షాకింగ్.. తెలంగాణలో వ్యాక్సిన్ తీసుకున్న 108 డ్రైవర్ మృతి!

భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే పలు రాష్ట్రాలలో వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కొందరు అస్వస్థతకు గురవుతున్నారు. తాజాగా, తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న గంటల్లోనే ఓ వ్యక్తి మరణించడం ఆందోళన కలిగిస్తోంది.   నిర్మల్ జిల్లా కుంటాల మండలం ఒలా గ్రామానికి చెందిన విఠల్ రావు అనే వ్యక్తి 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆయన మంగళవారం కుంటాల పీహెచ్‌సీలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే కుటుంబసభ్యులు నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విఠల్‌ మృతిచెందారు. వ్యాక్సిన్ తీసుకున్న గంటల్లోనే విఠల్‌ మరణించడంతో వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే, ఆయన మృతికి కోవిడ్ వ్యాక్సినేషనే కారణమా? లేదా? అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమంటున్నారు డాక్టర్లు. మరోవైపు విఠల్‌ మృతిపై డైరెక్టర్ అప్ పబ్లిక్ హెల్త్ స్పందించారు. గుండెపోటుతో ఆయన మరణించారని ఓ ప్రకటన విడుదల చేశారు. విఠల్‌ మరణంపై విచారణ కోసం  కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులతో పాటు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఊరట కలిగేలా నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్స కోసం అనేక మంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరి లక్షల కొద్ది రూపాయలు ఖర్చు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల ఆరోగ్య పథకం లో ఈ వసతి లేకపోవడంతో అనేకమంది లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. అలాంటి వారికి కేసీఆర్ సర్కార్ ఓ గుడ్ న్యూస్ తెలిపింది. కరోనా సోకి అత్యవసర చికిత్స పొందే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారిపై ఆధారపడిన వారికి రూ.లక్ష వరకు మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ అందివ్వనుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ తాజాగా దీనికి సంబంధించిన మెమో జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉద్యోగ విరమణ పొందినవారు 25 లక్షల మంది ఉంటారు. తాజా నిర్ణయం లక్షలాది మందికి ప్రయోజనం కలిగిస్తుందని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి.

దళిత ఎంపీ చనిపోతే పరామర్శించరా! జగన్ తీరుతో తిరుపతి వైసీపీకి దడ

ఎంపీ దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్ సభకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. తిరుపతి ఉప ఎన్నికను సవాల్ గా తీసుకుంటున్న టీడీపీ .. గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తోంది.  అయితే  వైసీపీ సిట్టింగ్ ఎంపీ చనిపోయినా.. ఆ కుటుంబాన్ని సీఎం జగన్ పరామర్శించకపోవడం ఇప్పుడు టీడీపీకి అస్త్రంగా మారుతోంది. ఇదే అంశంలో  సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ అనారోగ్యంతో చనిపోతే ఆయన కుటుంబ సభ్యులను జగన్ ఇంతవరకు పరామర్శించలేదని విమర్శించారు. దివంగత ఎంపీ దుర్గాప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించని జగన్ పై దళితులంతా ఏకమై తిరగబడాలని పిలుపిచ్చారు అచ్చెమన్నాయుడు. జగన్ ను దళితులు రాష్ట్రం నుంచి వెలివేయాలని వ్యాఖ్యానించారు. దళితులపై జగన్ కు నిజంగా అభిమానం ఉంటే... దుర్గాప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేవారని అన్నారు అచ్చెమన్నాయుడు. ఎంపీ చనిపోతే పరామర్శించే బాధ్యత ఆ పార్టీ అధినేత, సీఎంకు లేదా? అని  ప్రశ్నించారు. దుర్గాప్రసాద్ చనిపోయిన 12 రోజులకు బందర్ లో ఓ మంత్రి తల్లి చనిపోయారని... ఆ సందర్భంగా హెలికాప్టర్ లో వెళ్లి జగన్ ఆయనను పరామర్శించారని చెప్పారు అచ్చెమన్నాయుడు. కర్నూలు జిల్లాలో ఓ ఎమ్మెల్సీ చనిపోతే హెలికాప్టర్ లో వెళ్లి పరామర్శించారని గుర్తుచేశారు. దుర్గాప్రసాద్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. దళితులపై జగన్ కు అంత చులకన భావం ఎందుకని ఏపీ టీడీపీ అధ్యక్షుడు ప్రశ్నించారు. సీఎం జగన్ తీరుపై తిరుపతి జనాల్లోనూ చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ముఖ్యంగా దళితులు జగన్ పై ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. రెడ్డి నేతలు, వారి  కుటుంబ సభ్యులు చనిపోతే.. ప్రత్యేక  హెలికాప్టర్ లో వెళ్లి పరామర్శిస్తున్న జగన్.. పదవిలో ఉన్న ఎంపీ చనిపోయినా ఇంతవరకు అతని కుటుంబాన్ని పరామర్శించకపోవడం ఏంటని జనాలు కూడా ప్రశ్నిస్తున్నారు. అందుకే టీడీపీ ఈ అంశాన్ని తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారంగా మలుచుకోవాలని చూస్తోందట. జగన్ తీరుపై వైసీపీ కేడర్ లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోందని తెలుస్తోంది.తిరుపతి ఉప ఎన్నికలో ఇది తమకు తీవ్ర నష్టం కల్గిస్తుందని కొందరు అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. 

