అమెరికా భారత్ ను పాలించిందా.. ఎప్పుడబ్బా..?
posted on Mar 22, 2021 @ 10:30AM
కొద్దిరోజుల క్రితమే ఉత్తరాఖండ్ కొత్త సీఎం గా బాధ్యతలు చేపట్టిన బీజేపీ నేత తీరథ్ సింగ్ రావత్ పాపం వరుసగా ఎదో ఒక కాంట్రవర్సీలలో చిక్కుకుంటున్నారు. మొన్న చిరిగిన జీన్స్ వేసుకొని మహిళలు సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని కామెంట్ చేసి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న సంగతి తెల్సిందే. ఈ వివాదం ఇంకా పూర్తిగా చల్లారకముందే తాజాగా మరోసారి తన వివాదాస్పద కామెంట్స్ తో విపక్షాలకు దొరికిపోయారు. మన దేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించిన అమెరికా కరోనాను ఎదుర్కోలేక చేతులెత్తేసిందని అయన మజాగా చేసిన వ్యాఖ్యలపై అటు ప్రతిపక్షాలు, ఇటు నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నాయి. అవునా.. మన దేశాన్ని అమెరికా పరిపాలించిందా.. ఎప్పుడబ్బా అంటూ సెటైర్లు వేస్తున్నారు. వర్తకం పేరుతొ బ్రిటిష్ వాడు మనదేశం లోకి ఎంటర్ అయి దాదాపు రెండు వందల ఏళ్ళు ఏలి ఈ దేశాన్ని పీల్చి పిప్పి చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెల్సిందే. ఇదే విషయాన్నీ దేశంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా.. చెబుతారని.. అయితే ఈ మాత్రం చరిత్ర కూడా తెలియని వ్యక్తి ఈ రాష్ట్ర సీఎం అంటూ అక్కడి ప్రతిపక్షాలు మండిపడుతున్నారు.
ఆదివారం నాడు జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న తీరథ్ సింగ్ రావత్ కరోనా పరిస్థితులపై మాట్లాడుతూ.. మన దేశంలో నరేంద్ర మోదీ స్థానంలో మరొకరు ప్రధానిగా ఉంటే కరోనా సమయంలో ఏం జరిగి ఉండేదో ఎవరూ ఊహించని కూడా ఊహించలేరు. అప్పుడు దేశంలో చాలా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ప్రధాని మోదీ తీసుకున్న చర్యలతో దేశంలోని ప్రజలందరినీ కాపాడారు. మన దేశం విదేశాల కన్నా కరోనాను సమర్థవంతంగా కట్టడి చేయగలిగింది. మనల్ని 200 ఏళ్లు పాలించిన అమెరికా కూడా కరోనాను ఎదుర్కోలేక విలవిలలాడి పోయింది. అక్కడ లక్షలాది మంది ప్రజలు చనిపోయారు. ఆరోగ్య రంగంలో ఎంతో ముందున్న ఇటలీలో కూడా 50 లక్షల మంది మరణించారు. అక్కడ మళ్లీ లాక్‌డౌన్ విధించే ఆలోచన చేస్తున్నారు" అని ఆయన పేర్కొన్నారు.
ఉత్తరాఖండ్ కొత్త సీఎం గా బాధ్యతలు చేపట్టిన తీరత్ సింగ్ రావత్ కొద్దిరోజుల క్రితం మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై యువత తీవ్ర స్థాయిలో ఆపండించిన సంగతి తెలిసిందే. ఒక ఎన్జీవోను నడిపిస్తున్న యువతి చిరిగిన జీన్స్ వేసుకోవడం చూసి తాను షాకయ్యానని అయన అన్నారు. ఆ డ్రెస్ వేసుకుని ప్రజల్లోకి వెళ్లి.. సమాజానికి ఏం సందేశమిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.దేశంలో యూత్ రిప్ప్‌డ్ జీన్స్ కోసం షాపులకు వెళుతున్నారని, ఒకవేళ అవి అక్కడ దొరకకపోతే జీన్స్ కొనుక్కుని కత్తెరలతో తమకు తామే కట్ చేసుకుని మరీ ధరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ర్చ జరగడంతో.. చివరికి ఆయనే దిగొచ్చి, క్షమాపణలు చెప్పారు. తాజాగా భారత్‌ను అమెరికా పాలించిందని చెప్పి మరోసారి ఉత్తరాఖండ్ సీఎం విమర్శల పాలయ్యారు