సోనియా గాంధీ ఆశీర్వాదంతోనే బీజేపీలోకి

రాజకీయ నాయకులు పార్టీలు మారడం ఎంత కామనో, పార్టీ మారినప్పుడు అప్పటివరకు తాము పని చేసిన పార్టీపైనా, కలిసి పని చేసిన నాయకులపైనా విమర్శలు చేయడం కూడా అంతే కామన్. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ తీరు మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. త్వరలో బీజేపీలో చేరబోతున్నట్టు ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఒకవైపు కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరడానికి సిద్దపడిన ఆయన.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని తన తల్లి అని సంబోదించడం చర్చనీయాంశమైంది.   సోనియా గాంధీ ఆశీర్వాదంతోనే బీజేపీలోకి వెళ్తున్నానని సర్వే సత్యనారాయణ తెలిపారు. సోనియా గాంధీ నాకు తల్లి, రాహుల్ గాంధీ నా తమ్ముడన్న అని అన్నారు. సోనియా ఆరోగ్యం క్షీణించింది, రాహుల్ కు రాజకీయాలపై ఆసక్తి లేదు అందుకే తాను మరో దారి చూసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. టీఆర్ఎస్ కోవర్టుల వలనే కాంగ్రెస్ పతనమైందని మండిపడ్డారు. దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించింది కేసీఆరేనని ఆరోపించారు. కాంగ్రెస్ నాశనానికి రాష్ట్ర నాయకత్వం కారణమని, నాలాంటి వారిని గౌరవించటం లేదని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని అన్నారు. నా లాంటి వాళ్ళందరూ కష్టపడితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. 

పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసినప్పుడే కేంద్ర నిధులు! సంజయ్ సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. కేంద్ర నిధులపై కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసినప్పుడే‌‌ ప్రభుత్వానికి కేంద్రం నిధులిస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సంజయ్. బీజేపీని సమర్థిస్తున్న యువకులను చాలాన్ల పేర్లతో హింసిస్తున్నారని మండిపడ్డారు. వరద సాయం ఆపాలని తానే లేఖ రాశానని అసత్య ప్రచారం చేశారని చెప్పారు. వరద సాయం నిలిపివేయాలంటూ నాయకుల నుంచి ఎలాంటి లేఖ అందలేదని‌ ఎస్ఈసీ స్పష్టం చేసిందని తెలిపారు. నిజంగా తానే లేఖ రాసి ఉంటే.. ప్రభుత్వం తమపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు బండి.  బీజేపీని టీఆర్ఎస్ కంట్రోల్ చేయలేదు.. ప్రజల కంట్రోల్లో మాత్రమే బీజేపీ ఉంటుందని బండి సంజయ్ కామెంట్ చేశారు.   సమాజంలో 80 శాతం ఉన్న హిందువుల మనోభావాలే బీజేపీకి ముఖ్యమన్నారు సంజయ్. భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్లకూడదని ఎక్కడైనా రాసి ఉందా? లేఖపై ఏ దేవాలయం దగ్గరైనా సీఎం కేసీఆర్‌తో చ‌ర్చకు సిద్దమని చెప్పారు. నిజమైన హిందువు కాదు కాబట్టి.. కేసీఆర్ మక్కా మసీదుకైనా వస్తారని భావించానన్నారు. పేదలకు అందాల్సిన రైతుబంధును పొందుతోన్న కేసీఆర్, కేటీఆర్‌లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. మేము అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లో ఉన్న 40 వేల మంది రోహింగ్యా ముస్లింలను తరిమికొడతామని చెప్పారు. ఓట్ల కోసమే 40 వేల మంది రోహింగ్యాలను, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని కేసీఆర్ కాపాడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

వాళ్ల ఓట్ల కోసం గులాబీ వ్యూహాలు! పోసాని పాచిక పారేనా? 

