప్టాప్ తీసుకుని అప్పుడప్పుడు వాడుకునేవాడు. ఒకరోజు అందులో ఇన్స్టాగ్రామ్ చూస్తూ స్క్రోల్ చేస్తున్నప్పుడు అతనికి ఒక అనౌన్స్మెంట్ చాలా ఆసక్తిగా కనిపించింది. దాన్ని పరిశీలనగా చూస్తే వెబ్సైట్ డవలప్మెంట్ కాంపిటిషన్స్ జరుగుతున్నట్టు అర్థమయ్యింది. వెంటనే ఆ పోటీలో పాల్గొనాలని డిసైడ్ అయ్యాడు.  దానికోసం దాదాపు 2000 కంటే ఎక్కువ కోడ్ లను రాసి రెడి చేసుకున్నాడు.  వాటితో ఆ వెబ్సైట్ పోటీలో పాల్గొన్నాడు. కట్ చేస్తే! ఆ పోటీలో అతడు గెలిచి ఆ వెబ్సైట్ డవలప్మెంట్ పోటీలు పెట్టిన వాళ్ళ దగ్గర సంవత్సరానికి 33 లక్షల సాలరీతో జాబ్ కు ఎంపికయ్యాడు. న్యూజెర్సీకి చెందిన హెచ్ఆర్‌డి సంస్థలో వారి టీమ్ లో వేదాంత్ కు స్థానం దొరికేసింది. అతను చెయ్యాల్సిన కోడింగ్ పనిని ఆ సంస్థ వాళ్ళు చెప్పడం, దానిమీదఆ వేదాంత్ పనిచేయడం ఒక్కటే మిగులుంది అన్నప్పుడు ఆ సంస్థ వాళ్లకు ఒక షాకింగ్ నిజం తెలిసింది. అదే వేదాంత్ వయసు.  దాదాపు వెయ్యి మంది వెబ్సైట్ డవలప్మెంట్ పోటీలలో పాల్గొంటే అందులో వేదాంత్ గెలిచాడు. ఉద్యోగమూ సంపాదించాడు. కానీ అతడి వయసు కేవలం 15 సంవత్సరాలు అని తెలిసినప్పుడు ఆ సంస్థ వాళ్ళు అయోమయంలో పడిపోయారు. 15 సంవత్సరాల అబ్బాయికి ఉద్యోగం ఇవ్వడం అంటే అది వారి నియమ నిబంధనలకు విరుద్ధం అనుకున్నారో లేక ఆ అబ్బాయి ఇంకా చదువుకోవాలి కాబట్టి ఉద్యోగం ఇవ్వకూడదు అనుకున్నారో కానీ మొత్తానికి వేదాంత్ కు ఇచ్చిన ఆఫర్ ను వాళ్ళు రద్దు చేసేసుకున్నారు.  ఆ విషయం తెలియగానే వేదాంత్ బాగా నిరాశపడిపోకూడదని "నువ్వు నిరాశ పడకు, నీ చదువు పూర్తయిన తరువాత తిరిగి మా సంస్థను సంప్రదిస్తే నీకు ఉద్యోగం ఇస్తాం. ప్రస్తుతం నీ చదువు కొనసాగించు" అని ఎంతో ఊరడించే మాటలు చెప్పారు. వేదాంత్ animeeditor.com అనే వెబ్సైట్ ను డవలప్ చేసాడు. అందులో వ్లాగ్ లు బ్లాగ్ లు చాట్ బాక్స్, వీడియోస్ చూసేలా డవలప్ చేసాడు. అది మాత్రమే కాకుండా యూట్యూబ్ వీడియోస్ లాంటివి అప్లోడ్ చేయడానికి కూడా ఆప్షన్స్ పెట్టారు. ఖచ్చితంగా చెప్పాలంటే చాలామంచి ఫీచర్స్ తో వెబ్సైట్ కు రూపం ఇచ్చాడు. వేదాంత్ వథోడాలో నారాయణ ఇ-టెక్నో పాఠశాలలో చదువుతున్నాడు. సైన్స్ ఎగ్జిబిషన్ లో భాగంగా రాడార్ సిస్టమ్ మోడల్ ని రూపొందించడం ద్వారా గోల్డ్ మెడల్ కూడా గెలుచుకున్నాడు. ఇంత ఆసక్తికరమైన వేదాంత్ విషయం చదివాక వాళ్ళ అమ్మానాన్నలు ఏమి చేస్తారో అనే ఆలోచన అందరికీ వస్తుంది. వేదాంత్ తల్లిదండ్రులు అసిస్టెంట్ ప్రొఫెసర్ లుగా పనిచేస్తున్నారు. విద్యార్థులకు చదువు  విషయంలో క్రమశిక్షణ ఉండాలంటే మొబైల్, లాప్టాప్ లాంటి వస్తువులు ఇవ్వకూడదు అనే భావన కలిగిన ఆ తల్లిదండ్రులు ఇప్పటికీ తమ పిల్లాడికి లాప్టాప్ ఎక్కువగా ఇవ్వరట. వేదాంత్ కు జాబ్ ఆఫర్ వచ్చిన విషయం పాఠశాల వారికి తెలిసి వాళ్లే వేదాంత్ కోసం ఓ మంచి లాప్టాప్ కొనే పనిలో ఉన్నారట. పాఠశాల అడ్మిషన్లు పెంచుకునే వారి ఆలోచన వారిది అయితే పిల్లలు నేర్చుకోవలసినవి మాత్రమే నేర్చుకుంటే ఈ మొబైల్స్, లాప్టాప్స్ వల్ల టెక్నాలజీ యుగంలో దూసుకెళ్తారని స్పష్టంగా అర్థమైపోతుంది కదా! మీరు పిల్లలకు మంచి విషయాల కోసం మీ మొబైల్ లాప్టాప్ ఇవ్వచ్చు. కాకపోతే జబర్దస్త్ లు, కామెడీ కింగులు లాంటి వల్గర్ కంటెంట్ చూడనివ్వకుండా ఆ వస్తువులకు ఒక టైమ్ లిమిట్ పెట్టాలి.                                  ◆వెంకటేష్ పువ్వాడ.

పులిరాజును కాపాడుకుందాం!

భారతదేశ జాతీయ జంతువు పులి. నిజానికి భారతీయ హిందూ ధర్మంలో ప్రతిజంతువును కూడా దైవరూపంగా భావిస్తారు. దేవతలకు వాహకాలుగా భావించి వాటి పట్ల భక్తిగా ఉంటారు. కానీ ఎక్కడైనా పాము, లేక ఇతర జంతువులు ఏమైనా కనబడితే మాత్రం వాటిని కొట్టి చంపేయడం చేస్తారు. కారణం వాటివల్ల మనుషులకు హాని జరుగుతుందనే భయం. అలా మనుషులు చంపుకుంటూ పోతున్న వాటిలో భారతదేశ జాతీయ జంతువు పులి ఉనికి ప్రమాదంలో పడింది. మనిషి తన మనుగడను అభివృద్ధి చేసుకునేకొద్ది చుట్టూ ఉన్న పరిసరాలను చాలా మార్చేస్తున్నాడు. ముఖ్యంగా అడవుల విషయంలో జనాభా పెరుగుదల కారణాలు చెప్పి అడవులను నరికేస్తున్నాడు. ఫలితంగా అడవులలో పెరుగుతున్న జంతువుల నివాసానికి ముప్పు ఏర్పడింది. వాటికి తిండి, నీరు విషయంలో ఎంతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అందుకే అవి జనావాసప్రాంతాల్లోకి వచ్చేస్తుంటాయి. అయితే మనుషులు వాటిని హింసపెట్టి మరీ చంపుతారు. కొందరు వేటాడటం వల్ల, మరికొందరు వాటిపట్ల కఠినంగా ప్రవర్తించడం వల్ల వాటి సంతతి సరైన విధంగా అభివృద్ధిచెందక వాటి సంఖ్య క్రమంగా తగ్గిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ప్రతిసంవత్సరం జులై 29వ తేదీన జరుపుకుంటారు. ఈరోజున పులుల సంరక్షణ కోసం చేపట్టాల్సిన పనులు, అవి నివసించే ప్రాంతాలను ఎలా అభివృద్ధిచేయాలి? వాటిని ఎలా రక్షించాలి?? దానికోసం ఎలా అడవులను సంరక్షించాలి వంటి విషయాల గురించి చర్చించి, వాటిని అమలుపరిచే విధానం గురించి నిర్ణయం తీసుకుంటారు. పులుల సంఖ్య భారీగా తగ్గిపోయిందా? ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య తగ్గిపోవడం నిజమే. గత వందసంవత్సరాల చరిత్రను గమనిస్తే పులుల సంఖ్య చాలా విస్మయపరిచేంతగా తగ్గిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా 1913లో దాదాపు 1,00,000 పులులు ఉండేవి. అయితే ప్రస్తుతం వాటి సంఖ్య 3200గా మారిపోయింది. వందేళ్ల కాలంలో దాదాపు 97% పైన పులులు అంతరించిపోయాయి.  ఈ విషయాలు అన్నీ తెలిసిన తరువాత యావత్ ప్రపంచదేశాలు అయోమయంలో పడిపోయాయి. 2010 సంవత్సరంలో మొట్టమొదటిసారి అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం జులై 29 వ తేదీన పులుల సంరక్షణ దినోత్సవం జరుపుకోవడం మొదలుపెట్టారు. భారతదేశంలో పులుల సంరక్షణ ఎలా ఉంది? భారతదేశంలో 18 రాష్ట్రాలలో 51 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.  2018లో చివరిసారి పులుల గణన చేసినప్పుడు వాటి  పెరుగుదల కనిపించడం అందరి సంతోషానికి కారణమైంది.  సెయింట్ పీటర్స్‌బర్గ్ డిక్లరేషన్ షెడ్యూల్ కంటే 4 సంవత్సరాల ముందుగానే పులుల జనాభాను రెట్టింపు చేయాలనే లక్ష్యాన్ని భారత్ సాధించడం చాలా హర్షించాల్సిన విషయం. కారణాలు! పులుల సంఖ్య తగ్గిపోవడానికి కారణాల గురించి ఆరాతీస్తే పూర్తిగా మనుషులు చేస్తున్న పనుల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి అనే విషయం మనిషితత్వానికి మచ్చ తెస్తోంది.  జనాభా పెరుగుదల పేరుతో అడవులను క్రమంగా పంటపొలాలుగానూ, నివాస ప్రాంతాలుగా మార్చడం జంతువుల ఎముకలు, చర్మం మొదలైన వాటికి గిరాకీ బాగా ఉండటం వల్ల వాటికోసం చంపడం. చిన్న జీవుల మీద ఆధారపడి పెద్ద జీవులు బ్రతుకుతాయి. పులి, సింహం లాంటి జ్ఞాతువులు వేటాడటానికి కూడా తగిన జంతువులు అడవుల్లో ఉండాలి కానీ అవి కూడా చాలా కనుమరుగైపోతున్నాయి. ప్రకృతి విపత్తులు  జరిగినప్పుడు వాటి నివాసప్రాంతాలు దెబ్బతిని ఆవాసం కోల్పోవడం. పులుల కోసం తీసుకురాబడిన చట్టాలు! ◆1973లో ప్రాజెక్ట్ టైగర్ పేరుతో ఇందిరాగాంధీ చట్టాన్ని తీసుకువచ్చారు. దానిద్వారా పులుల సంరక్షణకు చర్యలు చేపట్టారు. ◆ 2010 సంవత్సరంలో 13 దేశాలు ఏకగ్రీవంగా ఒక తీర్మానం తీసుకున్నాయి. 2022 సంవత్సరానికల్లా పులుల సంఖ్యను రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ◆ 2018కి  పులుల సంఖ్య 3000 కాగా ఆ సంఖ్యను 6000 కు పెంచేలా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.  పులుల సంఖ్య పెరగడానికి ఏమి చేయొచ్చు? ◆అవగాహన కల్పించడం అందరి బాధ్యత. కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా అభయారణ్యాలలో పులుల సంచారం ఎక్కువ ఉంటుంది. అవి తిరిగే ప్రాంతాలకు వెళ్లి వాటిని భయపెట్టడం, వాటి జీవనానికి ఇబ్బంది కలిగించడం మనుషులకు సరదా అయిపోయింది. ఒకప్పుడు మనుషులు జీవించే ప్రాంతలలోకి అడవు జంతువులు ఎలాగైతే వచ్చేవి కావో, మనుషులు కూడా వాటి విషయంలో అలాగే ఉండాలి. వాటి మానాన వాటిని బతకనిస్తే వాటి సంతతి పెరుగుతుంది. ◆ దత్తత తీసుకోవడం. ఇదేంటి వింతగా అనుకుంటున్నారా?? సాధ్యమైనవాళ్ళు ఒక పులిని దత్తత తీసుకోవచ్చు. దాన్ని ఇంట్లో పెట్టుకోవాలా అని భయపడకండి.  దాని సంరక్షణ, దాని బాధ్యత, దాని పెరుగుదలకు కావాల్సిన అన్నిటి ఖర్చు భరిస్తే చాలు. వాటి ఆహారం కోసం అటవీ, జంతు సంరక్షణ వాళ్లకు  పెద్దమొత్తమే ఖర్చు అవుతుంది. వాటికోసం అందరూ తమ చేయూత అందిస్తే వాటికి ఇంకా మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతారు. ◆ కొందరికి సాహసాలు ఇష్టం, సాహసవంతమైన జీవితం ఇష్టం. ఇలాంటివాళ్లు కేర్ టేకార్స్ గా ఉండి పులుల సంరక్షణ చూసుకోవచ్చు. ◆ విరాళాల సేకరణ మరొక సహాయం. విరాళాలు సేకరించి పులుల సంరక్షణ, ఆరోగ్యం కోసం అందజేయవచ్చు. సోషల్ మీడియా వేదికగా కూడా ఇలాంటివి చేయచ్చు. అయితే జాగ్రత్త కొందరు ఫ్రాడ్ చేయొచ్చు. పులుల గురించి అయిదు ఆశ్చర్యకరమైన విషయాలు! ◆ పులుల అరుపు రెండు మైళ్ళ వరకు వినిపిస్తుందట.   ◆ ఇవి 40/mph వేగంతో పరిగెడతాయి. ◆ సగటు పులి బరువు సుమారు 800.278 పౌండ్స్ ఉంటుంది. ◆ పులి పిల్లలు వేటలో మొదటిసారి సక్సెస్ కాలేవు. రెండు మూడు ఫెయిల్యూర్స్  తరువాత సక్సెస్ అవుతుంది. ◆ ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో ఆశ్చర్యంగా భారతదేశంలోనే 70% ఉన్నాయి.                                 ◆ వెంకటేష్ పువ్వాడ.

