దుబ్బాక ఓడినా గులాబీకి తొందర! గ్రేటర్ కారణాలివేనా?
posted on Nov 13, 2020 @ 9:50AM
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలని టీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఎన్నికల సంఘం చకాచకా ఏర్పాట్లు కూడా చేస్తోంది. అయితే దుబ్బాక ఉప ఎన్నికలో ఓడిపోవడంతో షాకైన.. గులాబీ పార్టీ గ్రేటర్ ఎన్నికలపై వెనక్కి తగ్గుతుందని అంతా భావించారు. ముందస్తుకు వెళ్లకుండా.. షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరిలో గ్రేటర్ ఎన్నికలకు వెళ్లవచ్చని రాజకీయ పార్టీలు భావించాయి. అయితే అందరి అంచనాలకు భిన్నంగా వీలైనంత త్వరగా బల్దియా ఎన్నికలు ముగించాలని కారు పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దుబ్బాకలో ఓడినా గ్రేటర్ హైదరాబాద్ లో ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధపడటం వెనుక బలమైన కారణాలే ఉన్నాయంటున్నారు.
దుబ్బాకలో కమలం వికసించడంతో కారు పార్టీ నేతలకు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల టెన్షన్ పట్టుకుందట. దుబ్బాక ఫలితంతో రాష్ట్రంలో బీజేపీ పుంజుకోవచ్చని వారు భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే గ్రేటర్ లో బీజేపీకి పట్టుంది. దుబ్బాక తర్వాత సమీకరణలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. గ్రేటర్ ఎలక్షన్స్ను ఆలస్యం చేస్తే బీజేపీ పుంజుకుంటుందని, తమ పార్టీ కేడర్ వలసపోవచ్చనే భయం గులాబీ పెద్దల్లో ఉందని చెబుతున్నారు. గ్రేటర్ పరిధిలో బీజేపీకి పుంజుకునే చాన్స్ ఇవ్వొద్దన్న ఆలోచనలో టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారని చెబుతున్నారు. దుబ్బాక ఫలితం తర్వాత గ్రేటర్లో బీజేపీ బలం పెంచుకునేందుకు ట్రై చేస్తున్నదని, అలాంటి అవకాశం ఇవ్వకుండా వెంటనే ఎన్నికలు పెట్టేలా సమాలోచనలు జరుపుతున్నట్లు టీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. గ్రేటర్ పార్టీ లీడర్లకు దీనిపై సంకేతాలు కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు.దుబ్బాక ఫలితం ప్రభావం గ్రేటర్ లో పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైనా వారితో చర్చలు సాగిస్తున్నట్లు తెలిసింది. కచ్చితంగా ముందస్తుకు వెళ్లాలని నిర్ణయించినందు వల్లే గత వారం రోజులుగా నగరంలో మంత్రులు జోరుగా పర్యటిస్తూ ప్రారోంభత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారని చెబుతున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు వందలాది కాలనీలు నీట మునిగాయి. వరద బాధితులకు సాయం చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే 4 వందల కోట్ల రూపాయల వరకు పంపిణి చేసింది. షెడ్యూల్ వచ్చే వరకు మరో 150 కోట్ల రూపాయలు పంపిణి చేయాలని టీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. హైదరాబాద్లో వరద సాయం పంపిణీ కొనసాగుతున్నందున ఆ సాయం గురించి జనం మరువక ముందే ఎలక్షన్స్ పెడితే ఫాయిదా ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నట్లు సమాచారం. గ్రేటర్ లో ఒక్కో కుటుంబానికి రూ. 10 వేల చొప్పున 5.50 లక్షల మందికి నగదు సాయం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికి 4.50 లక్షల మందికి ఆర్థిక సాయం చేసినట్లు టీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. లోకల్ కార్పొరేటర్, లీడర్ల పర్యవేక్షణలో సాయం పంపిణీ జరుగుతోంది. బాధితుల సంఖ్య పెరిగితే మరిన్ని నిధులు విడుదల చేసేందుకు సర్కారు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. సర్కారు ఆర్థిక పరిస్థితి సరిగా లేని టైంలో అందించిన ఈ సాయాన్ని ఓట్లుగా మల్చుకోవాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు చర్చ నడుస్తున్నది.
గ్రేటర్ వరద సాయంలో అక్రమాలు జరిగాయని, గులాబీ నేతలే కోట్లాది రూపాయలు కాజేశారనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో ఇది టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే టీఆర్ఎస్ నేతలు మాత్రం వరద సాయం తమకు ప్లస్ అవుతుందని ధీమాగా ఉన్నారు. ఇప్పటికే నాలుగన్నర లక్షల కుటుంబాలకు సాయం అందించామని, మరో లక్ష కుటుంబాలకు 10 వేల రూపాయలు ఇస్తామని చెబుతున్నారు. ఈ లెక్కన కుటుంబానికి మూడు ఓట్లు లెక్కేసినా 16 లక్షల మందికి పైగా సాయం చేసినట్లు. ఇవన్ని తమకు ఓట్ల రూపంలో కలిసి వస్తాయని గులాబీ నేతల అంచనాగా ఉంది. గ్రేటర్ లో 74 లక్షల ఓట్లుగా.. పోలయ్యేది 35 లక్షల వరకే ఉంటుంది. దీంతో తమకు గెలుపు ఈజీగానే ఉంటుందంటున్నారు టీఆర్ఎస్ నేతలు. వరద సాయంలో టీఆర్ఎస్ నేతలు కాజేశారని చెబుతున్నారు కాబట్టి.. లక్ష కుటుంబాలకు సాయం అందకపోయినా.. ఓట్ల సమయంలో వారికి డబ్బులిచ్చి మేనేజ్ చేయవచ్చని కుండబద్దలు కొడుతున్నారు గ్రేటర్ కారు పార్టీ నేతలు.
గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వరద సాయంగా కుటుంబానికి 10 వేల రూపాయలు ఇస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిని నిజం చేసేలానే వరద సాయం పంపిణి జరిగిందని చెబుతున్నారు. నిజమైన వరద బాధితులకు కాకుండా ఓట్లు ఉన్నవారికే డబ్బులు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. గ్రేటర్ లో ఓట్లు లేని వారి ఇండ్లు నీళ్లలో మునిగిపోయినా వారిని అధికారులు పట్టించుకోలేదంటున్నారు. దీన్ని బట్టి పక్కాగా గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసమే టీఆర్ఎస్ సర్కార్.. వరద సాయం చేస్తుందని... 550 కోట్ల ప్రభుత్వ సొమ్మును తమ పార్టీకి ఓట్లు కురిపించడానికి అప్పనంగా వాడుకుంటుందనే ఆరోపణలు విపక్షాలు చేస్తున్నాయి.
మొత్తంగా దుబ్బాక విజయంతో జోష్ మీదున్న బీజేపీకి గ్రేటర్ లో ఎక్కువ సమయం ఇవ్వొద్దన్న భావనతో పాటు వరద బాధితులకు అందిస్తున్న సాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని గులాబీ పెద్దలు ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. అందుకే దుబ్బాకలో ఓడిపోయినా గ్రేటర్ ఎన్నికలు ముందస్తుగా నిర్వహించాలని టీఆర్ఎస్ నిర్ణయించిందని తెలుస్తోంది.