గ్రేటర్ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లపై గులాబీలో గుబులుందా? పవన్ ఎంట్రీతో తమకు కష్టమని కారు పార్టీ నేతలు కంగారు పడుతున్నారా? పోసానితో ప్రయోజనమెంత? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కీలకంగా మారిన సెటిలర్ల ఓట్ల కోసం ప్రధాన పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. సీమాంధ్ర ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కలిసి వచ్చే అన్ని అవకాశాలను పార్టీలు వాడేసుకుంటున్నాయి. అందులో భాగంగానే టీఆర్ఎస్ కు మద్దతుగా సినీ నిర్మాత, దర్శకుడు పోసాని కృష్ణమురళి  ప్రకటన చేశారని చెబుతున్నారు. హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించిన పోసాని.. గ్రేటర్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలని పిలుపిచ్చారు.    గ్రేటర్ ఎన్నికల సందర్భంగా పోసాని కృష్ణమురళి చేసిన ప్రకటనపై జోరుగా చర్చ జరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో కీలకంగా ఉన్న సెటిలర్ల ఓట్ల కోసమే టీఆర్ఎస్ పెద్దలు పోసానితో మాట్లాడించారనే వాదన వస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేస్తానని కూడా చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తే సెటిలర్ల ఓట్లు బీజేపీ వైపు మళ్లవచ్చని అధికార పార్టీ ఆందోళన పడుతుందని తెలుస్తోంది. అందుకే పవన్ ప్రకటన చేసిన మరునాడే పోసాని మీడియా ముందుకు వచ్చారని చెబుతున్నారు. తన ప్రసంగంలో ఆంధ్రావారి గురించి పదేపదే మాట్లాడారు పోసాని. తెలంగాణలో ఆంధ్రావారంతా సురక్షితంగా ఉన్నారని చెప్ప ప్రయత్నం చేశారు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ కు ఆంధ్రా నాయకులే మీదే కోపం ఉండేదని, ఆంధ్ర అంటే కాదన్నారు పోసాని. కేసిఆర్ వస్తే ఆంధ్రవారిని తరిమి కొడతారని ప్రచారం జరిగిందని.. కానీ తెలంగాణ వచ్చాక ఏ ఒక్క ఆంధ్రవారి మీద దాడి జరిగిన ఘటనలు లేవన్నారు పోసాని.     బీజేపీకి మద్దతూ తెలుపుతూ మాట్లాడిన పవన్ కల్యాణ్.. హైదరాబాద్ ను సురక్షితంగా ఉంచే వారినే గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. హైదరాబాద్ భద్రతపై పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు పోసాని. కేసీఆర్ పాలనలో హైదరాబాద్ భద్రంగా ఉందని చెప్పారు. 35 ఏండ్లుగా హైదరాబాద్ లో ఉంటున్నానని, గతంలో హైదరాబాధ్ అంటే మత కల్లోలాలు గుర్తొచ్చేవని,  టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక మత కల్లోలాలు ఆగిపోయాయని చెప్పారు పోసాని. ఎన్టీఆర్ తరువాత హైదరాబాధ్లో కేసీఆరే మత కల్లోలాలు లేకుండా చేశారన్నారు. గతంలో ఆంధ్ర తో పోలిస్తే తెలంగాణలో  పచ్చదనం ఉండేది కాదని ..కానీ కేసిఆర్ వచ్చాకా తెలంగాణ అంతా పచ్చగా మారిందన్నారు. దీంతో పవన్ కల్యాణ్ ప్రభావం సెటిలర్ల పడకుండా ఉండేందుకే.. టీఆర్ఎస్ కు మద్దతుగా పోసాని కృష్ణమురళి ప్రకటన చేశారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.     గ్రేటర్ హైదరాబాద్‌ ఎన్నికల్లో సెటిలర్ల ఓట్లు కీలకంగా మారాయి. దాదాపు 60 డివిజన్లలో గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో  సీమాంధ్రులు ఉన్నారు. 2016  గ్రేటర్ ఎన్నికల్లో మెజార్టీ సెటిలర్ ఓటర్లు అధికార పార్టీకి మద్దతుగా నిలిచారని చెబుతారు. ఇప్పుడు కూడా వారి ఓట్లను గంప గుత్తగా తమవైపు తిప్పుకునేందుకు అధికార పార్టీ ఎత్తులు వేస్తుందని తెలుస్తోంది. అందుకే మంత్రి కేటీఆర్ కూడా హైదరాబాద్ ప్రగతి నివేదిక విడుదల చేస్తూ.. సెటిలర్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. తాము కూడా సిద్దిపేట నుంచి వచ్చి హైదరాబాద్ లో  సెటిలయ్యామని చెప్పారు. హైదరాబాద్ లో ఉన్నవారంతా తమవారేనని చెప్పారు కేటీఆర్. గ్రేటర్ ఎన్నికల్లో 8 మంది సెటిలర్లకు టికెట్లు ఇచ్చామని వెల్లడించారు. పోసాని కృష్ణమురళికి నిక్కచ్చిగా పేరుంది. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పేస్తారని,  ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడుతారనే అభిప్రాయం ఆయనపై ప్రజలకు ఉంది. అయితే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని పోసాని చేసిన ప్రకటనపై ప్రజలు ఎలా స్పందిస్తారన్నది మాత్రం చెప్పలేమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేనికి తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును ఢీకొని ఓ ఆటో బోల్తాపడింది. ఈ ఘటనలో స్పీకర్ కారు కూడా అదుపు తప్పింది. రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. స్పీకర్ తమ్మినేని సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.   ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రసంగించగా, తమ్మినేని సీతారాం డిప్యూటీ సీఎం ధర్మానతో కలిసి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఈ కార్యక్రమం ముగించుకుని తిరిగి వచ్చే క్రమంలో ఆయన కారుకు ప్రమాదం జరిగింది.

అక్కడ పనికిరాని వ్యక్తికి ఇక్కడేం పని.. పవన్ పై బాల్క సుమన్ సంచలన కామెంట్స్

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగియడంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ శక్తియుక్తులన్నింటినీ ఒడ్డి పోరాడుతున్నాయి. ఈసారి బల్దియాపై తామే జెండా ఎగరేయాలనే లక్ష్యంగా చెమటోడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తొలుత ఒంటరిగా పోటీ చేస్తామన్న జనసేన.. బీజేపీ నేతల భేటీ తరువాత జీజేపీకి తాను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నాని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.   ఈ నేపథ్యంలో వపన్ కల్యాణ్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "పక్క రాష్ట్రంలో దేనికీ పనికి రాని వ్యక్తికి హైదరాబాద్ రాజకీయాలతో ఏం పనో " అంటూ బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా "ఏపీలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ..ఇక్కడ పోటీకి దిగుతాననడం జోక్‌గా ఉందంటూ" ఎద్దేవా చేసారు. అంతేకాకుండా "పక్క రాష్ట్రంలో ఏమీ చేయలేనోడు ఇక్కడ ఏం చేస్తాడంటూ" కామెంట్ చేశారు. ప‌వ‌న్ మాట‌లు విని జనాలు నవ్వుకుంటున్నారంటూ సుమన్ ఎద్దేవా చేశారు.