భారతీ సిమెంట్స్ కే సర్కార్ బల్క్ ఆర్డర్లు! ఖజానా దోచేస్తున్న జగన్ ఫ్యామిలీ?  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సిమెంట్ కంపెనీ లాభార్జనలో దూసుకుపోతోంది... కాదు కాదు సర్కార్ ఖజానాను అప్పనంగా  దోచేస్తూ ఆదాయం పెంచుకుంటోంది. ఇదో ఎవరో విపక్ష నేతలు చేస్తున్న  ఆరోపణ కాదు. స్వయానా ఏపీ సర్కార్ చెబుతున్న లెక్కలు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం మొదటి 10 నెలల్లో  ప్రభుత్వ పనుల కోసం... జగన్ రెడ్డి సర్కార్ అధికారికంగా కొనుగోలు చేసిన సిమెంట్ ఆర్డర్లలో మెజార్టీ వాటా భారతీ సిమెంట్స్ కే దక్కింది. 2020 ఏప్రిల్ నుంచి జనవరి 18 వరకు 2021 వరకు.. 10 నెలల కాలంలో 2,28,370.14 మెట్రిక్ టన్నుల సిమెంటు కోసం భారతీ సిమెంట్స్ కు ఆర్డర్లు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.  ఏపీ  సర్కార్ ఆర్డర్లను బల్క్ గా  కొట్టేసిన ఈ భారతీ సిమెంట్స్ సంస్థ ఎవరిదో  తెలుగు ప్రజలందరికి తెలుసు. భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కుటుంబానికి 49 శాతం వాటా ఉంది. సీఎం జగన్ రెడ్డి భార్య భారతీనే ఆ సంస్థ  డైరెక్టర్. వికాట్ అనే ఫ్రెంచ్ సంస్థ 2010 లో భారతి సిమెంట్‌లో 51 శాతం వాటాను సొంతం చేసుకుంది.  అంటే సీఎం జగన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న  భారతీ సిమెంట్ కు..  బల్క్ ఆర్డర్లు ఇస్తూ  ప్రజా ధనాన్ని దోచి పెడుతోంది  ఏపీ సర్కార్. బహిరంగ మార్కెట్ లో సిమెంట్ రేటు పెరిగేలా సిండికేట్ నడిపి.. తర్వాత ప్రభుత్వ పనులకు సామాజిక బాధ్యత కింద తక్కువ రేటుకే సరఫరా చేస్తున్నామనే కవరింగ్ ఇస్తూ.. ఈ నయా సిమెంట్ దోపిడికి జగన్ ఫ్యామిలీ  తెర తీసిందనే ఆరోపణలు వస్తున్నాయి.     భారతీ సిమెంట్స్ తర్వాత  ఏపీ ప్రభుత్వం నుంచి ఎక్కువ ఆర్డర్లు పొందింది ఇండియా సిమెంట్స్ లిమిటెడ్.  గత 10 నెలల కాలంలో  1,59,753.70 మెట్రిక్ టన్నుల ఆర్డర్ పొందింది ఈ సంస్థ.  ఇది భారతి సిమెంట్స్ కంటే 30 శాతం తక్కువ. అయితే ఈ ఇండియా సిమెంట్స్ ఎవరిదో కాదు. వైఎస్ జగన్ మరియు ఇతరులపై సిబిఐ నమోదు చేసిన  క్విడ్ ప్రో కో కేసులో ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీనివాసన్ ఒకరు. అంతేకాదు భారతి సిమెంటులో రూ .95.32 కోట్ల పెట్టుబడులు కూడా పెట్టింది ఇండియా సిమెంట్స్.  ఏపీ సర్కార్ నుంచి ఆర్డర్లు ఎక్కువగా పొందిన మూడో సంస్థ పెన్నా సిమెంట్స్‌.  ఏపీ ప్రభుత్వం నుంచి 1,50,325.02 మెట్రిక్ టన్నుల కొనుగోలు ఆర్డర్లు పెన్నా సిమెంట్స్ కు గత 10 నెలల కాలంలో వచ్చాయి. పెన్నా సిమెంట్స్ ఓనర్ కూడా జగన్ పై నమోదైన సీబీఐ క్విడ్ ప్రో కేసులో నిందితుడే.  మొత్తంగా జగన్ కుటుంబానికి చెందిన , ఆయన సీబీఐ కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తుల సంస్థలకే  ఏప్రిల్ 2020 నుంచి  జనవరి 2021 మధ్య మొత్తం ఏపీ ప్రభుత్వ కొనుగోలు ఆర్డర్‌లలో మూడవ వంతు వాటా దక్కింది.  ఏప్రిల్ 2012 మరియు సెప్టెంబర్ 2014 మధ్య సిబిఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లలో... 6, 7, 8 చార్జిషీట్లలో  డాల్మియా సిమెంట్స్, ఇండియా సిమెంట్స్, రఘురామ్ సిమెంట్స్ (భారతి సిమెంట్ యొక్క పూర్వపు పేరు) మరియు పెన్నా సిమెంట్స్ క్విడ్ ప్రో కోకు సంబంధించినవి.  వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కొన్ని కంపెనీల వైపు మొగ్గు చూపిందని, తక్కువ ధరలకు భూమిని కేటాయించిందని, మైనింగ్ లీజులు ఇవ్వడానికి చట్టాలను అధిగమించిందని లేదా నిబంధనలకు విరుద్ధంగా అదనపు నది నీటిని కేటాయించిందని సిబిఐ ఆరోపించింది, దీనికి బదులుగా వారు జగన్ రెడ్డి యాజమాన్యంలోని సంస్థలలో పెట్టుబడులు పెట్టారని తెలిపింది. అప్పడు వైఎస్సార్ హయాంలో క్విడ్ ప్రోకోలో లాభపడ్డారనే కేసులు ఎదుర్కొంటున్న  శ్రీనివాసన్ ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్ సంస్థలే..  ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం నుంచి సిమెంట్ ఆర్డర్లు భారీగా పొందాయన్న మాట.     ఏపీ ప్రభుత్వ అధికారిక లెక్కలతో .. వైఎస్ హయాంలో వెలుగులోనికి వచ్చిన క్విడ్ ప్రోకో అక్రమ దందాకు  మించిన దోపిడి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో  జరుగుతుందని తేలుతోంది. భారతి సిమెంట్ నేతృత్వంలోని సిమెంట్ కంపెనీలు సిండికేట్ ఏర్పాటు చేశాయని టీడీపీ ఆరోపిస్తోంది. అందుకే గత కొన్ని నెలల్లో 50 కిలోల సంచికి 220-250 రూపాయల నుండి 350-400 రూపాయలకు పెంచారని చెబుతోంది.  భారతి సిమెంటుకు ప్రయోజనం చేకూర్చడానికి ఇది జరిగిందంటున్నారు టీడీపీ నేతలు. బహిరంగ మార్కెట్లో సిమెంట్ ధరల పెరుగుతున్నా జగన్ సర్కార్ పట్టించుకోలేదని..  సర్కార్ కు తక్కువ రేటుకు ఇస్తున్నారనే సాకుతో భారతీ సిమెంట్స్ కు ఆర్డర్లు ఇవ్వొచ్చని కుట్ర చేశారని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభీ ఆరోపించారు. సర్కార్ ఖజానాను సీఎం సొంత సంస్థ కొట్టేస్తుండగా.. సామాన్య జనాలు మాత్రం బహిరంగ మార్కెట్ లో ఎక్కువ రేటుకు సిమెంట్ కొనుగోలు చేస్తూ భారం మోస్తున్నారని ఆయన మండిపడ్డారు.    జగన్ సంస్థతో పాటు అతనితో సంబంధాలున్న సంస్థలకే ప్రభుత్వ సిమెంట్ ఆర్డర్లు ఇచ్చారన్న ఆరోపణలపై స్పందించిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి... ఇందులో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు.  భారతి, ఇండియా, పెన్నా  సిమెంట్స్  సంస్థలు..  తక్కువ  రేటుకే షెడ్యూల్ ప్రకారం సరఫరా చేయగలిగినందుననే వారికి సర్కార్ నుంచి ఎక్కువ  ఆర్డర్లు వచ్చాయన్నారు. ఇతర కంపెనీలకు సమస్యలున్నాయని, షెడ్యూల్ ప్రకారం సరఫరా చేయలేకపోయాయని చెప్పారు.   వైఎస్ఆర్ నిర్మాన్ అనే పోర్టల్ ద్వారా కొనుగోలు ఆర్డర్లు చేస్తామని తెలిపారు.  అన్ని ప్రభుత్వ విభాగాలు తమ అవసరాలను జిల్లా కలెక్టర్లకు పంపుతాయని,  అప్పుడు వైయస్ఆర్ నిర్మాన్ ద్వారా ఏపి సిమెంట్ తయారీదారుల సంఘం (ఎపిసిఎంఎ) కు ఆర్డర్లు ఇస్తారని చెప్పారు.  APCMA దాని 23 తయారీదారులలో ఆర్డర్లను పంపిణీ చేస్తుందన్నారు. ఇదంతా పారదర్శకంగా జరుగుతుందంటున్నారు గౌతం రెడ్డి.

