రెండు వారాల్లోనే ఖతం! గులాబీ ప్లాన్ ప్రకారమే షెడ్యూల్?
posted on Nov 17, 2020 @ 3:49PM
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ముందస్తు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. రెండు వారాల్లోనే నామినేషన్లు, పోలింగ్ పూర్తయ్యేలా షెడ్యూల్ ప్రకటించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. నవంబర్ 18న నామినేషన్లు ప్రారంభం కానుండగా.. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుంది. అంటే రెండు వారాల్లోనే పోలింగ్ ప్రక్రియ మొత్తం ముగియనుంది. గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ పై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంత హడావుడిగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలించేలా షెడ్యూల్ ఉందని, టీఆర్ఎస్ డైరెక్షన్ లోనే ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మూడు రోజులే నామినేషన్లకు గడువుందని, పోటీ చేయాలనుకునే అభ్యర్థులు నామినేషన్ సందర్భంగా సమర్పించాల్సిన డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడం కూడా కష్టమనే వాదనలు వస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ వెనక టీఆర్ఎస్ భారీ ప్లాన్ ఉందని చెబుతున్నారు. గ్రేటర్ లో ముందస్తుకు వెళ్లాలని మూడు నెలలక్రితమే డిసైడైన గులాబీ పార్టీ.. అందుకు పక్కా ప్రణాళికలు వేసుకుంది. గత రెండు నెలలుగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో హడావుడి చేశారు మంత్రి కేటీఆర్. గ్రేటర్ లో పార్టీ పరిస్థితి, ప్రస్తుత కార్పొరేటర్ల పనితీరు, కొత్తగా ఇస్తే ఎవరికి టికెట్ ఇవ్వాలన్న అంశాలపై కారు పార్టీ కసరత్తు కూడా పూర్తి చేసిందని చెబుతున్నారు. వివిధ సంస్థలతో సర్వే చేయించి.. అందుకు అనుగుణంగా అభ్యర్థుల లిస్టును అధికార పార్టీ ఇప్పటికే రెడీ చేసిందని చెబుతున్నారు. టికెట్ కన్పామ్ అయిన నేతలకు ముందే సమాచారం ఇవ్వడంతో వారంతా ప్రచారం కూడా చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వం పంపిణి చేసిన వరద సాయాన్ని ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల చేతుల మీదుగానే అందించారని చెబుతున్నారు.
వరద బాధితులకు సాయం గా ఇప్పటికే 5 వందల కోట్ల రూపాయల వరకు పంపిణి చేసింది సర్కార్. వరద సాయం పంపిణీ కొన్నిప్రాంతాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. వరద సాయం గురించి జనం మరువక ముందే ఎలక్షన్స్ పెడితే ఫాయిదా ఉంటుందని అధికార పార్టీ అంచనాలు వేసుకుందని సమాచారం. గ్రేటర్ లో ఒక్కో కుటుంబానికి రూ. 10 వేల చొప్పున ఇప్పటికి 5 లక్షల మందికి ఆర్థిక సాయం చేసినట్లు టీఆర్ఎస్ లీడర్లు చెప్తున్నారు. లోకల్ కార్పొరేటర్, గులాబీ లీడర్ల పర్యవేక్షణలో సాయం పంపిణీ జరుగుతోంది. ఆర్థిక పరిస్థితి సరిగా లేని టైంలో అందించిన ఈ సాయాన్ని ఓట్లుగా మల్చుకోవాలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. కుటుంబానికి మూడు ఓట్లు లెక్కేసినా 15 లక్షల మందికి పైగా సాయం చేసినట్లు.. ఇవన్ని తమకు ఓట్ల రూపంలో కలిసి వస్తాయని గులాబీ నేతల అంచనాగా ఉంది. గ్రేటర్ లో 74 లక్షల ఓట్లుగా.. పోలయ్యేది 35 లక్షల వరకే ఉంటుంది. దీంతో తమకు గెలుపు ఈజీగానే ఉంటుందంటున్నారు టీఆర్ఎస్ నేతలు.
