భారత్ లో ట్విట్టర్ పై వేటు తప్పదా..!
posted on Nov 13, 2020 @ 9:48AM
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ రాజధాని లేహ్‌ను జమ్మూకశ్మీర్‌లో అంతర్భాగంగా చూపించడంతో మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు షాకిచ్చేందుకు కేంద్రం సిద్ధం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన లేహ్‌ను జమ్మూకశ్మీర్‌లో భాగంగా చూపించడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించి.. ఎందుకలా చూపించారో వివరణ ఇవ్వాలంటూ ట్విట్టర్‌కు ఐదు రోజుల గడువు ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలపై ట్విట్టర్ స్పందించకున్నా, లేక అది ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోయినా దానిపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేసే అవకాశం ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద భారత్‌లో ట్విట్టర్ యాక్సెస్‌ను బ్లాక్ చేయవచ్చు .. లేదా ఆరు నెలల జైలు శిక్ష పడేలా పోలీసు కేసు కూడా పెట్టవచ్చు.
కొంత కాలం క్రితం కేంద్ర ప్రభుత్వం లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసి, దానికి లేహ్‌ను రాజధానిగా చేసింది. అయితే ట్విట్టర్ మాత్రం లేహ్‌ను చైనాలో భాగంగా చూపించింది. ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ట్విట్టర్ అధినేత జాక్ డోర్సీకి లేఖ రాయడంతో పటంలో మార్పులు చేస్తూ.. ఈసారి దానిని జమ్మూకశ్మీర్‌లో భాగంగా మార్చేసింది. దీంతో ప్రభుత్వం ట్విట్టర్ పై మరోసారి మండిపడుతూ.. ఇలా ఎందుకు చూపించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.
తప్పుడు పటాన్ని చూపిస్తూ.. భారతదేశ సార్వభౌమత్వాన్ని అణగదొక్కేందుకు ఉద్దేశపూర్వకంగానే ట్విట్టర్ ఇలా చేస్తున్నట్టు గా పేర్కొంటూ.. దాని ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈసారి ప్రభుత్వం తీవ్ర హెచ్చరికలు చేయడంతో.. ట్విట్టర్ కనుక సంతృప్తికర వివరణ ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.