ఊరించి.. విసిగించి.. కడుపు మండించి.. పీఆర్సీ పాలిటిక్స్!
posted on Mar 22, 2021 @ 2:03PM
ఉద్యోగులకు 30శాతం పీఆర్సీ. సీఎం కేసీఆర్ ప్రకటనపై ఉద్యోగులు హర్షం. ఇది రొటీన్. పైకి కనిపిస్తున్నది ఇదే. కానీ, వాస్తవంలో ఏ ఒక్క ఉద్యోగి కూడా ఈ పీఆర్సీని మనస్పూర్తిగా ఆనందించ లేకపోతున్నాడు. హమ్మయ్య ఇప్పటికైనా ఎంతో కొంత పీఆర్సీ వచ్చిందంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు అంతే. డౌట్ ఉంటే.. మీ పక్కనున్న ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగినైనా కదిపి చూడండి. మీకే తెలుస్తుంది వారి మనోగతం. పీఆర్సీ ప్రకటించినా ఉద్యోగులు ఇంత డల్‌గా ఉండటానికి అనేక రీజన్స్.
ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ డిమాండ్ ఇప్పటిది కాదు. రెండేళ్లుగా నాన్చుతూ వచ్చిన వేతన పెంపు ఇప్పటికిలా కొలిక్కివచ్చింది. గత టర్మ్ తుది దశలోనే.. త్వరలో పీఆర్సీ అంటూ ఉద్యోగులను ఊరించారు కేసీఆర్. ఆ తర్వాత సడెన్‌గా అసెంబ్లీ రద్దు చేయడం.. పీఆర్సీ ప్రకటించకుండానే.. ఎన్నికలకు వెళ్లడంతో అప్పటి నుంచి కేసీఆర్‌పై గుర్రుగా ఉన్నారు ఉద్యోగులు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది.. ఎన్నికల ఫలితాలు తారుమారు అవుతాయనే విధంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం జరిగింది. అయితే, అసెంబ్లీ ఎలక్షన్‌లో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలవడంతో.. అప్పటి నుంచి ఉద్యోగులు పీఆర్సీపై నోరు మెదపలేని పరిస్థితి.
కాలం గిర్రున తిరిగి.. దుబ్బాక, జీహెచ్ఎమ్సీ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి షాక్ తగలడంతో కేసీఆర్ డిఫెన్స్‌లో పడ్డారు. ప్రజా వ్యతిరేకతతో పాటు ఉద్యోగుల కడుపు మంటను ఆలస్యంగానైనా గుర్తించారు. అంతకు ముందు.. పీఆర్సీ కమిటీ సిఫార్సు విషయంలో పెద్ద పొలిటికల్ డ్రామానే నడిపారు ముఖ్యమంత్రి. తాజా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మొదట్లో టీఆర్ఎస్‌కు వ్యతిరేక పవనాలే వీచాయి. రెండు సీట్లలోనూ ఓడిపోతామనేంతగా గులాబీ బాస్‌లో భయం పుట్టింది అంటారు. అందుకే, ప్రభుత్వ ఉద్యోగులను పీఆర్సీ పేరుతో విభజించి, కన్ఫ్యూజ్ చేసి.. సీఎం కేసీఆర్ ఓట్లు దండుకునే స్ట్రాటజీ అప్లై చేశారని అంటారు.
అధికార పార్టీకి చెందిన మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులు వేరు, ఉపాధ్యాయులు వేరు అంటూ వరుస కథనాలు ప్రచురించి, ప్రచారం చేసి టీచర్లను డిఫెన్స్‌లో పడేశారు. ఆ కన్ఫ్యూజన్ కొనసాగుతుండగానే 7 శాతం పీఆర్సీ కమిటీ రిపోర్డు ఇవ్వడం మరింత కలకలం రేపింది. కావాలనే, అతి తక్కువగా 7శాతం మంటూ ఉద్యోగులను భయాందోళనలకు గురి చేశారని చెబుతారు. అంతలోనే ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ దగ్గర పడటంతో మరో రకమైన బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కూడా నడిచాయి. అవంతా ఆఫ్ ది రికార్డ్. ఎన్నికల ముందు ఉద్యోగ సంఘాల నేతలను సీఎం కేసీఆర్ పిలిపించుకున్నారట. ఎమ్మెల్సీ ఎలక్షన్‌లో గనుక టీఆర్ఎస్ ఓడిపోతే.. పీఆర్సీ మరింత లేట్ చేస్తామని.. అది కూడా 7శాతం మాత్రమే ఇస్తామని.. ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమను గెలిపిస్తే.. ఉద్యోగులకు సంతృప్తికర స్థాయిలో ఫిట్మెంట్ ప్రకటిస్తామని డీల్ కుదుర్చుకున్నారట. ఈ విషయం అప్పట్లో ఉద్యోగ సంఘాల వాట్సప్ గ్రూపుల్లో తెగ వైరల్ అయిందని చెబుతున్నారు. ఉద్యోగులంతా అధికార పార్టీకే ఓటు వేసేలా సంఘం నేతలు ఒత్తిడి తెచ్చారని అంటారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు టీఆర్ఎస్‌కి ఓటు వేశారో లేదో తెలీదు కానీ, ఎలా గోలా అతికష్టం మీద రెండు ఎమ్మెల్సీ స్థానాలను అధికార పార్టీ గెలుచుకోవడంతో కేసీఆర్ ఫుల్ ఖుషీగా ఉన్నారట. అందుకే, ఫలితాలు వచ్చిన వెంటనే ఉద్యోగులకు 30శాతం ఫిట్మెంట్ ప్రకటించి.. రిటైర్‌మెంట్ వయసు పెంచి.. ఉద్యోగులను సంతృప్తిపరిచే ప్రయత్నం చేశారు. ముందుముందు నాగార్జున సాగర్ బై పోల్‌తో పాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్స్ సైతం ఉండటంతో ఉద్యోగులతో పెట్టుకుంటే.. మరీ తెగేదాక లాగితే.. అసలుకే ఎసరు వస్తుందని భావించిన కేసీఆర్.. పీఆర్సీ ప్రకటనతో నష్ట నివారణ చర్యలు చేపట్టారనేది ఉద్యోగుల భావన. అయితే.. ఎంప్లాయిస్ 45శాతానికి పైగా పీఆర్సీ డిమాండ్ చేస్తే.. కమిటీ 7శాతం సిఫార్సు చేస్తే.. మధ్యస్థంగా 30శాతంతో సరిపెట్టారు సీఎం కేసీఆర్. అందుకే, పెరిగిన పీఆర్సీపైనా ఉద్యోగులు అంత సంతృప్తిగా లేరంటున్నారు. రెండేళ్లు ఊరించి.. విసుగు పుట్టించి.. కడుపు మండించి.. చివరాఖరికి ఇంత ఆలస్యంగా.. ఎంతో కొంత పెంచిన ముఖ్యమంత్రిపై ఇప్పటికీ ఉద్యోగులు ఆగ్రహంగానే ఉన్నారని అంటున్నారు.