ప్రకృతి సంరక్షణ దినోత్సవం రోజు ఈ ప్రమాణాలు చేద్దాం!

ప్రస్తుతకాలంలో మనిషి తెలిసి కొంత తెలియక కొంత చేస్తున్న తప్పు ఏదైనా ఉందంటే ప్రకృతిని కాలుష్యం చేయడం. ప్రకృతి కాలుష్యం అవడం వల్ల మనిషి చుట్టూ ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రతి సంవత్సరం జులై 28 వ తేదీన ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ప్రపంచమంతటా ఏర్పడుతున్న కాలుష్యం, ప్రకృతి విషయంలో మనుషులు చేస్తున్న తప్పులు, ప్రకృతిని కాపాడుకునే మార్గాలు. ప్రణాళికలు వంటివి చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్త దేశాలు అన్నీ తీసుకునే ఈ నిర్ణయాల గురించి పక్కన పెడితే ఈ ప్రపంచం మీద అధిపత్యం చూపిస్తున్న మనుషులమైన మనం ప్రకృతి పరిరక్షణ కోసం ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు?? ప్రకృతిని అంతో ఇంతో మనకు తోచినంత కాపాడుకుంటే ఆ ప్రకృతి మన రేపటితరాలకు మంచి చేస్తుంది. ప్రపంచ పర్యవరణ, ప్రకృతి సంరక్షకులు అందరికీ సూచిస్తున్న, అందరూ చేయగలిగిన కొన్ని పనులు తెలుసుకోవాల్సిందే. వాటిని పటిస్తామని ప్రమాణాలు చేసుకోవాల్సిందే. ప్లాస్టిక్ వాడకం ఆపేయాలి! పర్యావరణం గురించి ఆలోచించే అందరూ మొదట చెప్పేమాట ప్లాస్టిక్ వాడకం ఆపేయాలని. నిజానికి సాధారణ ప్రజలకు కూడా ఎంతో సరసమైన ధరలో అందుబాటులో ఉండటం వల్ల ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగానే ఉంది. ఈ ప్లాస్టిక్ ను తిరిగి పునర్వినియోగించే అవకాశాలు ఉన్నా అది పర్యావరణానికి నష్టం చేసేదే. దీన్ని కరిగిస్తే వాయుకాలుష్యం జరుగుతుంది. పోనీ భూమిలో కలిసిపోతుందా అంటే అదీ లేదు.  అందుకే మనిషి తన జీవనశైలిలో ప్లాస్టిక్ ను వాడటం ఆపెయ్యాలి. బదులుగా క్లాత్ బ్యాగ్ లు, పేపర్ బ్యాగ్ లు వాడటం మొదలుపెట్టాలి. విద్యుత్ ఆదా చెయ్యాలి! విద్యుత్ ఉత్పత్తి నీటి ద్వారా, గాలి ద్వారా ఉత్పత్తి అవుతుంది. దీనికోసం ఎంతో యంత్రాంగం అవసరం అవుతుంది. విద్యుత్ కోసం పక్కరాష్ట్రాల నుండి అప్పు తీసుకునే స్థితికి ఎన్నో రాష్ట్రాలు దిగజరిపోయాయి. విద్యుత్ ను ఆదా చేయడం మొదలుపెడితే ఖర్చు తిరుగుతుంది, దాని వృధా అరికట్టినవాళ్ళం అవుతాము. అవసరం లేని సమయంలో ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేయాలి. ఇంటి పనులలో వీలైనంత వరకు సొంతంగా పని చేసుకోవాలి. చీటికీ మాటికి విద్యుత్ ఆధారిత వస్తువులు కొని క్రమంగా ఇంటిపని చేయకుండా ఉంటే బద్దకం కూడా ఎక్కువైపోయి తొందరగా డయాబెటిస్ రావడం ఖాయం. నీటిని పొదుపు చేయాలి! అందరికీ నీరు ఎంతో అవసరం. విద్యుత్ లేకపోతే పక్షులు, జంతువులు ఎంచక్కా బ్రతికేస్తాయి కానీ నీరు మాత్రం అన్ని జీవులకు కావాలి. ఇంట్లో కుళాయి తిప్పితే వచ్చేస్తున్న నీళ్ల గురించి చాలామందికి భయమే ఉండదు. పైగా ఇళ్లలో ఫిల్టర్ అయిన నీళ్లను వదులుతారు. అలాంటి నీళ్లు ఎంతో విలువైనవి. మనఇంట్లో మన ట్యాంక్ లో నీళ్లున్నాయని దానికి మనం డబ్బు కడతామని ఇష్టమొచ్చినట్టు వృధాచేయకూడదు. ఇల్లు చదవడం, బట్టలు ఉతకడం, వంట పాత్రలు కడగడం ఇలా వీటికోసం వాడే నీటిని పెరట్లో చెట్లకు మళ్లించాలి. పునర్వినియోగం! దేన్నైనాస్ అర్ పడేసేముందు తిరిగి వాడుకునే అవకాశం ఉందేమో ఆలోచించాలి. రీసైక్లింగ్ చేయడం, తిరిగి ఉపయోగించుకోవడం వల్ల వ్యర్థాలను తగ్గించవచ్చు.  చాలామంది వస్తువులను తిరిగి వాడటం అనేది షేమ్ గా ఫీలవుతారు. ఆ భావాన్ని తగ్గించుకోవాలి. ఇంట్లో ఉండే కంటైనర్లు, సీసాలు మొదలైనవాటిని మొక్కలు పెంచుకోవడానికి వేరే ఏమైనా స్టోర్ చేసుకోవడానికి వాడుకోవాలి. అవసరం అయితే తప్ప కొత్తవి కొనకూడదు! చాలామంది వస్తువులు పాతబడగానే కొత్తవి కొనేస్తారు. కానీ వస్తువులు చక్కగా పనిచేస్తున్నప్పుడు అలా పాతవి మార్చేయడం అవసరమా. మారుస్తున్న ఆ వస్తువుల వల్ల వాటిని తిరిగి రీసైకిల్ చేయడంలో చాలా పొల్యూట్ అయిపోతుంది. పరిశ్రమలు సెలరించే కొన్నిరకాల పాత వస్తువుల వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లుతోంది అనే విషయం ఆలోచించవు. అందుకే ప్రతిఒక్కరు ప్రకృతిని కాపాడుకోవాలి.                                    ◆ వెంకటేష్ పువ్వాడ.

కజిన్స్ కోసం ఉందోక రోజు!

ఇంగ్లీష్ క్యాలెండర్ లో ఫాథర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, వాలెంటైన్స్ డే లాగా నేషనల్ కజిన్స్ డే అని ఒకటి ఉంది. ఆ విషయం చాలామందికి తెలియదు, ఎక్కువ శాతం మంది పట్టించుకోరు కూడా. అయితే కజిన్స్ అనగానే అందరిలో ఒకానొక ఎమోషన్ చోటుచేసుకుంటుంది. ఒకే రక్తం పంచుకుని పుట్టకపోయినా తోబుట్టువుల కంటే స్ట్రాంగ్ బాండ్ కజిన్స్ తో ఉంటుంది ఎక్కువ శాతం మందికి. కజిన్స్ లో 90% మంది చిన్నతనంలో కలసి పెరిగినవాళ్ళు అయి ఉండటం వల్ల ఎన్నో చిన్నతనపు జ్ఞాపకాలు, తుంటరి పనులు, గొడవలు, ప్రేమలు ఉంటాయి కజిన్స్ మధ్య.  కాలం గడుస్తూ ఉంటే తల్లిదండ్రుల వృత్తులు, పోటీ ప్రపంచంలో చదువుల కోసం పరుగులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు మొదలైన కారణాల వల్ల కజిన్స్ దూరదూరంగా వెళ్ళిపోతారు. అయితే కాలం మారినా తాము ఏమీ మారలేదు అనే విషయం అపుడపుడు కలవడం వల్ల తెలుస్తూ ఉంటుంది. మరికొందరు కాలంతో పాటు మార్పుకు లోనవుతారు కూడా. ఏదేమైనా కజిన్స్ అంటే కొట్టుకోవడంలోనూ, వెనక నిలబడి సపోర్ట్ గా ఉండటంలోనూ ఎప్పుడూ ముందుంటారు. ప్రతి సంవత్సరం జులై నెల 24 వ తారీఖున నేషనల్ కజిన్స్ డే జరుపుకుంటున్న సందర్బంగా ఈసారి మీరు మీ కజిన్స్ ను కాస్త సర్ప్రైజ్ చేయడం, కొన్ని జ్ఞాపకాల్ని పంచుకోవడం చేస్తే చిన్ననాటి బంధమయినా, పెద్దల మధ్య అనుబంధమైనా ఇంకా గట్టిపడుతుంది. సడెన్ సర్ప్రైజ్! చెప్పకుండా కజిన్స్ దగ్గరకు వెళ్లడం, వాళ్ళను ఆశ్చర్యంలో ముంచెత్తడం అద్భుతంగా ఉంటుంది. నిజానికి పెద్దయ్యాక చదువులు, ఉద్యోగాల వల్ల దూరంగా ఉండేవాళ్ళు అప్పుడప్పుడు ఏదోలా కలిసే ఛాన్సెస్ ఎక్కువగానే ఉంటాయి. కానీ పెళ్లిళ్లు అయినవాళ్ళు ముఖ్యంగా అమ్మాయిలకు పెళ్లి తరువాత ఒక సెపరేట్ ప్రపంచం ఏర్పడుతుంది. భర్త, భర్త వైపు చుట్టాలు, అత్త, మామ. ఇంకా పిల్లలు వీళ్ళందరి ప్రపంచంలో అమ్మాయిలు ఉక్కిరిబిక్కిరి అవుతుండటం వల్ల కజిన్స్ ను, ఫ్రెండ్స్ ను కలవాలని ఉన్నా కలవడానికి తగినంత సమయం దొరకకపోవచ్చు. కాబట్టి ఒక చిన్న స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చినట్టు ఉంటుంది. చెప్పకుండా వెళ్లి కలిస్తే. బహుమతులు ఇవ్వడం! బహుమతులు చిన్నవో, పెద్దవో అనేది లెక్క కాదు. కానీ అవి ఎంత ప్రేమగా ఇస్తున్నాం అనేది ముఖ్యం. చిన్నతనంలో ఇష్టపడి ఆర్థిక పరిస్థితి వల్ల లేక పిల్లల మధ్య ఉన్న కాంపిటేషన్ వల్ల కొన్ని చేజారిపోయి ఉంటాయి. స్కూల్, కాలేజి, పోటీలలో గెలిచిన ప్రైజెస్, చిన్నప్పటి అరుదైన ఫోటోలు వంటివి బహుమతిగా ఇవ్వడం వల్ల చాలా సంతోషిస్తారు. ఆత్మీయ కలయిక! కజిన్స్ డే సందర్బంగా అందరూ కలసి ఆత్మీయంగా కలవడం చాలా బాగుంటుంది. కుదిరితే ఫ్యామిలీ తో సహా కలవడం పెద్ద పండగలాగే ఉంటుంది. ఇప్పటి వేగవంతమైన కాలంలో పిల్లలకు ఇలా రిలేషన్స్ గురించి నేరుగా అర్థం చేసుకున్న అనుభూతి కలుగుతుంది. జీవిత భాగస్వాములు పక్కన ఉంటే కొంతమంది తాము ఉండాల్సినంత ఫ్రీగా, కజిన్స్ తో క్లోజ్ గా ఉండలేకపోవచ్చు కాబట్టి ఆరోగ్యవంతమైన రిలేషన్స్ చాలా ముఖ్యం. అమ్మానాన్నలతో చెప్పుకోలేని పరీక్షల మార్కుల విషయాల నుండి, జీవితంలో స్పెషల్ గా భావించే ప్రేమ సంగతులు, గొడవలు, అల్లర్లు, అప్పులు వంటి ఎన్నో విషయాలలో స్నేహపూర్వకంగా ఉంటూనే బాధ్యతగా సపోర్ట్ ఇచ్చే కజిన్స్ పాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైనది. కాబట్టి కజిన్స్ ను సంతోషపెట్టండి ఎంతో కొంత వీలైనంత. వారి నుండి తిరిగి మీరు పొందే ప్రేమ మాత్రం విలువ కట్టలేనంత ఆనందాన్ని కలిగించడం ఖాయం.                                  ◆వెంకటేష్ పువ్వాడ.  

జాతీయోద్యమ శక్తి లోకమాన్య తిలక్!

బాలగంగాధర తిలక్. భారతజాతీయ ఉద్యమ పితామహునిగా పేరు పొందిన ఈయనను అందరూ లోకమాన్య అనే బిరుదుతో పిలుస్తారు. భారత జాతీయోద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించడంలోనూ, సామాన్య ప్రజలను ఆ ఉద్యోమంలో చురుగ్గా పాల్గొనేలా చేయడంలోనూ గొప్ప పాత్ర పోషించినవాడు లోకమాన్య తిలక్. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో నీకున్న అశాంతికి కారణం ఆయనేనని, ఆయన వల్లనే బ్రిటిష్ వారి మీద భారతీయుల మనసులో పోరాట స్థాయి ఏర్పడటం కానీ, అది పెరగడం కానీ జరిగిందని చెబుతారు. బాలగంగాధర్ తిలక్ 1856 జులై 23 వ తేదీన జన్మించాడు. ఈయన తండ్రి సంస్కృత పండితుడు, ఉపాద్యాయుడు. అందువల్ల చిన్నతనం నుండి చదువు విషయంలో మంచి అవగాహన ఉండేది. గణితశాస్త్రంలో ఈయనకు మంచి ప్రతిభ ఉండేది. తిలక్ జీవితంలో ఒక గొప్ప మార్పు తన పదేళ్ల వయసులో జరిగింది. అది అతని తండ్రి రత్నగిరి నుండి పుణెకి బదిలీ కావడం.  పూణేలో ఉండే ఆంగ్లో- వెర్నాక్యులర్ పాఠశాలలో ఎంతో గొప్ప ఉపాధ్యాయుల దగ్గర చదువుకునే అవకాశం తిలక్ కు లభించింది. అయితే పుణెకి వచ్చిన ఆరేళ్ళ వ్యవధిలోనే తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయాడు ఈయన. మెట్రిక్యులేషన్ చదువుతున్నప్పుడే సత్యభామ అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. ఆ తరువాత దక్కన్ కాలేజీలో చేరాడు. కాలేజీకి వెళ్లి చదువుకున్న తొలితరం భారతీయుల యువకుల్లో తిలక్ ఉండటం గమనార్హం. 1877 లో గణితశాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టభద్రుడయ్యాడు. ఆ తరువాత L.L.B పట్టా పొందాడు. రాజకీయ  లోకమాన్య తిలక్ 1890 వ సంవత్సరంలో భారతజాతీయ కాంగ్రెస్ లో సభ్యుడిగా చేరాడు. అయితే అప్పటి కాలంలో జరుగుతున్న మితవాద రాజకీయాలపై ఆయనకు పెద్దగా నమ్మకం ఏర్పడలేదు. దేశానికి స్వాతంత్య్రం కావాలంటే పోరాటం చేయడమే సరైన మార్గమని ఆయన నమ్మారు.  కాంగ్రెస్ పై విమర్శ! కాంగ్రెస్ అప్పటికాలంలో సంవత్సరంలో డిసెంబర్ నెలలో కేవలం మూడురోజుల పాటు "pray, petition, protest" అనే  మూడు విఆహాయలు గురించి మాట్లాడటంతోనే సరిపెట్టుకుంది. దాని గురించి విమర్శిస్తూ "మీరు కేవలం మూడురోజుల పాటు కప్పల మాదిరి బెకబెకలాడితే  ప్రయోజనం ఉండదు" అని వ్యంగ్యంగా విమర్శించారు. అది మాత్రమే కాకుండా కాంగ్రెస్ అడ్డుకునే సంస్థ అయిపోయింది(బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడుక్కోవడం కాదు వాళ్ళ మీద తిరగబడి పోరాటం చేసి మన దేశాన్ని మనం సొంతం చేసుకోవాలని తిలక్ అభిప్రాయం) అని అన్నారు.  నినాద కర్త! "స్వరాజ్యం నా జన్మ హక్కు" అని గొంతెత్తి నినదించిన వాడు తిలక్. ఈయన తన గళాన్ని గట్టిగా వినిపించడం వల్ల అతివాదుల వర్గంలోకి చేర్చబడ్డాడు. 1907లో సూరత్ లో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ చీలిపోయింది. అతివాదులు, మితవాదులు రెండు వర్గాలుగా చీలిపోయారు. అప్పుడు చీలిపోయినా వాళ్ళు తిరిగి 1917 లో ముస్లిం లీగుకు, కాంగ్రెస్ కు జరిగిన ఒప్పందం సమయంలో మళ్ళీ కలిసిపోయారు. సమాజంలో చురుకైన పాత్ర! ఈయన సమాజంలో చాలా చురుకైన పాత్ర పోషించాడు. పాశ్చాత్య విద్యావిధానాన్ని వ్యతిరేకించాడు. అది భారతీయ వారసత్వాన్ని అగౌరవపరుస్తుందని చెప్పాడు. భారతదేశ ఔన్నత్యాన్ని భోధించాలనే ఉద్దేశ్యంతో అగర్కార్, విష్ణు శాస్త్రి చిప్లుంకర్ లతో కలసి "దక్కన్ ఎడ్యుకేషనల్ సొసైటీ"  స్థాపించాడు. ఇంకా బ్రిటిష్ వారి పట్ల భారతీయుల ధోరణి మారాలనే ఉద్దేశ్యంతో మరాఠా పత్రిక, కేసరి పత్రికలలో ఘాటుగా వ్యాసాలు రాసేవాడు. ఈయన బాల్యవివాహాలను నిరసించాడు, వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. ఉత్సవాల విస్ఫోటనం! భారతదేశంలో పౌరులను భారతజాతీయోద్యమం వైపు నడిపేందుకు ప్రజలను ఒక్కచోటికి చేర్చేందుకు ఈయన చేసినది శివాజీ జయంతి ఉత్సవాలు, గణపతి నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం. వీటి ద్వారా భారతీయ హిందూధర్మ గొప్పదనాన్ని తెలియజేయడమే కాకుండా జాతీయోద్యమం వైపు నడిపించే అవకాశం సృష్టించుకున్నాడు.  కారాగార శిక్ష! ఈయన పత్రికల్లో రాసే తన రాతల ద్వారా ప్రజలను రెచ్చగొడుతున్నాడనే కారణంతో ఒకటిన్నర సంవత్సరాల కారాగార శిక్ష విధించారు. ఆ ఒకటిన్నర సంవత్సరం పూర్తవగానే స్వదేశీ ఉద్యమానికి సిద్ధమయ్యాడు. 1906 సంవత్సరంలో దేశద్రోహం కేసు మీద ఆరు సంవత్సరాలు ప్రవాస శిక్ష అనుభవించాడు. గ్రంధకర్తగా! ఈయన ప్రవాస శిక్ష అనుభవిస్తున్నప్పుడే గీతారహాస్యం అనే గ్రంధాన్ని రచించారు. అది మాత్రమే కాకుండా ఈయన మంచి చరిత్రకారుడు కూడా. ఆర్యులు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారని ఈయన తను రచించిన గ్రంధంలో పేర్కొన్నారు.  హోంరూల్! 1916 లో హోంరూల్ లీగ్ స్థాపించారు. దాని గురించి వివరిస్తూ పల్లెపల్లెకు తిరిగాడు. అనీబిసెంట్ అదే సంవత్సరంలో ఆ ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేసింది. అయితే తిలక్ ఒక కేసులో లండన్ వెళ్లగా బ్రిటిష్ వారు తెలివిగా పథకం వేసి అనీబిసెంట్ ఆ ఉద్యమాన్ని విరమించుకునేలా చేసింది. తిలక్, అనీబిసెంట్ ఇద్దరూ చెరొక దారిలో ఉండటం వల్ల హోంరూల్ లీగ్ మెల్లిగా చల్లారిపోయింది. ఆ తరువాత 1920 సంవత్సరంలో తిలక్ మరణించారు. ఆయన చనిపోగానే జాతీయోద్యమం ఇక దిక్కులేనిదైపోయిందని అందరూ అభిప్రాయపడ్డారు. ఈ విధంగా లోకమాన్య బలగంగాధర తిలక్ భారతజాతీయోద్యమ కర్తగా, ఒక గొప్ప సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా, బ్రిటిషు వారిని ఎదిరించిన శక్తిగా అన్నిటికంటే ముఖ్యంగా ఒక గొప్ప విద్యావంతుడిగా భారతీయ చరిత్రలో నిలిచిపోయాడు.                                  ◆ వెంకటేష్ పువ్వాడ.

మండే సూర్యుడు నెల్సన్ మండేలా!

నెల్సన్ మండేలా నల్లజాతి సూర్యుడిగా తెలుగువారు పిలుచుకునే ఈ వ్యక్తిత్వం మండే సూర్యుడిలాంటిది. దక్షిణాఫ్రికా రాజకీయ చరిత్రలో పూర్తి ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల అంగీకారంతో అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన తొలి నల్లజాతి వ్యక్తి నెల్సన్ మండేలా. నల్లజాతీయుల హక్కుల కోసం, వారి స్వేచ్ఛ, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మండేలా జన్మదినోత్సవాన్ని నెల్సన్ మండేలా డే గా ప్రపంచ వ్యాప్తంగా జులై 18న జరుపుకుంటారు. నోబెల్ బహుమతి గ్రహీతగా, భారతదేశ ప్రతిష్టాత్మక పురస్కారం భారతరత్న గ్రహీతగా మండేలా కేవలం దక్షిణాఫ్రికాకే కాదు మొత్తం ప్రపంచదేశాలకు ప్రేరణగా నిలిచే గొప్ప వ్యక్తి, నాయకుడు, ప్రజలను నడిపించే శక్తి. ఈయన జీవితం ఎన్నో మలుపులతో ఎన్నో పోరాటాలతో నిండి ఉంది. మహాత్మ గాంధీ ప్రేరణగా మండేలా అహింసాయుత మార్గం వైపు ప్రపంచ శాంతి వైపు తనవంతు కృషి చేసారు. బాల్యం విద్యాభ్యాసం! ఈయన తెంబు వంశానికి చెందినవాడు. దక్షిణ ఆఫ్రికాలో కేప్ ప్రాంతాల్లో ఉండేవారు. అక్కడి పాలన వీరిచేతుల్లో  ఉండేది. మండేలా 1918 జులై 18న తన తండ్రి మూడవ భార్యకు జన్మించాడు. ఈయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు రోలిహ్లాహ్లా. ఏడు సంవత్సరాల వయసు వచ్చేసరికి ఈయన పాఠశాలకు వెళ్లడం మొదలుపెట్టాడు. పాఠశాల ఉపాద్యాయుడికి రోలిహ్లాహ్లా అనే పేరు పలకడం రాక ప్రసిద్ధులైన బ్రిటిష్ నావికాదళ నాయకుడు హోరేషియా నెల్సన్ పేరు నుండి నెల్సన్ ను ఈయనకు తగిలించాడు. ఈయనకు 9 సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు. తరువాత ఈయన తన విద్యాభ్యాసం కొనసాగిస్తూ 1937లో "ఫోర్ట్ బ్యూఫోర్ట్"లో "హీల్డ్‌టౌన్" కళాశాలలో చేరాడు. ఈయనకు బాక్సింగ్, రన్నింగ్ మీద చాలా ఆసక్తి ఉండేది. అది కాస్తా వాటిలో ఆయనకు ప్రతిభ తెచ్చిపెట్టింది. కానీ సమాజంలో జరుగుతున్న పరిస్థితుల వల్ల అవన్నీ అటకెక్కాయి. మెట్రిక్యులేషన్ తరువాత ఈయన బి.ఏ లో చేరాడు. అయితే ఒక సంవత్సరం తరువాత ఈయన రాజకీయాలలో పాల్గొన్న కారణంగా ఈయనను విశ్వవిద్యాలయం నుండి తీసేసారు. తరువాత పెళ్లి గోల తపించుకోవడానికి జొహెన్నెస్ బర్గ్ కు వెళ్ళిపోయాడు. అక్కడ చాలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసాడు. దూరవిద్య ద్వారా ఆగిపోయిన బి.ఏ పూర్తి చేశాడు.  తరువాత విల్ వాటర్స్ రాండ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం చదవసాగాడు. అక్కడే అనూహ్యమైన మార్పులు జరిగాయి. జాతివివక్షత, దానికి వ్యతిరేక పోరాటం చేసేవారు అక్కడే మండేలా కు పరిచయం అయ్యారు. రాజకీయ అనుబంధం! రాజకీయంతో అనుభంధాలు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా మండేలా జీవితంలో పొరటాలే. 1948లో ఆఫ్రికనెర్ లు అధికంగా ఉన్న దక్షిణాఫ్రికా నేషనలిష్ట్ పార్టీ అధికారంలోకి వచ్చాక నల్లజాతి తెల్లజాతి అంటూ ప్రజలను వర్గాలుగా విడదీయడం చేసింది. మండేలా పీపుల్స్ కాంగ్రెస్ కార్యక్రమాలలో భాగంగా తన స్నేహితుడితో కలసి స్థాపించిన లా సంస్థ ద్వారా ఎంతోమంది పేద నల్లజాతి వారికి ఉచిత న్యాయవాద సౌకర్యం కల్పించారు.  ఈయన మొదట గాంధిలా శాంతియుతంగా పోరాటం చేసిన అవేవి నాటి దక్షిణ ఆఫ్రికా పరిస్థితులను మార్చేలా కనబడక అసహనానికి లోనయ్యారు. 1961లో సాయుధ విభాగాన్ని ఏర్పరిచి ప్రభుత్వ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు. జాతి వివక్షత అంతం చేయడానికి గెరిల్లా పోరాటాలను కూడా సిద్ధం చేసుకున్నారు. దీనివల్ల చాలామంది మరణించారు. జైలు శిక్ష! మండేలా 1962 ఆగష్టు లో అరెస్టయ్యాడు, 1962 అక్టోబర్ లో అయిదు సంవత్సరాల జైలుశిక్ష వేశారు. తరువాత 1964లో న్యాయస్థానం ఎదుట హాజరైనప్పుడు ప్రభుత్వ విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో వివరించాడు ఆ సందర్భంలో.  °నా జీవితమంతా ఆఫ్రికన్ జనుల సంఘర్షణకే అంకితం. తెల్లవారి పెత్తనాన్నీ, నల్లవారి పెత్తనాన్నీ నేను ప్రతిఘటించాను. అందరూ సహృద్భావంతో కలిసి ఉండే, అందరికీ సమానావకాశాలు లభించే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా సమాజం నాకత్యంత ప్రియమైన లక్ష్యాలు. అందుకోసమే నేను జీవిస్తాను. అవసరమైతే అందుకోసం మరణించడానికి కూడా నేను సంసిద్ధుడను" అని చెప్పాడు.  దీని తరువాత ఆయనకు జీవితకాల శిక్ష విధించారు. తరువాత 27 సంవత్సరాల జైలు జీవితంలో 18 సంవత్సరాలు రొబెన్ దీవిలో గడిపాడు. ఈయనకు తక్కువస్థాయి ఖైదీగా చాలా తక్కువ వసతులు కల్పించారు. సున్నపు క్వారీలో పనిచేయించేవారు. అలా అన్నేళ్ళు జైలు జీవితం గడిపిన తరువాత 1990లో మండేలాను విడుదల చేయడానికి ఉత్తర్వులు జారీచేశారు. స్వీయ చరిత్ర! మండేలా "లాంగ్ వాక్ టూ ఫ్రీడమ్" అని స్వీయ చరిత్ర రాసాడు. అది 1994లో ప్రచురించబడింది. అదంతా ఆయన తన జైలు శిక్ష సమయంలో రహస్యంగా రాసాడు. అధ్యక్షుడిగా! 1994 సంవత్సరంలో మొట్టమొదటి నల్లజాతి వ్యక్తి దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా  ఎన్నిక కాబడ్డారు. 1999 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. తరువాత థాబో ఎంబెకీ  పదవిని స్వీకరించాడు. చివరి పదేళ్లు! జూలై 2001లో మండేలాకు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్టు నిర్ధారించబడింది. రేడియేషన్ వైద్యం చేశారు.  జూన్ 2004లో తాను పబ్లిక్ జీవితం నుండి విరమిస్తున్నట్లుగాను, అధికంగా కుటుంబంతో గడపదలచుకొన్నట్లుగాను  ప్రకటించాడు. కాని పూర్తిగా సమాజం నుండి దూరంగా ఉండలేదు. ఈయన తన చివరి కాలంలో శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతూ 2013 డిసెంబర్ 5 న జొహెన్నస్ బర్గ్ లో మరణించాడు. అలా 20 వ శతాబ్దానికి చెందిన గొప్ప పోరాట నాయకుల్లో ఒకరైన నెల్సన్ మండేలా అస్తమయం చెందాడు. కానీ ఆయన పోరాట పటిమ, ఆయన జీవితం మండే సూర్యుడిలా ఎంతోమందిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ◆ వెంకటేష్ పువ్వాడ.

మూర్ఛ వ్యాధి లైఫ్ స్టైల్ ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?

మనిషిని అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని తాత్కాలిక ఉపశమనం తప్పితే శాశ్వత పరిష్కారం లేకుండా ఉంటాయి. దీర్ఘకాలిక మందుల వాడకం వల్ల  తగ్గే అవకాశాలు ఉంటాయేమో కానీ అది కొద్దిశాతం మాత్రమే. వయసుతోను, జెండర్ తోనూ సంబంధం లేకుండా సమయం అంటూ లేకుండా అందరినీ ఇబ్బంది పెట్టె సమస్య మూర్ఛ రోగం. ఇది నరాల సంబంధ సమస్య వల్ల వస్తుంది.  ప్రపంచంలో  అందరినీ ఇబ్బంది పెడుతున్న నరాలకు సంబంధించిన నాలుగవ సమస్యగా మూర్చరోగం నమోదయింది. మూర్చరోగానికి సంబంధించిన ఒక అధ్యయనంలో మెదడు పనితీరు గురించి ఒక విషయాన్ని తెలుసుకున్నారు. మూర్ఛ రోగులు నిద్రపోతున్న సమయంలో బయటి శబ్దాలకు స్పందించే లక్షణం సాధారణ వ్యక్తులకంటే ఎక్కువగా ఉంటుందట. అల్ఫా-బీటా తరంగాల స్థాయి వల్ల ఇందులో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. అసలు సమస్య ఎక్కడ?? ఏంటి? ◆అల్ఫా-బీటా తరంగాలు క్షీణించిపోయి తక్కువ స్థాయిలో ఉంటే శబ్దాలకు స్పందించే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గుణం వల్ల తరువాత ఏమి జరుగుతుందో అనే ఆలోచనా వలయం మెదడులో క్రమంగా పెరిగిపోతుందట. ఈ కారణం వల్ల మూర్ఛ రోగులు రాత్రి సమయాల్లో మెలకువ వచ్చి లేస్తే తరువాత నిద్రపోవడానికి చాలా ఇబ్బంది పడతారు. ◆మూర్ఛ రోగులలో మెదడులోని న్యూరాన్ లు వీణ మీద తీగల్లాగా ప్రవర్తిస్తాయి. అవి ఒక్కసారి కంపనానికి లోనైతే ఇక వాటి తాలూకూ శబ్దాన్ని రీసౌండ్ చేస్తున్నట్టు ఉంటాయి. మనిషి మానసిక పరిస్థితిని బట్టి వాటి శబ్ద తీవ్రత అనుభూతి చెందడంలో చాలా ఘోరమైన పరిస్థితులు ఎదుర్కుంటారు. ◆ ఈ పరిస్థితులు ఎలా ఏర్పడుతున్నాయి అనే విషయాలను  పరిశోధకులు దగ్గరగా పరిశోధించినప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది. పరిశోధనలో మెదడులో కొన్ని ఎలాక్ట్రోడ్ లు అమర్చి లోపలి పనితీరు వ్యవస్థను గమనించినప్పుడు ఆశ్చర్యంగా మూర్ఛ సమస్య ఉన్న వాళ్లలో మెదడు కణాలు అన్నీ ఒకే విధంగా స్పందించాయి. ◆ 7 సంవత్సరాలలో సుమారు 700 మంది నుండి న్యూరాన్ ల డేటా ను సేకరించి పరిశీలించిన ఫలితాలలో మెదడు కణాలు నిద్రలో చాలా తీవ్ర స్థాయిలో స్పందించాయని తెలుసుకున్నారు. ◆  అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ పరిశోధనలు, వాటి ఫలితాలు, బాధితుల అనుభవాలను గమనిస్తే ఈ మూర్ఛ వ్యాధి అనేది మనుషులను ఎంతగా ఇబ్బంది పెడుతోందో అర్థం చేసుకోవచ్చు. పరిష్కారం ఎలా? ఇది పూర్తిగా నరాల సంబంధిత సమస్య. కొన్ని జన్యు పరంగానూ ఉండచ్చు, మరికొన్ని అకస్మాత్తుగా సంభవించేవి కావచ్చు.  కొంతమందిలో ప్రమాదాలు జరిగినప్పుడు ఈ మార్చ వ్యాధి అటాక్ అవ్వచ్చు, మహిళల్లో ప్రసవ సమయంలో ఈ సమస్య ఎదురవ్వచ్చు. దీనికి స్వీయ పరిష్కారం ఏదైనా ఉందంటే అది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం. నరాలను ఒత్తిడిలోకి నెట్టే ఆలోచనలు, శారీరక శ్రమ ఎక్కువ చేయకుండా ఉండటం మంచిది. జీవన విధానాన్ని ఆహ్లాదంగా ఉంచుకోవడం. ◆ నరాలకు శక్తిని ఇచ్చే ఆహారపదార్థాలు తీసుకోవాలి. నువ్వులు, నువ్వుల నూనె ఎంతో మంచివి. ◆ సహజసిద్ధమైన జీవన విధానానికి దగ్గరగా ఉండాలి. తిండి, నీరు, గాలి, నివసించే వాతావరణం విషయంలో జాగ్రత్తలు అవసరం. ◆ కుటుంబ సభ్యుల నుండి సహకారం అవసరం అవుతుంది. అనవసరపు గొడవలకు, రాద్ధాంతాలకు దూరం ఉండాలి. ముఖ్యంగా ఎమోషన్స్ ను బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూసుకోవడం కుటుంబ సభ్యుల కర్తవ్యం. ఇవన్నీ కేవలం జాగ్రత్తలు మాత్రమే. వైద్యులను సంప్రదించి మందులు వాడటం మంచి మార్గం. ఇలా చేస్తుంటే జీవన విధానంలో మూర్ఛ అనే సమస్య ప్రభావం కాసింత తక్కువే ఉంటుంది.                                          ◆వెంకటేష్ పువ్వాడ.

