ముగ్గురు నానీలతో ప్రాణాలకు ముప్పు.. దళిత మహిళా వ్యాపారవేత్త సంచలన ఆరోపణలు
posted on Nov 17, 2020 @ 1:33PM
ఏపీలోని అధికార పార్టీ నేతల నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, మరీ ముఖ్యంగా రాష్ట్రంలో మంత్రులుగా ఉన్న ముగ్గురు నానీ (పేర్ని నాని, కొడాలి నాని, ఆళ్ల నాని) ల నుండి తనకు రక్షణ కల్పించాలని కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక దళిత మహిళా వ్యాపారవేత్త లక్ష్మీనరసింహన్ ఏపీ సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయం పై విజయవాడలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. "మచిలీపట్నానికి చెందిన నేను బెంగళూరులో స్థిరపడ్డాను. అయితే సొంత రాష్ట్రంలో వ్యాపారం చేయాలని భావించి గుడివాడ సమీపంలోని నందివాడలో 150 ఎకరాల చెరువును నూకల రామకృష్ణ, నూకల బాలాజీ నుంచి లీజుకు తీసుకున్నాను. లాక్‌డౌన్ సమయంలో ఏడాదికి ఎకరా రూ.60 వేలకు లీజుకు ఇచ్చిన వారు ఆ తర్వాత రూ.90 వేలు డిమాండ్ చేయడంతో దానికి అంగీకరించి 2023 వరకు లీజు ఒప్పందం చేసుకున్నాను".
అయితే ఈ క్రమంలో "గత ఏప్రిల్ నెలలో చేపలను విక్రయించుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో లీజుకు ఇచ్చిన వ్యక్తులు చాలా తక్కువ రేటుకు తమకే విక్రయించాలని డిమాండ్ చేశారు. దానికి అంగీకరించకపోవడంతో నాపై దౌర్జన్యం చేశారు" అని ఆమె ఆరోపించారు. వారు తనపై దాడి చేయడమే కాకుండా దౌర్జన్యంగా 150 ఎకరాల్లో రొయ్యలను తరలించుకుపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా పోలీసులు స్వీకరించలేదని, అంతేకాకుండా స్పందనలో రెండుసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆమె తెలిపారు. తాజాగా అక్టోబరులో మరోసారి డీజీపీకి ఫిర్యాదు చేశానని, దాంతో పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారని అయితే ఇప్పటి వరకు నిందితులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. నిందితులకు మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, ఆళ్ల నాని అండ ఉండటమే కారణమని ఆరోపించారు. దళితురాలినైన తనకు నూకల రామకృష్ణ, నూకల బాలాజీ, అలాగే మంత్రులు ముగ్గురు నానీల నుంచి ప్రాణహాని పొంచి ఉందని, తనకు రక్షణ కల్పించి వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించాలని" ఆమె సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వ్యవహారంపై సీఎం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.