అప్పుడు మోడీ.. ఇప్పుడు కేసీఆర్! జనాలను రోడ్లపై నిలబెట్టారని ఆరోపణలు
గత మూడు రోజులు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా జనాలే కనిపించారు. మీసేవా కేంద్రాల దగ్గర కిలోమీటర్ల మేర క్యూలైన్లు దర్శనమిచ్చాయి. జీరాక్స్ సెంటర్లు జనాలతో కిటకిటలాడాయి. ఆధార్, కరెంట్ బిలు, బ్యాంక్ అకౌంట్ ఫారాలు పట్టుకుని మహిళలు గంటల తరబడి లైన్లలో నిలబడ్డారు. పసి పిల్లలను చంకలో ఎత్తుకుని మండు టెండుల్లో కొన్ని గంటల పాటు పడిగాపులు పడ్డారు. వృద్ధులు కూడా తమకు ఆరోగ్యం సహకరించకున్నా లైన్లలో నిల్చున్నారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిల్చున్న జనాలు తోపులాడుకున్నారు. కొన్ని చోట్ల కుమ్ములాటలు కూడా జరిగాయి. కొందరు క్యూలైన్లలోనే సొమ్మసిల్లి పడిపోగా.. గోల్కొండ మీసేవా కేంద్రం దగ్గర ఓ మహిళ ప్రాణమే పోయింది. ఇదంతా సర్కార్ పంపిణి చేసిన వరద సాయం పొందేందుకు గ్రేటర్ ప్రజలు పడిన పాట్లు.
హైదరాబాద్ లో గత మూడు రోజులు కనిపించిన దృశ్యాలు చూసిన వారికి మూడేండ్ల కిందటి పరిణామాలు గుర్తుకువస్తున్నాయి. 2017 నవంబర్ అంటే సరిగ్గా ఇదే కాలంలో పెద్ద నోట్లను రద్దు చేసింది మోడీ సర్కార్. అప్పుడు కూడా జనాలు రోజుల తరబడి ఏటీఎంల ముందు, బ్యాంకుల ముందు క్యూ కట్టారు. తాము దాచుకున్న డబ్బులను తీసుకునేందుకు అవస్థలు పడ్డారు. బ్యాంకులు, ఏటీఎంల దగ్గర క్యూలు కట్టిన కొందరు అక్కడే కుప్పకూలి చనిపోయారు. నోట్ల రద్దు సమయంలో అనుభవించిన బాధలు ప్రజలకు ఇప్పటికీ మరిచిపోలేదు. ఇప్పుడు పది వేల రూపాయల వరద సాయం కోసం హైదరాబాద్ నగరంలో సేమ్ సీన్ రిపీట్ అయ్యిందని చెబుతున్నారు.
వరదలతో ఇబ్బంది పడిన ప్రతీ కుటుంబానికి గడప దగ్గరికే వచ్చి వరద సాయం అందిస్తామని మంత్రి కేటీఆర్ భరోసా కల్పించారు. వరద బాధిత కుటుంబాల లెక్కలన్నీ తమ దగ్గర ఉన్నాయని, వారందరికీ సాయం అందించే బాధ్యత ప్రభుత్వానిదేనని నమ్మకం కలిగించారు. అయితే నెల రోజులు దాటినా వరద బాధితులకు సాయం అందలేదు. 5 వందల కోట్ల రూపాయలు వరద సాయంగా పంపిణి చేశామని ప్రభుత్వం ప్రకటిస్తుండగా.. వరద బాధితులు మాత్రం తమకు సాయం అందలేదంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. దీంతో సర్కార్ పంపిణి చేసిన నగదు ఎక్కడికి వెళ్లిందో, ఎవరు నొక్కేశారో తెలియడం లేదు. వరద బాధితుల ఆందోళనలు పెరగడంతో దిగొచ్చిన సర్కార్... అందరికి సాయం చేస్తామని మీసేవా కేంద్రాల ద్వారా అప్లయ్ చేసుకోవాలని సూచించింది.