భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు.. మళ్ళీ హడలెత్తిస్తున్న కరోనా..
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఉధృతమవుతోంది. రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు మళ్ళీ హడలెత్తిస్తున్నాయి. గత నెల ఫిబ్రవరి వరకు తగ్గుతున్నట్లుగా కనిపించిన ఈ రోజువారీ పాజిటివ్ కేసులు మరోసారి ఇటు ప్రజలను అటు ప్రభుత్వాలను కూడా భయపెడుతున్నాయి.. దేశంలో వరుసగా తొమ్మిదో రోజు కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగింది.
గడచిన 24 గంటలలో కొత్తగా 40,953 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,15,55,284కి చేరింది. మరోపక్క నిన్న కరోనా కారణంగా 188 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,59,558 కు చేరింది.. ఇది ఇలా ఉండగా నిన్న 23,653 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,11,07,332కి చేరింది. రికవరీ రేటు 96.1 శాతంగా ఉంది. ఇక మన దేశంలో ప్రస్తుతం 2,88,394 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
ఇది ఇలాఉండగా దేశంలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో నిన్న 25.7వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఈ నెలాఖరు వరకు విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోపక్క మహారాష్ట్రలో వైరస్ ఉధృతి రీత్యా బస్సు సర్వీసుల రాకపోకలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిలిపివేసింది. ఇక నిన్న పంజాబ్‌లో 2.5వేలు, కేరళలో 1.98వేలు, కర్ణాటకలో 1.59 వేలు, గుజరాత్‌లో 1.4వేలు, మధ్యప్రదేశ్‌లో 1.14వేలు, చత్తీస్‌గఢ్‌లో 1.1వేలు, తమిళనాడులో 1.1వేల పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరోపక్క బెంగళూరు నగరంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గురువారం కర్ణాటకలో 1,590 కేసులు నమోదైతే, అందులో వెయ్యి కేసులు బెంగళూరువే ఉన్నాయి. ఇది ఇలా ఉండగా మనదేశంలో గత నవంబర్ 29 తర్వాత అంటే... 111 రోజుల తర్వాత మళ్లీ అత్యధిక కేసులు రికార్డ్ అయ్యాయి.
ఇక తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 66,036 మందికి టెస్టులు చెయ్యగా 364 పాజిటివ్ కేసులు తేలాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,02,724కి చేరింది. కొత్తగా కరోనాతో ఇద్దరు మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 1,666కి చేరంది. మరణాల రేటు 0.55 శాతం ఉంది. తాజాగా 189 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీ కేసుల సంఖ్య 2,98,451కి చేరింది. ప్రస్తుతం 2,607 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వాటిలో 980 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో మొన్న 47 పాజిటివ్ కేసులు రాగా... నిన్న కొత్తగా 75 కేసులొచ్చాయి.