నేషనల్ ప్రోటీన్ డే.. ప్రోటీన్ కు దారి ఇలా!

ఆహారమే అమృతం అంటారు. మనం తీసుకునే ఆహారమే మన శరీరానికి శక్తిని అందిస్తుంది. అయితే మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్ అనేది కీలకం. ప్రోటీన్ శరీరానికి  అవసరమైన స్థూల పోషకం, ఇది కణజాలాలను నిర్మించడంలో మరియు మరమ్మత్తు చేయడంలో, హార్మోన్లను నియంత్రించడంలో మరియు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది.  తగినంత ప్రోటీన్ తీసుకోవడం చాలా ముఖ్యం అయినప్పటికీ మనం తీసుకునే ప్రోటీన్ లు ఆరోగ్యకరంగా, సమర్థమంతమైన శక్తిని అందించ గలిగేగా ఉండాలి. అలాంటి ప్రోటీన్ ను తీసుకోవడం ముఖ్యం.  చాలా మంది తమ ఆహారంలో తగినంత ప్రోటీన్ తీసుకోవడానికి కష్టపడతారు, ప్రోటీన్స్ సరిపడిన మోతాదులో శరీరానికి అందకపోతే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.   జాతీయ ప్రోటీన్ దినోత్సవం సందర్భంగా  దినచర్యలో మరింత అధిక-నాణ్యత గల ప్రోటీన్‌ను చేర్చుకోవడంపై అవగాహన కల్పించడానికి ఆహారం ఎంపిక, మోతాదు వంటివి తెలుసుకుంటే..   లీన్ ప్రోటిన్:   టర్కీ కోడి చేపలు మరియు చిక్కుళ్ళు వంటి వాటిలో ఆరోగ్యకరమైన ప్రోటీన్ లు ఉంటాయి. వీటిలో సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇనుము, జింక్ మరియు విటమిన్ B12 వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి.  మొక్కల ఆధారిత ప్రోటీన్‌లు:  గింజలు, విత్తనాలు వంటి మొక్కల ఆధారిత ప్రోటీన్‌లు శాఖాహారులకు మంచి ఆప్షన్. వీటిలో గొప్ప పోషకాలు ఉంటాయి.  వాటితో పాటు ఫైబర్  కూడా ఎక్కువగా ఉంటుంది.  గుడ్లు వెరీ గుడ్డు.. :  గుడ్లు ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం, అలాగే విటమిన్ D, విటమిన్ B12 కూడా ఉంటుంది.   గిలకొట్టిన, గట్టిగా ఉడకబెట్టిన లేదా ఆమ్లెట్‌ల వంటి వివిధ మార్గాల్లో గుడ్లను  ఆహారంలో చేర్చుకోవచ్చు.    ప్రోటీన్ పౌడర్‌:  ఇప్పట్లో ప్రోటీన్ పౌడర్ లు బోలెడు. ఈ ప్రోటీన్ పౌడర్లు  ప్రొటీన్‌లను ఆహారంలో జోడించడానికి అనుకూలమైన మార్గం, కానీ అధిక-నాణ్యత కలిగిన,  కనిష్టంగా ప్రాసెస్ చేయబడిన బ్రాండ్‌ను ఎంచుకోవడం ముఖ్యం.  అలాగే ప్రోటీన్ పౌడర్‌లలో చక్కెరలను, అందులో జోడించిన ఇతర పదార్థాలను  గుర్తుంచుకోండి. సమతుల్య భోజనం:  భోజనాన్ని ప్లాన్ చేసేటప్పుడు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చడం లక్ష్యంగా పెట్టుకోవాలి.  ఇది మీరు ఎంత ప్రోటీన్ పొందుతున్నారని నిర్ధారించుకోవడంలో సహాయపడటమే కాకుండా  సంతృప్తిని పొందేలా చేయడంలో సహాయపడుతుంది.  స్నాక్ స్మార్ట్: స్నాక్స్ కొన్ని అదనపు ప్రొటీన్‌లను చొప్పించడానికి గొప్ప అవకాశం.  కొన్ని ఆరోగ్యకరమైన ప్రోటీన్-ప్యాక్డ్ స్నాక్ ఎంపికలలో గ్ పెరుగు, చీజ్,  కూరగాయలతో తయారుచేసే పదార్థాలు మంచి స్నాక్స్ లిస్ట్.  గమనిక ముఖ్యం:  ప్రోటీన్ ముఖ్యమైనది అయితే, దానిని అతిగా తీసుకోకపోవడం కూడా ముఖ్యమే.  ప్రతి భోజనానికి ఇంత మోతాదు ప్రోటీన్ తీసుకోవాలని గుర్తుపెట్టుకుంటే శరీరానికి సరిపడినంత తీసుకోవచ్చు.   హైడ్రేటెడ్‌గా ఉండాలి:  తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి, ప్రోటీన్ వంటి పోషకాలను శోషించడంతో సహా మొత్తం ఆరోగ్యానికి తగినంత నీరు త్రాగడం చాలా ముఖ్యం.  రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని లక్ష్యంగా పెట్టుకోండి మీ ఆహారంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్ మూలాలను చేర్చడం మొత్తం శరీర ఆరోగ్యానికి అవసరం.  లీన్ ప్రోటీన్ మూలాలను ఎంచుకోవడం, మొక్కల ఆధారిత ప్రోటీన్లను కలుపుకోవడం,  భోజనాన్ని సమతుల్యం చేయడం ద్వారా శరీర అవసరాలకు తగినంత ప్రోటీన్ లభిస్తుంది.                                             ◆నిశ్శబ్ద.

ఆలోచనా దినోత్సవం ఆడబిడ్డల అస్త్రం!

అప్పుడెప్పుడో అభిషేక్ బచ్చన్ ఐడియా సిమ్ యాడ్ లో one idea can change your life అని చెప్పాడు. ఆ సిమ్ యాడ్ గురించి ఏమో కానీ.. ఒక్క ఆలోచన అయితే జీవితాన్ని మారుస్తుందని దృఢంగా చెప్పవచ్చు. ఒక్క ఆలోచనతో, ఒక్క నిర్ణయంతో తమ జీవితాలలో గొప్ప మార్పులు సాధించుకున్న వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఆలోచనల పరంపర ఎందుకంటే.. అన్నిటికీ ఓ దినోత్సవాన్ని పెట్టేసిన ప్రపంచ అభివృద్ధికి పాటు పడినవారు ఈ ఆలోచనలకు కూడా ఒక రోజును కేటాయించారు. అది కూడా ఊరికే ఆలోచించడం కాదు. బాలికలు, మహిళలు వారి సమస్యల గురించి ఆలోచించడం, పరిష్కార దిశగా ప్రపంచాన్ని నడిపించడం ఇందులో ముఖ్య ఉద్దేశ్యం. అసలు ఏమిటి ఈ ఆలోచనా దినోత్సవ ముఖ్య ఉద్దేశం:- ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 22న ప్రపంచ ఆలోచనా దినోత్సవాన్ని జరుపుకుంటారు.  150కి పైగా దేశాల్లోని 10 మిలియన్ల బాలికలు  నిధులను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మహిళలు అందరూ తమ మధ్య ఒకానొక సోదరీబంధం, స్నేహ బంధంతో మహిళా సాధికారతకు అడుగులు వేయడం జరుగుతుంది. ఇదే అంశాన్ని ఈ ఆలోచనా దినోత్సవం గుర్తించి మహిళా సాధికారతను మనఃపూర్వకంగా గౌరవిస్తుంది.  ప్రపంచ ఆలోచనా దినోత్సవం మహిళాల గౌరవాన్ని నొక్కి చెప్పే ముఖ్యమైన దినం.     ప్రపంచ ఆలోచనా దినోత్సవం ప్రాముఖ్యత:-  ప్రపంచ ఆలోచనా దినోత్సవం రోజు మహిళలు బాలికలకు వారి అభిప్రాయాలను తెలియజేయడానికి, వారికి సంబంధించిన అంశాలను చర్చించడానికి వాటికి ప్రపంచ స్థాయిలో పరిష్కారాలను అందించడానికి ఒక పెద్ద వేదికగా మారుతుంది.   దీని చరిత్ర ఏంటంటే.. ప్రపంచ ఆలోచనా దినోత్సవం ఆవశ్యకతను 1926లో నాల్గవ మహిళా స్కౌట్ అంతర్జాతీయ సదస్సులో ప్రస్తావించారు.  ఫిబ్రవరి 22ని థింకింగ్ డేగా అంకితం చేసేందుకు సదస్సు అంగీకరించింది.  బాయ్ స్కౌట్స్ ఆఫ్ అమెరికాను స్థాపించిన లార్డ్ బాడెన్-పావెల్. ఈయన భార్య ఈ  సంస్థ యొక్క మొదటి గ్లోబల్ హెడ్ గైడ్‌. వీరిద్దరూ ఫిబ్రవరి 22న జన్మించారు.  ఆరు సంవత్సరాల తరువాత, 1932లో పోలాండ్‌లోని బుజ్‌లో జరిగిన 7వ ప్రపంచ సదస్సులో వారి పుట్టిన రోజు సందర్భంగా  బహుమతులు ఇవ్వబడతాయని తెలిపారు. దీనివల్ల బాలికల ఆలోచనా దినోత్సవానికి అదొక గొప్ప విరాళం లాగా మారింది. ఈవిధంగా థింకింగ్ డే కు రూపకల్పన జరిగింది.   ఈ ఏడాది ఆలోచనా అంశం ఏమిటంటే.. 'మన ప్రపంచం, మన శాంతియుత భవిష్యత్తు' అనే నినాదం ఈ సంవత్సరం ఆలోచనా దినోత్సవ అంశం. ఈ వ్యవస్థ నుండి మనం ఏమి అర్థం చేసుకోగలమో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికలకు మరింత సురక్షితమైన మరియు ప్రశాంతమైన భవిష్యత్తును నిర్మించడానికి ప్రకృతితో మనం ఎలా సహకరించవచ్చో ఇది విశ్లేషిస్తుంది. ఆలోచన అనేది రేపటిని మరింత ఆశాజనకంగా ఉండేలా చేస్తుంది కాబట్టి ఆలోచన మీ ఆయుధం కావాలి.                                     ◆నిశ్శబ్ద.

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం... భాషను కాపాడుకోవాలిప్పుడు..

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం…అనగానే... తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్లకు తెలుగే ఒక మూలధనం.. తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా… దేశమాత స్వేచ్చకోరి తిరుగుబాటు చేయరా.. నా పాట తేట తెలుగు పాట నా పాట తేనెలొలుకు పాట పూలతోటలకు పరిమళమిచ్చే ఘుమ ఘుమ పాట… అబ్బా . ఎన్నెన్ని మంచి పాటలు కదా… మాతృభాషా దినోత్సవమంటే సభలూ సమావేశాలు పెట్టేసి.. పాటలు, ఉపన్యాసాలు దంచి కొట్టేసి.. హమ్మయ్య మనం తెలుగు భాష కోసం పాటుపడుతున్నాం అనుకుని సభల్లో బాగా మెక్కి ఇంటికెళ్లిపోవడం. ఆ తరువాత ఎక్కడ చూసినా ఇంగ్లీషులో మాట్లాడుతూ, ఇంగ్లీషులో మునిగి తేలుతూ.. తమ పిల్లలను అచ్చంగా ఇంగ్లీషు భాషలోనే పెంచుతూ తెలుగుకు మంగళం పాడేస్తుంటారు. ఇదేనా తెలుగు భాషకు పాటు పడటం.  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఒక దేశానికి ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి మాత్రమే సంబంధించినది కాదు. ఇది ప్రపంచం మొత్తానికి సంబంధించినది. అసలు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఎలా వచ్చిందో తెలుసా.. 1947 లో భారతదేశం, పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు పాకిస్తాన్ భౌగోళికంగా రెండు భాగాలుగా ఏర్పడింది. వాటిలో  ఒకటి తూర్పు పాకిస్తాన్ కాగా  రెండవది పశ్చిమ పాకిస్తాన్. తూర్పు పాకిస్తాన్ ను ప్రస్తుతం బంగ్లాదేశ్ అంటున్నాం. రెండవ భాగం  పాకిస్తాన్ గా ఉంది. అయితే అప్పటికి రెండు భాగాలలో భాష, సంస్కృతి వేరువేరుగా ఉండేది. భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిన తరువాత పాకిస్తాన్ ప్రభుత్వం తమ జాతీయ భాషగా ఉర్ధూను ప్రకటించింది. ఇది బంగ్లా ప్రజలకు పెద్ద సమస్యగా మారింది. తూర్పు పాకిస్తాన్ లో ఎక్కువ శాతం ప్రజలు బంగ్లా మాట్లాడతారు. అందుకే వారికి పాకిస్తాన్ ప్రభుత్వ నిర్ణయం నచ్చలేదు. ఉర్దూతో పాటు బెంగాలీ కూడా జాతీయభాషగా ఉండాలని డిమాండ్ చేశారు.  తూర్పు బంగ్లా ప్రజలు అదే విషయాన్ని పాకిస్తాన్ రాజ్యాంగ సభలో లేవనెత్తారు. నిరసన చేపట్టారు. దీన్ని అణిచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం 144 సెక్షన్, ఇంకా అనేక నిబంధనలు విధించింది. దానికి వ్యతిరేకంగా డాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారు. 1952 ఫిబ్రవరి 21 న ర్యాలీలో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సలాం, బర్కాట్, రఫీక్, జబ్బర్, షఫియూర్ మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. దీనికి నిరసనగా పాకిస్తాన్ లీగ్ అదే రోజు పార్లమెంటర్ పార్టీకి రాజీనామా చేశారు. 1956 లో పాకిస్తాన్ మొదటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ఆర్టికల్ 214 లో బెంగాలీ ఉర్దూలను పాకిస్తాన్ రాష్ట్ర భాషలుగా పేర్కొంది. 1971 లో బంగ్లాదేశ్ స్వతంత్రమైనప్పుడు, బెంగాలీ ఏకైక రాష్ట్ర భాషగా ప్రవేశపెట్టబడింది. యునెస్కో బంగ్లా భాషా ఉద్యమం, మానవ భాష సాంస్కృతిక హక్కులను పురస్కరించుకుని 1999 ఫిబ్రవరి 21, న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ప్రకటించింది. ఇలా ప్రపంచంలో ఉన్న చిన్న పెద్ద భాషలు అన్నిటినీ కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే..  మనకు అవసరం కోసం, పై చదువుల కోసం ఎన్ని భాషలు అవసరమైన అవన్నీ అక్కరకు మాత్రమే.. మాతృభాష అనేది తప్పక ప్రతిఒక్కరి జీవితంలో ఉండాలి. మాతృ అనే పదంలోనే అది అమ్మ భాష అనే అర్థం ఉంది. మాతృ భాషను వదులుకుంటే అమ్మను కాలదాన్నినట్టే.. కాబట్టి పరభాషను గౌరవించాలి, ఆదరించాలి, మన భాషను ప్రేమించాలి, పోషించాలి, ఎప్పటికీ నిలుపుకోవాలి.. అంతేకానీ ఒకరోజు ముచ్చటగా ముగించకూడదు. ఏ దేశమేగినా..ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము.. ఇందులోనే ఈ జాతిలోనూ.. ఈ భూమిలోనూ మన తెలుగు భాష ఉంది. దాన్ని నిలబెట్టుకోవాలి.                                      ◆నిశ్శబ్ద.