ఏకంగా 87 మంది వైసీపీ ఎమ్మెల్యేల పై ప్రజల్లో ఆగ్రహం.. తాజా సర్వేలో షాకింగ్ రిపోర్ట్  

ఏపీలో 2019 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ 151 సీట్లు సాధించి ఘన విజయం సాధించిన సంగతి తెల్సిందే. అయితే ఈ విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ కష్టం కూడా చాలా ఉంది. దాదాపు మూడు వేల కిలోమీటర్లకు పైగా జగన్ చేసిన పాదయాత్రలో అటు సామాన్యుల సాధకబాధకాలు వింటూ వారికి భరోసా ఇస్తూ.. మరో పక్క ప్రశాంత్ కిషోర్ టీమ్ తో కలిసి పని చేసిన అయన తన కష్టానికి తగ్గ ఫలితం పొంది సీఎం గా బాధ్యతలు చేపట్టారు.   అయితే ఆ ఎన్నికలలో ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరు అనేది కూడా చూడకుండా కేవలం జగన్ ను చూసి జనం ఓట్లు వేశారని ప్రచారం జరిగింది. దీంతో ఎమ్మెల్యే పోస్టుకు అర్హత ఉన్నా లేకపోయినా జగన్ గాలిలో చాలామంది గెలిచారని కూడా వైసిపి వర్గాలు చెపుతాయి. ఇలా గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం ప్రజలకు అందుబాటులో ఉండకుండా.. కేవలం తమ పనులు చక్కబెట్టుకోవడంలో బిజీ అయిపోయారని విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలలో తాము ఖర్చు చేసిన సొమ్ము తిరిగి సంపాదించుకునే పనులలో మునిగిపోయి కొంతమంది ప్రజలను పట్టించుకోవడం లేదని.. మరి కొంత మంది సొంత పార్టీ లోకల్ నాయకులను కూడా పట్టించుకొకుండా పూర్తిగా దందాలలో మునిగి తేలుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   తాజాగా ఒక సర్వే సంస్థ ఏపీలో ఒక సర్వేను కండక్ట్ చేసిందని.. అమరావతిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ సర్వేలో దాదాపు 87మంది వైసీపీ ఎమ్మెల్యేల మీద ప్రజలలో పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని సమాచారం. ఈ సర్వే ప్రకారం కొన్ని నియోజకవర్గాల్లో మీ ఎమ్మెల్యే ఎవరు అంటే కూడా జనం గుర్తు పట్టే పరిష్టితి లేదని సమాచారం. ఇక ఈ ఎమ్మెల్యేల తోపాటు చాలా మంది మంత్రుల మీద కూడా ప్రజలలో వ్యతిరేకత బాగానే ఉందని.. ఆ సర్వే సంస్థ తేల్చిందని వార్తలు వస్తున్నాయి. దీంతో సీఎం ఎంత కష్టపడ్డా.. ప్రతిపక్షాలతో పనిలేకుండా.. వైసీపీ పుట్టి ముంచేది మాత్రం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులే అని ఆ సర్వేలో తేలిందట. ఈ సర్వే నేపథ్యంలో.. సీఎం జగన్ తన పార్టీని ఎలా కాపాడుకుంటారో చూడాలి.

