టీఆర్ఎస్ ఎమ్మెల్సీకి కరోనా! శాసనమండలిలో టెన్షన్
posted on Mar 22, 2021 @ 12:35PM
బడ్జెట్ సమావేశాల వేళ తెలంగాణ శాసన మండలిలో కరోనా కలకలం రేపింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కు పాజిటివ్‌గా తేలింది. సోమవారం శాసనసభ ఆవరణలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పురాణం సతీష్ కు రాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ రాగా.. ఆర్టీపీసీఆర్ టెస్టులో మాత్రం పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు ఎమ్మెల్సీ సతీష్. గత ఐదు రోజులుగా తనతో కాంటాక్టులో ఉన్న వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.
కరోనా సోకిన ఎమ్మెల్సీ పురాణం సతీష్.. శనివారం మండలికి హాజరయ్యారు. బడ్జెట్‌పై మాట్లాడారు. దీంతో సహచర ఎమ్మెల్సీలలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో శాసనమండలి సభ్యులందరూ కరోనా పరీక్షలు నిర్వహించుకోనున్నట్టు సమాచారం. మరోవైపు కోవిడ్ కారణంగా అసెంబ్లీ సమావేశాలను కుదించనున్నారని తెలుస్తోంది. సభ్యుడికి కోరనా సోకడంతో షెడ్యూల్‌కు ముందే ముగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మంగళవారం లేదా బుధవారం బడ్జెట్ సెషన్స్ క్లోజ్ చేయనున్నారని తెలుస్తోంది. బీఏసీ సమావేశం పెట్టి సెషన్స్‌పై నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించనుంది. షెడ్యూల్ ప్రకారం 26వరకు సమావేశాలు నిర్వహించాల్సి ఉంది.