మరాఠా యోధుడు జయంతి!!

భారతదేశ చరిత్రలో ఎంతో మంది వీరులు ఉన్నారు. వారిలో  ధైర్యసాహసాలు, వీరత్వం, ఎంతో గొప్ప చరిత్ర కలిగిన వారిని కూడా కాచివడపోస్తే అందులో ఖచ్చితంగా నిలబడగలిగేవాడు శివాజీ. విశాల మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి, పేరు చెబితేనే శత్రువుల గుండెలు దడదడలాడేలా భారత  చరిత్రలో ఓ గొప్ప యోధుడిగా, ఛత్రపతి బిరుదాంకితుడిగా నిలిచిపోయిన శివాజీ రావ్ భోంస్లే పూణే జిల్లాలోని జున్నార్ పట్టణం దగ్గర శివనేరి కోటలో షానాజీ, జిజియాబాయి దంపతులకు ఫిబ్రవరి 19, 1630వ సంవత్సరంలో జన్మించాడు. బాల్యపు చిగురులు!! శివాజీ తండ్రి షానాజీ బీజాపూర్ సుల్తానుల వద్ద జాగీర్దారుగా పనిచేసేవాడు. ఇతడు నిజాం రాజులను ఓడించి సంపాదించుకున్న రాజ్యాన్ని మొఘలులు ఆదిల్షాతో కలసి షానాజీని ఓడించారు. అప్పుడు ఆదిల్షా మరియు షానాజీ మధ్య జరిగిన ఒప్పందం కారణంగా ఆ ప్రాంతాన్ని వదిలి అక్కడి నుండి నేటి బెంగుళూరు ప్రాంతానికి జాగీరుగా వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు జిజియాబాయిని, శివాజీని అక్కడే వదిలి వెళ్ళాడు షానాజీ. తండ్రి షానాజీ, తల్లి జిజియాబాయి ఇద్దరూ మరాఠా సామ్రాజ్య స్థాపన కోసం చేసిన ప్రయత్నాలను చిన్నతనంలో చూసిన శివాజీ, తండ్రి బెంగుళూరు వెళ్లిపోగానే తల్లిదగ్గర రామాయణ, భారతాలు, పురాణాలు, వాటిలోని నీతి, యుద్ధ విషయాలు, స్త్రీపట్ల గౌరవంగా ఉండటం, పరమతాలను గౌరవించడం, ఎవ్వరికీ చెడు తలపెట్టకుండా మంచితనంతో ఉండటం వంటి విషయాలను చక్కగా తెలుసుకున్నాడు. రామాయణ, భారత, హిందూ దర్మాల ప్రత్యేకతను, వాటిలో విశిష్టతను తెలుసుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే ద్యేయంగా మనసులో పెట్టుకున్నాడు. యోధుడిగా అడుగులు!! తల్లి చెప్పిన మంచి మాటలు, పురాణాలలో దాగిన నీతి, తండ్రికి ఎదురైన అనుభవాలు ఇవన్నీ శివాజీకి చిన్నతనంలోనే గొప్ప ఆలోచనలను, మరాఠా సామ్రాజ్య స్థాపన అనే లక్ష్యాన్ని మనసులో నాటాయి. మొఘలులు భారతదేశం మీద పడి హిందూ మతాన్ని నీరుగారుస్తున్న దశలో శివాజీ వాళ్ళను ఎంతో నేర్పుగా ఎదుర్కొని హిందూధర్మాన్ని కాపాడిన వ్యక్తిగా, శక్తిగా నిలిచిపోయాడు. భైరాంఖాన్ పర్యవేక్షణలో ఎంతో గొప్పగా పదునుదేరిన శివాజీ తన 17 సంవత్సరాల ప్రాయం నుండి యుద్ధాలు చేయాడం మొదలుపెట్టి సుల్తానుల కోటలను స్వాధీనం చేసుకోవడం మొదలుపెట్టాడు. ఇవన్నీ చూసి ఓర్వలేని ఆ సుల్తానులు శివాజీ తండ్రిని అకారణంగా బంధించినప్పుడు శివాజీ, శంబాజీ ఇద్దరూ కలిసి ఆ సుల్తాల మీద యుద్ధం చేసి తండ్రిని సురక్షితంగా విడిపించుకున్నారు. ఆ తరువాత సుల్తానులను, మొఘలులను వరుసగా జయిస్తూ మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించుకోసాగాడు. యుద్ధ నైపుణ్యం!! శివాజీకి తన తండ్రి నుండి లభించింది కేవలం రెండువేల మంది సైనికులు అయితే దాన్ని పదివేల సమర్త్యానికి పెంచుకోవడంలో ఎంతో గొప్ప నైపుణ్యం ఉంది. అలాగే యుద్దానికి వ్యూహాలు రచించడంలో కూడా శివాజీ గొప్ప దిట్ట. ఇతను అనుసరించే వ్యూహాలు నాటి కాలానికి అసలు పరిచయం లేనివి. వీటిలో ముఖ్యంగా ప్రపంచానికి అప్పటివరకు పరిచయం లేని గెరిల్లా పోరాటం శత్రువులను ఎంఘో భయానికి గురుచేసేది.  రాశి కన్నా వాశి మిన్న అనే మాట శివాజీ సైన్యానికి సరిపోతుంది.  తన సైన్యాన్ని ఎంతో  నైపుణ్యంతో ఉత్తమంగా ఉంచుకునేవాడు శివాజీ. ఈయన దగ్గర ఎంతో ఉత్తమమైన సైనికులు ఉండేవారు. అలాగే సమర్థమవంతమైన సైన్యాధిపతి తానాజీ శివాజీ బలగంలోని వాడే.  పరమతాన్ని అధరించినవాడు!! హిందూవ్యతిరేక రాజ్యాలు, రాజుల మీద యుద్ధం చేసినా ముస్లిం మతస్థులను ఎవరినీ ఏ విధంగానూ ఇబ్బంది పెట్టని మనస్తత్వం శివాజీది. ఈయన ఎన్నో మసీదులను కట్టించాడు. తన దగ్గర పనిచేసేవాళ్లలోనే ఎంతోమంది ముస్లింలను ఉంచుకున్నాడు. బీజాపూర్ సుల్తానులను ఓడించడానికి ఔరంగజేబుకు సహాయపడ్డాడు, తన కూతురును కూడా హిందూమతం స్వీకరించిన ముస్లిం వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసాడు. ఇంకా ఈయన సైనికులలో కూడా ముస్లింలు చాలామంది ఉండేవాళ్ళు.  రాజులను ఓడిస్తే ఆ రాజుల భార్యలను, వారి కుటుంబంలో ఆడవాళ్లను కూడా తెచ్చుకునేవారు కొంతమంది. అయితే ఒకసారి ఒక ముస్లిం రాజు ఓడిపోయినప్పుడు అతడి కొడలును శివాజీ ముందు నిలబెడితే "మా అమ్మ మీలా అందంగా ఉంటే, నేను కూడా అందంగా ఉండేవాడినేమో"అని చెప్పి ఆ మహిళను తల్లితో పోల్చి, ఆమెను ఎంతో గౌరవంగా తిరిగి వెనక్కు పంపేసాడు శివాజీ. ఇది ఆయనలో ఉన్న వ్యక్తిత్వ విలువకు ఒక మచ్చుతునక మాత్రమే. చివరిలో!! సుమారు ఇరవై ఏడు సంవత్సరాల పాటు యుద్ధాలు చేసి భారతీయ రాజులకు అందరికీ ఎంతో ఆదర్శంగా నిలిచిన ఛత్రపతి శివాజీ తన యాభై మూడు సంవత్సరాల వయసులో మూడు వారాల పాటు విపరీతమైన జ్వరంతో బాధపడి దాన్నుండి కొలుకోలేక తుదిశ్వాస విడిచాడు. ఈయన ఆ కాలానికే పటిష్టమైన నిఘా వ్యవస్థ, నౌకాదళ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తీరు ఇప్పటి విశ్లేషకులను కూడా అబ్భురపరుస్తూనే ఉంది. ఈయన శౌర్య ప్రతాపాలు దేశాన్ని చైతన్యం వైపు నడిపిస్తూనే ఉంటాయి. ◆ వెంకటేష్ పువ్వాడ  

ప్రపంచాన్ని పునీతం చేసే దయాగుణం!

ఈ ప్రపంచంలో ఎన్నో మనస్తత్వాల మనుషులు ఉంటారు. ఒక్కొక్కరిలో ఒక్కొ గుణం మనకు అనుభవంలోకి వస్తుంది. అయితేయాన్ని గుణాలలోకి దయ చాలా గొప్పదని అంటారు. శత్రువులను కూడా క్షమించి తనవారిలా మార్చుకునే లక్షణాన్ని దయ మనుషుల్లో పెంపొందిస్తుంది.  దయ గురించి సుమతీ శతక కర్త ఇలా చెబుతాడు.. తన కోపమె తన శత్రువు, తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమె స్వర్గము, తన దుఃఖమె నరక మండ్రు తథ్యము సుమతీ!! దయ మనిషికి చుట్టంలాగా ఉంటే అది మనిషి జీవితాన్ని స్వర్గతుల్యం చేస్తుంది. ఇప్పుడు ఈ దయ గురించి ఎందుకంత చర్చ అనే అనుమానం అందరికీ వస్తుంది. అయితే.. మనిషిలో దయా గుణం పెంపొందడానికి, దయా గుణం ఇతరుల పట్ల చూపించవలసిన ఆవశ్యకత గురించి చర్చించడానికి ఒకరోజు కేటాయించారు. అదే "National Rondom Acts Of Kindness Day".. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీన "నేషనల్ రాండం యాక్ట్స్ ఆఫ్ కైండ్ నెస్ డే" జరుపుకుంటారు. ఈ ప్రపంచంలో ఈ దినోత్సవాలను జరుపుకోవడం కంటే ముందే భారతీయ ధర్మంలో జాలి, కరుణ, దయ మొదలైన గుణాలను పెంపొందించుకోవాలని నీతి కథల నుండి పురాణ కథల వరకు అన్నింటిలో భాగం చేసి చెప్పారు. బుద్ధుడు అన్నాడు దయ, కరుణ మనుషుల్లో ఉండాలని, అవి అహింసను రూపుమాపే గొప్ప ఆయుధాలు అవుతాయి. అడుగు అడుగులో..పలుకు పలుకులో చిన్నతనం నుండి పిల్లలకు నీతి కథలు, నీతి వాక్యాలు, దయ, కరుణ వంటి గుణాలు నూరిపోస్తూ పెంచుతాం. అయితే ఈ జాలి, కరుణ, దయ అనేవి కేవలం మాటల్లో చెప్పుకునేవి కాదు. చేతల్లో చూపించాల్సినవి.  మనం ఒకరి పట్ల దయతో, ప్రేమతో ప్రవర్తిస్తే.. ఇతరులు ఇంకొకరి పట్ల అదే విధంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఈ ప్రపంచంలో మనిషి తనకు ఏ అనుభూతి ఎదురైతే అదే ప్రపంచంలో ఉందని గట్టిగా విశ్వసిస్తాడు. హింసకు గురయ్యే మనిషి ప్రపంచమంతా హింసే.. ప్రతి వ్యక్తి ఇతరులను హింసకు గురిచేస్తూ ఉంటారని అనుకుంటారు. అదే ఒక వ్యక్తికి దయాపూరిత అనుభవం ఎదురైతే ఆ మనిషి ఈ ప్రపంచంలో మంచితనం, మంచి మనుషులు, మంచి గుణాలు ఉన్నాయని నమ్ముతాడు. తాను కూడా ఇతరుల పట్ల దయ చూపించడం చేస్తాడు.  ఇలా ఇతరుల పట్ల దయ చూపించడం అనేది ఓ మంచి గుణాన్ని తమ నుండి తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి వ్యాప్తం చేస్తుంది. కష్టాల్లో ఉన్నవారిని, ప్రకృతీ విలయాల కారణంగా అనాథలుగా మారిన వారిని, ఒంటరితనంతో కొట్టుమిట్టాడుతున్న వారిని, వృద్ధులను జీవితంలో ఎంతోమంది ఎన్నో రకాల సమస్యలలో చిక్కుకుపోయి ఉంటారు వాళ్ళందరినీ కూడా సగటు మనిషిగా ఆదుకోవచ్చు. జంతువులు, మనుషులు, మొక్కలు, ఈ ప్రపంచాన్ని ఆవరించి ఉన్న సకల జీవరాశులు కూడా దాయా గుణానికి చలిస్తాయి. కాబట్టి దయ అనేది మనిషిని ఉన్నతంగా మారుస్తుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచానికి దయను అందించండి.. ఈ ప్రపంచాన్ని ఒకానొక దయాపూరిత గుణంతో నింపండి.                                  ◆నిశ్శబ్ద.

