జనసేనతో టీబీజేపీ కటీఫ్! ఏపీ వరకే పరిమితమన్న సంజయ్
posted on Nov 17, 2020 @ 8:50PM
ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయాలు వేడెక్కాయి. పార్టీల వ్యూహాలతో సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అయితే బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని అందరూ భావించగా.. ఆ పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించాయి. గ్రేటర్ ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేయనున్నట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తమకు పట్టున 50 డివిజన్లలో పోటీ చేస్తామని, అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నామని చెప్పారు పవన్ కళ్యాణ్.
జనసేన ప్రకటన తర్వాత స్పందించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో జనసేన పొత్తు ఏపీ వరకే పరిమితమని, తెలంగాణకు వర్తించదని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని... మొత్తం 150 డివిజన్లలో తమ అభ్యర్థులను నిలబెడతామని సంజయ్ స్పష్టం చేశారు.