వరంగల్ గులాబీలో వర్గపోరు! కడియం కారు దిగినట్టేనా?
posted on Mar 22, 2021 @ 11:45AM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయంతో జోష్ లో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సీనియర్ నేతలు షాకిస్తున్నారు. హాట్ కామెంట్లతో వేడి రాజేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్‌లో వర్గపోరు రచ్చకెక్కింది. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న రాజయ్య, కడియం శ్రీహరి మధ్య మాటల యుద్దం జరుగుతోంది. గతంలో డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన ఈ ఇద్దరు నేతలు.. ఇప్పుడు ఒకరిపై మరొకరు విమర్శల తూటాలు పేల్చుతున్నారు. నువ్వెంతంటే.. నువ్వెంత అంటూ.. మండిపడుతున్నారు.
స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న కడియం శ్రీహరి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క రూపాయి ఎవరికి సహాయం చేయనివాడు కూడా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే రాజయ్యపై మండిపడ్డారు. చెల్లని రూపాయి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు కడియం. పనిచేసే వారిని నిరుత్సాహ పరుచడం కాదు.. మగాళ్ళయితే ఆర్థిక సహాయం చేయాలని సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరి దగ్గర చాయ్ తాగినా.. పనుల పేరుతో రూపాయి తీసుకున్నా.. ముక్కు నేలకు రాస్తానని స్పష్టం చేశారు కడియం శ్రీహరి. పదవులను, పనులను అమ్ముకుంటూ...మళ్లీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. నెత్తి మీద పది రూపాయలు పెడితే రూపాయికి కూడా అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే రాజయ్యపై నిప్పులు చెరిగారు కడియం శ్రీహరి.
కడియం కామెంట్లకు వెంటనే కౌంటరిచ్చారు ఎమ్మెల్యే రాజయ్య. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ప్రజాదరణను చూసి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు. తనపై కడియం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కడియం చర్యలను పార్టీ అధిష్టానం పరిశీలిస్తోందని, సరైన సమయంలో తగిన నిర్ణయం తీసకుంటుందని ఎమ్మెల్యే రాజయ్య చెప్పారు. తనపై కడియం చేసిన ఆరోపణలపై పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని ఆయన కార్యకర్తలను కోరారు రాజయ్య. పార్టీ అధినేత దగ్గర పూర్తి సమాచారం ఉందని తెలిపారు. వ్యక్తిగత స్వార్థంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించ వద్దని శ్రీహరికి రాజయ్య సూచించారు.
ఇటీవలే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో గందరగోళం సృష్టించడానికి కొంత మంది కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఘనపుర్ గురించి మాట్లాడేవారికి అడ్రస్సే కాదు.. ఇక్కడ ఓటు కూడా లేదని ఎద్దేవా చేశారు. కొన్ని గుంటన క్కలు గోతులు తవ్వుతున్నాయని... నోరుందని ఏదీపడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని రాజయ్య స్పష్టం చేశారు. మీ తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడరన్న ఆయన.. ప్రజా బలం ఓట్లతోనే తెలుస్తుందని అన్నారు. రాజయ్య మాట్లాడిన ఈ వ్యాఖ్యలకే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది. ఇద్దరూ నేతలు పోటాపోటీ కౌంటర్లు ఇచ్చుకుంటుండటంతో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక గులాబీ కేడర్ గందరగోళంలో పడిపోయింది.
మరోవైపు కడియం శ్రీహరి పార్టీ మారబోతున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ తీరుపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు. బీజేపీ ముఖ్య నేతలు కొందరు ఆయనతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. అయితే పార్టీ మారుతున్నారంటూ తనపై వస్తున్న వార్తలను గతంలో కడియం ఖండించారు. అయితే తాజాగా ఎమ్మెల్యే రాజయ్యపై ఓపెన్ గానే ఘాటు వ్యాఖ్యలు చేయడంతో... తన రాజకీయ భవిష్యత్ పై ఆయన కీలక నిర్ణయం తీసుకుని ఉంటారనే చర్చ జరుగుతోంది. అందుకే అలా మాట్లాడారని చెబుతున్నారు. చూడాలి మరీ కడియం రాజకీయ అడుగులు ఎలా ఉండబోతున్నాయో...