భారతదేశానికి సినిమా రుచి చూపించిన ఘనుడు  దాదాసాహెబ్!

కాంతార ఫేమ్ రిషబ్ శెట్టికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. ఎక్కడ చూసినా ఈ వార్తే… అయితే ఫిబ్రవరి 16న దాదాసాహెబ్ ఫాల్కే మరణించారు. ఈయన వర్ధంతిని స్మరించుకుంటూ ప్రతిభావంతులకు ఈ అవార్డ్ అందజేస్తారు. ఈ సందర్భంగా దాదాసాహెబ్ ఫాల్కే గురించి సినిమా వైపు ఆయన ప్రయాణం గురించి తెలుసుకుంటే.. దాదాసాహెబ్ ఫాల్కే అసలు పేరు ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే.  అతను బ్రిటీష్ ఇండియాలోని త్రయంబక్‌లో (ప్రస్తుతం భారతదేశంలోని మహారాష్ట్రలో) ఏప్రిల్ 30, 1870న జన్మించాడు.  ఆయనను 'ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా' అని పిలుస్తారు.  ఈయన సృజనాత్మక కళలపై గొప్ప ఆసక్తిని కలిగి ఉన్నాడు.  1944 ఫిబ్రవరి 16న మహారాష్ట్రలోని నాసిక్‌లో మరణించాడు.  దాదాసాహెబ్ ఫాల్కే జీవితం, కొన్ని ఆసక్తికరమైన విషయాలను చూస్తే.. దాదాసాహెబ్ ఫాల్కే భారతీయ ప్రజలకు సినిమా అనుభవాన్ని, అందులో అందాన్ని పరిచయం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వినోద పరిశ్రమ అయిన సినిమా పరిశ్రమను అభివృద్ధి చేశారు.  భారతదేశ మొట్టమొదటి పూర్తి నిడివి చలనచిత్రం రాజా హరిశ్చంద్ర (1913) రూపొందించాడు.   భారతదేశం గొప్పగా చెప్పుకునే  సినిమా నిర్మాత, దర్శకుడు, సినిమా రచయిత, కథకుడు, సెట్ డిజైనర్, డ్రెస్ డిజైనర్, ఎడిటర్, డిస్ట్రిబ్యూటర్ మొదలైనవన్నీ ఈయనే.  అందుకే భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో ఒకటైన "దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్" ఈయన  పేరు మీద ప్రారంభించబడింది, ఇది 'లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్' భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రతిభ కనబరిచిన వారికి అందించబడుతుంది.   దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ 1969లో సమకాలీన భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన అందించిన సేవలను స్మరించుకునే ఉద్దేశంతో స్థాపించబడింది.  భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో కూడిన కమిటీ ఫాల్కే అవార్డు విజేతను ఎంపిక చేస్తుంది.  ఇది సినిమా రంగంలో భారతదేశపు అత్యున్నత పురస్కారం.  సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా ఏటా జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో దీనిని అందజేస్తారు. దాదాసాహెబ్ ఫాల్కే 30 ఏప్రిల్, 1870 న మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా సమీపంలోని త్రయంబకేశ్వర్ పట్టణంలో జన్మించారు.  ఈయన  తన ప్రాథమిక విద్యను 1885లో ముంబయిలోని సర్ J.J స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో పూర్తి చేశాడు. 1890లో అతను డ్రాయింగ్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ గురించి అధ్యయనం చేయడానికి గుజరాత్‌లోని వడోదరకు వెళ్లాడు. గోద్రాలో (గుజరాత్), దాదాసాహెబ్ ఫాల్కే ఫోటోగ్రాఫర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు, అయితే ప్లేగు వ్యాధి కారణంగా ఈయన మొదటి భార్య, బిడ్డ మరణించిన తర్వాత ఫోటోగ్రఫీ పనిని విడిచిపెట్టాడు.  ఆ తర్వాత కొత్త టెక్నాలజీలను తెలుసుకునేందుకు జర్మనీ వెళ్లాడు. పాఠశాల సమయం నుండే ఈయన  మ్యాజిక్‌పై  ఆసక్తిని పెంచుకున్నాడు.  ఆ సమయంలో అతను వివిధ రకాల స్పెషల్ ఎఫెక్ట్‌లను కూడా ప్రయోగించాడు.  జర్మనీలో అతను కార్ల్ హెర్ట్జ్ అనే ఒక మాంత్రికుడిని కలుసుకున్నాడు, అతనితో కలిసి పనిచేశాడు.  కొంతకాలం తర్వాత అతను ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లో డ్రాఫ్ట్స్‌మ్యాన్‌గా పనిచేసే అవకాశాన్ని పొందాడు. అయితే ఆసక్తి లేకపోవడంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి మళ్లీ మహారాష్ట్రకు వచ్చాడు.  అక్కడ, అతను ప్రింటింగ్ ప్రెస్ వ్యాపారాన్ని ప్రారంభించాడు.  ముంబైలోని ‘అమెరికా-ఇండియా థియేటర్’లో ఫెర్డినాండ్ జెక్కా రూపొందించిన మూకీ చలన చిత్రం "ది లైఫ్ ఆఫ్ క్రైస్ట్" చూసినప్పుడు అతని జీవితం మలుపు తిరిగింది. "రాజా హరిశ్చంద్ర"ని పూర్తి నిడివి చలనచిత్రంగా రూపొందించాలని నిర్ణయించుకున్నాడు.  ప్రధాన పాత్ర కోసం అందమైన నటీనటుల కోసం అనేక ప్రకటనలు ఇచ్చాడు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు.  చివరకు దాదాసాహెబ్ కుటుంబం మొత్తం రాజా హరిశ్చంద్ర చిత్రాన్ని రూపొందించడంలో పాలుపంచుకున్నారు.  ‘రాజా హరిశ్చంద్ర’ చిత్రానికి నిర్మాత, దర్శకుడు, రచయిత, కెమెరామెన్ మొదలైనవారు దాదాసాహెబ్ ఒక్కరే. నటీనటుల దుస్తులు, పోస్టర్లు, సినిమా నిర్మాణాన్ని అతని భార్య నిర్వహించింది.  అతను హరిశ్చంద్రుని పాత్రను పోషించాడు. అతని 7 సంవత్సరాల కుమారుడు భాల్చంద్ర ఫాల్కే ఈ చిత్రంలో హరిశ్చంద్ర కొడుకుగా ప్రధాన పాత్ర పోషించాడు.  అలాగే, ఆ ​​సమయంలో ఏ మహిళ కూడా ఈ చిత్రంలో నటించడానికి సిద్ధంగా లేకపోవడంతో తారామతి ప్రధాన పాత్ర కోసం ఒక వ్యక్తిని ఎంపిక చేశారు.  ఈ చిత్రం మొదటిసారిగా 3 మే, 1913న ముంబైలోని కరోనేషన్ సినిమాలో బహిరంగంగా ప్రదర్శించబడింది. దాదాసాహెబ్ ఫాల్కే రాజా హరిశ్చంద్ర సినిమా మొత్తాన్ని తీయడానికి 15 వేల రూపాయలు వెచ్చించాడు.  1971లో ఈయన గౌరవార్థం ఈయన ముఖంతో కూడిన పోస్టల్ స్టాంప్‌ను ఇండియా పోస్ట్ విడుదల చేసింది. సమకాలీన భారతీయ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే అందించిన సహకారాన్ని స్మరించుకునేందుకు 1969లో ఈ అవార్డును స్థాపించారు.  ఇది డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వంచే ప్రదానం చేయబడింది.  1969లో, భారతీయ సినిమా ప్రథమ మహిళ దేవికా రాణి ఈ అవార్డు మొదటి గ్రహీత.  ఈ అవార్డులో శాలువా, రూ.  10 లక్షల రూ౹౹,  ఒక బంగారు కమలం ఉంటాయి.. దాదాసాహెబ్ ఫాల్కే అకాడమీ దాదాసాహెబ్ ఫాల్కే పేరిట మూడు అవార్డులను అందిస్తుంది. ఫాల్కే రత్న అవార్డు, ఫాల్కే కల్పతరు అవార్డు, దాదా సాహెబ్ ఫాల్కే అకాడమీ అవార్డులు. 1932లో, దాదాసాహెబ్ ఫాల్కే చివరి మూకీ చిత్రం 'సేతుబంధన్' విడుదలైంది. తర్వాత అది డబ్బింగ్‌తో విడుదలైంది.  ఈయన  1936-37 సమయంలో తన చివరి చిత్రం 'గంగావతరన్'ని నిర్మించాడు.  తన జీవితకాలంలో 95 సినిమాలు, 26 షార్ట్ ఫిల్మ్‌లు చేసాడు. ఫిబ్రవరి 16, 1944 న నాసిక్‌లో మరణించాడు.  చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సహకారం విశేషమైనది, ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది.                                          ◆నిశ్శబ్ద.

మీరు సింగిల్సా.. జర లుక్కేయండి ఇటువైపు..

షాదీ మాటే వద్దు గురూ.. సోలో బ్రతుకే సో.. బెటరూ.. అని ఎంతోమంది సింగిల్స్ పాడుకుంటూ ఉంటారు. ప్రేమలోనూ.. రిలేషన్షిప్ లోనూ.. ఎంతో విసిగిపోయి విరక్తి చెందితే తప్ప ఎవరూ అంత పెద్ద నిర్ణయం తీసుకోరు. నిన్నటికి నిన్న వాలెంటైన్స్ డే వెల్లువలా సాగింది. ఎక్కడ చూసినా హృదయం గుర్తులూ.. ప్రేమ పక్షులు, గులాబీలు, గిఫ్టులు, చాక్లెట్లు ఓయబ్బో ఈ ప్రపంచం మొత్తం మీద ఈ వాలెంటైన్స్ డే బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది. అయితే వాలెంటైన్స్ డే అనేది జంటలకే కానీ సింగిల్స్ కి కాదు కదా.. సింగిల్స్ పాపం ఒక్కరే ఒంటరి పడవ ప్రయాణం చేసుకుంటూ ఉంటారు.  ఈ ప్రపంచం మనసు చాలా దొడ్డది. ఒంటరితనానికి భరోసా ఇస్తుంది. అందులో భారగమే సింగిల్ డే..  సింగిల్స్ డే నా… ఇదోటి ఉందా?? అని అనుకుంటున్నారా?? అవునండీ బాబు సింగిల్స్ డే ఉంది. అది అక్షరాలా ఒంటరిగా ఉన్న వాళ్లకోసమే. సింగిల్స్ అవేర్‌నెస్ డే ఫిబ్రవరి 15న జరుపుకుంటారు. కాబట్టి మీరు ఒంటరిగా ఉండి, వాలెంటైన్స్ డేతో పూర్తిగా సంబంధం లేకుండా ఉండేవారు అయితే. ఇదిగో ఈ సింగిల్ డే మీకోసమే..  వాస్తవానికి, వాలెంటైన్స్ డే రోజు తమకు ఎవరూ తోడు లేకుండా ఒంటరిగా ఉన్నవాళ్లకోసం ఈ సింగిల్ అవేర్‌నెస్ డే ఏర్పాటు చేయబడింది. అయితే ఇందులో చాలా ముఖ్య ఉద్దేశాలే ఉన్నాయి. అవేంటంటే.. నిజమైన ప్రేమ.. నిజమైన ప్రేమ ఏంటో తెలుసా?? తమను తాము ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ. ఇతరులను ప్రేమించడం నిజమైన ప్రేమ కాదా అని ప్రశ్న వస్తోందేమో.. కానీ తమ మీద తమకు బాధ్యత, ఇష్టం, ప్రేమ లేకుండా ఇతరుల మీద మాత్రమే దాన్ని చూపించినప్పుడు మనిషుల్లో ఖాళితనం ఏర్పడుతుంది. ఎదుటి మనిషి దూరం వెళ్లిపోయినప్పుడు ఆ ఒంటరితనం అంతా నరకంలా అనిపిస్తుంది. అదే తమను తాము ప్రేమించుకుంటే తాను ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా తమను తాము ప్రేమించుకోవడానికి ఒంటరితనమే మంచి మార్గం. ఒంటరితం సమస్య కానే కాదు. తమకోసం తాము హాయిగా సమయాన్ని విచ్చించుకునే ఒక మంచి అవకాశం అది. పైకి బంధాలు బాగా కనిపిస్తాయి ప్రపంచం వ్యాప్తంగా.. కానీ ఒంటరిగా ఉన్నవారి శాతం ఎక్కువగానే ఉందని సర్వేలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా యుఎస్ వంటి దేశాల్లో సింగిల్ పర్సెంటేజ్ జనాభాలో సగం ఉన్నట్టు సర్వేలు వెల్లడించాయి.  ఈరోజు ప్రత్యేకత.. ఒంటరితనం మానసికంగా మనిషిని బలపరిచినా.. అది మరో విదంగా మనిషిని నిరాశకు కూడా లోను చేస్తుంది. అలాంటివారికి ధైర్యం చెప్పడం, జీవితం మీద ఆశ కల్పించడం, అందమైన భవిష్యత్తును చూపించి వారిని ముందుకు నడిపించడం ఈరోజు ప్రత్యేకతలో భాగం. కనీసం ఎప్పుడూ వారితో ఉండకపోయినా మాటలతో ఉత్తేజపరచడం చేయొచ్చు. ఒకరిని ఒకరు కలుసుకుని బహుమతులు ఇచ్చుకోవడం, ధైర్యం చెప్పుకోవడం, వినూత్నంగా సమయాన్ని గడపడం చేయొచ్చు. ఏది ఏమైనా.. ఈ సింగిల్స్ డే సింగిల్ గా ఉండేవాళ్లకు  సపోర్ట్ గా నిలుస్తుంది.                                     ◆నిశ్శబ్ద.  