పొత్తు లేదు.. ప్రచారం చేయరు! విచిత్ర బంధంతో బలవుతున్న అభ్యర్థులు 

'' నేను కొట్టినట్టు చేస్తా.. నువ్వు ఏడ్చినట్టు చేయ్‌'. ఈ సామెతను బయటికి ప్రత్యర్థులుగా నటిస్తూ లోలోపల స్నేహంగా ఉండేవారి గురించి చెప్పడానికి ఉదాహరణగా చెబుతారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు అధికార టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల పరిస్థితి కూడా ఇలానే ఉంది. ఎంఐఎం మాకు మిత్రపక్షమని చెబుతారు.. కాని పొత్తు లేదంటారు టీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ సర్కార్ కు పూర్తి మద్దతిస్తారు.. కాని కలిసి పోటీ చేసేది లేదంటారు పతంగి పార్టీ నేతలు. ఈ అర్థంకాని బంధంతో ఈ పార్టీల తీరుపై గ్రేటర్ ప్రజలకు క్లారిటీ రావడం లేదు.    ఎంఐఎంతో పొత్తు లేదని ఇటీవల జరిగిన మీట్ ద ప్రెస్ లో చెప్పారు మంత్రి కేటీఆర్. పాతబస్తీలోనూ 10 డివిజన్లలో తమ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎంఐఎంతో పొత్తు లేదని చెప్పే కేటీఆర్.. పాతబస్తిలో ప్రచారం చేస్తారా అంటే ఆయన దగ్గర సమాధానం లేదు. పతంగి పార్టీతో పొత్తు లేదంటున్న కారు పార్టీ.. అక్కడ బలమైన అభ్యర్థులను మాత్రం పెట్టడం లేదు.  పొత్తు లేదంటూనే ప్రతిసారీ పరోక్షంగా ఎంఐఎం పార్టీకి అధికార పక్షం సహకరిస్తూనే పలువురిని పోటీలో నిలబెడుతోంది. అక్కడ పోటీ చేసే అభ్యర్థులకు అధిష్ఠానం సహకరించదు. పార్టీ ముఖ్య నేతలు పాతబస్తిలో ప్రచారమే చేయరు. పాతబస్తీలో జరిగే ఈ విచిత్ర పోటీతో కొందరు అమాయక అధికార పార్టీ అభ్యర్థులు బలవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.    పాతబస్తీలోని చార్మినార్, యాఖుత్ పురా, చాంద్రాయణగుట్ట, బహదూర్ పురా, మలక్ పేట, కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల్లో ఎంఐఎం పార్టీదే హవా. దశాబ్దాలుగా ఇక్కడ మెజార్టీ డివిజన్లలో పతంగి పార్టీ అభ్యర్థులే గెలుస్తున్నారు.  అలాంటి ప్రాంతాల్లో అధికార పక్షం నామమాత్రంగా అభ్యర్థులను పోటీకి నిలుపుతోంది. పార్టీ కోసం నిరంతరం పని చేస్తున్న కార్యకర్తలు నామినేషన్లు దాఖలు చేసినా ప్రచారానికి మాత్రం అధిష్ఠానం రావడం లేదని పాతబస్తి గులాబీ లీడర్లే చెబుతున్నారు. గతంలో ఏనాడూ మంత్రుల స్థాయిలో ఎవరూ ప్రచారానికి వెళ్లలేదు. అక్కడక్కడా టీఆర్ఎస్ ప్రచారాన్ని ఎంఐఎం పార్టీ కార్యకర్తలు అడ్డుకున్న సందర్భాలు ఉన్నాయి. గత గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మలక్‎‎పేట నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రిపైనే కొందరు దాడికి యత్నించారు. అంత పెద్ద ఘటన జరిగినా ఆ పార్టీ వైఖరిని అధికార పార్టీ నెతలేవరూ ఖండించలేదు.    2016 బల్దియా ఎన్నికలకు అన్ని డివిజన్లకు ఇంచార్జ్ లను నియమించింది టీఆర్ఎస్. ఇంచార్జులుగా నియమించిన వారిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మేయర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు. అయితే వారెవరు పాతబస్తిలో సీరియస్ గా ప్రచారం చేయలేదు. చేశామంటే చేశామన్నట్లుగా కొన్ని ప్రాంతాల్లో తిరిగి సైలెంట్ అయ్యారు. పార్టీ పెద్దల నుంచి అలాంటి ఆదేశాలు వచ్చాయనే కొందరు గులాబీ నేతలు ఓపెన్ గానే చెప్పేశారు. గ్రేటర్ ప్రచార బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ 2016లో నగరంలో భారీగా రోడ్ షోలు, సభలు నిర్వహించారు. పాతబస్తీని మాత్రం ఆయన  పట్టించుకోలేదు. ప్రజలకు  అనుమానం రాకుండా ఉండేందుకని రెండు, మూడు డివిజన్లలో సభ పెట్టారు కేటీఆర్. ఈ సారి కూడా ఓల్డ్ సిటిలోని అన్ని డివిజన్లకు ఇంచార్జులను ప్రకటించింది అధికార టీఆర్ఎస్ పార్టీ. అయితే వారు ప్రచారం చేస్తారా అంటే డౌటే.    ప్రతీసారి ఉత్తుత్తిగా నిలబడడం, ప్రచారం చేయడం ఆనవాయితీగా ఓల్డ్ సిటీలో ఆనవాయితీగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి.  టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్యనున్న కనిపించని పొత్తు బంధంతో నాయకులు నష్టపోతున్నారనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది. పార్టీ పెద్దల వ్యూహం తెలియక బరిలో ఉంటున్న అభ్యర్థులు.. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని బలవుతున్నారని చెబుతున్నారు. పార్టీ సహకరిస్తే పాతబస్తిలోనూ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 2016 ఎన్నికల్లో ముఖ్య నేతలెవరు ప్రచారం చేయకున్నా టీఆర్ఎస్ కు నాలుగు సీట్లు వచ్చాయి. కొన్ని డివిజన్లలో ఎంఐఎం, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోరు జరిగింది. జాంబాగ్ లో కారు పార్టీ అభ్యర్థి కేవలం ఐదు ఓట్ల తేడాతో ఎంఐఎం క్యాండిడేట్ చేతిలో ఓడిపోయారు. దీంతో టీఆర్ఎస్ పెద్దలు కొంత సీరియస్ గా ప్రచారం చేస్తే పాతబస్తిలో మరికొన్ని డివిజన్లు గెలిచే అవకాశం ఉండేదనే చర్చ అప్పుడు జరిగింది. ఈ అర్థంకాని బంధంతో గులాబీ పార్టీ అభ్యర్థులు, కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు కష్టాల పాలవుతున్నారనే చర్చ ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల సందర్భంగా మరోసారి జోరందుకుంది.

రావాలి జగన్.. కావాలి జగన్! గ్రేటర్ లో ప్రత్యేక ప్రచార రథం  

రావాలి జగన్.. కావాలి జగన్. ఈ నినాదం రాసి ఉన్న బ్యానర్లు, ఫ్లెక్సీలు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొన్ని చోట్ల దర్శనమిస్తున్నాయి. ప్రచార రథాలకు ఇదే నినాదాన్ని పెద్దగా రాయించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ నినాదంతో వైసీపీ ప్రచారం చేసింది. రావాలి జగన్.. కావాలి జగన్ అన్న పాటలు మార్మోగాయి. ఇప్పుడు అదే నినాదం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ కొన్ని చొట్ల వినిపిస్తోంది. ఈ నినాదం  విన్న వారంతా జీహెచ్ఎంసీలో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులు ఇలా ప్రచారం చేస్తున్నారేమోనని భావించారు. కాని వైసీపీ గ్రేటర్ ఎన్నికలకు దూరంగా ఉంది. వైసీపీ పోటీ చేయకున్నా రావాలి జగన్ .. కావాలి జగన్ నినాదం వినిపిస్తుండటం ఇప్పుడు గ్రేటర్ లో చర్చగా మారింది.    రావాలి జగన్.. కావాలి జగన్ నినాదంతో ప్రచారం చేస్తున్నది వైసీపీ నేతలు కాదు టీఆర్ఎస్ నేతలు. గులాబీ లీడర్లు ఇలా ప్రచారం చేస్తుండటం మరింత ఆసక్తిగా మారింది. రావాలి జగన్.. కావాలి జగన్ బ్యానర్ తో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారం చేస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏపీ ముఖ్యమంత్రి  జగన్ ను తమ స్నేహితుడిగా చెబుతుంటారు సీఎం కేసీఆర్. జగన్ కూడా కేసీఆర్ ను పొగుడుతుంటారు. దీంతో తమ పార్టీ అధినేత మిత్రుడైన జగన్ పార్టీ నినాదాన్ని టీఆర్ఎస్ నేతలు ఉపయోగించుకుంటాన్నరంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హైదరాబాదీలకు జగన్ ముద్దులు కావాలట అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు.   అయితే గ్రేటర్ ఎన్నికల్లో ఈ నినాదం  వెనక అసలు సోర్టీ మాత్రం మరోలా ఉంది. జగద్గిరిగుట్ట నుంచి  టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థి పేరు జగన్. గత ఎన్నికల్లో ఈయన ఇక్కడి నుంచి విజయం సాధించారు. సిట్టింగ్ కార్పొరేటర్ గా మరోసారి బరిలో నిలిచారు. తన పేరు జగన్ కావడంతో.. కావాలి జగన్.. రావాలి జగన్ అని రాయించుకుని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో మార్మోగిన ఈ నినాదం తనకు కలిసి వస్తుందనే ఆలోచనతోనే ఇలా చేశానని చెబుతున్నారు టీఆర్ఎస్ అభ్యర్థి జగన్. ఈ విషయం తెలియని చాలా మంది.. రావాలి జగన్.. కావాలి జగన్ అని రాసి ఉన్న టీఆర్ఎస్ ప్రచార రథంపై సెటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని చెబుతున్నారు.  

