చంద్రబాబుతో జతకడితేనే బీజేపీకి లైఫ్!
posted on Mar 22, 2021 @ 11:06AM
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తర్వాత పార్టీల వ్యూహాలు ఛేంజ్ అవుతున్నాయి. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకుంది. బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేస్తామని ప్రకటించింది. అయితే తిరుపతిలో పోటీ చేసి తీరుతామని ముందు నుంచి గట్టిగా పట్టుబట్టిన పవన్ కల్యాణ్.. వెనక్కి తగ్గడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో జనసేన తెగతెంపులు చేసుకునే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగానే ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే అనంతపురం మాజీ ఎంపీ, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి రెడ్డి మరోసారి రాజకీయ కాక పుట్టించే కామెంట్లు చేశారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడి జేసీ.. త్వరలో తిరుపతి లోక్ సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నికపై తనదైన శైలిలో మాట్లాడారు. తిరుపతి ఉప ఎన్నికలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా గెలుపు వైసీపీదేనన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ నేతలకు జేసీ ఓ సలహా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బతికి బట్ట కట్టాలంటే ఒకేఒక్క మార్గముందన్నారు. చంద్రబాబుతో జతకడితేనే బీజేపీకి లైఫ్ ఉంటుందని తేల్చి చెప్పారు జేసీ దివాకర్ రెడ్డి. బీజేపీ ఆ దిశగా త్వరగా నిర్ణయం తీసుకుంటే బెటరన్నారు.
పంచాయతీ ఎన్నికలు, ప్రస్తుతం టీడీపీలో నెలకొన్న పరిస్థితిని కూడా వివరించారు దివాకర్ రెడ్డి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని తాను ఎంతచెప్పినా .. చంద్రబాబు పట్టించుకోలేదని చెప్పారు. అన్ని రకాలుగా టీడీపీని అడ్డుకొని పంచాయతీలను వైసీపీ సొంతం చేసుకుంటుందని హెచ్చరించినా చంద్రబాబు మొండిగా ముందుకెళ్లారరని అన్నారు. చంద్రబాబుపై కేసులు నమోదు చేయడం ఆలస్యమైందన్న జేసీ దివాకర్ రెడ్డి.. ఇంత లేట్ అవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. జేసీ వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీతో పాటు బీజేపీని ఉద్దేశించి జేసీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జేసీ మాటలపై చంద్రబాబు, ఏపీ బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.