పనితో ప్రేమలో పడండి

  మీరు ఎప్పుడన్నా మీ పనితో ప్రేమలో పడ్డారా ? లేదంటే వెంటనే ఆ పనిలో వుండండి. ఎందుకంటే రోజు సంతోషంగా ఉండాలంటే మీరు చేసే పనితో ప్రేమలో పడండి అంటున్నారు పరిశోధకులు . నిజానికి  చాలామందికి ఈ సీక్రెట్ తెలీక   జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నారు అంటున్నారు వారు . అదేదో బరువు మోస్తున్నట్టు  జీవితాన్ని ఎంతో కష్టం గా లాక్కు వెళుతుంటారు . అదేమంటే చేసే పని నచ్చితే కదా ! దానిని ఎంజాయ్ చేసేది అంటారు. అయితే  చేసే పని మీకు నచ్చినా నచ్చకపోయినా ముందుగా దానిని వందశాతం ప్రేమించటం మొదలు పెట్టండి.  అప్పుడు అది భారంగా అనిపించదు. అదెలా సాద్యం అంటే, చేసేపని మీద పూర్తిగా మనసుపెట్టి నప్పుడు, ఆ పని పూర్తి అయ్యేసరికి మనకి తెలియకుండానే ఒక సంతృప్తి కలుగుతుంది.      సో... మనం చేసే పనిమీద ద్రుష్టి పెట్టాం కాని , అది మనకు నచ్చినదా , కాదా అన్న విషయం మీద కాదు కాబట్టి , ఆ క్షణం లో నిజంగా ఒక పనిని సమర్దవంతం గా పూర్తి చేసినప్పుడు కలిగే ఆనందాన్ని రుచి చూస్తాం. ఈ సూత్రం  చిన్న పని నుంచి పెద్ద పని దాకా అన్నిటికి వర్తిస్తుంది. చేసే పని ఏది అయినా సరే దానిని మనస్పూర్తిగా , శ్రద్దగా చేయటం అనే చిన్న అలవాటు ఒక్కటి చాలు మనకి కొండంత సంతోషాన్ని ఇవ్వటానికి.     చేసే పని నచ్చనప్పుడు అసహనం, కోపం కలుగుతాయి . అవి ఒకదాని నుంచి ఒకదానికి పాకి పోయి, రోజుని, ఒకో సారి  మొత్తం  జీవితాన్ని నిందిస్తూ  గడిపేస్తాం. దాని వల్ల నచ్చిన పనులని కూడా ఆనందం గా చేయలేము. ఇది ఒక చైన్ లా మొత్తం జీవితాన్ని చుట్టబెట్టేస్తుంది. దాంతో సెల్ఫ్ పిటి లోకి వెళ్ళిపోయి మన జీవితం ఇలా కావటానికి కారణం అంటూ చుట్టుపక్కల వాళ్ళని నిందించటం మొదలు పెడతాం . దానివలన అనుబంధాల మద్య పొరపచ్చాలు వస్తాయి. మళ్ళి దాని నుంచి బాధ .. నైరాశ్యం ..పుట్టుకొచ్చి మనసుని అల్లకల్లోలం చేస్తాయి.    వింటుంటే ...నిజమా ? అన్న అనుమానం కలుగుతుంది కాని ఒక్కసారి మీలోపలకి మీరు ప్రయాణించి, మీ కోపానికి, అసహనానికి కారణాలని వెదకటం మొదలు పెట్టండి. మీరు చేసే పనిని మీరు ప్రేమించకపోవటమే కారణం అని తెలుస్తుంది. అంటున్నారు పరిశోధకులు. కొన్ని ఏళ్ల పాటు, వందల మందిపై వీరు జరిపిన పరిశోధనలలో బయట పడ్డ నిజం అది.   అందుకే చేసే ప్రతి పనితో ప్రేమలో పడదాం. అసలే జీవితం ఉన్నదే చిన్నది. అందులో సగం జీవితం పనిని చూసి విసుక్కోవటం తోనే సరిపోతే ఇక ఉన్న జీవితాన్ని హాయిగా ఆస్వాదించే అవకాశమే రాదేమో? కష్టంగా ఉన్నవాటిని ఇష్టంగా మార్చుకుంటే జీవితం ఎప్పుడు మూడు నవ్వులు ఆరు విజయాలతో కళకళలాడుతుంది. మరి మీ పనితో మీరు ప్రేమలో పడ టానికి సిద్దమేగా ?  - కళ్యాణి

ప్రేమకు నిర్వచనాలు ఏవి?

ప్రేమ అనగానే అందరికీ ఎక్కడలేని హుషారు పుడుతుంది. జీవితంలో తోడుగా అన్ని రకాల ఎమోషన్స్ షేర్ చేసుకోవడానికి ఒక తోడు అనేది ప్రేమికుడు లేదా ప్రేమికురాలి ద్వారా దొరుకుతుంది. అయితే ప్రేమ అనే రెండు అక్షరాలకు నిజమైన అర్థం నిజం, నిజాయితీ, నమ్మకం, ధైర్యం, విజయం. ఈ అయిదు ప్రేమకు నిజమైన అర్థాలు...! ఈనాటి సమాజంలో వున్న యువకుల ఆలోచనలు ఎక్కువగా ప్రేమవైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రేమ అంటే వాళ్ళ దృష్టిలో కళ్ళలో కళ్లు పెట్టుకుని చూసుకుని నవ్వుకోవడం, సైగలు చేసుకోవడం, ప్రేమికుడు లేదా ప్రియురాలి కోసం ఏమైనా కొనివ్వడం సినిమాలకు తీసుకెళ్ళడం, ప్రియురాలు ఏదైనా అడిగితే ప్రేమికుడు ప్రియురాలు కోసం తన తాహతుకు మించకపోయినా ప్రియురాలు అడిగినదాని కోసం తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేయడం ప్రియురాలి కోరికలు తీర్చడం వంటివి చేస్తున్నారు. చివరికి తల్లి దండ్రులకు అప్పుల బాధను మిగిల్చి, వాళ్ళు వారి సరదాలను కోరికలను తీర్చుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. ఇది ప్రేమికురాలికి న్యాయం చేయడమా, లేక తల్లిదండ్రులకు న్యాయం చేయడమా మీరే ఆలోచించండి.  నిజమైన ప్రేమికుడు లేక ప్రియురాలుకు ముందు ప్రేమ పట్ల మంచి అవగాహన వుండాలి. ప్రేమను ఆరాధించాలి, అలాగే తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడాలి. వయసులో ఉన్నవారు ప్రేమించడం సహజం. ప్రేమించడం తప్పేమీ కాదు. ప్రేమికులు ఇద్దరు మీకు ఉన్నదాంట్లో మీ కుటుంబానికి తగ్గట్టుగా ఖర్చు చేసుకోవాలి. మీరు మీ ప్రేమ మోజులో పడిపోయి తల్లిదండ్రులను అప్పుల బాధకు గురి చేయకూడదు. ప్రేమికుడికి, ప్రేమికురాలు ఇవ్వవలసిన నిజమైన ఆనందం, ప్రేమికుడికి తల్లి దండ్రుల దగ్గర మంచిగౌరవం వుండేలా సమాజంలో మంచి గుర్తింపు ఉండేలా చేయడం. ఇది నిజమైన ప్రేమికురాలు ప్రేమికుడికి ఇచ్చే నిజమైన ఆనందం. ప్రేమ మోజులో పడిపోయి మీరు అనవసరపు ఖర్చు చేయకూడదు. అలాగే అబ్బాయిలు అమ్మాయిల విషయంలో  ఒక పరిధిలో ఉండాలి. చాలామంది ప్రేమ అనగానే ఇక మొత్తం ఒకరికొకరు ఏకమైపోవాలి అనుకుంటారు. శారీరకంగా కలవడానికి ఒత్తిడి చేస్తుంటారు. దానివల్ల జీవితాలు పెద్ద సమస్యల్లో చిక్కుకుంటాయి. ప్రేమంటే మనుషుల్ని అర్థం చేసుకుని ఆరాధించి తరువాత ఇద్దరూ కలిసి ఒక కొత్త జీవితాన్ని మొదలుపెట్టడం. అంతే తప్ప ముందే అన్ని అయిపోవాలని లేకపోతే ప్రేమ లేదు అని మాటలు చెప్పడం కాదు.  మీరు ఒకవేళ ప్రేమ మోజులో పడితే నిజాయితీగా వుండి మీరు ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి. ఇద్దరు ఒకరికొకరు ఆలోచించుకొని ఒక సరైన లక్ష్యాన్ని ఎంచుకోవచ్చు. ఆ లక్ష్యంపై నమ్మకాన్ని పెంచుకోవాలి. అలా నమ్మకం ఏర్పడితే జీవితంలో భవిష్యత్తు గొప్పగా ఉంటుందనే ధీమా వస్తుంది.  ఏర్పరుచుకున్న ఆ లక్ష్యంలో ఏవైన సమస్యలు వస్తే కృంగిపోకుండా ధైర్యంగా వుండాలి. ఆ సమస్యను ఇద్దరు ధైర్యంతో పరిష్కరించుకోవాలి. ఇద్దరూ నిర్ణయంలోనూ, సమస్యలొనూ, పరిష్కారంలోనూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటే ఎంత ఇబ్బందులు అయినా అధిగమించగలుగుతారు.  ఇలా లక్ష్యాన్ని ఏర్పరుచుకొని విజయాన్ని సాధించి మీ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టి మీ ప్రేమకు తల్లిదండ్రుల నుండి సమాజం నుండి మంచి గుర్తింపు వుండేలా చేసుకోవాలి. మీ ప్రేమను ఇతర ప్రేమికులు ఆదర్శంగా తీసుకునేలా మీరు గొప్పగా ఉండాలి అనుకోవాలి. ఇద్దరి మధ్యన ప్రేమ స్నేహభావంగా వుండాలి. ఇది మాత్రమే కాదు ప్రేమకు కావలసింది ఓర్పు, సహనం, ఇవి రెండూ కూడా చాలా అవసరం. అదే విషయాన్ని ఆలోచించాలి.  ప్రేమ మోజులో పడిపోయి తల్లిదండ్రులకు కడుపు కోతను కన్నీటిని మిగిల్చి పారిపోయి పెళ్ళి చేసుకోవడం న్యాయమా? లేక మీ ప్రేమకు మంచి లక్ష్యాన్ని ఏర్పరుచుకుని మీ ప్రేమ పట్ల మీ తల్లిదండ్రులకు మంచి గుర్తింపు కలిగేటట్లుగా వ్యవహరించడం న్యాయమా? ప్రేమకు నిర్వచనాలను ఎవరికి వారు ఇచ్చుకుంటూ నిజమైన నిర్వచనాన్ని నవ్వులపాలు చేయకూడదు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి.                                           ◆నిశ్శబ్ద.

టెడ్డి బేర్ చరిత్ర తెలుసా?

విస్తృతమవుతున్న ప్రపంచంలో పిల్లలు ఆడుకోవడానికి టెడ్డి బేర్ ని తీసివ్వమని అడుగుతుంటారు. పిల్లల తరువాత ఈ టెడ్డి బేర్ ను ఇష్టపడేది అమ్మాయిలు. మరీ ముఖ్యంగా టీనేజ్ గాళ్స్ కు టెడ్డిలంటే భలే ఇష్టం. ఆ తరువాత ఈ ఇష్టం టీనేజ్ అమ్మాయిల నుండి ఇన్ఫినిటీ… గా మారుతుంది. అంటే  అధిక శాతం మంది వయసుతో సంబంధం లేకుండా ఈ టెడ్డీలను ఇష్టపడతారు.  ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న, వాలెంటైన్ వీక్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా టెడ్డీ డేని జరుపుకుంటారు.  మీరు మీ ప్రియమైన వారికి టెడ్డీని అందించడం ద్వారా మీ ప్రేమను తెలియజేయవచ్చు.  ఆడవాళ్ళే కాదు, కొంతమంది మగవారు కూడా టెడ్డీని కౌగిలించుకోవడానికి ఇష్టపడతారు, కాబట్టి అమ్మాయిలూ.. టెడ్డీ బేర్‌ని మీరు ప్రేమిస్తున్న అబ్బాయిలకు కూడా వారికి ఇవ్వండి, తద్వారా వారు మిమ్మల్ని మిస్ అయినప్పుడల్లా టెడ్డీని కౌగిలించుకోవచ్చు. టెడ్డిని కేవలం ప్రేమికులు మాత్రమే ఇచ్చిపుచ్చుకుంటారని అనుకుంటే పొరపాటే..  మీరు ఇష్టపడే పిల్లలకు లేదా మీ ఇంట్లోని పెద్దలకు కూడా ఇవ్వవచ్చు. అయితే ఈ టెడ్డి వెనక ఓ కథ ఉంది.. ఓ చరిత్ర ఉంది. ఇంతకూ ఆ కథ, ఆ చరిత్ర ఏమిటంటే.. అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్‌వెల్ట్ ముద్దుపేరు టెడ్డీ. , 1902 సంవత్సరం నవంబర్ 14న అతను మిస్సిస్సిప్పిలోని ఒక అడవిలో వేటకు వెళ్ళాడు, అతని సహాయకుడు హోల్ట్ కొల్లియర్ కూడా అతనితో పాటు వెళ్ళాడు.  కోలియర్ గాయపడిన టెడ్డీ బేర్‌ను పట్టుకుని చెట్టుకు కట్టేశాడు.  దీని తరువాత వేటలో భాగంగా ఆ సహాయకుడు ఎలుగుబంటిని కాల్చడానికి అధ్యక్షుడి అనుమతి కోరాడు.  కానీ, గాయపడిన స్థితిలో ఉన్న ఎలుగుబంటిని చూసి, అధ్యక్షుడు రూజ్‌వెల్ట్ వేట మీద ఉన్న ఆసక్తిని, ఇష్టాన్ని పక్కన పెట్టి ఆ జంతువును చంపడానికి నిరాకరించాడు. ఇది కార్టూనిస్ట్ క్లిఫోర్డ్ బెర్రీమాన్ రూపొందించిన వాషింగ్టన్ పోస్ట్.   ఈ సంఘటన తర్వాత, అతని పేరు మీద, టెడ్డీ బేర్ కనుగొనబడింది.  దీనిని ఓ వ్యాపార దంపతులు రూపొందించారు.   వాలెంటైన్స్ వీక్‌లో టెడ్డీ డే జరుపుకోవడానికి ముఖ్యంగా అమ్మాయిలే కారణం.  చాలా మంది అమ్మాయిలు ఈ స్టఫ్డ్ బొమ్మలను ఇష్టపడతారు, ఇవి వెచ్చని ఆత్మీయ కౌగిలిని అందించే ఆత్మీయులలాగా అనిపిస్తాయి. కోపం, బాధ, ప్రేమ వ్యక్తం చేసుకోవడానికి తోడుగా ఉంటాయి. అందుకే అబ్బాయిలు టెడ్డీ బేర్‌లను బహుమతిగా ఇవ్వడం ద్వారా అమ్మాయిలను ఆకట్టుకుంటారు.  ఈ టెడ్డీ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10న జరుపుకుంటారు. ఇలా ఇది వాలెంటైన్ వీక్ లో భాగమయ్యింది.                                     ◆నిశ్శబ్ద.  

చాక్లెట్ చెమ్మక్ లో కరిగిపోండిక!

దేన్నైనా మన అనుకోవడం మన ఇండియన్స్ కి చాలా గొప్ప అలవాటు. అలాగే ఎక్కడి నుండో వచ్చిన వాలెంటైన్స్ డే ని మనదే మనదే అంటూ మనతో కలిపేసుకున్నాం.  ఫిబ్రవరి 2nd వీక్ మొత్తం వాలెంటైన్స్ డే సందడి మాములుగా ఉండదు. మరీ ముఖ్యంగా ఒక్కోరోజు ఒక్కో ప్రత్యేకతతో వాలెంటైన్స్ డే జపం చేస్తూ జుయ్.. జుయ్.. అంటూ ఫెరారీ కారులో తిరిగినట్టు యువత యమ స్పీడుగా, మరింత ఉత్సాహంతో తిరిగేస్తుంటారు.  వాలెంటైన్స్ డే మూడవ రోజు తియ్యతియ్యని చాక్లెట్ డే.. చిన్నా పెద్దా తేడాల్లేకుండా చాక్లెట్లను చప్పరించేసే వారున్నారు. ఈకాలంలో ఈ షుగర్ అనే జబ్బు లేకుంటే చాక్లెట్ ల వ్యాపారం ఇంకెంత శుభ్రంగా ఉండేదో అనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి వస్తే.. ముచ్చటగా మూడవ రోజు చాక్లెట్ డే రోజు.. ప్రేమికులు చాక్లెట్ లను ఇచ్చి పుచ్చుకుని మనసులో దాగున్న ప్రేమను చాక్లెట్ అంత తియ్యగా వ్యక్తం చేసి మధురానుభూతిని పొందుతారు.  సాధారణంగానే ప్రియురాలిని కలిసే ప్రియుడు చాక్లెట్ లేకుండా అస్సలు వెళ్ళడు. ఒకవేళ తొందరలో.. కిందామీద పడుతూ చాక్లెట్ లేకుండా వెళితే మాత్రం.. ఆ ప్రియురాలి ముఖం క్యారమిల్ లో ముంచి తీసినట్టు కన్నీళ్లు కారుతూ కనిపిస్తుంది.  అంతేనా.. ఎండలో నిలబడిన డైరీ మిల్క్ లాగా దిగులుపడిపోతుంది. ఇకపోతే కమ్మగా కరిగిపోయే చాక్లెట్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.  అవేంటంటే… చర్మానికి మేలు చేస్తుంది  చాక్లెట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి, ఇందులో కోకో ఉంటుంది, ఇది చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.  ఈ చాక్లెట్ డే రోజు ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న డార్క్ చాక్లెట్‌ మిమ్మల్ని మరింత ఉత్సాహంగా మారుస్తుంది.  యాంటీ ఆక్సిడెంట్  యాంటీ ఆక్సిడెంట్ అయిన పాలీఫెనాల్ వంటి ఫైటోకెమికల్, వాటి లక్షణాల కారణంగా చాక్లెట్ ఘూఢమైన  సువాసనను కలిగి ఉంటుంది.  ఇది వాలెరిక్ యాసిడ్ వంటి ఫ్లేవనాయిడ్లను కలిగి ఉంటుంది, ఇది శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది. బెస్ట్ స్ట్రెస్ బస్టర్  ఈ కాలంలో ఒత్తిడి అనేది ఒక సాధారణ సమస్య అయిపోయింది. మీరు గనుక దానితో ఎక్కువగా టచ్ లో ఉన్నట్లయితే.. మీరు ప్రతిరోజూ డార్క్ చాక్లెట్ ను  తినాలి, ఎందుకంటే ఇది ఒత్తిడిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఎప్పుడైనా ఒత్తిడిగా అనిపించినప్పుడు, నీరసంగా, బద్ధకంగా  ఉన్నపుడు డార్క్ చాక్లెట్ తిన్నారంటే మీలో కనిపించే మార్పును మీరే స్పష్టంగా చూడగలరు. మధుమేహం ఛాన్సెస్ తక్కువ..  వినడానికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ ఇదే నిజం. సహజంగా స్వీట్స్ అంటే ఇష్టపడేవారు ఇప్పటి కాలానికి తగ్గట్టు నచ్చినన్ని స్వీట్స్ తినాలంటే భయపడతారు. షుగర్ ఎక్కడ వస్తుందోనని వారి భయం. అయితే, డార్క్ చాక్లెట్‌ లో ఉండే ఫ్లేవనాయిడ్‌ లు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కాబట్టి డయాబెటిస్ అని భయపడేవారు తీపి తినాలని అనిపించినా, షుగర్ వస్తుందేమో అనే భయంతో తీపికి దూరం ఉండాలని అనుకున్నా ఆ భయాలు పక్కన పెట్టి హాయిగా డార్క్ చాక్లెట్ ని చప్పరించేయండి. చూశారా??  కేవలం ప్రియురాలిని, ప్రియుడిని కూల్ చేయడమే కాదు, ఆరోగ్యాన్ని చక్కబెట్టగలదు మన చాక్లెట్.  చాక్లెట్ డే పేరు చెప్పుకుని ఇంకాస్త ఎక్కువ డోస్ వేసేయండి ఈరోజు..                                     ◆నిశ్శబ్ద.

ప్రేమను వ్యక్తం చేస్తున్నారా?

◆ప్రపోజ్ డే◆  ఈ ప్రపంచంలో ప్రేమ చాలా గొప్పది. మనిషిని అనుభూతి చెందించడంలో కూడా ప్రేమ మొదటి స్థానంలో నిలుస్తుంది. ఫిబ్రవరి మాసం వచ్చిందంటే ప్రేమికుల మనసులకు మరింత ఉత్తేజం కలుగుతుంది. వాలెంటైన్ వీక్ గా పిలువబడే వారంలో రెండవరోజును ప్రపోజ్ డే గా చెబుతారు. తాము ప్రేమిస్తున్నవారికి తమ మనసులో మాట చెప్పడం, తాము ఆల్రెడీ ప్రేమిస్తున్నవారి మీద మనసులో ఎంత ప్రేమ ఉందొ తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఎక్కడ చూసినా  ప్రేమ జంటలు ప్రేమపావురాల్లా సందడి చేస్తుంటాయి.  ఇష్టమైన వారిని బయటకు తీసుకెళ్లడం తమ మనసులో మాట చెప్పడంలో ఒక్కొక్కరు ఒకో విధమైన మార్గాన్ని అనుసరిస్తారు. కొందరు పువ్వులు ఇస్తే, మరికొందరు బహుమతులు, ఇంకొందరు చాక్లెట్లు ఇస్తూ మనసును బయట పెడతారు. అయితే ప్రపోజ్ డే రోజు ప్రేమికులు అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయాలు కొన్ని ఉన్నాయి, అవి తప్పక తెలుసుకుని తీరాలి.. అవేంటంటే.. ఒకే.. నాట్ ఒకే.. ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరు  తాము ప్రేమించే వారికి మనసులో మాట చెబుతారు. కొందరు ఆ మాట చెప్పడానికి భయపడతారు. అయితే అవతలివారు ఒకే చెబుతారా లేదా నో చెబుతారా అనేది వారి వ్యక్తిగత విషయం అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రేమించడం మీ వ్యక్తిగత ఇష్టం అయినప్పుడు ఒకే చెప్పాలా లేదా అనేది వారి వ్యక్తిగత విషయం అని గుర్తుపెట్టుకోవాలి. ఆ విషయం అర్ధం చేసుకుంటే ఎదుటి వారు నో చెప్పినా సరే పాజిటివ్ మైండ్ ఉంటుంది. లేకపోతే ప్రపంచం మొత్తం మీద ఉన్న వైరాగ్యం అంతా మీలోకి వచ్చి దేవదాసునో.. లేక పార్వతినో చేస్తాయి. పాజిటివ్.. నెగిటివ్… ప్రేమ ఒప్పుకోకపోతే ఇక అవతలి వాళ్లకి పొగరు, వాళ్ళు మిమ్మల్ని అవమానం చేస్తున్నారు వంటి నెగిటివ్ ఆలోచనలు మానుకోవాలి. ఈ కాలంలో అమ్మాయిలు, అబ్బాయిల స్నేహం సాధారణం. అబ్బాయిల అయినా అమ్మాయిలు అయినా స్నేహితుల్లానే ఉండండి. ప్రవర్తనలో స్నేహితులకు బదులు ప్రేమికుల రేంజ్ లో కేరింగ్, ప్రేమ, అఫెక్షన్ చూపించి ఆ తరువాత నాది ఓన్లీ ఫ్రెండ్షిప్ మాత్రమే, నువ్ ఇలా లవ్ యాంగిల్ లో చూస్తావని అనుకోలేదు లాంటి డైలాగ్స్ కొట్టకండి. ఒకవేళ మీ స్నేహితులు మీకు ప్రపోజ్ చేసినా మీకు ఇష్టం లేకపోతే సర్ది చెప్పండి, వారు మిమ్మల్ని అర్థం చేసుకునేవరకు  సమయం ఇవ్వండి. అంతేకానీ స్నేహం అనుకుంటే లవ్ చేస్తావా అని గొడవలకు పోకండి. అలాగని మరీ పూసుకుని రాసుకుని కేర్ టేకార్ గా ఉండకండి. అవసరాలు తీర్చవచ్చు కానీ అన్నిటికీ మీరే అవసరం అనేలా మారకండి. అప్పుడే ప్రేమకు, స్నేహానికి వ్యత్యాసం ఎంతో కొంతం అర్థమవుతుంది. ప్రపోసల్ స్పెషల్.. నచ్చినవారికి మనసులో మాయా చెప్పడమే కాదు, ఇంప్రెస్ చేయడం కూడా ముఖ్యమే. ప్రేమను ఎంత విభిన్నంగా ఎక్స్ప్రెస్ చేస్తే అవతలి వారు అంతగా ఇంప్రెస్ అవుతారు. నచ్చిన అమ్మాయికి లేదా అబ్బాయికి ప్రపోజ్ చేదం అదేదో యుద్ధం అనుకోవద్దు. నిజాయితీగా మనసులో మాటను చెబితే అవతలి వారు అర్థం చేసుకుంటారు. ఓవర్ ఏక్షన్ చేసి బొక్కబోర్లా పడితే తరువాత ప్రేమ కాస్త వెక్కిరించినట్టు అవుతుంది. జస్ట్ మూవ్ ఆన్.. ప్రేమిస్తున్నవారు నో చెప్పారా?? నో ప్రాబ్లెమ్ వారికి వేరొక జీవితం ముడిపడి ఉంది అని మనసుకు చెప్పుకోవాలి. ఇలా చెప్పుకోవడం కష్టమే. కానీ బలవంతం చేసి ఇష్టం లేని వారి జీవితంలోకి వెళ్లి అశాంతిగా బ్రతకడం కంటే అవతలి వారి నిర్ణయాన్ని గౌరవించి మీరు కదిలిపోవడం మంచిది. రెండు చేతులు కలిస్తేనే  చప్పట్లు అన్నట్టు రెండు మనసులు కలిస్తేనే సంపూర్ణమైన ప్రేమ సాధ్యం. కాబట్టి ప్రేమ రిజెక్ట్ అయితే జైస్ట్ మూవ్ ఆన్ అంతే… చివరగా చెప్పొచ్చేది ఏమిటంటే.. ప్రేమ అనేది కేవలం ఓ అమ్మాయికో అబ్బాయికో ఆకర్షణతో చెప్పేది , ఆరాధనతో వ్యక్తం చేసేది అనుకుంటే పొరపాటు. పంచడానికి ఈ ప్రపంచంలో ప్రేమ, అభిమానం, ఆప్యాయత  లేనివారు ఎందరో ఉన్నారు. వారికి మీ ప్రేమను అందివ్వవచ్చు మనస్ఫూర్తిగా..                                           ◆నిశ్శబ్ద.

'జననాంగ వికృతీకరణ' సృష్టికి మూలాన్ని సమాధి చేస్తున్నారు!