మహమ్మారి ఎఫెక్ట్... ఇక ఆకలి చావుల కోరలలో ప్రపంచం

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం బిక్కుబిక్కుమంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మహమ్మారి కారణంగా మరో పెను ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరిస్తోంది. ప్రభుత్వాలు కనుక వెంటనే అప్రమత్తం కాకపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో పాటు ప్రపంచం మొత్తం వచ్చే ఏడాది ఆకలి చావులలో చిక్కుకుంటుందని ఐరాసకు చెందిన డబ్ల్యూఎఫ్‌పీ (వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బీస్లే హెచ్చరించారు. ఈ విషయం పై వెంటనే ప్రభుత్వాలు అప్రమత్తం కావాలని.. ఇప్పటికే కరోనా కారణంగా చాలామంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని, ఆర్థిక వ్యవస్థలు కూడా తలకిందులయ్యాయని అయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రజలు ఆకలి చావుల్లో చిక్కుకోకుండా ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలని అయన కోరారు. అంతేకాకుండా కరోనా సెకండ్ వేవ్ తో చాలా దేశాలు మళ్ళీ లాక్‌డౌన్ వైపు అడుగులు వేస్తున్నాయని.. మరికొన్ని దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నాయని డేవిడ్ బీస్లే తెలిపారు.

తిరుపతిలో బీజేపీ గెలిస్తేనే ఏడు కొండలు సేఫ్! జగన్ పై సత్యకుమార్ సంచలన కామెంట్లు

జగన్ పాలనలో తిరుమల ఏడు కొండలు కబ్జా అయ్యే అవకాశం ఉందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లోక్ సభకు త్వరలో జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ గెలిస్తేనే ఏడుకొండలు కబ్జా కాకుండా ఉంటాయన్నారు. తిరుపతి అభివృద్ధిపై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టారని సత్యకుమార్ చెప్పారు. తిరుపతి  ఉప ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు బీజేపీ, జనసేనకు మాత్రమే ఉందన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ప్రధాని మోడీకి కానుకగా ఇస్తామన్నారు సత్యకుమార్.    ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సత్యకుమార్. ఒక మత వ్యాప్తి కోసం జగన్ పాకులాడుతున్నారని విమర్శించారు. ఏపీలో అభివృద్ధి శూన్యమని, అవినీతికి కొత్తమార్గాలను అన్వేషించడంలో ముఖ్యమంత్రి దిట్ట అన్నారు. జగన్మోహన్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో  వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అనాలోచిత నిర్ణయాలు జగన్‌కే సాధ్యమన్నారు సత్యకుమార్. టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి వైసీపీ నాయకులకు దోచిపెట్టేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇసుకను అధికార పార్టీ నేతలు లూఠీ చేస్తున్నారని విమర్శించారు. జగన్ అవినీతి మొత్తాన్ని త్వరలో బట్ట బయలు చేస్తామన్నారు సత్యకుమార్.

బిగ్‌బాస్ షో చూపిస్తూ క్లిష్టమైన సర్జరీ! గుంటూరు వైద్యుల ఘనత

గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు అద్భుతం చేశారు. ఓ రోగి మెదడులో మాటలు, సంభాషణకు అత్యంత కీలకమైన ప్రాంతంలో శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో వైద్యులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. అతడిని మెలకువగా ఉంచి బిగ్‌బాస్ షో, అవతార్ సినిమాను చూపిస్తూ విజయవంతంగా ఆపరేషన్ చేశారు. క్లిష్టమైన సర్జరీని ఈజీగా పూర్తి చేసి ఘనత సాధించారు గుంటూరు డాక్టర్లు. ఈ ఆపరేషన్ చేసిన వైద్యులలో ముగ్గురు గుంటూరు సర్వజన ఆసుపత్రికి చెందిన వారే కావడం మరో విశేషం.   గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్లకు చెందిన వరప్రసాద్ కు 2016లో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్‌కు శస్త్రచికిత్స జరిగింది. అయితే గత కొన్ని నెలలుగా అతనికి ఫిట్స్ వస్తుండడంతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడులో కణితి మళ్లీ పెరుగుతున్నట్టు గుర్తించారు. దానిని తొలగించేందుకు మెదడు త్రీడీ మ్యాప్‌ను సిద్ధం చేసుకుని కణితి ఎక్కడుందో గుర్తించి సరిగ్గా అక్కడ మాత్రమే కపాలాన్ని తెరిచి ఆపరేషన్ చేసి తొలగించారు.   మనిషి మాట్లాడేందుకు ఎంతో కీలకమైన ప్రాంతంలో ఆపరేషన్ చేయాల్సి రావడంతో డాక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. రోగిని మెలకువగా ఉంచి, మాట్లాడిస్తూ ఈ సర్జరీ చేయాల్సి ఉంది. దీంతో రోగికి టీవీలో బిగ్‌బాస్ షో, అవతార్ సినిమాను చూపిస్తూ విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. రోగి వరప్రసాద్‌ పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ చేశారు. వరప్రసాద్ కు బీమా సౌకర్యం ఉండడంతో సర్జరీకి పైసా కూడా ఖర్చు కాలేదని వైద్యులు తెలిపారు. అరుదైన ఘనత సాధించిన డాక్టర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది.

సోనియా ఢిల్లీ విడిచి వెళ్లనున్నారా?

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కొంతకాలం పాటు దేశ రాజధానిని విడిచి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి మకాం మార్చినా ఆమె విదేశాలకు వెళ్లరని, ఇండియాలోనే మరో ప్రాంతంలో ఉంటారని సమాచారం. సోనియా గాంధీ ఢిల్లీ విడిచి వెళ్లడానికి అక్కడి కాలుష్యమే కారణమని తెలుస్తోంది. సోనియా గాంధీ కొన్నేళ్లుగా శ్వాసకోశ సంబంధ ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరంలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటం ఆమెకు ఇబ్బందిగా మారుతుందంట. అంతేకాదు ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి కూడా ప్రమాదకర స్థాయిలో ఉండటంతో సోనియా ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో డాక్టర్లు ఇచ్చిన సలహా మేరకు రాజధానిని విడిచి ఆమె చెన్నయ్ లేదా గోవాకు వెళ్ళనున్నట్లు సమాచారం.   సోనియా గాంధీ అనారోగ్య సమస్య ఇటీవల కొంచెం పెరిగిందని చెబుతున్నారు. ఢిల్లీ నగరంలో తీవ్రమైన చలి, వాతావరణంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతోంది. కాలుష్యం బాగా పెరిగిన కారణంగా శ్వాస సమస్యలు ఉన్నవారికి ఢిల్లీ వాతావరణం ప్రమాదకరంగా మారింది. దీంతో డాక్టర్ల సూచన మేరకు కొంతకాలం సమ శీతోష్ణ పరిస్థితులు ఉండే ప్రాంతంలో ఉండాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. కొడుకు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకాగాంధీలతో కలిసి చెన్నయ్ నగర శివారు ప్రాంతం లేదా గోవాకు సమీపంలో కొంతకాలం ఉండేలా ప్లాన్ జరుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెబుతున్నారు.   అనారోగ్యం కారణంగానే సెప్టెంబరు నెలలో వైద్యులను కలవడానికి విదేశాలకు వెళ్ళింది సోనియాగాంధీ, పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సైతం ఆమెహాజరుకాలేదు. గత జూలై నెలలోనూ అనారోగ్యం కారణంగా సోనియా గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న సోనియాగాంధీకి ఢిల్లీ వాతావరణ సరిపడదని డాక్టర్లు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. చలి, కాలుష్యం తదితర సమస్యలు ఢిల్లీ నగరంలో తీవ్ర స్థాయిలో ఉన్నందున పరిస్థితి అనుకూలంగా మారేంత వరకు ఢిల్లీకి బైట ఉండడమే శ్రేయస్కరమని సూచించారట. దీంతో కొన్ని వారాల పాటు దక్షిణాదినే ఉండాలని ఆమె నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వచ్చే నెలలో జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సోనియా గాంధీ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది.

మహమ్మారితో కలిసి ఉగ్రవాదులొస్తున్నారు జాగ్రత్త.. హెచ్చరించిన ఐరాస

కరోనా మొదలైనప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న తీవ్ర నష్టం మన చూస్తూనే ఉన్నాం. తాజాగా ఈ కరోనా మహమ్మారి ఉగ్రవాదుల చేతిలో ఆయుధం గా మారె అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన (యునైటెడ్ నేషన్స్ ఇన్టర్ రీజినల్ క్రైమ్ అండ్ జస్టిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ) యూఎన్ఐసీఆర్ఐ ఆందోళన వ్యక్తం చేస్తోంది.   ప్రపంచంలోని కొన్ని విచ్ఛిన్నకర ఉగ్ర శక్తులు కరోనా పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని, ముఖ్యంగా ఐసిస్, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో సరికొత్త కుట్రకు తెర తీస్తున్నాయని యూఎన్ఐసీఆర్ఐ హెచ్చరించింది. ఈ ఉగ్రవాద సంస్థలకు చెందిన సభ్యులు తమకు కరోనా సోకేలా చేసుకుని తరువాత వైరస్ బాంబుల్లా తయారవుతున్నారని పేర్కొంది. ఆపై వారు మాస్క్ లు ధరించకుండా జనసమూహాల్లోకి వెళ్లి బహిరంగంగా తుమ్మడం, దగ్గడం వంటి చర్యలకు పాల్పడతారని, దీని ద్వారా ప్రజల్లో ఈ మృత్యుకారక వైరస్ మరింత వ్యాపించేందుకు ప్రయత్నిస్తున్నారని  వివరించింది. ఈ రకమైన కొత్త కొత్త దాడులను ఉగ్రసంస్థలు కూడా ప్రోత్సహిస్తున్నాయని యూఎన్ఐసీఆర్ఐ తన నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా ఈ విధమైన కుట్ర సిద్ధాంతాల ప్రచారం కోసం సోషల్ మీడియాను విపరీతంగా వాడుకుంటున్నారని తన నివేదికలో తెలిపింది.