లేటెస్ట్ నవరస చిత్రాలు ఈ ఎమోజీలు!

మనిషికి జీవితంలో భావవ్యక్తీకరణ ఎంతో ముఖ్యమైనది. కొందరు ఈ వ్యక్తికరణను ముఖకవళికల ఆధారంగా వ్యక్తం చేస్తుంటారు. ఏదైనా ఒక భావోద్వేగాన్ని వ్యక్తం చేయడానికి నవరసాలను ముఖంలోకి తీసుకొచ్చి వాటిని బయటపెడుతుంటారు. సందర్భాన్ని బట్టి, మనిషి మూడ్ ని బట్టి వ్యక్తీకరణలు మారుతుంటాయి. అయితే నేటి వేగవంతమైన కాలంలో స్నేహితులు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు, రిలేషన్ లో ఉన్నవారు కావచ్చు దూరంగా ఉంటున్నవాళ్ళు ఫోన్ కాల్స్ లోనూ, చాటింగ్ లోనూ ఒకరిని ఒకరు పలకరించుకుంటూ  ఉంటారు. ఇలా పలకరించుకునే  సమయంలో ఎక్స్ప్రెషన్స్ బయట పెట్టడానికి అందరూ వాడుతున్నవి ఎమోజిస్.  నవ్వడం, ఏడవడం, కోపం, బాధ, అసహనం, ప్రయాణాలు, వంట చేయడం, అనారోగ్యం ఇలా ప్రతి సందర్భానికి ఎమోజీలు ఉన్నాయి. చాటింగ్ చేసుకునేవాళ్ళు సింపుల్ గా ఎమోజీలు పెట్టి తమ సిట్యుయేషన్ ను అవతలివాళ్లకు చెబుతుంటారు. అయితే ఈ ఎమోజీలు ప్రస్తుత నెట్ యుగంలో చాలా చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. వీటి వాడకం లేని సామాజిక మాధ్యమాల సంభాషణలు సాగడం లేదంటే అర్థం చేసుకోవచ్చు. ఫేస్ బుక్, వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ మొదలైన మాధ్యమాలలో ఎమోజీల హాంగమా అంతా ఇంతా కాదు.  అసలు ఎమోజీలు ఎక్కడివి? ఒకసారి మీరు చేసిన ఆన్లైన్ చాటింగ్ గమనిస్తే ఆ చాటింగ్ లో హార్ట్ సింబల్స్, లాఫింగ్ సింబల్స్, స్లీపింగ్ సింబల్స్, స్మైలీ ఫేస్ లు, యాంగ్రీ ఫేస్ లు ఇలా ఎన్నో రకాల ఎమోజీలు చాలానే వచ్చి ఉంటాయి. ఎమోజి అని పిలువబడే ఈ ఐకానిక్  జపనీస్ చిత్రాలు ఇంటర్నెట్‌లో బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పట్లో కామన్ అయినట్టు ఈ ఎమోజీల విజయాన్ని కూడా  జూలై 17న ఎమోజీ డే గా గుర్తించి సెలబ్రేట్ చేసుకుంటారు. ఎమోజీ డే రోజు జరిగే అక్టీవిటీస్! బుల్లి ఎమోజీలతో, చిన్న సరదాలు, చెప్పలేనంత సంతోషాలు స్నేహితులు, సన్నిహితుల మధ్య క్రియేట్ చేసుకోవచ్చు. సంభాషణలను కేవలం ఎమోజీలు ద్వారా మాత్రమే చేయడం చెప్పలేనంత ఫన్ గా ఉంటుంది. ఈకాలంలో క్రియేటివిటికి కొదవలేదు. ప్రయోగాలు చేసి సొంత ఎమోజీలు సృష్టించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి క్రియేటివిటీల విషయంలో  స్నేహితుల మధ్య చిన్న చిన్న ఛాలెంజ్ లు కూడా పెట్టుకోవచ్చు. వేసుకునే డ్రెస్ , ఉపయోగించే వస్తువులు ఇంకా వివిధ రకాల వాటి మీద ఎమోజీ చిత్రాలు వేయడం, రోజంతా ఆ ఎమోజీల ఫన్ ను అందరితో ఎంజాయ్ చేయడం. ఎమోజీలు విషయంలో అందరూ కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ◆భాషతో సంబంధం లేకుండా వ్యక్తీకరణ అందరికీ తెలిసిపోవడం ఈ ఎమోజీల స్పెషల్. ◆ వెటకారం, వ్యంగ్యం, హాస్యం, సంతోషం వంటి అన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఎమోజీలతో సాధ్యమవుతుంది. మొబైల్ పాడ్ లో లేని ఎమోజీ అంటూ ఉండదు. బహుశా వాటిలో చాలావరకు మనం వాడనివి కూడా ఉంటాయి. ◆ ఇవి మంచి కోడింగ్ కాన్సెప్ట్ లాగా పనిచేస్తాయి. కమ్యూనికేషన్  జరిగేటప్పుడు సరదాగా వీటితో చిన్న చిన్న పజిల్స్ లాంటివి ప్లే చేయచ్చు. ◆ అవన్నీ సరదా అయితే కాస్త చిరాకు, కోపం, అసహమ్ లో ఉన్నప్పుడు మాట్లాడాలని లేనప్పుడు కూడా ఎమోజీ తో రిప్లయ్ ఇవ్వచ్చు, అలాగే పనులలో ఉన్నప్పుడు ఎమోజిలే మంచి మార్గం. ఇలా ఎమోజీలు రోజువారీ మన చేతుల్లో చాలానే దొర్లిపోతుంటాయి. ఒకవేళ ఈ ఎమోజీ డే లు గట్రా పిచ్చి పనిగా ఎవరికైనా తోస్తే ఒక సైలెంట్ ఎమోజీ చూసి ఆ భంగిమలోకి మారిపోండి.                                ◆ వెంకటేష్ పువ్వాడ.

పేపర్ బ్యాగ్స్ తీసుకుందామా?

మనిషి విజ్ఞానపరంగా అభివృద్ధి చెందేకొద్ది ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కరణలు చేసాడు. నిత్యం అన్నిరకాలుగా ఉపయోగించుకుంటున్న ప్లాస్టిక్ అలాంటిదే. అయితే కాలం గడిచేకొద్దీ ఆ ప్లాస్టిక్ ఎంత ప్రమాదకరమైనదో తెలిసొచ్చింది. దానికి ప్రత్యామ్నాయంగా ఎన్నెన్నో ప్రయోగలు చేశారు. ప్రకృతికి హాని కలిగించకుండా ఉండాలని చేసిన ఆ ప్రయత్నాలలో ఆవిష్కారం అయ్యిందే పేపర్ బ్యాగ్. పండ్లు తీసుకోవలన్నా, పూలు తీసుకోవలన్నా, కూరగాయలు, సరుకులు, చివరికి చెత్త పడేయడానికి కూడా ప్లాస్టిక్ వాడటం వల్ల చాలా పెద్ద నష్టాలే ఎదురయ్యాయి. ఇప్పుడు మాత్రం ప్లాస్టిక్ బ్యాన్ చేసి పేపర్ బ్యాగ్ వైపు మొగ్గుచూపారు.  పేపర్ బ్యాగ్ పుట్టుక! ప్రతి సంవత్సరం జూలై 12న పేపర్ బ్యాగ్ డేగా జరుపుకుంటారు. ప్లాస్టిక్‌కు బదులు పేపర్ బ్యాగుల వాడకంపై అవగాహన కల్పించే సమావేశాలు, కార్యకలాపాలు చేపడతారు.    పర్యావరణానికి  ప్లాస్టిక్ సంచుల వల్ల జరిగే  దుష్ప్రభావమే పేపర్ బ్యాగుల వినియోగానికి దారితీసింది. మనం ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ కుళ్ళిపోవడానికి సంవత్సరాలు పడుతుంది, అయితే కాగితపు సంచుల ద్వారా ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అంతేకాకుండా ఈ పేపర్ బ్యాగులను తిరిగి రీసైకిల్ చేయడం లేదా వీటిని సులువుగా నేలలో కలిసిపోయేలా చేయచ్చు.  ప్రజలు స్థిరమైన జీవనశైలిని ఎంచుకుంటున్న దశలో పర్యావరణం గురించి ఆలోచించి ప్లాస్టిక్ ను దూరం పెట్టి పేపర్ బ్యాగ్ లను వాడితే ఎంతో మంచి పరిణామాలు చోటుచేసుకుంటాయి.    పేపర్ బ్యాగ్ చరిత్ర: ప్లాస్టిక్ వినియోగం వల్ల ఎదురవుతున్న నష్టాలకు పరిష్కారంగా పేపర్ బ్యాగ్ ల వాడకం మొదలైనా, పేపర్ బ్యాగ్ ల  పుట్టుక మాత్రం ఇప్పటిదేమీ కాదని చరిత్ర చెబుతోంది. భారతదేశ ప్రాచీనులు వస్త్రాలతో తయారుచేసిన సంచులు, జనపనార, టెంకాయ పీచు వంటి వాటితో తయారుచేసిన  చేతి సంచులు వాడేవాళ్ళు. అయితే 1852లో ఫ్రాన్సిస్ వోల్లే అనే అమెరికన్ ఆవిష్కర్త మొదటి పేపర్ బ్యాగ్ మెషీన్‌ను స్థాపించాడు.  తరువాత 1871లో మార్గరెట్ ఇ నైట్ ఫ్లాట్-బాటమ్ పేపర్ బ్యాగ్‌లను ఉత్పత్తి చేసే మరొక యంత్రాన్ని అభివృద్ధి చేసింది.  ఆమె "the mother of the grocery bag"గా ప్రసిద్ధి చెందింది. ఆ తరువాత అనేక సంవత్సరాలుగా, చార్లెస్ స్టిల్‌వెల్ మరియు వాల్టర్ డ్యూబెనర్ వంటి అనేక మంది ఆవిష్కర్తలు మెరుగైన డిజైన్‌లు మరియు మాన్నికైన కాగితపు సంచులను ఉత్పత్తి చేశారు.  కాగితపు సంచులు లేదా పేపర్ బ్యాగ్స్ ఎందుకు వాడాలి? కాగితపు సంచులు ఎందుకు వాడాలి అనేదానిపై చెప్పుకోవాల్సిన మొదటి విషయం పర్యావరణానికి హాని కలిగించకపోవడం. వాడేసి పడేసిన తరువాత తొందరగా భూమిలో కలిసిపోవడం, లేదా రీసైకిల్ చేయడానికి అనువుగా ఉండటం.  పేపర్ బ్యాగ్స్ వాడటం వల్ల అన్ని రకాల కాలుష్యాలను  తగ్గించవచ్చు.  పేపర్ బ్యాగ్స్ ను ఒక్కసారి వాడి పడేయకుండా రియూజ్ చేసుకోవచ్చు. అంటే ఓకేదాన్ని  మళ్ళీ ఉపయోగించుకోవడం.  ◆ఒకసారి వాడేసిన పేపర్ బ్యాగ్ పరిస్థితిని బట్టి వంటగదిలో వాడొచ్చు. నూనెలో వేయించిన పకోడీలు ఇతర పదార్థాలను శుభ్రంగా ఉన్న పేపర్ బ్యాగ్ లపై వేస్తే నూనెను పీల్చుకుంటాయి. కిచెన్ నాప్కిన్స్ కొనే ఖర్చు కాస్త అయినా తగ్గుతుంది. ◆ గాజు, పింగాణీ వంటి వస్తువులను ప్యాక్ చేయడానికి పేపర్ బ్యాగ్స్ బాగా ఉపయోగపడతాయి. వీటి వల్ల వస్తువులు విరిగిపోకుండా ఉంటాయి. ◆ పేపర్ బ్యాగ్స్ లో కార్బన్ మూలం ఉంటుంది. కాబట్టి కంపోస్టు ఎరువుగా మార్చడానికి బాగా అనువుగా ఉంటుంది. ఈ ఎరువు మొక్కలకు మంచి పోషకంగా ఉపయోగపడుతుంది. ◆ ఉల్లి వెల్లుళ్లు వంటి వాటిని పేపర్ బ్యాగ్స్ లో వేసి పొడి ప్రదేశాలలో ఉంచితే నెలల తరబడి పాడుకాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఆకుకూరలు వంటివి పేపర్ బ్యాగ్స్ లో వేసి ఫ్రిజ్ లో ఉంచితే అదనపు తేమను పీల్చుకుని ఆకుకూరలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ◆ ఎక్కడికి వెళ్లినా ఓ పేపర్ బాగ్ మనతో ఉంచుకుంటే ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. లేకుంటే సింపుల్ గా రికైల్ కోసం వాడేయచ్చు కూడా. ◆పేపర్ బ్యాగ్స్ ను ఏవిధంగా వాదుకున్నా వీటి నుండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ, నష్టాలు కానీ ఉండవు. ధర విషయంలో మరీ అంత ఎక్కువగా ఏమి ఉండవు.  కాబట్టి పర్యావరణానికి మంచి చేసే పేపర్ బ్యాగ్స్ వైపు అడుగులు వేసి కాసింత ఈ భూమిని, ప్రకృతిని కాపాడుకోవాలి అందరూ.                                  ◆వెంకటేష్ పువ్వాడ.  