గొల్లపూడిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత.. దీక్షకు దిగిన దేవినేని ఉమా 

ఏపీ రాజధాని అమరావతి తరలింపును వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఉద్యమం ఈరోజుతో 400వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల ఉద్యమానికి మద్దతుగా టీడీపీ దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో గొల్లపూడి సెంటర్ మొత్తం ప్రస్తుతం పోలీసుల వలయంలో ఉంది. రైతు ఉద్యమానికి మద్దతుగా టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తన నివాసంలో దీక్ష చేపట్టారు. దీంతో ఆ సమీపంలోని నివాసం ఉండే వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం గొల్లపూడి ప్రాంతం మొత్తం కర్ఫ్యూ వాతావరణాన్ని తలపిస్తోంది. మరోపక్క దేవినేని దీక్షకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. రైతుల దీక్షలకు టీడీపీ నాయకులు దులిపాళ్ల నరేంద్ర తన మద్దతు తెలిపారు.   ఇది ఇలా ఉండగా నిన్న కూడా గొల్లపూడిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దేవినేని ఉమ పై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టాలని దేవినేని సిద్ధం కాగా.. ఆయనను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

టీఆర్ఎస్, బీజేపీలను తరిమికొడతామన్న రేవంత్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేశారు తెలంగాణ  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలన్నారు రేవంత్ రెడ్డి. జీఎస్టీ. సీఏఏ బిల్లులతో పాటు నోట్ల రద్దుకు  కేసీఆర్ సపోర్ట్ చేశారని చెప్పారు. మోడీ, అమిత్ షాకి  లొంగిపోయి.. ఈడి, సీబీఐకి  బయపడి కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. కేసీఆర్ కాళేశ్వరం దోపిడీ , విద్యుత్ దోపిడి,  యాదాద్రి పై  విచారణకు ప్రధాని ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. బీజేపీ కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందన్నారు.  మోడీ, కేసీఆర్ కలిసి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి.     కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి  మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు.  కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు ప్రధాని మోడీ వైపు ఉంటారో లేకుంటే రైతుల వైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు. వ్యవసాయ చట్టాలపై కేంద్రం చర్చల పేరిట కాలయాపన చేస్తోందన్న రేవంత్‌రెడ్డి.. మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ నేతలను కేసీఆర్ సర్కార్ అరెస్ట్‌  చేస్తోందని  విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్  రెడ్డి పంట కొనుగోలు చేయమని బహిరంగంగా చెప్పడం సిగ్గుచేటన్నారు. పంట కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని.. లేదంటే టీఆర్ఎస్, బీజేపీలను గాలికి తూర్పారపడతామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.  

రామాలయానికి విరాళాలు సేకరించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ యుద్ధం సాగుతోంది. ఇరు పార్టీల నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతూ కాక పుట్టిస్తున్నారు.  తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్ తో పాటు ఇతర కమలం నేతలు సీఎం కేసీఆర్ టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రామ భక్తులు నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాల్గొని అందరికి షాకిచ్చారు. రామ భక్తులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడంతో పాటు తాను కూడా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి విరాళాలు సేకరించారు.             అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా జరుగుతోన్న విరాళాల సేకరణలో భాగంగా ఆందోల్ - జోగిపేటలో కూడా రామ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు.  విరాళాల సేకరణ కోసం రామ భక్తులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే ఎవరూ ఊహంచిని విధంగా టీఆర్ఎస్‌కు స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కూడా ఈ ర్యాలీలో తన అనుచరులతో కలిసి పాల్గొన్నారు.  పట్టణంలో ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించారు. అంతేకాదు రామ మందిరం నిర్మాణానికి తన వంతుగా 11,111 రూపాయల విరాళం అందజేశారు టీఆర్ఎస్  ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.  బీజేపీ, టీఆర్ఎస్ మధ్య  విమర్శలు, ప్రతి విమర్శలు తీవ్రమవుతున్న తరుణంలో రామమందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరించే కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి పాల్గొనడం ఆసక్తిరేపుతోంది. రామమందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరించే కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి పాల్గొనడం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనను  ప్రజలు ఆసక్తిగా గమనించారు.అయితే రాముడు అందరి వాడు అన్న సంకేతం ఇచ్చేందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ ర్యాలీలో పాల్గొన్నారని చెబుతున్నారు. 

వరల్డ్ టాప్ టెన్ ట్రాఫిక్ రద్దీ నగరాలివే! 

