బాబోయ్ సంచయిత.. నేను వేగలేనంటున్న సింహాచలం దేవస్థానం ఈవో.!
posted on Nov 13, 2020 @ 5:27PM
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక గజపతిరాజును తప్పించి సంచయితను చైర్మన్ గా నియమించిన సంగతి తెల్సిందే. అయితే ఆమె బాధ్యతలు చేపట్టిన తరువాత నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తలలో ఉంటూనే ఉన్నారు. తాజాగా సింహాచలం దేవస్థానము ఈవో తనను బదిలీ చేయాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్ కు అర్జీ పెట్టుకున్నారు. దేవస్థానం ఈవో త్రినాథరావు తను ఇక్కడ పనిచేయలేనని, తనను వెంటనే బదిలీ చేయాలని తాజాగా ఆర్జీ పెట్టుకున్నారు. ఇక్కడ విశేషమేంటంటే అయన మొన్న సెప్టెంబర్ లోనే బాధ్యతలు చేపట్టగా అప్పుడే బదిలీ కోరటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా త్రినాథ రావుకు ముందు దేవస్థానం ఈవోగా బాధ్యతలు నిర్వహించిన భ్రమరాంబ కూడా ఆ బాధ్యతల్లో రెండు నెలలకు మించి పనిచేయలేకపోయారు. ఈవోలంతా వరుసగా బదిలీ కోరటం వెనుక మన్సాస్ ట్రస్ట్ చైర్మన్ సంచయితతో వస్తున్న తీవ్ర విభేదాలే కారణమని తెలుస్తోంది. గత ఆరు నెలల కాలంలో ఏకంగా ముగ్గురు ఈవోలు మారటం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.