ఈ ప్రపంచం సంగతి ఏమిటో కానీ.. ఈ దేశంలో మాత్రం స్త్రీకి సంబంధించిన కొన్ని విషయాలను మాట్లాడటానికి ఎంతో సంకోచిస్తారు. అలాంటి వాటిలో సెక్స్,స్త్రీ-పురుష జననేంద్రియాలు, వాటికి సంబంధించిన సమస్యలు. మనుషులను ఉద్రేకపరిచే కోరికలు మొదలైనవి ఎంతో ముఖ్యమైనవి. అయితే ఎన్నో వందల సంవత్సరాల నుండి స్త్రీ చాలా విషయాల్లో అణిచివేయబడుతోంది. ఈ సృష్టిలోకి ఓ మనిషి రావాలంటే స్త్రీ జననేంద్రియం దానికి కార్యక్షేత్రం. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ప్రపంచం ఇన్ని మార్పులకు లోనైనా ఎన్నోచోట్ల ఇప్పటికీ స్త్రీల పట్ల చాలా దారుణాలు జరుగుతున్నాయి. వాటిలో స్త్రీ జననేంద్రియం మీద అధికారం, అణిచివేత కూడా ముఖ్యమైనది.  స్త్రీ జననేంద్రియ వికృతీకరణకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6న జీరో టాలరెన్స్ ఫిమేల్ జెనెటల్ మ్యుటిలేషన్ ను అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు.  మనం 21వ శతాబ్దంలో ఉన్నప్పటికీ, ఓ హింసాత్మక సంప్రదాయం ఇప్పటికీ ఉనికిలో ఉండటం చాలా కలవరపెడుతోంది.  ఆఫ్రికా మరియు తూర్పు ఐరోపా నుండి అరబ్ దేశాలు, ఆసియా, లాటిన్ అమెరికా వరకు  స్త్రీల జననేంద్రియాల పట్ల  జరుగుతున్నవి చాలా దారుణమైనవి.  బాహ్య స్త్రీ జననేంద్రియాలను తొలగించడం వేల సంవత్సరాల లింగ అసమానతలో ముఖ్యమైనదిగా ఉంది.   ఇతరులు స్త్రీ యొక్క లైంగికత మరియు ఆనందాన్ని నియంత్రించడానికి దీనిని పాటిస్తారు.  దీని గురించి ప్రపంచానికి సరైన అవగాహన  కల్పించేందుకు  ఫిబ్రవరి 6వ తేదీని స్త్రీ జననేంద్రియ వికృతీకరణకు జీరో టాలరెన్స్ డేగా ప్రకటించింది. అసలు ఏమిటీ సమస్య.. ఎక్కడుంది ఈ ఆచారం?? స్త్రీ జననేంద్రియ వికృతీకరణ అనేది స్త్రీ జననేంద్రియాలను పూర్తిగా లేదా పాక్షికంగా తొలగించడం.  మహిళల యోని భాగంలో క్లిటోరిస్‌ను కుట్టడం, కత్తిరించడం చాలా దేశాలలో పాటించే అలవాటు. ఇది మహిళల పట్ల దారుణమైన చర్య కలిగి ఉంది.   ప్రపంచం  స్త్రీ జనాభా విషయంలో  విఫలమవుతూనే ఉంది, దాదాపు 200 మిలియన్ల మంది బాలికలు, మహిళలు ఇప్పటి వరకు జననేంద్రియ వికృతీకరణకు గురయ్యారు, ఈ సంఖ్య క్రమక్రమంగా  పెరుగుతూనే ఉండటం దిగ్భ్రాంతికి గురిచేసే విషయం.  అయితే.. ఇది ఎక్కడ ఉద్భవించిందనే దానిపై చరిత్రకారులు స్పష్టత ఇవ్వనప్పటికీ  ఇది చాలా కాలంగా ఉండటమే కాదు, ప్రపంచంలోని అనేక జాతి, తెగ ప్రజలు ఇప్పటికీ దీనిని పాటిస్తున్నారు.  ఉప-సహారా, అరబ్ దేశాలలో స్త్రీ జననేంద్రియ వికృతీకరణ చేయడం చాలా సాధారణం. దీని వల్ల కలుగుతున్న నష్టం ఏమిటి??  స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కేవలం స్త్రీలను అణిచివేస్తున్న ఒక మార్గం మాత్రమే కాదు. ఇది చాలా పెద్ద అనారోగ్య సమస్యలు దారి తీస్తున్న అంశం.  స్త్రీలలో, బాలికలలో  లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.  జననేంద్రియ వికృతీకరణకు గురైన స్త్రీలు ప్రసవానంతర రక్తస్రావం, పిండం మరణం, ప్రసవానికి ఆటంకం మొదలైన సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఎక్కువ ఉంది. ఇంకా మానసిక ప్రభావాలు చాలా దీర్ఘకాలం ఉంటాయి.  వాటి తాలూకూ గాయాలు పిల్లలలో ప్రవర్తనా సమస్యలకు దారితీస్తుంది, మానసిక స్టైర్యాన్ని బలహీనపరిచి ఆందోళన, ఒత్తిడి పెరగడానికి కారణం అవుతాయి.   ఇన్నాళ్లు ఈ సమస్య ఇలా కొనసాగడానికి స్త్రీలలో భయమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అయా విషయాలు  నోరు తెరచి మాట్లాడాలంటే స్త్రీలు  చాలా భయాందోళనకు గురవుతారు. సమాజం కూడా అలాంటి విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదు అనే ఒకానొక కట్టుబాటును విధించారు. దీనివల్ల స్త్రీల సమస్యను పరిష్కరించడం కూడా సవాలుగా మారింది.  2012  ఫిబ్రవరి 6న స్త్రీ జననేంద్రియ వికృతీకరణ కోసం జీరో టాలరెన్స్ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రకటించింది. దీని గురించి అవగాహన కల్పించడం, స్త్రీలలో చైతన్యం తీసుకురావడం, స్త్రీలు ఈ సమస్య వల్ల పడుతున్న ఇబ్బందులను సమాజానికి వినిపించడం. మొత్తంగా స్త్రీలకు ఈ సమస్య నుండి విముక్తి కలిగించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం.                                        ◆నిశ్శబ్ద.

క్యాన్సర్ మీద యుద్ధానికి అస్త్రాలు ఇవే!

క్యాన్సర్ ప్రపంచంలో అధికశాతం మందిని బలి తీసుకుంటున్న అనారోగ్య సమస్య. ఈ క్యాన్సర్ తొలినాళ్లలో బయటపడకుండా చివరివరకు మనిషిలో దాక్కుని మనిషిని మరణానికి చేరువగా నెట్టి నరకాన్ని చూపిస్తుంది. అందుకే క్యాన్సర్ మీద అవగాహన కల్పించేందుకు గానూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4 వ తేదీన జరుపుకుంటూ వస్తున్నారు. ఇంతకూ ఈ క్యాన్సర్ డే ఎలా ఆవిర్భవించింది. ఆరోజున చేసే పనులు ఏమిటి?? క్యాన్సర్ అధిగమించడం ఎలా?? వంటి కొన్ని ముఖ్యమైన విషయాలు అందరికోసం… ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4 వ తేదీన ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ఈ క్యాన్సర్ దినోత్సవం 2008 లో  ప్రకటించబడింది. క్యాన్సర్ సమస్య చాపకింద నీరులా శరీరంలో ప్రవేశించి మనిషిని మరణానికి చేరువగా తీసుకెళ్లేవరకు బయటపడదు. ఈ కారణంగా క్యాన్సర్ మీద అందరికీ అవగాహన కల్పించాలని, క్యాన్సర్ ను మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవాలని, క్యాన్సర్ గురించి అందరూ జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రపంఫమ్ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో క్యాన్సర్ ఒకటి.  యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ (UICC) 1993లో జెనీవాలో స్థాపించబడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ నిర్మూలనకు, వైద్య పరిశోధనలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న సభ్యత్వ-ఆధారిత సంఘం.  దాని ఆధ్వర్యంలో, అదే సంవత్సరంలో స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో మొదటి అంతర్జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకున్నారు.  అనేక ప్రసిద్ధ సంస్థలు, క్యాన్సర్ సంఘాలు, చికిత్సా కేంద్రాలు ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చాయి.  2000లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా జరిగిన మొదటి ప్రపంచ సదస్సులో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం అధికారికంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం పారిస్‌లో జరిగింది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ సంస్థల సభ్యులు, ప్రముఖ ప్రభుత్వ నాయకులు ఈ సదస్సుకు  హాజరయ్యారు.  క్యాన్సర్ రోగుల జీవితం బాధాకరంగా మారకుండా, వారి జీవితం మెరుగ్గా గడిచిపోయేందుకు ప్రపంచం నిర్వర్తించాల్సిన బాధ్యతను వివరిస్తూ, 10 కథనాలతో కూడిన 'చార్టర్ ఆఫ్ ప్యారిస్ ఎగైనెస్ట్ క్యాన్సర్' పేరుతో ఒక పత్రంపై సంతకం చేయబడింది.  క్యాన్సర్‌ గురించి పరిశోధించడం, నివారించడం, దానికి చికిత్స చేయడంలో పురోగతి సాధించడం. పరిశోధనల కోసం పెట్టుబడి వంటి విషయాలు ప్రస్తావించబడ్డాయి.   ఈ చార్టర్‌లోని ఆర్టికల్ ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించింది.  క్యాన్సర్ అనేక రకాలను కలిగి ఉంది, కాబట్టి నిర్దిష్ట రకం క్యాన్సర్‌ను గుర్తించడానికి మరియు దానితో పోరాడడాన్ని ప్రోత్సహించడానికి వివిధ రంగులు మరియు చిహ్నాలు ఉపయోగించబడతాయి.  ఉదాహరణకు, ఆరెంజ్ రిబ్బన్ అనేది పిల్లల్లో క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడం కోసం, పింక్ రిబ్బన్ ప్రపంచవ్యాప్తంగా బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహనతో ముడిపడి ఉంది.  ప్రాణాలతో బయటపడిన వారి ఆశకు చిహ్నంగా, డాఫోడిల్ పువ్వును  ఉపయోగిస్తారు.  క్యాన్సర్ డే రోజు ఏమి చేయవచ్చు??  ఈ రోజున, ఆసుపత్రులు, పాఠశాలలు, వ్యాపారాలు, మార్కెట్‌లు, కమ్యూనిటీ హాళ్లు, ఉద్యానవనాలు మొదలైన వాటిలో వ్యక్తులు, సంఘాలు, సంస్థలను ఒకచోట చేర్చి ప్రచారం చేయడానికి, అవగాహన కల్పించడానికి, ఈవెంట్స్ ను నిర్వహిస్తారు. దీనికోసం విరాళాల సేకరణ కూడా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది.  క్యాన్సర్ బారిన పడిన వారు ఒంటరి కాదు, ఈ ప్రపంచం వారికి అండగా నిలబడుతుంది అనే భరోసా ఇవ్వడమే ఈ అవగాహనా సదస్సులు ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం. క్యాన్సర్ ను మందులతోనే కాదు ప్రేమ, ఆప్యాయత, సహకారంతో కూడా తరిమికొట్టండి. అలాగే ప్రేమను, ఆప్యాయతను క్యాన్సర్ బాధితులకు మనఃపూర్వకంగా పంచండి.                              ◆నిశ్శబ్ద.       

సి.పి బ్రౌన్ పుట్టింది మన దేశంలోనే అని మీకు తెలుసా?

భారతదేశం ఆంగ్లేయుల పాలనలో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా భారతీయుల పరిస్థితులను, ముఖ్యంగా తెలుగువారి పరిస్థితులను అర్థం చేసుకుని తెలుగువారి జీవితాలకు కొత్త దారి చూపించిన ఆంగ్లేయ అధికారులు నలుగురున్నారు. సర్ థామస్ మన్రో. కాలిన్స్ మెకెంజీ. సర్ ఆర్థర్ కాటన్. సి.పి. బ్రౌన్. ఆ నలుగురూ. తెలుగువారు ఈ నలుగురిని ఎప్పటికీ మరచిపోరు. ముఖ్యంగా తెలుగు భాష విషయంలో సి.పి. బ్రౌన్ కృషి మరువలేనిది. అయితే సి.పి. బ్రౌన్ ఆంగ్లేయ అధికారిగా ఇక్కడికి వచ్చినా ఆయన పుట్టింది మాత్రం భారతదేశంలోనే.. చాలా ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం. సి.పి. బ్రౌన్ తండ్రి రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ క్రైస్తవ మత ప్రచారకుడిగా 1786లో కలకత్తా వచ్చాడు. హిందూ మతాచారాలను అవగతం చేసుకొనే లక్ష్యంతో భారతీయ భాషలను నేర్చుకున్నారు. ప్రాచ్యభాషా సంస్కృతులపట్ల ఆదరాభిమానాలు కలవాడు డేవిడ్ బ్రౌన్. ఈ క్రమంలోనే సి.పి.బ్రౌన్ రెండవ కొడుకుగా కలకత్తాలో జన్మించాడు. ఆ తరువాత తండ్రి చనిపోయిన తరువాత వీరు ఇంగ్లాండ్ కు వెళ్లిపోయారు. అయితే ఈస్టిండియా కంపెనీ కోసం బ్రౌన్ లండన్ (హెర్ట్ఫోర్డ్ లోని హెయిల్ బరీ కాలేజీలో చేర్పించారు. ఈ కాలేజీలో సంస్కృతం బోధించేవారు. సంస్కృతం లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు 'బంగారుపతకాలు' యిచ్చేవారు. ఆ పతకం అంచు చుట్టూ"తత్ సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం" అన్న సంస్కృత సూక్తి ఒకవైపు, మరోవైపు 'శ్రీవిద్యా వరాహ' అని చెక్కబడి వుండేది. ఆవిధంగా బ్రౌన్ సంస్కృతాభ్యాసం సాగించి బంగారు పతకం పొందాడు. బ్రౌన్ భారతదేశానికి వచ్చినప్పటికీ ఆయన వయసు 19 ఏళ్ళు. తెలుగు నేర్చుకోవాలని పట్టుదలతో వెలగపూడి కోదండరామ పంతులు వద్ద తెలుగు అక్షరాలు నేర్చుకొన్నాడు. పదహారు నెలల్లో తెలుగులో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. థామస్ మన్రో ప్రభావం, ఆయన 'కాన్వోకేషన్' ఉపన్యాసంలో తెలుగులో  చేసిన ప్రసంగం బ్రౌన్ మనసులో గాఢంగా పాతుకుపోయింది. ఈయన మొదటగా కడపలో ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. తెలుగు సాహిత్యానికి సుక్షేత్రమైన కడపలో ప్రధాన కార్యస్థానాన్ని నెలకొల్పాడు. ఆయన పలు చోట్ల పని చేసినా ఎక్కడా స్థిరాస్తి సంపాదించలేదు. కడపలో పెద్ద బంగళా, తోట కొన్నారు. అప్పట్లో అతని వేతనం 5-6 వందలకు మించదు. బంగాళాలో పెద్ద గ్రంథాలయం నెలకొల్పాడు. సొంత డబ్బుతో పండితులను నియమించాడు. బంగళాను 'సాహిత్య కర్మాగారం'గా రూపొందించాడు. అవిద్య ఆకాండతాండవం చేస్తున్న కాలమది. చదువుకొన్న తెలుగు యువకులు చాలా అరుదుగా వున్న కాలమది. 1821లో కడపలో రెండు బళ్ళు పెట్టాడు. ఉచితంగా తెలుగు, హిందూస్తానీలలో చదువు చెప్పించాడు. ఆ బళ్ళలో దేశీయ ఉపాధ్యాయులను నియమించాడు. విద్యార్థులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించాడు. "హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెర్మనీస్"పుస్తకం చదువుతుండగా వేమన ప్రస్తావన కన్పించింది. వేమన పట్ల శ్రద్ధ పెరిగింది. వేమన పద్యాలు గల తాటాకు ప్రతులెన్నో తెప్పించాడు. మచిలీపట్నం కోర్టు పండితుడు తిప్పాభట్ల వెంకట శివశాస్త్రి, వర్యం అద్వైత బ్రహ్మ శాస్త్రి, ఆ దశలో సాహిత్య విద్యా గురువులయ్యారు. వేమన పద్యాలకు అర్థతాత్పర్యాలు బోధించారు. తెలుగు వ్యాకరణ, ఛందస్సూత్రాలు నేర్చుకొన్నాడు బ్రౌన్. దాదాపు 2 వేల వేమన పద్యాలను సేకరించి వాటిలో 633 పద్యాలను ఇంగ్లీషులోకి అనువాదం చేసి అచ్చు వేయించాడు. అలా వేమన పద్యాలకు ప్రపంచంలో విస్తృత ప్రచారం కావించాడు.                                    ◆నిశ్శబ్ద.