ప్రపంచ దేశాల్లో పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు వలసలు పెరిగిపోతున్నాయి.  అయితే వలసలకు తగ్గట్లు మౌలిక వసతుల కల్పన నగరాల్లో సాధ్యం కావట్లేదు. దీంతో నగరాలు, పట్టణాల్లో రద్దీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద నగరాల్లో ట్రాఫిక్‌ రద్దీ దారుణంగా ఉంటోందని తాజా అధ్యయనం చెబుతోంది. ప్రపంచంలో ఏయే నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందనే అంశంపై టామ్ టామ్ సంస్థ ఒక నివేదిక వెల్లడించింది. 2020 సంవత్సరానికి సంబంధించిన ట్రాఫిక్ ఇండెక్స్‌ను Tom Tom Traffic index- 2020 పేరుతో విడుదల చేసింది. ప్రపంచంలోని ఆరు ఖండాలు, 57 దేశాల్లో మొత్తం 416 నగరాలపై ఈ సర్వే చేశారు. 2020 సంవత్సరంలో ప్రపంచంలో సగటు ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న పది నగరాలను ఆ సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో మూడు భారతీయ నగరాలు కూడా ఉన్నాయి. రష్యా రాజధాని మాస్కో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నగరాల్లో మొదటి స్థానంలో ఉంది. ఇక్కడి రోడ్లపై ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా 54 శాతంగా ఉందని టామ్ టామ్ నివేదిక తెలిపింది. భారత వాణిజ్య రాజధాని ముంబై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న నగరాల్లో ప్రపంచ వ్యాప్తంగా రెండు, మన దేశంలో  మొదటి స్థానంలో నిలిచింది. ముంబై రోడ్లపై వాహనాల ట్రాఫిక్ రద్దీ 53 శాతంగా ఉంది.కొలంబియా కేపిటల్ బొగోటా  53 శాతం ట్రాఫిక్ రద్దీతో మూడో స్థానంలో నిలిచింది. ఫిలిప్పీన్స్‌లో రాజధాని మనీలాలో ప్రజలు సొంత వాహనాలనే ఎక్కువగా వాడతారు. ఇక్కడి రోడ్లపై  ట్రాఫిక్ రద్దీ 53 శాతంగా నమోదైంది.  మిడిల్ ఈస్ట్ దేశాల్లో టర్కీలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది.  టర్కీ రాజధాని  ఇస్తాంబుల్ లో ట్రాఫిక్ రద్దీ  51 శాతంతో  ప్రపంచ నగరాల్లో ఇది ఐదో స్థానంలో ఉంది.    భారత్ ఐటీ నగరం బెంగళూరులో ట్రాఫిక్ సమస్య అంతకంతకు పెరిగిపోతోంది. మన దేశంలోని దక్షిణాది నగరాల్లో బెంగళూరులోనే రోడ్లపై సగటు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ రద్దీ స్థాయి 51 శాతంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్య ఎక్కువున్న ఆరో నగరంగా టామ్ టామ్ సంస్థ సర్వేలో నిలిచింది బెంగళూరు. ఉక్రెయిన్ దేశంలోని కైవ్ నగరంలో కూడా రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఇక్కడ ట్రాఫిక్ రద్దీ స్థాయి 51 శాతంగా ఉంది. భారత రాజధాని ఢిల్లీ రద్దీ ఎక్కువగా ఉన్న నగరాల్లో దేశంలో  మూడవ స్థానంలో, మొత్తం జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. మన రాజధానిలో ట్రాఫిక్ రద్దీ స్థాయి 47 శాతంగా ఉన్నట్లు టామ్ టామ్ వెల్లడించింది. రష్యాలోని నోవోసిబిర్స్క్ నగరం ట్రాఫిక్ రద్దీ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. నోవోసిబిర్స్క్ రోడ్లపై ట్రాఫిక్ రద్దీ స్థాయి 45 శాతంగా నమోదైంది. ఇక టూరిజానికి ప్రసిద్ధి చెందిన బ్యాంకాక్‌ నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అక్కడి రోడ్లపై సగటు ట్రాఫిక్ రద్దీ 44 శాతంగా ఉన్నట్లు టామ్ టామ్ తెలిపింది. బ్యాంకాక్ ఓవరాల్ లిస్టులో పదో స్థానంలో నిలిచింది.  అయితే నగరాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతున్నా..  కరోనా మహమ్మారి వైరస్ కారణంగా గతేడాది వివిధ దేశాల్లో ట్రాఫిక్ చాలావరకు తగ్గిపోయిందని సర్వేలో తెలిసింది. అయితే ఇది తాత్కాలికమేనని.. ప్రస్తుతం పట్టణాల్లో మళ్లీ ట్రాఫిక్ రద్దీ పెరుగుతుందని టామ్ టామ్ సంస్థ వివరించింది.    

ఖమ్మం టీఆర్‌ఎస్‌లో ముసలం.. పొంగులేటి తీరుతో కారుకి కొత్త కష్టం!!

దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో నిరాశలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ కి మరో షాక్ తగలనుందా?.. త్వరలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న వేళ పార్టీలో ఏర్పడిన ముసలం టీఆర్ఎస్ కి మరో ఓటమిని తెచ్చిపెట్టనుందా?.. తాజాగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టిన్నాయి. సౌమ్యుడుగా పేరున్న పొంగులేటి ఉన్నట్టుండి ఫైర్ అయ్యారు. సిట్టింగ్ ఎంపీ అయిన తనని కాదని గత ఎన్నికల్లో నామా నాగేశ్వరరావుకి టికెట్ ఇచ్చినా నోరు మెదపని పొంగులేటి.. ఉన్నట్టుండి తన అనుచరుల జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ సొంత పార్టీ నేతలను హెచ్చరించడం హాట్ టాపిక్ గా మారింది.   తన అనుచరులను ఆయా నియెజకవర్గాలలోని ఎమ్మెల్యేలు ఇబ్బంది పెడుతున్నారని పొంగులేటి ఆరోపిస్తున్నారు. తాజాగా సత్తుపల్లి నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లిన ఆయన.. రాజకీయాలలో ఏదీ శాశ్వతం కాదని, కక్షపూరిత రాజకీయాలు వద్దని అన్నారు. తన అనుచరులను కష్టపెట్టిన వారు వడ్డీతో సహ అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏ పదవి లేని పొంగులేటి.. నియెజకవర్గాలలో పర్యటించడంపై కొందరు ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారన్న వార్తలపై కూడా ఆయన ఘాటుగా స్పందించారు. తాను ప్రజా ప్రతినిధిని కానని.. ఎవరి అనుమతి తీసుకుని పర్యటనలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజాభిమానమే తనకు పదవని.. వచ్చే రోజున ఏదీ ఆగదని, పోయేది చెప్పి పోదని వ్యాఖ్యానించారు. తన అభిమానులను వేధించే ఎవరైనా ప్రతిఫలం చెల్లించాల్సిందేనని హెచ్చరించారు.   సొంత పార్టీ నేతలను హెచ్చరిస్తూ పొంగులేటి వ్యాఖ్యలు చేయడం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఉన్నట్టుండి ఆయన ఇంత ఆవేశపడటానికి కారణమేంటి? ఆయన పార్టీ మారడానికి సిద్దమయ్యారా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆయన టీఆర్ఎస్ ను వీడతారని గత లోక్ సభ ఎన్నికల నుంచే ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయనకు చెందిన సంస్థ పెద్ద ఎత్తున ప్రభుత్వ కాంట్రాక్టులు చేయడం, ప్రభుత్వం నుండి రావాల్సిన బిల్లులు పెండింగ్ లో ఉండటంతో ఆయన పార్టీ మారలేదని అంటుంటారు. అలాగే సీఎం కేసీఆర్ ఆయనకు రాజ్యసభ హామీ ఇచ్చారని కూడా ప్రచారముంది. అయితే ఇప్పుడు దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో బీజేపీ దూకుడు పెంచడం.. మరోవైపు, జిల్లాలో తనకి పట్టున్నప్పటికీ పదవిలో లేకపోవడం, సొంత పార్టీ నేతలతో సఖ్యత లేకపోవడం వంటి కారణాలతో ఆయన ఇక టీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఉన్నట్టుండి ఆయన దూకుడు పెంచి సొంత పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు.    త్వరలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న వేళ పొంగులేటి తీరు టీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొంగులేటి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపణలున్నాయి. ఆ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పది స్థానాలకు గాను ఒక్క సీటుతో టీఆర్ఎస్ సరిపెట్టుకుంది. ఆ కారణంతోనే సిట్టింగ్ ఎంపీ అయిన పొంగులేటి టికెట్ ఇవ్వకుండా.. నామాకి టికెట్ ఇచ్చారు. ఆ టైములో పొంగులేటి బీజేపీ లేదా కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగింది. కానీ పొంగులేటి మాత్రం నామా గెలుపుకోసం కృషి చేసి టీఆర్ఎస్ లోనే కొనసాగారు. అయితే ఇప్పుడు ఆయన ఉన్నట్టుండి స్వరం పెంచడం.. జిల్లా టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే టీఆర్ఎస్ కు మరో దెబ్బ తగిలినట్టేనని విశ్లేషకులు అంటున్నారు.