జ్ఞానాన్ని గుభాళింపజేసే గురుపూర్ణిమ!

ఆషాడ శుద్ద పౌర్ణమి రోజును గురుపౌర్ణిమ అని కూడా అంటారు. గురుపూర్ణిమ అనేది గురువును స్మరించుకుంటూ జరుపుకునే వేడుక అని అందరి అభిప్రాయం. గురుపూర్ణిమ రోజునే వ్యాసుడు జన్మించాడు కాబట్టి దీన్ని వ్యాసపూర్ణిమ అంటారని కొందరు చెబుతారు. ఏది ఏమైనా ఆషాడ శుద్ధ పూర్ణిమ రోజును అందరూ ఎంతో భక్తిశ్రద్దలతో జరుపుకుంటారు.  గురువును పూజించడం భారతీయ సనాతన ధర్మంలో ఎప్పటి నుండో ఉంది. భక్తుడు లేదా శిష్యుడిలో ఉన్న అంధకారాన్ని తొలగించేవాడు గురువు. మన భారతదేశంలో ఎంతో మంది గురువులు ఉన్నారు. వాళ్ళందరూ ఆత్మసాక్షాత్కారం పొంది ప్రజలకు ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రశాంత జీవితాన్ని గురించి తమ భోధనల ద్వారా చెప్పినవాళ్ళు. ఇంకా ముఖ్యంగా తమ జీవితం ద్వారానే ప్రజలకు, శిష్యులకు గొప్ప మార్గాన్ని చూపినవాళ్ళు. బుద్ధుని జీవితాన్ని ప్రజలకు ఎలా అయితే ఒక గొప్ప మార్గంగా ప్రచారం చేస్తారో, బుద్ధ పూర్ణిమను ఎంతో ప్రత్యేకంగా ఎలా చూస్తోరో, అలాగే గురుపూర్ణిమ కూడా ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. గురుపూర్ణిమ రోజున ఎంతో మంది తమ గురువుల అనుగ్రహం కోసం గురువును ఆశ్రయిస్తారు. కొందరు ఉపదేశాలు తీసుకుంటారు. మరికొందరు గురువుకు సేవ చేసుకుంటారు, గురువును గుర్తుచేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తారు. షిరిడి సాయి బాబా లాంటి గురువుల మందిరాలు భక్తులతో కిటకిటలాడుతాయి. గురుపూర్ణిమ వెనుక కథనం!! అందరూ గురుపూర్ణిమ వెనుక కథ ఏంటి అంటే వ్యాసుడు జన్మించాడు కాబట్టి గురుపూర్ణిమ జరుపుకుంటారు అని చెబుతారు. కానీ వ్యాసుడు జన్మించడం  నిజమే అయినా దానికంటే అరుదైన విశిష్టమైన కథనం గురుపూర్ణిమ వెనుక ఉంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ గురుపూర్ణిమ వెనుక ఆసక్తికర కథనాన్ని చెప్పారు. ఆయన ఆరాధించే పరమేశ్వరుడు ఆదియోగి. ఆయనే ఈ సృష్టిలో మొదటి యోగి అని ఆయనే మొదటి గురువు అని సద్గురు చెబుతారు. ఈ సృష్టిలో మొట్టమొదటిసారి ఒక యోగి హిమాలయాల్లో కనిపించాడు ఆయన్ను చూసిన ప్రజలు ఆయన ఏమైనా చెబుతాడేమో ఎదురుచూసారు కానీ ఏమీ చెప్పకపోవడం వల్ల అందరూ వెళ్లిపోయారు. అయితే అక్కడ ఏడుమంది మాత్రం అలాగే ఉండిపోయారు. ఆదియోగి వాళ్ళను పట్టించుకోలేదు. కానీ వాళ్ళు అక్కడి నుండి వెళ్లకుండా సుమారు 84 సంవత్సరాలు అక్కడే ఉన్నారట. చివరికి ఆదియోగి వాళ్ళవైపు చూసినప్పుడు సరిగ్గా దక్షిణాయనం మొదలైందట. ఆదియోగి ఆ ఏడుమందికి గురువుగా మారి ఉపదేశం చేశారు. ఆ ఏడుమంది సప్తర్షులుగా పిలవబడ్డారు. అంతేకాదు ఆదియోగి ఆ సప్తర్షులవైపు దక్షిణదిక్కుగా చూసాడు కాబట్టి ఆయన దక్షిణామూర్తిగా పిలబడ్డాడు. ఆదియోగి సప్తర్షులకు గురువుగా మారి చేసిన ఉపదేశాన్ని సప్తర్షులు ప్రజల మధ్యకు తీసుకొచ్చారు. ఇదీ గురుపూర్ణిమ వెనుక కథనం. అయితే గురువు ఎవరైనా శిష్యుడికి ఎంతో గొప్పవాడు కాబట్టి ఎందరో గురువులున్న ఈ భారతదేశంలో తమ తమ గురువును తలచుకుంటూ, పూజిస్తూ, సేవిస్తూ గురుపూర్ణిమను చాలా భక్తితో జరుపుకుంటారు. కాబట్టి అందరికీ గురువు అనుగ్రహం ఉండాలని కోరుకుందాం. ఈ గురుపూర్ణిమ నాడు అందరూ గురువులూ తమ శిష్యులకు గొప్ప జ్ఞానాన్ని పంచాలని ఆశిద్దాం.                                   ◆ వెంకటేష్ పువ్వాడ.

జగన్నాథుని రథచక్రాలు సాగుతున్నాయి!!

భారతదేశం మొత్తం రథయాత్ర పేరుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పూరీ జగన్నాథుని రథోత్సవం ప్రస్తుతం జరుగుతోంది. ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన వెలసిన పూరీ క్షేత్రం శ్రీకృష్ణుణ్ణి ఆరాధించే వాళ్లకు ఎంతో పవిత్రమైనది. చార్ ధామ్ యాత్రలో ఉన్న ప్రముఖ నాలుగు క్షేత్రాలలో ఒకటైన పూరి జగన్నాథుని రథోత్సవం ప్రత్యేకత, విశేషాలు మొదలైన వాటి గురించి తెలుసుకున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలని ఉంటుంది. పూరీ క్షేత్రంలో ఎన్నో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. వాటిలో రథయాత్రకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. జగన్నాథుడు బలభద్రుడు, సుభద్రలతో కలసి ఇక్కడ రథాల మీద ఉరేగడం చాలా కన్నుల పండుగగా ఉంటుంది. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఇక్కడి గొప్ప ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం కొత్త రథాన్ని తయారుచేసి ఆ రథాల్లోనే రథోత్సవం జరుపుతారు. రథోత్సవాలు ఎక్కడ జరిగినా మూలవిగ్రహాలు వేరు, ఊరేగింపు విగ్రహాలు వేరు ఉంటాయి. కానీ పూరీ క్షేత్రంలో అలా కాకుండా  మూలవిగ్రహాలనే ఊరేగింపు చేస్తారు. కొత్త రాథాలపై మూల మూర్తులను చూడటం ఇక్కడే సాధ్యం. అందుకే పూరీ రథయాత్రకు ఇంత విశిష్టత ఏర్పడింది. ఆషాడ శుద్ధ విదియ రోజున సంవత్సరం నుండి మూలమూర్తిగా పూజలందుకుంటున్న జగన్నాథుణ్ణి, బలభద్రుణ్ణి, సుభద్రని గర్భాలయంలో నుండి బయటకు తీసుకుని వస్తారు. అథిత్యం గుండిచా వేదిక!! పూరీజగన్నాథ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో గుండిచా ఆలయం ఉంటుంది. ఇది పూరీ ఆలయాన్ని  నిర్మించిన ఇంద్రద్యుమ్నుడి భార్య గుండిచా కట్టించినది. పూరీ ప్రధాన గుంది నుండి మూడు కిలోమీటర్లు రథం మీద వెళ్లి గుండిచా ఆలయంలో రత్న సింహాసనం మీద కొలువవుతాడు జగన్నాథుడు. రథం ప్రత్యేకత!! అంతా ఎక్కువభాగం రథాల్లోనే ఉంది ప్రత్యేకత. రథం తయారీ కోసం 1072 వృక్ష భాగాలను పూరీకి తరలిస్తారు. అక్షయతృతీయ రోజు 125 మంది ఈ 1072 బాగాలను 2188 ముక్కలుగా చేస్తారు. వీటిలో 832 ముక్కలు జగన్నాధుడి రథం కోసం, 763 భాగాలు బలభద్రుడి రథం కోసం, మిగిలిన 593 భాగాలను సుభద్ర రథం కోసం కేటాయిస్తారు. వాటితో రథాలను తయారుచేయడం మొదలు పెడతారు. ఆషాడ పాడ్యమి నాటికి వీటి నిర్మాణం పూర్తవుతుంది. జగన్నాధుడి రథం 16 చక్రాలతో 45 అడుగుల ఎత్తుతో అన్నిటి కంటే పెద్దగా ఉంటుంది. ఎర్రటిచారలు ఉన్న పసుపు వస్త్రంతో దీన్ని కప్పుతారు. దీన్ని నందిఘోష అంటారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని, సుభద్ర రథాన్ని పద్మధ్వజం అని అంటారు. తిరుగు ప్రయాణం!! రథాల మీద ఊరేగుతూ గుండిచా ఆలయాన్ని చేరుకున్న ఆతరువాత వారం రోజుల పాటు అక్కడే గడుపుతారు జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ముగ్గురూ, వారం రోజుల తరువాత దశమి రోజు తిరిగి పూరీ ప్రధాన ఆలయానికి వెళతారు. దశమి తరువాత ఏకాదశి రోజున స్వామి వార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. మళ్ళీ ద్వాదశి రోజున విగ్రహాలను తిరిగి గర్భగుడిలోకి తీసుకెళ్లిపోతారు. దీంతో రథయాత్ర ముగుస్తుంది. ఆసక్తికర విషయాలు!! జగన్నాథుని రథోత్సవం జరిగేటప్పుడు రథాన్ని లాగుతున్నప్పుడు రథానికి ఏ అడ్డు వచ్చినా దాని ప్రయాణం ఆగదు. మనుషులు రథం కింద పడినా వేరే ఇతర సమస్యలు వచ్చినా కూడా రథాన్ని ఆపరు.  రథాలను, మూలవిగ్రహాలను మొత్తం చెక్కతోనే తయారుచేస్తారు. ఇది ఎంతో విశిష్టమైన వేప చెట్ల నుండి తయారుచేస్తారు. చాలామంది రథానికి ఉపాయోగించే కలప గురించి, ప్రతి సంవత్సరం కొత్త రథాల గురించి వినగానే అన్ని చెట్లను నరికేస్తున్నారా అని కొంచెం వ్యతిరేకత చూపిస్తారు. కానీ నిజానికి రథాల కోసం ఎంతో ప్రత్యేకంగా వృక్షాలను పెంచుతారు. వాటినే రథాల కోసం వినియోగిస్తారు.  8, 11, 19 సంవత్సరాలకు ఒకసారి మూలమూర్తుల విగ్రహాలను కూడా మార్పులు చేస్తారు. కొత్త చెక్క విగ్రహాలను తయారుచేసి, పాత వాటిని శాస్త్రోక్తంగా ఖర్మకాండలు జరుపుతారు. మనిషి జనన మరణాలకు ఇది గొప్ప సందేశాన్ని ఇస్తుందని కొందరి అభిప్రాయం. ◆ వెంకటేష్ పువ్వాడ.

