కేరళలోనూ హస్త రేఖలు అస్తవ్యస్తం ...
దేశం చాలా క్లిష్ట పరిస్థితులలో వుంది, ఇది ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలలో చాలా చాలా పాపులర్ అయిన సినిమా డైలాగ్. అలాగే, ఈ డైలాగ్’ నూతన ప్రసాద్’ కు మంచి గుర్తింపు,గౌరవం తెచ్చి పెట్టింది. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా, అలానే చాలా క్లిష్ట పరిస్తితులలో ఉంది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న ఐదు రాష్ట్రాలలో ‘కేరళ’ ఆటోమేటిక్’ గా కాంగ్రెస్ ఖాతాలో చేరవలసిన రాష్ట్రం. అక్కడ ఒకసారి, సిపిఎం సారధ్యంలోని ఎల్డీఎఫ్, మరోమారు కాంగ్రెస్ సారధ్యంలోని యూడీఎఫ్ అధికారంలోకి రావడం ఆనవాయితీగా వస్తోంది. ఆ లెక్కన ప్రస్తుతం ఎల్డీఎఫ్ అధికారంలో వుంది కాబట్టి రేపటి ఎన్నికల్లో యూడీఎఫ్ ఆటోమేటిక్’ గా గద్దెనెక్కాలి, కానీ, పరిస్థితి చూస్తే, హస్త రేఖలు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడంలేదని ఆ పార్టీ నాయకులే, అది కూడా బహిరంగంగా అంగీకరిస్తున్నారు. ఎన్నికల సమయంలోనూ పార్టీలోని అంతర్గత విబేధాలు బయట పడుతూనే ఉన్నాయి.
అంతర్గత విబేధాల కారణంగానే, రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు వ్యతిరేకంగా తానూ పోటీ చేయడం లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, ఎంపీ కే .సుధాకరన్, ప్రకటించారు. పినరయి పోటీ చేస్తున్న ధర్మదోమ్ నియోజక వర్గం కాంగ్రెస్ అభ్యర్ధిగా పార్టీ అధిష్టానం సుధాకరన్ పేరును ప్రకటించింది. అయితే, ఆయనే స్వయంగా తాను పోటీ చేయడం లేదని ప్రకటించడంతో పాటుగా ఆయన ఏ మాత్రం దాపరికం లేకుండా అందుకు కారణం కూడా చేప్పేశారు.
‘‘ధర్మదోమ్ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకత్వం నన్ను కోరింది.దీనికి నేను నా కృతజ్ణతలు తెలియజేస్తున్నాను, ఈ ప్రతిపాదనను కూడా ఆహ్వానిస్తున్నాను. కానీ ప్రస్తతం అక్కడి పరిస్థితుల దృష్ట్యా పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. ఆ నియోజకవర్గం నుంచి నా అభ్యర్థిత్వంపై అక్కడి స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సముఖంగా లేరు.” అంటూ ఆయన పార్టీలో అంతర్గత విబేధాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పకనే చెప్పారు.
ఇదలా ఉంటే, రాష్ట్ర పార్టీ నాయకులు కొందరు, గతంలో ఇలాంటి పరిస్థితి వస్తే, పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దేది, ఇప్పుడా పరిస్థితి లేదు. అసలు అధిష్టానమే ఉండీ లేనట్లుగా వుందని, విచారం వ్యక్త పరిచారు. అలాగే, ముఖ్యమంత్రి పోటీ చేస్తున్న నియోజక వర్గంలో గట్టి అభ్యర్ధిని నిలపలేక పొతే, ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విజయావకాశాలను దెబ్బతీస్తుందన్న ఆందోళన కూడా పార్టీ వర్గాల్లో వినవస్తోంది. అదేవిధంగా, జమాతే ఇ ఇస్లామి రాజకీయ విభాగమైన వెల్ఫేర్ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం కూడా పార్టీలో చిచ్చురేపుతోంది. శబరిమల ఆందోళన సమయంలో పార్టీ తీసుకున్న స్టాండ్, కొంత మేరకు హిందువులకు దగ్గర చేసింది. ఇప్పుడు పార్టీ ఐయుఎంఎల్’లో చేతులు కలడంతో పరిస్థితి మళ్ళీ మొదటికే వచ్చింది. బీజేపీ గెలిచే అవకాశాలు లేక పోయినా, హార్డ్ కోర్ హిందూ ఓటు బీజేపీకే పడుతుందని, పార్టీ నాయకులతో పాటుగా,రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.
ఇదలా ఉంటే, రాష్ట్రంలో పార్టీ, ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాలా, మాజీ ముఖ్యమంత్రి, ఎన్నికల ప్రచార కమిటీ కన్వీనర్‌గా ఉమెన్ చాందీ వర్గాలుగా చీలిపోయింది. యుడిఎఫ్‌కు మెజారిటీ వస్తే ఉమెన్ చాందీ ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడం ఖాయమన్న సంకేతాలు రావడంతో, ఇరు వర్గాలు ప్రత్యర్ధులకు ప్రయోజనం చేకూర్చే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇదలా ఉంటే, పార్టీ మరో సీనియర్ నేత చాకో, టికెట్ల పంపిణీలో తమ వర్గానికి అన్యాయం జరిగిందని అలిగి, పార్టీకి రాజీనామా చేసి, ఎన్సీపీలో చేరారు.
మరో వంక ముఖ్యమంత్రి పినరయి విజయన్, అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను ఎల్డీఎఫ్’ను మరోసారి గెలిపిస్తాయని ధీమాగా ఉన్నారు. ఒక ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పినరయి విజయన్ , ఈ ఐదేళ్ళలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై రూ. 50,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నాం, అయితే ఇప్పటికే ఆ లక్ష్యాన్ని దాటి రూ.63,000 పై చిలుకు పనులు పూర్తి చేశాం అని పేర్కొన్నారు. అలాగే వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని రూ.600 నుంచి రూ.1600లకు పెంచామని, కరోనా కాలంలోనూ ఏ ఒక్కరూ ఆకలితో అలమటించే పరిస్థతి రాకుండా ప్రభుత్వం ఆదుకుందని చెప్పుకొచ్చారు. అన్నిటినీ మించి, కరోనా సంక్షోభ సమయంతో పాటుగా వరసగా పలకరించిన ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రభుత్వం ప్రజలను అన్ని విధాల ఆదుకుందని, అందుకే ప్రజలు ఎల్డీఎఫ్’ కు మరో మారు పట్టం కడుతున్నారని ధీమా వ్యక్తం చేశారు.
నిజంగా అదే జరిగితే అది హస్తం స్వయం కృతమే అవుతుంది. ఎందుకంటే, ఎల్డీఎఫ్ ప్రభుత్వం అనేక అవినీతి కుంభకోణాల్లో పీకలవరకూ కురుకు పోయింది. బంగారం దొంగ రవాణ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయం ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఒక విధంగా, ఎల్డీఎఫ్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుంది. అయినా, ప్రాధాన ప్రతిపక్ష కూటమి, యూడీఎఫ్కు సారధ్యం వహ్సితున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కాడి వదిలేయడంతో , ఎల్డీఎఫ్’కు వరంగా మారింది. కాంగ్రెస్’కు శాపమైందని, రాజకీయ పండితులు పేర్కొంటున్నారు.