రాజ్యాంగబద్ద వ్యవస్థలో కూర్చుని చిల్లర పనులు.. ఎస్‌ఈసీపై కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్
posted on Nov 18, 2020 @ 10:01AM
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే ఫిబ్రవరిలో జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) సిద్ధమైన విషయం తెలిసిందే. దీనికోసం సన్నాహాలు చేసుకోవాలని అటు రాజకీయ పార్టీలకు ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అయన సూచించారు. దీనిపై ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ.. ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం, అలాగే ప్రస్తుత కరోనా పరిస్థితుల గురించి అయన వివరంగా ప్రస్తావించారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు న్యాయపరమైన అడ్డంకులు కూడా లేవని రమేశ్ కుమార్ పేర్కొన్నారు.
అయితే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ప్రకటనపై మంత్రులు, పలువురు వైసీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా.. ఏపీ మంత్రి కొడాలి నాని గుడివాడలో మీడియాతో మాట్లాడుతూ నిమ్మగడ్డపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ సిగ్గులేకుండా, చంద్రబాబు రాసిన లేఖలకు స్పందిస్తూ ఎన్నికలను నిర్వహించాలనుకోవడం సిగ్గుచేటు. కరోనా తీవ్రత దృష్ట్యా ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా సిద్ధంగా లేరు. నిమ్మగడ్డకు అసలు రాజ్యాంగ వ్యవస్థలపై, రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదు. రాజ్యాంగబద్ద వ్యవస్థలో కూర్చున్న నిమ్మగడ్డ చిల్లర రాజకీయాలు చేయకుండా, రిటైర్ అయ్యే లోపు హుందాగా వ్యవహరించాలి. ప్రస్తుతం ఉన్న కరోనా తీవ్రత దృష్ట్యా బ్యాలెట్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం వైరస్ వ్యాప్తికి కారణమవుతుంది. వయసు వచ్చినా బుద్ధి, జ్ఞానం లేకుండా కోవిడ్ కేసులు తీవ్రంగా ఉన్నప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తామనడం అవివేకం. రాష్ట్రంలో రెండు కరోనా కేసులు ఉన్నపుడు ఎన్నికలు జరపలేని ఈ చవట దద్దమ్మ రోజుకు 1500 పాజిటివ్ కేసులు నమోదవుతున్నపుడు ఎన్నికలు నిర్వహిస్తాడట. ఏపీ ప్రజలను ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చునే అజ్ఞాతవాసి నిమ్మగడ్డ రమేష్, జూమ్ బాబులు ఇద్దరు కలిసి ఏపీ ప్రజలకు నష్టం కలిగించేలా ఎన్నికలు నిర్వహిస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఒకవేళ ఈ విషయంలో అయన కోర్టుకు వెళితే మేము కూడా అక్కడే తేల్చుకోవడానికి రెడీగా ఉన్నాము" అని కొడాలి నాని వ్యాఖ్యానించారు.