నీ సంగతి తేలుస్తా.. విలేఖరికి వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్
posted on Mar 22, 2021 9:04AM
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు బరి తెగిస్తున్నారు. తమను ప్రశ్నింటే వారిపై ప్రతీకారాలకు దిగుతున్నారు. ప్రజా సమస్యలు. అక్రమాలు వెలుగులోనికి తెచ్చిన ఓ పత్రికా విలేకరిపై వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు చిందులు తొక్కారు. వార్తలు రాసి నన్ను బెదిరించాలని చూస్తావా? నీ సంగతి తేలుస్తా అంటూ హెచ్చరించారు. తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలోనే ఎమ్మెల్యే వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపుతోంది.
వినుకొండలో అసైన్డ్ భూములు ఆక్రమించి అక్రమంగా ప్లాట్లు వేస్తున్నారని, ఆ వార్తలు రాయకుండా పట్టణంలోని సమస్యలపైనే వార్తలు ఎందుకు రాస్తున్నారని విలేకరులను ఆయన ప్రశ్నించారు. ఓ పత్రికా విలేకరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.‘‘పట్టణంలో గత పదేళ్లలో సమస్యలు లేవా? ఇప్పుడే ఉన్నాయా? నువ్వు చాలా చేస్తున్నావ్. నీ సంగతేంటో తేలుస్తా. వార్తలు రాసి నన్ను బెదిరిస్తావా? నువ్వెంత’ అంటూ సీటులోంచి లేచి ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోయారు.
ఇంతలో కల్పించుకున్న ఓ చానల్ విలేకరి భూముల ఆక్రమణలపైనా వార్తలు రాస్తున్నామని చెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఎమ్మెల్యే మరోమారు మండిపడ్డారు. ‘‘ఎవరేం చేస్తున్నారో నాకు తెలుసు. నువ్వేం చేస్తున్నావో కూడా నాకు తెలుసు. బయటకు పో’’ అంటూ చిందులు తొక్కారు. దీంతో అతడు బయటకు వెళ్లిపోయాడు. తాగునీటి సమస్యలపై వార్తలు రాసిన మరో విలేకరిపైనా ఎమ్మెల్యే ఆగ్రహంతో ఊగిపోతూ తిట్ల దండకం అందుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలు బయటికి తీసుకువచ్చిన విలేఖరులను బెదిరించడం ఏంటని జనాలు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే తీరుపై విపక్ష నేతలు మండిపడుతున్నారు.