ఆకలి మంటలు చల్లార్చే ఆయుధం మనదగ్గరే ఉంది!

ఈ ప్రపంచంలో మనిషికి కావలసిన తప్పనిసరి అవసరాల్లో ఆహారం ఒకటి. దేశం ఏదైనా ప్రాంతం ఏదైనా ప్రాణి ఏదైనా ఆహారం లేకుండా బతకడం కష్టం. అందుకే ఆహారం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతి మనిషి తనకు సరిపడిన ఆహారం పొందడం అనేది ప్రాథమిక హక్కుగా పరిగణించబడింది కూడా. అయితే ఈ ప్రపంచంలో ఉన్న జనాభాలో ప్రతి పదిమందిలో ఒక్కరు దీర్ఘకాలిక ఆకలితో అలమటిస్తున్నారు. 1945 సంవత్సరం నాటికి ఐక్యరాజ్యసమితి ప్రతి మనిషి ఆహారం పొందడాన్ని హక్కుగా గుర్తించలేదు. అయితే 1979, అక్టోబర్ 16 న ఆహారం పొందడం కూడా ఒక హక్కుగా ఐక్యరాజ్యసమితి గుర్తించడంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 16 న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.  ప్రపంచంలో ఆహార భద్రత ఉన్న దేశాల్లో భారతదేశం ప్రస్తుతం 68వ స్థానంలో ఉంది.  కొన్ని దేశాలలో కనీసం రొట్టె ముక్కకు నోచుకోని జీవితాలు ఉన్నాయి. ఆహారం కోసం తుపాకులు పట్టుకుంటున్న వాళ్ళు, దొంగలుగా మారుతున్న వాళ్ళు ఉన్నారు. మరికొందరు బానిసత్వంలో మునిగిపోతున్నారు. భారతదేశం ఆహార భద్రత దృష్ట్యా 68 వ స్థానంలో ఉన్నా ఎంతో మందికి ఆహారం దొరకడం లేదు. అధిక జనాభా గల భారతదేశంలో సగటు పౌరుడు అన్నిరకాల అవసరాలకు పోరాటం చేయాల్సిందే.  అంతే కాదు మహా నగరాలుగా పిలవబడే ముంబై, హైదరాబాద్, ఢిల్లీ, కలకత్తా వంటి నగరాలలో స్లమ్ ఏరియాలలో, ఫుట్ పాత్ ల మీద ఎంతోమంది ఆహారం సరిగా లేక బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతుంటారు. ఇలాంటి వారికోసం ఆహార రక్షణ కల్పించడం సగటు పౌరులుగా అందరి బాధ్యత.  ఏమి చేయచ్చు!! ప్రతి పౌరుడు ప్రపంచం మొత్తం ఆకలి మంటలు చల్లార్చలేకపోవచ్చు. కానీ ప్రతి వ్యక్తి మరొక వ్యక్తి ఆకలి తీర్చగలడు. ఆ విషయం గుర్తుపెట్టుకొని దాన్ని అనుసరిస్తే తప్పకుండా ఆహారం అందరికీ అందుతుంది.  సామాజిక స్పృహ కలిగిన కొంతమంది కలసి ఫుడ్ బ్యాంక్ ఏర్పాటు చేయవచ్చు. ఆహారాన్ని సేకరించడం, అవసరమైన వారికి అందించడం ఈ పనిలో భాగం. దీనివల్ల కొందరికైనా ఆహార భద్రత కల్పించినవారు అవుతాము. భారతీయ ఫంక్షన్ లు, పెళ్ళిళ్ళ్ళు, ఇతర శుభకార్యాలలో చాలా ఆహారం మిగిలిపోతూ ఉంటుంది అలాంటి ఆహారాన్ని సదరు కార్యక్రమాలు జరుపుతున్న యజమానులతో మాట్లాడి ఆరోగ్యకరమైన రీతుల్లో సేకరించి ఎంతోమంది ఆకలి తీర్చవచ్చు.  ఆహార భద్రత పెరగాలి అంటే చేయాల్సిన మరొక పని, చిన్న రైతులను ప్రోత్సహించడం. ఆహార ధాన్యాలను వారి నుండి కొనుగోలు చేస్తే వారికి పంట అమ్మకం మీద భరోసా వస్తుంది. వారు పంటలు పండించగలరు. ఆహార భద్రత కోసం విరాళాలు సేకరించడం కూడా ఎంతో మంచి పని. దేశ వ్యాప్తంగా ఎన్నో స్వచ్చంధ సంస్థలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి కూడా. ప్రతి గ్రామంలో బాధ్యతాయుతమైన యువత సమూహంగా ఏర్పడి విరాళాలు సేకరించి ఆయా గ్రామాల్లో ఉన్న వారికి ఆకలి తీర్చడానికి ప్రత్యామ్నాయాలు కనుగొనగలిగితే ప్రతి గ్రామం నుండి మొదలై దేశ వ్యాప్తమవుతుంది ఈ గొప్ప అడుగు.  ఇకపోతే ఈ ఆహార దినోత్సవం ఎందుకు అంత ముఖ్యమైనది?? దీని గురించి ఎందుకు అంత ప్రాముఖ్యత ఇస్తూ చర్చించుకోవాలి అనే విషయంలోకి వెళితే. ప్రపంచంలో ఆకలి వల్ల మనుషుల ప్రవర్తనలు, ప్రవృత్తులు మారిపోతాయి. మనుషులు తమ తమ కౄరత్వాన్ని పెంచుకోవడానికి ఆహారం ముఖ్య కారణం అవుతుంది. ఆహార లభ్యత ఏర్పడితే మనుషులలో ఈరకమైన ప్రవృత్తి తగ్గే అవకాశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి పేర్కొన్నట్టు ఆహారం పొందడం ప్రతి మనిషి హక్కు అయినప్పుడు దాన్ని పొందడం అనేది మనిషి బాధ్యత కూడా. అందుకే ఆహారాన్ని వృధా చేయద్దు, అలా చేస్తే ఇతరుల ఆహారాన్ని వారి నోటి నుండి లాక్కున్నట్టే. ఇతరుల ఆకలి మంటలు చల్లార్చే ఆయుధం ఏదైనా ఉందంటే అది మనదగ్గరే ఉంది, ఆహారాన్ని వృధా చేయకపోవడమే ఆ గొప్ప ఆయుధం. ఈ విషయం మరిచిపోకండి.                                         ◆నిశ్శబ్ద.

మీరూ జుట్టు పిచ్చోళ్లేనా?

డబ్బెవరికి చేదు టైపులో జుట్టెవరికి చేదు చెప్పండి. జుట్టేమైనా తింటామా చేదు, తీపి, కారం అనడానికి అని డౌట్ వస్తే దాన్ని అవతలికి తరిమేయ్యండి. ఒకప్పుడు నాగుపాము జడలు, జులపాల జుట్టులు, గాలికి ఎగిరెగిరి పదే హెయిర్ క్రాఫులు అబ్బో ఆ కాలమే వేరబ్బా!! మరిప్పుడో….. హెయిర్ ఫాల్ అనే సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉన్న జుట్టుపోకుంటే చాలు దేవుడా అని కోటి నమస్కారాలు చేసేవాళ్ళు ఎక్కువున్నారు. చెబితే నమ్మరు కానీ అమ్మయిలలో కూడా బట్టతల సమస్య కనబడుతూ ఉంటుందనే మాట వింటే విచిత్రంగానే ఉంటుంది. అవన్నీ వొద్దులే కానీ ఇప్పుడు ఒక విషయం తెలుసుకోవాలి, తెలిసిన విషయం గురించి కాసింత మాట్లాడుకోవాలి, మాట్లాడుకుంటూ ఆలోచించాలి, ఆలోచించి ఇంకేం చేస్తాం మనం అలా చెయ్యకుండా ఉండాలి. ఎలా చెయ్యకుండా ఉండాలి? జుట్టెవరికీ చేదు కాదు. మళ్లీ అదేమాట ఎందుకంటారా?? సరే జుట్టు అంటే అందరికీ ఇష్టమే. కొంతమందికి అదృష్టవశాత్తు బాగానే ఉంటుంది. జుట్టు లేకపోవడం రాలిపోవడం, క్రమేణా దాని వాల్యూమ్ తగ్గిపోవడం వీటికి కారణాలు బోలెడు ఉంటాయి.  వాటిలో మొదటిది డిప్రెషన్. ఈకాలంలో ఈ మాట సహజం అయిపోయింది. అందుకే జుట్టు తక్కువున్నోళ్లు కూడా ఎక్కువైపోయారు. బట్టతలలు, ఎలుక తోకలు కామన్ అయిపోయాయి. ఏదో ఈకాలం లో ఫాషన్ పుణ్యమా అని కాస్త జుట్టు లూజుగా వదుల్తారు కాబట్టి ఎలుక తోక కూడా చిన్న కాలువలాగా కళకళలాడుతూ ఊగుతూ ఉంటుంది. రెండవ కారణం డిఎన్ఏ. నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఫ్యామిలీస్ లో బట్టతల వంశపార్యపరంగా వస్తున్నవాళ్ళు పాపం బోలెడు ఉంటున్నారు. జుట్టు పలుచగా ఉండటం, బట్టతల రావడం మాత్రమే కాకుండా అతిగా జుట్టు పెరగడం కూడా డిఎన్ఏ మాజిక్కే. మూడవ కారణం లైఫ్ స్టైల్. ఆహారంలో biotin పుష్కలంగా ఉండాలి. జుట్టు, గోర్లు, చర్మం మొదలైనవి ఆరోగ్యంగా పెరగాలంటే ఈ పోషకం అవసరం. అలాగే శరీరానికి కావలసినంత విటమిన్ డి, చర్మానికి విటమిన్ ఈ కూడా అవసరం. మొత్తంగా చెప్పాలంటే విటమిన్, ప్రోటీన్ బ్యాలెన్స్డ్ గా ఉండాలి. దాంతో పాటు జుట్టు సంరక్షణ ముఖ్యం. ప్రస్తుత కాలంలో పొల్యూషన్, జంక్ ఫుడ్ వంటివి మనిషి భౌతిక స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తుంటాయి. అదే అదే భౌతిక స్వరూపమంటే బాడీ షేప్ అన్నమాట. ఇలా ఇన్ని సమస్యలు మనిషి చుట్టూరా ఉన్నప్పుడు ఆ జుట్టును కోల్పోయేవాళ్ళు కూడా  లోలోపల బాధపడుతూనే ఉంటారు. కానీ ఆ బాధ కంటే కూడా బయటి వాళ్ళు వేలెత్తి చూపించి వెకిలిగా నవ్వుతూ జోక్స్ వేస్తుంటే మాత్రం ఇంకా ఇంకా కుమిలిపోవడం జరుగుతుంది. లేనిదాన్ని ఎక్కడి నుండి తెస్తారు? అదే లేని జుట్టును ఎక్కడి నుండి తెస్తారూ అని ఎవరైనా ఆలోచిస్తారా?? ఎంతసేపూ నీ పిలక, నీ బట్టతల అని ఏకసెక్కాలే కానీ జట్టులో ఏముందిలే మనిషి స్వభావం మంచిది అని ఎవరైనా అనుకుంటారా?? లేదే ఇతరుల్ని ఇన్సల్ట్ చేయడం అదొక రాచకార్యం అయిపోయింది అందరికీ.  ఇవన్నీ తెలిసాక ఇంకొక విషయం. ఉత్తరప్రదేశ్ లో ఉన్నావ్ లో రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అరేంజ్డ్ మ్యారేజ్ లో పెళ్లిలో పెళ్లి కొడుకు పాపం కళ్ళు తిరిగి పడిపోయాడు. అమ్మాయి వాళ్ళ అన్నయ్య పెళ్లి కొడుకు ముఖం మీద నీళ్లు జల్లి పైకి లేపుతున్నపుడు అతడి టైమ్ బాగలేక పెట్టుకున్న విగ్గు జారిపోయింది, అప్పటివరకు పెళ్లి కొడుక్కు స్టైల్ హెయిర్ స్టయిల్ అనుకున్న అమ్మాయి డిజప్పాయింట్ అయిపోయింది. ఇంకేముంది సినిమాటిక్ గా ఈ పెళ్లి క్యాన్సిల్ డైలాగ్ కూడా చెప్పేసింది. చెప్పేసాక ఇక ఏమవుతుంది ?? పెళ్లి ఆగిపోయింది. ఇలా ఇలా అన్నీ బాగున్నా కేవలం జుట్టు కారణంగా మనుషుల మధ్య ముఖ్యంగా ఆడ, మగ రిలేషన్స్ మధ్య ఈ జుట్టు పెద్ద సమస్యలే తెచ్చిపెడుతోంది.  అందుకే జుట్టు విషయంలో పిచ్చిగా ఉండకండి. లైట్ తీసుకోండి.                              ◆వెంకటేష్ పువ్వాడ.