మరోసారి వింత వ్యాధి కలకలం.. మూర్చతో పడిపోతున్న జనం!!

పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరును గడగడలాడించిన వింత వ్యాధి తాజాగా భీమడోలు మండలం పూళ్ల గ్రామాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏలూరులో వచ్చిన వింత వ్యాధికి గల కారణాలు ఇంకా పూర్తిగా నిర్ధారణ కాక ముందే.. ఇవే లక్షణాలు మరోసారి కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 16న పూళ్ల గ్రామంలో ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. తరువాత అనారోగ్యానికి గురవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే గ్రామానికి చెందిన 10 మందికి పైగా అస్వస్థతకు గురికావడంతో వైద్య వర్గాల్లో ఆందోళన నెలకొన్నది. నిలుచున్న వారు నిలుచున్నచోటే కుప్ప కూలిపోవడం, ఫిట్స్‌తో కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపించడంతో వింత వ్యాధేమోనన్న భయంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఫుడ్ పాయిజన్ వల్ల ప్రజలు అస్వస్థతకు గురి అయ్యి ఉండొచ్చని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. పరీక్షలు నిర్వహించిన తర్వాత పూర్తిస్థాయి వివరాలు తెలిసే అవకాశముంది.    కాగా, గత డిసెంబర్లో ఏలూరులో వింతవ్యాధి కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. 600 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నీరు కలుషితం వల్లే ప్రజలు అస్వస్థతకు గురయ్యారని అప్పట్లో భావించారు. తాజాగా పూళ్ల గ్రామంలో 10 మందికి పైగా అస్వస్థతకు గురికావడంతో.. నీటి కాలుష్యమే కారణమా? లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

బెంగాల్ లో దీదీ.. తమిళనాట స్టాలిన్! ప్రీ పోల్ సర్వేలో బీజేపీకి షాక్ 

దేశ వ్యాప్తంగా త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్, అసోంతో పాటు దక్షిణాదికి చెందిన తమిళనాడు, పుదిచ్చేరి, కేరళ అసెంబ్లీ  ఎన్నికలు జరగబోతున్నాయి. బెంగాల్ లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది బీజేపీ. ఏడాదిన్నర క్రితం నుంచే అక్కడ రాజకీయ ఎత్తులు మొదలు పెట్టింది.  దక్షిణాదిలో పార్టీ విస్తరణపై ఫోకస్ చేసిన బీజేపీ.. తమిళనాడుపై ఆశలు పెట్టుకుంది. తమకు మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకేతో కలిసి మరోసారి సర్కార్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే బీజేపీ ఆశలపై నీళ్లు చల్లింది  ఏబీపీ- సీ ఓటర్ సర్వే. పశ్చిమ బెంగాల్ లో మరోసారి టీఎంసీదే అధికారమని తేల్చేసింది. తమిళనాడులో డీఎంకే కూటమి ఘన విజయం సాధించబోతోందని  ఏబీపీ- సీ ఓటర్ సర్వేలో తేలింది. కేరళలో  పినరయి విజయన్‌ మళ్లీ విక్టరీ కొడుతారని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.  తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా ఏబీపీ- సీ ఓటర్ సర్వే ప్రకారం డీఎంకే- కాంగ్రెస్ కూటమి  158 నుంచి 166 స్థానాలు గెలుచుకోబోతోంది. ఏఐఏడీఎంకే- బీజేపీ కూటమి  60 నుంచి 68 స్థానాలకే పరిమితం కానుంది. కమల్‌హాసన్ పార్టీ  ఎంఎన్ఎం  గరిష్టంగా 4 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే వెల్లడించింది. సర్వే ప్రకారం కమల్ హాసన్ పార్టీ తమిళనాడులో ఎలాంటి ప్రభావం చూపడం లేదన్నది స్పష్టమవుతోంది.  కేరళలో మరోసారి కామ్రెడ్లదే విజయమని సర్వే ద్వారా వెల్లడైంది. కేరళలో మొత్తం 140 సీట్లు ఉండగా... ఎల్‌డీఎఫ్ కు 42 శాతం ఓట్లతో  81-89 సీట్లు..యూడీఎఫ్ కు 35 శాతం ఓట్లతో  49- 57స్థానాలు రానున్నాయి. కేరళలో బీజేపీకి గరిష్టంగా రెండు స్థానాలు వస్తాయని ఏబీపీ- సీ ఓటర్ సర్వే తెలిపింది. బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పశ్చిమ బెంగాల్ లోనూ ఆ పార్టీకి షాక్ తప్పదని ఏబీపీ- సీ ఓటర్ సర్వే తేల్చింది. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తృణామూల్ కాంగ్రెస్  పార్టీ 43 శాతం ఓట్లతో 158 స్థానాలు గెలవబోతోంది. బీజేపీ 37.5 శాతం ఓట్లతో 102 స్థానాలు దక్కించుకుంటుందని సర్వేలో వెల్లడైంది. బెంగాల్ లో  కాంగ్రెస్- లెప్ట్ పార్టీల కూటమి 12 శాతం ఓట్లు సాధింది  30 స్థానాలు గెలుచుకోనుంది. బెంగాల్ లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొడతారని సర్వేలో స్పష్టమైనా... బీజేపీకి మాత్రం గతంలో కంటే ఓట్ల శాతం భారీగా పెరిగింది.     

ఏపీ స్థానిక ఎన్నికల వ్యవహారంలో ప్రభుత్వ ఉద్యోగులకు హైకోర్టు షాక్  

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తీవ్ర ఘర్షణ జరుగుతున్న సంగతి తెల్సిందే. వచ్చే ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా హైకోర్టు ఆ షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది. ఇది ఇలా ఉండగా కరోనా టైంలో ఎన్నికలు జరపడానికి వీల్లేదని ఉద్యోగ సంఘాలు తమ నిరసన వ్యక్తం చేసిన సంగతి తెల్సిందే. తాజాగా ఇదే విషయమై.. స్థానిక సంస్థల ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగుల ఫెడరేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఏపీ హైకోర్టు ఈరోజు దానిని కొట్టేసింది. మరో పక్క ఇదే విషయంపై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ పై నిన్న, ఈరోజు విచారణ జరిగింది. దీనిపై తీర్పు ఇంకా రావాల్సి ఉంది.

