కడప జిల్లాలో సర్పంచ్ పదవి కోసం ఎన్నారై బంపర్ ఆఫర్..
posted on Jan 30, 2021 @ 9:55AM
ఏపీలో సుప్రీం కోర్టు తీర్పుతో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైన సంగతి తెల్సిందే. ఈ ఎన్నికలను నిస్పక్షపాతముగా జరపడానికి ఎస్ఈసి నిమ్మగడ్డ అన్ని ప్రయత్నాలు చేస్తుండగా.. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవాలకు భారీ నజరానా ప్రకటించి.. ఆ ముసుగులో తాను బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునే పనిలో పడింది. ఇది ఇలా ఉండగా కడప జిల్లాలో సర్పంచ్ పదవి ఏకంగా అరకోటి ధర పలికింది. ఇక్కడ మండల కేంద్రమైన పుల్లంపేట పంచాయతీ సర్పంచి పదవిని పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఇస్తే గ్రామాభివృద్ధి కోసం రూ.50 లక్షలు ఇస్తానని ఓ ఎన్నారై బంపర్ ఆఫర్ ఇచ్చారు. అంతేకాకుండా గ్రామం మొత్తానికి విందు కూడా ఇస్తానని అయన ప్రకటించారు. ప్రస్తుతం అక్కడ ఈ ఆఫర్ మీద హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. పుల్లంపేట గ్రామానికి చెందిన 37 ఏళ్ల యువకుడు ఒకరు కువైత్ వెళ్లి బాగానే సంపాదించి ఈమధ్యనే స్వగ్రామానికి వచ్చారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఈ పంచాయతీకి రెండో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. 3,006 మంది ఓటర్లున్న పుల్లంపేటకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ప్రతి ఏటా రూ.19లక్షలు, పన్నుల రూపంలో.. రూ.7లక్షలు కలిపి మొత్తం రూ.26 లక్షలు ఆదాయం వస్తోంది. అయితే తాజాగా జరుగుతన్న ఎన్నికల్లో సర్పంచ్ స్థానాన్ని అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించారు. దీంతో వైసీపీ, టీడీపీ మద్దతుతో పోటీ చేయడానికి పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సర్పంచి పదవికి ఏకగ్రీవం కోసం ఎన్నారై భారీ ఆఫర్ ఇవ్వడంతో స్థానికంగా తీవ్ర చర్చ నడుస్తోంది.