Read more!

మీరూ.. గతంలో జీవిస్తున్నారా? అయితే ఇది చదవండి!

మనిషి తన జీవితంలో చేసే పెద్ద తప్పు ఏదైనా ఉందంటే అది వర్తమానంలో ప్రయాణిస్తూ గతంలో జీవిస్తూ ఉండటం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ప్రస్తుత కాలంలో ఎంతోమంది చేస్తున్న పని అదే.. 

"మా తాతలు నేతులు త్రాగారు మీరు మా మూతులు వాసన చూడండి," అన్నాడట వెనకటికొకాయన. కొందరికి తమ పూర్వీకులు చాలా గొప్పవారని వీరు వారి సంతతి వారేనని మన సాంప్రదాయం సంస్కృతి వారిలో కూడా వారసత్వంగా వచ్చిందని గొప్పలు చెప్పకుంటూ వుంటారు చాలామంది. 

సూర్యునికి  ఎదురుగా నిలబడితే మనిషి తన నీడను కూడా తాను చూసుకోలేడు. అలాగే గతంలో జీవించడం అలవరచుకుంటే ప్రస్తుత జీవితం శూన్యమవుతుంది. ఈ విషయం ఎంత చెప్పినా ఎవరికీ అర్థం కాదు. 

యుద్ధం జరిగిన దేశాలలో ఎంతో ఆస్తి నాశనమయిన వారిని మనం చూశాం ఎంతో ధనం, ఎన్నో భవంతులు, మరెన్నో ఫ్యాక్టరీలు పోగొట్టుకుని నేలమట్టమయిన ధనికుల చరిత్రలను మనం చూస్తూ ఉంటాం. అంతటి ప్రాభవాన్ని చవిచూసిన ప్రభుద్దులు అంతా కోల్పోయాక బ్రతకడం కోసం ఒక చిన్న ఉద్యోగిగా మారి,  మరోక వ్యక్తి దగ్గర గుమాస్తాగానో, వేరే ఇంకో పనో  పనిచేస్తూ ఉంటారు. చిన్న చిన్న షాపులలో సెల్స్ మెన్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వారు ఎంతోమంది ఉంటారు. వారు అవకాశం దొరికితే కమ గత వైభవాన్ని చెప్పుకోలేకుండా వుండలేరు. మేము ఒకప్పుడు బాగా వున్నవారమే. బ్రతికి చెడ్డవారం అంటూ వాపోతారు.

 ఆ రోజుల్లో మీరు మా  ఇంటికి వచ్చివుంటే మిమ్మల్ని ఏ విధంగా అతిధ్యంతో ముంచెత్తేవాడినో... అంటూ గతంలోకి పోయి నాటి సుఖ భోగాల గుర్తులలోనూ, , ఆలోచనా పరంపరలతోనూ  తన గత వైభవ చరిత్రను కథలు కథలుగా వినిపిస్తారు. అది నిజమే కావచ్చు కాని మనకు అదంతా గత చరిత్ర క్రింద అనిపిస్తుంది. 'గతజల సేతు బంధనం దేనికి' అనిపిస్తుంది.

ప్రస్తుతం అటువంటి చరిత్రలని ఆదరించి ఆదుకునేవారు మన నవసమాజంలో కనిపించరు. గతాన్ని ప్రస్తుతంతో పోల్చడం ఎవరికి ఇష్టం ఉండదు. అదంతా యదార్ధమే కావచ్చు కాని ప్రస్తుతానికి చరిత్ర అనేది అప్రస్తుతం, లాభంలేని వ్యర్థ కాలక్షేపానికి మాత్రమే అలాంటివన్నీ ఉపకరిస్తాయి.  అలాంటి కథలన్నీ వినడానికి అంత ఓపిక ఎవరికీ లేదు.  ఈ రోజుల్లో నీ పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తారు కాని,  ఎప్పుడో గడిపిన సుఖ సంతోషాల గురించి, సమస్తం చెయ్యి జారిపోయిన తరువాత పూర్వం బ్రతికిన రోజుల గురించి ఎవరికీ అవసరం లేదు.

 కొందరు వ్యక్తులు ఇలా చెప్పేటప్పుడు ఉన్నఫీ ఉన్నట్టు చెబుతూ ఉంటారు. అయితే మరికొందరు ఆనాటి వైభోగం ఏదీ ఇప్పుడు లేదు కాబట్టి, ఇప్పుడు తనని ఎవసరూ ఆధారాలు చూపించమని అడగరు కాబట్టి లేనివన్నీ కల్పించి కథలు అల్లుతారు.  అందులో మూడు వంతులు ఆతిశయోక్తులే ఉంటాయి. దురదృష్టవశాత్తు ప్రపంచంలో అనేక ప్రమాదాలు సంభవించి ఎన్నో కోట్లమంది నిరాశ్రయులుగా మారిపోయారు. కొన్ని ప్రాంతాలు ప్రపంచపటం నుంచే తొలిగిపోయాయి. కోట్లాది ఆస్తులు నామరూపాలు లేకుండా పోయాయి. కాని రుజువులు లేని నిజాలను మనం విశ్వసించం, అది మానవ నైజం. పోయిందని చెబితేనే నమ్మం అలాంటిది జరిగిపోయిన వాటిని కథలుగా చెప్పుకుంటూ ఉండటం ఎంతవరకు అవసరం.

బహుశా కొందరు తమ గత జీవితాన్ని గుర్తుచేసుకుని వాస్తవంలో ఇలా ఉన్నామే అని బాధపడుతూ ఉంటారు. ఎన్నో సుఖాలు అనుభవించిన జీవితం కష్టాల మధ్య ఇబ్బందులు పడుతూ ఉండాల్సి వస్తోందే అని సంఘర్షణకు గురవుతుంది. కానీ గతాన్ని ఆలోచించడం వల్ల, దాని గురించి ఇతరులకు చెప్పుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏమి ఉండదని తెలుసుకోవాలి. గతం ఏమీ లేదని, వర్తమానమే జీవితానికి మొదలు అని తనకు తాను చెప్పుకుని సాగిపోవాలి. అప్పుడే జీవితంలో ముందుకు సాగగలడు.

                                        ◆నిశ్శబ్ద.