తెలంగాణ కాంగ్రెస్‌ కు భారీ షాక్

తెలంగాణ కాంగ్రెస్‌ కు షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మహేంద్రహిల్స్‌లోని సర్వే సత్యనారాయణ ఇంటికి వెళ్ళిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ బీజేపీలోకి రావాలని ఆయనను ఆహ్వానించారు. అనంతరం త్వరలో బీజేపీలో చేరుతున్నట్లు సర్వే ప్రకటించారు. అంతేకాదు తనతో పాటు చాలా మందిని బీజేపీలో చేర్పిస్తానని సర్వే తెలిపారు.   సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడం గ్రేటర్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ కు గట్టి షాక్ అనే చెప్పొచ్చు. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికలో ఘోర ఓటమిని చవిచూసింది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల వేళ సీనియర్లు పార్టీని వీడడం పార్టీ శ్రేణులను కలవరపెడుతోంది. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ ని వీడారు. ఫైర్ బ్రాండ్ విజయశాంతి సైతం కాంగ్రెస్ ని వీడి బీజేపీలో చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. మరో నేత కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా కాంగ్రెస్‌ను వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, లేదంటే తెలంగాణలో కాంగ్రెస్ మనుగడ కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పాక్‌లో వెలుగుచూసిన 1300 ఏళ్లనాటి విష్ణువు ఆలయం

పాకిస్తాన్‌ లో అతిపురాతనమైన హిందూ ఆలయం వెలుగుచూసింది. వాయువ్య పాకిస్తాన్‌ లోని స్వాత్ జిల్లా బ‌రీకోట్ ఘుండాయ్ ద‌గ్గర‌ పురావస్తుశాఖ చేపట్టిన తవ్వకాల్లో 1300 ఏళ్లనాటి ఆలయం బయటపడింది. దీనిని శ్రీ మహా విష్ణువు ఆలయంగా గుర్తించినట్టు పాకిస్తాన్‌ పురావస్తుశాఖ చీఫ్ ఫజల్ ఖాలిక్ తెలిపారు. 1300 ఏళ్ల క్రితం హిందూ షాహీ కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు భావిస్తున్నామన్నారు.   కాగా, హిందూ షాహీస్ లేదా కాబూల్ షాహీస్ ఒక హిందూ రాజ్యవంశంగా చెబుతారు. చరిత్ర ప్రకారం క్రీ.శ. 850-1026 మధ్య కాలంలో ఈ వంశ‌స్థులు.. ఇప్పుడు పాక్ లో భాగమైన కాబూల్ లోయ‌, గాంధారాతో పాటు వాయ‌వ్య భార‌త్ ప్రాంతాన్ని పాలించారు. వారే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు అభిప్రాయపడుతున్నారు.

రాజధాని తరలింపుపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు..

కొద్ది కాలం క్రితం విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనను పోలీసులు అడ్డుకున్న కేసుపై ఏపీ హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. అయితే దీనికి సంబంధించిన అఫిడవిట్‌లో ప్రభుత్వానిది మతిలేని చర్య అని పేర్కొనడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపు లాయర్ తీవ్రంగా తప్పు పట్టారు. దీంతో వేల కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన అమరావతి రాజధానిని తరలించాలనే ప్రభుత్వ ఆలోచన మతిలేని చర్య కాదా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. ఇదే సమయంలో రాజకీయాల్లో నేరప్రవృత్తి కూడా పెరిగిపోతోందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీనిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు సూచించింది. నేరచరిత్ర కలిగిన వారినుంచి వ్యవస్థలను కాపాడాలని ధర్మాసనం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

ముంబై ఉగ్రదాడిని మించిన కుట్ర వార్తల నేపథ్యంలో..  మోడీ, షా, దోవల్ అత్యవసర భేటీ

జమ్మూ కశ్మీరులోని నగ్రోటాలో జరిగిన ఎన్‌కౌంటర్, 26/11 ముంబై దాడులు జరిగి పన్నెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఉగ్రవాదులు మరో సారి అంతకంటే భారీ ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నట్లు సమాచారం వస్తున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమయ్యారు. ఇంకా ఈ సమావేశానికి విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్థన్ శృంగ్లా, నిఘా సంస్థల ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు.   ముంబైలో దాడులు జరిగిన నవంబర్ 26వ తేదీనే మరోసారి భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేసిన నలుగురు టెర్రరిస్టులను జమ్మూ కాశ్మీర్ లో భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారంతా ముంబై దాడులు జరిగిన రోజే మరోసారి భారీ స్థాయిలో దాడి చేయడానికి కుట్ర పన్నినట్టు నిఘావర్గాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో దేశంలో భద్రతపై ప్రధాని మోదీ అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలను ప్రధానిమోదీ ట్విట్టర్ ద్వారా అభినందించారు.   గురువారం జమ్మూకాశ్మీర్‌లో జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. జమ్మూ హైవేపై నగ్రోటా ప్రాంతంలోని బస్ టోల్‌ప్లాజా వద్ద ఓ ట్రక్కు అనుమానాస్పదంగా కనిపించింది. బియ్యం ట్రక్కును తనిఖీ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో ట్రక్కు డ్రైవర్‌ వెంటనే దిగి పారిపోయాడు. దీంతో అప్రమత్తమైన బలగాలు ట్రక్కులో వెతికాయి. బియ్యం బస్తాల మాటున దాక్కున్న ఉగ్రవాదులు భారత భద్రతా బలగాలపై గ్రెనేడ్లు విసరుతూ, కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు, సీఆర్పీఎఫ్‌ బలగాలు ఆ ట్రక్కును చుట్టుముట్టి, దీటుగా స్పందించారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. ఉగ్రవాదుల వద్ద నుంచి 11 ఏకే రైఫిళ్లు, 24 మేగజైన్లు, 3 పిస్టళ్లు, 35 గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు.