పైపై మెరుగుల కోసం పాకులాడితే

అనగనగా ఓ రెండు గుర్రాలు ఉండేవి. దేవతా గుర్రాలంటే మాటలా! పాలరాతి తెలుపుతో, నురగలాంటి జూలుతో మహా అందంగా ఉండేవి. వాయువేగంతో ముల్లోకాలూ చుట్టిపారేసేవి. జనం ఆ గుర్రాలను చూసినప్పుడల్లా ముక్కున వేలేసుకునేవారు. అంత అందమైన గుర్రాలను చూడటంతో తమ జన్మ ధన్యమైపోయిందని మురిసిపోయేవారు. కానీ ఆ గుర్రాల మనసులో ఏదో చింత! రెండు గుర్రాలనీ అంతా సమానంగా చూస్తున్నారు. రెండూ అందమైనవే అనీ, రెండూ వేగమైనవే అనీ పొగుడుతున్నారు. ‘అలా జరగడానికి వీల్లేదు! ఈ ప్రపంచంలో అన్ని గుర్రాలకంటే నేనే అందంగా ఉండాలి,’ అన్న ఆలోచన రెండు గుర్రాలలోనూ కలిగింది. అంతే వాటిలో ఒక గుర్రం నిదానంగా దేవుడి దగ్గరకి చేరింది.   ‘భగవంతుడా! నన్ను ఇంత అందంగా అద్భుతంగా సృష్టించినందుకు కృతజ్ఞతలు. దేవతా గుర్రంగా నా జన్మ ధన్యమైపోయింది. కానీ నాదో చిన్న కోరిక,’ అంది ఆ గుర్రం. దాని మనసులో మాట గ్రహించినట్లుగా భగవంతుడు ఓ చిరునవ్వు నవ్వి- ‘నువ్వు దేవతా గుర్రానికి. నీ కోరికని తీర్చాల్సిందే! ఏం కావాలో కోరుకో!’ అన్నాడు. ‘నేను అందంగా ఉన్న మాట నిజమే కానీ ఇంకాస్త అందంగా ఉంటే బాగుండు అన్న దుగ్థ నన్ను తెగ వేధిస్తోంది. ఆలోచించి చూస్తే నాలో చాలా అవకరాలే కనిపిస్తున్నాయి. అవన్నీ సరైపోయి నేను ఇంకా అందంగా ఉండేట్లు ఆశీర్వదించండి స్వామీ!’ అని వేడుకుంది.   ‘ సరే! నీలో నీకు ఏ లక్షణాలు లోపాలుగా కనిపిస్తున్నాయో చెప్పు. అవన్నీ సరిదిద్దుతాను,’ అంటూ అభయమిచ్చాడు భగవంతుడు. దాంతో ఆ గుర్రం తనలో తనకి లోపాలుగా తోచిన లక్షణాలన్నింటినీ ఏకరవు పెట్టడం మొదలుపెట్టింది. ‘ఈ తల చూసారా! మరీ మెడకి అంటుకుపోయినట్లుగా ఉంది. అది ఇంకాస్త పొడవు ఉంటే బాగుంటుంది. ముక్కు కూడా మరీ సన్నగా ఉందేమో అని నా అనుమానం. ఇక కాళ్లు ఇంకాస్త పొడవుంటే భలే ఉంటుంది. దయచేసి ఇవన్నీ సరిదిద్దురూ!’ అంది గుర్రం. ‘తథాస్తు! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునే సరికి ఈ లోపాలేవీ లేని సరికొత్త రూపం నీకు వస్తుంది,’ అన్నాడు భగవంతుడు.   మొదటి గుర్రం సంతోషంగా భగవంతుని దగ్గర సెలవు తీసుకుంది. అది అలా వెళ్లిందో లేదో రెండో గుర్రం భగవంతుడి దగ్గరకు చేరుకుంది. ‘హే భగవాన్‌! ఆ గుర్రం తన అందాన్ని పెంచుకోవాలనే కోరికతోనే నీ దగ్గరకి వచ్చిందని నాకు తెలుసు. ఎలాగైనా ప్రపంచంలోనే గొప్ప గుర్రం అనిపించుకోవాలని దాని తపన. దాని అత్యాశని మీరు అణచాల్సిందే! అది తనలోని అందం మెరుగుపడేందుకు ఏ లక్షణాలనైతే కోరుకొందో... అవి నాలో మరింత ఎక్కువగా ఉండేలా వరం ఇవ్వండి,’ అని వేడుకుంది. ‘అయ్యో అదెంత భాగ్యం! అసలే నువ్వు దేవతా గుర్రానివి. నీ కోరికను తీర్చాల్సిందే! రేపు ఉదయం నువ్వు లేచి చూసుకునేసరికి ఆ లక్షణాలన్నీ నీలో కనిపిస్తాయి. తథాస్తు!’ అంటూ నవ్వాడు భగవంతుడు.   ఆ రాత్రి గుర్రాలకి సరిగా నిద్రపట్టనే లేదు. ఎప్పుడెప్పుడ తెల్లవారుతుందా... నిబిడీకృతమైన తమ అందాన్ని ఎప్పుడెప్పుడు చూసుకుంటామా అన్న ఉద్విగ్నతతో ఆ రాత్రిని గడిపాయి. ఎప్పుడో అర్ధరాత్రి వాటికి మాగన్నుగా నిద్రపట్టింది. తెల్లవారాక చూసుకుంటే ఆ రెండు గుర్రాలకీ తమ కోరిక నెరవేరిన విషయం తెలిసిపోయింది. కాకపోతే... మొదటిగుర్రం కోరుకున్న లక్షణాల కారణంగా అది అచ్చు ఒంటెలా మారిపోయింది. మొదటి గుర్రం కోరుకున్న లక్షణాల మోతాదు తనలో మరింతగా ఉండాలని కోరుకోవడంతో రెండో గుర్రం జిరాఫీలా మారిపోయింది!!!   తమ శరీరాల వంక చూసుకున్న గుర్రాలు రెండూ లబోదిబోమంటూ భగవంతుడి దగ్గరకు పరుగులెత్తాయి. ఆయనను చూస్తూనే ‘ఏమిటీ మాకీ అన్యాయం!’ అంటూ ఆక్రోశించాయి.   ‘మీరు కోరుకున్న వరాన్ని యథాతథంగా తీర్చాను. ఇది అన్యాయం ఎలా అవుతుంది? ఆగమేఘాల మీద పరుగులు తీసే దేవతాశ్వాలు ఎలా ఉండాలో, మిమ్మల్ని అలా పుట్టించాను. కానీ మీకు మీ శరీరం పట్ల కానీ, దానిని అందించిన నా పట్ల కానీ నమ్మకం లేదు. అదే అసలైన అన్యాయం. మీరు నిజంగా నన్ను ఏదన్నా కోరుకోవాలని అనుకుంటే... ఎలాంటి నిస్సత్తువా దరిచేరకుండా బలిష్టంగా ఉండాలనో, కోరుకున్న గమ్యాలని సమర్థంగా చేరుకోవాలనో అడగాల్సింది! కానీ మీరు పైపై మెరుగులకే ప్రాధాన్యతని ఇచ్చారు. ఇక ఫలితం అనుభవించండి. ఇక నుంచీ మీరు దేవతా అశ్వాలు కాదు. ఒకరేమో ఒంటెలాగా ఎడారుల్లో తిరుగుతూ నానా బరువులూ మోయాల్సి ఉంటుంది. మరొకరేమో చిటారుకొమ్మ మీద దొరికే ఆహారంతో తృప్తిపడుతూ అడవులలో కాలం గడపాల్సి వస్తుంది. పోండి!,’ అనేశాడు భగవంతుడు. అదీ విషయం! (ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)   - నిర్జర.

మీ తాళం చెవి ఎక్కడుంది??

