గోవిందా.. ఏంటీ దారుణాలు! ఎస్వీబీసీని బజారున పడేశారా?
posted on Nov 13, 2020 @ 2:08PM
మహిళా ఉద్యోగులకు లైంగిక వేధింపులు.. పోర్న్ సైట్ లింకులు.. నిధుల్లో అక్రమాలు. ఇవి తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా నడిచే భక్తి చానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ లో వెలుగు చూస్తున్న వ్యవహారాలు. వరుసగా జరుగుతున్న ఘటనలతో శ్రీవారి చానెల్ అప్రదిష్ట పాలవుతుంది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఎస్వీబీసీ పూర్తిగా గాడి తప్పినట్లుగా మారిపోయింది. మాజీ చైర్మన్ వ్యవహారాలు, బోర్డు గందరగోళ నిర్ణయాలతో ప్రతిష్టాత్మక ఛానెల్ పరువు నవ్వులపాలైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఇష్టారాజ్యంతోనే భక్తి చానెల్ బజారున పడే పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు వస్తున్నాయి. శ్రీవారి చానెల్ లో జరుగుతున్న పరువు పోయే పరిణామాలతో వెంకన్న భక్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఎస్వీబీసీలో తాజాగా వెలుగుచూసిన పోర్న్ సైట్ లింక్ వ్యవహారం టీటీడీకి తలనొప్పిగా మారింది.ఈ ఘటనలో విచారణ జరిపేకొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఎస్వీబీసీ ఛానెల్ లో పనిచేసే ఉద్యోగుల్లో కొంతమంది పనిమానేసి పోర్న్ సైట్స్ చూడటానికి ఆఫీస్ సిస్టమ్స్ ఉపయోగిస్తున్నట్టు తేలింది. ఎస్వీబీసీలో పనిచేసే ఉద్యోగి పోర్న్ లింక్‌లు పంపటం నిజమేనని టీటీడీ విజిలెన్స్ విచారణలోనూ తేలింది. దీంతో పోర్న్ వీడియో పంపిన ఉద్యోగితోపాటు పోర్న్ సైట్లు చూస్తున్న మరో ఐదుగురు ఉద్యోగులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంది ఎస్వీబీసీ యంత్రాంగం.
శతమానం భవతి కార్యక్రమం కోసం ఒక భక్తుడు మెయిల్ చేయగా తిరిగి భక్తుడికి ఎస్విబిసి ఉద్యోగి ఓ అశ్లీల సైట్ లింక్ పంపారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తుడు టిటిడి చైర్మన్ కు ,ఈవో కు దీనిపై ఫిర్యాదు చేశారు. పోర్న్ సైట్స్ వ్యవహారం భక్తుడి ఫిర్యాదు ద్వారా వెలుగులోకి రావడంతో.. టీటీడీ ఉలిక్కి పడింది. వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టిందిఎస్వీబీసీ. సైబర్ క్రైమ్ పోలీస్ బృందం రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తోంది. 82 కంప్యూటర్లను, సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. మిగతా కంప్యూటర్లలో కూడా పోర్న్ సైట్స్ చూసినట్టు ఆధారాలున్నాయని, బ్రౌజర్ హిస్టరీలో అన్ని విషయాలు బైటపడ్డాయని తెలిసింది. అయితే ఆ సమయంలో కంప్యూటర్లను ఎవరు వినియోగించారు, ఎవరు పోర్న్ సైట్స్ చూశారనే విషయాన్ని నిర్థారించుకునేందుకు సీసీ టీవీ ఫుటేజ్, అటెండెటన్స్ ను పరిశీలిస్తున్నారు.
వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాకా ఎస్వీబీసీ చానెల్ లో భక్తుల మనోభావలకు భంగం కలిగే పరిణామాలే వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఎస్వీబీసీ బోర్డుకు జగన్ సర్కార్ నియమించిన చైర్మెన్ వ్యక్తే లైంగిక వేధింపులు చేస్తూ దొరికిపోవడం తీవ్ర దుమారం రేపింది. ప్రతిష్టాత్మక శ్రీవారి భక్తి చానెల్ చైర్మెన్ గా కమెడియన్ కమ్ యాక్టర్ పృథ్వీని నియమించింది. ఆయన పదవి చేపట్టిన కొన్ని రోజులకే గత జనవరిలో మహిళా ఉద్యోగులను వేధిస్తున్న ఘటన వెలుగు చూసింది. మహిళా ఉద్యోగితో పృధ్విరాజ్ మాట్లాడిన ఆడియో లీక్ అవడం పెద్ద సంచలనమే సృష్టించింది. ఆ ఆడియో కారణంగా పృథ్వీపై ఆరోపణలు రావడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. తర్వాత కూడా పలు ఆరోపణలు వచ్చాయి. ఎస్వీబీసీ నిధుల్లోనూ అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి.
ధార్మిక ప్రచారం కోసం 2008లో శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్‌ను ప్రారంభించింది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి ఆలయం లోపల, వెలుపల జరిగే కార్యక్రమాలతో పాటు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ధార్మిక కార్యక్రమాలను ప్రసారం చేసేందుకు ఈ చానల్‌ను ప్రారంభించింది టీటీడీ. చానల్ పరిపాలన వ్యవహారాలను చూసుకోవడానికి ప్రత్యేకంగా బోర్డ్ ని...చైర్మన్ ని కూడా నియమించింది . ఇలా గొప్పగా ప్రారంభించిన ఛానల్ వివాదాలకు చిరునామాగా మారడం భక్తులను కలవరపరుస్తోంది. నియామకాలు..కొనుగోలు, కార్యక్రమాలు నిర్వహణ వరకు అంతటా అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గత చైర్మన్ పృథ్విరాజ్ వ్యవహరించిన తీరు ఛానల్ ప్రతిష్టతో పాటు టీటీడీ పరువును బజారు కీడ్చినట్లయింది.
ఎస్వీబీసీలో జరుగుతున్న ఘటనలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ కార్యకర్తలు నిరసనలు చేస్తుండగా.. ఏపీ రాష్ట్ర బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ దీయోధర్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఛానల్‌లో అసాంఘిక ఘటనలు జరగడం బాధాకరమన్నారు సునీల్ దీయోధర్. అయోధ్య భూమి పూజను కూడా ఎస్వీబీసీ ప్రసారం చేయలేదని విమర్శించారు. తప్పులు చేయడం.. తర్వాత క్షమాపణలు చెప్పి సరిద్దిదుకోవడం టీటీడీకి సర్వసాధారణంగా మారిందన్నారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. టీటీడీ ఆస్తులు, నిధులను ప్రభుత్వం కాపాడాలని సునీల్ దీయోధర్ అన్నారు.
ఎస్వీబీసీ టీవీ ఛానల్ లో వెలుగు చూసిన అశ్లీల సైట్ లింక్ ఘటనతో పాటు గత ఏడాది కాలంగా వరుసుగా జరుగుతున్న ఘటనలతో శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు తిరుమల శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలన్న సంకల్పంతో టీటీడీ ఏర్పాటు చేసిన ఎస్వీ భక్తి ఛానల్‌కు రాజకీయ గ్రహణం పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. ధర్మ ప్రచారానికి నిర్వహించే ఛానల్ లో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడటం దురదృష్టకరమని మండిపడుతున్నారు. ఎస్విబిసి పవిత్రతను కాపాడాలంటూ హిందూ సంఘాలు ఆందోళనలు కూడా చేస్తున్నాయి. టీటీడీ పవిత్రత కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందంటున్నారు భక్తులు.