బీజేపీకి జనసేన మద్దతు! ప్రచారం కూడా చేస్తానన్న పవన్

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. సొంతంగానే పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన ఇప్పుడు వెనక్కి తగ్గింది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఓబీసీ చైర్మెన్ లక్ష్మణ్ తో చర్చల తర్వాత గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేయడం లేదని అధికారికంగా ప్రకటించారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. గ్రేటర్‌లో బీజేపీ తరపున ప్రచారానికి జనసేనాని ఒప్పుకున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు.   గ్రేటర్ హైదరబాద్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై బీజేపీ, జనసేన మధ్య కొన్ని రోజులుగా గందరగోళం నెలకొంది. గ్రేటర్ లో పోటీ చేయాలని నిర్ణయించుకున్న జనసేన... బీజేపీతో పొత్తుకు ఆసక్తి చూపింది. అయితే బీజేపీ మాత్రం జనసేనను పట్టించుకోనట్లుగా వ్యవహరించింది. గ్రేటర్ ఎన్నికల్లో తమకు ఎవరితోనూ పొత్తు లేదని రెండు రోజుల క్రితం ప్రకటించారు బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్. అంతేకాదు జనసేనతో పొత్తు ఏపీ వరకే పరిమితమని కూడా స్పష్టం చేశారు. సంజయ్ ప్రకటనతో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్త ఉండదనే అంతా అనుకున్నారు. అయితే గురువారం జనసేన నుంచి మరో ప్రకటన వచ్చింది. గ్రేటర్ ఎన్నికలపై పవన్ తో మాట్లాడేందుకు బండి సంజయ్ వస్తున్నారని ప్రకటించింది. జనసేన ప్రకటనతో రెండు పార్టీల మధ్య చర్చలు జరుగుతాయని, పొత్తు కదరవచ్చని భావించారు.   జనసేన లేఖపై మరోసారి స్పందించిన బండి సంజయ్... జనసేనతో పొత్తు సమస్యే లేదన్నారు. తాము 150 మందిని ఇప్పటికే ఖరారు చేశామని చెప్పారు. దీంతో తెలంగాణ జనసేన అధ్యక్షుడు కూడా స్పందించి రాత్రికి తమ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తామన్నారు. అయితే లిస్ట్ రిలీజ్ కాలేదు. శుక్రవారం మళ్లీ పొలిటికల్ సీన్ మారిపోయింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వెళ్లి పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపారు. జనసేన పోటీ చేయకుండా బీజేపీకి మద్దతిచ్చేలా అయన్ను ఒప్పించారు.   జనసేనతో పొత్తు విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. నామినేషన్ల పర్వం ముగిసేవరకు కావాలనే సాగదీసినట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి అన్ని డివిజన్లలో అభ్యర్థులు నామినేషన్ వేశాకా పవన్ వద్దకు బీజేపీ నేతలు వెళ్లారు. నామినేషన్ వేసిన అభ్యర్థులను మళ్లీ వెనక్కి తీసుకోలేమని చెప్పలేం కాబట్టి ఎలాగైనా సర్దుకుపోవాలని పవన్ ను ఒప్పించినట్లు చెబుతున్నారు. జనసేన తరుపున ఎక్కువగా నామినేషన్లు రాకపోవడంతో వారిని విత్ డ్రా చేయించడం పెద్ద కష్టం కాదనే అభిప్రాయంతోనే బీజేపీ ఇలా ఎత్తు వేసిందని చెబుతున్నారు. అయితే గ్రేటర్ ఎన్నికల పొత్తు విషయంలో బీజేపీ చేతిలో జనసేన బఫూన్ అయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

పాన్ షాప్ మాదిరిగా సీబీఐ! మహారాష్ట్ర మంత్రి హాట్ కామెంట్స్

సీబీఐపై సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర మంత్రి అస్లాం షేక్. సీబీఐని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక పాన్ షాప్ మాదిరి తయారు చేసిందని ఆయన ఆరోపించారు. అది ఎక్కడకైనా పోతుందని, ముఖ్యంగా బీజేపీయేతర పాలిత రాష్ట్రాలకు వెళ్తుందని, ఎవరినైనా బుక్ చేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులకు వ్యతిరేకంగా కూడా చర్యలు తీసుకుంటుందని విమర్శించారు. సీబీఐ గురించి ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన రూలింగ్ కరెక్ట్ అని చెప్పారు మంత్రి అస్లాం షేక్.   రాష్ట్రాల అనుమతి లేకుండా సీబీఐ అక్కడ విచారణ జరపరాదని... రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోనే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో విచారణ జరపాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీబీఐకి సంబంధించిన ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టును సుప్రీం తన తీర్పు సందర్భంగా ఊటంకించింది. చట్టం ప్రకారం సీబీఐకి రాష్ట్రాల అనుమతి తప్పనిసరి అని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రస్తుతం రాజస్థాన్, బెంగాల్, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, చత్తీస్ గఢ్, పంజాబ్, మిజోరాం రాష్ట్రాలు సీబీఐకి అనుమతిని నిరాకరించాయి. గతంలో సీఎంగా చంద్రబాబు ఉండగా ఏపీలోనూ సీబీఐకి అనుమతి నిరాకరించారు.