టైటిల్ చూడగానే మన తాళం చెవి ఇంకెక్కడ ఉంటుంది మనదగ్గరే!! అనుకుంటున్నారా?? అయితే మీరు పప్పులో కాలేసినట్టే.  సరే!! మీరు అనుకున్నట్టే మీ ఇంటి తాళం చెవో, లేదా మీ బీరువా తాళం చెవో, లేక మీ టూ వీలర్ కావచ్చు, ఫోర్ వీలర్ కావచ్చు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్న మీ మొబైల్ కావచ్చు ఇలా ఇవన్నీ కూడా మీ ఆధీనంలో ఉన్నా వాటి తాళం చెవి లేదా వాటిని వాడటానికి  ఇతరుల అనుమతి తీసుకోవాలని ఇతరులు మీతో చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది??  నా వస్తువు నేను వాడుకోవడానికి ఇతరుల అనుమతి ఏంటి?? అని అనిపించవచ్చు కదా!! మరి వస్తువు మన సొంతమైనప్పుడు, దాన్ని మనం డబ్బు పెట్టి కొన్నప్పుడు దాని విషయంలో సర్వ హక్కులు మనకే ఉండాలన్నది సబబే!!  మరి అలాగే మీ జీవిత తాళం చెవి ఎక్కడుందో ఒక్కసారి గుర్తుచేసుకోండి ఇప్పుడు. జీవిత తాళం చెవి ఏమిటి విచిత్రంగా అనిపిస్తుందా??  అవును ఒక వస్తువు నాది అని చెప్పుకోవడానికి ఆ వస్తువు మీద సర్వ హక్కులను ప్రదర్శిస్తూ, నచ్చినట్టు వాడుతూ ఉంటారు కదా. మరి మీ జీవితం మీద మీరు పూర్తిగా హక్కు కలిగి ఉన్నారా అనే విషయం ఆలోచించండి మరి. ఇతరుల ప్రమేయం లేని జీవితాలు చాలా తక్కువ. ఎవరూ తమ జీవితాన్ని తాము సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లడం లేదు అనేదానికంటే ఇతరుల చేతుల్లో ఉంచి ముందుకు నడుస్తున్నారు అనుకోవడం మంచిదేమో కదా!! కాస్త ఆలోచించి చూస్తే అదే నిజమని నమ్ముతారు కూడా. ఇలా తమ జీవితం తమ కంట్రోల్ లో లేక ఇతరుల ప్రమేయంతో ముడిపడి, లేక సమాజంతో ముడిపడి, తమకేం  కావాలో తెలుసుకోకుండా సమాజానికి తగ్గట్టుగా ఉండటం ఉత్తమ వ్యక్తిత్వం అనుకుంటారు కానీ తమ జీవితంలో కోల్పోతున్నది చివరలో మాత్రమే అర్థమవుతుంది వాళ్లకు. అలాంటి వాళ్ళ జీవితంలో ఎలాంటి ప్రత్యేకత లేకుండా, ఎలాంటి సొంత అభిరుచులు, అభిప్రాయాలు లేకుండా ఒకానొక యంత్రంలా సాగుతూ ఉంటుంది.  ఒకటి చదవాలని ఇష్టం ఉంటుంది కానీ ఎవరో సలహా ఇస్తారు అదొద్దు ఇది చదువు అని, అలాగే అటువైపు వెళ్తారు. మరొకరు అలా ఉండకు ఇలా ఉండు అంటారు, ఇంకొకరు కుటుంబ విషయాలలో జోక్యం చేసుకుని సలహాలు ఇచ్చేస్తూ ఉంటారు. కొందరేమో అనుభవంతో చెబుతున్నాం అంటూ లెక్చర్  ఇస్తారు. ఇట్లా ఈ పరంపర కేవలం ఒక విషయంతోనో, ఒకరోజుతోనో ఆగిపోకుండా పూర్తిగా మనిషి మానసిక విషయాల్లో కూడా చొచ్చుకు వస్తుంది. ఎంతగా అంటే జీవితాల్లో జరిగే ప్రతిదానికి ఇతరులు ముందుకొచ్చి మాట్లాడేంతగా, ప్రతి విషయాన్ని ఇతరులు తమ చేతుల్లోకి తీసుకుని జడ్జ్ చేసేంతగా. ఇలా ఇంకొకరు మీ జీవితాన్ని కంట్రోల్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం?? మొబైల్ ఫోన్ ను అడగకుండా ఇతరులు తీసుకుని వాడతారనో, లేక అందులో కాస్త పర్సనల్ విషయాలు ఉంటాయనో ఫోన్ లాక్ పెట్టుకుంటున్న వాళ్ళం జీవిత తాళం చెవిని మాత్రం ఇతరుల చేతుల్లో అంత సులువుగా ఎందుకు పెట్టేస్తున్నాం?? ఎప్పుడైనా ఆలోచించారా??  కొలీగ్స్ ఏమనుకుంటారనో, పక్కింటి వాళ్ళు ఏదో అనుకుంటారనో, ఇతరులు విమర్శిస్తారనో ఇలా ఎన్నో కారణాల వల్ల జీవితాల్లో ఎంతో విలువైన విషయాల్లో కొన్ని నిర్ణయాలను మార్చేసుకుంటూ ఉంటారు చాలామంది. జీవితం అనేది సమాజ ఆమోద యోగ్యమైనదిగా లేకపోయినా పర్వాలేదు అని చెప్పడం లేదు ఇక్కడ. ఎవ్వరికీ నష్టం కలిగించనతవరకు ఎలాంటి సమస్య ఉండదు కదా!! ఇక్కడున్న చిక్కల్లా మరొకరి జీవితంలోకి దూరి వారి విషయాలను జడ్జ్ చేసేయడం అనే అత్యుత్సాహం మరియు తమ జీవితం కంటే ఇతరుల జీవితం గూర్చి ఉన్న కుతూహలం కూడా కారణం కావచ్చు. ఫలితంగా జరుగుతున్నది ఒకటే ఎవరి జీవితం ఆశించినట్టు లేకుండా గందరగోళంగా  సాగిపోతోంది. ఎందుకు ఈ గందరగోళం అంటే ఎవరికి తొందరగా సమాధానం బయటకు రాదు. కానీ, ఒక్కసారి కాస్త ఆలోచిస్తే తెలుస్తుంది తమ జీవిత  నిర్ణయాలను తీసుకునే అవకాశం, తమకు లేకపోగా ఇతరుల చేతుల్లో నిర్ణయాలు జరిగిపోవడమే అని. అందుకే మరి జీవితాలు ఎలాంటి గందరగోళానికి గురవ్వకుండా సాగాలి అంటే ఎవరి జీవిత తాళం చెవి వారిదగ్గరే ఉండాలి. తద్వారా ఎవరి సాధ్యాసాధ్యాలు వారికి తెలుస్తాయి. ఎవరి లక్ష్యాలు వారు సక్రమంగా నెరవేర్చుకోగలుగుతారు.  ఇప్పుడు ఆలోచించండి. మీ తాళం చెవి ఎక్కడుంది?? ఎక్కడున్నా సరే దాన్ని చేజిక్కించుకోవలసినది మీరే!! ఒకవేళ మరొకరి జీవిత తాళం చెవి మీ దగ్గర ఉంటే వారిది వారికి ఇచ్చేయండి. ఇవేమీ ఆర్థిక కార్యకలాపాలు కాదు, జీవితాలు అనే విషయం మర్చిపోకండి.  ◆ వెంకటేష్ పువ్వాడ  

కాళిదాసు చమత్కారం!

మహాకవి కాళిదాసు గురించి అందరికీ తెలుసు. ఆయన అంత సుప్రసిద్ధుడు. శతాబ్దాల గడుస్తున్నా వన్నె తగ్గని కీర్తి ఆయనది.  సాధారణ విషయాలను కూడా ఎంతో చమత్కారంగా చెప్పడం, అడగడం ఆయనకే చెల్లింది అంటారు పండితులు.ఆయన కాలంలో జరిగిన ఒక ఆసక్తి కథనం ఇది. అది ధారా నగరంలో వారవనితల వీధి. ఆ వీధిలో ఒక రంగుటద్దాల మేడ! ఆ మేడ వసారాలో, పూసల తెరల వెనుక, పందొమ్మిదేళ్ళ పడుచుపిల్ల తూగుటుయ్యాలలో ఊగుతూ ఏవేవో శ్లోకాలు రాగయుక్తంగా వల్లె వేస్తోంది. అదే వీధి గుండా పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ భవభూతి, కాళిదాసు వెళ్తున్నారు. వాళ్ళు వీనుల విందుగా వినబడుతున్న ఆ స్వరానికి ఆకర్షితులై అటు వైపు చూసారు. తాంబూల చర్వణంతో ఎర్రగా పండిన ఆ అమ్మాయి అధరాలు చూడగానే వారిరువురికి తాంబూలం గుర్తుకువచ్చింది. వెంటనే వాళ్ళ దగ్గరున్న తాంబూలపు పెట్టె తెరచి చూసారు. భవభూతి పెట్టెలో సున్నం అయిపోయింది.  అప్పుడు భవభూతి ఆ అమ్మాయిని ఉద్దేశించి, “తూర్ణమానీయతాం చూర్ణమ్ పూర్ణచంద్రనిభాననే” అని అడిగాడు. అనగా, “పున్నమి చంద్రునివంటి ముఖము గల ఓ సొగసరీ! కాసింత సున్నం తెచ్చిపెట్టు” అని అర్థం.  తరువాత కాళిదాసు తన పెట్టెలో తమలపాకులు కూడా లేకపోవడం చూసి, వెంటనే “వర్ణాని స్వర్ణపర్ణాని కర్ణంతాకీర్ణలోచనే” అంటూ శ్లోకాన్ని పూర్తి చేసేడు. అనగా, “చెంపకి చేరడేసి కళ్ళు గల ఓ చక్కని చుక్కా! పసిడివన్నె గల లేత తమలపాకులు కూడా ఇవ్వూ!” అని అర్థం. మహాకవులు వలె ఉన్న ఆ ఆగంతుకులని చూచి, చటుక్కున లేచి, అంజలి ఘటించి, వారిరువురికి కూర్చోవడానికి ఆసనాలు చూపించి, లోపలికి వెళ్లి ఆకులూ, వక్కలు, సున్నం ఉన్న వెండి పళ్లెం వారి ముందు ఉంచి, వినయము, విలాసము ఉట్టిపడుతూ ఉండగా మొదట కాళిదాసుకి తమలపాకులు, తరువాత భవభూతికి సున్నం అందించిందిట ఆ అమ్మాయి. ఈ ప్రవర్తన చూసి భవభూతికి కోపం వచ్చింది., “ఏమిటీ పక్షపాతం? సున్నం తెమ్మని ముందుగా అడిగింది నేను. తరువాత కదా కాళిదాసు ఆకులు అడిగింది? ఇదెక్కడి ధర్మం?” అని నిలదీసి అడిగేడట. దానికి ఆ అమ్మాయి సిగ్గుతో ఎర్రబడిన బుగ్గలతో, “క్షమించాలి. పూజా వ్యతిక్రమం జరిగితే మన్నించాలి. సామాన్య ధర్మం మాట ఎలా ఉన్నా, మా వృత్తి ధర్మం ప్రకారం మిక్కిలి రొక్కము ఇచ్చినవారంటేనే మా కులంవారు ఎక్కువ మక్కువ ప్రదర్శిస్తారు. తక్కినవాళ్లు తరువాతే!” అని గడుసుగా సమాధానం చెప్పిందిట! ఆ జవాబు విని ఆ అమ్మాయి సమయస్ఫూర్తికి, సంవాద చాతుర్యానికి ముచ్చటపడి, కవులిద్దరూ ఆమెని మనసారా ఆశీర్వదించి, ముందుకి కదిలి వెళ్లిపోయారట! అదీ కథ!! పై విషయం చదివిన వాళ్లకు ఒక అనుమానం వస్తుంది. భవభూతి కాళిదాసు ఇద్దరూ ఆ అమ్మాయికి ఎలాంటి డబ్బూ ఇవ్వలేదు కదా మరి వాళ్ళు ఏమిచ్చారు?? ఎప్పుడిచ్చారు?? ఆ అమ్మాయి ఎప్పుడు తీసుకుంది?? అనే అనుమానాలు.  పైన శ్లోకంలో ఒక చమత్కారం ఉంది. అదే కథకి ఆయువుపట్టు. భవభూతి చెప్పిన శ్లోక పాదంలో తూర్ణ, చూర్ణ, పూర్ణ అనే మాటలలో మూడు “ణ” లు ఉన్నాయి. కాళిదాసు పూర్తి చేసిన పాదంలో వర్ణ, స్వర్ణ, పర్ణ, కర్ణ, అకీర్ణ అనే మాటలలో అయిదు “ణ” లు ఉన్నాయి. తెలుగువారు ణ అనే అక్షరాన్ని “అణా” అని ఉచ్చరిస్తారు: ట, ఠ, డ, ఢ, అణా. కానీ అణా అనేది ఒక నాణెం కూడా కదా! ఈ కోణంలో చూస్తే భవభూతి ముట్టజెప్పినది మూడు అణాలు, కాళిదాసు ఇచ్చినది అయిదు అణాలు అని మనం అన్వయించుకోవాలి.  ఇలా ఎన్నో చమత్కారాలతో కవుల కాలం అద్భుతంగా సాగిందని ఇలాంటి విషయాలతో అర్థమవుతుంది.                            ◆వెంకటేష్ పువ్వాడ.