25 ఏళ్ళ యువతి.. పిల్లవాడిని టెర్రస్ పై..
posted on Mar 22, 2021 @ 1:00PM
కాలం సైన్స్, టెక్నాలజీ అంటూ ముందుకు వెళ్తుంటే. కాలంతో ఆలోచించాల్సిన మనిషి ఆలోచన మాత్రం ఇంకా మంత్రాలు విష్వవాసాల దగ్గరే ఉన్నాయి. ఇంకా అనాగరిక సమాజంలోనే బతుకుతున్నారు. ఇంకా పాత చింకాకాయ పచ్చడి అనే నాటి మూఢనమ్మకాలనే ఇప్పటికి నమ్ముతూ మూర్ఖంగా బతుకుతున్నారు. ఈ మధ్య కాలంలో చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ ఉన్నత విద్య వంతుల కుటుంబం మూఢనమ్మకాల బారిన పడి తమ కుటుంబాన్నిసర్వనాశనం చేసుకున్న విషయం తెలిసిందే. విద్యాబుద్ధులు చెప్పే తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి తమ కుమార్తెలను మూఢ నమ్మకాల పేరుతో కడతేర్చారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. ఆ సంఘటన మరుగున పడకముందే తాజాగా మరో మూఢ సంఘటన వెలుగులోకి వచ్చింది. తనకు పిల్లలు పుట్టడం లేదంటూ ఓ మహిళా ఓ బాబాను ఆశ్రయించింది. వైద్యులను కలిసి ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిన ఆమె, మూఢనమ్మకాల వలలో చిక్కుకుపోయి. దారుణానికి పాల్పడి చివరకు చెరసాల పాలయింది.
ఆమెకు సంతానం కాలేదు. అందుకు పక్కింటి పసివాడి ప్రాణాలు తీసింది. ఆమెకు 25 ఏళ్ళు. 2013వ సంవత్సరంలో పెళ్లయింది. పెళ్లయి ఎనిమిదేళ్లవుతున్నా ఆమె అమ్మ అనే పిలుపుకు నోచుకోలేదు. ఈ విషయం పై అతింట్లో తీవ్ర ఒత్తిడిని ఆమె ఎదురుకుంది. ఏంచేయాలనే ఆలోచనే ఆమెను తరిమింది. దాంతో ఏం చేయాలో ఆమెకు తోచలేదు. తెలిసిన వాళ్ల సలహాతో నాలుగేళ్ల క్రితం అదే నగరంలోని ఓ తాంత్రికుడిని కలిసింది. తన సంతానం సమస్య గురించి వివరించి మొరపెట్టుకుంది. తనకు త్వరగా సంతాన భాగ్యం కలిగేలా చూడామణి మాంత్రికుడిని కోరింది. దీనికి అతడు బాగా ఆలోచించి అందుకు ఒకే ఒక్క మార్గం ఉందని హితబు పలికాడు. ఎవరైనా చిన్న పిల్లాడిని బలి ఇచ్చి అమ్మవారికి రక్త తర్పణం చేస్తే త్వరగా సంతానం కలుగుతుందని. తనకు ఉన్న శని తొలగిపోవడానికి ఇదొక్కటే మార్గం. అంటూ మాయమాటలు చెప్పాడు.
అంతే ఈ విషయం పై మొదట్లో ఆమె భయపడింది. పిల్లలు లేకున్నా పర్లేదులే, పసి ప్రాణాన్ని తీయడం ఎందుకని అనుకుంది. కానీ, ఇటీవల సంతానం గురించి అత్తారింట్లోనూ, అటు ఇరుగు పొరుగు వారితో వస్తున్న ఒత్తిళ్లను ఆమె భరించలేకపోయింది. ఇక అంటే మాంత్రికుడు చెప్పిన పథకానికి సిద్ధం అయింది. తన పక్కింట్లోనే ఉండే మూడేళ్ల పిల్లాడిని ఎవరూ చూడకుండా ఇంటి పైకి తీసుకెళ్లింది. అక్కడే ఆ పిల్ల వాడిని చంపేసి. ఆ తర్వాత శవాన్ని ఓ బ్యాగులో పెట్టి మూట కట్టింది. రాత్రి అందరూ పడుకున్న తర్వాత పిల్లవాడి శవాన్ని మాయం చేయాలని భావించింది. కానీ ఈ లోపే ఆ బాలుడి తల్లిదండ్రులు అప్రమత్తమయ్యారు. తమ కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి చుట్టుపక్కల వెతకడం మొదలు పెట్టారు. పక్కింటి టెర్రస్ పై ఓ బ్యాగు ఉండటంతో అనుమానంతో ఆ బ్యాగును ఓపెన్ చేస్తే అసలు విషయం బయట పడింది. పోలీసుల ఎంట్రీతో ఆమె గుట్టు రట్టయింది. ఆమెతోపాటు, ఆ తాంత్రికుడిని కూడా పోలీసులు కటకటాల్లోకి నెట్టేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని హర్దోయ్ నగరంలో జరిగింది.