నిజమైన క్రికెట్ మజా.. ఆసీస్‌పై భారత్ చారిత్రాత్మక విజయం

నిజమైన క్రికెట్ మజా టెస్ట్ క్రికెట్ తోనే వస్తుందని మరోసారి రుజువైంది. ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా సాగిన చివరి టెస్ట్ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టిన టీమిండియా కుర్రాళ్ళు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని నమోదుచేశారు. గబ్బా పిచ్‌లో ఓటమంటే ఎరుగని ఆసీస్ కి భారత్ ఓటమి రుచిని చూపించింది. చివరి టెస్ట్ లో మూడు వికెట్ల తేడాతో విజయ సాధించి 4 టెస్టుల ఈ సిరీస్ ను 2-1 తో సొంతం చేసుకుంది. 328 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు శుభ్‌మన్ గిల్(91) అద్భుత ఆరంభాన్నిచ్చాడు. అతనితో పాటు చటేశ్వర్ పుజారా(56) కూడా రాణించాడు. ఇక వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్(89 నాటౌట్) ఆసీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మ్యాచ్ చివరి వరకు క్రీజులో పాతుకుపోయి భారత్‌కు మరపురాని విజయాన్ని అందించాడు. దీంతో టీమిండియా 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది.

అమరావతిలో  నో ఇన్ సైడర్ ట్రేడింగ్ !  హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి షాక్ 

హైకోర్టులో ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వానికి షాక్ తగిలింది. ఏపీ రాజధాని భూముల్లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందంటూ.. సీఐడీ పెట్టిన కేసులను హైకోర్టు కొట్టివేసింది. కిలారు రాజేష్‌తో పాటు మరికొంత మంది..రాజధానిలో భూములు ముందుగానే కొనుగోలు చేశారని సీఐడీ కేసులు నమోదు చేసింది. రాజధానిలో ఉన్న ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేసింది. భూములు అమ్మినవారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని..ప్రభుత్వం కక్షసాధిస్తోందని పేర్కొంటూ కిలారు రాజేష్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేశారు.   కిలారు రాజేష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి.  పిటిషనర్ తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. భూములు అమ్ముకున్నవారు ఫిర్యాదు చేయకుండా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం.. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరగలేదని పేర్కొంటూ.. దీనికి ఐపీసీ సెక్షన్లకు వర్తించవని హైకోర్టు స్పష్టం చేసింది.

కన్న కొడుకులే కాడెద్దులు! పాలమూరు రైతు కన్నీళ్ల సాగు  

రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని ప్రభుత్వాలు గొప్పగా చెబుతుంటాయి. సాగు సాఫీగా సాగేందుకు కొత్త కార్యక్రమాలు చేపట్టామని పాలకులు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. కాని క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటిదేమి కనిపించదు. ఎప్పటిలానే అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఎన్నో కష్టాలు పడుతూ పంటలు పండిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన  ఓ పేద రైతు కన్నీళ్ల సాగు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో కన్నకొడుకులనే కాడెద్దులుగా చేసుకున్నాడు.  మహబూబ్‌నగర్ జిల్లా  దోరెపల్లి గ్రామంలో శివగారి పెద్ద రాములుది వ్యవసాయ కుటుంబం. ఆయనకు రెండున్నరెకరాల పొలం ఉంది. అరవై ఏండ్ల వయసులో కూడా ఆ రైతు వ్యవసాయం ఆపలేదు. తన ఇద్దరు కొడుకులతో కలిసి సాగు చేస్తున్నాడు. రోజూ పొలానికి వెళ్తూ పనుల్లో కొడుకలకు సాయం చేస్తుంటాడు ఆ వృద్ధ రైతు. అతడికి ఉన్న రెండున్నరెకరాల పొలంలో పదిసార్లు బోర్లు వేస్తే పదకొండోసారి నీళ్లు పడ్డాయి. అన్నిసార్లు బోర్లు వేయడంతో అప్పులు కూడా పెరిగిపోయాయి. దీంతో  ఆ కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయింది. కూలీలను పిలిస్తే ఇచ్చేందుకు డబ్బులు లేక వాళ్లే పనులన్నీ చేసుకునేవారు. సాగు కోసం కాడెద్దులను కూడా కొనలేకపోయాడు. వ్యవసాయానికి కాడెద్దులు వేరే వాళ్ల దగ్గర తెచ్చుకున్నా, అందుకు  ఇచ్చేందుకు డబ్బులు లేవు. అందుకే విధి లేక కొడుకుల్ని కాడెద్దులుగా చేసి గొర్రును లాగిస్తూ కరిగెట చేయిస్తున్నాడా రైతు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాములు  కష్టం చూసిన స్థానికులు సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మిన భూమిని, వ్యవసాయాన్ని వదులుకోలేక సాగు చేస్తున్న రాములుకు ప్రభుత్వమే  సాయం చేయాలనుకుంటున్నారు.  నిరుపేద రైతులకు సర్కారే చేయూత ఇవ్వాలని కోరుతున్నారు.   ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా, ఎన్ని హామీలు ఇచ్చినా అవి కార్యరూపం దాల్చడం లేదనడానికి ఈ  రైతు కష్టాలే నిలువెత్తు సాక్ష్యం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు  ఓ రైతు ట్రాక్టర్ కు కూలీ ఇచ్చే స్థోమత లేక తన కూతుళ్లతో అరక దున్నించిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోను చూసి సినీ నటుడు సోనూ‌సూద్ స్పందించిన వారికి ఆర్థికసాయం చేశాడు. ఈ పాలమూరు రైతుకు కూడా ఎవరో ఒకరు సాయం చేస్తారని ఆశిద్దాం.. 

కోవాగ్జిన్ టీకా వీళ్లకు నిషేదం! భారత్ బయోటెక్ ఫ్యాక్ట్ - షీట్

దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. తొలి విడతలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకా వేస్తున్నారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో సోమవారం వరకు 580 మంది అస్వస్థతకు గురి కాగా..  ఇద్దరు మరణించారు. దీంతో  మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే, తాము తయారు చేసిన కరోనా టీకా కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న భారత్ బయోటెక్ .. టీకా ఎవరు తీసుకోకూడదన్న విషయంపై  కీలక ప్రకటన విడుదల చేసింది.  తాము తయారు చేసిన కోవాగ్జిన్ టీకాకు ఎవరు దూరంగా ఉండాలన్న విషయంపై ఓ ఫ్యాక్ట్ - షీట్ ను భారత్ బయోటెక్ ప్రకటించింది గతంలో అలర్జీలు ఉన్నవారు, రక్త హీనత, గర్భవతులు, బిడ్డలకు పాలిచ్చే తల్లులు, తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు కొవాగ్జిన్ ను తీసుకోవద్దని సలహా ఇచ్చింది భారత్ బయోటెక్. కొవాగ్జిన్ కాకుండా మరో వేరియంట్ ను తీసుకున్న వారు, శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిపై ప్రభావం చూపించే మందులను వాడుతున్న వారు కూడా కోవాగ్జిన్ తీసుకోవద్దని సూచించింది.  జ్వరంతో బాధపడుతున్న వారు కూడా కోవాగ్జిన్ టీకాకు దూరంగా ఉండాలని వెల్లడించింది.  వ్యాక్సిన్ తీసుకునే ముందు తమ మెడికల్ హిస్టరీని గురించి వైద్యులకు, వ్యాక్సిన్ ఆఫీసర్ లకు తప్పనిసరిగా తెలియజేయాలని.. వారి సలహా, సూచనల మేరకు నడచుకోవాలని భారత్ బయోటెక్ కోరింది.    మరోవైపు మూడు రోజుల వ్యవధిలో సుమారు 3.80లక్షల మందికి కరోనా టీకాలు వేసినట్లు  కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో 580 మందిలో దుష్ప్రభావాలు వెలుగు చూశాయని, ఏడుగురిని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. ఇద్దరు మృతిచెందిన అందుకు కరోనా టీకా కారణం కాదని స్పష్టం చేసింది. ఆదివారం సాయంత్రం ఉత్తర్‌ప్రదేశ్ మొరదాబాద్‌‌లో ఓ వ్యక్తి మృతిచెందారు. వ్యాక్సిన్ తీసుకున్న 24 గంటల తర్వాత మహిపాల్ సింగ్ (46) అనే ప్రభుత్వ హాస్పిటల్ వార్డు బాయ్ మృతిచెందారు. ఆయన మృతికి, కరోనా వ్యాక్సిన్‌కు ఎలాంటి సంబంధం లేదని జిల్లా ప్రభుత్వ వైద్యాధికారి తెలిపారు. కార్డియో పల్మనరీ వ్యాధి కారణంగా కార్డోజెనిక్ అరెస్టు  ద్వారా మహిపాల్ మృతిచెందినట్లు పోస్టుమార్టం ద్వారా స్పష్టమైందని చెప్పారు. 43ఏండ్లు కలిగిన మరో వ్యక్తి కర్ణాటక రాష్ట్రం బళ్లారి‌లో మృతిచెందాడు. కార్డియో పల్మనరీ విఫలం కావడంతో మృతిచెందినట్లు ప్రభుత్వం తెలిపింది. 

సవాళ్లు ప్రతి సవాళ్లతో గొల్లపూడిలో హైటెన్షన్.. దేవినేని ఉమా అరెస్ట్  

విజయవాడ నగరంలోని గొల్లపూడి ప్రాంతంలో తీవ్ర‌ ఉద్రిక్త పరిస్థితి నెల‌కొంది. రాష్ట్ర మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమల మధ్య సవాళ్లు‌, ప్రతి సవాళ్ల‌తో ఒక్క‌సారిగా అక్కడ ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెలకొంది. దేవినేని ఉమ‌పై విమ‌ర్శ‌లు చేసే సమయంలో ఒక్కసారిగా స‌హ‌నం కోల్పోయిన కొడాలి నాని మాట జారారు. దేవినేని ఉమ‌ను ఏకంగా ఇంటికి వ‌చ్చి తంతా అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మంత్రి వ్యాఖ్య‌ల‌పై దేవినేని ఉమ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ.. ఆ వ్యాఖ్యలకు నిర‌స‌న‌గా ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద దీక్షకు సిద్ధ‌మ‌య్యారు. మంత్రి కొడాలి నానికి ద‌మ్ముంటే త‌న‌ను ట‌చ్ చేసి చూడాలంటూ అయన స‌వాల్ విసిరారు.   దీంతో ఈరోజు ఉదయం గొల్లపూడిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద నిర‌న‌స‌న‌కు సిద్ద‌మైన దేవినేని ఉమను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు, టీడీపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తోపులాట జ‌రిగి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గొల్ల‌పూడిలో ఎటువంటి రాజ‌కీయ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి లేద‌న్న పోలీసులు.. దేవినేని ఉమ‌ను బ‌ల‌వంతం‌గా అరెస్టు చేసి.. పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. మ‌రోపక్క దేవినేని ఉమ నిర‌స‌న‌కు సంఘీభావంగా బ‌య‌ల్దేరిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