పసిపిల్లలను పని పిల్లలుగా చేయొద్దు!

చట్టాల ప్రకారం బడి వయసు పిల్లలు బడిలో ఉండాలి. వాళ్ళు బయట పనులు చేయకూడదు. అందరికీ విద్యలో భాగంగా ప్రభుత్వాలు అన్ని వర్గాల వారికీ ఉచిత విద్యను ప్రవేశ పెట్టాయి. ఎన్నో పథకాలు ప్రవేశపెట్టాయి. ఆఖరికి పాఠశాలలోనే భోజనము పెడుతూ పిల్లలను విద్యాధికులుగా మార్చి ఈ దేశానికి బంగారు బాటలు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.కానీ పిల్లలందరూ చదువుకోవడం లేదేందుకు? పేదరికం! పసిపిల్లల జీవితాలు పనిపిల్లల వర్గంలో పడిపోవడానికి కారణం పేదరికం అనేది నమ్మాల్సిన నిజం. పేదరికం ఉంటే ఏంటి ప్రభుత్వాలు ఉచిత విద్య అందిస్తున్నాయి కదా అనే ప్రశ్న అందరికీ వస్తుంది. కానీ సమస్య కేవలం పసిపిల్లలదే అయితే పరిష్కారం అయిపోతుంది. ఇక్కడ  సమస్య ఆ పసిపిల్లల కుటుంబాలది. చిన్నతనంలోనే కుటుంబాన్ని మోయాల్సిన బాధ్యతాయుతమైన వ్యక్తులు చనిపోవడం వల్ల ఇంటి భారాన్ని భుజాలకు ఎత్తుకుని పనిపిల్లలుగా మారుతున్నవాళ్ళు అధికం.  బాలకార్మికులు! ఈ కాలంలో ప్రతిరోజూ ప్రతి వీధిలో కనీసం ఒక్కరైనా బడిలో ఉండాల్సిన పిల్లలు పనులు చేస్తూ కనిపిస్తారు. ఇంటి పనులు చేస్తూ, బిల్డింగ్ వర్క్ లు, షాప్ లలోనూ ఆఫీసులలోనూ ఫ్లోర్ తుడుస్తూ, ఇంకా వీధుల్లో ఆహారపదార్థాలు అమ్ముతూ, ట్రైన్ లలోనూ, బస్టాండ్ లలోనూ, ఫ్లాట్ ఫామ్ ల మీద ఎక్కడ చూసినా లేత చేతులు, కాళ్ళు మోయలేని బరువులతో ఆగని నడకలతో సాగుతూనే ఉంటారు. వీళ్ళందరూ తమ బాల్యాన్ని సంతోషంగా గడపలేకపోయినా చెప్పలేనంత భారంతో జీవిత బండ్లు లాగుతున్నవాళ్ళు. సమాజం వీళ్ళను బలకార్మికులు అంటోంది. సుమారు 5 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్లు ఈ బాలకార్మికులలో భాగంగా ఉన్నారు. కారణాలు! పైన చెప్పుకున్నట్టు పేదరికం బాలకార్మికులు తయారవ్వడానికి మూలకారణం. అది మాత్రమే కాకుండా అనాథ పిల్లలు ఈ వర్గంలోకి అర్థాంతరంగా వచ్చి పడుతున్నారు. పిల్లల బరువు మోయలేమనే కారణంతో కొందరు పిల్లలను ఎక్కడంటే అక్కడ వదిలేసి బరువు దించేసుకుంటారు. అలాంటి పిల్లలు బ్రతకడానికి  ఎన్నో మార్గాలు వెతుకుతూ పనివాళ్లుగా మారిపోతున్నారు.  ఆర్థిక భరోసా లేని జీవితాల వల్ల పిల్లలకు ఎలాంటి రక్షణ ఉండదు. పెద్దవాళ్ళ లాగా పనికి తగ్గ పలితాన్ని డిమాండ్ చేసే ఆలోచన, ధైర్యం వాళ్లకు ఉండవు. జీవితం గురించి ఒకానొక భయం వాళ్ళను వెంటాడుతూ ఉంటుంది. కేవలం కడుపు నింపుకోవడానికి అడ్డమైన చాకిరీ చేస్తుంటారు. యజమానులు కూడా కఠినంగా ఉంటూ పిల్లల్ని తమ గుప్పెట్లో పెట్టుకుని శ్రమదోపిడి చేస్తారు.  తల్లిదండ్రులు, సంరక్షకులు ఉండే పిల్లలు ఈ వర్గంలోకి రావడం చాలా అరుదు. ఎటొచ్చి అయినవాళ్ళు లేకుండా వీధినపడ్డ వాళ్ళు ఎక్కువ. ఇంకా పేదరికంలో ఉండే కుటుంబాలలో బాధ్యత లేని తండ్రుల వల్ల బాలకార్మికులుగా మారుతున్నవాళ్ళు ఎక్కువ.  ముంబయ్, ఢిల్లీ, హైదరాబాద్, కలకత్తా వంటి రాజధాని ప్రాంతాలలో స్లమ్స్ ఏరియాలలో ఇలాంటి బాలకార్మిక పసి కుసుమాలు ఎక్కువ. పరిష్కారాలు! ఈ బాలకార్మికులకు నివాసం, రక్షణ అనేది పెద్ద ప్రశ్నలుగా ఉంటాయి. ప్రస్తుత భారతదేశంలో పిల్లలకు ఉచిత విద్య అందించినా సరైన రక్షణ లేక, ఒక మంచి మార్గనిర్దేశకం చేసేవాళ్ళు లేక చాలా అయోమయంలో పడిపోతున్నారు. నిజానికి సమాజంలో ఉన్న అందరూ సంకల్పం చేసుకుంటే బాలకార్మిక వ్యవస్థను చాలా వరకు నిర్మూలించవచ్చు. ప్రస్తుత కాలంలో పిల్లలకు మేమున్నామనే ధైర్యం ఇస్తూ ఉంటే ఎంచక్కా చక్కగా చదువుకుంటారు. వాళ్ళ ప్రతిభను అనుసరించి ఎన్నో ఫౌండేషన్ లు డొనేషన్ లు విద్యార్థులను ఆదుకుంటున్నాయి. ఆలోచించుకోలేని వయసులో కాసింత ఆవాసం ఇస్తే బాలకార్మికులు కాస్తా బావిభారత పౌరులు అవుతారు. ◆వెంకటేష్ పువ్వాడ.

ఈ స్వేచ్ఛకు మూలం ఇదే!

దేశం యావత్తూ భారతదేశానికి వచ్చిన స్వాతంత్య్రం గురించి గొప్పగా పొంగిపోతుంది. స్వాతంత్య్రం సిద్దించినప్పుడు దేశాన్ని నడిపిస్తున్న నాయకుల వల్లనే దేశ స్వాతంత్య్రం సాధ్యమయ్యిందని నినదిస్తుంది. స్వాతంత్య్రం నుండి గణతంత్ర్యం వరకు ఇదే తీరు పెఅతి చోటా కనిపిస్తుంది. కానీ భారతదేశ స్వేచ్చా పోరాటాలు ముందుకు సాగడానికి ప్రాణాలను ఎంతో సునాయాసంగా చేతుల్లో నుండి జారవిడిచిన వీరుల ప్రేరణా ఫలితమే ఈ స్వాతంత్ర్య భారతం. అటువంటి వారిలో భగత్ సింగ్ మొదటి వరుసలో ఉంటారు. అతిచిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ చివరి క్షణాల గురించి వింటే ప్రతి భారతీయ యువత గుండె ఉప్పొంగుతుంది. భారతీయులలో ఉత్తేసిజం కలుగుతుంది.   భారత స్వాతంత్ర్య విప్లవజ్యోతి సర్దార్ భగత్ సింగ్ కు ఉరిశిక్ష పడుతుందని ముందే తెలుసు. అందుకే తనతోపాటు శిక్ష పడుతున్న తన స్నేహితులు రాజగురు దత్తులకు, లియోనాయిడ్ ఆండ్రీన్ రాసిన  'సెవెన్ దట్ వర్ హ్యాంగ్' అనే  నవలను చదివి వినిపిస్తూ ఉండేవాడు. ఆ నవలలో ఒక పాత్రకు ఉరిశిక్ష పడుతుంది. అయితే ఆ పాత్ర “నన్ను ఉరి తీయకండి”, “నన్ను ఉరితీయకండి" అంటూ ఉంటుంది. చివరకు ఉరి తీయడానికి ఉరి కంబం వద్దకు తీసుకువెళ్ళేటప్పుడు కూడా “నన్ను ఉరి తీయకూడదు" అంటూనే ఉంటుంది. భగత్ సింగ్ ఆ ఘట్టం వర్ణించేప్పుడు అతని కళ్ళు వర్షించేవి. అది చూసిన సదరు స్నేహితులు మృత్యువంటే రమ్మని సవాల్ చేసే తమ కామ్రేడ్, మరణభయంతో వణికే ఒక నవలా పాత్ర కోసం కన్నీరు కార్చే దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డారు. 1931 మార్చి 23వ తేదీన భగత్ సింగ్ కు  ఉరిశిక్ష అమలు జరుపుతున్నా సమయంలో భగత్ సింగ్ ఉరి కంబం దగ్గరకు వెళ్ళాడు. అక్కడే ఉన్న మేజిస్ట్రేట్ తో.. "మేజిస్ట్రేట్ సాబ్! మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ఒక భారతీయ విప్లవకారుడు, తన మహత్తర లక్ష్యసాధన కోసం నవ్వుతూ ప్రాణాలర్పించడానికి ఉరి కంబం ఎలా ఎక్కుతాడో చూసే అవకాశం మీకు దొరికింది” అని చెప్పి చిరునవ్వుతో ఉరి కంబపు ఉరి తాడు మెడకు తగిలించుకున్నాడు.  "నా జీవనజ్యోతి ఉదయపు వెలుగులా ఆరిపోయినా, మా ఆదర్శం, మా భావాలు విద్యుల్లతల్లా ప్రపంచాన్నంతా జాగృతం చేస్తాయి. నా పిడికెడు బూడిద నశించిపోతే ప్రపంచానికి నష్టమేమిటి?” అన్నాడు. కేవలం ఇది మాత్రమే కాదు. భగత్ సింగ్ కు ఉరిశిక్ష అని తెలిసిన తరువాత ఆయన తాంత్రి తన కొడుకును ఆ శిక్ష నుండి తప్పించాలని ఎంతగానో ప్రయత్నం చేసాడు. అప్పుడు భగత్ సింగ్ తన తండ్రి కోసం ఒక ఉత్తరం రాసాడు. ఆ ఉత్తరాన్ని చదివితే ప్రతి భారతీయుడు దేశానికి ఎంతో గౌరవం ఇస్తాడు. ఆ ఉత్తరం ఇలా సాగుతుంది... పూజ్యులైన తండ్రిగారికి, నన్ను ఉరికంబం నుంచి తప్పించేందుకు కన్నతండ్రిగా మీరు పడుతున్న తపనకు కొడుకుగా సంతోషపడతానేమో, కానీ ఈ దేశపౌరుడిగా మాత్రం సిగ్గుపడుతున్నాను. మీ కొడుకునైనందుకు మీ ఆశల్ని, ఆకాంక్షల్ని గౌరవిస్తాను. కానీ మీ కన్నా ముందు ఈ మాతృభూమి రుణం తీర్చుకునే హక్కు నాకు లేదంటారా? నేను బ్రిటిషర్లపై చేసిన దాడిని నేరంగా భావించటం లేదు. అందుకే నేనెప్పుడూ మీ ముందు నిర్దోషినని నిరూపించుకునేందుకు, కోర్టులో వాదించేందుకు అంగీకరించలేదు. నాన్నా... నా జీవితం మనదేశం కన్నా విలువైందేమీ కాదు. కేవలం నా జీవితమే కాదు ప్రతి యువకుడి జీవితం కూడా ఇలా మాతృభూమికే సమర్పణం చేయాలని నమ్ముతాను. అందుకు ఎన్ని ప్రతిఘటనలనైనా ఎదుర్కోవాలి. అలాంటి ప్రగతి కోసం నిలబడే ఏ వ్యక్తి అయినా కాలం తీరిన పాత విశ్వాసాల్ని సవాలు చేయాలి. నాకు తెలుసు నా మెడకు ఉరితాడు బిగించడమే జీవితంలో ఆఖరిక్షణం అవుతుంది. అయినా ఒక లక్ష్యం కోసం పోరాడిన జీవితానికి అలాంటి ముగింపు గర్వకారణమే కాని దయనీయం కాదు. ఎలాంటి స్వార్ధం లేకుండా, ఎలాంటి పారితోషికం ఆశించకుండా నా జీవితాన్ని దేశస్వాతంత్య్రం కోసం అర్పించాననే సంతృప్తితో, చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానిస్తున్నాను. మానవాళికి సేవచేయటానికి, పీడితులకు విముక్తిని కల్పించటానికి యువతరం ముందుకొచ్చినప్పుడే నవయుగానికి నాంది సాధ్యమవుతుంది.  నాన్నా... నా మరణం తరువాత  ముందు తరాలకు త్యాగమనే సుగుణం తీగలా వ్యాపించేలా చూడండి. ఎలాంటి పరీక్షాసమయంలోనైనా మహత్తరమైన మానసిక దృఢత్వాన్ని సడలనీకుండా చూసుకొమ్మని ప్రోత్సహించండి... ఇక సెలవు…                         ఇట్లు                మీ ప్రియ పుత్రుడు                   భగత్ సింగ్. ఓసారి ఇలాంటి విప్లవ వీరుల మాటలు, వారి అంతరంగం విన్నా, వారి నాటి స్థితిగతులు తెలుసుకున్నా దేశానికి తగిన మార్గం ఈ భారతీయ పౌరులకే అర్థమవుతుంది.                                    ◆నిశ్శబ్ద.