హైదరాబాద్ లో ఓటేసిన వైసీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెలంగాణలో ఓటేశారు. హైదరాబాద్ లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏపీ ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఓటేయడం ఏంటని షాకవుతున్నారా.. కాని ఇది నిజం కర్నూల్ జిల్లా శ్రీశైలం వైసీపీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి హైదరాబాద్ లో ఓటేశారు. అయితే ఓటు వేసింది ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో కాదు.. హైదరాబాద్‌లో జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో.
వైసీపీ ఎమ్మెల్యేతో పాటు పలువురు ఏపీ టీడీపీ, బీజేపీ నేతలు హైదరాబాద్‌లో ఓటు వేశారు. ఏపీకి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఓటు వేశారు. కేంద్ర మాజీమంత్రి పళ్లంరాజు, టీడీపీ నేత కంభంపాటి రామ్మోహనరావు, జేసీ పవన్ రెడ్డి, ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. ఇక తెలంగాణకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ వాణీదేవి కూడా ఓటు వేశారు. టాలీవుడ్ నుంచి సినీ హీరోలు వెంకటేష్, శ్రీకాంత్, త్రివిక్రమ్, నిర్మాత దిల్ రాజు, కేఎస్ రామారావు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ ఎన్నికలను తలపించేలా హోరాహోరీగా ఎన్నికల్లో తలపడ్డారు అభ్యర్థులు. జూబ్లిహిల్స్ హౌసింగ్ సొసైటీలో మొత్తం 3,181 ఓట్లు ఉండగా.. 1,750 మంది మాత్రమే ఓటు వేశారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో 1,195 ఎకరాల్లో సొసైటీ విస్తరించి ఉంది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీకి ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో ఒకరు, మహిళా కేటగిరిలో ఇద్దరు, జనరల్ కేటగిరిలో 12 మంది సభ్యులు ఉంటారు. 2015లో ఎన్నికైన సభ్యుల పదవీకాలం గత ఏడాది ముగిసింది. 020లో సెప్టెంబర్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, సభ్యుల పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగించారు. ప్రస్తుతం గడువు ముగియడంతో 2021 మార్చి 3న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు.