అంబానీ కేసులో గంటకో ట్విస్ట్! ముంబైలో అసలేం జరుగుతోంది?
posted on Mar 21, 2021 @ 8:34PM
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద ఆయుధాలతో నిండిన వాహనం కేసు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముంబై క్రైమ్ ఇంటెలిజెన్స్ హెడ్ వాజీ అరెస్ట్ తో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. తాజాగా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ రాసిన లేఖ కలకలం రేపుతోంది. అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై క్షుణ్ణంగా దర్యాప్తు జరపాలని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వివరించాలని కోరారు కేంద్రమంత్రి.
పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలు తీవ్రమైనవేనని, వీటిపై దర్యాప్తుకు ఆదేశించే విషయంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు సంపూర్ణ అధికారం ఉందని చెప్పారు. ఈ విషయంలో మాజీ ఐపీఎస్ అధికారి జూలియో రిబీరో సహకారం తీసుకోవాలన్నారు శరద్ పవార్. అంబానీ నివాసం వద్ద కారు బాంబు కేసు దర్యాప్తులో క్షమించరాని పొరపాట్లు చేసిన పరంబీర్ సింగ్‌ను ముంబై నగర పోలీసు కమిషనర్ పదవి నుంచి తప్పించడంతో, ఆయన ఇటువంటి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారన్నారు. అరెస్టయిన ముంబై పోలీసు అధికారి సచిన్ వాజేను పునరుద్ధరించాలని గత ఏడాది నిర్ణయించినవారిలో పరంబీర్ సింగ్ ఒకరని చెప్పారు పవార్.
అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెంటనే రాజీనామా చేయాలని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు.హోం మంత్రి పదవిలో అనిల్ దేశ్‌ముఖ్ కొనసాగుతున్నంత కాలం ఈ ఆరోపణలపై విచారణ జరగరాదని చెప్పారు. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్‌పైనా దేవేంద్ర ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనిల్ దేశ్‌ముఖ్‌ను కాపాడేందుకు శరద్ పవార్ ప్రయత్నిస్తున్నారన్నారు. సత్యాన్ని శరద్ పవార్ మరుగుపరుస్తున్నారని దుయ్యబట్టారు. పోలీసుల బదిలీల్లో అవినీతికి సంబంధించి ఓ నివేదికను ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు మహారాష్ట్ర డీజీ సుబోధ్ జైశ్వాల్ ఇటీవల సమర్పించారని దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ఈ నివేదికపై ముఖ్యమంత్రి ఎటువంటి చర్య తీసుకోలేదని, దీంతో డీజీ జైశ్వాల్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చిందని చెప్పారు.
ముంబై నగర మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ శనివారం మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్ధవ్ థాకరేకు రాసిన ఈ-మెయిల్ లేఖలో అనిల్ దేశ్‌ముఖ్ అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నెలకు రూ.100 కోట్లు వసూలు చేసి తనకు ఇవ్వాలని సస్పెండయిన ఏపీఐ సచిన్ వాజేను అనిల్ డిమాండ్ చేశారని తెలిపారు. అయితే పరమ్ బీర్ సింగ్ ఆరోపణలను అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు. పరమ్‌బీర్ సింగ్‌ను ముంబై నగర పోలీసు కమిషనర్ పదవి నుంచి బదిలీ చేయడం గురించి ప్రస్తావించారు. సచిన్ వాజేపై దర్యాప్తులో ఆటంకాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే పరమ్‌బీర్ సింగ్‌ను బదిలీ చేసినట్లు తెలిపారు.