ఎమ్మెల్సీల ఎంపికలో సర్ ఫ్రైజ్! దేశపతి, కర్నెకు షాక్
posted on Nov 13, 2020 @ 5:27PM
తెలంగాణలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను మంత్రివర్గం ఖరారు చేసింది. కొంత కాలంగా ప్రచారంలో ఉన్న నేతలను కాకుండా .. ఎవరూ ఊహించని వారిని మండలికి ఎంపిక చేసి అందరికి సర్ ఫ్రైజ్ ఇచ్చారు గులాబీ బాస్. ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను కేబినెట్ ఖరారు చేసింది. ఈ పేర్లను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. శాసనమండలి అభ్యర్థుల్లో ఎస్సీ, బీసీ, ఓసీల నుంచి ఒక్కొక్కరికి అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్.
గవర్నర్ కోటాలో మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్యకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. కాంగ్రెస్ నుంచి వరంగల్ తూర్పు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు సారయ్య. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 2016లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. త్వరలోనే గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో నగరానికి చెందిన బీసీ నేత బస్వరాజు సారయ్య కు అవకాశం కల్పిస్తూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
గవర్నర్ కోటాలోనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు ప్రజా కవి గోరంటి వెంకన్న. సీఎం కేసీఆర్ ఓఎస్డీగా ఉన్న దేశపతి శ్రీనివాస్ ను మండలికి పంపిస్తారని మొదటి నుంచి ప్రచారం ఉంది. ఆయన పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్లుగా కూడా ప్రచారం జరిగింది. అయితే అనూహ్యాంగా దేశపతికి బదులు గోరటి వెంకన్నను మండలి తలుపు తట్టింది. ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఒకటి ఎస్సీకి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారట. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన గోరటికి అదృష్టం కలిసి వచ్చిందని చెబుతున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా రాజకీయ నేతలు కాకుండా ఒకరిద్దరిని కళాకారుల నుంచి ఇవ్వాలని గవర్నర్ సూచించినట్లు గతంలో వార్తలు బయటికి వచ్చాయి. గోరటి ఎంపికకు ఇది కూడా ఒక కారణం కావచ్చని భావిస్తున్నారు.
మూడో మండలి అభ్యర్థిగా కొత్త వ్యక్తిని ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. మంత్రివర్గం ఖరారు చేసిన బొగ్గారపు దయానంద్ పేరు టీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా మందికి తెలియదు. ఆయన రాజకీయాల్లోనూ యాక్టివ్ గా లేరని చెబుతున్నారు. శాసనమండలికి దయానంద్ ఎంపిక అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కొత్తపేట మారుతీనగర్ కు చెందిన దయానంద్ ఆర్యవైశ్య సంఘంలో ప్రముఖ్య వ్యక్తిగా చెబుతున్నారు. ప్రస్తుతం వాసవి క్లబ్ చీఫ్ అడ్వయిజర్ గా ఉన్న దయానంద్ కు గ్రేటర్ పరిధిలోని వైశ్యులతో మంచి పరిచయాలు ఉన్నాయంటున్నారు. గ్రేటర్ ఎన్నికల కోసమే ఆయన ఎంపిక జరిగిందనే చర్చ జరుగుతోంది.
దివంగత నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నాటికే శాసనమండలిలో గవర్నర్ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అప్పటి నుంచి మండలి అభ్యర్థుల కసరత్తు జరుగుతూనే ఉంది. రెండు నెలల క్రితమే భర్తీ చేస్తారని ప్రచారం జరిగినా ఎందుకో ఆగిపోయింది. టీఆర్ఎస్ నేతలు చెబుతూ వచ్చారు. నాయిని నర్సింహరెడ్డితో పాటు ఉద్యమం నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్న కర్నెకు మరోసారి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె వాణిదేవి, టి.రవీందర్‌రావు తదితరుల పేర్లు కూడా వినిపించాయి. నాయిని ఆరోగ్యం క్షిణించడంతో ఎమ్మెల్సీ ఎన్నిక వాయిదా పడిందని అయితే వీరెవ్వరిని కనికరించలేదు కేసీఆర్.