‘మీ సేవ’ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుంటే నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే సాయం జమ అవుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వ ప్రకటనతో వరద సాయం కోసం ప్రజలు ఎగబడ్డారు. వరద బాధితులంతా మీసేవా కేంద్రాలకు పరుగులు పెట్టారు. ఆన్ లైన్ లో వచ్చిన దరఖాస్తుదారులకు సోమవారం ఒక్క రోజే రూ.55 కోట్లు పంపిణీ చేసినట్లు అధికారులు చెప్పారు. ఎలాంటి పరిశీలన లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి పది వేలు మంజూరవుతున్నాయనే అభిప్రాయం రావడంతో ప్రజలు లక్షల సంఖ్యలోనే క్యూ లైన్లలో నిలబడడం మొదలుపెట్టారు. దీంతో మంగళ, బుధవారాల్లో ‘మీ సేవ’ కేంద్రాల దగ్గర జనం బారులు తీరారు. దరఖాస్తుల వెల్లువ తట్టుకోలేక కంప్యూటర్ సర్వర్ సైతం ఆగిపోయిందంటే జనాలు ఏ రేంజ్ లో వచ్చారో అర్ధం చేసుకోవచ్చు. ఒక్క రూపాయి దరఖాస్తు ఫారం 20 రూపాయలకు, రూ.45 సర్వీసు చార్జి రూ.150 వరకూ పెరిగింది. ప్రభుత్వ యంత్రాంగం ఈ అవకతవకలను నిలువరించడంలో విఫలమైంది.
వరద సాయం పంపిణీలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించడలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులకు బదులుగా స్థానికంగా ఉండే టీఆర్ఎస్ నేతలు పంపిణీ చేస్తుండడంతో ఇది టీఆర్ఎస్ ఇస్తున్న సాయం అనే అభిప్రాయాన్ని కలిగించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఓట్లకు పంచుతున్న నోట్లు అనే విమర్శలు వెల్లువెత్తాయి. వరద సాయాన్ని టీఆర్ఎస్ ఓట్ల కోసం తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసిందని విపక్ష నేతలు ఆరోపించారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలైన సొమ్మునే ప్రభుత్వం నగదు రూపంలో పంచుతూ తామే ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే.. కరోనా లాక్ డౌన్ సమయంలో నేరుగా అందరి అకౌంట్లలో డబ్బులు వేసినట్లు 10 వేలు కూడా వేస్తే సరిపోయేదని చెబుతున్నారు. ఓట్ల కోసం జనాల ప్రాణాలతో చెలగాటమాడారని ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరవుతున్నారు. వరద సాయం కోసం కరోనాను లెక్క చేయకుండా జనాలు గుంపులుగుంపులుగా ఒకచోట చేరారని.. దీని ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తే బాధ్యులు ఎవరిని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటికీ ఎంతమందికి వరద సాయం అందిందో, ఇంకా ఎంతమందికి అందాల్సి ఉందో ప్రభుత్వం లెక్కలను వెల్లడించడంలేదు. ఈ ప్రక్రియను ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా అమలు చేయలేకపోయిది. వరదలకు ఇబ్బంది పడని కుటుంబాలకు సైతం స్థానిక అధికార పార్టీ నేతలు నగదు సాయం అందించడంతో నిజమైన బాధితులకు సాయం అందకుండా పోయింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ పథకం అర్ధంతరంగా ఆగిపోవడంతో నిజమైన వరద బాధితులకు ప్రభుత్వం సాయం ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎన్నికల్లో అధికార పార్టీకి ఇది ఇబ్బందిగా మారవచ్చని భావిస్తున్నారు. సాయం అందని వరద బాధితులు ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. వారంతా గ్రేటర్ ఎన్నికల్లో కారుకు వ్యతిరేకంగా ఓట్లు వేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.