Read more!

యుద్ధం ముగింపా? కాదు అదే మొదలు వీరి జీవిత పోరాటానికి!

"యుద్ధం" ప్రపంచ దేశాల నుండి సాధారణ పౌరుల వరకు ఉలిక్కిపడే విషయమిది. కేవలం ఒక చిన్న పదంలో ఎంతో భీభత్సం దాగుంది. ఎన్నో జీవితాల దైన్యం నిమిళితమై ఉంది, వందలు, వేలు, లక్షల కొద్దీ ప్రాణాలు ప్రశ్నార్థకమై నిలుచుంటాయి. ద్వాపర యుగంలో జరిగిన కురుక్షేత్ర మహా సంగ్రామం నుండి నేడు ఇంకా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వరకు, యుద్ధానికి ఫలితం ఏమిటి అనేది ప్రతి దశలో తెలుస్తూనే ఉంది అందరికీ. మరీ ముఖ్యంగా ఈ యుద్ధాలలో జరిగిన నష్టం ఏమిటి?? కేవలం ప్రాణాలు, ఆస్తుల నష్టాలేనా??  

యుద్దాల వల్ల సంభవించే మరొక భయంకరమైన పరిణామం ఉంది. అదే భవిష్యత్తరాలు అనాథలుగా మారడం. మరీ ముఖ్యంగా ఈ యుద్ధాల వల్ల చిన్న పిల్లల జీవితాలు దుర్భరంగా మారతాయి.  యుద్ధాలలో మరణించే వారి పిల్లల బాధ్యత తీసుకునేవారు ఎవరూ ఉండరు. వారు శరణార్ధులుగా ఇతర దేశాలకు వలస పోయి అనాథలుగా బ్రతకాల్సి వస్తుంది. దీన్ని పరిగణలోకి తీసుకుని ఐక్యరాజ్యసమితి యుద్ధ అనాథల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 6వ తేదీన జరుపుతూ వస్తోంది. 

దీని ఉద్దేశం ఏమిటి?? 

యుద్ధాల కారణంగా అనాథలుగా మారిన పిల్లల గురించి అవగాహన కల్పించడం ఈ దినోత్సవం లక్ష్యం.  ఈ రోజు యుద్దాల కారణంగా అనాథలుగా మారిన పిల్లల కష్టాలను, వారు పెరుగుతున్నప్పుడు ఎదుర్కొనే మానసిక, సామాజిక, శారీరక పరిస్థితులను, వారి ఇబ్బందులను, వారి కనీస అవసరాల కోసం, భద్రత కోసం వారు చేసే పోరాటాన్ని అందరికీ తెలిసేలా చేయడం ముఖ్య ఉద్దేశం.  

పరిస్థితులు ఎలా ఉన్నాయి??

యుద్దాలు పరిణమించడం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనాథలుగా మారుతున్న వారి లెక్కలను ఐక్యరాజ్యసమితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉంటుంది. 2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 140 మిలియన్ల మంది అనాథలు ఉన్నారు, ఇందులో ఆసియాలో 61 మిలియన్లు, ఆఫ్రికాలో 52 మిలియన్లు, లాటిన్ అమెరికా, కరేబియన్‌లలో 10 మిలియన్లు, తూర్పు ఐరోపా, మధ్య ఆసియాలో 7.3 మిలియన్లు ఉన్నారు. ఈ లెక్క లక్షలాది మంది పిల్లలు అనాథలుగా మారారనే దానికి  సాక్ష్యంగా స్పష్టతను ఇస్తుంది. 

చేదు నిజం ఏమిటంటే.. 

మొత్తం అనాథల్లో 95 శాతం మంది ఐదేళ్లకు పైబడిన వారే.  అంటే ఐదేళ్ల నుండే తమవారిని కోల్పోయి అగమ్యగోచరమైన పరిస్థితిలో పిల్లలున్నారు. అభివృద్ధి చెందిన దేశాలలో అనాథల సంఖ్య చాలా తక్కువగా ఉంది.  కానీ, యుద్ధాలు, భయంకరమైన అంటువ్యాధులకు గురైన ప్రదేశాలలో, అనాథల సంఖ్య గణనీయంగా ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది.

ఎదుర్కొంటున్న పరిణామాలు ఏమిటి??

దేశాల మధ్య రగిలే సమస్యలు కాస్తా ఇరుదేశాల్లోని ప్రజల మీద ప్రభావం చూపిస్తాయి. ఇవి యుద్ధానికి దారితీసినప్పుడు లక్షలు, కోట్ల మంది ఎంతో సునాయాసంగా జీవితాలను జార్చుకుంటున్నారు. దేశాల మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం ప్రజలకు లేకపోవడం వల్ల ఆ దేశాల చర్యలకు ప్రజలు బలిపశువులవుతున్నారు. యుద్ధాలలో పెద్దవారు, యువకులు మరణించగా దిక్కుతోచని స్థితిలో పసిపిల్లలు అనాథలవుతున్నారు. వీరు ఆహారం, ఆశ్రయం, భద్రత విషయంలో ప్రతి రోజునూ లెక్కపెట్టుకుంటూ జీవించాల్సి వస్తోంది.

గత లెక్కల చిట్టా ఏమి చెబుతోంది??

ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం అనాథల సంఖ్య 1990 నుండి 2001 వరకు పెరిగింది.  అయినప్పటికీ, 2001 నుండి,  ఈ సంఖ్య స్థిరంగా తగ్గుతూ వచ్చింది. ఆ కాలంలో సంవత్సరానికి 0.7% మాత్రమే నమోదు అయింది.   1990లో 146 మిలియన్లు, 1995లో 151 మిలియన్లు, 2000లో 155 మిలియన్లు,  2005లో 153 మిలియన్లు, 2010లో 146 మిలియన్లు  2015లో 140 మిలియన్లు గా నమోదయ్యాయి.

ప్రస్తుతం ఏమి చేయొచ్చు??

ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి అందరికీ తెలిసిందే.. రెండు దేశాల మధ్య సమస్యగా మొదలైన ఈ యుద్ధం కాస్తా మరింత దీర్ఘకాలం కొనసాగితే మూడవ ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే ప్రపంచం మొత్తం మీద కోట్ల కొద్దీ మరణాలు సంభవించడమే కాకుండా ఎంతో మంది పిల్లలు అనాథలుగా మారతారు. కాబట్టి దేశాల మధ్య సమస్యలకు యుద్దమే పరిష్కారం కాదనే విషయం మనకు తెలిసిన సగటు పౌరుడి చేతిలో దాన్ని అడ్డుకునే అస్త్రం లేకపోయినా అనాథలను ఆదుకునే మనసు, వారికి ఆశ్రయమిచ్చే తాహతు మనకున్నప్పుడు అలాగే చేయడం అందరి ధర్మం. యుద్ధం ముగింపు కాదు, కొన్ని కోట్లమంది పిల్లల జీవితాల పోరాటానికి అది మొదలవుతుంది. 

                                     ◆నిశ్శబ్ద.