కార్పొరేటర్ అనుమానాస్పద మృతి! విశాఖ వైసీపీలో కలకలం
posted on Mar 22, 2021 @ 10:35AM
విశాఖపట్టణం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న అధికార వైసీపీలో విషాదం నెలకొంది. ఆ పార్టీ కార్పొరేటర్ సూర్యకుమారి ఆదివారం రాత్రి అనుమాస్పద స్థితిలో చనిపోయారు. తీవ్ర గాయాలతో ఆమె చనిపోయినట్లు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తులు కార్పొరేటర్ పై దాడిచేశారని ప్రాథమిక సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 61వ వార్డు నుంచి సూర్యకుమారి విజయం సాధించారు. కుటుంబ సభ్యులతో కలిసి పారిశ్రామిక వాడలో ఆమె నివసిస్తున్నారు. ఈ క్రమంలో సూర్యకుమారి ఆకస్మిక మృతి చెందడం.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
సూర్యకుమారి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్య కుమారి మృతిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా హత్య చేశారా? లేక అనారోగ్యంతో చనిపోయారా? ఆకస్మిక మృతికి కారణమేంటి? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఎన్నికల్లో గెలిచి వారం కాకముందే సూర్యకుమారి మరణించడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నాయి. వైసీపీ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి.