తాత ఎవరో, తండ్రి ఎవరో తెలియదు.. అశోక్ గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు
posted on Nov 17, 2020 @ 2:28PM
విజయనగరం గజపతిరాజుల కుటుంబ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సంచయిత గజపతిరాజు మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా నియామకం అయినప్పటి నుంచి వివాదం రాజుకుంటూనే ఉంటుంది. తాజాగా, సంచయితకు జగన్ సర్కార్ తూర్పుగోదావరి జిల్లాలోని 104 ఆలయాల బాధ్యతను అప్పగించింది. ఈ క్రమంలో సంచయితపై టీడీపీ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 104 ఆలయాలకు ఒక్కసారి కూడా సంచయిత హాజరవ్వలేదన్నారు. తమ పూర్వీకులు నిర్వీహించే ఆలయాలకు ఒక్కసారి కూడా రానివారు.. వాటి ఆస్తులపై కన్నేయడం బాధాకరమని కాదన్నారు.
తాజాగా సోషల్ మీడియాలో సంచయిత చేసిన పోస్ట్‌పై అశోక్ గజపతిరాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో తండ్రులు మార్చేవారు ఎవరైనా ఉన్నారా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాత ఎవరో, తండ్రి ఎవరో తెలియదు.. తండ్రి, తాతను సంచయిత ఒక్కసారైనా కలవలేదని విమర్శించారు. ఒక్కో చోట ఒక్కో విధంగా తండ్రి పేరు మార్చే పిల్లలను తానెక్కడా చూడలేదని వ్యాఖ్యానించారు.
మాన్సాస్ ఛైర్మన్ హోదా అన్నది ప్రభుత్వం కల్పించిన పదవి కాదన్నారు. ట్రస్టు నియామకాల్లో ప్రభుత్వ నియంతృత్వ ధోరణితో వ్యవహరించిందని.. ఆనవాయితీలకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించిందని చెప్పారు. చట్ట విరుద్ధంగా అర్ధరాత్రి జీవోలో ఛైర్మన్‌గా తనను తొలగించారని.. తనకు కనీసం ఎలాంటి నోటీసు ఇవ్వలేదన్నారు. ఛైర్మన్ పోస్ట్ అపాయింటింగ్ పోస్ట్ కాదు.. ఆనవాయితీగా వచ్చే పోస్ట్ అని వ్యాఖ్యానించారు. ఆనవాయితీలకు విరుధ్ధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. ఇష్టమొచ్చిన వారిని కుటుంబసభ్యులని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. ఎవరు ఏ కుటుంబంలో ఉండాలన్నదీ ప్రభుత్వం నిర్ణయించే ధోరణి సరికాదని.. ఆదాయం, ఆస్తి ఉన్న ఆలయాలపై ప్రభుత్వం కన్నేయటం బాధాకరమని అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారు.