టీఎస్ ఉద్యోగులకు 34 శాతం పీఆర్సీ!
posted on Mar 21, 2021 @ 7:22PM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని గంటల్లోనే తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందబోతోంది.ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటన రాబోతోంది. పీఆర్సీ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఉపఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో.. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. దీంతో పీఆర్సీ ప్రకటనపై రాష్ట్ర ఆర్థికశాఖ ఎన్నికల సంఘం అనుమతి కోరింది. దీనిపై స్పందించిన ఈసీ.. పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి ఇబ్బందీ లేదని తెలిపింది.అయితే పీఆర్సీపై అనవసర ప్రచారం చేయరాదని ఈసీ సూచించింది. ఎలాంటి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అవినాష్ కుమార్ ఆదివారం లేఖ రాశారు.
ఈసీ నుంచి లైన్ క్లియర్ కావడంతో.. ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన సవరణ ప్రకటించేందుకు మార్గం సుగమమైంది. ప్రగతి భవన్ వర్గాల సమాచారం ప్రకారం సోమవారం సీఎం కేసీఆర్ స్వయంగా ఉద్యోగులకు పీఆర్సీ చేయనున్నట్లు సమాచారం. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన ఆనందంలో సీఎం కేసీఆర్ ఉద్యోగులపై వరాలు కురిపిస్తారన్న ప్రచారం సాగుతోంది. ఆదివారం కూడా పీఆర్టీయూ నేతలు కేసీఆర్ తో సమావేశమయ్యారు. మరికొందరు ఉద్యోగ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఏపీలో అమలవుతున్న మధ్యంతర భృతి కన్నా కనీసం రెండు శాతం ఎక్కువే ఫిట్మెంట్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. గత జూలైలో జగన్ సర్కార్... అక్కడి ఉద్యోగులకు 27 శాతం పీఆర్సీ ఇచ్చింది. దీంతో తెలంగాణ ఉద్యోగులకు 34 శాతం ఫిట్ మెంట్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఉద్యోగుల వయోపరిమితి పెంపు అంశంపై సైతం సీఎం హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పీఆర్సీపై అధికారిక ప్రకటన కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరోవైపు ఇటీవల ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆర్థిక శాఖకు చేసిన కేటాయింపుల్లో రూ. 8 వేల కోట్లను ప్రత్యేకంగా చూపారు. అయితే ఈ నిధులను పీఆర్సీ కోసమే ప్రత్యేకంగా చూపారన్న చర్చ జోరుగా సాగుతోంది.