కరోనా ఉధృతి కారణంగా ఆ రాష్ట్రంలో మళ్ళీ లాక్ డౌన్...!
posted on Nov 17, 2020 @ 6:40PM
భారత్ లోని చాలా రాష్ట్రాలలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతున్న సంగతి తెల్సిందే. అయితే గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం అలర్ట్ అయి.. ప్రముఖ మార్కెట్లను మూసి వేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయని అయన అన్నారు. దీపావళి సమయంలో ఎక్కువ మంది ప్రజలు మాస్కులు ధరించకుండా, సామాజికదూరం కూడా పాటించలేదని కేజ్రీవాల్ అన్నారు. తమకు ఏమీ కాదనే ధోరణిలో జనాలు ఉంటున్నారని అయన అసహనం వ్యక్తం చేశారు. కరోనా ఎవరికైనా వస్తుందని, పరిస్థితిని దారుణంగా మారుస్తుందని అయన చెప్పారు. అందరూ జాగ్రత్తలు పాటించాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని అన్నారు. మార్కెట్లలో జనాలు ఎక్కువగా పోగవుతున్నారని... దీంతో ఇవి కరోనా హాట్ స్పాట్ లుగా మారే అవకాశం ఉందని అయన అన్నారు. దీంతో కొన్ని రోజుల పాటు మార్కెట్లను మూసేయాలని నిర్ణయించామని దీనిపై కేంద్ర ప్రభుత్వానికి తమ ప్రతిపాదనను పంపామని అయన చెప్పారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రస్తుతం పెళ్లిళ్లకు 200 మంది వరకు అనుమతిస్తున్నామని... కానీ, ప్రస్తుత కరోనా తీవ్రత దృష్ట్యా మళ్లీ పాత నిబంధన (50 మందికే అనుమతి) కు వెళ్లాల్సిన పరిస్థితి ఉందని కేజ్రీవాల్ తెలిపారు.