మూడేళ్ళ తరువాత వైసీపీ ఉండదు... బీజేపీ నేత సెన్సేషనల్ కామెంట్స్
posted on Nov 17, 2020 @ 4:01PM
ఏపీ సీఎం జగన్, అలాగే అయన పార్టీ పై బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "వైసీపీ అనేది మూసేసే పార్టీ. మూడు సంవత్సరాల తర్వాత అసలు ఆ పార్టీనే ఉండదు. గ్యారెంటీగా చెబుతున్నా. కావాలంటే మీరు రాసిపెట్టుకోండి. ఇక్కడ మూసేయడం అంటే ఆ పార్టీ అధికారంలో ఉండదని అర్థం.’’ అంటూ విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీ ఓడిపోతుందని తాను ముందే చెప్పానని, 2019 ఎన్నికలలో అదే జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అంతేకాకుండా నోటికి వచ్చింది చెప్పడానికి తాను కేఏ పాల్‌ను కానని విష్ణుకుమార్ రాజు సెటైర్ వేశారు. సంవత్సరంన్నరలోనే జగన్ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని అయన చెప్పారు. పాదయాత్ర సమయంలో ప్రజలకు జగన్ ముద్దులు పెడితే నిజమైన ప్రేమ అనుకున్నారని, కానీ ఇప్పుడు వారికి అది దొంగ ప్రేమ అని తెలిసిందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చాలు లోపల వేస్తున్నారని అయన దుయ్యబట్టారు. విశాఖలో అక్రమ కట్టడాలంటూ ప్రతివారం శుక్రవారం రాత్రి నుండి మొదలుపెట్టి కూలగొడుతున్నారని చెప్పారు. ఇకనుండి కోర్టులు శని, ఆదివారాలు కూడా తెరిచే విధంగా చూడాలని అయన కోరారు. విశాఖలో హైకోర్టు బెంచ్ ఒకటి ఏర్పాటు చేయాలని, అప్పుడే ఇక్కడి ప్రజలకు న్యాయం జరుగుతుందని, లేకపోతే సామాన్యులు భయభ్రాంతులకు గురయ్యే ప్రమాదం ఉందని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.