గ్రేటర్ ఎన్నికలకు ఇలా అని విధాలా సిద్ధమైన కారు పార్టీ.. విపక్షాలకు ఏ మాత్రం సమయం ఇవ్వకూడదన్న ప్లాన్ తోనే ఎన్నికల షెడ్యూల్ ను ఇలా రూపొందించిందనే విమర్శలు వస్తున్నాయి. దుబ్బాకలో బీజేపీ గెలవడంతో గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ నేతలకు టెన్షన్ పట్టుకుందట. దుబ్బాక ఫలితంతో బీజేపీలో జోష్ పెరిగిందని అంచనా వేస్తున్న టీఆర్ఎస్ పెద్దలు.. గ్రేటర్ ఎలక్షన్స్ను ఆలస్యం చేస్తే బీజేపీ పుంజుకుంటుందని భావించారట. ఇప్పటికే గ్రేటర్ లో బీజేపీలోకి వలసలు జోరందుకున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ఇంచార్జ్ గా జాతీయ నేత భూపేంద్ర యాదవ్ ను నియమించింది బీజేపీ. దీంతో తమ పార్టీ కేడర్ వలసపోవచ్చనే భయం గులాబీ పెద్దల్లో ఉందని చెబుతున్నారు. అందుకే గ్రేటర్లో బీజేపీ బలం పెంచుకునేందుకు ట్రైం ఇవ్వకుండా వెంటనే ఎన్నికలు పెట్టిందని చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ కూడా ఇటీవల గ్రేటర్ లో దూకుడు పెంచింది. వరద సాయంపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేసింది. ఎంపీ రేవంత్ రెడ్డి జోనల్ కమిషనర్ల కార్యాలయాల ముందు ధర్నాలు చేశారు. కాంగ్రెస్ ఆందోళనలకు జనాల నుంచి మంచి స్పందన వచ్చింది. గ్రేటర్ లో మరింత పోరాటానికి కాంగ్రెస్ ప్లాన్ చేస్తుండగానే గ్రేటర్ షెడ్యూల్ వచ్చేసింది. గ్రేటర్ లో కాంగ్రెస్ కు ప్రస్తుతం సరైన లీడర్లు లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో చాలా మంది ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ఇప్పుడు చాలా చోట్ల కొత్త అభ్యర్థులను వెతుక్కొవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నామినేషన్లను మూడు రోజులే గడువుంది. దీంతో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం కాంగ్రెస్ కు కష్టమేనన్న చర్చ జరుగుతోంది.
కేవలం రెండు వారాల్లోనే పోలింగ్ ఉంది. అభ్యర్థుల ఎంపికకే ప్రతిపక్షాలకు రెండు, మూడు రోజుల సమయం పోతుందని చెబుతున్నారు. ఇక ప్రతిపక్షాలకు ప్రచారం చేసుకోవడానికి ఐదారు రోజులే లభిస్తుందని తెలుస్తోంది. ఐదారు రోజుల్లో ఎంత మందిని కలుస్తారు.. ఇతరత్రా ఎన్నికల పనులు ఎవరూ చూస్తారోనన్న ఆందోళన విపక్షాల్లో వ్యక్తమవుతోంది. ఇవన్ని లెక్కలు వేసుకున్నాకే అధికార పార్టీ పక్కా ప్లాన్ ప్రకారమే ఎన్నికల సంఘం నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిందంటున్నారు. అందుకే ఎన్నికల షెడ్యూల్ పై విమర్శలు చేస్తోంది బీజేపీ. టీఆర్ఎస్ రాసిచ్చిన షెడ్యూల్ నే ఎన్నికల
సంఘం ఖరారు చేసిందని ఆరోపించింది. రాష్ట్ర ఎన్నికల సంఘంపై సీఈసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు బీజేపీ నేతలు.