తిరుపతిలో జనసేన ఒంటరి పోరు? బీజేపీ నేతల తీరుపై పవన్ గుర్రు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ ప్రస్తుతం తిరుపతి లోక్ సభ చుట్టే తిరుగుతున్నాయి. వైసీపీ ఎంపీ అకాల మరణంలో ఖాళీ అయిన ఎంపీ సీటుకు త్వరలోనే ఎన్నిక జరగనుంది.  నోటిఫికేష‌న్ ఏ క్ష‌ణ‌మైన విడుద‌లయ్యే అవకాశం ఉండటంతో పార్టీలన్ని ఉప ఎన్నిక వ్యూహరచనలో ఉన్నాయి. తిరుపతి ఎన్నికను సవాల్ గా తీసుకుంటున్న ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ప్రచారం కూడే చేసేస్తోంది. గత ఎన్నికల్లో 2 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచిన అధికార వైసీపీ ఇంకా క్యాండిడేట్ ను ఖరారు చేయలేదు. ఇక ఏపీలో బలపడేందుకు పావులు కదుపుతున్న బీజేపీ.. జనసేనతో కలిసి తిరుపతిలో సత్తా చాటాలని చూస్తోంది. అయితే తిరుపతిలో పోటీ అంశంలో మాత్రం ఆ రెండు పార్టీల మధ్య క్లారిటీ రావడం లేదు. ఎవరూ బరిలో ఉండాలన్న దానిపై స్పష్టత లేకపోవడంతో ఆ రెండు పార్టీల నేతలతో పాటు కేడర్ లోనూ గందరగోళం నెలకొంది. ఇరు పార్టీల నేతలు ఇస్తున్న భిన్న ప్రకటనలతో.. తిరుపతి ఉప ఎన్నికలో  ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా లేక ఎవరికి వారే పోటీ చేస్తారా అన్న  అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.    తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో  జనసేన నుంచి అభ్యర్థిని బరిలో దింపాలని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ మొదటి నుంచి భావిస్తున్నారు. తిరుపతి లోక్ సభ పరిధిలో బీజేపీ కంటే జనసేననే బలంగా ఉందని ఆ పార్టీ లెక్కలు చెబుతోంది. జ‌న‌సేన అభ్య‌ర్ధినే ఉమ్మ‌డి అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించాల‌ని ఢిల్లీ వెళ్లి మ‌రి  బీజేపీ పెద్ద‌లకు విజ్ఞ‌ప్తి చేసుకున్నారు ప‌వ‌న్ . తిరుపతిలో తమకు  అవకాశం ఇవ్వాలనే షరతుతోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీకి జనసేన మద్దతు ఇచ్చిందనే ప్రచారం కూడా జరిగింది.  అయితే తాజాగా కొంత‌మంది ఏపీ బిజేపీ నాయకులు చేస్తోన్న కామెంట్స్ తో తిరుపతి అభ్యర్థిపై క్లారిటీ రావడం లేదు. బీజేపీనే తిరుపతిలో పోటీ చేస్తుందన్న సోము వీర్రాజు వ్యాఖ్యలపై  ప‌వ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తోన్న‌ట్లు తెలుస్తోంది.  ఇప్పటికి బ‌రిలో ఉండ‌బోయే అభ్య‌ర్ధికి సంబంధించి ఒక స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డం పై ఆ పార్టీ నేత‌లు కూడా గుర్రుగా ఉన్న‌ట్లు చెబుతున్నారు.  తిరుపతి పోటీ విషయంలో బీజేపీ నాన్చుడు దోరణిపై జనసేన చీఫ్ అసహనంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ తీరుతో తిరుపతిలో  పోటీపై అయోమయం కనిపిస్తుండటంతో గబ్బర్ సింగ్ కూడా ఒక విధ‌మైన క‌న్ఫ్యూజన్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. స్వ‌యంగా వెళ్లి కోరిన‌ప్ప‌టికి ఇప్ప‌టి వ‌ర‌కు అభ్య‌ర్ధికి సంబంధించి ఒక స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డ‌మేంట‌ని బీజేపీ హైకమాండ్ పైనా ప‌వ‌న్ ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్నారు. తిరుపతి  అభ్య‌ర్దిని ఎన్నుకోవ‌డానికి గ‌తంలో రెండు పార్టీల సభ్యులతో ఒక క‌మిటిని వేశారు. అయితే ఈ క‌మిటి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారిగా స‌మావేశం కాలేదు.  బీజేపీ చివరి వరకు నాన్చేందుకే ఇలా చేస్తుందన్న అనుమానాలను కొందరు జనసేన నేతలు వ్యక్తం చేస్తున్నారు.  అందుకే చివ‌రి వ‌ర‌కు నాన్చి బీజేపీ హ్యాండిస్తే.. ఏం చేయాల‌న్నదానిపై జ‌న‌సేన శ్రేణులు క‌స‌రత్తు చేస్తోన్నాయని తెలుస్తోంది. తిరుపతిలో బీజేపీ కంటే తామే బలంగా ఉన్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ తామే పోటీ చేస్తామని తేల్చి చెబుతోంది జనసేన. బీజేపీ తమకు సహకరించకపోతే  ఈనెల 21న తిరుపతిలో నిర్వహించనున్న సమావేశంలో పవన్ కల్యాణ్ సీరియస్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.  మరోవైపు బీజేపీ విషయంలో జనసేన నేతల్లో మరో చర్చ కూడా జరుగుతోంది. ఏపీ బీజేపీ నేతలు కాపు సామాజిక వర్గంపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు ఉన్నారు. తటస్ట కాపు నేతలతో పాటు వివిధ పార్టీల్లో ఉన్న ఆ సామాజిక వర్గ నేతలను బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగానే కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆయన పార్టీలో చేరితే కాపు వర్గం మద్దతు ఎక్కువగా తమకే ఉంటుందని బీజేపీ నమ్ముతోంది. అందులో భాగంగానే సోము వీర్రాజు స్వయంగా ముద్రగడ నివాసానికి వెళ్లి మరీ ఆయనను బీజేపీలోకి ఆహ్వానించారని... రాజ్యసభ సభ్యత్వంతో పాటు పార్టీలో కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ముద్రగడతో పాటు మరికొందరు కాపు నేతలను కూడా పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.  అయితే కాపు సామాజిక వర్గానికి దగ్గరవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం జనసేనకు భారీ నష్టాన్ని కలిగిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గమే ఎక్కువగా జనసేనకు మద్దతుగా ఉంటోంది. ఇప్పుడు బీజేపీ రాజకీయ వ్యూహాలతో .. ఆ పార్టీ తమ ఓటు బ్యాంక్ కే గండి కొడుతుందనే ఆందోళన జనసేన నేతల్లో కనిపిస్తోంది. మొత్తంగా తిరుపతి ఉప ఎన్నికతో పాటు ఏపీ బీజేపీ రాజకీయ నిర్ణయాలతో తమకు మంచి కంటే చెడే జరుగుతుందన్న అభిప్రాయమే మెజార్టీ జనసేన నాయకుల్లో ఉందని తెలుస్తోంది. ఇది బీజేపీ, జనసేన పొత్తుపైనా ప్రభావం చూపే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది.  

కొత్త అల్లుడికి 125 రకాల రుచులతో సంక్రాంతి భోజనం.. ఎక్కడో తెలుసా.. 

ఎంతైనా గోదావరి జిల్లాల వారి మర్యాదలే వేరు అంటారు మన పెద్దలు. సాధారణ రోజుల్లోనే ఇంటికి వచ్చిన అతిథులకు కడుపు నిండుగా రకరకాల వంటలు వడ్డించి మెప్పిస్తారని పేరుంది. అదే సంక్రాంతి లాంటి పెద్ద పండుగకు కొత్తగా వచ్చిన ఇంటల్లుడు ఐతే ఇక చెప్పేదేముంది. రకరకాల పిండివంటలు, నాన్ వెజ్ ప్రియులైతే మసాలా ఘుమఘుమలతో కూడిన ఐదారు రకాల వంటకాలతో ఆ మర్యాదే వేరుగా ఉంటుంది. తాజాగా సంక్రాంతి పండుగకు వచ్చిన ఆ ఇంటి కొత్త అల్లుడికి భీమవరానికి చెందిన ఒక కుటుంబం ఏకంగా 125 రకాల రుచులను వడ్డించిన విషయం తాజాగా వైరల్ అవుతోంది. భీమవరం పట్టణానికి చెందిన కురిశేటి కాశీవిశ్వనాధం కుటుంబం కొత్త అల్లుడికి స్వీట్లు, పిండివంటలు, ఐస్ క్రీమ్ అన్ని కలిపి 125 రకాల రుచులను అరటి ఆకు పరిచి దానిలో వెండి పళ్లెం లో వడ్డించారు. దీంతో ఉంగుటూరుకు చెందిన ఆ అల్లుడు నారాయణ అఖిల్ ముందు ఆశ్చర్యపోయినా తరువాత మెల్లగా తేరుకుని ఆరగించేసారు.